Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఉత్తర రామచరిత-9

[‘ఉత్తర రామచరిత’ను వచన రూపంలో సరళ సుందరంగా అద్భుతమైన దృశ్యీకరణ శైలిలో అందిస్తున్నారు శ్రీ విహారి గారు.]

సీతారాముల అన్యోన్య ప్రేమానురాగ ప్రసక్తి:

ఋతువులు మారుతున్నాయి. ఏ ఋతువుకా ఋతువు శోభల్ని వెలారుస్తూ ప్రకృతి తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తున్నది.

శ్రీరఘురాముని, సత్యధర్మ పరాక్రముని – రాజ్యపాలన జనరంజకంగా సాగుతున్నది.

వసంతం ప్రవేశించింది. అనంత సంతోష పారవశ్యంతో స్త్రీ పురుషులు ఆహ్లాదిస్తున్నారు.

జానకీ సతితో వనవిహారంలో వున్నాడు శ్రీరాముడు. వనమానోజ్ఞకత్వాన్ని చూసి మైమరచిపోతున్నది జానకి. రాముడేమో వనంలోని తరువుల్నీ కొమ్మల్నీ రెమ్మల్నీ కేళాకుళుల్నీ కాక, పృధ్వీపుత్రి ఒయ్యారాల్నీ, లావణ్యాన్నీ పరీక్షగా చూడటంలో తన్మయుడవుతున్నాడు.

పక్కకి జరిగి కూచున్నాడు.

జానకి ముగ్ధమోహన లతాంగి. శలాకరెమ్మ కాస్తా ఇప్పుడు భామినిగా శరీర సౌష్టవ విశేషాల్లో బరువూ, మెరుపూ దీప్తివంతమవుతున్నాయి. ‘‘దేవి వారి అంగాంగ వస్తు వితతిలో కొంచెం మాకు బహూకరించకూడదూ?’’ అన్నాడు రాముడు. దరహాసద్యుతి వెన్నెలలా విరిసింది – సీత నెమ్మోముపైన. పలుకు రాలేదు. క్రీగంటిచూపులో శతకోటి సరయూ తరంగాలు!

భర్త మధుర భాషణం సీత మనసున సహజానురాగాన్ని ఒలికిస్తున్నది. మరుతూపులు తాకి చూపులు స్వాగతిస్తున్నాయి. రాముడు మరికొంత దగ్గఱయి వెట్టకూర్చాడామెకు. పలుకుసాగుతుండగానే, చేరువలో దూరం తరిగింది. లజ్జావనతయైన ఆమె మోము నెత్తి, మోవినాని, కౌగిటజేర్చి నవ్వేడు. రెప్పల అలతి కదలికతో ప్రతిస్పందించింది రామపత్ని!

‘ఇన్ని సంభవాలు జరిగినా, ఇన్నిన్ని సంఘటనల సెగ రగిలినా, ఈమె తారుణ్యం పెళ్ళినాటి లావణ్యాన్ని ఈనాటికీ బహుళంగా మంగళప్రదం చేస్తున్నది’ అనిపించింది రాఘవునికి.

ఆమె చెవిలో అదే ఊసులాడేడు. “ఈ శృంగారప్రావీణ్యానికి మీ రాలచ్చి అసూయ చెందుతుంది దాశరథిగారూ” అని కిలకిలా నవ్వింది అవనిజ. (రాలచ్చి = రాజ్యలక్ష్మి)

సరసాలాపం సాగరాగాంబుధిలో ఓలలాడారు సీతారాములు.

వనపాలకులెవ్వరో ఇద్దరు దూరంగా నిలబడి భయం భయంగా వీరివైపు చూస్తుండటం గమనించాడు రాముడు.

సీతకు ఒకింత పక్కకి జరిగి వారిని రమ్మని సైగ చేశాడు. వచ్చారు. తమ చేతుల్లోని చిన్న పాత్రల్ని అందించారు. పరిశుద్ధమైన మైరేయకమనే మధువు అది. వారిద్దరూ వెనుదిరిగి వెళ్ళిపోయారు. (అది పెద్ద ఉసిరి, బెల్లము, ఇప్పరసము వంటి పదార్థాలతో తయారు చేసినది.)

