Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఉత్తర రామచరిత-7

[‘ఉత్తర రామచరిత’ను వచన రూపంలో సరళ సుందరంగా అద్భుతమైన దృశ్యీకరణ శైలిలో అందిస్తున్నారు శ్రీ విహారి గారు.]

కార్తవీర్యార్జుని చేతిలో రావణ పరాభవం:

ఇక్కడివరకూ చెప్పిన అగస్త్యుడు శ్రీరాముని వైపు సాలోచనగా చూశాడు.

“మహర్షీ మీరు తొలుత చెప్పినదానికి వివరణను విశదం చేశారు. రావణుడి కంటే రావణి ఘనత ఏమిటో అర్థమైంది. వాడు నిజంగా ఇంద్రజిత్తే! మాయతో జిత్తులమారి అయ్యాడన్నమాట!” అన్నాడు.

“అవును. అందుకే ఇంద్రజిత్తు త్రిలోక ప్రశస్తి పొందాడు. దానికి మరో కారణం – బ్రహ్మను అతడు చివరలో అడిగిన వరం కూడా. చెప్పాను కదా – తన పరాక్రమం ద్వారానే అమరత్వాన్ని సాధించుకుంటానని బాస చేసుకున్నాడు.”

“నిజమే. దాని పర్యవసానమూ అనుభవించాడు కదా” అన్నాడు. సమావేశంలో ఒక ప్రక్కగా కూర్చుని వింటున్న లక్ష్మణుడు.

“అవును మహర్షీ! ఆ కాలంలో ఆ రావణుని ఎదుర్కోగలిగిన శూరులే లేకుండా పోయారా? అందరు క్షత్రియవీరుల్లో ఏ వొక్కరూ దశకంఠుని గర్వాన్ని అధఃకరించలేకపోయారా?” అడిగేడు రాముడు.

చిరునవ్వుతో, “మంచి సందేహమే వచ్చింది. అసలు వానికి మించిన ఘనులు లేకపోలేదు” అంటూ “వినండి – ఆ వృత్తాంతాలూ వివరిస్తాను” అని కొనసాగించాడు.

అమరావతికి సమమైన మహిమాన్వితమైన మహానగరము మాహిష్మతీ నగరం. దాన్నివేయి బాహువులు గల మహారాజు అమేయ పరాక్రమవంతుడు కార్తవీర్యార్జునుడు పాలిస్తున్నాడు.

అహంకారమత్తుడైన రావణుడు పిలువని పేరంటానికి పోయినట్లు ఆ పురానికి వెళ్ళి ఆ అర్జునునితో యుద్ధం చేయ సంకల్పించాడు. వెళ్ళాడు.

మహాబలశాలీ, సమర్ధుడూ అయిన ఆ మహారాజు ఆవేళనే వింధ్య పర్వత ప్రాంతాన వున్న నర్మదానదిలో జలక్రీడలాడటానికి తన స్త్రీలతో కలసి వెళ్ళాడు.

రావణుడు తాను “యుద్ధకాంక్షియై వచ్చానని రాజుకు చెప్పండి” అని హుంకరించాడు. వారు నిర్భయంగా ‘వెళితే నువ్వే వెళ్ళమన్నట్టు’ సూచించారు. ఆగ్రహోదగ్రుడై దశగ్రీవుడు ఆ నది సమీపానికి వెళ్ళాడు.

పరమ మానోజ్ఞమైన ప్రదేశం. రమణీయమైన వాహిని. కమనీయమైన వాతావరణం. రావణుడు ఆశ్చర్యానందాల్లో మునిగాడు. నర్మదానదీ స్నానం చేయాలనిపించింది. ప్రహస్త – శుక సారణ- మహోదర ధూమ్రాక్షులు అమాత్యులు వున్నారు పక్కన. వారితో ఆ ఆహ్లాద ప్రదమైన పరిసరాల్ని వర్ణించాడు. “కాంతి చల్లగా వుంది. గాలి భయపడి పరిమళభరితంగా వీస్తున్నది. నది విలాసవంతమైన యువతిలా ఆహ్వానిస్తున్నది. రండి. నేను స్నానం చేసి, తీరంలో శివార్చన చేస్తాను. శివలింగాన్ని తెచ్చి ఇక్కడ వుంచి, మీరూ స్నానం చేయండి” అని ఆజ్ఞాపించాడు.

