[‘ఉత్తర రామచరిత’ను వచన రూపంలో సరళ సుందరంగా అద్భుతమైన దృశ్యీకరణ శైలిలో అందిస్తున్నారు శ్రీ విహారి గారు.]
కన్నెల వేటల దొర:
దారిలో నిశ్శబ్దంగా, ప్రశాంతంగా వెళతాడా? అసురుడు కదా – ఇరవై చేతులవాడు. ఆ చేతులకూ, పదిముఖాలకూ ఎప్పుడూ ఏదో ఒక తీటా, ఒక ఆరాటం! ‘ఆత్మ సంభావితాః’ – తానే గొప్పవాడిననే దురహంకారం. అభిమానమనే మదం తోడుగా వస్తున్నాయి.
అందుకనే ‘కన్నెలవేటల దొర’ అయిపోయాడు. రాజకన్యలు, దేవకన్యలు, ఋషికన్యలు, దానవకన్యలు.. కనపడుతున్నారు. కనపడిన వారినల్లా చెఱపడుతున్నాడు. ‘పుష్పకం’ కదా చోటుకు సమస్యలేదు. నిరసించినవారిని నీరసింపచేస్తున్నాడు. నిరోధించిన వారి బంధువుల్ని నిర్జిస్తున్నాడు.
సంఖ్య పెరుగుతున్నది. నాగ – రాక్షస- అసుర- మనుష్య- యక్ష- దానవ- గంధర్వ కన్యల్ని గ్రహించాడు. శతాధికమై పోయారు. అందరూ సౌందర్యరాశులే. అందరూ అరుదైన శారీరక అవయవ సౌష్టవం కలిగినవారే.
పుష్పకం పయనిస్తున్నది. లోపల విలాపాలూ, రోదనలూ, విన్నపాలూ.. ఆ కుత్సితమైన కామపూరితమైన మదమత్తుని ముందు గాలిలో కలుస్తున్నాయి.
ఆ కన్యలంతా – తమ తమ తల్లిదండ్రుల్నీ, సోదరీసోదరుల్నీ, బంధుమిత్రుల్నీ తలచుకుని తలచుకుని పొగిలి పొగిలి ఏడుస్తున్నారు. కొందరు వివాహితలు దుర్బలులైన తమ భర్తల్ని ఈ దానవుడు ఎలా నశింపజేసి తమను బలవంతంగా తీసుకువస్తున్నాడో తలచుకుని వీనిని అసహ్యించుకొంటున్నారు. రావణ పరివారం వారిని అదిరిస్తూ బెదిరిస్తూ చెండుకుతింటోంది.
ఉత్తమమైన ఆ స్త్రీలు – ఈ దుర్బుద్ధిపరుని నిందిస్తూ ‘ఈ రాక్షసాధముడు పరస్త్రీల యందు మోహవశుడై, కామప్రవృత్తితో ఇంతటి దుశ్చర్యలు చేస్తున్నాడు. అందువలన వీడు స్త్రీ మూలముననే మరణిస్తాడు’ అని శపించారు. పతివ్రతలైన వారి శాపానికి ‘తథాస్తు!’ పలుకుతున్నట్టుగా ఆకాశంలో దేవదుందుభులు మ్రోగాయి.
అక్కడ అంతఃపురంలో పట్టమహిషి మండోదరి కుడికన్ను అదిరింది!!
లంకా ప్రవేశం చేశాడు రావణుడు.
భర్తృవిహీన శూర్పణఖ విలాపం:
రావణ మందిరం.
మండోదరి వచ్చి, భర్త దుశ్చేష్టల్నీ, స్త్రీల పట్ల ఆయన నెఱపుతున్న దుర్మార్గాన్నీ అత్యాచారాల్నీ నిరసించి, హితోక్తుల్ని పంచి, నిందోక్తుల్ని మనసులో దాచుకుని, అప్పుడే తన మందిరానికి వెళ్ళిపోయింది.
