Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఉత్తర రామచరిత-13

[‘ఉత్తర రామచరిత’ను వచన రూపంలో సరళ సుందరంగా అద్భుతమైన దృశ్యీకరణ శైలిలో అందిస్తున్నారు శ్రీ విహారి గారు.]

శ్రీరాముని అశ్వమేధయాగం – చర్చ:

ఆ రోజు – ఉదయాన్నే తమ్ముల్ని ఇద్దరినీ తన ఆంతరంగిక మందిరానికి పిలిపించాడు.

రాజ్యపాలన వ్యవహారాలూ, అంతఃపురంలో తల్లుల క్షేమసమాచారం.. మాటలూ, ఇతర ముఖ్యాంశాలూ.. పరామర్శ అయింది. భరతుని వైపు చూస్తూ, “రాజసూయయాగం చేయాలని వున్నది. నీ అభిప్రాయం చెప్పు” అని అడిగేడు కౌసల్యా తనయుడు.

కించిత్తు ఆశ్చర్యం కలిగింది కైకేయీ సుతునకు. సౌమిత్రి వైపు చూశాడు. “చెప్పు.. ఫరవాలేదు” అన్నట్టు కనుసైగతో ధైర్యాన్ని ఇచ్చాడు లక్ష్మణుడు.

మౌనంగా ఆలోచిస్తున్నాడు భరతుడు. అన్నకు తాను సలహా యివ్వటమేమిటి? రాజసూయం యాగం చేసిన మిత్రుడు సోముడు వంటివారు ఆ సుయజ్ఞం చేసి కీర్తిమంతులైనారు. ఈ వాస్తవాలన్నీ అన్నకు తెలుసు. ఆయన తేజం, కీర్తి, వైభవం – ఇప్పటికే (‘త్రిభిః వ్యాప్తః’ కదా) లోకమంతా వ్యాప్తిచెందే వున్నాయి కదా.

నోరు మెదల్చాడు.

“అన్నయ్యా, శ్రీరాముడు అంటే బలవాన్‌, ధృతిమాన్‌, స్థైర్యవాన్‌, వీర్యవాన్‌, ప్రతాపవాన్‌ అని జగమంతా వేనోళ్ళ పొగడుతోంది. రాజసూయయాగం వలన భూపాలకులైన రాజవంశాలన్నీ వినాశానికి గురయ్యే ప్రమాదం వున్నది. నీకు తెలుసు. శ్రీరాముడు అక్లిష్టకర్ముడు. ఆ రాజులందరూ ఇప్పుడు నీ వశంలోనే వున్నారు”

తాను చెప్పవలసినది చెప్పకయే చెప్పి ఒక నమస్కారం పెట్టాడు. లక్ష్మణుడు తమ్ముడి వైపు మెచ్చుకోలు చూపుని సారించాడు.

శ్రీరాముడు “మంచి సంభావ్యత కలిగిన రీతిలో, హేతుబద్ధంగా నువ్వు చెప్పిన మాట నాకు సంతోషం కలిగిస్తున్నది భరతా! నేను నా రాజసూయయాగం ఆలోచనను నిర్వర్తించుకుంటాను” అన్నాడు. అంటే విరమించుకోవటమే!

ఈ సందర్భంలోనే లక్ష్మణుడు కూడా తన ప్రతిపాదనను అన్న ముందు ఉంచదలుచుకుని ఇలా అన్నాడు.

“రఘునందనులకు తెలియనది కాదు. మన తండ్రి దశరథుడు నిర్వహించిన క్రతువే – అశ్వమేధయాగం- చేయవచ్చు. అది సర్వపాపాల్నీ పవిత్రం చేయగలిగినదీ, సకల శుభాల్నీ కలిగించేదీ” అని “పూర్వం ఇంద్రుడే ఆ క్రతువుని నిర్వహించి పాపవిముక్తుడైనాడు కదా” అన్నాడు.

“అవును. ఆ వివరాలు చెప్పు లక్ష్మణా. మన భరతుడూ వింటాడు” అన్నాడు జానకీనాథుడు.

లక్ష్మణుడు మొదలెట్టాడు.

“వృత్రుడు అనే దైత్యుడు ఉండేవాడు. అతడు ‘ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్య బుద్ధ్యాంచ పరినిష్టితః శశాన పృధివీం స్ఫీతాం ధర్మేణ సుసమాహితః’ ధర్మపరుడై రాజ్యాన్ని పాలిస్తున్నాడు. రాజ్యప్రజలంతా సుఖంగావున్నారు. రాజ్యం సుభిక్షంగా వున్నది.

వృత్రుడికి అత్యుత్తమైన తపస్సు చేసి స్వర్గాధిపత్యం సాధించాలనే తలపు కలిగింది. పెద్దకొడుకు మదురుడు. అతనికి రాజ్యభారం ఒప్పజెప్పి తపానికి వెళ్ళాడు. ఉగ్రమైన తపస్సు చేయటం మొదలెట్టాడు.

