Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఉత్తర రామచరిత-4

[‘ఉత్తర రామచరిత’ను వచన రూపంలో సరళ సుందరంగా అద్భుతమైన దృశ్యీకరణ శైలిలో అందిస్తున్నారు శ్రీ విహారి గారు.]

అనరణ్యుని శాపం:

శత్రుంజయుడుగా, ఇంకా విజృంభించసాగేడు, కైకసిసూనుడు. నిర్నిరోధంగా తన జైత్రయాత్రని సాగిస్తున్నాడు. గతంలో మరుత్తుడిపై తిరస్కార సందర్భంలోనే ఓటమి నంగీకరించి పాఱిపోయిన రాజులు కాక, మరికొంతమందిపై వరుస విజయాల్ని సాధిస్తూ ‘సర్వోత్కర్ష’గా జయహారతుల్ని పొందుతున్నాడు. మహేంద్ర వరుణుల వంటి రాజుల్ని పిలిచి సవాలు చేశాడు. వారు కూడా రావణబలాన్నీ, బలగాన్నీ, వరబలాన్నీ తెలిసినవారు కనుక, ఓటమి నంగీకరించి తలలు వంచుకున్నారు.

ఈ క్రమంలో అయోధ్యాపతి అనరణ్య మహారాజు పైకి వెళ్ళి రావణుడు తన శాసనంతో హెచ్చరించాడు. ‘యుద్ధం లేక ఓటమి అంగీకారం’ – ఇదే ఆ శాసనం!

అనరణ్యుడు యోధానుయోధుడు. పదివేల ఏనుగులు, లక్షగుఱ్ఱాలు, వేలరథాలు, లక్షల పదాతిదళం కలిగిన సైన్యావాహిని ఆయనది. యుద్ధానికే సిద్ధమైనాడు. భీకరమైన యుద్ధం జరిగింది. ఇరుపక్షాలా సైనిక నష్టం జరిగింది. రావణుని మీద అనరణ్యుడు స్వయంగా ఎనిమిదివందల శరపరంపరని ప్రయోగించాడు. ద్వంద్వయుద్ధం భయంకరంగా సాగింది.

రావణుని దెబ్బకు చివరకు అనరణ్యుడు నేలకూలాడు. అనరణ్యుడు అన్నాడు; ‘కాలోహిదురతిక్రమః’ – (కాలాన్ని అతిక్రమించలేము), యుద్ధం నుండి నేను పాఱిపోలేదు. రణరంగంలోనే ప్రాణాల్ని విడుస్తున్నాను. నేను ధర్మపరిరక్షకుడినీ, ప్రజా సంరక్షకుడినీ అయివుంటే, నేనిచ్చే శాపం నీకు తగులుతుంది. ఇక్ష్వాకువంశంలో దశరథుని కుమారుడు నీ ప్రాణ హర్త అవుతాడు’’ అని గంభీరంగా అంటూ విగతజీవుడైనాడు.

అనరణ్యుని శాపానికి ‘తథాస్తు’ అన్నట్టు దేవదుందుభి మ్రోగింది!

ఆ సంభవానికి రావణుడు అతి నిర్లక్ష్యంగా, తృణీకార భావంతో, విజయోద్వేగంతో అక్కడినుంచీ మరలి పోయాడు!

***

మేఘమార్గంలో పుష్పకంలో వెళుతున్నాడు రావణుడు. సాధించుకుంటూ వస్తున్న విజయాల్ని గురించిన ఆలోచనలలో వున్నాడు.

మార్గమధ్యంలో ఎదురైనాడు దేవర్షి నారదుడు. ఆగేడు. కుశలప్రశ్నలూ, పరామర్శలూ అయినై.

‘‘నీ పరాక్రమానికి చాలా సంతోషం కలుగుతోంది తండ్రీ. వింటున్నాను – నీ విజయపరంపర గురించి. కొన్ని యుద్ధాల్ని పరికించగలిగాను కూడా. సరి. నాకొక సందేహం వుంది. విని, ఆలోచిస్తానంటే చెబుతాను.’’

‘‘సరి, చెప్పు’’

‘‘నీవీ మధ్య మర్త్యలోక ప్రాణుల్ని చంపుకుంటూ నీ జైత్రయాత్రని సాగిస్తున్నావు. కానీ, ఈ మానవులంతా సగం చచ్చిన వారే కదా తండ్రీ!’’