తాను స్నానం చేశాడు. వారూ చేశారు. తర్వాత సువర్ణలింగ పూజ చేసేడు రావణుడు.

కార్తవీర్యార్జునుడు స్త్రీలతో జలక్రీడలాడుతున్న ప్రదేశానికి రావణుడు శివపూజ చేస్తున్న ప్రదేశం సమీపంలోనే వుంది.

సహస్రబాహువైన కార్తవీర్యార్జునుడు తన బాహుబలాన్ని పరీక్షించుకోవడానికా అన్నట్టు ఆ వేయి చేతులతో నర్మదానదీ ప్రవాహాన్ని అడ్డుకున్నాడు. జలప్రవాహం ఎదురుతిరిగి రావణుడు పూజ చేస్తున్న చోటికి మరలింది. ఆ నీటివాలులో, జాలులో – రావణుడు చేస్తున్న పూజా పుష్పాలు, దర్భాస్తరణములు, ఇతర సుగంధాలంకరణ విశేషాలూ కొట్టుకుపోతున్నాయి.

గమనించాడు రావణుడు. విస్తుపోయాడు. కోపం ముంచుకొచ్చింది. హుంకరించి, తలపంకించి, చూపుతో శుకసారణులకు సంజ్ఞ చేశాడు. భయపడుతూ వారిద్దరూ శీఘ్రంగా వెళ్ళి చూసివచ్చారు. చూసినది చెప్పారు.

ఠక్కున లేచాడు పంక్తిగ్రీవుడు. బలోద్ధతతో, రోషంతో అట్టహాసంతో కదిలాడు. అమాత్య బృందం, ఆ వెనుక పరివారం కదిలారు. అర్జునుని స్నాన సన్నివేశం వద్దకు వచ్చేశాడు. చూశాడు.  స్త్రీ గజగణం మధ్యన మత్తవారణంలా నర్మదలో స్త్రీల మధ్యగా రాజవీరుడు మహారాజు.

సహించలేకపోయాడు. వెళ్ళి రావణుడు యుద్ధానికి వచ్చాడని చెప్పి రమ్మన్నాడు. అమాత్యులు వెళ్ళి చెప్పారు. అర్జునుని అమాత్యులు ‘ముందు మాతో యుద్ధం చేసి జయించండి’ అని సవాలు చేశారు.

పోరు మొదలై, క్రమంగా భీకరమైంది.

కొందరు సైన్యముఖ్యులు వెళ్ళి మహారాజుకు విషయాన్ని విన్నవించారు.

కార్తవీర్యార్జునుడు స్నానం ముగించి, క్రోధం తీవ్రతతో గద ధరించి రావణుని ముందుకు వెళ్ళటానికి బయల్దేరాడు.

ప్రహస్తుడు ముసలాన్ని చేబూని మహారాజును అడ్డుకున్నాడు. గదాధారి అయిన అర్జునుడు మహావేగంతో ప్రహస్తుని పడగొట్టాడు. ఈ సంభవానికి వణకిపోయి మిగిలిన అమాత్యులు పారిపోయారు.

రావణుడికి అర్థమైంది. అర్జునుడు తన మీదికి రావటం కాదు, తానే వాని మీదకు లంఘించాలని ఒక్క ఉదటున వాని పైకి దూకాడు.

అతడు సహస్ర బాహువులవాడు; ఇతడు వింశతి బాహువులవాడు! ‘నృపరాక్షసయోస్తత్ర ఆరబ్దం రోమహర్షణమ్‌!’ యుద్ధం ప్రారంభమైంది. తీవ్రమైంది, దుర్నిరీక్ష్యమైంది. ఎలా?

క్షోభిస్తున్న రెండు సముద్రాల్లా వున్నది. మొదళ్ళు కదలిన రెండు మహాపర్వతాల కదలికల్లా వున్నది. మహా ప్రజ్వలనంతో తేజోవంతమైన రెండు అగ్నిగోళాల మంటలా ఉంది. బలోద్ధతులైన రెండు మదేభాల పోరులా వుంది. రెండు ఆబోతుల స్పర్ధలా వుంది. ప్రచండంగా ఉరుముతున్న రెండు మేఘాల రావంలా ఉంది. బలంతో జూలు విదలుస్తున్న రెండు సింహాల పోరాటంలా వుంది. రుద్రయముల ఎక్కటి పోరుగా వుంది.