సహజ ప్రకృతికి లోనై, బాహుబల గర్వాంధతతో, నైజస్వభావకారణాన – భార్య అమృషోక్తుల్ని తేలిగ్గా తీసుకుని, పెదవి విరిచి కూర్చున్నాడు.
హఠాత్తుగా, అదాటున – శూర్పణఖ వచ్చి అన్నగారి పాదాలపై పడిరది. కొప్పువీడి వున్నది. ముఖమంతా ఏడ్చి ఏడ్చి వాచి పోయి వుంది. భూషణరహితంగా, దూసిపోసిన పూదీగెలా వున్నది. దీనాలాపాలతో వాలింది.
ఆశ్చర్యపోలేదు లంకానాధుడు. ఆమె విలపిస్తున్నది భర్త గురించి అని అర్థమైంది.
ఆమెను లేవదీసి, కన్నీరు తుడిచాడు. అనునయంతో పెదవి కదల్చి ఏదో చెప్పబోయాడు. ఆమె కండ్లలో నిప్పుకలు రాలుస్తూ, “చెల్లెలు భర్తనే దునుమాడే క్రూరచిత్తం నీది. పాపవృత్తికి ఆలోచన ఎందుకు వుంటుంది? వైరంతో నా భర్తను పొట్టనబెట్టుకున్నావు” అని నిందావాక్యాలతో, పరుషభాషణం చేసింది. వెక్కుతోంది.
“తప్పు జరిగిపోయింది చెల్లీ! సంగర రంగంలో మనవారు, లాతివారు అనే భేదానికి అవకాశం వుండదు కదా. కనీసం నా మంత్రుల్లో ఎవ్వరూ, సైన్య సమూహంలోని ఏ ఒక్కరూ కూడా సూచన చేయలేదు. నేను ఏమి చెప్పినా, ఎంత వగచినా, నీ భర్తను తిరిగి తెచ్చి ఇవ్వలేను కదా. ఊఱడిల్లుము” అని ఓదార్పు మాటలు పలికాడు.
కొంతతడవుకు – ప్రేమతో అన్నాడు,
“దండకారణ్యం ఎంతో అందమైన ప్రదేశం. శుక్రుని శాపం వలన అది రాక్షస నివాసమైంది. అక్కడికి ఖరుని పంపుతాను. అతడు మన పినతల్లి కొడుకు కదా. నీమీద వాత్సల్యం చూపుతాడు., వానికి బాసటగా దూషణునీ త్రిశరునీ కూడా నియమిస్తాను. పధ్నాలుగు వేల సైన్యాన్ని ఇస్తాను, ఖరదూషణులు, త్రిశరుడు నీ కనుసన్నల్లో మెలుగుతూ, నీ సుఖసంతోష జీవనానికి, ఆజ్ఞ ప్రకారం శ్రద్ధాభక్తులతో ప్రవర్తిస్తారు” అని పరమాదర పూర్వకంగా ఆమెను ఉపశమింపజేశాడు.
నిదానంగా కదిలింది శూర్పణఖ.
రావణుడు స్వస్థచిత్తుడైనాడు.
మేఘనాదుడు – మాహేశ్వర యజ్ఞం:
కుమారుడు మేఘనాదుని పిలువమని ప్రతీహారికి చెప్పాడు. ఆయన తన మందిరంలో లేడని కబురు వచ్చింది. లంకకు ఉపవనం -నికుంభిలలో వున్నాడని తెలిపారు.
మాటల్లోనే మంత్రులు వచ్చారు. విషయ ప్రస్తావన చేశాడు. మేఘనాదుడు ఒక యాగకార్యక్రమంలో వున్నట్టు తెలిసింది. బయలుదేరి ఆ ప్రదేశానికి వెళ్ళాడు.
మేఘనాదుడు – కృష్ణాజినాన్ని కట్టుకుని, కమండలువు, శిఖి, దండము ధరించి ఉన్నాడు. క్రతువేమో సాగుతున్నది.
