[‘ఉత్తర రామచరిత’ను వచన రూపంలో సరళ సుందరంగా అద్భుతమైన దృశ్యీకరణ శైలిలో అందిస్తున్నారు శ్రీ విహారి గారు.]
శంబూక వధ:
తెల్లవారి చాలా సేపయింది. రాచనగరూ, అయోధ్యా- దైనిక వ్యవహారాల్లో నిమగ్నమై వున్నది. ఎవరికి వారు ప్రజలంతా వారివారి వృత్తి ఉద్యోగ ఉపాధి కార్యక్రమాల్లో ఉన్నారు.
శ్రీరాముడు ఆనాడు కొలువు లేనందువలన తన మందిరంలో శాస్త్రపఠనం చేసుకుంటున్నాడు.
ధర్మగంట మ్రోగింది. అది రాచనగరు ముఖద్వారం దగ్గర వుంది. ప్రజల్లో ఎవరికైనా ఏ అవసరం కలిగినా, ఆ అవసరం శ్రీరామునికి మాత్రమే చెప్పకోవలసినది అయితే, వారు వచ్చి ఈ ధర్మగంటను మ్రోగించవచ్చు.
శ్రీరాముడు విన్నాడు. పరిచారకుల్నీ, ముఖ్యోద్యోగుల్నీ పిలిచి, ఆ ఆగంతకుల్ని ప్రవేశ పెట్టమన్నాడు.
వారు వెళ్ళివచ్చి గ్రామం నుండి ఎవరో ఒక వృద్ధ బ్రాహ్మణుడు, చనిపోయిన పధ్నాలుగు, పదిహేనేళ్ళ కుమారుని శవాన్ని తీసుకువచ్చి, పుత్ర శోకానికి రోదిస్తున్నాడు, లోనికి రానంటున్నాడని వార్త తెలిపారు. ఆ బ్రాహ్మణుని భార్య కూడా పక్కన వుండి విలపిస్తున్నది.
శ్రీరాముడు హుటాహుటిని ముఖద్వారం దగ్గరికి వచ్చేశాడు. జరిగిన సంభవానికి విచారాన్ని వ్యక్తం చేసి, ఆ బ్రాహ్మణ దంపతుల్ని ఊరడిల్ల చేయటానికి ప్రయత్నించాడు. కానీ, ఆ ప్రయత్నంలో విఫలుడైనాడు.
బ్రాహ్మణుడు తాను ఏడుస్తూనే మాట్లాడసాగేడు. “నేను ఎన్నడూ ఏ పాపం చేసినట్లు తెలియదు. నా కొడుకు నాకు శ్రాద్ధాదులు చేయవలసినవాడు – ఇలా బాల్యంలోనే మృత్యువాత పడటం ఘోరం కదా. ఇలాంటి దారుణం ఎన్నడూ వినిలేము. కనీలేము. బాలలకు ఇలా అకాల మరణం సంభవిస్తున్నదంటే మహారాజైన నీవు చేసిన పెద్దపాపమే ఏదో వుండి వుంటుంది. కనుక, నా కొడుకుని బ్రతికించు” అని, “నీ పాలనలో ఏవో శాస్త్ర విరుద్ధమైన చర్యలూ, క్రియలూ సాగుతున్నవన్నమాట. రాజు చరిత్ర, నడత మంచిది కాకపోతేనే కదా – జనానికి ఇలాంటి అకాల మరణాలు సంభవించేది” అని గద్దించేడు.
శ్రీరాముడు విన్నాడు. వింటూ, నిర్విణ్ణుడైనాడు. నిర్విణ్ణుడై, ఆలోచనలో మునిగి వున్నాడు. బ్రాహ్మణుడు తన బాధను వ్యక్తం చేస్తూ మాట్లాడుతూనే ఉన్నాడు. “స్వయంగా రాజు పాపకార్యాలు చేయకపోయినా, ఆ రాజు ఏలుబడిలో, రాజ్యంలో ఎవరైనా పాపకార్యాలు, దురాచారాలు చేస్తుంటే, వాటిని పరిహరింపజేసి జనాన్ని రక్షించలేకపోయినా, ఇలాంటి మరణాలు సంభవిస్తాయి కదా! ఇంతటి మహాపుణ్యం చేస్తున్న నీవు ఇక్ష్వాకు వంశానికి ఇలాగే పేరు తెస్తూ వర్థిల్లు రాజా! నీ రాజ్యంలో మేమంతా ఇలా సుఖంగా బతుకుతున్నాం కదా. కానీ” అని అధిక్షేప పూర్వకంగా నిందాస్తుతి చేశాడు.
శ్రీరాముడు మాటాపలుకూ లేకుండా వెనుదిరిగి లోపలికి వచ్చేశాడు.
మనసంతా కలచినట్లయింది. తననే కాక, వంశాన్ని కూడా దూషిస్తున్నాడు బ్రాహ్మణుడు. తానుచేసిన పాపం ఏమైనా ఉన్నదా? మతిమతిలో లేదు. దుఃఖంతో, శోకంతో చేసిన ఆ బ్రాహ్మణుడి విలాపమే చెవుల్లో రొదపెడుతోంది.