శ్రీరఘువీరశేఖరుడు మైరేయకలశాన్ని వైదేహికి ‘‘దేవి వారి కోసం ప్రత్యేకంగా చేయించారు. స్వీకరించండి’’ అని నవ్వుతూ అందించాడు. తానూ తీసుకున్నాడు. సీత ఒకటి రెండు గుటకలు వేసింది. వెంటనే ఓకరింపుతో వమనం చేసింది. ముఖకవళికలు మారేయి. రాముడు కళవళపడ్డాడు. ఉమ్మి ఉమ్మి తెమల్చుకుని నిదానంగా నిబ్బరించుకున్నది సీత. లేచి నిలబడి, ‘‘మరేం భయంలేదు..’’ అని ‘‘వెళ్దాం’’ అన్నది. భార్యని పొదివిపట్టుకుని అడుగులు వేయించాడు సీతాపతి. వనవిహారం ఇలా ముగిసింది!

మందిరానికి వచ్చారు. ఆమె తన ప్రియసఖి చేత నిమ్మపండు తెప్పించుకున్నది!!

***

రోజులు వెనక్కు వెళుతున్నాయి. ప్రణయసరసాల్లాపాలతో, అలకలతో, కినుకలతో, కలయికతో, వనవిహారాలతో, జలక్రీడలతో – సీతారాముల వైవాహిక జీవనకేళి ఆనందమయంగా సాగుతున్నది.

‘‘ఈ లీల రేలు భూమి

నేలుచు, బగలెల్ల భూమి నేలుచు, ధర్మ

శ్రీలోలుండై, యేక

స్త్రీ లోలుండనగ బతి ప్రసిద్ధి వహించెన్‌!’’

అన్నాడు మహాకవి -కంకటి పాపరాజు

అవనిజ గర్భవతి అయింది. సిగ్గుపడుతూ భర్తకు ఆ శుభవార్త చెబితే, ‘నాకు తెలుసు’ అని అక్కున చేర్చుకొని, చెక్కిలిని చుంబించాడు. వనవిహారంలోని సంఘటనని గుర్తుచేసి, ‘‘నీవు నిమ్మపండుని కోరినప్పుడే, నీ – నా అరచేతులకు సంతానం ఉసిరికలా అందబోతున్నదని అర్థమైంది’’ అన్నాడు. ‘‘అమ్మ.. దొంగా’’లతో సరాగం సాగింది. ఆ రాగ ప్రస్తారం రాచలోగిళ్ళకు చేరింది.

సీతకు కావలసిన ముద్దుముచ్చటలు ముమ్మరంగా జరిగేయి, జరిపేరు – అత్తలందరూ, శాంత వంటి బంధువులూ, బలగం!

ఒకనాడు, కేళీలోలత్వం, ఇద్దరి భాషణలో మొగ్గ దొడిగింది. ‘సై అంటే సై’ అనుకుంటూ, నర్మగర్భపు వాక్కులతో సిద్ధమైనారు. పాచికలాట సాగింది. సాగి, సాగి ఆగింది. సీతాదేవి పందెపుటాటలో గెలిచింది. ‘భార్యాదిచ్ఛేత్‌ పరాజయమ్‌’ అని నవ్వుతూ, ‘‘ఏమి కావాలో అడుగు జానకీ’’ అన్నాడు దశరథ నందనుడు.

క్షణంసేపు సీత రాముని ముఖంలోకి తదేకంగా చూసి, ‘‘తపోవనాని పుణ్యాని ద్రష్టుమిచ్ఛామి రాఘవ’ – పుణ్యప్రదాలైన తపోవనాల్ని చూడాలని నా కోరిక’’ అని ‘‘గంగాతీర వాసులైన ఋషిబృందం పాదాలవద్ద ఒకరాత్రి గడిపి వద్దామనిపిస్తున్నది’’ అన్నది.

రాముడు సంతోషంగా ఆమెను సమీపించి ‘‘తప్పకుండా వెళ్దువుగాని. శుభప్రదమైన వాంఛితం’’ అన్నాడు.

ఆమె కనుచికిలింపుతో తన సంతృప్తిని తెలిపింది.

రాముడు ఆ మందిరం నుండి వేరే కక్ష్యలోనికి నడిచాడు.

సీతపై లోకాపవాదం – సీతా పరిత్యాగం:

ప్రముఖంగా ముగ్గురు సోదరులతో, అష్టమంత్రులతో రాజ్యపాలన చేస్తున్నాడు రాఘవుడు.