మహారాజుని చూసి అసురగురువు, ప్రధాన ఋత్విక్కు – శుక్రుడు ఎదురువచ్చాడు. స్వాగత వచనాలు పలికేడు. క్రతువు గురించి ఇలా వివరించాడు, “మేఘనాదుడు మౌనవ్రతంలో, యాగ దీక్షలో వున్నాడు. అతడు మాట్లాడితే యజ్ఞం అసమృద్ధం అవుతుంది. మేఘనాదుడు బహువిస్తరమైన ఏడు యజ్ఞాల్ని పూర్తి చేశాడు” క్షణం ఆగేడు శుక్రాచార్యుడు.
రావణుని ముఖకవళికల్లో మార్పు గోచరిస్తున్నది. పుత్రుని ఘనకార్యానికి సంతోషపడుతున్న చాయలు లేవు. దానికి భిన్నంగా ఉదాసీనంగా ఆలోచనా మగ్నుడై వున్నాడు. అయినా, జరిగిన కార్యక్రమం గురించి చెప్పటాన్ని కొనసాగించాడు.
“నీ కుమారుడు అన్యదుర్లభమైన మాహేశ్వరయజ్ఞాన్ని విజయవంతంగా ముగించాడు. అది కాగానే, మహేశ్వరుడు ప్రత్యక్షమై అనేకవరాల్ని ప్రసాదించాడు.”
పక్కనే ఉన్నాడు మేఘనాదుడు. అతని ముఖం మీద గర్వరేఖ పొడమింది.
“సారథి సూచన ప్రకారం కోరుకున్న విధంగా భూ ఆకాశమార్గాల్లో పయనించే దివ్యరథాన్ని, గాఢాంధకారాన్ని సృష్టించే ‘తామసి’ అనే మాయనూ, అక్షయమైన ధనుర్బాణాల్నీ, రణంలో శత్రు విధ్వంసం చేయగల అస్త్రాల్ని ప్రసాదించాడు పరమేశ్వరుడు. ‘మాయ’ని ప్రయోగిస్తే సురాసురులతో సహా ఎవ్వరూ ఇతని సంచారాన్ని తెలుసుకోలేరు” అని, “నిజానికి, ఈనాడు, మరికొంతసేపటిలో యజ్ఞం సమాప్తం కాగానే మీ దగ్గరికే రానున్నాడు”.
లంకేశునికి అసహనంగా వున్నది. ఇప్పుడిక నోరు తెరిచాడు. “మీరిద్దరూ కలిసి చేసిన ఘనకార్యం వలన ఏమి సాధించారు? దానవ ద్వేషులైన ఇంద్రాది దేవతల్ని పూజించి, యాగ ద్రవ్యాల్ని సమర్పించి సంతృప్తుల్ని చేశారు. వాటిని స్వీకరించి, ఆరగించి అసురుల తెలివిలేమికి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు వారు. అంతేకదా? చేసింది చాలు. జరిగినదానిని మార్చలేము కదా” అని కినుకతో “కుమారా. రా, ఇంటికి పోదాం” అని వేగిరపరచాడు.
తండ్రి ఆనతిని గౌరవిస్తూ కదిలాడు మేఘనాదుడు.
యజ్ఞం అక్కడే, ఆ స్థితిలో అసంపూర్ణంగా ఆగిపోయింది.
తండ్రీ కొడుకులూ, పరివారం బయల్దేరేరు. శుక్రాచార్యుల వారికి వారిని అనుసరించక తప్పలేదు.
యజ్ఞభూమి మూర్ఛబోయింది!!
కుంభీనస అపహరణం:
రావణ మందిరం.
మంత్రులు, పురోహితులు, మండోదరి, విభీషణుడు – అందరూ, ఇందరూ వున్నా, నిశ్శబ్ద గాంభీర్యంలో మునిగివున్నది.
కొందరి ముఖాలు నేల వాలివుంటే, కొందరి చూపులు దిక్కుల్ని కొలుస్తున్నాయి.