ఇంద్రాది దేవతలు భయంతో చలించారు. ఇంద్రుడు విష్ణువుని ప్రార్థించాడు, “వృత్రుడికి మీ వర బలం వున్నది. ఇప్పటికే లోకాల్ని జయించాడు. ఇప్పుడీ తపోమహిమతో నా పదవికే ఎసరు పెట్టాడు. నన్ను రక్షించు” అని. ‘అగతీ నామ్‌ గతిర్భవాన్‌’ గతిలేనివారికి నీవే గతి కదా అని ప్రాధేయపడినాడు.

విష్ణువు కనికరించి ‘నేనుగా వృత్రుడిని చంపలేను. మీకొక సహాయం చేయగలను. నా స్వరూపాంశాల్ని మూడుగా విభజించి ఒకటి ఇంద్రునీ, ఒకటి వజ్రాయుధాన్నీ, ఒకటి భూమినీ పొందేటట్టు చేస్తాను. అప్పుడు నీవు వెళ్ళి వృత్రుని సంహరించి ఈ ఉపద్రవం నుంచీ బయటపడు’ అని సూచించాడు. అలాగే చేశాడు.

ఇంద్రుడు వృత్రాసుర సంహారం చేశాడు. దానితో –

ఇంద్రుని బ్రహ్మహత్యా పాతకం వెంటబడి తరుమసాగింది. అతన్ని పట్టుకొని అతని దేహావయవాల్లో ప్రవేశించింది. మళ్ళీ గతిలేక విష్ణువు దగ్గరికి పోయి మొరపెట్టుకున్నాడు- ఈ పాపం నుండి రక్షించమని.

విష్ణువు దేవేంద్రుని అశ్వమేథ యాగంచేసి కడతేరమని సలహాఇచ్చాడు. అశ్వమేధయాగం జరిగింది. యాగం ముగిసిన తర్వాత మహేంద్రుడు బ్రహ్మను “నా స్వరూపం స్థానం ఏమిటి ఇప్పుడు” అని అడిగాడు.

బ్రహ్మ ఆజ్ఞాపించాడు – నిన్నునీవే నాలుగు భాగాలుగా విభజించుకొమ్మని. ఇంద్రుడు నాలుగు భాగాలు అయినాడు. “ఒకటి వర్షాకాలంలో జలపూర్ణాలైన నదుల్లో ఉండి, పాపుల పాపాల్ని తొలగిస్తాను. మరొక భాగంలో – సర్వకాలాల్లో ఊసర క్షేత్రాల్లో నివసిస్తాను. మూడవ అంశంలో యౌవనవతుల రజస్సులో మూడు రాత్రులు నివసిస్తాను. నాలుగవ అంశంలో నిరపరాధులైన బ్రాహ్మణుల్ని ఎవరు హింసిస్తారో వాళ్ళను ఆశ్రయించి వుంటాను”. “తథాస్తు” అన్నారు దేవతలంతా. వృత్రాసుర వృత్తాంతం విని లక్ష్మణుని అభినందించాడు రాముడు.

***

శ్రీరాముడి గుణగణాల్లో శౌచం కూడా ఒకటి. శౌచం అంటే శుచిత్వం, స్వచ్ఛత. భౌతికమూ, దైహికమూ మాత్రమే కాదు. మానసిక స్వచ్ఛత. రాగద్వేషాలకు అతీతంగా వుండటం. కొన్ని సందర్భాల్లో రఘుపతికి ఈ లక్షణం లేదనిపిస్తుంది సాధారణ పాఠకుడికి. కానీ ఆయన ప్రవర్తన ఎక్కడెక్కడ అలా లేదో, ఆయా పట్టుల్లో ఆయన తాను చెప్పుకున్న ‘ఆత్మానం మానుషంమన్యే’ అన్న స్థితిరూపంలో వున్నాడన్నమాట. ఈ ఉటంకింపు ఎందుకంటే, ఈ సందర్భంలో భరతుడు రాజసూయం వద్దన్నాడు. ‘సరే. బాగుంది’ అన్నది రాముని సమాధానం. లక్ష్మణుడు అశ్వమేధయాగం మంచిది అన్నాడు. అన్నగారు ఏ సమాధానమూ చెప్పలేదు. ఇదీ మానసిక స్వచ్ఛత. “రామో విగ్రహవాన్‌ ధర్మః” అని మారీచుడు – దానికి కొనసాగింపుగా ‘సాధుః సత్యపరాక్రమః’ అన్నాడు. ఇదీ ఆ సాధుత్వం, సత్త్వం, సరళత్వం. అందువలన ఇప్పడు భరత లక్ష్మణులకు తనదైన సాధుత్వంతో “మీరిద్దరూ చెరొక కథ చెప్పారు. ఇప్పుడు నేనొక కథ చెబుతాను వినండి” అన్నాడు.

తమ్ములు ఇద్దరూ సావధానచిత్తులై ఉత్సాహంగా చూశారు. రాముడు చెప్పటం మొదలెట్టాడు.

‘ఇలుడు అనే మహారాజు సమస్త భూ వలయాన్నీ తన ఏలుబడిలోకి తెచ్చుకుని, ధర్మాత్ముడుగా పాలన చేస్తున్నాడు. ఆయన దేశం – బాహ్లికదేశం. ఆయన కర్దమ ప్రజాపతి కొడుకు. ఇలుడు అంటే తన రాజ్యంలోని ప్రజలకే గాక యక్ష కిన్నర కింపురుష గంధర్వ, నాగ, గరుడుడు వంటి వారందరికీ గౌరవం. ఇలుడు మహా పరాక్రమవంతుడు కూడా. ఆయనకు మృగయావినోదం అంటే అమిత ప్రీతి.

