Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఉత్తర రామచరిత-10

[‘ఉత్తర రామచరిత’ను వచన రూపంలో సరళ సుందరంగా అద్భుతమైన దృశ్యీకరణ శైలిలో అందిస్తున్నారు శ్రీ విహారి గారు.]

రథం వెళుతోంది.

లక్ష్మణుని విచారాన్ని గమనిస్తున్న సుమంత్రుడి మనస్సూ ఖేదపడింది.

“విధి బలీయం స్వామీ. అది ఎంతటివారికైనా అనుల్లంఘనీయమే. కార్యకారణ విచికిత్స చేసిన కొద్దీ – ఎక్కడో దొరుకుతుంది సమాధానం” అన్నాడు.

లక్ష్మణుడు తేరి చూశాడు.

రథాన్ని నిదానం చేస్తూ మరికొద్ది దూరం వెళ్ళగానే ఆపేడు. ప్రశ్నార్థకంగా చూశాడు లక్ష్మణుడు.

“తమ్ములకు కూడా చెప్పనంటే, మీ కొక వృత్తాంతం చెబుతాను. అన్నగారిచే సీతాపరిత్యాగం కారణం కొంతవరకూ విశదమవుతుంది. మీ వగపు చూస్తుంటే చెబుదామనిపిస్తోంది” అన్నాడు.

“అలాగే” అని బాస చేశాడు లక్ష్మణుడు.

సుమంత్రుడు వివరించసాగేడు.

“ఒకానొక సందర్భంలో దశరథ మహారాజు మీ కులగురువైన వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళారు. ఆయన వెంట నేనూ వెళ్ళాను. మేము వెళ్ళేసరికే, దుర్వాస మహాముని వశిష్ఠాశ్రమంలో చాతుర్మాసదీక్ష వహించి అక్కడ వున్నారు.

మధ్యాహ్న కాలంలో ప్రసంగానుప్రసక్తంగా మీ తండ్రిగారు దుర్వాస మహర్షిని – తనకు పుట్టబోయే పుత్రుల ఆయుర్దాయము గురించి చెప్పమని అడిగారు.

దుర్వాసుడు ఒక పూర్వగాథను ముందుగా వివరించాడు. “దేవాసుర యుద్ధంలో అసురులు దేవపీడుతులై పరిగెత్తుకుపోయి భృగుమహర్షి భార్య ఆశ్రయాన్ని అర్థించారు. ఆమె వారికి అభయమిచ్చింది. వారు అక్కడ నిర్భయులై ఉన్నారు. ఇది తెలిసి విష్ణువు క్రోధంతో వెళ్ళి భృగుపత్ని శిరస్సును తన చక్రంతో సంహరించాడు. భృగువు చూశాడు. కోపావేశం కలిగింది. “నా భార్యను అకారణంగా చంపావు. కనుక ‘మనుష్యలోకంలో పుట్టి చాలా సంవత్సరాలు భార్యావియోగాన్ని అనుభవించు’ అని శపించాడు. విష్ణువు దానిని గ్రహించి ‘లోకక్షేమం కోసం నేను మీ శాపాన్ని భరిస్తాను’ అని ఆ మహర్షి శాపాన్ని అంగీకరించాడు. ఆ మహావిష్ణువే నీ పుత్రుడుగా జన్మించాడు. ‘రాముడు పదకొండు వేల సంవత్సరాలు ధర్మాత్ముడుగా పాలన సాగించి తర్వాత బ్రహ్మలోకానికి వెళతాడు’ అని భవిష్యద్వాణిని వినిపించాడు. మీ తండ్రి దశరథుడు ఈ వృత్తాంతాన్ని మరొకరికి తెలియజేయవద్దని నన్ను ఆజ్ఞాపించారు. ఇప్పుడు మీ దుఃఖాన్ని చూసి సహకరించలేక మీకు చెప్పాను. ఇప్పుడు దుర్వాసుని శాపం వలన రామప్రభువుకూ, సీతకూ ఈ కష్టకాలం దాపురించింది. సర్వమూ కడకు శుభప్రదమే అవుతుంది”

ఈ మాటల్లోనే సూర్యాస్తమయం అయింది.

వారిద్దరూ ఆ రాత్రికి కేశినీ నదీతీరంలో విశ్రమించారు.

***

లక్ష్మణుడు అయోధ్యకు చేరేడు.