ఎంతటి మహారాజుకైనా, పరిసరాల నిశ్శబ్దం, మనుషుల మౌనం భరించరానిది.
“చెప్పండి మహారాణీ” అన్నాడు రావణుడు. మనసులోపలి విసుగు ధ్వనించింది. ఆమె విభీషణుని వైపు చూపు బరపింది మాటలో, “చెప్పవయ్యా” అన్నట్టు.
విభీషణుడు మొదలెట్టాడు. “మీ జైత్రయాత్రా విశేషాలు మాకందరికీ విశదమైనాయి మహారాజా..” అని క్షణం ఆగేడు.
రావణుడు శాంతిస్తున్నాడు ఈ ప్రారంభానికి.
“అయితే, మీరేమో వస్తూ వస్తూ శతాధికంగా వివాహిత స్త్రీలనూ, కన్యలనూ ఘోరహింసల పాలుచేస్తూ, చెఱపట్టి తెచ్చుకున్నారు. ఇక్కడేమో..”
రావణుడి మనసు కుతకుతలాడిరది. పాదతాడనం చేశాడు. అనిష్టమైన స్పష్టీకృతికి అసమ్మతి సూచన మాత్రమే కాదు. ‘సరి.. సరి..” అని ఒక హెచ్చరిక కూడా.
“ఇక్కడేమో నిన్ను లెక్కచేయకుండా మన కుంభీనసను మధువు హరించుకు పోయాడు”
రావణుడు గతుక్కుమన్నాడు. “ఎవడా మధువు?”
విభీషణుడు కోపంతోనే చెప్పుకుపోతున్నాడు “ఇంకా నయం. కుంభీనస ఎవరని అడగలేదు” అని “ఆమె కూడా మనకు సోదరే. తెలుసుకదా. మన మాతామహులు సుమాలి సోదరుడు. పూజ్యుడు, మాల్యవంతుడు. ఆయన కుమార్తె అనిలకు కుమార్తె ఈ కుంభీనస. అలా ఆమె మన సోదరి.”
“మధువు మన రాజమందిరంలోకి ప్రవేశించే సమయంలో నీవు నీ యాత్రలో వున్నావు. కుంభకర్ణుడు నిద్రలో వున్నాడు. నేను జలప్రవేశం చేసి తపంలో వున్నాను. మేఘనాదుడు యజ్ఞంలో వున్నాడు. మధువు మన సైన్యాన్ని, రాక్షస శ్రేష్ఠుల్ని నిర్జించి ఆమెను అపహరించుకొని వెళ్ళాడు”
ఇది విని రావణుడు కోపతీవ్రతతో హుంకరించి మధువుపై దాడి వెడలటానికి హుటాహుటిన బయల్దేరాడు. ఆయన వెంట కుంభకర్ణ మేఘనాదాది వీరులు, మంత్రులు సైన్యాధిపతులు హళాహళిగా కదిలారు. విభీషణుడు మాత్రం ధర్మరక్షకుడుగా రాజధానిలో నిలబడి పోయాడు.
రావణకూటమంతా మధువు నగరంలో ప్రవేశించి అల్లకల్లోలం చేయటం మొదలెట్టారు. మధువు కనిపించలేదు. కుంభీనసి రావణునికే ఎదురయింది. భయపడి అంజలితో, తలను వంచి పాదాభివందనం చేసింది.
రాక్షస శ్రేష్ఠుడు “భయపడకు..లే..” అని ఆమెను చేరదీసి, “చెప్పు” అన్నాడు.
“మహావీరా! నువ్వు ప్రసన్నం కావటం నా అదృష్టం. నాకు మాట ఇవ్వు. మధువు ఇప్పుడు నా భర్త. నా భర్తను చంపకు. క్షమించు” దోసిలి యెగ్గింది. “కులస్త్రీకి, మంగళ రూపిణికి వైధవ్యాన్ని మించిన శోకం లేదు. సోదరిగా నాకు నీ నుండి నాకు ఆ కర్మను లేకుండా చెయ్యి” అన్నది.