ఒక వేట సందర్భంలో తన దేశ ఎల్లల్లో వున్న దుర్గమారణ్యాలన్నిటా, అనేక జంతుజాలాన్ని సంహరించినా, ఇలుడికి సంతృప్తి కలుగక, తన రాజ్యం ఎల్లలు దాటి స్కందుడు నివసించే ప్రదేశంలోకి ప్రవేశించాడు.

అప్పడు, ఆ ప్రదేశంలో సాక్షాత్తు పరమశివుడు పార్వతీదేవితో క్రీడిస్తున్నాడు. ఆ ప్రాంతాన్నంతా తన వినోదార్థం, స్త్రీ ప్రకృతిగా మార్చేసి ఆనందిస్తున్నాడు. పశుపక్షిమృగ సమూహాలన్నీ స్త్త్రీత్వం పొందాయి.

ఈ శివలీల లేక శివక్రీడ తెలియక ఇలుడు ఆ స్థలంలోకి వెళ్ళగానే స్త్రీగా మారిపోయాడు!!

ఆశ్చర్యం సంగతి సరే. అమిత భయసంభ్రమాలు కలిగేయి. అసాధారణ పరిణామం కదా. ఆ విచారంతో పోయి మహేశుని ‘అన్యధా శరణం నాస్తి గరళకంఠా- పాహిమాం’ అని వేడుకున్నాడు. శివుడు పార్వతివైపు చూశాడు. ఇలుడు ఆమె పాదాల్ని ఆశ్రయించాడు.

శివపార్వతులు ఇలునిపై కరుణ చూపేరు. ఒక నెల పురుషుడుగా, ఒక నెల స్త్రీగా వుండేట్టు అనుగ్రహించారు.

ఇలుడు స్త్రీగా త్రిభువన్మోహన సౌందర్యంతో వుండేవాడు. ఆయన అనుచర పరివారమూ ఆ నెలలో స్త్రీలుగా మారిపోయేవారు. వారి పేరు ‘కింపురుషులు’గా స్థిరపడిరది.

‘కాలోహి దురతిక్రమః’ అన్నట్టు చూడండి. విధి చేష్టలు చిత్రంగా వుంటాయి. ఇలుడు – ఇలగా – సుందరిగా వున్నప్పుడు ఒకసారి చంద్రనందనుడు బుధుడు చూశాడు. మోహించాడు. ఇల కూడా అతన్ని వలచింది. ఇక ఇలుడు ఇలాగా ఉన్న నెలంతా- ఇలా బుధులు శృంగారజలధిలో ఓలలాడసాగేరు. ఫలితంగా – వారికి పురూరవుడు జన్మించాడు!

ఒక ఏడాది గడిచింది. బుధుడికి అంతరంతరాల్లో ఈ స్త్రీ-పురుష ఏర్పాటు పట్ల విముఖత కలిగింది. ఇలునకు శాశ్వతంగా పునఃపురుషత్వం కలిగేందుకు ప్రయత్నించాలనుకున్నాడు.

రాజర్షి సంవర్తుని పిలిపించాడు. అతనితో పాటు భృగువు పుత్రుడైన చ్యవన మహర్షిని, అరిష్టనేమి మునినీ, ప్రమోదనునీ, దుర్వాసమహామునినీ ఆహ్వానించాడు. వారందరికీ ప్రణమిల్లి ఇలుని గురించి చెప్పబోతూ ‘ఇలుడు మహాబాహువైన కర్దమ ప్రజాపతి కుమారుడు’ అని ప్రారంభించాడు. సరిగ్గా అదే క్షణానికి కర్దమ ప్రజాపతి మహాత్ములైన ఇతర బ్రాహ్మణులతో కలిసి అక్కడికి వచ్చాడు.

విషయం ప్రతి ఒక్కరికీ తెలిసింది. కొడుకు పరిస్థితికి విచారిస్తూ, కర్దముడే చెప్పాడు. “శాపం ఇచ్చింది శివుడు. కనుక శివానుగ్రహానికి ఆయన్నే అభ్యర్థించాలి. దానికి వున్న ఏకైక మార్గం – శివునికి ప్రీతికరమైన అశ్వమేధయాగాన్ని నిర్వహించటమే’ అని.

పెద్దలంతా ఔనౌనన్నారు. సంవర్తుని శిష్యుడైన మరుత్తుడు యాగానికి ఏర్పాట్లు చేశాడు. అశ్వమేధ యాగం, దిగ్విజయంగా జరిగింది. శివుడు ప్రత్యక్షమై కోరిన వరాన్ని ఇచ్చాడు. ఇల స్త్రీత్వం తొలగింది. ఇలుడు తన బాహ్లాక రాజ్యాన్ని శశబిందువుకు ఇచ్చి, తాను ప్రతిష్ఠానపురం రాజధానిగా రాజ్యాన్ని స్థాపించి పాలించాడు. ఇలుని తర్వాత పురూరవుడు రాజై ప్రజల సంక్షేమం, రాజ్య సుభిక్షం రెండు కన్నులుగా వైభవంగా రాజ్యపాలన చేశాడు.’