అప్పుడప్పుడు ఆయనలోని హాస్యప్రియత్వం ‘నేనున్నానంటుంది’.

ఇవ్వాళ అలా అన్నది.

‘‘సరే.. మిత్రుల్ని రావించండి’’ అని అనుజ్ఞనిచ్చాడు మంత్రులకు.

వారంతా వచ్చి మందిరంలో కూర్చుని వున్నారు. ఎవరువారు? అందరూ హాస్యకారులు.

విజయుడు, మదుమత్తుడు, కాశ్యపుడు, కులుడు, మంగలుడు, సురాజి, కాలియుడు, దంతవక్త్రుడు, సుమాంగధుడు. వీరందరికంటే మహారాజు పీఠానికి సమీపంగా భద్రుడు. అందరూ ఉత్సాహంగా సంభాషించుకొంటున్నారు.

కౌసల్య ప్రియకుమారుడు – దాశరథి- మందిర ప్రవేశం చేశాడు.

అందరూ వందనాలు చేశారు. చిరునవ్వుతో హర్షామోదాన్ని తెలిపి తను ఆసనాధిష్టుడైనాడు రాముడు.

కుశల ప్రశ్నలూ, పరామర్శలూ అయినాయి. ఒక్కొక్కరూ తమతమ ప్రాంతం విశేషాలూ, పౌరజన సంతోషం వ్యక్తం చేశారు. రామరాజ్యానికి ప్రశంసలే, ప్రశంసలు.

రామమూర్తి విన్నాడు. తల పంకించాడు.

‘‘భద్రా, నీవు రాజ్యంలో ప్రజలు అనుకుంటున్న శుభాశుభవిషయాలన్నీ చెప్పు. ప్రియవచనాభిలాషి మాత్రమే కాకూడదు కదా – పాలకుడు? నిర్భయంగా, నిస్సందేహంగా – విన్నది విన్నట్టు, చూసింది చూసినట్టు చెప్పు. వాస్తవం కావాలి. దాని ఆధారంతో కావలసిన మార్పుల్ని చేసుకోవచ్చు. ప్రజలకు ఇతోధికంగా సుఖసంతోషాల్ని సమకూర్చవచ్చు’’

రామభద్రునికి కైమోడ్చి, నిదానంగా చెప్పసాగేడు భద్రుడు, ‘‘సేతుబంధనం, లంకా విజయం గురించి జనమంతా ప్రతిచోటా పదేపదే ప్రస్తావించుకొని రామ విక్రమాన్ని శ్లాఘిస్తున్నారు ప్రభూ! అయితే..’’ అని ఆగేడు. మిత్రులంతా ఆయన వైపు ఉత్కంఠతో చూశారు.

‘‘అయితే..? చెప్పు భద్రా! వాస్తవం ఏదైనా నేను నిన్నేమీ నిందించకుండా వింటాను’’ అన్నాడు రాముడు, భద్రునికి శ్వాసనూదుతూ.

‘‘రాముడు రావణుని సంహరించి, ఆ రావణస్పర్శతో అపహృతయైన సీతను తెచ్చుకుని ఏలుకుంటున్నాడు. రావణుడు బలవంతంగా ఆమెను పట్టుకుని, తన ఒడినిడుకుని, లంకకు తీసుకుపోయి, రాక్షసస్త్రీ సమూహం మధ్యలో కూర్చోబెట్టాడు. అలాంటి సీతను ఇంటికి తెచ్చుకున్నాడు. ఆమెతో సమాగమం వలన సుఖాన్నెట్లా పొందగలుగుతున్నాడో. ఇకముందు మనం కూడా మన భార్యల తప్పుల్ని ఇలాగే ఉపేక్షించి ఏలుకోవాలేమో? ఎందుకంటే ‘యథారాజా, తథాప్రజ’ అని లోకశ్రుతి కదా’’

ఇంతా చెప్పి, భద్రుడు చేతులు కట్టుకొని కూర్చున్నాడు.

రాముని మనస్సంతా కలచినట్లయింది. మిత్రమండలి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు.

వారంతా తలలు ఆడిస్తూ, ‘‘అవును ఇతడు చెప్పినదంతా సత్యమే ప్రభూ. మేమూ అక్కడక్కడా ఈ భాషణం విన్నాము’’ అన్నారు.