రావణుడు ఇరుకున పడ్డాడు. తటపటాయించాడు. క్షణాల తర్వాత అడిగేడు. “మధువు ఎక్కడ?” అని, “నీ కోరిక క్రారమే జరుగుతుంది. అతనితో కలిసి సురలోక జైత్రయాత్రకు వెళతాను. రమ్మను” అన్నాడు.
కుంభీనస ఊపిరి పీల్చుకుంది. సంతోషం కలిగింది. భర్తను పిలుచుకొని వచ్చింది. రావణునకు కైమోడ్పుతో పాదాభివందనం చేశాడు మధువు.
విషయ పరామర్శలు జరిగేయి. ఆ రాత్రికి అక్కడ విశ్రాంతికి అంగీకరించాడు రావణుడు. బావగారికీ, ఇతర పరివారానికీ సత్కారాలు బహుళంగా ఏర్పాటు చేశాడు మధువు.
మర్నాడు, రావణ పటాలమంతా ప్రయాణమైనారు. స్వర్గంపై దండయాత్రలో తొలి మజిలీ అతనికే అనూహ్యంగా – కైలాసగిరి అయింది.
స్వర్గంపై రావణ దండయాత్ర:
కైలాసగిరి రావణుడికి నయనానందకరంగా స్వాగతం పలికింది.
తెల్లని కైలాస శిఖరం పక్కగా నల్లటి వృక్షసంపద. తెలుపు నలుపులు సయ్యాటలాడుతున్నై. గిరి రామణీయకాన్ని ఆనందిస్తూ అక్కడే ఆగదలచి, సైన్య సమూహాన్ని ఆ కొండ చరియలో విడిది సేయమని అనుజ్ఞ నిచ్చాడు. వివిధ భోగ్యవస్తు సముదాయాన్నీ, నానావిధమైన ఉద్యాన కేళాకుళీ వైవిధ్యం శోభల్నీ సొంతం చేసుకున్న ఆ గిరి పైని తాను దిగేడు.
రంభారావణ సంవాదం – శాపం – పర్యవసానం:
చంద్రోదయమైంది.
వనప్రాంతమంతా మానోజ్ఞతను ఆరవేసుకున్నది. దీప్తిమంతమైన కర్ణికార, కదంబ, వకుల వృక్షాలతో ఆ ప్రాంతం కనువిందు చేస్తున్నది. చంపక – అశోక -పున్నాగ-మందార- చూత- పాటల – లోధ్ర- ప్రియంగు – అర్జున- కేతక -తగర- ప్రియాల – నారికేళ – పనస తరు కదంబకంతో శోభాయమానంగా విలసిల్లుతోంది. మందాకినీ జల సంపూర్ణాన్ని సంబరపరచి బాలసమీరం ఆహ్లాదాన్ని పంచుకుంటూ వస్తోంది.
మంజుల గాన స్రవంతిని జాలువార చేస్తున్నది- అనురాగవతుల సాన్నిధ్యంలోని కిన్నరులు సాగిస్తున్న స్వరరాగ మాధురి.
విద్యాధరులు స్త్రీలతో సరససల్లాపాల్లో నిమగ్నులై వున్నారు. కుబేర భవనం నుండి అప్సరస్త్రీ సమూహాల గానాలు వివరంలేని బహు ఘంటానాదాల కలయికగా- వినపడుతున్నాయి.
సమీరుడు మరీ ఉత్సహిస్తూ, గిరినీ, గిరిశిఖరాల్నీ, గిరిప్రాంత సరస్సుల్నీ, ఉద్యానవనాల్నీ స్పర్శిస్తూ, లాలిస్తూ, ఎడనెడ ఆగి క్రీడిస్తూ ముచ్చట గొలుపుతున్నాడు.