– ఇంతటి గాథను వివరించి, “కనుక నేను కూడా అశ్వమేధయాగాన్ని నిర్వహిస్తేనే మంచిదని భావిస్తున్నాను’ అని “ఇక దాని నిర్వహణ మీ ఇద్దరి బాధ్యత” అన్నాడు.

ముగ్గురూ సంతోషంగా కదిలేరు.

అశ్వమేధయాగం – లవుకుశల రామాయణ గానం:

అశ్వమేధయాగానికి ‘నభూతో..’ అన్నట్లు ఏర్పాట్లు చేయబడినై. లోకంబులు లోకేశులు, లోకస్థులు.. అన్న వారంతా ఏ వర్గవర్ణలింగ వివక్షతలు లేక ఆహ్వానింపబడి, విచ్చేశారు. ముని సమూహం, దేవబ్రాహ్మణులు సరేసరి.. సుగ్రీవ, విభీషణులు వారి వారి అనుచరగణం.. ఇలా.. ఈ పట్టికలో.. లేనివారు లేరు.

యాగాశ్వానికి రక్షకుడుగా లక్ష్మణుడు వెళ్ళి విజయుడై వచ్చాడు. అశ్వమేధయాగం వైభవోపేతంగా దశదిశలా విజయం మ్రోగేటట్లు జరుగుతోంది. “ఇంద్రుని యజ్ఞం చూశాము. కుబేరుని యాగానికీ వెళ్ళాము. యముడు నిర్వహించిన క్రతువుకీ మేము ప్రత్యేక ఆహ్వానితులుముగా వెళ్ళి వచ్చాము. వరుణ యజ్ఞానికీ ప్రత్యక్ష సాక్షులము. అయితే ఈ శ్రీరామయాగానికి అవి ఎంత మాత్రమూ సాటిరావు” అని వృద్ధతాపసులు వంటి జనమంతా ఏకగ్రీవంగా దాశరథినీ, రాఘవుల్నీ అభినందించి, ఆశీర్వదించారు. దాన గౌరవాలకు కొలది లేనే లేదు. సంతృప్తితో సర్వులూ సంతోషించారు.

యాగాన్ని చూసేందుకు శిష్యబృందంతో వచ్చాడు వాల్మీకి మహర్షి. ఋషుల నివాసం దగ్గర ఆయన నివాసాన్ని ఏర్పాటు చేశారు. కుశలవుల్ని చేరదీసి- “సావధానంగా రామాయణ గానాన్ని యాగ ప్రదేశం, అయోధ్యానగరం విభ్రాంతితో పరవశం చెందేటట్టు చేయండి. మునులు, రాజులు, వానరులు, రాక్షసులు, యక్షగంధర్వ కిన్నరులు, దేవతాగణం – అందరూ మీ గాన మాధుర్యానికి అబ్బురపడి మైమరచిపోవాలి. మీ సంగీతలహరిలో తేలిపోవాలి. రామాయణం మొదటి సర్గనుండి చివరివరకూ పాడాలి. ఒకవేళ శ్రీరామునితో సహా ఎవరైనా ‘మీరెవరు’ అని అడిగితే వాల్మీకి శిష్యులమని మాత్రమే చెప్పండి’ అని తగిన సూచనలతో వారిని యాగం జరుగుతున్న ప్రదేశానికి పంపేడు.

శ్రీరామగాథ కుశలవుల నోట మంజుల మనోజ్ఞ మధురస్వర రాగయుక్తంగా గానం చేయబడుతోంది. ద్రుత- మధ్య విలంబితాది ప్రమాణాల్ని పాటిస్తూ, వీణాతంత్రుల లయకు అనుగుణంగా సాగుతోంది.

స్వయంగా శ్రీరాముడే విన్నాడు. పరవశించిపోయాడు. బాలకుల్ని చూస్తుంటే అనిర్వచనీయమైన చక్షూరాగం, భావోద్వేగం ముప్పిరిగొన్నాయి. భరత లక్ష్మణులతో చెప్పి పిల్లలకు బంగారు నాణేలు ఇమ్మన్నాడు. వారు వాటిని అందజేయబోతే, “మునివాటికల్లో గురువు గారి సేవలో, వారి అడుగుజాడల్లో తరిస్తున్న వాళ్లం. వీటిని మేమేం చేసుకుంటాం’ అని వినయంగా తిరస్కరించారు.

రాముడు బాలకుల్ని దగ్గరకు చేర్చుకొని ‘ఎక్కడిదీ కావ్యం. దీని పరిమాణం ఎంత? ఏ దేశం వారు ఆ రచయిత? ‘నా నృషిః కురుతే కావ్యం’ అన్నారు. ఆ ఋషిపుంగవుడు ఎక్కడ వున్నాడు? ఆ సమాచారం మొత్తం నాకు చెప్ప’మని కోరేడు.

మహర్షి, తపఃశాలి, తేజోమూర్తి, భగవానుడైన వాల్మీకి గురించి తెలిసింది. ముని బాలకులు తన కుమారులే అనీ బయటపడింది. ఆనంద పారవశ్యంతో ఉక్కిరిబిక్కిరైనాడు.

వాల్మీకి దగ్గరకు దూతల్ని పంపాడు. తన మాటగా చెప్పమని సందేశం పంపాడు?

‘యది శుద్ధ సమాచారా యదివా వీత కల్మషా

కరోత్విహాత్మనః శుద్ధిమను మాన్య మహామునీమ్‌’

(సీత పరిశుద్ధమైన చరిత్ర కలిగినదే అయితే, పాప రహితయే అని నిరూపించుకోగలిగితే, మహర్షిని అంగీకరింపజేసి ఇక్కడకు రమ్మనండి)

అంతేకాదు, ‘వచ్చి పరిషత్తులో సమస్త మాన్య జనగణాల మధ్య నన్ను కూడా నిర్దోషిగా నిరూపించటానికి రావాలి ఆమె’ అనీ సందేశం పంపాడు.

దూతలు వెళ్ళి వాల్మీకికి శ్రీరామ వాంఛితాన్నీ, నిబంధనల్నీ విశదంగా విన్నవించారు.

యాగభూమికి వాల్మీకీ, సీతా ఆగమనం:

వాల్మీకి నవ్వుకున్నాడు. భూత భవిష్యద్వర్తమానాల్ని ఎఱిగిన వాడు కదా. బ్రహ్మవాక్కును వరంగా పొందిన బ్రహ్మర్షి. “సరే. అలాగే. సీతను తీసుకొని నేను వస్తానని చెప్పండి” అని సమాధానం పంపాడు.

కౌసలేయుడు విన్నాడు. వెంటనే భరతలక్ష్మణుల్నీ, సుమంత్రునీ పిలిచి, ‘రేపు పరిషత్తుకు రావలసిన వారందరికీ పిలుపుల్ని పంపించమన్నాడు. రాజులు, ఋషులు, మంత్రులు, మునులు, విప్రులు, వివిధవర్గాల పౌరులు సామాన్యజనులు.. అందరూ రావాలి. వచ్చి సీత శపథాన్ని నిర్వహించుకొనే, నిరూపించుకొనే విధానాన్ని వినాలి, చూడాలి. ఇదీ రామాజ్ఞ!

వెళ్లేయి వర్తమానాలు.

ఆహ్వానింపబడిన వారితోనూ, ఏ ఆహ్వానం లేకున్నా సీతను చూడాలనుకొనే సాధారణ ప్రజలతోనూ- పరిషత్తు క్రిక్కిరిసి పోయింది.

వాల్మీకి మహర్షి సీతను వెంటబెట్టుకుని యజ్ఞశాలకు వచ్చాడు. వస్తుంటే – ఆమె బ్రహ్మ వెంట వస్తున్న వేదంలా వుందట! ప్రజలంతా సీతకు ‘మేలుమే’లని జయధ్వానాలు చేస్తున్నారు. కొందరు ‘శ్రీరామ! రామ!’ అనిపెద్దగా అరుస్తున్నారు. ఈ అరుపులో ‘అయ్యయ్యో’ ‘ఏమయ్యా- సీతకు ఇంత కష్టాన్ని పెట్టావు’ అనే ఆర్తీ, నర్మగర్భ నిందా వున్నాయి.

జన సముదాయం మధ్యకు వెళ్ళి నిలబడినారు – వాల్మీకీ, సీతా.

వాల్మీకి స్పష్టమైన కంఠస్వరంతో, బిగ్గరగా చెప్పాడు,”శ్రీరామా! వినవయ్యా – ఘనుడా! లోకాపవాదానికి భయపడి నీ సువ్రతనూ, ధర్మచారిణినీ నా ఆశ్రమం దగ్గర విడిచిపెట్టావు. ఇప్పుడీ మహాపావని నీకు విశ్వాసాన్ని కలిగించే సమాధానం ఇస్తుంది” అని.

శ్రీరాముడు ముని మాటలకు కలత చెందాడు. గొంతు సవరించుకొని అన్నాడు, “మహాత్మా మీరన్నది యథార్థమే. ఆమె పాపరహిత, ధర్మనిరతి కలిగిన సతి. పతివ్రత. నాకు తెలుసు. అందుకనే అగ్నిపునీతగా ఆమెను స్వీకరించి అయోధ్యకు తెచ్చుకున్నాను. కానీ, వీరికేమి తెలుసు? ‘ఆమె అగ్నిప్రవేశం చేసి సాక్షాత్తు అగ్నిచే, దేవదేవులచే మెప్పు పొంది నిలిచిన, సాధ్వీమతల్లి’ అని? అందువల్లనే అపవాదాన్ని నమ్మారు. వారి నమ్మకాన్ని పాలకునిగా నేను త్రోసిరాజనలేను. కనుక, రాజుగా నేను నా కర్తవ్యాన్ని నిర్వహించాను” అని.

సజలనేత్రాలతో వున్న రాముని చూసి, సీత ఇలా ప్రకటించింది.

“శ్రీ దశరథ నందనుని వినా మరొక పురుషుని నా మనసున తలపకున్న పతివ్రతనే అయితే, నా చరితపావనమైనదే అయితే, అమ్మా- భూదేవీ! నన్ను నీ దగ్గరికి చేర్చుకో. నాకు మార్గాన్ని ఇవ్వు.”

జానకి ప్రార్థనకు ప్రతిస్పందనగా, దివ్యరత్న ఖచితమైన, దేవనిర్మితమైన సింహాసనం భూమి నుండి పైకి వచ్చి ఆమె ముందు నిలిచింది. సీత దానిపై కూర్చోగానే, అది ఆమెను రసాతలానికి తీసుకుపోయింది.

చూపరులందరూ విస్మయంతో, విచారంతో, హాహాకారాలతో, రోదనలతో, విలాపాలతో నిలబడి పోయారు.

దేవతలు పుష్పవృష్టిని కురిపించారు.

***

సీతాదేవి రసాతలానికి వెళ్ళి పోయిన తర్వాత శ్రీరాముడు వికలచిత్తుడై పోయాడు. సీత స్మరణతో శోకంలో మునిగిపోయాడు. తమ్ములు, తల్లులు రఘుపతి స్థితిని చూసి కలత చెందారు. పిచ్చివానిలా భూదేవితో సంభాషిస్తూ- ‘నీవు నా అత్తగారివే కదా. అల్లుడిపట్ల ఇంతనిర్దయ, కఠినత్వం సమంజసమేనా? నా సీతను నాకి’మ్మని విలపించసాగేడు.

దేవగణాలతో కలిసి వచ్చాడు బ్రహ్మ. “శ్రీరామా! నిస్కల్మష, సాధ్వి, నీ ఆశ్రయతపం వలన సిద్ధురాలైన సీత నాగలోకానికి చేరింది. చింతించకు . నీ వైష్ణరూపం గురించి, పూర్వజన్మ గూర్చి స్మరించు. మళ్ళీ నీకు సీత సమాగమం కలిగేది స్వర్గంలోనే. వెళ్ళు, వెళ్ళి ఉత్తమమైన వాల్మీకి ఆదికావ్యాన్ని సంపూర్ణంగా విను” అని వాస్తవాన్ని తేటతెల్లం చేశాడు.

రఘునందనుడు ఊరడిల్లాడు. పుత్రుల చేత ఉత్తరకథను గానం చేయించుకొన్నాడు. యజ్ఞం చివరికి ఈ విధంగా పూర్తి అయింది. అన్ని క్రతు కార్యాల్లో తన పక్కన స్వర్ణసీతను పెట్టుకుని పత్నీరూపవిధుల్ని పూర్తి చేయించాడు. శ్రీరామపాలనలో మళ్ళీ అయోధ్యలో, ప్రజల్లో సుఖసంతోష జీవనం నెలకొన్నది.

కాలం గడుస్తున్నది. శ్రీరాముని తల్లులు స్వర్గస్థులైనారు.

***

భరతుడి మేనమామ యుధాజిత్తు. ఈయన పురోహితుడు గార్గ్యుడు. ఇతడు మహర్షి. అంగిరసుడి కుమారుడు. యుధాజిత్తు గార్గ్యుని ప్రత్యేక సందేశంతో శ్రీరాముని దగ్గరకు పంపాడు. సింధునది ఉభయతీరాల్లో, పరీవాహ ప్రదేశాల్లో శతసహస్రంగా గంధర్వులు ఆక్రమించుకొని, ప్రజలకు ఉపద్రవాలు కల్పిస్తున్నారనీ, వచ్చి వారిని నిర్జించి, శాంతి చేకూర్చమనీ ఆ సందేశంలో విజ్ఞప్తి.

రాముడు ఆ సమస్యని చక్కబెట్టి రమ్మని భరతుని ఆదేశించాడు. భరతుడు వెళ్ళి గంధర్వుల్ని ఓడించి, పారద్రోలి, తక్షశిల, పుష్కలావర్తము అనే రెండు మహానగరాల్ని నిర్మింపజేసి, తన కుమారులైన ‘తక్షుడు’ ‘పుష్కలుడు’ – ఇరువురికీ ఆ నగరాలు రాజధానులుగా రాజ్యాభిషిక్తుల్ని చేసి వచ్చాడు.

ఈ శుభపరిణామం తర్వాత శ్రీరాముడి ఆలోచన లక్ష్మణుని కుమారుల మీదికి మరలింది. వారు – అంగదుడు, చంద్రకేతువు. (ఈ అంగదుడు వేరు. వాలి కుమారుడు కాదు!) ‘కారుపథం’ అనే సుభిక్షమైన, శుభకరమైన శాంతి స్థిరమైన దేశానికి భరతుని పంపి ‘అంగదీయము’ ‘చంద్రకాంతము’ అనే రెండు మహానగరాల్ని నిర్మింపజేశాడు. లక్ష్మణుని కుమారులిద్దరికీ ఆయా రాజ్య భాగాల్ని ఇచ్చి అభిషిక్తుల్ని చేశాడు భరతుడు.