మందిరంలో గాలి స్తంభించింది.

మౌనమూర్తిగా చేసన్నతో మిత్రులందరికీ సెలవు చెప్పేడు రాముడు.

పరిచారకుని పిలిచి సోదరులు ముగ్గుర్నీ ఉన్నవారిని ఉన్నట్టు, సత్వరం రమ్మని కబురు పంపేడు.

– వచ్చారు ముగ్గురూ. అన్నను చూశారు.

రాముని ముఖం విషణ్ణంగా వుంది. వారిలో వారు మొహమొహాలు చూసుకున్నారు. చేసైగతో వారిని కూర్చోమన్నాడు రాముడు. కూర్చున్నారు.

అన్నగారి మనస్సు వ్యాకులంగా వున్నది అని గ్రహించారు. కారణం అన్నగారు పిలిస్తే తాము వస్తే ఆయన స్వాగతించే తీరువేరు. ప్రసన్న వదనంతో మృదుపలుకుతో ‘రండి తమ్ముళ్ళూ’ అనో లేక ‘రా భరతా’ అనో ‘రా సౌమిత్రీ’ లేక ‘రా రిపుఘ్నూ’ అనో చేయి సాచేవాడు.

సరే. మందిరం నిశ్శబ్దంలో మునిగింది.

చాలా సమయం గడిచింది.

రాముడు చెప్పసాగేడు, ‘‘మీకు తెలిసిందో, లేదో – మీ వదిన గురించీ, నా గురించీ పౌర జానపదుల్లో ఒక అపవాదు వచ్చింది’’

తమ్ములు నిశ్చేష్టులైనారు. ‘‘అది నా మనసును కలచి వేస్తున్నది. నేను పుట్టింది ఇక్ష్వాకువంశంలో. వైదేహి కూడా మహాత్ములైన జనకుల వంశంలో జన్మించింది కదా’’ అంటుంటే స్వరం గద్గదికమైంది.

ఉత్కంఠగా వున్నది రాఘవులకు. తర్వాత తెప్పిరిల్లి రాఘవుడు జనాపవాదాన్ని విడమరిచి చెప్పాడు.

అప్పుడు లక్ష్మణుని ఉద్దేశించి, ‘‘లక్ష్మణా నీకు తెలుసుగదా – సీత అగ్ని ప్రవేశ ఘటన. ప్రత్యక్షసాక్షివి కదా. ఇక నా విషయం, సీత విషయం మీకు చెప్పనవసరం లేదు కదా. అయినా, లోకులు భిన్నభిన్న అభిప్రాయాలు కలవారు కదా’’ అని ‘‘ఈ భూమి మీద ఏ వ్యక్తి అపకీర్తి ఎంతకాలం పర్యాప్తిలో ఉంటుందో అంతకాలం అతడు నరకంలో పడి వుంటాడు. అందుకనే..’’ అంటూ క్షణం ఆగి అన్నాడు, ‘‘లక్ష్మణా! రేపు ప్రాతఃకాలంలో సుమంత్రుని రథంపై నువ్వే సీతను తీసుకొని వెళ్ళి – గంగకు ఆవలి ఒడ్డున తమసా తీరంలో వున్న వాల్మీకి ఆశ్రమ ప్రాంతంలో విడిచి శీఘ్రంగా వెనుతిరిగి వచ్చేయాలి. ఇది నా ఆజ్ఞ. సీత విషయంలో నా నిర్ణయానికి ఎవ్వరూ అడ్డుచెప్పకూడదు, నా పాదాల మీద, జీవితం మీద ఒట్టు ’’ అని ముగించాడు.

స్వరం సుస్థిరంగా వున్నది. తమ్ములు ముగ్గురూ నిర్విణ్ణులైనారు.

నోటమాట రాలేదు. కళ్ళల్లో నీరు తిరిగింది.

మౌనంగానే లేచి నిలబడ్డారు.

రాముడు తనకు తాను చెప్పుకుంటున్నట్టు పైకే అన్నాడు, ‘‘సీత తనకు ముని ఆశ్రమాల్ని చూడాలని కోరికగా వుందని అడిగింది. ఆమె కోరిక కూడా ఈ రూపంలో తీరుతుంది’’

లక్ష్మణుడు మనసులో అనుకున్నాడు, ‘‘ఈ రాముడిప్పుడు నూతన ప్రభువు, నూతన భర్త’’ అని.