అనుభవం హృదయగతమై, మనోల్లాసాన్ని అతిశయింపజేయగల మార్గాలు రెండే కదా! చక్షుశ్శోత్ర సాధనాలు. వీటిని ఉత్తేజితం చేసేవి రూపరసగంధాల అనుభూతి. ఈ సమ్మిళిత ఉద్వేగంలో వున్నాడు రావణుడు. కామోద్రేక జనకమైన వాతావరణం, పరిసరాలూ, ప్రకృతి ప్రతాపం! అసలే రసిక మహారాజు. ఆపై మోహం దండయాత్ర!
మాటిమాటికి నిట్టూరుస్తున్నాడు. చంద్రుని చూసి ‘అహో’ అనుకుని ఉసురుసురంటున్నాడు. అర్థనిమీలిత నేత్రాలతో పుష్పలతానికుంజాల్ని చూసి, కరవిన్యాసంతో, మందస్మితం చేస్తున్నాడు.
అదిగో, సరిగా రావణ మనశ్చలనం ఇలా వుండగా, ఒకమెరపు తీగె మెరసింది! కన్ను చెదిరింది!
రంభ! అప్సర స్త్రీలందరిలో శ్రేష్ఠురాలు! అపురూప సౌందర్యరాశి. సకల సౌభాగ్య ప్రదమైన భూషణభూషితగా ఎదురైంది. అంగ ప్రత్యంగ సౌష్ఠవాన్ని విభిన్న భంగిమల్లో చూస్తున్నాడు. ‘కాంతిచేత, శోభచేత, లావణ్యంచేత, కీర్తిచేత కూడా ఆమె రెండవలక్ష్మి’లా అనిపించింది.
మన్మథుడు మోహపారవశ్యాన్ని పెచ్చరిల్ల చేశాడు – రావణుని తను మాన ప్రాణాల్లో తాళలేక పోతున్నాడు. అడుగు కదల్చి ఆమె ముందు నిలిచాడు.
ఆమె సంభ్రమించింది. ఆశ్చర్యపోయింది. కొంచెం దూరంలో వున్న చెలులెవరో గుసగుసలు వోయారు- ‘రావణుడు.. రావణుడు’ అని! రంభ భయపడిరది. ముఖాన స్వేదం కమ్మింది. అంతలోనే రావణుడు ఆమె చెయ్యి పట్టుకున్నాడు. ఆమె నిలువునా వణుకుతున్నది.
“ఎవరివే, ఎవ్వరిదానవే? ఎటు పోతున్నావు. ఇంతటి సౌందర్యాన్ని ప్రోవు చేసి చూపి, కదలిపోతుంటే, నా అంతటివాడికి అది దుస్సహమవుతుంది. ఏ అదృష్టవంతుడు, భాగ్యశాలి భోగింపబోతున్నాడు ఈ బంగరుబొమ్మను, నిలువు నిలువెల్లా అందాలు పూచిన కొమ్మను?! ఎవడు వాడు? ఇంద్రుడా, విష్ణువా, అశ్వినీ దేవతలా?” అంటూ ఆమె అంగాంగవర్ణనని తమకంతో సాగిస్తున్నాడు.
రంభకు శరీరమంతా చిరచిరలాడింది. మనసు గరగరలాడింది. నోరు తడియార్చుకుని పెదవి కదిల్చింది. “నేను ధర్మానుసారం మీ కోడలిని మహానుభావా! నా పట్ల ఇలా అవమానం తగదు. నిజానికి ఎవరైనా అవమానిస్తే నన్ను రక్షించవలసిన బాధ్యత కలిగిన వాడివి. అలాంటి నువ్వే ఇలా కామమోహితుడవు కావటం అకృత్యం మాత్రమే కాదు. దుష్కృత్యమవుతుంది. నన్ను విడు” అని చేతులెత్తి నమస్కరించింది.
పక్కున నవ్వేడు పంక్తిగ్రీవుడు. “కోడలివా? తప్పించుకు పోవటానికి బంధుత్వాన్ని కలుపుతున్నావా?” అని “లోకభీకరుడైన, రసికరాజ వరుడైన ఈ రావణుని ముందు ఏ అబల ఎత్తులూ సాగవు లలనా” అని వికటంగా నవ్వేడు.