మంత్రులకు, అయోధ్యావాసులకు ఈ ఏర్పాట్లన్నీ సంతోషప్రదంగా ఉన్నాయి. శ్రీరామపాలన ప్రజారంజకంగా సాగుతున్నది. రామలక్ష్మణ భరతులు ధర్మరక్షా దీక్షలో నియమవ్రతులై ప్రజలకు సుఖశాంతుల్ని పంచుతున్నారు. ‘చీలిన అగ్నికీలలు సచేలముగా నట నిల్చినట్లు’ ఉన్నారు సహోదర త్రయం!

కాలపురుషుని రాక – బ్రహ్మ అనుజ్ఞ:

దిక్కులు ప్రసన్నంగానే వున్నాయి. వాతావరణంలో ఉడుకుదనం లేదు. అయినా, ఆ వేళ – శ్రీరాముని మనసు అలజడికి లోనై వున్నది. పాలన అంతా శుభప్రదంగానే సాగుతోంది. అయినా, ఏదో అవ్యక్తమైన ఆందోళనతో మనసు మల్లడి గొంటున్నది. నిమిత్తాలు అటు ఇటుగా వున్న భావన.

అదిగో – ఆ సందర్భంలో –

లక్ష్మణుడు మందిరంలోకి వచ్చాడు. “బ్రహ్మదేవుని దూతను,.. కేవలం రామునితో సంభాషించాలి’ అని ఒక మహాముని వచ్చారు. ద్వారం దగ్గర వేచి వున్నారు’ అని వార్తని తెచ్చాడు. వెంటనే ప్రవేశపెట్టమన్నాడు.

ఆ మహాముని రాముని ముందుకు వచ్చి కూర్చున్నాడు.

“నేను నీతో మాత్రమే ఆంతరంగికంగా, పరమ ఏకాంతంలో మాట్లాడాలి. మన సంభాషణ మధ్యలో ఎవ్వరూ లోనికి రాకూడదు” అని స్పష్టంగా చెప్పేడు.

శ్రీరాముడు వల్లెయని లక్ష్మణుని ద్వారందగ్గర వుండమనీ, “ఎవరు లోపలికి వచ్చినా, నీతో సహా, వధ్యుడవుతాడు, జాగ్రత్త” అని హెచ్చరిస్తూ ఆజ్ఞాపించాడు.

సరేనని లక్ష్మణుడు ఆ విధినియుక్తుడైనాడు.

లోపల –

వచ్చినవాడు కాలపురుషుడు. రామునికి బ్రహ్మ సందేశాన్ని వినిపిస్తున్నాడు. ‘లోకరక్షణ బాధ్యత స్వీకరించినవాడివి. మేమంతా నీ చేత సృష్టింపబడి వివిధ కర్తవ్యాల్ని నిర్వహిస్తున్న వాళ్ళం. స్వసంకల్పంతో దశరథపుత్రుడిగా ఉద్భవించావు. వాంఛించిన అనుకున్న కార్యాలన్నీ పూర్తి చేశావు. పూర్ణాయుర్దాయము గడిచింది. సురలోక వాసులు నీ రాకకై చూస్తున్నారు.’

విన్నాడు రాముడు. “సరి- బ్రహ్మ చెప్పిన విధంగా నేను దేవతల వశవర్తునిగా ఉండవలసిందే గదా. నేను ఎక్కడ నుండి వచ్చానో అక్కడికి వెళతాను” అన్నాడు.

సరిగ్గా ఆ సమయంలో –

ద్వారం దగ్గర దుర్వాస మహర్షి లోపలికి రావటానికి అనుజ్ఞకు లక్ష్మణుని నిర్బంధిస్తున్నాడు. వీల్లేదని- కారణం, పర్యవసానం కూడా వివరించాడు లక్ష్మణుడు. దుర్వాసుడు వినలేదు. ముక్కోపి కదా. వెళ్ళనీయక పోతే, నిన్నూ, రామునీ, అయోధ్యనూ, కోసలనూ, ప్రజల్నీ భస్మీపటలం చేస్తానని ఉగ్రుడై పోయాడు.

‘ఇతరుల క్షేమంకోసం, రాజ్యశ్రేయం కోసం నేనే పోతాను’ అనుకుని లోపలికి వెళ్ళాడు లక్ష్మణుడు.

ఠక్కున కాలపురుషుడు అంతర్ధానమైనాడు. రామునికి దుర్వాసుని రాక వార్తను అందించాడు లక్ష్మణుడు.

దుర్వాసుడు లోపలికి వచ్చాడు. రాముడు వినయంతో ఆతిథ్యం ఇచ్చి ఆయన రాకకు కారణం అడిగేడు.

“నేను అనశనవ్రతం ప్రారంభించి వెయ్యేళ్ళు పూర్తిచేశాను. ఈనాడు భోజనం చేయాలి. ఎలా సిద్ధంగా వున్నదో అలా నాకు నీవు భోజనం ఏర్పాటు చెయ్యి” అని కోరేడు.

రాముడు అలాగే ఆయన కోరికను తీర్చాడు. దుర్వాసుడు సంతృప్తితో రాముని మెచ్చుకొని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు.

రామునికి లక్ష్మణుని విషయంలో ఏమి చేయాలా అని సందేహం, బాధ, ఆవేదన కలిగేయి. మహర్షుల్ని పిలిపించి కర్తవ్యాన్ని చెప్పమన్నాడు.

వశిష్ఠుడు కాలగతి గురించి ప్రవచించి, ‘ఈ పరిణామం ఇలా వస్తుందని నాకుముందే తెలుసు. ధర్మపరిరక్షకునిగా నీ విధి లక్ష్మణుని త్యజించుటే’ అని ఉద్బోధించాడు.

సరయూ నదిలోకి ప్రవేశించాడు లక్ష్మణుడు. స్వీయ నిర్బంధంతో సశరీరంతో స్వర్గానికి చేరేడు.

‘విష్ణువు నాలుగవ భాగం తిరిగి మనల్ని చేరింది’ అని సంతోషించారు దేవముఖ్యులు.

అవతార పరిసమాప్తి:

శ్రీరాముడు అన్నీ సర్దుకోవటం ప్రారంభించాడు. దక్షిణ కోసల ప్రాంతానికి ‘కుశావతి’లో కుశుణ్ణీ, ఉత్తరకోసలకు ‘శ్రావస్తి’లో లవుణ్ణీ పట్టాభిషిక్తుల్ని చేసేశాడు. భరతుణ్ణి ఉండమన్నాడు. బావురుమన్నాడు భరతుడు. తానూ సోదరుల్ని అనుగమించాల్సిందేనని నిశ్చయించుకున్నాడు.

మధుపురి నుండి శ్రీరాముని పనుపున శత్రుఘ్నుడూ వచ్చాడు. జరిగినదీ, జరుగుతున్నదీ, జరుగనున్నదీ తెలిసిపోయింది. తన రాజ్యాన్ని రెండు భాగాలు చేసి పెద్దకొడుకు సుబాహువుకు మధుపురినీ, రెండవ కొడుకు శత్రుఘాతికి విదిశా నగరాన్నీ రాజధానులుగా ఏర్పాటుచేసి వారిని అభిషిక్తుల్ని చేసి, శ్రీరాముని అనుసరించేటట్లు అనుగ్రహించమని వేడుకున్నాడు. వానరశ్రేష్ఠులు, ఇతర దేవనిర్ణితమైన ముఖ్యులూ, శ్రీరాముని ప్రముఖ సేవకులూ దేవతాలోకాలకు వెళ్ళిపోయారు. అయోధ్యా పౌరులందరూ సరయూనదీతీరం గోవ్రతార క్షేత్రం వద్ద నదీప్రవేశం చేశారు.

సోదర సహితుడై శ్రీరాముడు తన వైష్ణవ తేజస్సులోకి ప్రవేశించాడు!!

అక్కడ- దేవలోకంలో-

శ్రీరామాదుల్ని ఆత్మీయంగా సాదరంగా స్వాగతించాడు బ్రహ్మ!!

మర్యాదా పురుషోత్తముని అవతారం పరిసమాప్తమైంది.

***

అనేక సంవత్సరాలు అయోధ్య నిర్జనంగా వుంది. ఆ తర్వాత ఋషభుడు అనే రాజు పాలనలో జననినాదాలతో కళకళలాడిరది.

***

శ్రీరామాయణం బ్రహ్మ చేత నిర్దేశించబడింది. బ్రహ్మాది దేవత లందరిచేత పూజింపబడింది. శ్రీమహావిష్ణువు అఖ్యానం కావటం వలన దేవతలు, సిద్ధ సాధ్య, గంధర్వ, కిన్నర, కింపురుషులు దీన్ని నిత్యం విని సంతోషిస్తూ వుంటారు.

శ్రీరామాయణం ఆయుర్తృద్ధికరం. సౌభాగ్యప్రదం. యశస్కరం. శ్రాద్ధ సమయాల్లో కూడా చదివి వినిపించవచ్చు. పుత్రులు లేని వారు పుత్రుల్ని పొందుతారు. నిర్ధనుడు ధనవంతుడవుతాడు. నిత్యం ఒక్క శ్లోకపాదం పఠించినా పాపవిముక్తుడవుతాడు. సూర్యగ్రహణం కాలంలో, కురుక్షేత్రంలో, ఒక బంగారు రాశిని దానం చేసినవాడూ, రామాయణాన్ని నిత్యం పఠించేవాడూ – ఇద్దరూ సమానమే. ఇద్దరికీ అంతే పుణ్యం!!

శ్రీరామాయణం గాయత్రీ స్వరూపం. అందువల్లనే అది కొందరికి మంత్రరాజం.

శ్రీరామాయణం మహత్తరమైన ఛందస్సుందరమైన, ఆదికావ్యం. ప్రాచేతసుని చేతిలో అది వేదరూపంగా ఆవిర్భవించింది. వాల్మీకి గిరి నుండి జాలువారిన జ్ఞానగంగ రామాయణం. అది మానవాళికి, అన్ని కాలాల్లో నాలుగు పురుషార్థాల్నీ అందించే అభ్యాసయుక్తమైన కరదీపిక! స్వస్తి!!!

శ్రీశ్రీశ్రీశ్రీ

Exit mobile version