[‘ఉత్తర రామచరిత’ను వచన రూపంలో సరళ సుందరంగా అద్భుతమైన దృశ్యీకరణ శైలిలో అందిస్తున్నారు శ్రీ విహారి గారు.]
లవణాసుర వృత్తాంతము – సంహారము:
పూర్వం కృతయుగంలో దైత్యులలో మహామతీ, లోల పుత్రుడూ అయిన మధువుఅనే మహాసురుడు వుండేవాడు. అతడు బ్రాహ్మణ పూజకుడు, వారి రక్షణను బాధ్యతగా స్వీకరించిన ధర్మపరుడు. మహాపరాక్రమవంతుడు కూడా. రుద్రుడు వీని మహద్గుణాలకు సంతోషించి ఒక గొప్ప కాంతీ, శక్తీ కలిగిన శూలాన్ని బహూకరించాడు. “ఇది రుద్ర శూలము వంటిదే. అమిత శక్తివంతమైనది. దేవతలకు, బ్రాహ్మణులకు నీవు ఎంత కాలం ఏ అపాయం కలగజేయకుండా వుంటావో, అంతకాలం ఇది నీ వశమై వుంటుంది. ఎవరు నిన్ను యుద్ధంలో ఎదిరించవచ్చినా వారిని భస్మం చేసి తిరిగి నీ చేతిలోకి వచ్చేస్తుంది. మహామహిమాన్వితమైన ఆయుధం, జాగ్రత్త” అని దాన్ని అందించాడు. వెంటనే మధువు రుద్రుని మరొక కోరిక కోరేడు, “భగవంతుడా! ఇంతటి శక్తిమంతమైన శూలం శాశ్వతంగా నా వంశానికి చెందేటట్టు వరమివ్వు” అని. రుద్రుడు “అది జరగదు” అని పర్జన్యగర్జలా చెప్పేశాడు. క్షణం ఆగి మధువు పై కారుణ్యంతో ‘సరే అడిగావు కనుక, నీ కుమారునికి ఒక్కనికీ మాత్రం ఇదివశమై వుండే వరాన్నిస్తున్నాను” అని అంతర్థానమైనాడు.
మధువు బ్రహ్మానందం పొందాడు. భార్య కుంభీనసకు తెలిపి ఆమెనూ సంతోషింపజేశాడు. ఈమె విశ్వావసువుకూ, అనలకు జన్మించిన మహాభాగ. అనతికాలంలోనే మధువు- కుంభీనసలకు లవణుడు జన్మించాడు.
లవణుడు బాల్యం నుంచే దుష్టబుద్ధి ప్రదర్శకుడైనాడు. వాడు చేసేవన్నీ పాపకృత్యాలే. తల్లిదండ్రుల హితబోధల్ని తిరస్కరించి దుష్టత్వాన్ని చూపసాగేడు. పుత్రుని ‘ఘన’ కార్యాల విచారంతోనే మధువు మరణించాడు. రుద్రశూలం లవణుడి పరమైంది. దాన్ని చూసుకుని లవణునిలో మరింతగా అహంకారం విజృంభించింది. లోకాల్ని పీడిరచసాగేడు. దుర్మదుడై ఋషుల్ని చెండుకు తినసాగేడు. క్రూరస్వభావంతో అన్ని ప్రాణుల్నీ ఆహారం చేసుకుని యథేచ్ఛగా విహరించటం నిత్యకృత్యమైంది. ప్రత్యేకించి మునిభక్షణ వాడికి ప్రియమైన ఆహారమైంది. సింహాలూ, లేళ్ళు, పెద్దపులులు, పక్షులు – అనీ వాడికి నంజుళ్ళ లెక్క. “మమ్మల్ని ఎలాగైనా వాడినుండి కాపాడ”మని వేడుకున్నారు మునులంతా.
విన్నాడు రాముడు – ఆలోచించాడు. ముగ్గురు తమ్ముల్నీ పిలిపించాడు. వారికీ ఈ లవణాసురుడి దుర్మార్గాల్ని తెలియజేశాడు.
“మృత్యుదేవతలా వున్న లవణుని ఎవరు సంహరించగలరు?” ప్రశ్న.
“భరతుడు రాముడి పాదుకలకు పట్టాభిషేకం చేసి పధ్నాలుగేళ్ళు రాజ్యపాలన భారాన్ని వహించాడు. లక్ష్మణుడు వనవాస క్లేశాన్ని సహించి వున్నాడు. కనుక లవణుని నా వాటాకు ఇవ్వండి” అన్నాడు శత్రుఘ్నుడు.
రామునికీ ఇది సమంజసమైన సూచన, కోరిక అనిపించింది. మునులకు బాసచేశాడు. అభయమిచ్చాడు. లవణాసుర సంహారానికి శత్రుఘ్నుడు నియోగింపబడినాడు.
ముందుగా మధువు రాజ్యానికి ప్రభువుగా శత్రుఘ్నునికి మునుల సమక్షంలో అయోధ్యలోనే పట్టాభిషేకం జరిపించాడు శ్రీరాముడు.
“యమునా తీరంలో సుందరమైన నగరాన్ని నిర్మింపజేసే బాధ్యత నీది. పౌరజన పదాల్ని ఏర్పాటు చేయించి ధర్మానుసారం రాజ్యపాలన చెయ్యి” అని తమ్మునికి ఆజ్ఞ ఇచ్చాడు.
కులగురువు వశిష్ఠుడూ, ఇతర పెద్దలూ ఆశీస్సులు పలికారు. అంతఃపురంలోని తల్లులు, వదినలు దీవెనలిచ్చారు. అన్నగారి ఆజ్ఞను శిరసా వహించి లవణ సంహారం చేస్తానని బాస చేశాడు శత్రుఘ్నుడు.
తమ్ముని తీసుకుని ఆంతరంగిక మందిరానికి వెళ్లాడు రాముడు.
అక్కడ-
“స్వయంభువుగా శ్రీమహావిష్ణువు మహాసముద్రంలో శయనించినప్పుడు ఈ దివ్యమైన శక్తిగల శరంసృష్టించబడింది. మధుకైటభ సంహారానికీ, సుర రక్షణకూ ఈ శరం సృష్టింపబడింది. సురాసురులకు ఇది కనపడదు. రావణునితో యుద్ధంలోకూడా నేనీ శరాన్ని ఉపయోగించలేదు. కారణం ప్రాణ వినాశానికి భీతిల్లే” అనే వివరణతో ఆ దివ్యమైన బాణాన్ని సోదరునికి అందించాడు రాముడు.
అంతేగాక, లవణాసుర సంహారానికి కావలసిన వ్యూహాన్నీ తానే చెప్పాడు.
“ఆ లవణుడు శూలాన్ని ఇంట్లో వుంచి పూజలు చేస్తూ, బయటికి వెళ్ళి క్రూరకార్యాలు చేసి చేసి తిరిగి ఇంటికి వచ్చి శూలాన్ని జాగ్రత్తగా భద్రం చేసుకుంటూ వుంటాడు. కనుక, లవణుడు బయటికి వెళ్లి తిరిగి వచ్చి పురాన్ని చేరకముందు, అతని భవన ప్రవేశానికి ముందే అతన్ని సంహరించాలి. మరో మార్గంలో వానిని వధించలేవు, వాడికి ఏమాత్రం అనుమానం కలిగినా శూలాన్ని పట్టుకుంటాడు. అప్పుడా అసురుడు అవధ్యుడవుతాడు, జాగ్రత్త”
“ఇప్పుడు గ్రీష్మం జరుగుతోంది. ఇది పూర్తి అయి, వర్షాకాలం మొదలయ్యే సమయంలో నీవు మధుపురం చేరాలి. ఈలోగా సైన్యం వెళ్ళి యమునకు ఈవల సిద్ధంగా వుంటుంది. వర్షఋతువు ఆరంభంలో మునుల్ని ఉంచుకుని సేనావాహిని వాడి పురం దగ్గరికి చేరుతారు. అప్పుడు నీవూ అక్కడికి చేరాలి. ఇదీ ప్రణాళిక. ఇతర వివరాలను నీవు సేనా నాయకులతో చర్చించి నిర్ణయించుకో. వర్షాకాలం గదా శత్రువు లెవరూ యుద్ధానికి రారని వాడు శూలం లేకుండా స్వేచ్ఛావిహారంతో ఆహారానికి పోతూ వుంటాడు. ఆహార వ్యామోహం కూడా ఒక వ్యసనం. మితంలేకుండా తినటమంటే మనోనిగ్రహం శూన్యమనే అర్థం. తిండి రుచికోసం సమస్త జీవుల్నీ విచక్షణ లేకుండా చంపుకు తినటం దుర్మార్గం, అభ్యంతరకరం!”
-అన్నగారి మాటల్ని శ్రద్ధగా విని, “మీ ఆజ్ఞ ప్రకారం నడుస్తాను. ఆశీర్వదించండి” అని పాదాభివందనం చేసి శత్రుఘ్నుడు సెలవు తీసుకున్నాడు.
ఆ మర్నాడు సేనానాయకుల్ని సమావేశపరచాడు శత్రుఘ్నుడు. వారంతా సమర్థులూ, శూరులూ, యుద్ధకౌశలంలో, వ్యూహాచరణలో సిద్ధహస్తులు. మహోత్సాహంతో ప్రణాళికను విన్నారు. ‘శత్రువు అయిన లవణాసుర సంహారాన్ని మాకు వదిలేయండి’ అన్నట్టు ప్రతాపం చూపేరు.
శత్రుఘ్నుడికి సంతృప్తి కలిగింది. చేయవలసిన పనులూ, మార్గమధ్యంలో విడిది ప్రదేశాలూ, చివరికి పొంచివుండవలసిన ప్రాంతం – అన్నీ నిర్దేశింప బడినాయి.
మునులంతా ‘సర్వదా విజయీభవాన్’ అని దీవించారు. వారంతా సైన్యానికి మార్గదర్శకులూ, పురోగాములూ. మరోవిధంగా రక్షణ కవచం లాంటివారు.
మరో నాలుగురోజుల్లో సేనావాహిని తమ బాటపట్టింది.
నాలుగురోజుల తర్వాత –
శత్రుఘ్నుడు పరిమితసైన్యంతో మధువు నగరానికి బయల్దేరాడు. రెండురోజుల ప్రయాణం జరిగింది.
ఆ రాత్రి –
విశ్రమించేందుకు అనువైన ప్రదేశం కోసం చూస్తుంటే, ప్రశాంతమైన వాతావరణం, పరిసరాలూ ఉన్న ఆశ్రమం కనిపించింది. సైన్యాన్ని దూరంగా ఒక ప్రచ్ఛన్న స్థలంలో ఆపి, తానొక్కడూ ఆశ్రమానికి వెళ్ళాడు.
అది వాల్మీకి ఆశ్రమం!
వాల్మీకి దర్శనం! శత్రుఘ్నుడు చాలా ఆనందించాడు. మహర్షికి అంజలి ఘటించి “కార్యార్థినై వెళుతున్నాను. ఈ రాత్రికి తమ ఆశ్రయం కావాలి” అని అర్థించాడు.
వాల్మీకి చిరునవ్వుతో “ఇది మీ ఆశ్రమమే రాఘవా! రఘువంశ్యుల విశ్రావమే ఇది” అని “ఆ విశేషాలు చెబుతాను” అంటూ ముందు మార్గశ్రమ తీర్చుకొనే ఏర్పాట్లు చేయించాడు. మునిబాలకుల్ని సైన్య విషయం చూడమని పంపేడు. శత్రుఘ్ననకు ఫలమూలాల్ని తెప్పించి ఇప్పించాడు. శత్రుఘ్నుడు సేదదీరాడు.
వాల్మీకి ఆ ఆశ్రమ వృత్తాంతాన్ని చెప్పసాగేడు.
రఘువంశంలో సుదాసుడనే రాజు ఉండేవాడు. ఆయన కుమారుడు మిత్రసహుడు. కానీ, సౌదాసుడనే వ్యవహారనామం ఆయనది. చిన్నతనం నుండి ఆయనకు వేట ప్రియత్వం ఎక్కువ. ఒకసారి వేటకు వెళ్ళాడు.
మహారణ్యం –
భయంకరమైన రాక్షసులిద్దరు పెద్దపులుల ఆకారాల్లో వందలు, వేలు సంఖ్యలో మృగాల్ని చంపి, తిని యధేచ్ఛగా తిరుగుతున్నారు.
సౌదాసుడు వారిని చూశాడు. కోపం వచ్చింది. శరసంధానం చేసి ఒక రాక్షసుని చంపాడు.
దగ్గరకు వెళ్ళి చూశాడు. రెండవవాడు “ఏ అపరాధమూ చేయని నా మిత్రుణ్ణి వధించావు. సరే. కానీ.. సమయం వచ్చినప్పుడు ప్రతీకారం తీర్చుకుంటాను” అని అంతర్థానమయి పోయాడు.
కాలక్రమంలో సౌదాసుడు రాజ్యాభిషిక్తుడైనాడు. ఒక మహాయజ్ఞాన్ని చేశాడు. యజ్ఞసమాప్తిలో – పూర్వపు రాక్షసుడు వశిష్ఠుడి రూపం ధరించి అక్కడికి వచ్చాడు. రాజుని మాంసంతో చేసిన మధురమైన ఆహారాన్ని పెట్టమని కోరేడు. రాజు వంటవానిని ఆజ్ఞాపించాడు. వంటవాడు సందేహించాడు. రాక్షసుడు తానే వంటవానిగా మారి, మనుష్య మాంసపదార్థాన్ని చేసి, తీసుకుపోయి రాజుకు ఇస్తే రాజు దాన్ని అసలు వశిష్ఠునికి ఇచ్చాడు. దాన్ని చూసి క్రోధావిష్టుడై వశిష్ఠుడు, “నన్ను మాంసభక్షకుని చేయబూని అవమానించావు. కనుక, ఇకనుండి ఇదే నీకు భోజనం అవుతుంది” అని శపించాడు!
సౌదాసుడు క్రుద్ధుడై మహర్షికి ప్రతిశాపం ఇవ్వబోయాడు. కానీ, ఆయన భార్య మదయంతి నిరోధించి, ‘ఆయన మన కులగురువు జరిగింది అపరాధం. దాన్ని ఇక్కడితో ఆపండి’ అని వేడుకున్నది. సౌదాసుడు కోపాన్ని మ్రింగుకున్నాడు. చేతిలో శాపం ఇవ్వటానికి తీసుకున్న నీళ్ళు ఉన్నాయి. వాటిని తన పాదాల మీద చల్లుకున్నాడు. రాజు పాదాలు నల్లగా రంగుమారిపోయాయి. ఆ సౌదాసమహారాజు అప్పటినుండి కల్మషపాదుడుగా ప్రసిద్ధుడైనాడు.
వశిష్ఠుడు రాక్షసమాయను అర్థం చేసుకుని, శాపావసానాన్ని అనుగ్రహించాడు. ‘పన్నెండు సంవత్సరాల తర్వాత నీకు శాపవిముక్తి కలుగుతుంది. అప్పటివరకూ జరిగిన భక్ష్యభక్షణాదికం గుర్తుండదు’ అని వరమిచ్చాడు.
‘ఆ కల్మషపాదుడు నిర్వహించిన యజ్ఞభూమే ఈ ఆశ్రమం’ అని ముగించాడు వాల్మీకి.
– శత్రుఘ్నుడు పర్ణశాలలో విశ్రమించాడు.
నిద్రపట్టటం లేదు. వాతావరణం ఆహ్లాదకరంగానే వుంది. మహర్షి వాక్కులు పూర్వరాజన్యులందరినీ స్మరణకు తెస్తున్నాయి. ధర్మపరులు, ధర్మపరిరక్షకులు వారంతా! శ్రీరాముడు ఆ తానులో ముక్క. బాధ్యతాబాధ్యతల్ని గరపిన అన్న!
కుశలవుల జననం:
..ఇలా ఆలోచనామగ్నుడై బయటకు వచ్చాడు.
చల్లటి కమ్మతెమ్మెర వీస్తున్నది. పింఛాలనార వేసుకున్న నెమళ్ళులాగా కొండలు, వనంలో చెట్లు హరిణాల్లా వివిధ భంగిమల్ని చూపుతున్నాయి. అలతిదూరంలో సైన్యం విశ్రమిస్తున్నది. కాగడాల వెలుగు. రక్షకభటులు గుడారాలకు పహారా కాస్తున్నారు.
జాములు గడుస్తున్నాయని తెలుపుతూ చాయ వెలుగుని ప్రసరిస్తున్నాడు చంద్రుడు.
– ఎవరో మునిబాలకులు! చకచకా వేస్తున్నారు అడుగులు.
మొహాల్లో సంబరం! ఆశ్చర్యం కలిగింది. ఈ అసమయంలో ఎందుకు వస్తున్నారు?
ఆ ఇరువురు వాల్మీకుల వారి కుటీరం లోపలికి వెళ్ళారు. శత్రుఘ్నుడూ కాలుకదల్చి, కొంచెం సమీపానికి వెళ్ళాడు.
లోపలినుంచీ మాటలు వినిపిస్తున్నాయి. “భగవన్! రామపత్నీ సాప్రసూతా దారద్వయమ్! తతో రక్షాం మహాతేజౌ కురు భూతవినాశనీమ్!”
(రామసతి ఇద్దరు బాలకుల్ని ప్రసవించింది. తమరు వచ్చి భూతబాధా నివారకమైన రక్షా విధానాన్ని చేయాలట స్వామీ!)
శత్రుఘ్నుడు ఆనందభరితుడైనాడు.
వాల్మీకుల వారు చేతిలో దర్భకట్టతో బయటికి వచ్చారు. వేరే కుటీరం వైపు నడిచారు.
శత్రుఘ్నుడు నిదానంగా తన పర్ణశాలలోనికి వెళ్ళి విశ్రమించాడు.
– మహర్షి వాల్మీకి ప్రసవగృహం లోపలికి వెళ్ళి పిల్లల్ని చూసి, దర్భల్ని అభిమంత్రించి, పిల్లకు రక్షచేసి, కుముస్ఠినీ, లవమునూ తపస్వినులకు ఇచ్చి, ముందు పుట్టినవానికి కుశాగ్రములతో సమ్మార్జునం చేయండి. రెండవవానికి దర్భల కిందిభాగం – లవముతో – సమ్మార్జనం చేయండి” అని చెప్పాడు. వారు వాటిని ఆయన చెప్పిన విధంగా చేశారు.
కొంత సమయం గడిచింది.