“నేను నిజమే చెబుతున్నాను స్వామీ. నేను మీ అన్న కుబేరుని ప్రాణంలో ప్రాణమైన ప్రియపుత్రుడు నలకూబరుని భార్యను” అన్నది.
ఇరువది చేతులవాడు మరింత విరగబడి నవ్వసాగేడు. రంభ అపరోక్ష హెచ్చరికగా, దృఢమైన, స్పష్టీకృతితో అన్నది, “నా భర్త ధర్మంలో బ్రాహ్మణుడు, పరాక్రమంలో క్షత్రియుడు. క్రోధంలో అగ్ని. సహనంలో ధాత్రి వంటివాడు. నా కోసం అతడు వేచివుంటాడు. నన్ను పోనీ” అని కైమోడ్పుతో అర్థించింది.
“నేను నీకు తగను; నీవు సత్పురుషులు అనుసరించిన మార్గాన్ని అనుసరించి, యోగ్యభావనతో నన్ను విడువుము” అని ప్రాధేయపూర్వకంగా అన్నది.
రావణుడు మదోన్మత్తుడైనాడు. “స్వర్గంలోని అప్సరసకు వావివరుసలు వర్తించవు భామినీ. తండ్రి యజ్ఞం చేసి సోమయాజిగా మరణించి వస్తే అతన్ని అలరిస్తారు. ఆతని కుమారుడే రణరంగంలో వీరమరణం చెందివస్తే అతన్నీ మీ సంభోగంతో తృప్తి పరుస్తారు. అవును కదూ! ఇలా ఎందరెందరినో నీ కౌగిలితో ఆనందింపజేసే నీకు ఈ బాంధవ్య ప్రసక్తి కూడదు! తీసిగట్టున పెట్టు. రా” అని ఆమెను ఆక్రమించి బలాత్కారంగా అనుభవించేశాడు!!
ప్రవృత్తి తత్త్వం కూడా ప్రకృతితత్త్వం లాగానే అగాధమౌ జలనిధి!
-మదగజం క్రీడించటం వలన కలచివేయబడిన సరస్సులా వ్యాకులచిత్తగా, రోదిస్తూ వచ్చి నలకూబరుని ముందు వాలింది రంభ.
జరిగిన అత్యాచారం గురించి చెప్పింది. రావణుని అహంకృత దుష్కృత్యాన్ని వివరంగా విన్నవించుకున్నది.
నలకూబరునికి పరిస్థితి అర్థమైంది. అబలగా తన భార్య నిస్సహాయతకు తానూ విచారించాడు. కోపంతో కింకర్తవ్యం అని క్షణం ఆలోచించి, మరుక్షణం నిర్ణయించి, ఉత్తర క్షణంలో చేతితో నీళ్ళు తీసుకుని ఆచమనం చేసి రావణుడికి దారుణమైన శాపాన్నిచ్చాడు.
“మంగళప్రదురాలా! కామమోహితవు కాని నిన్ను ఆ రాక్షసుడు బలవంతంగా అనుభవించాడు. ఇటుపై వాడు తనను సమ్మతించని ఏ స్త్రీని అనుభవించినా అతని శిరస్సు ఏడుముక్కలుగా బద్దలవుతుంది”
ఇది విని, ఆమె కళ్లు తుడుచుకుంది. ఆకాశంలో బ్రహ్మాదిదేవతలందరూ, రావణునికి ఇదే మరణశాసనమని సంతోషించారు.
శాపం సంగతిని రావణుని కడకు గాలి మోసుకుపోయింది.
నిర్విణ్ణుడైనాడు!!
(సశేషం)
విహారిగా సుప్రసిద్ధులైన శ్రీ జే.యస్.మూర్తి గారు 1941 అక్టోబర్ 15 న ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు. విద్యార్హతలు: ఎం.ఏ., ఇన్సూరెన్స్ లో ఫెలోషిప్; హ్యూమన్ రిసోర్సెన్ మేనేజ్మెంట్, జర్నలిజంలలో డిప్లొమాలు, సర్టిఫికెట్స్, జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో ప్రసంగాలు, వ్యాస పత్ర ప్రదానం.
