Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఉత్తర రామచరిత-6

[‘ఉత్తర రామచరిత’ను వచన రూపంలో సరళ సుందరంగా అద్భుతమైన దృశ్యీకరణ శైలిలో అందిస్తున్నారు శ్రీ విహారి గారు.]

దేవదానవయుద్ధం – స్వర్గంపై రావణుని దాడి:

ససైన్యంగా కైలాసాన్నిదాటి బయలుదేరాడు రావణుడు.

వార్త అందింది – ఇంద్రుడికి. తత్తఱ మొదలైంది.

మనసు నిండా అనేక ఆలోచనలు.

యుద్ధం అనివార్యం. దుష్టరాక్షసుడి చర్యలన్నీ తెలుస్తూనే వున్నాయి. అసాధారణుడు కదా వాడు. తెలిసిన మూర్ఖుడు. తనలో దాచుకుని విజృంభిస్తున్న ఆరుగురు శత్రువుల్నీ జయించలేక, వెలుపల వున్న తాను శత్రువులనుకున్న వారందరినీ జయించాలని ఒక ఉద్యమంగా సాగుతున్నాడు.

సాటి దేవతల్నీ, ఆదిత్యుల్నీ, వసువుల్నీ, రుద్రుల్నీ, సాధ్యుల్నీ, మరుద్గణాల్నీ పిలిచి, ‘సజ్జా భవత యుద్ధార్థం రావణస్య దురాత్మనః’ (దురాత్ముడైన రావణునితో యుద్ధానికి సన్నద్ధులు కండి) అని ఆజ్ఞాపించాడు. వారంతా వెళ్ళి తమ తమ అనుసారుల్ని సిద్ధం చేసుకోసాగేరు. ఇంద్రుడు శచీదేవి వంటి స్త్రీ గణాన్నీ హెచ్చరించాడు – జాగ్రత్తగా వుండమని.

ఒక ప్రక్క ఈ ఏర్పాట్లు చేస్తూనే, తన భయం తన మనసుని మల్లడి చేస్తుంటే హుటాహుటిని విష్ణువు దగ్గరకు వెళ్ళాడు. విషయం తెలియజేశాడు. ‘ఏం చేయమంటావు?’ అని అడిగేడు.

‘‘స్థావరజంగమాత్మకమైన త్రిలోకాల్లో నీవు తప్ప వేరే గతిలేదు. సనాతనుడవు. నీవే కదా నన్ను నిలిబెట్టినదీ, లోకాల్ని సంరక్షిస్తున్నదీ’’ అని పరిపరివిధాల ప్రార్థించాడు.

అంతా విన్నాడు విష్ణుమూర్తి.

‘‘ఆ రావణుడు సాక్షాత్తూ బ్రహ్మదేవుని వరాల వలన అమిత బలవంతుడు. ఎవరిచేత మరణం లేని వరం కదా అది. కనుక, నువ్వూ, నేనూ బ్రహ్మమాటని ఇప్పుడు వ్యర్థం చేయలేము. కానీ, నేను ఆ దుష్టదశగ్రీవుని, నా పరివారంతో కలిసివచ్చి కాలం అనుకూలించినప్పుడు సంహరిస్తాను. ప్రస్తుతం భయపడకండా యుద్ధం చెయ్యి’’ అని చెప్పి పంపించేశాడు.

దేవదానవ యుద్ధం మొదలైంది.

రెండు పక్షాల్లోనూ సంక్షోభం, వ్యాకులం, ఘోరమైన, దారుణమైన పరిస్థితి.