ఇద్దరూ గదా ప్రహారాలతో రెచ్చిపోతున్నారు. ఇద్దరిలోనూ అలసట కనిపించటం లేదు. కార్తవీర్యార్జునునకు కోపం మిన్ను ముట్టింది. ప్రాణశక్తిని సర్వాన్ని ఏకస్థితికి జేర్చుకొని రావణుని వక్షస్థలంమీద తీవ్ర గదాఘాతాన్ని మోదాడు.

ఆ దెబ్బకు అంతటి రావణుడూ – అట్టిట్టయి పోయాడు. బారెడు దూరం పోయి పడ్డాడు! క్షణం విరామాన్ని ఇవ్వకుండా, ఒక్కపెట్టున ఎగిరి రావణుని మీదకు దూకాడు కార్తవీర్యార్జునుడు. వెంటనే తన వేయి చేతులతో ఒడిసిపట్టి బంధించేశాడు!!

ఈ సంభవాన్ని చూసి సిద్ధ చారణ దేవసమూహం ‘బాగు – బాగు’ అంటూ అర్జునుని శిరస్సుపై పూలు చల్లారు.

కార్తవీర్యార్జునుడు రావణుని తీసుకుని వెళ్ళి తన నగరప్రవేశం చేసేడు!

రావణుని వధించదలచక, (వధించలేడు కనుక!) కారాగారంలో వుంచాడు.

స్వర్గలోకంలో ఈ వార్త దేవతలందరి నోళ్ళలోను నానుతోంది. పులస్త్యుడు విన్నాడు. ఆయన తేజోవంతుడు, మహాధైర్యవంతుడు, మహర్షి.

– కార్తవీర్యార్జుని వద్దకు వచ్చాడు. వార్తాహరులు ఆయన రాక గురించి చెప్పగానే, అర్జునుడు ఎదురేగి అర్ఘ్యపాద్యాలతో సత్కరించి, వినయంతో తోడ్కొని వచ్చాడు. “మహర్షీ. ఇదుగో రాజ్యం, రాజ్యప్రజలు, నా పుత్రులు, నా భార్య, అందరమూ మీకు ఏమి చేయమని కోరుతారో దాన్ని చేయటానికి సిద్ధం. మీ ఆజ్ఞని తెలుపండి” అని వేడుకున్నాడు.

పులస్త్యుడు అర్జునుని సాహసవీర్యాన్నీ, రాజ్యపాలననూ మెచ్చుకున్నాడు. “లోకంలో తనకు సాటే ఎవ్వరూ లేరని విర్రవీగిన నా పౌత్రునే జయించావు. నీవు ‘రావణ’ విజేతవు” అని అభినందించి, ‘రావణుని విడిచిపెట్ట’మని వేడుకుంటున్నాను” అన్నాడు.

పులస్త్యుని కోరికను ఆజ్ఞగా భావించాడు. గౌరవాదరాలతో ‘సరే’ అని అమాత్యుల్ని రావణుని తీసుకురమ్మన్నాడు.

రావణుడు వచ్చాడు. పితామహునికి నమస్కరించాడు.

వెంటనే అగ్ని వ్రేల్చబడిరది. అగ్నిసాక్షిగా కార్తవీర్యార్జునుడు – రావణుడు ‘మనము పరస్పరం హింసించుకొనకూడదు. స్నేహపూర్వకంగా వ్యవహరిద్దాం’ అని మాట కలుపుకున్నారు.

పులస్త్యుడు సంతోషించి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు.

దశకంఠుడూ లంకకు తరలి వెళ్ళాడు.

***

“విన్నావు కదా రామా! ఒకడు బలవంతుడైతే, అతని తలదన్నేవారు మరికొందరు వుంటారు. అందువలన తనకు శ్రేయస్సు కోరుకునేవాడు, శత్రువు పట్ల అవజ్ఞ చేయరాదు. ఔదార్యం చూపాలి” అన్నాడు అగస్త్యుడు. ‘అపకారికి ఉపకారము నెపమెన్నక చేయటం’ సందేశం అందుకనే లోకంలో స్థిరపడింది.