తెలగులోని అన్ని ప్రసిద్ధ పత్రికల్లోను 350 పైగా కథలు రాశారు. టీవీల్లో, ఆకాశవాణిలో అనేక సాహిత్య చర్చల్లో పాల్గొన్నారు.
15 కథా సంపుటాలు, 5 నవలలు, 14 విమర్శనాత్మక వ్యాససంపుటాలు, ఒక సాహిత్య కదంబం, 5 కవితా సంపుటాలు, రెండు పద్య కవితా సంపుటాలు, ఒక దీర్ఘ కథా కావ్యం, ఒక దీర్ఘకవిత, ఒక నాటక పద్యాల వ్యాఖ్యాన గ్రంథం, ‘చేతన’ (మనోవికాస భావనలు) వ్యాస సంపుటి- పుస్తక రూపంలో వచ్చాయి. 400 ఈనాటి కథానికల గుణవిశేషాలను విశ్లేషిస్తూ వివిధ శీర్షికల ద్వారా వాటిని పరిచయం చేశారు. తెలుగు కథాసాహిత్యంలో ఇది ఒక అపూర్వమైన ప్రయోజనాత్మక ప్రయోగంగా విమర్శకుల మన్ననల్ని పొందింది.
ఆనాటి ‘భారతి’, ‘ఆంధ్రపత్రిక’, ‘ఆంధ్రప్రభ’ వంటి పత్రికల నుండి ఈనాటి ‘ఆంధ్రభూమి’ వరకు గల అనేక పత్రికలలో సుమారు 300 గ్రంథ సమీక్షలు చేశారు.
విభిన సంస్థల నుండి పలు పురస్కారాలు, బహుమతులు పొందారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు (1977) గ్రహీత. కేంద్ర సాహిత్య అకాడెమివారి Encyclopedia of Indian Writers గ్రంథంలో సుమారు 45 మంది తెలుగు సాహితీవేత్తల జీవనరేఖల్ని ఆంగ్లంలో సమర్పించారు. మహాకవి కొండేపూడి సుబ్బారావుగారి స్మారక పద్య కవితా సంపుటి పోటీలోనూ, సాహిత్య విమర్శ సంపుటి పోటీలోనూ ఒకే సంవత్సరం అపూర్వ విజయం సాధించి ఒకేసారి 2 అవార్డులు పొందారు.
అజో-విభో-కందాళం ఫౌండేషన్ వారి (లక్ష రూపాయల) జీవిత సాధన ప్రతిభామూర్తి పురస్కార గ్రహీత. రావూరి భరద్వాజ గారి ‘పాకుడురాళ్లు’ – డా. ప్రభాకర్ జైనీ గారి ‘హీరో’ నవలలపై జైనీ ఇంటర్నేషనల్ వారు నిర్వహించిన తులనాత్మక పరిశీలన గ్రంథ రచన పోటీలో ప్రథమ బహుమతి (రూ.50,000/-) పొందారు. (అది ‘నవలాకృతి’ గ్రంథంగా వెలువడింది).
కవిసమ్రాట్ నోరి నరసింహ శాస్త్రి సాహిత్య పురస్కార గ్రహీత.
6,500పైగా పద్యాలతో-శ్రీ పదచిత్ర రామాయణం ఛందస్సుందర మహాకావ్యంగా ఆరు కాండములూ వ్రాసి, ప్రచురించారు. అది అనేక ప్రముఖ కవి, పండిత విమర్శకుల ప్రశంసల్ని పొందినది. ‘యోగవాసిష్ఠ సారము’ను పద్యకృతిగా వెలువరించారు.
వృత్తిరీత్యా యల్.ఐ.సి. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ నుండి జనరల్ మేనేజర్‌గా పదవీ విరమణ చేశారు. ఫోన్: 9848025600