రావణ పక్షంలో మహావీరులూ, క్రూరులు కూడా అయిన – మారీచ, ప్రహస్త, మహాపార్శ్వ, మహోదరులు, అకంపన, నికుంభ, శుక, సారణులు, సంహ్రాద, మహాదంష్ట్ర, ఘటోదర, ధూమకేతు, దుర్ముఖ, దూషణ, ఖర, త్రిశరస్సులు, కరవీరాక్ష, సూర్యశత్రు, మహాకాయ, అతికాయ, నరాంతకులు యుద్ధరంగంలో వీరవిహారం చేయసాగేరు. మధువు, సుమాలి కూడా వున్నారు. అరివీరభయంకరుడు మేఘనాదుడూ వున్నాడు.

ఒక క్షణం ఇటు, ఒక క్షణం అటుగా – ఇరుపార్శ్వాలూ- గెలిచేసినట్టు జయధ్వానాలూ, కేరింతలూ, త్రుళ్ళింతలుగా – తక్కెడ -ఎత్తుజిత్తుల్ని సూచిస్తున్నది.

దేవతలు రాక్షససేనని చిందరవందర చేసిన ఉత్సాహంలో ఉన్నారు.

అప్పుడు తానై విజృంభించాడు సుమాలి. ఆగ్రహోదగ్రుడై దేవసైన్యాన్ని కకావికలు చేయగలిగాడు.

ఇంద్రుడు భీతిల్లుతున్నాడు. చూశాడు –

అష్ట వసువుల్లో ఎనిమిదవవాడు – సావిత్రుడు- సుమాలిని ఎదుర్కొన్నాడు.

యుద్ధం భయంకరమైంది. సుమాలి రథాన్ని తుత్తునియలు చేసేశాడు సావిత్రుడు. అదను చూసి గదా ప్రహారంతో సుమాలి తలమీద మోదేడు.. సావిత్రుని గదా హతికి తల్లడిల్లుతున్న సుమాలిని ఇంద్రుడు వచ్చి అగ్నిశిఖా సదృశమైన తన గదతో పిడుగు రగిల్చినట్లే కొట్టేడు.

సుమాలి శిరస్సుగానీ, అస్థికలుగానీ, మాంసంగానీ కనిపించక, భస్మమై పోయాడు.

సుమాలి మరణం యుద్ధంలో మొదటి మలుపు!

***

సుమాలి వధతో రాక్షససైన్యంలో కలకలం పుట్టింది. వసువూ, ఇంద్రుడూ కలిసి వీరవిహారం చేస్తున్నారు. ఇక తాళలేక పలాయనం చిత్తగించే స్థితిలో వుంది సైన్యం. ముఖ్యులు ఎవరు ఎక్కడ వున్నారో కూడా తెలియటం లేదు.

ఈ స్థితిని అవగతం చేసుకున్నాడు మేఘనాదుడు. ఒక పక్క త్వష్ట, పూష అనే ఆదిత్యులు కూడా విజృంభించి రాక్షసుల్ని చెండుకుంటున్నారు.

మేఘనాదుడు – పేరును సార్థకం చేస్తూ- కదనరంగంలోకి దూకి గర్జించాడు, “రాక్షస వీరులారా? భయపడకండి! వీరుడంటేనే – ‘ఉత్సాహోవీరః’ అన్నారు. మనకేమీ కాలేదు. మీరంతా అరివీరభయంకరులు. మీమీ ధైర్య సాహసాల్ని చూపుతూ దేవతల్ని నేలమట్టం చేయండి’’ అని.

ఒక్కసారిగా తులాదండం ఇటు వొరిగింది. మేఘనాదుడి గర్జనకూ, ఉత్సాహాతిశయానికీ, విక్రమధాటికీ – దేవతలంతా వణుకుతూ చెల్లాచెదురు కాబోతున్నారు.

చూశాడు ఇంద్రుడు. సరిగ్గా అదే సమయంలో అటునుంచీ జయంతుడు, తన కుమారుడు – యుద్ధ ప్రతాపుడు – వస్తున్నాడు. వెంటనే, సైన్యాన్నీ, నాయకుల్నీ ఉద్దేశించి ‘‘ఆగండి. ఎవ్వరూ భయపడకండి. అడుగో, జయంతుడు ప్రవేశించాడు. విజయం మనదే, శత్రువుల్ని నిశ్శేషం చేయండి’’ అని ఉగ్రరూపంతో ఉత్సాహపరచాడు.