మందిరమంతా కలయతిరుగుతున్నాడు. బాలుని అకాల మృత్యుపాపం, ఆ బ్రాహ్మణ దంపతులు ఏమైనా అఘాయిత్యం చేసుకుంటే, బ్రహ్మహత్యా పాతకం తనను చుట్టుకుంటాయి! భయ విచలితుడైనాడు. సుమంత్రుని రావించాడు.
ఆ బ్రాహ్మణ దంపతుల్ని తగువిధంగా ఆదరించి, ఊరడింప జేయమనీ, ఎట్టి దుర్ఘటనా జరగకుండా జాగ్రత్త తీసుకోమనీ ఆజ్ఞాపించాడు. ఈ సంభవం తెలిసి, లక్ష్మణ భరతులూ వచ్చారు. వారి హృదయాలూ ఉద్విగ్నమయ్యే ఉన్నాయి ఉన్నచోట ఉండలేపోతున్నారు. దిక్కులు చూస్తున్నారు. అంతా నిశ్శబ్దం. సోదరులు ముగ్గురూ విచారగ్రస్తులై పరిపరి యోచనల్తో ఆ రాత్రిని వెళ్ళదీశారు.
***
తెల్లవారి దైవకార్యాల అనంతరం, రాముడు –
ఆదిత్య హృదయం స్ఫురణ, పఠనం అయినై.
ఆకాశం కేసి చూశాడు. స్వచ్ఛంగా వుంది. నిర్మలంగా వుంది. ఆయన హృదయం లాగానే!!
తనది నిశ్చయజ్ఞానం. ప్రథమ పురుషార్థ తత్త్వాన్ని జీర్ణించుకున్నవాడు తాను. కాలోచితమైన ధర్మమూ తెలియనివాడేం కాదు. నీతీ, న్యాయం కూడా ఆచరణలో ధర్మ గీతకు అటు వైపుకు పరిగెత్తరాదనే నిబద్ధతనీ పాటించేవాడే.
వృద్ధ బ్రాహ్మణుడు, భార్య, విగతజీవి పుత్రుడు మనస్సునీ, మనోధర్మాన్నీ వెంటాడుతున్నారు. వారు ద్వారం దగ్గరే కుమిలి కుమిలి ఏడుస్తూ ఉన్నారని, సుమంత్రుడు వచ్చి చెప్పి వెళ్ళాడు.
కాలజ్ఞానం – పరిణామం, ప్రస్తుతం, కాలిక స్పృహ వెన్నుదట్టాయి.
తమ్ములు ఇద్దరూ ఉన్నారు. మంత్రుల్ని, వశిష్ఠ, వామదేవ, మార్కండేయ, మౌద్గల్య, కాశ్యప, కాత్యాయన, గౌతమ, నారద జాబాలుల్నీ పిలిపించాడు.
అందరూ వచ్చారు. అంజలించాడు. కూర్చున్నారు.
సాకల్యంగా విషయాన్ని వివరించాడు. “ఆ వృద్ధుని బాధావ్యధల్ని అర్థం చేసుకోగలిగాను. కానీ, ఆ మహానుభావుడు పరిష్కారానికి – అంటే బాలుని పునరుజ్జీవింప జేయమని (ఉపరోధతి!) నిర్బంధిస్తున్నాడు.”
“చెప్పండి. నేను ఏం చేయగలను?”
మంత్రులు అందరూ మహర్షులవైపు చూశారు. మహర్షులు ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. అందరూ కలిసి నారదుని వైపు ‘మీరే సెలవియ్య గలవారు’ అన్నట్టు వేడికోలు చూపుల్ని బరపారు.
నారదుడు, “సరే” అని ప్రారంభించాడు.
“రామా! యుగధర్మాలు నీకూ, వీరందరికీ తెలిసినవే. అయినా గుర్తు చేస్తాను”.
ఈ మాట విని భరతలక్ష్మణులు ఒకరినొకరు చూసుకున్నారు. దేవర్షి చెప్పేది వినాలనే ఉత్సుకత కనిపించింది వారి చూపుల్లో.
“రామా! కృతయుగంలో అంతా బ్రహ్మమయం. ధర్మం నాలుగుపాదాల నడిచిన కాలం. ఋషుల తేజస్సులో రాజ్యాలు వర్థిల్లినై. బ్రాహ్మణులు మాత్రమే తపస్సుకు అర్హులు. వారిలో తపస్సు లేనివాడు వుండేవాడు కాదు. వారంతా దార్శనికులు, దీర్ఘదర్శులు.
ఆ తర్వాత త్రేతాయుగంలో వారితో పాటు క్షత్రియులూ తపస్సు చేత తేజస్వులై భూమిని పాలించారు. త్రేతాయుగంలో ధర్మం మూడుపాదాల మీదే నిలిచింది. ఒక పాదం అధర్మ ప్రభావం వలన ఆయుర్దాయం తగ్గింది. లోకంలోకి అనృతం ప్రవేశించింది.
ద్వాపరం వస్తోంది. ఇది సంధికాలం. అధర్మం రెండుపాదాలు భూమిమీద పెడుతోంది. వైశ్యశూద్రులకూ అనృతమూ, అధర్మమూ సంక్రమిస్తున్నాయి… దాని కారణంగా బ్రహ్మక్షత్రియుల్లో కూడా తేజోహ్రసం (ప్రభావశీలంలో తగ్గుదల) జరుగుతోంది. ఇప్పుడు – ఈ సంధికాలంలో వైశ్యులకు కూడా తపస్సుకు అర్హత కలుగుతోంది. ఇంకా, శూద్రులకు ఆ అర్హత లభించలేదు. కలియుగం నాటికి ఆ పరిణామం సంభవిస్తుంది. ఈలోగా వారు తపస్సుకు అనర్హులు. నీ రాజ్యంలో ఈ అనర్హత ఉల్లంఘింపబడుతోంది. ఎక్కడో ఎవ్వరో చేయకూడని పనికి పూనుకుని చేస్తున్నారు. దాని ప్రభావం ప్రసరిస్తోంది. ఆ అధర్మ కార్యాన్ని నిరోధించని రాజు కూడా నరకానికి పోతాడు. కారణం మీకు తెలుసు. ప్రజల పుణ్యపాపాల్లో, తపస్సులో ఆరవవంతు రాజుకు చేరుతుంది. ఆరవవంతు స్వీకరిస్తున్నాడు కనుకనే రాజుకు ప్రజారక్షణ ముఖ్య కర్తవ్యమైంది. కాబట్టి, నీ దేశంలో ఎక్కడ అక్రమకార్యం, అనర్హమైన తపస్సు, అధర్మాచరణ జరుగుతున్నాయో తెలుసుకో. వాటిని తుదముట్టించు. మొక్కయి వంగనిది మ్రానై వంగదు. అకార్యానికి రాజు విధించవలసిన శిక్ష ఏమిటో సత్యధర్మ పరాక్రముడవైన నీకు బాగా తెలుసు. వెళ్ళు”
రామునితో సహా నారదుని మాటలు విన్న వారందరికీ పాలకుని విధి ఏమిటో తేటతెల్లమయింది.
రాముడు లేచి నిలబడి మహర్షులందరికీ కైమోడ్పు ఘటించి “సెలవు” అన్నాడు.
వారంతా చేసన్నతోనే దీవించి బయటకు వెళ్ళారు. రాముడు లక్ష్మణుని ఉద్దేశించి, “బ్రాహ్మణ దంపతుల్ని అనునయించుతూ వుండు. బాలుని శరీరాన్ని తైలద్రోణిలో భద్రపరచే ఏర్పాటు చెయ్యి” అని ఆజ్ఞాపించాడు.
లక్ష్మణుడు వెళ్ళాడు. అతని వెనుకగా భరతుడూ, వారిని అనుసరించి మంత్రులూ వెళ్ళారు. రాముని సూచనతో సుమంత్రుడు ఉన్నాడు.
పుష్పకాన్ని రమ్మని స్మరించాడు రాఘవేంద్రుడు. మరుక్షణం అది వచ్చింది. దానిలోనికి ప్రవేశించాడు. సుమంత్రుడు తటపటాయిస్తున్నాడు. రాముడు ‘సరే, నీవు కూడా ఆగు’ అన్నట్టు చూశాడు.
పుష్పకం ఆకాశమార్గాన బయల్దేరింది. భూమిపై పరీక్షగా చూస్తున్నాడు రాముడు. సారథి నిర్దేశం ప్రకారం గమనాగమన వేగాన్ని తనంత తాను నియంత్రించుకోగల వాహనం కదా, పుష్పకం!
అందుకని అది రామ భావనని తెలుసుకుని వెళుతోంది.
పశ్చిమాన ఏ పాపకార్య నిర్వహణా రాముని పరిశీలనకు అందలేదు. ఉత్తరము వైపునా చూశాడు. ఏమీ కనిపించలేదు. హిమవత్పర్వతప్రాంతం కదా. పరమ రమణీయంగా, స్వచ్ఛంగా ఉన్నది. జనావాసాలే తక్కువ.
అటునుండి దక్షిణదిక్కుకు వెళ్ళాడు. అక్కడ శైవల పర్వతం వున్నది. దానికి ఉత్తరభాగంలో ఒక సరస్సు ఉన్నది. ఆ సరస్సులో తలక్రిందులుగా వ్రేలాడుతూ ఒక మనిషి తపస్సు చేస్తున్నాడు. ఆశ్చర్యం కలిగింది రాముడికి. పుష్పకాన్ని కిందికి దింపాడు. ఆ వ్యక్తికి ఎదురుగా నిలిచి అడిగాడు, “మహానుభావా! ఎవరు నువ్వు. నేను దశరథుని పుత్రుడిని. రాముణ్ణి. ఈ రాజ్యపాలకుడిని” అని, “ఏమి కోరి ఈ కఠోరమైన, అనూహ్యమైన తపానికి పూనుకున్నావు?” అన్నాడు.
సమాధానం వచ్చింది. “రామా! నేను శూద్రజాతిలో జనించిన వాడిని. నా పేరు శంబూకుడు. అయితే, ఈ శరీరంతో స్వర్గాన్ని చేరి దేవత్వం పొందాలనీ, దేవలోకాన్ని జయించాలనీ నా కోరిక. ఆ లక్ష్యాన్ని సాధించుకోవటానికి ఈ ఉగ్ర తపస్సుకు పూనుకున్నాను” అని “నేను సత్యాన్ని చెబుతున్నాను” అన్నాడు.
నివ్వెఱపోయాడు రాముడు. అప్రతిభుడైనాడు.
రాజధర్మం గురించి నారదుని వివరణ అంతా మేధలో మారుమ్రోగింది. ఈ శంబూకునిది అధర్మవాంఛ, అనర్హప్రయత్నం. యోగ్యతాయోగ్యతలు యుగధర్మాన్ని ఆశ్రయించుకునే నడుస్తాయి. అనర్హమైన యత్నం మాత్రమే కాదు లోకవిరుద్ధమైన కోరిక – సశరీరంగా స్వర్గాన్ని చేరాలనుకోవటం, ఆలోచన తెమలింది.
క్షణంలో తెప్పిరిల్లి తటాలున ఒరనుండి ఖడ్గాన్ని తీసి అతని శిరస్సును ఖండిరచాడు.
వెంటనే దేవతలు వచ్చి ‘బాగు.. బాగు..’ అని ప్రశంసించారు. “ఈ అపచారమును ఖండించి రాజ్యపాలకునిగా నీ విధ్యుక్త ధర్మాన్ని నెరవేర్చావు. వరం కోరుకో” అన్నాడు మహేంద్రుడు.
బ్రాహ్మణ బాలకుని పునర్జీవింప జేయమని అర్థించాడు రాముడు.
“ఆ బాలుడు ఇప్పటికే జీవించాడు. నీవు ఇక్కడ తపస్సుకు అధికారం లేని శంబూకుని వధించగానే అక్కడ ఆ బాలుడు ప్రాణాలతో తేరుకున్నాడు” అని చెప్పాడు మహేంద్రుడు. “శంబూకుని కోరిక అంగీకరింపదగినది కాదు. మనుష్యుడు ఎవ్వరూ సశరీరంతో స్వర్గాన్ని చేరరాదు కదా. చేరలేడు కదా” అనీ అన్నాడు.
రాముడు దేవతలకందరికీ నమస్కరించి సెలవు కోరేడు.
రాముని అగస్త్య దర్శనం:
మహేంద్రుడు చెప్పాడు, “మేమంతా ఇప్పుడు అగస్త్యాశ్రమానికి వెళుతున్నాం. ఆ మహర్షి పన్నెండు సంవత్సరాలు జలశయనం చేసి ఆ దీక్షను విరమించాడు. ఆ సందర్భంగా ఆయన్ని అభినందించటానికి వెళుతున్నాము వస్తే నీవూ రావచ్చు”
రామునికీ ఆనందం కలిగింది. “వస్తాను. వారి దర్శనభాగ్యం అమోఘమైనది” అంటూ తానూ పుష్పకాన్ని ఎక్కి బయల్దేరేడు.
అగస్త్యాశ్రమం.. దీక్ష సమాపన ఉత్సవంతో ఆశ్రమం కోలాహలంగా ఉంది. దేవతల్నీ, శ్రీరామునీ స్వాగతించి సత్కరించాడు అగస్త్య మహాముని.
దేవతలు తిరిగి వెళ్ళారు.
శ్రీరాముని ఆ రాత్రికి తన అతిథిగా వుండమని కోరేడు అగస్త్యుడు. అంతటి మహాముని అలా అర్ధించటం ఇబ్బంది అనిపించింది రామునికి.
“మీరు మహాముని స్వామీ. తపోనిధులు. నన్ను పెద్దను చేయకండి” అని వినయంగా అంజలించాడు రాముడు.
అప్పుడు అగస్త్యుని వాక్యం ఎంతో అర్ధవంతమైనది. కథాంశాన్ని గర్భీకరించుకుని ఉన్నది.
అగస్త్యుడు అన్నాడు, ‘త్వం హి నారాయణః శ్రీమాంస్త్వయి సర్వం ప్రతిష్ఠితమ్” (రామా! నీవు లక్ష్మీ సమేతుడవైన నారాయణుడవే. నీవే అన్నిటికీ ఆధారమైన వాడవు) అని.
రాముడు ఆ రాత్రికి ఆశ్రమంలో ఉండి, తెల్లవారుతూనే అయోధ్యకు బయలుదేరనున్నాడు. అప్పుడు అగస్త్యుడు ఒక దివ్యమైన ఆభరణాన్ని రామునికి ఇవ్వబోతూ చెప్పాడు, “ఇది విశ్వకర్మచే తయారు చేయబడింది. దీని తేజస్సు అమోఘమైనది, మహత్వం దివ్యమైనది” అని, “ఒకరు కానుకగా ఇచ్చిన దానిని, గ్రహీత తాను వాడుకోకుండా, అనుభవించకుండా మరొకరి ఇస్తే గొప్ప ఫలమని శాస్త్రోక్తి, నీవు దీనిని స్వీకరించటానికి సమర్థుడవు, అర్హుడవు”
దాశరథికి సందేహం కలిగింది. అడిగేడు, “మహాశయా, దాన స్వీకరణే క్షత్రియులకు నింద్యం. అందునా బ్రాహ్మణుని నుండి తీసుకోవచ్చునా?” అని.
అగస్త్యుడు రాముని సందేహాన్ని తీరుస్తూ ఇలా వివరించాడు. “రామా! కృతయుగంలో భూలోకంలో రాజులే లేరు. స్వర్గానికే రాజు. ఇంద్రుడు. భూవాసులు బ్రహ్మను ప్రార్థించారు ‘మాకూ రాజు కావాలి, పాలకుడు లేని ప్రదేశం ఊసరక్షేత్రం’ అని. ‘సరే’ అన్నాడు బ్రహ్మ.
క్షుపుడనే రాజుని సృష్టించాడు. నలుగురు లోకపాలకుల్ని పిలిచి – ‘మీ మీ తేజస్సులో కొంతభాగం యివ్వమని తీసుకున్నాడు. వాటిని సమభాగాలుగా ఈ క్షుపునిలో సమకూర్చాడు. ఇంద్రుని భాగం ద్వారా భూమిని ఆజ్ఞాపించాడు. వరుణుని అంశం ద్వారా శరీరాన్ని పోషించాడు. కుబేరుని అంశ ద్వారా ధనాన్ని సమకూర్చాడు. యముని భాగం ద్వారా ప్రజల్ని శాసించే శక్తినిచ్చాడు.
– కనుక, ఇంద్రుడికి సంబంధించిన అంశచేత, నీవు ఈ ఆభరణాన్ని నానుండి స్వీకరించవచ్చు. నీకు ఏ దోషమూ అంటదు. క్షేమం కలుగుతుంది” అని వివరణ ఇచ్చాడు.
శ్వేతుని వృత్తాంతం – దండుని కథ:
శ్రీరాముడు ఆ ఆభరణాన్ని స్వీకరించి దాని అద్బుతమైన ఆకారానికి ఆశ్చర్యపోయి, “ఇది మీకు ఎవరు ఇచ్చారు, ఎలా లభించింది?’ అని ఉత్కంఠతో విచారించాడు.
మహర్షి మందస్మితం చేశాడు. ‘రామా, రఘునందనా! నీకు తెలియవనివా ఇవన్నీ? నా చేత చెప్పించుకుని వినాలనే వాంఛితం కాదూ’ – అనిపించింది. కారణం ఆయనకు తెలుసు – రామునిది స్వయం ప్రకాశత్వం. ‘మానుష మాత్రుడు కనుక ఇలా అడుగుతున్నాడు. లోకంలో మర్యాదా పురుషోత్తముడు కనుక నన్ను అడుగుతున్నాడు’ అనుకున్నాడు. ‘సరే. విను’ అని చెప్పసాగేడు.
‘అతి విశాలమూ, అనంత విస్తీర్ణము గల ఒక మహారణ్యాన్ని చూశాను – ఒకానొక సందర్భంలో- ఫలమూల సమృద్ధంగా వుంది. దానిలో ఒక యోజనం విస్తీర్ణం గల రమణీయమైన సరస్సు వుంది. హంస, కారండవ, చక్రవాకాలు విహరిస్తున్నాయి. పద్మాల శోభతో కమనీయంగా వున్నదా సరస్సు.
ఆ సరస్సుకు అతి సమీపంలో ఒక ప్రాచీనమైన ఆశ్రమం ఉంది. కానీ దానిలో మునులెవ్వరూ లేరు. నిర్మానుష్యంగా వుంది. నేను సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ, ఆలోచనలో వుండగా అక్కడకు ఒక దివ్య విమానం వచ్చింది.
ఆ విమానం నుండి ఒక స్వర్లోకవాసి, వివిధాభరణ భూషితుడు అయిన సుందరుడు దిగాడు. విమానంలో అతన్ని సేవిస్తున్న అప్సర స్త్రీలు నిలిచి చూస్తున్నారు.
ఇక్కడ నేను కన్నారా చూస్తున్నాను. ఆ స్వర్లోక పురుషుడు ఆశ్రమంలో ఒక మూలనున్న మానవదేహం (శవం) దగ్గరికి పోయి, దాని మాంసభక్షణం చేస్తున్నాడు. నాకు ఒళ్ళు జలదరించింది. తన పని పూర్తి చేసుకుని, సరస్సులో యథావిధిగా ఆచమనం చేసి విమానం ఎక్కటానికి దాన్ని సమీపించాడు. నేను వడివడిగా అక్కడికి చేరి అతన్ని ఆపి ‘ఎవరు నువ్వు? అతి నింద్యమైన మాంసభక్షణ చేసి పోతున్నావు ఎందుకీ దుర్భరమైన స్థితి?’ అని ప్రశ్నించాను.
నన్ను తేరపార చూసి, నా ముని ఆహార్యాన్ని గమనించి తన గాథను నాకు వివరించాడు.
ఆ దివ్యలోక పురుషుడు శ్వేతుడు. విదర్భరాజు, లోక ప్రసిద్ధి కలిగిన కీర్తిమంతుడూ అయిన సుదేవుని మొదటి భార్య కుమారుడు. సుదేవునికి రెండవ భార్య ద్వారా మరొక పుత్రుడు వున్నాడు. వాడి పేరు సురథుడు. సుదేవుని మరణానంతరం శ్వేతుడు రాజ్యాభిషిక్తుడై ధర్మపరుడుగా ప్రజల్ని పాలించసాగేడు. ‘వినాశ కాలే విపరీతబుద్ధి!’ ఉన్నట్టుండి శ్వేతుడికి తన ఆయుర్దాయం గురించీ మరణం గురించీ తెలుసుకోవాలనే కోరిక కలిగింది. తపస్సు చేయటానికి ఈ విశాలవనాన్నీ, అందులోని సరస్తీరాన్నీ ఎన్నుకున్నాడు. రాజాధికారాన్ని తమ్ముడు సురథునకు ఇచ్చి తీవ్రమైన దృఢదీక్షతో కఠిన తపస్సుకు పూనుకొన్నాడు. వేల ఏండ్లు గడిచినై. బ్రహ్మలోకానికి చేరేడు. బ్రహ్మలోకంలో ఆకలిదప్పులు ఉండవు. కానీ, అక్కడికి చేరినా, వీనికి ఆకలిదప్పుల బాధ తీరకపోగా అధికమైనై. పితామహుని కారణం అడిగాడు. బ్రహ్మ నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. ‘శ్వేతా! తపస్సు చేశావు కానీ, మనిషిగా నీవేనాడూ దానం చేయలేదు. అందువల్లనే నీకీ క్షుత్పిపాస కాంక్ష. అమితమైన తిండితో బాగా పోషించిన, అమృతతుల్యమైన నీ దేహాన్ని నీవే తిను. దానితో నీకు జీవన నిర్వాహం జరుగుతుంది. అగస్త్యమహాముని ఈ వనానికి వచ్చి నిన్ను చూసినప్పుడు ఆయన అనుగ్రహం వలన నీకు శాపవిముక్తి కలుగుతుంది’ అని వరమిచ్చాడు’ అంటూ ‘నన్ను ఈ బాధనుండి కడతేర్చ’మని వేడుకున్నాడు. తన ఆభరణాల్లో ఒక దివ్యాభరణాన్ని తీసి నాకు ఇచ్చి ప్రాధేయపడినాడు. నేను దాన్ని స్వీకరించగానే శ్వేతుడి మనుష్య దేహం నశించింది.
“ఈ దివ్యాభరణం ఆ శ్వేతుడి నుండి నేను గ్రహించినది. దీన్ని స్వీకరించటానికి నీవే అర్హుడవు”అని చెప్పాడు అగస్త్యుడు.
అడిగేవాడికి చెప్పేవాడు లోకువ అని సామెత. శ్వేతుడు గురించి అగస్త్యుడు చెప్పిన ఈ వృత్తాంతమంతా ఇంతవరకూ విని, ఆలోచనాపరుడుగా కొద్దిక్షణాలు మౌనం వహించాడు రాముడు. ఆ తర్వాత అడిగేడు.
“శ్వేతుడు తపస్సు చేసిన అంత విశాలమైన వనం ఎందువలన అంత ఘోరంగా మృగపక్షి శూన్యంగా ఉన్నది”
అగస్త్యుడు మహాముని కదా. బహు వేదజ్ఞుడు. రాముని ప్రశ్న ఆంతర్యం తెలుసు. ఈ వృత్తాంతంలో మరికొంత వివరణ వినటం ద్వారా ఈ దశరథ నందనుడు తన వంశంలోని పూర్వరాజ్యుల్ని తలపుకు తెచ్చుకుంటున్నాడు! ‘సరే. విను’ అన్నాడు.
“కృతయుగం. మనువు పాలిస్తున్నాడు. మీ వంశానికి కులవర్థనుడైన ఇక్ష్వాకువు మనువు పుత్రుడు. కొడుక్కి రాజ్యాభిషేకం చేస్తూ మనువు ఒక విలువైన ధర్మాన్ని బోధించాడు. ‘దణ్డేన చ ప్రజా రక్ష మా చ దణ్డమకారణే’ అనేది ఆ నియమం సూచన. ప్రజల రక్షణకు దండాన్ని ఉపయోగించు. అయితే కారణం లేకుండా దండప్రయోగం చేయకు. అంటే నిర్దోషుల్ని శిక్షించకు అని.”
రామునికి గల గొప్ప గుణాల్లో ఒకటి ‘వజ్రాదపి కఠోరాని మృదూని కుసుమాదపి’ కదా. ఇదిగో – ఇదీ మనువు నుండి – ఇక్ష్వాకువు ద్వారా వంశపారంపర్యంగా వస్తూ వున్న రాజ్యపాలన నీతీ, ధర్మపరిరక్షా సూత్రం!
“ఇక్ష్వాకువుకి నూరుగురు పుత్రులు. వాళ్ళలో చిన్నవాడు దండుడు. విద్యాభ్యాసం లేదు. నడవడికలో అన్నీ అవాంఛిత ధోరణులు.
పేరుకు తగినట్టు అస్తవ్యస్త ధోరణి. ఈ లక్షణం చూసి తండ్రి ఈ దండుడికి వింధ్య శైవల పర్వతాల మధ్య నున్న సువిశాల ప్రాంతాన్ని ఇచ్చి, ఏలుకో పొమ్మన్నాడు.
రాజయ్యేసరికి దండుడి ధోరణి మారింది. ఆలోచనల్లో, ప్రవర్తనలో కార్యసానుకూల ధోరణి వచ్చింది. శుక్రాచార్యుల వారిని ప్రార్థించి ఆయన్ని పురోహితునిగా చేసుకున్నాడు. రాజధాని నగరాన్ని నిర్మింపజేశాడు. దాని పేరుని మధుమంతమని నిశ్చయించాడు. రాజ్యం సుభిక్షంగా వుంది. నగరం వైభవోన్నతంగా వుంది. ప్రజలు సుఖభోగాలతో ఆనందంగా వున్నారు.
– అప్పుడు చైత్రం జరుగుతోంది. వసంత శోభలతో ప్రకృతి పరవశింపజేస్తున్నది. రసహృదయుకు అనిర్వచనీయమైన అనుభూతి ప్రేరకం. కాముకులను కోరికల మత్తులో ముంచే ఉత్ప్రేరకం. వనాలన్నీ మత్తెక్కించే పవనాల్ని పంచుతున్నై.
గురువుగారి ఆశ్రమానికి వెళ్ళాడు దండుడు. వనంలో సంచరిస్తున్నది – ఆరజ – శుక్రాచార్యుల వారి పుత్రిక. అతిలోక సౌందర్యవతి. లావణ్యం ఆమె దేహ సాముద్రికాల్ని ఏలుతున్నది.
చూశాడు. లిప్తకాలంలోనే మన్మథుడు ప్రలోభ ప్రభావాన్ని రువ్వేడు.
దండుడు ఆమెని సమీపించి మధుర స్వనంతోనే రాగ ప్రసారం చేశాడు. ఆమె యౌవనాన్ని తనపరం చేసి తరింపచేయమని వేడుకున్నాడు. ఆమె తన తండ్రి గురించి చెప్పింది. ఆయన కోపతీవ్రత పర్యవసానం ఎలా వుంటుందో చెప్పింది. ఆ మాటలూ, బెదిరింపులూ, నిరోధింపులూ పట్టలేదు దండుడికి. మోహపారవశ్యంతో ఆమెని బలాత్కరంతో వశపరచుకున్నాడు, అనుభవించాడు.
శుక్రుడు వచ్చాడు. తెలుసుకున్నాడు. ఆగ్రహోదగ్రుడై దండుని శపించాడు.
“సప్త రాత్రేణ రాజా సౌ సపుత్ర
బల వాహనం పాపకర్మ సమాచారో
వధం ప్రాప్స్యతి దుర్మతిః”
(పాపకర్మాచరణం వలన ఆ రాజు పుత్రసైన్య వాహనాలు అన్నీ ఏడురోజుల్లో నశించిపోతాయి. వాడు మరణిస్తాడు.)
‘అంతేకాదు నూరు యోజనాలు విస్తీర్ణం కలిగిన వాడి రాజ్యభూమిమీద ఇంద్రుడు ధూళివర్షాన్ని కురిపించుగాక! ఆ ధూళిధూసర ప్రభావం వలన ఆ ప్రాంతమంతా ఊసరక్షేత్రమై పోతుంది. అక్కడి నివాసులంతా కూడా మృత్యువాత పడతారు’ అని కోపోద్రేకంలో శపించేశాడు.
అలాగే జరిగింది. ఏడురోజుల లోపల. అయితే, శుక్రుడు కూతురు – ఆరజకు మాత్రం ఆ వనంలో ఒక యోజనం విశాలమైన మనోహరమైన సరసుని సృజించాడు. ‘రాత్రిపూట నీ వద్ద నివసించే ప్రాణులు మాత్రం చంపబడరు. పో.. పోయి, శాపావసానానికి కాలాన్ని ప్రార్థిస్తూ వుండు’ అని శపించాడు.