***

రాత్రి గడుస్తున్నది.

ఇక్కడ లక్ష్మణుడు మథనపడుతున్నాడు. ఎందుకిలా జరిగింది? ఆనాడు దేవతల సన్నిధిలో, ఋషీశ్వరులు అందరుండగా, సూర్యచంద్రులు కూడా సీత పాపములేనిది, పరమపావని అని వక్కాణించారుకదా.

‘‘అగ్ని పునీత సీత గురించి – అసలు ఇలాంటి జనాపవాదం తగునా అని కాదు ప్రశ్న. ఎలా ఆవిర్భవిస్తాయి ఇలాంటి వదంతులు? – అని నా విచారం, వ్యథ’’ అని భార్య ఊర్మిళతో తన సంవేదనని పంచుకున్నాడు.

ఆమె గంభీర హృదయ. తత్త్వవేత్త. ‘‘లోకులకు తెలిసింది సాధారణ ధర్మమే కదా స్వామీ. శాశ్వత సత్యాన్నిగానీ, ధర్మసూక్ష్మాల్ని గానీ వారు తెలుసుకోలేరు. ‘అజ్ఞానులు కొందరెప్పుడపహాస్యము బూనెద’రని మీకూ తెలుసుకదా. కానీండు. రాజాజ్ఞ అనుల్లంఘనీయం కదా – మీకూ, నాకూ ఎవరికైనా! ఇంతకీ మా అక్క దురదృష్టవంతురాలు. పైగా ఉత్తమనిషి కూడా కాదు. మళ్లీ పరీక్షాకాలం ఇది ఆమెకు.’’

‘‘మనకు అనుభవకాలం’’ అన్నాడు లక్ష్మణుడు.

మౌనం వహించింది లక్ష్మణుడూ అంతర్ముఖీనుడైనాడు.

చాలాసేపటికి తేరుకొని ఊర్మిళే అన్నది, ‘‘తెల్లవారుతూనే మీ ప్రయాణం. నిద్ర పట్టించుకొని అంతో ఇంతో విశ్రాంతి తీసుకోండి’’ అన్నది.

తల పంకించి లేచాడు లక్ష్మణుడు.

***

ఇక్కడ –

తన ఏకాంత మందిరంలో శ్రీరాముడు. ఒక ప్రత్యేక విభాగంలో-

నిద్రేం వస్తుంది?

భద్రుని వాక్యాలూ, దుర్ముఖుని, ఇతర మిత్రుల నిర్థారణ పదే పదే మనసును రాపు చేస్తున్నాయి.

‘‘సీత పరిశుద్ధురాలని నా అంతరాత్మకు తెలుసు. అగ్నిదేవునకు తెలుసు. దేవాదులకు తెలుసు. అంతకంటే మిన్నగా లంకలోని రాక్షసీ గణానికి తెలుసు. త్రిజటలాంటి నిష్కల్మష హృదయులకు తెలుసు. కానీ, ప్రజల మనసుకు వేరు భావన పొడమింది. లౌకికులైన సామాన్యులకు నరంలేని నాలుకలమీది మాటలు వాక్యాలై ప్రసారమై, ప్రచారమవుతాయి. భవ్యమహర్షులైన వారికి, మాన్యులగు విజ్ఞులకు వాక్కు సర్వార్థచన్ద్రికగా ప్రసరమౌతుంది. ఏది ఏమైనా, ప్రజల మాటను మన్నించవలసిన సందర్భంలో ఏ సౌఖ్యాన్నయినా, స్నేహాన్నయినా, తుదకు జానకినే అయినా, ధర్మ పరిరక్షణకోసం విడిచిపెడతాననే ప్రతిజ్ఞని నేను ఎన్నడో చేశాను. కనుక, జానకి విషయంలో ఈ విషమస్థితికి ధర్మాచరణమే శరణ్యం. ప్రేమానురాగాలూ, బంధం ఆ తర్వాతివే. తప్పదు. విధి అనుల్లంఘనీయం – రాముడికైనా!’’

తన మనసుకు తాను ఇంత నివేదించుకొన్న తర్వాత కొంత స్వస్థుడైనాడు రాముడు.