మేఘనాదుడు తన పరాక్రమ ధాటి ఆకాశమంత ఎత్తునే ప్రదర్శించసాగేడు.

జయంత మేఘనాదులు ఎదురెదురయ్యారు. జయంతుని మీద శరపరంపరని కురిపిస్తూ, మేఘనాదుడు, మరో పక్కనుండి చుట్టు ముడుతున్న దేవతల మీద, శతఘ్ని – ముసల – ప్రాస- గదా- ఖడ్గ – పరశ్వధాలను రువ్వుతున్నాడు.

ప్రచండమైంది కదనం. దేవతలు తాళలేక పోతున్నారు. రణరంగమంతా చీకటి ఆవరించింది. ఎవరు ఎవర్ని సంహరిస్తున్నారో తెలియని అయోమయం అలముకుంది.

మేఘనాదునిది పై చెయ్యి అయింది. జయంతుని మాతామహుడు – పులోముడు – మనుమడు ప్రమాదంలో పడినట్లు గమనించి, హుటాహుటిని వచ్చి అతన్ని పోరుకి కడగా తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళటం వెళ్ళటం అతన్ని తీసుకుపోయి సముద్రంలో దాచేశాడు.

ఇంద్రుడు ఈ సంభవాన్ని చూసేడు. మాతలిని పిలిచి రథాన్ని తెప్పించుకుని, రణరంగానికి వచ్చేశాడు. అతని వెనగ్గా – అశేష విశేష ఆయుధదారులై – వసురుద్ర ఆదిత్యులూ, అశ్వినీ దేవతలూ, మరుద్గణాలూ కదలివచ్చారు.

వీరందరినీ చూసి విహ్వలత నుండి తేరుకొని విజృంభించ సాగారు దేవవర్గం సైనికులు.

ఆ సమయంలో గాలి పరుషంగా వీస్తోంది. సూర్యకాంతి పలుచబడిరది. పెద్దపెద్ద ఉల్కలు కిందకు డ్రుల్లినై.

ఇంద్రుని రాకను గమనించాడు రాక్షసేశుడు. విశ్వకర్మ నిర్మించిన రధాన్నెక్కి యుద్ధభూమికి వచ్చాడు. కుమారుని పక్కకి పంపేడు. తానే స్వయంగా ఇంద్రునితో తలపడినాడు.

అటు ప్రక్కన కుంభకర్ణుడు కోపావేశంతో అందిన వాడిని అందినట్లు తోమరాలు, ముద్గరాలు, శక్తులు మాత్రమే కాక తన పాదాలతో, చేతులతో, భుజాలతో వివిధ సాధనాల ప్రయోగంతో ఎడతెరిపి లేకుండా మట్టడించసాగేడు.

దేవదానవ యుద్ధం లోకభీకరంగా సాగుతున్నది.

ఇరుపక్షాల సైనిక సమూహం శవాలతో కదనభూమినంతా చిందరవందరగా, రక్త ప్రవాహం నిండిన నదిలా మార్చింది.

ఇంద్రుడు రాక్షసరాజుమీద ప్రళయకాలాగ్నితో సమానమైన బాణపరంపరని ప్రయోగిస్తున్నాడు. లంకాధిపతి, మహాబాహువు – ఇంద్రుని బాణాల్ని ఛేదిస్తూ, తానూ శతసహస్రంగా బాణ ప్రయోగాలు చేస్తున్నాడు.

యుద్ధభూమి సర్వమూ అంధకారబంధురమై పోయింది.

దేవతలూ రాక్షసులూ ఉన్మత్తులై కుత్తుకల్ని ఉత్తరించుకుంటూ పోరుని ఉధృతం చేస్తున్నారు. కానీ, చీకటివారిని స్పృహలేకుండా చేసింది. ఆ చీకటికి ఇంద్రుడు, రావణుడు, కొంచెం పక్కగా వున్న మేఘనాదుడు – ఈ ముగ్గురు మహాబలులు మాత్రమే తెలివితో నిలువగలిగారు.

***

కొంత సమయం గడిచింది.

రావణుడికి పరిస్థితి అర్థమైంది. తన సైన్యం నీరుగారుతోంది. దేవతలు అత్యుత్సాహంతో యుద్ధభూమిని శ్మశానంగా చేసేస్తున్నారు.

పటపటా పండ్లు గీరుతూ, సారథిని హెచ్చరించాడు – రథాన్ని దేవసైన్యం మధ్యలోకి తీసుకువెళ్లమని. అతను బెరుకుగా చూశాడు. దశకంఠుడికి కోపం తీవ్రమైంది. ‘‘మళ్ళీ చెబుతున్నాను. మనం ఇప్పుడు నందనవన ప్రాంతంలో వున్నాము. ఉదయపర్వతం వైపు పోనీ రథాన్ని. అసురారులు శలభల్లా నా ప్రతాపాగ్నిలో భస్మమయ్యే వరకూ ఊరుకోను’’ అని గదిమేడు. ఆ గద్దింపుకు సారథిó మేను వణికింది. అశ్వాల్ని ఆ వైపుకు అదిలించాడు.

రావణుడి భీషణత్వాన్నీ, సారథిóకి అతడు చేస్తున్న హెచ్చరికల్నీ పసిగట్టేడు మహేంద్రుడు. తన సేనావాహిని మధ్యలో నిలబడి, ‘‘అడుగో – రావణుడు, ఉదయపర్వతం వైపు వస్తున్నాడు. ముఖ్యయోధులారా! అప్రమత్తులు కండి’’ అంటూ, ఆ వెంటనే ‘‘అతన్ని చంపటం శక్యం కాదు. బ్రహ్మమహేశ వరప్రసాదం వలన అతన్ని మనం సంహరించలేం. వెంటనే బంధించండి’’ అని బిగ్గరగా సందేశించాడు.

రావణుడు ఉత్తరం వైపు నుండి దేవసైన్యంపై శస్త్రాల్ని ప్రయోగిస్తూ చొచ్చుకు వస్తున్నాడు. అతని వూహాన్ని గమనించాడు ఇంద్రుడు. తాను ససైన్యంగా దక్షిణ పార్శ్వం నుండి ప్రవేశించి, రాక్షసుల్ని ఊచకోత కోస్తూ వెళ్ళి రావణుని ఆక్రమించేశాడు!

రావణ సైన్యంలో ఒక్కసారిగా అదుపులూ, కేకలూ మిన్నుముట్టేయి. ‘‘అయ్యో.. చచ్చాం.. మహారాజు ప్రమాదంలో చిక్కుకున్నారు’’ అని శతకోటి కంఠాలు ఒక్కుమ్మడిగా అరిచేయి.

మేఘనాదుడు ఉలిక్కిపడినాడు. లేచాడు.

“తాం ప్రవిశ్య మహామాయమాం ప్రాప్తాం పశుపతేపురా’’ (మహేశుని నుండి లభించిన మాయను అవలంబించి) సైన్యం మధ్యనుండి సరాసరి ఇంద్రుని ముందుకు దూకాడు. కానీ, మాయా ప్రభావం వలన రావణుని ఇంద్రుడు చూడలేకపోయాడు. మాతలి మేఘనాదుని శరసంఘాతానికి తాళలేక పోతున్నాడు.

ఇంద్రుడు క్షణం ఆలోచించాడు. రథం దిగాడు. మాతలిని వెళ్ళి పొమ్మన్నాడు. తృటిలో పక్కనే సిద్ధంగా నిలిచివున్న ఐరావతం పైకి లంఘించాడు. మేఘనాదుని కోసం వెదుకసాగేడు. కానీ అతడు కనపడకుండా, బాణప్రయోగం చేస్తున్నాడు. వాటిని నిలవరించుకుని ఇంద్రుడు అలసిపోయాడు.

సమయజ్ఞుడు మేఘనాదుడు, ఒక్క ఉదుటున ఇంద్రుని సముఖానికి వెళ్ళి తన మాయతో, అతన్ని బంధించేశాడు. బలాత్కారంగా తీసికొని పోతున్నాడు.

దేవముఖ్యులూ, సైన్యం చూశారు. నిలువునా నీరయ్యారు. అటునుండి వస్తున్న రావణుని అడ్డుకుని పోరుని ఉధృతం చేయగలిగారు.

మేఘనాదుడు తీవ్రస్వరంతో “రాక్షసవీరులారా! యుద్ధాన్ని విరమించండి. ఇంద్రుడిని బంధించాను. మనం గెలిచాము’’ అని జయధ్వానం చేశాడు.

ఇటు రాక్షసులు జయోత్సాహంతోనూ, అటు దేవతలు సందిగ్ధంతో, న్యూనతతో యుద్ధాన్ని విరమించారు.

రావణుడు కుమారుని దగ్గరకు వచ్చి అతన్ని ప్రశంసిస్తూ ఆదరపూర్వకంగా అన్నాడు, ‘‘అతిబలంతో సమర్థుడవైన కుమారా! తగిన విక్రమంతో మన కుల వివర్థనుడవైనావు. మహేంద్రునే జయించావు’’

రావణి వినయపూర్వకంగా, సంతోషంతో తండ్రికి నమస్కరించాడు.

రావణుడు ముందుగా ఇంద్రుని తీసుకుని కుమారుని నగరంలోకి ప్రవేశించమన్నాడు. తాను రాక్షస యోధులతో కలిసి వారి వెనుకగా కదిలాడు.

ఇంద్రజిత్‌కు బ్రహ్మవరం:

దేవతలంతా – వసు రుద్ర ఆదిత్య సాధ్య గణాలతో వెళ్ళి బ్రహ్మకు మహేంద్రుని రావణుడు, రావణి లంకకు తీసుకుపోయినట్లు చెప్పి, తమ అధిపతిని విడిపింపజేయమని ప్రార్థించారు.

‘‘స్వర్గాన్ని రాజులేని రాజ్యాన్ని చేయవల’’దని వేడుకున్నారు.

బ్రహ్మకూ ఈ స్థితి ప్రమాదకరమని తెలుసు. అందుకే వారితో కదలివచ్చి లంకకు చేరేడు. నభోమండలంలో నిలిచి రావణుని ఉద్దేశించి మాట్లాడాడు.

‘‘దశకంఠా! నీ విజయానికి నిన్ను మెచ్చుకుంటున్నాను. ముల్లోకాల్నీ జయిస్తానన్న నీ ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నావు. యుద్ధంలో మేఘనాదుని వీర్య విక్రమధాటి గురించి విన్నాను. తెలుసుకున్నాను. అతడు నీతో సమానుడు, లేదా నీకంటే కూడా అధికుడనవచ్చు. ఇంద్రుని జయించి అతనిని లంకకు తెచ్చిన మేఘనాదుడు లోకంలో ‘ఇంద్రజిత్తు’గా ప్రసిద్ధినీ, పేరునీ పొందుతాడు. మహాబలవంతుడుగా, దుర్జయుడుగా ఉంటాడు’’ అని క్షణం ఆగి, ‘‘పాకశాసనుడైన ఇంద్రుని విడిచిపెట్టు. దానికి ప్రతిఫలంగా ఏమి కావాలో కోరుకో’’ అన్నాడు.

ఇంద్రజిత్తు బ్రహ్మతో సూటిగా మాట్లాడసాగేడు. ‘‘లోకంలో భూనభాంతరాలలో సంచరించే జంతువుల్లో సైతం ఒకదానిని చూస్తే ఒకదానికి భయమే. అలాగే మనుషుల్లో అందరికీ దేవదానవుల్లో అందరివలనా భయమే. ఆ కారణం వలన – నాకు మరణం లేకుండా వరం ఇవ్వు. మహేంద్రుని విడిచి వేస్తాను’’

బ్రహ్మకి ఇబ్బందిగా వుంది. అయినా చెప్పక తప్పదనుకున్నాడు. ‘ఇంద్రజిత్‌! నీకూ తెలిసిన వాస్తవమే. పుట్టిన ఏ ప్రాణికైనా మరణం తప్పదు కదా?’’

‘‘అయితే – నాకు ఏ సిద్ధి కావాలో అడుగుతున్నాను విను. శత్రువులపై జయాన్ని కోరుతూ నేను నిత్యమూ హవ్యములతో, మంత్రాలతో హోమము చేసి, యుద్ధసన్నద్ధుడు కాగానే నా కొరకై అగ్ని నుండి విశేషమైన రథం బైటకు రావాలి. నేనా రథంలో ఉన్నంతవరకూ నాకు మరణము సంభవించకూడదు. ఒకవేళ నేను నా వ్రతాన్ని అసంపూర్తిగా వదలివేస్తే, వెళ్ళి యుద్ధం చేస్తే నా వినాశము జరగవచ్చు. ఈ విధంగా నేను కేవలం నా పరాక్రమం ద్వారా మాత్రమే అమరత్వాన్ని సంపాదించుకో కోరుతున్నాను. ఈ వరాన్ని ఇచ్చి, మహేంద్రుని తీసుకుపో’’

బ్రహ్మ ‘‘తథాస్తు. నేను అంగీకరిస్తున్నాను’’ అని దీవించాడు.

మహేంద్రుని వదలి, రావణుడు, ఇంద్రజిత్తు ఇతర దానవగణంతో కూడి, అక్కడ నుండి వెడలిపోయారు.

ఇంద్రుడు బంధవిముక్తుడైనాడు. అయినా, అతడు దేవతేజస్సును కోల్పోయి, దీనంగా నిలబడినాడు. చింతాక్రాంతుడై బ్రహ్మవైపు తిరిగి ‘ఏమి ఈ దుస్థితి’ అని వేడుకున్నాడు.

మహేంద్రుడు పూర్వము చేసిన మహాపాపమును గురించి బ్రహ్మ సవిస్తరంగా తెలియజేశాడు.

ఆ పాప వృత్తాంతమే – అహల్యా ప్రలంభ ప్రబంధము!!

గతాన్నంతా విశదీకరించి, ‘‘మహేంద్రా! ఆ పాపం వల్లనే నీవు శత్రువు చేత బంధింపబడి అపజయం పాలయ్యావు. ఆ పాప పరిహారానికి ‘వైష్ణవ యజ్ఞం’ని సావధానంగా నిర్వహించు’’ అని సూచించి, ‘‘నీ పుత్రుడు జయంతుడు యుద్ధంలో మరణించలేదు. అతని మాతామహుడు పులోముడు తీసుకొని వెళ్ళి మహాసముద్రంలో దాచి వుంచాడు’’ అని ఊరట నిచ్చాడు.

దేవేంద్రుడు బ్రహ్మకు అంజలి ఘటించి, తన కృతజ్ఞతను వేయికళ్ళ వెలుగుతో అందించాడు.

‘వైష్ణవ’ యజ్ఞాన్ని నిర్విఘ్నంగా పూర్తిచేసి, మళ్ళీ సురలోకాధిపత్యాన్ని పొందాడు మహేంద్రుడు.

(సశేషం)

Exit mobile version