దండుడు ఏలిన రాజ్యం కనుక దండకారణ్యం అయింది. అసంఖ్యాక మునులకు నివాసస్థలంగా వున్నది కనుక, జనస్థానం అనే పేరూ వచ్చింది.”
– అగస్త్యుడు చెప్పిన ఈ వృత్తాంతపు ఆలోచనలతోనే ఆ రాత్రి గడిపాడు రాముడు.
మర్నాడు, “భూలోకంలో నిన్ను గూర్చి చెప్పుకొనే వారంతా సిద్ధి పొందుతారు’ అనే వరాన్నీ, అగస్త్యుని ఆశీస్సునీ తీసుకుని అయోధ్యకు బయల్దేరి వెళ్ళాడు.
(సశేషం)
విహారిగా సుప్రసిద్ధులైన శ్రీ జే.యస్.మూర్తి గారు 1941 అక్టోబర్ 15 న ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు. విద్యార్హతలు: ఎం.ఏ., ఇన్సూరెన్స్ లో ఫెలోషిప్; హ్యూమన్ రిసోర్సెన్ మేనేజ్మెంట్, జర్నలిజంలలో డిప్లొమాలు, సర్టిఫికెట్స్, జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో ప్రసంగాలు, వ్యాస పత్ర ప్రదానం.
తెలగులోని అన్ని ప్రసిద్ధ పత్రికల్లోను 350 పైగా కథలు రాశారు. టీవీల్లో, ఆకాశవాణిలో అనేక సాహిత్య చర్చల్లో పాల్గొన్నారు.
15 కథా సంపుటాలు, 5 నవలలు, 14 విమర్శనాత్మక వ్యాససంపుటాలు, ఒక సాహిత్య కదంబం, 5 కవితా సంపుటాలు, రెండు పద్య కవితా సంపుటాలు, ఒక దీర్ఘ కథా కావ్యం, ఒక దీర్ఘకవిత, ఒక నాటక పద్యాల వ్యాఖ్యాన గ్రంథం, ‘చేతన’ (మనోవికాస భావనలు) వ్యాస సంపుటి- పుస్తక రూపంలో వచ్చాయి. 400 ఈనాటి కథానికల గుణవిశేషాలను విశ్లేషిస్తూ వివిధ శీర్షికల ద్వారా వాటిని పరిచయం చేశారు. తెలుగు కథాసాహిత్యంలో ఇది ఒక అపూర్వమైన ప్రయోజనాత్మక ప్రయోగంగా విమర్శకుల మన్ననల్ని పొందింది.
ఆనాటి ‘భారతి’, ‘ఆంధ్రపత్రిక’, ‘ఆంధ్రప్రభ’ వంటి పత్రికల నుండి ఈనాటి ‘ఆంధ్రభూమి’ వరకు గల అనేక పత్రికలలో సుమారు 300 గ్రంథ సమీక్షలు చేశారు.
విభిన సంస్థల నుండి పలు పురస్కారాలు, బహుమతులు పొందారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు (1977) గ్రహీత. కేంద్ర సాహిత్య అకాడెమివారి Encyclopedia of Indian Writers గ్రంథంలో సుమారు 45 మంది తెలుగు సాహితీవేత్తల జీవనరేఖల్ని ఆంగ్లంలో సమర్పించారు. మహాకవి కొండేపూడి సుబ్బారావుగారి స్మారక పద్య కవితా సంపుటి పోటీలోనూ, సాహిత్య విమర్శ సంపుటి పోటీలోనూ ఒకే సంవత్సరం అపూర్వ విజయం సాధించి ఒకేసారి 2 అవార్డులు పొందారు.
అజో-విభో-కందాళం ఫౌండేషన్ వారి (లక్ష రూపాయల) జీవిత సాధన ప్రతిభామూర్తి పురస్కార గ్రహీత. రావూరి భరద్వాజ గారి ‘పాకుడురాళ్లు’ – డా. ప్రభాకర్ జైనీ గారి ‘హీరో’ నవలలపై జైనీ ఇంటర్నేషనల్ వారు నిర్వహించిన తులనాత్మక పరిశీలన గ్రంథ రచన పోటీలో ప్రథమ బహుమతి (రూ.50,000/-) పొందారు. (అది ‘నవలాకృతి’ గ్రంథంగా వెలువడింది).
కవిసమ్రాట్ నోరి నరసింహ శాస్త్రి సాహిత్య పురస్కార గ్రహీత.
6,500పైగా పద్యాలతో-శ్రీ పదచిత్ర రామాయణం ఛందస్సుందర మహాకావ్యంగా ఆరు కాండములూ వ్రాసి, ప్రచురించారు. అది అనేక ప్రముఖ కవి, పండిత విమర్శకుల ప్రశంసల్ని పొందినది. ‘యోగవాసిష్ఠ సారము’ను పద్యకృతిగా వెలువరించారు.
వృత్తిరీత్యా యల్.ఐ.సి. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ నుండి జనరల్ మేనేజర్‌గా పదవీ విరమణ చేశారు. ఫోన్: 9848025600