అన్నగారి సన్నిధికి వెళ్ళటానికి మనస్సు ఉత్సహించటం లేదు.

భర్త మానసిక స్థితిని గమనించింది ఊర్మిళ.

“ఒక కర్తవ్యాన్ని నిర్వహించమనే ఆజ్ఞ ప్రభువుది. దాన్ని నిర్వహించి  వచ్చారు మీరు. ఆ ఆజ్ఞ బాగోగులన్నీ దాన్ని శాసించిన వారివి. మీ కెందుకీ విచారం, బాధ? వెళ్ళి మీ విధ్యుక్త ధర్మాన్ని నెరవేర్చానని చెప్పి రండి” అని స్పష్టంగానే చెప్పింది.

పరీక్షగా భార్య వైపు చూశాడు లక్ష్మణుడు.

ఆమె ‘అవును’ అన్నట్టు దృఢమనస్విగా కనుచికిలింపు నిచ్చింది.

‘ఈమె మంచి వేదాంతి!’ అనిపించి లోలోపల హర్షించాడు.

“అవును. నీ హిత విచక్షణ బాగుంది” అంటూ ఠక్కున లేచి బయటికి నడిచేడు.

లక్ష్మణుడు అన్నగారి మందిరానికి చేరేసరికే సుమంత్రుడు ద్వారం దగ్గర కనిపించాడు. అతని పక్కగా ఎవరో ఇద్దరు ఆగంతకులు నిలబడి మాట్లాడుతున్నారు. సుమంత్రుడు “మీరు వెళ్ళి భరతుల వారితో మాట్లాడండి. వారు మీ సమస్యను పరిష్కరిస్తారు” అని చెబుతున్నాడు. వారు చకచకా వెళ్ళిపోయారు.

“ఏమిటి విషయం? అన్నగారిని చూశావా?” అని సుమంత్రుని అడిగేడు లక్ష్మణుడు.

“లేదు. మీకంటే ముందు నేను ప్రభువుల్ని చూడగలనా?”

“ఆ వెళుతున్న వారెవరు?”

“ఎవరో దూరప్రాంత వాసులు. శ్రీరాముల వారి దర్శనానికి వచ్చారు. వారిదేదో గ్రామ సమస్య. ‘మహారాజు ఇప్పుడు దర్శనం ఇవ్వరు’- అని ద్వారపాలకులు చెప్పారట. నిరాశతో తచ్చాడుతున్నారు. ఇదీ పరిస్థితి. నేను వారికి చెప్పింది విన్నారు కదా.”

లక్ష్మణుడు తల ఊపి ‘సరే’ అనుకుంటూ మందిరం లోపలికి వెళ్ళాడు.

రాముడు దీనుడై నేలచూపులు చూస్తూ అన్యమనస్కుడై వున్నాడు. అలికిడికి తలెత్తి చూశాడు. కళ్ళనిండా నీరు. వెళ్ళి అన్నకు పాదనమస్కారం చేసి కూర్చున్నాడు లక్ష్మణుడు.

“కళ్లు మూసినా తెరచినా మీ వదినరూపమే నన్ను దోషిగా నిలుపుతున్నదిరా లచ్చీ. ప్రసూన చిత్తసుమన్వితరా ఆమె. కానన సీమకు పంపవలసి వచ్చింది. ఆత్మబంధు వియోగం ఎప్పుడూ గుండెల్ని మండిరచటం సహజమే. ఇక ఆ ‘ఆత్మ’ భార్యే అయితే.. వేలకీలలతో వేధించటం కదూ?” అని శోకతప్త హృదయంతో బావురుమన్నాడు.

లక్ష్మణుడు ఊరడించలేకపోయాడు.

సమయం గడిచింది. రాముడు నిదానంగా నిరుద్వేగి అయ్యాడు. “చెప్పు” అన్నాడు.

“రాజాజ్ఞను నిర్వర్తించాను. వాల్మీకి వారి ఆశ్రమప్రాంతంలో విడిచి వచ్చాను.” అని ముక్తసరిగా సమాధానం చెప్పి కూర్చున్నాడు.

నిముషాలు దొర్లిపోతున్నాయి.

“అన్నయ్యా. ఒక్కమాట చెప్పనా?”

“చెప్పు”

“కాలగతి గురించీ, విధిబలీయత గురించీ వశిష్ఠులవారి గీతోపదేశం విన్నవాడివి. ప్రోగు చేసుకున్నవన్నీ భౌతికవస్తువులైనా, మనస్తాత్విక మోహాలైనా, చివరికి నశించవలసినవే. ఏ కలయిక అయినా కడకు ఎడబాటుకే గదా. నిన్ను నీవు నిగ్రహించుకోగలవాడివి. సమస్త లోకాల్నీ నిగ్రహించగలవాడివి. ఈ శోకాన్ని గడవగల మనస్సు నీది. అలాంటివాడివి, రాజకార్యాలపట్ల విముఖుడవు కావటం, బేలవై ఇలా ఏకాకిగా కుమలటం భావ్యమా? మహారాజ విధుల పట్ల ఉపేక్ష తగనిది కదా?”

తలెత్తి పరిశీలనగా తమ్ముడిని చూశాడు రాముడు. లక్ష్మణుడు చెబుతూనే వున్నాడు.

“సీతా పరిత్యాగం చేశాడేగానీ రాముడు – భార్యావిమోహియై రాజధర్మాల్ని ఉపేక్షించి స్వకర్తవ్యాన్ని మరచిపోయాడు – ఏం రాజు దొరికాడు – అని మరో అపవాదం రావచ్చు కదా?” అని ఆపి, “ఇలా అంటున్నందుకు నన్ను మన్నించు” అన్నాడు, తల వంచుకుని.

మందిరంలో నిశ్శబ్దం ఘనీభవించింది.

చాలాసేపటికి రాముడు, సావధాన చిత్తుడై “లక్ష్మణా. నీవు చెప్పింది సత్యం. మంచిమాటనే స్పష్టం చేశావు. చిన్నవాడివైనా నువ్వు నాకు అహరహమూ హితమే బోధిస్తూ వున్నావు. చాలా సంతోషం” అని లేచి వచ్చి తమ్ముని ఆలింగనం చేసుకున్నాడు.

లక్ష్మణునికీ సంతృప్తి కలిగింది.

“నీవంటి ఆప్తుడు, బుద్ధిమంతుడు ప్రియవచనమే కాక హితవచనం చెప్పటానికి వెరవడు. అదే రాజుకు ఆవశ్యకము” అని,

“పౌరకార్యాల పట్ల శ్రద్ధవహించని రాజు స్థితి – గాలీ వెలుతురూ లేని చీకటిగుయ్యారంలో పడినవాడి స్థితే” అన్నాడు.

లక్ష్మణుడు ఔనన్నట్లు తల వూపేడు.

“కీర్తిమంతుడైనవాడు, సత్యవాక్పాలకుడు అయిన నృగుచక్రవర్తి గురించి నీకు చెబుతాను విను” అని ఆ వృత్తాంతాన్ని ఆరంభించాడు.

లక్ష్మణుడు కూర్చున్నాడు అతనింక- శ్రద్ధా భక్త్తీ గల శ్రోత!!

నృగు మహారాజు వృత్తాంతం:

నృగు మహారాజు సదాచార సంపన్నుడు, ధర్మపరుడు. దానయజ్ఞయాగాది క్రతువుల పట్ల విశేష శ్రద్ధాసక్తులు కలిగినవాడు. ఆ మహారాజు పుష్కరతీర్థంలో స్వర్ణాభరణాలతో  అలంకరింపబడిన కోటిగోవుల్ని బ్రాహ్మణులకు దానమిచ్చాడు.

కాలం గడిచింది. రాజ్యపాలన ప్రజాక్షేమ ప్రదంగా జరుగు తున్నది. ఒకనాడు ఇద్దరు గోదాన గ్రహీతల మధ్య తగవులేచింది. ఒకరి ఆవు వెళ్ళి మరొకరి ఆవుల మందలో కలిసింది. మొదటివాడు వెళ్ళి రెండవవానికి విషయం చెప్పి, తన గోవును తనకిమ్మని కోరేడు. మొదటి బ్రాహ్మణుడు నిరాకరించాడు. తగవు పెద్దదయింది. తెగలేదు. ఇద్దరూ రాజు గారి దగ్గరకు వచ్చారు. ద్వారపాలకులు ‘మహారాజు అన్యకార్య నిమగ్నులైవున్నారు. ఇప్పుడు దర్శనం వీలు కాద’ని చెప్పారు.

ఇద్దరూ అలాగే చాలారోజులు గడప పడిగాపు పడి వేచి వున్నారు. రాజుగారు దర్శనం ఇవ్వలేదు.

ఇద్దరికీ విసుగు కలిగింది. కోపం వచ్చింది. మహారాజును “అర్థిజనాన్ని ద్వారం దగ్గరే కావలి కాచేటట్టు చేస్తూ, దర్శనమీయని ఈ రాజు అలాగే అనేక సంవత్సరాలు జనం ఎవ్వరికీ కనిపించని పాడుబడిన గోతిలో ఊసరవెల్లిగా పడివుండుగాక” అని శపించారు.

నృగమహారాజుకి చేరింది వార్త. గడగడలాడేడు. శాపవిమోచనాన్ని అర్థించాడు.

ద్వాపరయుగంలో విష్ణువు వాసుదేవుడనే పేరుతో యాదవకులంలో అవతరిస్తాడు. అతని ద్వారానే నీకు శాపవిముక్తి” అని అభయమిచ్చారు.

నృగు మహారాజు తన కొడుకు వసువుని పిలిచి, కర్తవ్యాన్ని బోధించి, రాజ్యపాలనని ఒప్పగించి, “పూర్వజన్మ కృతమ్‌ పాపప్రభావం అనుభవింపక తప్పదు. ఫలితం ఏదైనా స్వీకరించకా తప్పదు. మనిషి తాను చేసిన  శుభాశుభ కర్మఫలంగా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళుతాడు. అక్కడ సుఖమో, దుఃఖమో అనుభవిస్తాడు. ఇది అనుల్లంఘనీయం. తప్పదు” అని బోధించి తాను ఏర్పాటు చేయించుకున్న గోతిలోనికి వెళ్ళిపోయాడు.

“కనుక నీవు నాకు చెప్పినట్లు రాజుకు ప్రజావసరాల్ని తీర్చటమే ప్రథమ కర్తవ్యం. ఆ విధిపట్ల బాధ్యతతో శ్రద్ధతో ఉండక తప్పదు. చులకన భావంతోగానీ, అలసత్వంతోగానీ, అహంతోగానీ, ఆ బాధ్యతని విస్మరిస్తే, పర్యవసానం దుఃఖభూయిష్టం అవుతుంది” అని “ఈ సందర్భంగా మరొక వృత్తాంతమూ చెబుతాను విను” అని నిమి గాథను వివరించటం మొదలెట్టాడు.

నిమి చక్రవర్తి గాథ:

నిమి చక్రవర్తి పరమధార్మికుడు. సమర్ధుడైన బలవిక్రమాలతో మంచి పరిపాలకుడు. ఇక్ష్వాకు చక్రవర్తులలో పన్నెండవ వాడు. ఆయన రాజధాని నగరం వైజయంతం. అది గౌతమాశ్రమ ప్రాంతంలో నిర్మించబడింది. సాక్షాత్తు అమరావతి వైభవంతో శోభయమానమైన నగరం అది.

ఒకసారి, నిమి చక్రవర్తి తన పితరుల సంతుష్టిని కోరి ‘దీర్ఘసత్రము’ అనే యాగాన్ని తలపెట్టాడు. ఆ  యాగానికి తండ్రి ఇక్ష్వాకువుని ఆహ్వానించాడు. ఆ యాగానికి ‘హోత’ ప్రధాన ఋత్విక్కుగా వుండమని బ్రహ్మర్షి అయిన వశిష్ఠుని వేడుకున్నాడు. ఆయన ‘ప్రస్తుతం ఇంద్రుని పనిమీద అమరావతిలో వున్నాను. ఈ పని అయిన తర్వాత వస్తాను- ఆగ’మన్నాడు.

నిమి అంతటి జాగుని భరించలేకపోయాడు. గౌతముని హోతగా కోరి ఆయన చేత ఆ యాగాన్ని నిర్వహించాడు. వశిష్ఠుడు వచ్చాడు. నిమి అలసిపోయి  నిద్రపోతున్నాడు. ఎంతసేపు నిరీక్షించినా వశిష్ఠునకు రాజదర్శనం కాలేదు. క్రోధంతో ఊగిపోయాడు. ‘కులగురువును నిర్లక్ష్యం చేసి యాగ నిర్వహణకు మరొకరిని ఎన్నుకున్నావు. పైగా పగలు నిద్రిస్తూ నన్ను అవమానించావు. ‘అచేతనుడ’వై ఉండు – పో!’ అని శపించాడు. నిమికీ కోపం వచ్చింది.  “నిద్రావశుడినైన నాకు నీరాక తెలియలేదు. దానికి ఇంత క్రోధం పనికిరాదు. పైగా నీవు బ్రహ్మర్షివి. సంయమివి. నాకు అకారణంగా శాపమిచ్చావు. కనుక, నీవు కూడా విచేతనుడవై పో” అని ప్రతిశాపం ఇచ్చాడు. ఆయన అచేతనుడు, ఈయన విచేతనుడూ అయి పోయారు.

వశిష్ఠుడు తేజోరూపంలో వెళ్ళి బ్రహ్మని ప్రార్థించాడు. మిత్రావరుణుల తేజస్సుతో నీవు మళ్ళీ సదేహుడవు అవుతావు పొమ్మన్నాడు. అలాగే ఆయన కొంతకాలానికి రూపం పొందాడు.

ఇక, నిమికి ఋషీశ్వరులంతా కలిసి యోగదీక్ష నిచ్చారు. ఆయన కళేబరాన్ని తైలద్రోణిలో వుంచి భద్రం చేశారు. భృగుమహర్షి ప్రమేయంతో దేవతలంతా నిమికి పునర్‌రూపం ఇవ్వటానికి నిశ్చయించుకొన్నారు. నిమి కోరిక మేరకు – ఆయన వాయురూపంలో సకలప్రాణుల నేత్రాలమీద నివసించే  వరాన్ని ఇచ్చారు. నిమికి కుమారుని జన్మింపజేయటానికి ఋషులంతా ఆయన కళేబరం మీద అరణిని వుంచి, త్రచ్చి పురుషుని ఆవిర్భవింపజేశారు. మథించుట వలన ‘మిథి’ ఐనాడు. పుట్టటం వలన ‘జనకుడు’ అయినాడు. ఆయన రాజ్యం మిథిల, విదేహ అయినై!

“ఇదీ ఆ నిమి వృత్తాంతం. ఎంత జ్ఞాని అయినా తొందరపాటు క్రోధం అనర్థాలకు దారి తీస్తుంది అనే సత్యాన్ని మరువరాదు” అని వివరించాడు శ్రీరాముడు.

ఆలోచనా నిమగ్నమైన చూపుతో ‘అవునవును’ అన్నాడు లక్ష్మణుడు.

యయాతి చరితము:

“ఓర్పు అనేది పురుషుల్లో అందరిలోనూ కనపడదు. నిమి – వశిష్ఠుల శాపవృత్తాంతాల్లో అంతర్గత సత్యం క్రోధం కదా. క్రోధం వచ్చేది ‘ఓర్పు’ లేనందువల్లనే. ఆ ఓర్పు సుగుణ విశేషం ఎంతటి ప్రశస్తిని గడించి పెడుతుందో చెబుతాను విను. ఇది యయాతి చరిత్ర” అని శ్రీరాముడు ప్రారంభించాడు.

యయాతి రాజర్షి. సత్త్వగుణశాలి. పాలనాదక్షుడు. నహుషుడి కుమారుడు. యయాతికి ఇద్దరు భార్యలు- శర్మిష్ఠ, దేవయాని. శర్మిష్ఠ వృషపర్వుని కూతురు. దేవయాని శుక్రాచార్యుని కుమార్తె. శర్మిష్టకు పూరువు; దేవయానికి యదువు కుమారులు. పూరువు తల్లి సుగుణాల్ని పుణికి పుచ్చుకున్నవాడు. ఈ కారణాన యయాతికి పూరువు అంటే కించిత్తు అధిక ప్రేమానురాగాలు ఉన్నాయి.

యదువుకి తన స్థితిపట్ల దుఃఖం కలిగింది. వెళ్ళి తల్లి దగ్గర వాపోయాడు. ‘ఈ వ్యత్యాసపు బతుకు బతికే కంటే మరణం మేలు. నీవైనా ఈ వేదనని ఎందుకు అనుభవించాలి. ఇద్దరమూ కలిసే పోదాం..లే’ అని కటువుగా మాట్లాడాడు.

దేవయానికి బాధ కలిగింది. తండ్రిని స్మరించింది. ఆయన వచ్చాడు. ఇద్దరూ కలిసి రాజుకు తమపట్ల గల అనాదరాన్నీ, అగౌరవాన్నీ వల్లె వేశారు. దైత్యగురువు కదా – శుక్రాచార్యుడు. కోపం తాటి ప్రమాణంగా రేగింది. “యయాతీ! నీది దుర్బుద్ధి. అందువల్లనే నన్నూ, నా కూతురునూ, మనుమడినీ అవమానిస్తున్నావు. దానికి కారణం నీ వయస్సే. కనుక నీవు వృద్దాప్యంతో జీర్ణుడవై, శైధిల్యాని పొందుతావు..పొమ్ము” అని శపించేశాడు.

శుక్రుని ఈ అకారణ కోపానికి విచారించాడు యయాతి. కొడుకు యదువుని కోరేడు, “నా వార్థక్యాన్ని నీవు తీసుకొని నీ యౌవనాన్ని నాకివ్వు. నాకు భోగానుభవాల మీద ఇంకా విరక్తి కలుగలేదు. నేను యౌవనాన్ని అనుభవించి, సంతృప్తుడనైన తర్వాత, నీ యౌవనాన్ని నీవు తీసుకొందువుగాని” అని!

యదువుకు కోపం వచ్చింది. అసలే తండ్రి పట్ల ద్వేషంతో వున్నాడు కదా, “పోయి నీ ముద్దుల కొడుకు పూరువుని అడుగు” అని సీత్కరించాడు.

యయాతి వెళ్ళి పూరువుని అడిగేడు. అతడు తండ్రికి పాదాభివందనం చేసి “ధన్యుణ్ణి. మీ ఆజ్ఞను పాటిస్తాను” అనేశాడు. యయాతి చాలా సంతోషించాడు.

యయాతి యౌవనుడైనాడు, పూరువు వృద్ధుడైనాడు. మహారాజుగా యయాతి అనేక యజ్ఞయాగాదులు చేసి, సుఖభోగాల్ని అనుభవించాడు.

చాలాకాలం గడిచింది.

యయాతి పూరువుని పిలిచి, “నా వృద్ధాప్యాన్ని నాకు ఇవ్వు నాయనా. నాయందు అధికమైన గౌరవాన్నీ, ప్రేమానురాగాల్నీ చూపించావు. నీకు రాజ్యాభిషేకం చేస్తాను. యౌవనాన్ని స్వీకరించు” అని యథావిధిగా ఆ ప్రక్రియని జరిపించేడు.

యదువుని చూశాడు తండ్రి. పట్టరాని కోపం వచ్చింది, “రాక్షస ప్రవృత్తి నీది. తండ్రినని కూడా చూడక, నన్ను చీదరించుకున్నావు. అవమానించావు. నీకు క్రూరరాక్షసులు, పిశాచాలూ సంతానంగా కలుగుగాక” అని శపించాడు.

యౌవనవంతుడైన పూరువుని రాజ్యాభిషిక్తుని చేశాడు యయాతి. తాను వానప్రస్థాశ్రమానికి తరలివెళ్ళాడు.

పూరువు కాశిరాజ్యంలో ప్రతిష్ఠానమనే నగరంలో ధర్మమూర్తిగా, సత్పరిపాలన చేయసాగేడు.

యదువు క్రౌంచవనంలోని పురంలో పడి, అనేకమంది రాక్షసులకూ, పిశాచాలకూ జనకుడైనాడు.

-విన్నావు కదా. యయాతి శుక్రుని శాపాన్ని స్వీకరించి తన ఓరిమితో శ్రేయాన్ని పొందాడు. నిమి లాగా కోపిష్టిగా ప్రతిశాపం వంటి పని చేయలేదు. ‘పడ్డవాడెప్పుడూ చెడ్డవాడు కాడు’ అనే జనశ్రుతి ఇందుకే పర్యాప్తమైంది” అన్నాడు శ్రీరామచంద్రుడు.

లక్ష్మణుడికి తన వనవాసం, భార్య ఊర్మిళ సహనం మదిలో మెదిలేయి!

అన్నదమ్ములు లేచి మందిరం బయటకు కదిలేరు!

ప్రక్షిప్త సర్గలు:

  1. రాముని సభకు ఒక శునకం వచ్చింది. ‘నేనీ నగరంలో అక్కడా ఇక్కడా ఏరుకుని నా తిండి నేను తిని పడుకుంటుంటే, ఈ బిక్షువు నన్ను చావగొట్టి తిట్టి, కడగా నెట్టి ఛీ గొట్టాడు స్వామీ’ అని భిక్షువుని చూపింది. భిక్షువేమో – ‘నేను ఇల్లిల్లూ తిరిగి అడుక్కున్న దానిని తినటానికి సత్రం చేరుకోగానే, ఇది నా కాళ్ళకు అడ్డం తగులుతూ తయారవుతుంది. రోజూ ఇదే అవస్థ దీనితో’ అని తన ఇబ్బంది తాను చెప్పుకున్నాడు. రాముడు తీర్పు చెబుతూ – భిక్షువుకి మఠాధిపత్యాన్ని ఇచ్చి పొమ్మన్నాడు. ఆ కుక్కతో పాటు పరిషత్తు సభ్యులూ, పౌరులూ ‘ఇదేమి తీర్పు?’ అని ఆశ్చర్యపోయారు. రాముడు వారికి సమాధానంగా – ‘భిక్షువు, కుక్క గత జన్మలో చేసిన కర్మఫలం అనుభవిస్తున్నారు’ అని వివరణనిస్తాడు.
  2. ఇలాంటిదే మరొకటి – గ్రద్ద గుడ్లగూబల వివాదము. గ్రద్ద మనుష్యులు పుట్టినప్పటి నుండి ఈ చెట్టుమీద నేను నా ఇంట్లో వుంటున్నాను – అంటున్నది. ఈ చెట్టు పుట్టిన నాటినుండి నేను నా గూడు నిర్మించుకుని ఇందులో వుంటున్నాను అంటున్నది గుడ్లగూబ. రాముడు సృష్టిక్రమాన్ని వర్ణించి, చెట్టు పుట్టనప్పటి నుండి నేను ఇక్కడే వుంటున్నాను అని వాదించే గ్రద్ద వాదన అసత్యం. చెట్టు ప్రారంభం నుంచీ వుంటున్నానన్న గుడ్లగూబ మాట సత్యం – అని తీర్పునిస్తాడు.

రెండు కథలూ రాముని న్యాయనిర్ణయ సామర్థ్యాన్ని చెప్పటానికి కల్పింపబడి ఉంటుందని వ్యాఖ్యాతల అభిప్రాయం.

ప్రజాహితంలో నిమగ్నుడై వున్నాడు రాముడు. ప్రజాహితం అంటే ధర్మమార్గంలో ప్రజల్ని శాసించటం. సుఖాల్ని కల్పించటం కాదు, సుఖాల్ని పొందేందుకు, గడించుకొనేందుకు వారిని స్వావలంబనాశ్రితుల్ని చేయటం. ప్రజల తత్త్వాన్నీ, ధర్మార్థ తత్త్వాన్నీ తెలిసి పాలన చేయటం.

సభ, పరిషత్తు – రెండు మాన్య సామాన్యపౌర జానపదవర్గాల సలహామండలులు. సమాఖ్య సామంత, మంత్రిమండలి. అష్టమంత్రుల సమావేశం వేరు. వీరందరినీ కర్తవ్య పరాయణుల్ని చేయటమూ పాలనలో భాగమే.

అప్పుడే రెండు సమావేశాలు ముగిశాయి.

శ్రీరాముడు విశ్రాంతి మందిరంలోకి వెళ్ళబోతుంటే, సుమంత్రుడు ప్రవేశించాడు. నిజానికి అతడూ వెళ్ళబోతూ, వెనక్కి వచ్చాడు.

“యమునా తీరం వాసులు – భార్గవులు మొదలైన మహామునులు – మహారాజ దర్శనం కోరుతూ ద్వారం వద్ద వేచివున్నారు ప్రభూ” చెప్పాడు.

వెంటనే ప్రవేశపెట్టమన్నాడు. ఎదురేగి వారికి స్వాగతం పలికేడు. వారంతా తాము తెచ్చిన వనమూలఫలాల వంటి కానుకల్ని సమర్పించి కూచున్నారు. కుశలప్రశ్నలు అయినై. వచ్చిన పనిని అడిగేడు. మునుల పక్షాన భార్గవమహర్షి మాట్లాడాడు.

(సశేషం)

Exit mobile version