రాత్రి మూడవజాము జరుగుతోంది!!

***

తెల్లవారింది. రామునికీ, లక్ష్మణునికీ, సీతకూ, వీరితోపాటు సుమంత్రునకూ అది దుర్దినమే.

సుమంత్రుడు రథాన్ని సిద్ధంచేసి తెచ్చాడు.

లక్ష్మణుడు వదినగారి మందిరానికి వెళ్లి రామాజ్ఞని చెప్పాడు. ఆ చెప్పటంలో గొంతు వణికింది. “ముని ఆశ్రమాలు దర్శిస్తానని అన్నగారిని అడిగావట. నన్ను ఆ పనికి ఆజ్ఞాపించారు. రథం సిద్ధం” అన్నాడు.

ఆమె చాలా సంతోషంతో త్వరత్వరగా సిద్ధమైంది. మునులకు, తపస్వినులకూ తానుగా ఇవ్వదలచిన కానుకలన్నిటిని తీసుకుని బయల్దేరింది.

తీరా రథాన్ని సమీపిస్తుంటే ఆమెకు కుడికన్ను అదరసాగింది. దేహం కంపించింది. హృదయం కూడా అస్వస్థంగా వున్నట్టనిపించింది.

చెప్పింది లక్ష్మణునికి ‘‘అంతా సవ్యంగా వున్నది కదా లక్ష్మణా. రాచవారందరూ కుశలం కదా?’’ అని విచారణ చేసింది.

మౌనగంభీరంగా అతడు తలపంకించాడు.

ఆమె రథాన్ని ఎక్కింది. ప్రయాణం సాగింది. గంగాతీరం చేరేరు. సీత రథాన్ని దిగి, గంగాజలాన్ని స్వీకరించి, సంతోషంతో గంగకు తన మనసును విప్పి, కోరికను నివేదించుకున్నది. గంగ ‘సుపుత్రా ప్రాప్తిరస్తు’ అని దీవిస్తున్న భావన కలిగి, సిగ్గిలి, ఆనందించింది.

సుమంత్రుని అక్కడ వుండమని ఆదేశించి, సీతను నావలో ఎక్కమన్నాడు లక్ష్మణుడు. ఆమె ఎక్కింది. తాను ప్రవేశించాడు. నావ తమసా తీరం చేరింది. దిగేరు. క్షణంసేపు నిలబడి నదీతీరం ప్రశాంతతని ఆహ్లాదించింది సీత. వెనకకు తిరిగి చూస్తే, లక్ష్మణుడు కన్నీటితో, ఉద్వేగంతో, విచారగ్రస్తుడై కనిపించాడు.

సీత నివ్వెరపోయింది. “ఏమైంది లక్ష్మణా! ఏమిటీ కన్నీరు? దేనికో వ్యథ చెందుతున్నావు. కారణం చెప్పు’’ అని సౌమ్యంగా ప్రశ్నించింది.

లక్ష్మణుడు బాధని దాచలేకపోయాడు. కన్నీరు వెనుక ఏడుపు పైకి పొంగింది.

సీత మాన్ప్రడి ‘‘చెప్పు లక్ష్మణా! ఏమి అన్నగారిని చూడకుండా వుండాల్సి వస్తున్నదని బాధా?’’ అని ‘‘సరే.. నేను ఒక్కరాత్రి మాత్రమే వాల్మీకి ఆశ్రమంలో వుండి వచ్చేస్తాను. సరేనా?’’ అన్నది పెద్దరికమూ, తల్లి మనసూ ధ్వనింపజేస్తూ.

ఇంక, లక్ష్మణుడు నిబ్బరించుకోలేకపోయాడు. ఏడుస్తూనే – ‘‘ఇంత దూరం తెచ్చి చెప్పకపోవటం ఎలా తల్లీ. దురాలోచనాపరులు రావణుని స్పర్శ తగిలి, వాడి వనంలో వుండి వచ్చిన సీతను రాముడు మోహంతో ఏలుకుంటున్నాడు. రాజుగా ఆయనే ఇలా ధర్మం తప్పితే, ఇక మనవంటి సామాన్యులూ అలాగే కాపురాలు చేయవచ్చని చెప్పినట్లే కదా’’ అని అపవాదు వేశారమ్మా! అగ్నిపునీతయైన నిన్ను ