Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఉత్తర రామచరిత-3

[‘ఉత్తర రామచరిత’ను వచన రూపంలో సరళ సుందరంగా అద్భుతమైన దృశ్యీకరణ శైలిలో అందిస్తున్నారు శ్రీ విహారి గారు.]

వేదవతి శాప వృత్తాంతం:

క్రమంలో.. అదిగో-

హిమవత్‌పర్వత ప్రాంతం చేరింది పుష్పకం. కన్నులు విచ్చుకుని చుట్టూ చూశాడు. రమణీయంగా వుంది ప్రదేశం.

వెండి కరగించి అచ్చుపోసినట్లు ధవళకాంతులతో మెరిసి పోతున్నాయి శిఖరాలు. నదీ నదాలు మహామహుని మృదుపదాల గమనంలా కదులుతున్నాయి. పిల్లగాలి స్పర్శ మనసును ఉల్లాసపరుస్తున్నది.

క్రిందకి చూశాడు ఇరవైచేతులవాడు. నందనవన సమానంగా ఉద్యానవనం. ఆశ్చర్యం కలిగింది. పర్వతశ్రేణిలో వివిధపుష్పజాతుల లతాలనికుంజాలు. వాటికి మధ్యగా మంజులమైన పద్మకాసారం.

దాని తటిని అదుగో –

పుష్పకాన్ని దిగాడు. సమీపించాడు.

అతిలోక సౌందర్యవతి! తపోదీక్షలో ధ్యానమగ్నయైవున్నది. రెప్పలార్చుకుని చూస్తూ నిలిచాడు. క్షణమాత్రంలోనే మనసు చలించింది. మేధ వికటించింది. మూడవ పురుషార్థమే ముప్పిరిగొన్నది. ఆమె మోహనరూపం రావణుని మదన తాపానికి గురిచేసింది. దేహమంతా కంపించింది. చిరుచెమటలు కమ్మేయి.

గొంతు పెకలించుకుని మాట వచ్చింది, “తరుణీ! ఎవ్వతె వీవు?” అంటూ, మరో అడుగు ముందుకు వచ్చింది. “త్రిజగన్మోహినివి ఎందుకు ఇలా ఒంటిగా కూర్చుని, తాపసి విధంగా ధ్యాననిమగ్నమై వున్నావు? నీ యౌవనానికీ, రూప లావణ్యానికి విరుద్ధమైన చర్యలో వున్నావు. ఇది అయుక్తం కదా సుందరీ?”

ఆమె మౌనాన్ని ఆశ్రయించే వున్నది. కన్ను తెరవలేదు.

రావణుని లోలోపల కామాగ్ని సెగపెడుతోంది. “ఎవ్వరి దానవే పడతీ!! వివాహితవేయైన, నీ భర్త ఎవరు? నిన్ను అనుభవించే పురుషుడు లోకంలో అత్యంత అదృష్టవంతుడూ, భాగ్యశాలీ!” అని దృఢవాక్యాన్ని వదిలేడు.

ఆమె కన్ను తెరచి చూసింది. ఎదుటి పురుషుడెవరో తెలుసుకోగలిగింది. అయినా, భద్రశీలగా మాట్లాడసాగింది. “దేవగురువు బృహస్పతి కుమారుడు శోభావంతుడు అయిన కుశధ్వజుడు నా తండ్రి. ఆయన నిత్య వేదాభ్యాసనా పరుడు. ఆయనకు నేను వేదవాఙ్మయ స్వరూపిణిగా జన్మించాను. నాపేరు వేదవతి. నన్ను వివాహ మాడటానికి దేవ, గంధర్వ,యక్షరాక్షస, పన్నగులు ఎందరో నా తండ్రి వద్దకు వచ్చి వేడుకున్నారు. నా తండ్రి వారి కోరికను అంగీకరించలేదు. కారణం – జగదేకారాధ్యుడూ, త్రిలోకాధిపతీ అయిన విష్ణువు తన అల్లుడు కావాలని ఆయన వాంఛితం. ఈ కారణాన్ని విని, వివేకభ్రష్టుడైన శంభువు అనే దైత్యరాజు నా తండ్రి నిద్రిస్తుండగా వధించాడు. నా తల్లీ అగ్నిలో దూకి భర్తతో సహగమనం చేసింది. నా తండ్రి వాంఛితాన్ని నాకు ఆయన ఆజ్ఞగా తీసుకుని, విష్ణువునే భర్తగా పొందాలని ప్రతిజ్ఞ చేసి, ఈ విధంగా, తపోదీక్షలో వున్నాను. నా నియమానికి విఘ్నం కలిగిస్తున్నావు నీవు. నీవెవరో నాకు తెలుసు రావణా” అన్నది.

వేదవతి మాటలకు హేళనగా నవ్వేడు రావణుడు.

“సుశ్రోణీ” అని సంబోధిస్తూ, “మృగశాబాక్షీ! ఇలా తపాలతో, జపాలతో ధ్యానాలతో పుణ్యాన్ని మూట కట్టుకోవాలనే కోరికలు ముసలివాళ్ళకు తగిన కర్మలు. నీవు త్రైలోక్య సుందరివి. నీకీ కోరికా తగదు. తపమూ తగదు. యౌవన కాలం వృథాగా వ్యర్థపుచ్చుకోకు. ఈ దశగ్రీవుని భార్యవై సుఖభోగాల్ని అనుభవించు”. అని “విష్ణువు, విష్ణువు అంటున్నావే, ఆ విష్ణువనేవాడు – శౌర్యవీర్యాల్లోగానీ, భోగవైభోగ్యాల్లోగానీ నాతో ఎంతమాత్రమూ సమానుడు కాడు” అని చేయి విదల్చి తృణీకరించాడు.

“ఎంత మాట!” అని రావణుని గద్దిస్తూ – “విష్ణునిందను నీవు తప్ప బుద్ధిగల వాడెవడూ చెయ్యడు. రావణా” అని గ్రుడ్లురిమింది.

రావణుడు హుంకరించాడు. కోపంతో ఊగిపోయాడు. “నన్నే బుద్ధిహీనునిగా భావిస్తావా?” అంటూ వేదవతి కేశాల్ని తన హస్తాగ్రంతో పట్టుకున్నాడు.

వేదవతి కోపవేగంతో, కండ్లలో నిప్పుకలు రాలుస్తూ, ఆ రాక్షసుడు గుప్పిట బట్టినంతవరకూ తన శిరోజాల్ని – చేతినే ఖడ్గం చేసుకుని తటాలున ఖండించి వేసుకున్నది.

అప్రతిభుడై చూస్తున్నాడు రావణుడు.

ఉగ్రస్వరూపిణే అయింది వేదవతి. “ఓరీ! దేవవిరోధీ! నీవు అవమానించిన నా దేహాన్ని ఇప్పుడే అగ్నికి ఆహుతి చేస్తాను. నిన్ను శపించి నా తపస్సును క్షయింపజేసుకోను. నీ గర్వాన్ని సర్వమూ హరించి, నీ మరణానికి కారణం కావటానికి పునర్జన్మ యెత్తుతాను. నేను చేసిన పుణ్యఫలం వలన ఒక ధర్మాత్మునికి అయోనిజనై జన్మిస్తాను. సాధ్విగా మనుగడ సాగిస్తాను”అంటూ మరుక్షణం అగ్నిలో దూకి దగ్ధమైంది.

మనోమాలిన్య భరితుడైన దానవేశుడు చలించలేదు. పెదవి విరిచి తప్పుకున్నాడు.

క్షణాల అనంతరం పద్మదళాయతాక్షి వేదవతి పద్మ మధ్యస్థగా ద్భవించింది. ఆమెను గ్రహించి లంకలో తన గృహానికి తీసుకువెళ్ళాడు.

***

రావణ మందిరమంతా నిశ్శబ్దగంభీరంగా వుంది. ఎవ్వరూ నోరెత్తటం లేదు. పద్మోద్భవని ఇంటికి తీసుకువచ్చాడని మహారాజు గురించి బయట చాలామంది గుసగుసలు పోయారు. లోపల మంత్రులు, సేనాధిపతులు, బంధుమిత్రులు అంతా ఉన్నారు కానీ, ఎవ్వరూ లేనట్టే ఉన్నది. గాలి స్తంభించిన వాతావరణం.

తన సింహాసనం మీద ఠీవిగా కూర్చున్న రావణుడు ఉసురుసురని నిట్టూరుస్తూ, అసహనంగా కదిలేడు. సభనంతా ఒకసారి తేరిచూసేడు. ప్రహస్తుడి వైపు చూపు బరపేడు.

మహారాజుకి ఆంతరంగికుడికిందే లెక్క. చనువు లేకున్నా, అంతో ఇంతో రాజానుగ్రహం కలిగిన వాడిననే కించిత్‌ గర్వం వున్నవాడే! అయినా, ఇప్పుడు నోట మాటపెగల్లేదు.

రావణుడు గట్టిగానే గద్దించాడు, “ఏమైంది మీకందరికీ. స్వర్ణలంక అందాల్ని వైభవాల్ని పెంపొందించే పద్మభవని గురించి విని, ఆనందించవలసింది పోయి, ఇలా నోళ్ళు కుట్టేసుకున్నారెందుకు?”

ప్రహస్తుడు తలవంచుకున్నాడు. సారణుడు చేతులు కట్టుకుని నిలిచి, నేలచూపులతో ఏదో చెప్పబోయాడు

ఇంతలో, అంతఃపుర స్త్రీ ఒకర్తె భయం భయంగా వచ్చి, సింహాసనానికి అలతి దూరంలో నిలిచింది. దానవేశునికి అర్థమైంది.

లేచి నిలిచి, గంభీరంగా సభను చాలించాడు. గబగబా అడుగులు వేస్తూ అంతఃపురం వైపు కదిలేడు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇక్కడ స్వేచ్ఛ నొందిన గాలి, అక్కడ అంతఃపురంలో బిగుసుకు పోయివున్నది.!

పద్మ సంభవ:

రాజసభలో మేటవేసిన నిశ్శబ్ద గాంభీర్యాన్నే ఇక్కడా గమనించాడు రావణుడు. అందరూ తలలు వాల్చుకుని, చేతులు కట్టుకుని నిలబడి వున్నారు.

శిశువుని వుంచిన ఊయెలకు పక్కగా నిలబడి ఉన్నది – మండోదరి. ఆమె ముఖం వివర్ణంగా వున్నది. పద్మభవను చూసి సంతోసించవలసిన సహజస్త్రీ లక్షణం బోసి పోయి వున్నది.

పట్టమహిషిని సమీపించాడు రావణుడు. “ఏమైంది? ఎందుకు మీరంతా కలత చెందిన ముఖాలతో వున్నారు?” అని గట్టిగానే అడిగేడు.

ఆమె చూపు మరల్చి కొంచెం పక్కగా వున్న మంత్రి మహోదరునికి సంజ్ఞ చేసింది.

మహోదరుడు సాముద్రిక లక్షణాలు తెలిసిన వాడు. విజ్ఞుడు. మహారాజు మన్నన పొందినవాడు.

ఒక అడుగు ముందుకు కదల్చి, వచ్చి, రావణునితో అన్నాడు, “ఈ శిశువు విలక్షణసంజాతగా తోస్తున్నది ప్రభూ! ఇక్కడ ఈమె ఉనికి అశుభాన్ని సూచిస్తున్నది” అని ఆగేడు.

రావణుడు ఆశ్చర్యంతో మంత్రి వైపు చూశాడు, “చెప్పండి” అన్నాడు.

మంత్రి నీళ్ళు నములుతూ, గుటకలు మింగుతూ, కంపిత స్వరంతో మాటని బయటపెట్టాడు, “గృహస్థైషా హి సుశ్రోణీ తద్వధాయైవ దృశ్యతే” అని!

రావణుడు గతుక్కుమన్నాడు. సంభ్రమాశ్చర్యాలతో చూపులు మార్చిమార్చి మంత్రినీ, మండోదరినీ చూడసాగేడు.

క్షణాలు గడిచాయి. తెప్పిరిల్లాడు రావణుడు. కర్తవ్యం బోధపడింది. మనసులోని మాటను హుంకరింపుతో అర్థం చేసుకున్న వారంతా భయగ్రస్తులై అక్కడినుండి తప్పుకున్నారు.

మహోదరుడు, మండోదరీ మాత్రం ఉన్నారు.

రావణుడు తన నిశ్చయాన్ని బయటపెట్టాడు. “అయితే సముద్రంలో విసిరివేయవలసిన శిశువే ఈమె!”

మండోదరి ముఖం మీది భయం నీడ అలాగే వున్నది.

మహోదరుని ముఖకవళికల్లో మాత్రం సంతృప్తి గోచరించింది.

శిశువుని తానే చేతుల్లోకి తీసుకున్నాడు రావణుడు. అడుగు కదిలింది!!

***

ఇంతవరకూ చెప్పి అగస్త్యుడు శ్రీరాముని వైపు పరీక్షగా చూశాడు.

రాముని మనసులో ఎన్నెన్నో ఆలోచనలు! “ఆ తర్వాత?” అని అడిగి “చెప్పండి మహర్షీ” అన్నాడు.

అగస్త్యుడు కొనసాగించాడు. “సముద్రం నుండి భూమిని చేరింది ఆమె. కాలపరిణామ క్రమంలో – మిథిలానగరంలో మహారాజు జనకుడు యజ్ఞం చేయప్రారంభిస్తూ యజ్ఞగృహమధ్యంలో భూమిని దున్నుతుంటే, హలాగ్రం తగిలి, చాలులో జనించింది. అందువల్లనే ఆమెను ‘సీత’ అని పిలుచుకుంటూ పరమానందపడినాడు జనకుడు! అలా కృతయుగంలోని వేదవతి త్రేతాయుగంలో సీతగా, అయోనిజగా ఉద్భవించి, నీకు సహధర్మచారిణి అయింది. ఆమే సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మి”

రాముని కళ్ళు మిలమిలలాడేయి.

వేదవతి కథ వినిన మహర్షి బృందం సంతోషంతో సుఖ ప్రసంగంలోకి దిగారు.

ఒక పక్కనుండి ఎవరో అడిగారు, “సీతాదేవి జననం ఎప్పుడు జరిగింది స్వామీ?” అని.

సీతాదేవి జననం:

“వైశాఖే శుక్ల నవమ్యా ముత్పన్నా పావనీ సుతా

సీతాముఖా త్సా సంజాతా పాలితా జనకేచ”

– అని మహాసుందరీ తంత్రం చెప్పింది కదా” అని మరొకరెవరో జవాబిచ్చారు.

 ఆనాటికి సమావేశాన్ని ముగించాడు అగస్త్య మహర్షి!

అటు ఆకాశాన్ని స్వర్ణమయం చేస్తూ సూర్యుడు కొండ దిగుతున్నాడు!

***

శ్రీరాముని ముందు వేదవతి గాథ గురించే ఇంకా నులివెచ్చని ప్రసంగం చేస్తున్నారు మునివరులు. అగస్త్యుడు ‘అసలు కథని సాగిద్దాం’ అనగానే అందరూ, శ్రద్ధాళువులై శ్రోతలైనారు. అగస్త్యుడు కొనసాగించాడు.

మరత్తు యజ్ఞం – రావణ విజయం:

భూలోక సంచారంలో వున్నాడు వింశతిభుజుడు. తీర్థక్షేత్రాల నెన్నిటినో దాటి పోతున్నది పుష్పకం. ఉశీరబీజం అనే క్షేత్రం దగ్గరకు వచ్చింది. కిందికి చూశాడు రావణుడు. దిగాడు.. పరివారమూ దిగింది.

యాగభూమి. యజ్ఞ సంభారంతో, వీక్షక సమూహంతో కళకళలాడు తోంది. మంత్రోచ్ఛారణ చేస్తున్నారు పురోహితులు, ఋత్విక్కులు.

విమల సన్నివేశం – నిర్మల ప్రకృతికీ, కమనీయమైన ధృతికీ అభినివేశమైంది. వాతావరణం పండుగలా అందరికీ చేతో మోదం కలిగిస్తున్నది. గాలి శాఖావ్రాతం మీద ఆప్తవచనాల్ని రాస్తున్నట్టు ఆహ్లాద స్పర్శనిస్తున్నది. హోమగుండాల్లోని అగ్ని ప్రజ్వలనకాంతిలో వివిధ వేదికలు ప్రకాశిస్తున్నాయి. ఇటు హేమంతపు చల్లదనమో, పరిమళమో తెలియని అనుభూతిభారంతో మాన్య సామాన్య జనగణం ముఖాలు వెలిగిపోతున్నాయి.

రావణుడికి గుండెలో ముల్లు గుచ్చుకొన్నట్లయింది. మనసు గీపెట్టింది. శుకసారణల వైపు చూసి ‘పోయి చూసి రండ’ని హుంకరించాడు.

వారిద్దరూ అటు వెళ్లి ఇటు వచ్చి విషయవివరణ చేశారు. ‘యజ్ఞకర్త, భూభర్త – మరుత్తు మహారాజా! బృహస్పతి సోదరుడు సంవర్తకుడు క్రతుప్రవర్తకుడు, ప్రధాన ఋత్విక్కు. కశ్యపుడు, అత్రి, వశిష్ఠుడు, కౌశికుడు మొదలైన మహర్షులూ, ఇంద్రాది వేల్పులూ ఉన్నారు”.

విషయం విన్న రావణుడు దర్పంగా తల పంకించాడు. వేగంగా అడుగులు వేస్తూ యాగ ప్రధాన వేదిక దగ్గరకు వచ్చాడు.

రావణుని రాకను గమనించిన వేలుపు ముఖ్యులు ఈ దానవుడు ముందే యజ్ఞధ్వంసి. మనం కనిపిస్తే అసలు వదలడు అనే భీతితో రూపాలు మార్చుకుని తిర్యగ్జంతువులలోప్రవేశించారు. ఇంద్రుడు నెమలిగా, యముడు కాకిగా, కుబేరుడు తొండగా, వరుణుడు హంసగా అయిపోయారు.

రావణుడు మరుత్తుని ముందు నిలబడి, భీకర రౌద్రాకారంతో ‘నాతో యుద్ధమైనా చెయ్యి, లేదా ఓటమిని అంగీకరించి మూలకూర్చో’ మని గద్దింపు హెచ్చరికను రువ్వేడు.

మరుత్తు మహారాజు, “నీవెవరు? ఏమిటీ దాడి? నన్ను ఎదిరించగల ధీరుడవా?” అని ప్రశ్నించాడు.

రావణుడు వికటాట్టహాసం చేశాడు. చూపరులంతా భయభ్రాంతులైనారు. వ్యంగ్యంగా అన్నాడు దశాననుడు, “నేనెవరో తెలియని నీ అజ్ఞానాన్ని చూసి సంతోషిస్తున్నాను” అని “అమరలోక విజేత, లంకాధినేతను ఎఱుగని వాడు ముల్లోకాల్లో నువ్వొక్కడివే వున్నావు.”

“ఓహో అన్నగారినే జయించిన వీరుడవు కదూ” అని అంతే హేళనగా అన్నాడు మరుత్తు. కాళ్లు ఘట్టించి హుంకరించాడు రావణుడు. వెంటనే ధనుర్బాణాలను ధరించి యుద్ధానికి సన్నద్ధుడైనాడు మరుత్తు.

మహారాజుని నిరోధిస్తూ, సంవర్తకుడు, “నీవిప్పుడు యజ్ఞభూమిని వదిలి వెళితే బలక్షయము, కులక్షయము అవుతాయి. యాగదీక్షలో వున్నవాడు కోపగించరాదు. యుద్ధమూ చేయకూడదు” అని హితవు చెప్పాడు. మరుత్తు శాంతించి స్వస్థచిత్తుడైనాడు.

అక్కడవున్న దుష్యంతుడు, గాధిరాజు, గయుడు, సురధుడు, పురూరవుడు మున్నగు రాజులు ఓటమి నంగీకరిస్తూ – వెడలిపోయారు.

ఆ వెంటనే శుకసారణులు, పరివారం జయధ్వానాలతో రావణుని శౌర్యాన్ని నినదిస్తూ, విజయ ప్రకటన చేశారు.

రాక్షసబృందమంతా రావణుని కూడి, ముని సమూహాన్ని సంహరించి, యూపాల్ని పెల్లగించి పశుగణాల్ని హరించి, హోమగుండాల్లో రక్తం క్రుమ్మరించి, హోతల్ని చంపి, భక్ష్య భోజ్య పానీయాలుగా ఆరగించి పరాక్రమాన్ని చూపుతూ, వెడలిపోయారు.

ఇక్కడ వేలుపు పెద్దలు తమతమ నిజరూపాలు ధరించారు.

ఇంద్రుడు నెమలికి “నీ పింఛములు ఇక నుండి చూడముచ్చటగా వుంటాయి. నాకున్న వెయ్యి కళ్ళు నీ పింఛముమీద వుంటాయి. వర్ష సమయంలో పింఛము విప్పి ఆనందిస్తూ చూచువారికి కనువిందు చేస్తావు’ అని వరమిచ్చాడు.

యముడు కాకికి ‘నీకిక రోగాల బాధవుండదు. మృత్యు భయము లేదు, పరులు నిన్ను చంపేవరకూ జీవించే వుంటావు. నువ్వు భుజిస్తే, ఆకలిబాధతో వున్న లోకులు, బంధువులు తృప్తి పొందుతారు” అని వరమిచ్చాడు.

వరుణుడు హంసకు ‘మనోరమమైన వర్ణంతో సౌమ్యంగా, శుచిగా, చంద్రమండల సమానంగా, శుద్ధమైన నురుగువలె కాంతిమంతంగా వుంటావు’ అనే వరం ఇచ్చాడు.

(‘పూర్వం హంస పూర్తిగా తెల్లగా వుండేది కాదు. వాటి రెక్కల చివర నీలంగా, వక్షస్థలాలు పచ్చగడ్డి చిగుళ్ళ రంగులోనూ వుండేవి రామా!’ అని వివరణని తెలిపాడు అగస్త్యుడు.)

కుబేరుడు తొండకు ‘నీ తల భాగం ద్రవ్యంతో నిండి వుంటుంది, వర్ణం బంగారు వర్ణమవుతుంది’ అనే వరాన్ని ప్రసాదించాడు.

ఉపకారానికి సంతోషదాయకమైన ప్రత్యుపకారం ఇది!

మరుత్తు యజ్ఞాన్ని పూర్తిచేసి సంతృప్తిని పొందాడు.

(సశేషం)

Exit mobile version