సావధానంగా సీతను చేసన్నతో పరామర్శించి “తల్లీ, నీ పిల్లలు తేజోవంతులు, వీర్యవంతులూ అవుతారు. పెద్దవానిపేరు కుశుడు, రెండవవాడు లవుడు. వారిద్దరూ ఆపేర్లతో కీర్తిమంతులవుతారు” అని ఆశీర్వదించాడు.
-తెల్లవారింది.
మహర్షి వద్ద సెలవు తీసుకుని, శత్రుఘ్నుడు తన ప్రయాణాన్ని ఆరంభించాడు.
– ఆ ప్రయాణం సైన్యంతో సహా ఏడురోజులు జరిగింది.
ఏడవరోజు రాత్రికి యమునా తీరంలోని ఋషీశ్వరుల ఆశ్రమప్రాంతం చేరేరు. అక్కడ విశ్రమం.
మర్నాడు – రాత్రి
మహర్షులతో ఇష్టగోష్ఠిలో ఉన్నాడు శత్రుఘ్నుడు. భృగువు పుత్రుడు- చ్యవనమహర్షి – ప్రసాక్తానుప్రసక్తంగా, లవణుడి బలం గురించీ, వాని వద్దగల శూలం గురించీ చెప్పసాగేడు.
“మహోదయా, ఆ లవణుడి బలం వాడి కిరాతక చర్యలకు తగినదే. అనేకమందిని ద్వంద్వయుద్ధంలోనే సంహరించాడు. ఆ విధానం వాడి శౌర్యానికి నిదర్శనం-”
“అలా నిర్జింపబడిన వారిలో మహావీరులెవరూ లేరా?” అనే సందేహాన్ని అడిగాడు శత్రుఘ్నుడు.
“ఉన్నారు. వాడికి తన బలం, శూలం బలం కలిసి కలిగించిన మదం హెచ్చు. దాని విజృంభణం గురించి చెబుతాను విను”
చ్యవనుని భాషణాన్ని శ్రద్ధగా వింటున్నాడు శత్రుఘ్నుడు.
***
‘పూర్వం యువనాశ్వని పుత్రుడు మహాబలశాలి, పరాక్రమ విక్రముడు అయిన మాంధాత అయోధ్యను పాలిస్తూ వుండేవాడు. ఆ వీరుడు మీ ఇక్ష్వాకు వంశం వాడే. భూమినంతా దాదాపుగా ఏకచ్ఛత్రాధిపత్యం కిందకు తెచ్చి ఏలుకుంటున్నాను కనుక దేవలోకాన్నీ జయించాలనీ కోరిక కలిగింది. దేవలోకాన్ని ఆక్రమించాలనుకున్నాడు.
ఇంద్రుడికీ విషయం తెలిసింది. జంకు కలిగింది. తనంత తానుగా అర్థసింహాసనాన్నీ, అర్ధరాజ్యాన్నీ ఇస్తామని సురగణాలు మాంధాతకు ఒక ప్రతిపాదనను పంపేయి. మాంధాత అంగీకరించలేదు. దేవేంద్రునికి కోపం కలిగింది. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికెక్కుతానన్న సామెతగా – ముందు నీకు భూలోకం మొత్తాన్ని జయించే శక్తి లేదు, మా మీదకు దండెత్తుతావా – అని క్రుద్ధుడైనాడు.
మాంధాతకు తిక్కరేగింది. ‘భూలోకంలో నాపాలనను వ్యతిరేకించేవారు ఎవరున్నారు?’ అని బీరాలు పలికాడు. ‘ఉన్నాడు, మధువు పుత్రుడు మధువనంలో లవణుడు వున్నాడు, వాడిని జయించి మా మీదకు రా చూద్దాం’ అని సవాలు విసిరేడు.
మాంధాత ‘సరే’ అని లవణుడుని యుద్ధానికి ఆహ్వానిస్తూ దూతని పంపాడు. లవణుడు అసలే మదశాలి. ఈ ఆహ్వానాన్ని అవమానంగా భావించాడు. దూతను సంహరించి యుద్ధానికి సిద్ధమైనాడు.
ఇద్దరికీ పోరు భీకరంగా జరిగింది. మాంధాత బలం ముందు లవణుడి బలం వీగిపోయినా, వాడి శూలం బలం మాంధాతను సంహరించేసింది!
మీ వంశంలో ఇంతవరకూ ఎవ్వరూ వాడిమీద పగ తీర్చుకోలేదు. ఇప్పటికి ఆ అవకాశం నీకు దక్కింది. ‘జయోస్తు!’ అని దీవించాడు. దేవతలూ, ఇతర ఋషులూ ‘తథాస్తు’ అన్నారు.
***
ఉషోదయమైంది.
ఆదిత్య ప్రతాపం మొదలైంది. ఇటు శత్రుఘ్నుడు మధుపురానికి ససైన్యుడై బయలుదేరాడు. అటు లవణుడు తన ఆహార సంపాదన, భక్షణ యాత్రకు బయటకు బయల్దేరాడు.
మధ్యాహ్నం దాటింది.
శత్రుఘ్నుడు మధుపుర ద్వారం దగ్గరికి చేరి లవణుడి రాక కోసం వేచి చూస్తున్నాడు.
వచ్చాడు లవణుడు.
ఎలా వచ్చాడు? కొన్నివేల కళేబరాల్ని తన వాహనాల మీద వేసుకుని వచ్చాడు. తానుగా కొన్నిటిని తక్షణభక్షణకు, దారిబత్తెంలా – దేహానికి కొన్నిటిని వ్రేలాడగట్టుకుని భీకరాకారుడై వచ్చాడు. చూశాడు.
ద్వారం దగ్గర సైన్యం! వారికి ముందు నాయకుడు – శత్రుఘ్నుడు!
“ఎవడవురా నువ్వు! నాకు ఆహారంగా కావాలని చావు కోరుకుని వచ్చావా? సాహసవంతుడవే. సరాసరి నా ఎదుట నిలబడగలిగావు” అని హేళన చేశాడు.
“దుర్మార్గుడా, నేనెవరో నా పరాక్రమం తెలుపుతుంది. అయినా అడిగావు కనుక విను. సత్యధర్మ పరాక్రమవంతుడు శ్రీరాముని సోదరుడిని. నా పేరే రిపుఘ్నుడు. నా అన్న పనుపున నిన్ను వధించటానికే వచ్చాను. రా. నాతో ద్వంద్వయుద్ధం చెయ్యి”
వికృతంగా వికటాట్టహాసం చేశాడు లవణుడు. “సరే. నీముచ్చట తీర్చి తర్వాతే నిన్ను భక్షిస్తాను. ఉండు. లోనికి వెళ్ళి నా ఆయుధం తెచ్చుకుంటాను” అని ద్వార సమీపానికి వెళ్ళటానికి ఉంకించాడు. శత్రుఘ్నుడు అడ్డుకున్నాడు. “క్రూరుడవు, పాపాత్ముడవు అయిన శత్రువువి నువ్వు. నిన్ను విడువకూడదు. ధర్మం కాదు. న్యాయమూ కాదు. నేను నీకా అవకాశాన్నిచ్చే మందబుద్ధినీ కాను” అంటూ, చిచ్చరపిడుగులా ముందుకు దూకి ఒక్కవేటు వేశాడు.
ఆ దెబ్బకు లవణుడు మహోగ్రుడైనాడు. పక్కనున్న ఒక మహావృక్షాన్ని పెళ్ళగించి ఒక్క ఉదటున శత్రుఘ్నుని పైకి విసిరాడు. శత్రుఘ్నుడు దాన్ని శతధా చేధించేశాడు.
అటు ఇటూ బాణవర్షం!
లవణుడు విజృంభించి శత్రుఘ్నుని మూర్ఛిల్లేటట్లు కొట్టాడు. అతను మోహవశుడైనాడు.
దేవగణం హాహాకారాలు చేశారు. సైన్యం శీఘ్రంగా తమ నాయకునికి బాసటగా రక్షణ వలయాన్ని కట్టేశారు.
లవణుడికి లోపలకు వెళ్ళే అవకాశం యివ్వకుండా శరపరంపరగా ఎదుర్కొన్నారు.
శత్రుఘ్నుడు చనిపోయాడనుకుని తాను తెచ్చుకుని, ఇంతకుముందు పక్కన పడేసిన కళేబరాల్ని ఎత్తుకోబోయేడు లవణుడు.
మరునిమేషంలో శత్రుఘ్నుడు స్పృహ పొందాడు.
ఆయుధాన్ని ధరించి లవణుని పైకి దూకేడు. మరో రెండుక్షణాల్లో శ్రీరామ ప్రసాదమైన, మహద్వంతమైన శక్తిగల శరాన్ని సంధించాడు.
దివ్యమూ, అమోఘమూ అయిన ఆ బాణ ప్రభావానికి లోకం గజగజ వణికింది. పర్వతాల్నే భేదించే తీవ్రత కలిగిన దాని పూనిక వలన సురాసుర గంధర్వ యక్ష కిన్నర సిద్ధసాధ్యులంతా భయభ్రాంతులైనారు.
బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి తమ భయవిహ్వలతను చూపుకున్నారు. బ్రహ్మ వారికి అభయమిచ్చి, శరం ప్రభావాన్ని వివరించాడు. వారు లవణ శత్రుఘ్నుల కదనరంగాన్ని చూస్తూ నిలబడిపోయారు.
ఇక్కడ యుద్ధ ప్రదేశం లోని వీరులంతా నిశ్చేష్టులై కడగా నిలిచారు.
శత్రుఘ్నుడు శరాన్ని ప్రయోగించాడు!
దివ్యమైన ఆ బాణం లవణుని వక్షస్థలాన్ని చీల్చి, రసాతలాన్ని ప్రవేశించి లిప్తకాలంలో మళ్ళీ శీఘ్రంగా వచ్చి శత్రుఘ్నుని చేరింది!
లవణాసుర సంహారం జరిగింది! దేవదుందుభులు మ్రోగాయి. పుష్పవృష్టి కురిసింది!
‘దిష్ట్యా జయో దాశరథే తవాద్య
దిష్ట్యా చ లోకాః సకలాః ప్రసన్నాః’
అని ఈప్రశంసా వాక్యాలు పలికేరు దేవతలంతా. ఋషులు ప్రశంసించారు.
అవును! అదృష్టం చేత జయం పొందాడు దశరథ పుత్రుడు. అదృష్టవశాన లోకాలన్నీ ప్రసన్నములైనవి!
చ్యవనుడు మొదలైన మునిముఖ్యులంతా శత్రుఘ్నుని సంస్తుతించి, తమను లవణుని బాధల నుండి కడతేర్చినందుకు దీవెనలిచ్చారు!
– శత్రుఘ్నుడు నిర్మించబోయే మధుపురి రమ్యంగా శూరులైన సైన్యంతో అలరారుతుంది. దివ్యనగరంలా శోభాయమానంగా వైభవోపేతం అవుతుంది అని వరాల్ని ఇచ్చారు.
– ఆ శ్రావణమాసం కాగానే నగర శంఖుస్థాపన జరిగింది. శత్రుఘ్నుని భార్య శ్రుతకీర్తి వచ్చి భర్తని చేరింది.
నగర నిర్మాణం పూర్తి అయి, మహోన్నత విభవంతో, దేవతానగరంలా విలసిల్లింది.
– శత్రుఘ్నుని ధర్మపాలనలో పన్నెండు సంవత్సరాలు గడిచేయి.
అన్నను చూడాలని భార్యాసమేతంగా పరిమితసంఖ్యలో సైనికులతో, ముఖ్య అనుచరులతో అయోధ్యకు బయల్దేరేడు శత్రుఘ్నుడు.
మార్గమధ్యంలో వాల్మీకి ఆశ్రమంలో ఆగేడు.
ఆ రాత్రి – భగవంతమైన రాత్రి. చంద్రుడూ వెన్నెల కాస్తున్నాడు- భగవంతంగానే. శుభమస్తు పవనాలు వీస్తున్నాయి. రమ్యతరంగంలా వీనులవిందుగా శ్రావ్యమైన గానం వినపడుతోంది. తెలిసి తెలియని ఊహలు ఒకింత క్రమ్ముతున్నాయి. నిలిచి నిలువనీయని స్థితిలో దేహం పులకిస్తున్నది. కనులు అరమోడ్పులయి హాయిని మేస్తున్నాయి.
ఒక ఆనంద పారవశ్యం, ఒక అనుభూతి తన్మయత్వం!
మనసు లోలోపల ఏదో మహా విశేష స్పర్శాసుఖం! ఆ పులకింతకు ఆశ్చర్యపోయారు రిపుఘ్నుడు, భార్య శ్రుతకీర్తీ!
కారణం –
రామచరిత గానం చేయబడుతోంది. మధురమంజుల శ్రవణీయత జాలువారుతోంది!
ప్రాంగణంలో విడిది చేసిన సైన్యముఖ్యుల మనసుల్లోనూ ఇదే పారవశ్యం!!
ఆ రాత్రి వారందరికీ ఒక సుమధుర మనోహర జ్ఞప్తిగా మిగిలింది!
– ఆ మర్నాడు మహర్షి ఆశీస్సులు స్వీకరించి, ఆయన దగ్గర సెలవు తీసుకుని బయల్దేరి అయోధ్యకు వెళ్ళారు.
***
అయోధ్య-
శ్రీరామ రాజ్యం వైభవోన్నతంగా వున్నది. ప్రజలంతా క్షేమ సౌఖ్యాలతో ఆనందిస్తున్నారు.
తల్లులకందరికీ మ్రొక్కారు శత్రుఘ్నుడూ, భార్యా. తన తల్లికి వందనాలు చేశాడు. రాణివాసమంతా వీరి రాకకు పండుగ జరుపుకుంది.
ఊర్మిళా లక్ష్మణుడూ, మాండవీ భరతులూ – తమ్మునీ, అతని భార్యనూ ప్రత్యేక ఆదరంతో ఆనందింపజేశారు.
శ్రీరామునికి పాదాభివందనం చేశారు శత్రుఘ్ను దంపతులు.
అందరి కళ్ళల్లోనూ చెమరింపు!
రాముడు తమ్ముని ఆలింగనం చేసుకుని, అతడి ఘనకార్యాలకు ప్రశంసించాడు. రాజ్యపాలన గురించి ప్రత్యేక విచారణ చేశాడు. వలసిన సూచనలూ, హితమూ పలికేడు.
ఏడురోజులూ ఏడు నిముషాల్లా గడిచిపోయాయి.
అయోధ్య అంతా ఆనందంతోనూ, కొంత అసంతృప్తితోను శత్రుఘ్న పరివారానికి వీడ్కోలు పలికింది!
(సశేషం)
విహారిగా సుప్రసిద్ధులైన శ్రీ జే.యస్.మూర్తి గారు 1941 అక్టోబర్ 15 న ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు. విద్యార్హతలు: ఎం.ఏ., ఇన్సూరెన్స్ లో ఫెలోషిప్; హ్యూమన్ రిసోర్సెన్ మేనేజ్మెంట్, జర్నలిజంలలో డిప్లొమాలు, సర్టిఫికెట్స్, జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో ప్రసంగాలు, వ్యాస పత్ర ప్రదానం.
తెలగులోని అన్ని ప్రసిద్ధ పత్రికల్లోను 350 పైగా కథలు రాశారు. టీవీల్లో, ఆకాశవాణిలో అనేక సాహిత్య చర్చల్లో పాల్గొన్నారు.
15 కథా సంపుటాలు, 5 నవలలు, 14 విమర్శనాత్మక వ్యాససంపుటాలు, ఒక సాహిత్య కదంబం, 5 కవితా సంపుటాలు, రెండు పద్య కవితా సంపుటాలు, ఒక దీర్ఘ కథా కావ్యం, ఒక దీర్ఘకవిత, ఒక నాటక పద్యాల వ్యాఖ్యాన గ్రంథం, ‘చేతన’ (మనోవికాస భావనలు) వ్యాస సంపుటి- పుస్తక రూపంలో వచ్చాయి. 400 ఈనాటి కథానికల గుణవిశేషాలను విశ్లేషిస్తూ వివిధ శీర్షికల ద్వారా వాటిని పరిచయం చేశారు. తెలుగు కథాసాహిత్యంలో ఇది ఒక అపూర్వమైన ప్రయోజనాత్మక ప్రయోగంగా విమర్శకుల మన్ననల్ని పొందింది.
ఆనాటి ‘భారతి’, ‘ఆంధ్రపత్రిక’, ‘ఆంధ్రప్రభ’ వంటి పత్రికల నుండి ఈనాటి ‘ఆంధ్రభూమి’ వరకు గల అనేక పత్రికలలో సుమారు 300 గ్రంథ సమీక్షలు చేశారు.
విభిన సంస్థల నుండి పలు పురస్కారాలు, బహుమతులు పొందారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు (1977) గ్రహీత. కేంద్ర సాహిత్య అకాడెమివారి Encyclopedia of Indian Writers గ్రంథంలో సుమారు 45 మంది తెలుగు సాహితీవేత్తల జీవనరేఖల్ని ఆంగ్లంలో సమర్పించారు. మహాకవి కొండేపూడి సుబ్బారావుగారి స్మారక పద్య కవితా సంపుటి పోటీలోనూ, సాహిత్య విమర్శ సంపుటి పోటీలోనూ ఒకే సంవత్సరం అపూర్వ విజయం సాధించి ఒకేసారి 2 అవార్డులు పొందారు.
అజో-విభో-కందాళం ఫౌండేషన్ వారి (లక్ష రూపాయల) జీవిత సాధన ప్రతిభామూర్తి పురస్కార గ్రహీత. రావూరి భరద్వాజ గారి ‘పాకుడురాళ్లు’ – డా. ప్రభాకర్ జైనీ గారి ‘హీరో’ నవలలపై జైనీ ఇంటర్నేషనల్ వారు నిర్వహించిన తులనాత్మక పరిశీలన గ్రంథ రచన పోటీలో ప్రథమ బహుమతి (రూ.50,000/-) పొందారు. (అది ‘నవలాకృతి’ గ్రంథంగా వెలువడింది).
కవిసమ్రాట్ నోరి నరసింహ శాస్త్రి సాహిత్య పురస్కార గ్రహీత.
6,500పైగా పద్యాలతో-శ్రీ పదచిత్ర రామాయణం ఛందస్సుందర మహాకావ్యంగా ఆరు కాండములూ వ్రాసి, ప్రచురించారు. అది అనేక ప్రముఖ కవి, పండిత విమర్శకుల ప్రశంసల్ని పొందినది. ‘యోగవాసిష్ఠ సారము’ను పద్యకృతిగా వెలువరించారు.
వృత్తిరీత్యా యల్.ఐ.సి. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ నుండి జనరల్ మేనేజర్‌గా పదవీ విరమణ చేశారు. ఫోన్: 9848025600