గతుక్కుమన్నాడు రావణుడు. తేరి చూశాడు.

‘‘అవును. వీరందరికీ రుజజరామృత్యువులు బ్రహ్మరాతలోనే వున్నాయి. మృత్యువు వారికి అనివార్యం కదా!’’

ఆలోచనలోకి దిగేడు దానవేశుడు. నారదుడు తన భాషణని కొనసాగించాడు. ‘‘ఈ మనుష్యులంతా ఆకలిదప్పులు, రోగాలూ, రొష్టులూ, వార్థక్యం, తోటివారి నిర్లక్ష్యం. వీటితోనే అవస్థల పాలబడి ‘దినదినగండం నూరేళ్ళాయుష్షు’ రీతిన జీవచ్ఛవాలై వున్నారు. ‘మాయరోగమదేమొ గానీ మనిషి మనిషికి కుదరదు’ అని వారిలో విజ్ఞులే వాపోతున్న సందర్భం. ఒకచోట నిరంతర దుఃఖం, ఒకచోట అమిత సుఖభోగవైభోగాలు! మోహవ్యామోహాలూ, అరిషడ్వర్గాల అలజడి, కర్మఫలాధారంగా వీటన్నింటికీ నిర్దేశకుడు ఎవరు?’’

ఆగేడు నారదుడు. రావణుని కళ్ళల్లోకి సూటిగా చూశాడు. ‘‘ఎవరూ?’’ అడిగేడు రావణుడు సాలోచనగా.

‘‘యముడు! వీరంతా కడకు వాడిని చేరవలసిన వారే కదా. అందుకని ఆ యముణ్ణి జయిస్తే అందరినీ జయించినట్లే కదా?!’’ నిదానంగా తలవూపాడు.

నారదుడు మందస్మితంగా తానూ తల పంకించాడు.

‘‘అవును. మానవలోకానికి ఇన్ని క్లేశాల్ని కలిగిస్తున్న యముణ్ణి వధిస్తాను. నలుగురు లోకపాలురను జయిస్తానని నేను ఎటూ ప్రతిజ్ఞ చేసేవున్నాను. వీనితో ప్రారంభిస్తాను’’ అని పుష్పకాన్ని సాగమని అనుజ్ఞనిచ్చాడు. కదిలింది విమానం.

క్షణం సేపు ధ్యానంలో ఉన్నాడు నారదుడు. ‘‘యముడు లోకనిగ్రహశక్తికి రూపం. దుర్నివారుడు ఆ యముడు. ఈ రావణుడు వరసిద్ధిబలుడు!” అని సందేహించింది మనస్సు. ‘చూద్దాం’ అనుకుంటూ తానూ దక్షిణదిక్కుకే అడుగు కదిలించాడు.

అప్పటికప్పుడే పుష్పకం వేగంగా యమపురి (!) వైపు వెళ్ళిపోతున్నది!!

యమునిపై రావణుని దండయాత్ర:

రావణుడు యమపురికి రావటానికి ముందే నారదుడు అక్కడికి చేరుకుని, యముడికి ఈ వార్తని అందించాడు. యముడు విని ఊరుకున్నాడు.

ఇంతలోనే –

పుష్పకం పురం ముందు ఆగింది. విమానం దిగి మంత్రులతో పరివారంతో ఇరవై చేతులవాడు యమలోక ప్రవేశం చేశాడు. అడుగులు వేస్తూ అంతటా కలయజూస్తున్నాడు.

నరకం ఎలా వున్నది?!

యముని అనుచరులు, సైనికులు భయంకరంగా అనేక మంది ప్రాణుల్ని కొడుతూ బాధిస్తున్నారు. వారి రోదన ధ్వనులు కర్ణకఠోరంగా ఉన్నాయి. కొంతమంది ప్రాణుల్ని కుక్కలూ క్రిములూ పీక్కుతింటున్నాయి. వారి ఘోష భరించరానిదిగా వున్నది. కొంతమంది రక్తప్రవాహంతో నిండివున్న వైతరిణీ నదిని దాటలేక, ఆగలేక శోకిస్తున్నారు. కొందరిని భటులు అత్యుష్ణంగా వున్న ఇసుకలో పొర్లించి కాలుస్తున్నారు.

అసిపత్రవనంలోకి వచ్చాడు రావణుడు. కొందరు పాపాత్ముల్ని చూశాడు. వారి దేహభాగాలన్నీ తెగిపోతున్నై. మరికొందరిని రౌరవ నరకంలోకి, క్షారనదంలోకి తోసేస్తున్నారు భటులు. అశుద్ధంతో మలిన పంకంతో దీనంగా ఏడుస్తూ, అరుస్తూ పరిగెత్తుతున్నారు కొందరు పాపులు.

వీరందరికి కడగా కొందరు పుణ్యాత్ములు సుఖకరమైన గృహాల్లో సంగీతగాన శ్రవణంతో ఆనందిస్తున్నారు. ధార్మికులు కొందరు సుందరీమణులతో విహరిస్తున్నారు.

రావణుడు దుర్భరమైన బాధల్ని అనుభవిస్తున్న వారిని కొందరిని ఆ బాధావిముక్తుల్ని చేయసాగేడు. ఆ ప్రేతలకు కాపలావున్న కింకరులు రావణుని మీదికి యుద్ధానికి దిగారు. కొందరు పరుగుపరుగున యమధర్మరాజుకు చెప్పటానికి వెళ్ళారు.

ఇరుపక్షాల యోధులు అసంఖ్యాకంగా చేరి భీకరమైన కదనరంగంలోకి దూకారు. పోరు ఉధృతమైంది. ఒకరికొకరు తీసిపోకుండా విజృంభించారు. యమభటుల ధాటికి రావణ కూటంలోని సైన్యాలు, యుద్ధవీరులు లెక్కకు మిక్కిలిగా క్షతగాత్రులైనారు. మరణించిన వారు సరేసరి.

పరిస్థితిని గమనించాడు రావణుడు. తనకూ కవచం జారిపోయింది. దేహమంతా రక్తసిక్తమైంది. ఉగ్రుడైపోయాడు. పాశుపతాస్త్రాన్ని తీశాడు. కోపించి, జృంభించి దాన్ని ప్రయోగించనే ప్రయోగించాడు. ప్రళయభీకరంగా, దావానలసమంగా అగ్నికీలలు ఎగసినై. ఆ అస్త్రం యమభటుల్ని, కింకరుల్ని, యోధుల్ని, పాశహస్తుల్ని ఎందరినో తరిమి తరిమి మాడ్చి మసి చేసింది. వారందరి బిట్టరుపులతో ఆ స్థలం ప్రతిధ్వనించింది. ఆ ధ్వానానికి సమానాంతరంగా, రావణుడు భూమ్యాకాశాల్ని దద్దరిల్లజేస్తూ బిగ్గరగా సింహనాదం చేశాడు. ఆ నాదాన్ని విని యముడే సంభ్రమించాడు. శత్రువు జయించాడని అర్థం చేసుకున్నాడు.

యుద్ధసన్నద్ధుడై ఠక్కున లేచాడు. మరుక్షణం –

ప్రాసముద్గరాలు ధరించి మృత్యువు వచ్చి ఈ పక్కన నిలిచాడు. అగ్నిచ్ఛటల్ని విసురుతూ యముని ఆయుధం కాలదండం ఆకృతి దాల్చి వచ్చి పక్కన నిలబడింది. దానిని ఆనుకుని కాలపాశం నిలిచింది. సారధి రథాన్ని తెచ్చాడు. ఉగ్రరూపంతో యుద్ధం జరుగుతున్న ప్రదేశానికి వచ్చేశాడు యముడు.

ఆయన్ని చూడగానేనే రావణుని మంత్రులు పలాయనం చిత్తగించారు. రావణుడు మాత్రం తీవ్రమైన క్రోధంతో యమునితో తలపడటానికి నిలబడే ఉన్నాడు.

యముడు రావణుని నిశితంగా చూశాడు. మూర్తీభవించిన క్రౌర్యంగా ఉన్నాడు.

రావణడు యముని పరీక్షగా చూశాడు. సాక్షాత్తూ ప్రాణులు అందరినీ ఒక్క విసురుతో ఉసురుతీసేట్టు వున్నాడు.

రావణుని సమీపించి తన శక్తుల్నీ, తోమరాల్నీ వాదిపై వర్షింపజేశాడు యముడు. కంపించి పోయాడు దశగ్రీవుడు. అయినా, మరుక్షణంలో తెప్పిరిల్లి యమునిపై శరపరంపరగా వివిధ శక్తుల్ని ప్రయోగించాడు.

పోరు దందడి పెచ్చరిల్లింది. ఏడురోజులు అవిరళంగా సాగింది. లోకాలు భయవిహ్వలతతో వణికాయి.

మృత్యువుకి ఈ స్థితికి అమితమైన క్రోధాగ్ని రగిలింది. యముని సావధానుని చేస్తూ తన మనసులోని మాటను ఇలా చెప్పసాగేడు.

‘‘యుద్ధంలో ఇక నన్ను వెంటనే ప్రయోగించు మహానుభావా! ఈ దుష్టరాక్షసుని మట్టుబెడతాను. మహారాజా! నీకు తెలియని వాస్తవం ఏమున్నది? మహావీరులూ, క్రూరులూ అయిన హిరణ్యకశిపుడు, నముచి, శంబరుడు, విసంధి, ధూమకేతువు, బలి, దంభాసురుడు, వృతృడు, బాణుడు – ఇలా ఎందరు నా కంటబడి మృతులైనారో కదా. అంతేకాదు,శాస్త్రవేత్తలు, వేదవేత్తలు, విజ్ఞులు అయిన గంధర్వులు, ఋషులు, యక్షులు, అప్సరసలు ఎందరు స్వభావ సిద్ధమైన లోకమర్యాద ననుసరించి కాలధర్మం చెందలేదు. అసలు ప్రళయకాలంలో భూమితోసహా సర్వ ప్రకృతినీ నశింపజేసేది నేనే కదా. ఎంతటి బలవంతుడైనా నా కంటబడి జీవించడు కదా- ఈ రాక్షసాధముడెంత? నాకు అనుజ్ఞ ఇవ్వండి.’’

విన్నాడు యముడు. ఒక నిశ్చయానికి వచ్చేశాడు.

‘‘మృత్యు! త్వం తిష్ఠైనం;

నిహన్మ్యహమ్‌’’

(నీవు ఆగు. నేనే వీనిని సంహరిస్తాను) అంటూ కాలదండాన్ని చేతబట్టేడు.

కాలదండమంటే – అసాధారణ శక్తి పుంజం. దాని ప్రక్కల కాలపాశాలు; అగ్ని కీలలతో, వజ్రసదృశంగా ముద్గరం ప్రయోగిస్తే? – ప్రతిక్రియనూ, పర్యవసానాన్నీ వర్ణించతరమా?

కాలదండాన్ని యెత్తి నిలిచిన యముని చూసి, దేవతలంతా తత్తరపడుతూ దిగారు. బ్రహ్మ ప్రత్యక్షమైనాడు. ఆత్రుతతో ‘‘యమధర్మరాజా! ఆగు! ఆగు!’’ అని అరుస్తూ, ‘‘ఈ రాక్షసుని కాలదండంతో చంపవద్దు, చంపవద్దు’’ అని నిరోధించాడు.

చూశాడు కాలుడు. బ్రహ్మమాటల్ని విన్నాడు.

అతి సంభ్రమంతో బ్రహ్మయముని సమీపించాడు. ‘‘నేనీ దానవునికి వరాన్ని ఇచ్చాను. దానిని అసత్యం చేయవద్దు. దేవమానవుల్లో ఎవరైనా నా మాటను అసత్యం చేస్తే, ముల్లోకాల్నీ అసత్యం చేసినట్లు అవుతుంది కదా. ఎలా అంటే, కాలదండ ప్రయోగం అంటే అది ఇష్టుల్ని, అనిష్టుల్ని, మహాపాపులతో పాటు పుణ్యాత్ముల్నీ, మాన్యుల్నీ, సామాన్యుల్నీ, ప్రజలందరినీ సంహరించేస్తుంది! ఇది కాలదండ ధర్మానికే విరుద్ధం. కనుక, ఈ దానవుడు దానిచే మరణించినా నా మాటకు భగ్నం, లేక దాని ప్రయోగం వలన జరుగరానిది జరిగినా -నా నియమానికీ, నీ విధ్యుక్త ధర్మానికీ భగ్నం వాటిల్లినట్లే అవుతుంది. కనుక, నా మాటని మన్నించి దాని ప్రయోగ ప్రయత్నాన్ని ఉపసంహరించు’’ అని వేడుకున్నాడు.

బ్రహ్మమాటల్లోని సంభావ్యాసంభావ్యాల్ని అర్థం చేసుకున్నాడు యముడు. ‘‘మా అందరి మీదా అధికారం వున్న నీవు చెబితే తప్పేదేం వుంది?’’ అని కాలదండ ప్రయోగాన్ని ఉపసంహరించుకుని, అంతర్థానమై పోయాడు.

మరుక్షణం దశగ్రీవుడు తాను జయించినట్లు, తన పేరు వినిపించేటట్లు కోలాహలం చేస్తూ, మిగిలివున్న పరివారం చేస్తున్న జయజయద్వానాల మధ్య పుష్పకాన్ని ఎక్కి వెళ్ళిపోయాడు

బ్రహ్మాదిదేవతలూ, నారదుడూ ఊపిరి పీల్చుకుని చిత్తగించారు! వారి దారిన వారు కదిలారు!

రావణుని రసాతల విజయం – వరుణుని పైకి దాడి:

సంపదకాంక్ష, భోగవైభోగ వ్యామోహం, కామ ప్రకృతి, జయేచ్ఛ, పరాక్రమదర్పం – ఇవన్నీ రాక్షస రాజు ప్రవృత్తి నిక్షిప్తాలు. వర్తన ప్రేరేపకాలు. తిరిగే కాలూ తిట్టే నోరూ కుదురుగా ఉండలేవు.

యమునిపై పరోక్ష విజయం తర్వాత, రావణుని మదాంధత ఇంకా హెచ్చింది. మారీచాది అనుసారులు పక్కనే వున్నారు. తర్వాతి లక్ష్యాన్ని రసాతలంగా నిర్ణయించాడు. సముద్ర ప్రవేశం చేశాడు. వాసుకి పాలిస్తున్న భోగవతీపురికి వెళ్ళి నాగుల్నీ, దైత్యుల్నీ తనవశం చేసుకున్నాడు. నాగరాజు అసంఖ్యాక మణిరాశుల్ని ఇచ్చి నిశాచర వల్లభుని తనియ చేశాడు. ఇప్పుడు రావణాటోపం మరింతగా విజృంభించింది.

అతని ముందున్నది – ఇక మణిమయపురం. దానికి మరో పేరు మణిమతి నగరం. బ్రహ్మవరాల్ని పొంది, అమేయ ప్రతాపపరాక్రమాలు కలిగిన నివాత కవచమనే దైత్యులు దాని అధిపతులు. వారు రావణుని దండయాత్రని అశేష సేనావాహినితో ఎదుర్కొన్నారు. పోరు అతిభీకరంగా ఏడాదిపాటు సాగింది. అది జయాపజయాలు ఎటూ తేలని తుములమైన సంగరమైంది. బ్రహ్మ ప్రవేశించాడు. ఇద్దరికీ నచ్చచెప్పి, సంధి కుదిర్చాడు. మైత్రీపురస్సరంగా మణిమయ పురాధిపతులు ఏర్పాటుచేసిన విశేషమైన వైభవాల్ని అనుభవించాడు రావణుడు.

కొంతకాలం గడిచింది.

మళ్లీ బుర్రలో పురుగు తొలిచింది. బయల్దేరాడు. వరుణుని మీద దాడి రావణుని లక్ష్యం. మధ్యలో కాలకేయులు తగిలారు. వారిలో వున్న శూర్పణఖ భర్త, తనకు బావమరిది అయిన – విద్యుజ్జిహ్వుడితో సహా – ముహూర్త కాలంలో నాలుగువందల మంది దైత్యుల్ని సంహరించాడు. ముందుకు కదిలాడు.

ధవళమేఘంలా, కైలాసంలా తేజరిల్లుతున్న వరుణ నివాసగృహాన్ని చూశాడు. అక్కడవున్న కామధేనువు సురభి- కనిపించింది. ‘ఏడిరా వరుణుడు? వాడి గర్వగ్రంథిని పెకలిస్తాను’ అంటూ తన ఉద్ధతిని చూపాడు.

వరుణకుమారులు, పౌత్రులు, గో – పుష్కరులు – తమ సేనా వాహినితో వచ్చి చుట్టుముట్టారు. స్వల్ప సమయంలోనే ధనుజేశుని చీకాకుపఱచగలిగారు. లంకాధినాథుడికి క్రోధం పెల్లుబికింది. ఇరవై చేతులే వేయి చేతులుగా సహస్రాధికంగా శస్త్రప్రయోగం చేశాడు. వారి రథాలు తునాతునకలైనై. రథ విహీనులపై మరింత కోపతీవ్రతతో బాణవర్షం కురిపించారు, రావణుని, ఆతని మంత్రుల, ప్రత్యేకించి మహోదరుని గదాప్రహారాలతో పరివారమూ. వరుణపుత్ర పౌత్రులు, సైన్యాధ్యక్షులు నేలవాలారు. ప్రభాసురుడనే వరుణుని మంత్రి రావణుడితో అన్నాడు, ‘‘మా ప్రభువు బ్రహ్మలోకానికి వెళ్ళాడు. ఆయన లేని తరుణంలో వీరందరినీ ఎటూ నీవు ఓడిరచావు. ఇక చాలు. వ్యర్థ పరిశ్రమ ఎందుకూ?వెళ్ళు’’ అని. రావణుడు,మంత్రులు జయోత్సాహ నినాదాలు చేశారు.

పుష్పకాన్ని వచ్చిన దారిన వెనుకకు మరలించాడు లంకాధిపతి.

ప్రక్షిప్తసర్గ-1:

రావణుడు బలిచక్రవర్తిని చూడబోవుట – బలి అతనికి విష్ణు ప్రభావాన్ని వివరిస్తాడు. ఆ హితవు చెవికెక్కకపోగా, బలిని నిర్జించానని ప్రకటించుకొని వెండి కొండకు వెళ్ళాడు.

ప్రక్షిప్తసర్గ- 2:

అక్కడి నుండి సూర్యుని మీదికి యుద్ధానికి పోయాడు. తపనుడికి ఈ అసురారి సంగతి తెలుసు కనుక, తన అనుయాయుల్లో ఒకడైన దండుడనే వాడిని పంపించి, ‘‘భానుడు నీతో యుద్ధానికి సిద్ధంగా లేడు, వెళ్ళ’’మన్నాడు. విజయప్రకటనతో వచ్చేశాడు పంక్తి గ్రీవుడు.

ప్రక్షిప్తసర్గ-3:

దారిలో కొందరు పుణ్యాత్ములు స్వర్గానికి పోతుంటే, వారిని ఆపి వివరాలు అడిగేడు. అంతమందిలోనూ మాంధాతను గుర్తించి యుద్ధానికి స్వాగతించాడు. మాంధాత ఈ గర్వాంధుని అహం దించాలని కదనంలోకి దిగాడు. భయంకర రణం సాగింది. జయాపజయాల నిర్ణయం జరిగే పరిస్థితి లేదు. పులస్త్య బ్రహ్మ గమనించి వచ్చాడు. గాలవుడూ వచ్చాడు. వారి ప్రమేయంతో సంధి జరిగింది.

ప్రక్షిప్తసర్గ-4:

రావణుడు చంద్రమండలానికి దండయాత్ర చేశాడు. మళ్ళీ బ్రహ్మ వచ్చి ఈ చల్లని వాడిమీద నీ వేడిసెగ ఎందుకు – వీడుమని సూచించాడు. దానితో తాను గెలిచినట్లు నాలుగు దిక్కులా వినపడేటట్లు తూర్యనాదాలు మ్రోయింపజేసి, అక్కడినుండి లంకాపురికి బయల్దేరాడు.

ప్రక్షిప్తసర్గ-5:

మధ్యలో కపిలుని చేతిలో పరాభవం పొంది ఆ న్యూనతతో, క్రోధంతో చెలరేగి పోయాడు.

(సశేషం)

Exit mobile version