తదనంతర గాథని వినిపించసాగేడు అగస్త్యుడు.

వాలి చేతిలో రావణబంధనం:

కాలం వేగంగా, బలంగా కదులుతోంది.

దశకంఠుని కదలికా అలాంటిదే. దశగ్రీవుడు కదా. దశదిశలూ వాడివే.  కార్తవీర్యార్జునుని చేతిలో పరాభవాన్ని మరిచిపోయాడు.

‘అహో- తేజో రావణో రాక్షసేశ్వరా!’ అని చూసేవారు విభ్రమం చెందే తేజస్సూ, ప్రతాప అహంకారం కలిగినవాడు కదా! రావణుని నైజం లక్షణం – క్రూరత్వం, దుష్టత్వం, మదం, విశృంఖలత్వం! వీటి అతిశయాన్నీ, విజృంభణనీ ప్రదర్శిస్తూ, సాహసవీరుడన్న ప్రతివాడికీ సవాలు విసరుతూ తిరుగుతున్నాడు.

ఈ క్రమంలో ఒక్కసారి కిష్కింధ చేరేడు.

కిష్కింధ – హేమమాలిని ధరించిన వాలి ఏలుబడిలో వున్న వానర రాజ్యం.

రాజమందిర ప్రాంగణంలో ప్రవేశించి, “రారా.. వానరా! వాలీ! నీ కేళి ముగిస్తాను!” అని అట్టహాసం చేశాడు.

వాలి అమాత్యుడు, వాలి భార్య తారకు తండ్రి – పేరు తారుడు. వచ్చాడు. ఆయన సమర్థుడు. సమయజ్ఞత, విషయజ్ఞత కలిగినవాడు. రావణాహంకార మూర్తిని చూశాడు. లోలోపల నవ్వుకుని నిదానంగా చెప్పాడు.

“రావణా! నీ హుంకృతిని ఆపు. ప్రస్తుతం వాలి ఇక్కడ లేడు. నాలుగు సముద్రాల్లోనూ స్నానసంధ్యలు పూర్తిచేసుకోవటానికి వెళ్ళేడు. వచ్చే వేళ అయింది.  ముహూర్తకాలం ఆగు.”

రావణుడికి అసహనం కలిగింది. పాదతాడనం చేసి, ఉసురుసురని విసుక్కున్నాడు.

తారుడు అన్నాడు, “రావణా! ఊరికే రెచ్చిపోకు. ఇదిగో ఇటు చూడు” అని పక్కగా వున్న ప్రోవును చూపి “అక్కడ శంఖల్లాగా తెల్లగా వున్న గుట్టవున్నదే, దాని మీదివన్నీ వాలితో యుద్ధానికి వచ్చి, వాలి చేతిలో మరణించినవారి ఎముకలే!” అన్నాడు.

“అంతటి మొనగాడా, మీ వాలి? చూద్దాం!” అని హేళనగా పెదవి విరిచాడు.

తారుడు చెప్పాడు, “రావణా, మిడిసిపడకు. నీవు అమృతం తాగి వచ్చినా, వాలితో పోరు కుదిరితే ఇంతే సంగతులు! నీ జీవితం ఇంతటితో సరి! కనుక, నా అల్లుడు వచ్చేలోగా ఈ ప్రకృతిని చూస్తూ ఆనందించు. వాలి వచ్చేడంటే నీకా అవకాశం మిగలదు.

వాలి వచ్చే అంతవరకూ ఆగలేనంటావా – వెళ్ళు- ఇప్పుడు దక్షిణ సముద్రం వద్ద ఉండివుండవచ్చు” అనీ అన్నాడు.

రావణుని అహం అతన్ని నిలవనీయలేదు, తారుని మీద తన విసురుచూపి, పుష్పకాన్ని ఎక్కి దక్షిణ సముద్రతీరం చేరేడు.

పుష్పకాన్ని దిగి ముందుకు వెళ్ళాడు. వాలిని చూశాడు. సూర్యతేజస్సుతో వెలిగిపోతున్నాడు. ఇరువది చేతులవాడు, నెమ్మదిగా అడుగులు వేస్తూ వాలి సమీపానికి వెళుతున్నాడు.

సరిగా అప్పుడే వాలి కూడా ఈ రావణుని చూశాడు.  ఏ తత్తఱపాటూ కలుగలేదు. చెవుల పిల్లిని చూసిన సింహంలా, పన్నగాన్ని చూసిన గరుడునిలా రావణుని లెక్కచేయలేదు. వేదమంత్రాలు చదువుకుంటూ వున్నాడు.

వెనుక నుంచీ –

రావణుడు వాలి దగ్గరకు వచ్చాడు. అతడు తన చేతికి అందేంతవరకూ రానిచ్చి, వాలి రావణుని అదాటున వొడిసిపట్టుకుని, చంకలో వ్రేలాడేట్టు చేసి ఆకాశంలోకి ఎగిరేడు.

వాయువు మేఘాన్ని అపహరించినట్లు వెళ్ళి పోతున్నాడు వాలి.

రావణుని మంత్రులు, పరివారం హాహాకారాలతో అరుచుకుంటూ పరిగెత్తసాగేరు. అతన్ని అందుకోవటం తమ వల్ల కాదని ఆగిపోయారు.

వాయువేగ, మనోవేగాల్ని అధిగమించి వెళుతున్నాడు వాలి. మహాపర్వతాలే తప్పుకుంటున్నాయి.

వాలి బాహుబంధనంలో రావణుడు. చేతులూ, వస్త్రమూ, తొడలూ వ్రేలాడుతున్నై.

నభోమండలంలో దేవతలు ఈ దృశ్యాన్ని చూసి, వాలి పరాక్రమాన్ని అభినందిస్తూ నిలిచారు.

వాలి పశ్చిమ సముద్రం చేరి సంధ్యోపాసన చేశాడు. ఆ తర్వాత ఉత్తర సముద్రానికి వెళ్ళాడు. అక్కడా తన స్నానసంధ్యాదికాలు పూర్తిచేసుకున్నాడు. ఆ వెంటనే తూర్పు సముద్రస్నానమూ, సంధ్యా అయినై. గిలగిల్లాడిపోయాడు దశకంఠుడు.

కిష్కింధకు వచ్చి, తన ఉద్యానవనంలో రావణుని దింపాడు; “ఎక్కడ నుండి వచ్చావు?” అని నవ్వుతూ అడిగాడు.

రావణుడు తన ప్రవరని చెప్పుకున్నాడు. తలవంచుకుని తన ‘ఘనత’నూ నెమ్మదిగా చెప్పి ఇలా అన్నాడు, “ఏ మాత్రం అలసట లేకుండా, నా వంటి బలశాలిని మోస్తూ అంత శీఘ్రవేగంతో మహాసముద్రాల్ని చుట్టి వచ్చావు. నీ బలం, గమనం, కేవలం వాయువు, గరుడుడు, మనస్సు – అనే మూడు భూతాలకు మాత్రమే ఉన్నది. నీ ముందు నా బలమెంతో నాకు తెలిసింది. నన్ను నీ మిత్రునిగా అంగీకరించు” అని వేడుకున్నాడు.

వాలి సమ్మతించాడు. అగ్నిసాక్షిగా మైత్రి కుదిరింది.

రావణుడు కిష్కింధ అతిధిగా సకలభోగాలూ అనుభవిస్తూ అక్కడ ఒక మాసం వున్నాడు.

***

“అదీ వాలి, ఇదీ రావణుడు!” అని ఆ వృత్తాంతాన్ని ముగించాడు అగస్త్యుడు.

రాముడు చిరునవ్వు నవ్వేడు. “ముప్పుతిప్పలు పెట్టి మూడు చెఱువుల నీళ్ళు తాగించటమంటే ఇదేనన్నమాట” అని నవ్వేడు సౌమిత్రి.

“అంతటి వాలికీ తానేమిటో తెలియజేశాడు సత్యధర్మ పరాక్రమవంతుడు దాశరథి” అన్నారు అక్కడ వున్న ఋషి సమూహంలోని వారెవరో!

రాముడు వినయానతుడైనాడు.

లక్ష్మణుడు ‘మా అన్న!’ అనుకుని నిండుగా శ్వాసించాడు. వెడద ఉరం మరింత ఉప్పొంగింది!!.

(సశేషం)

Exit mobile version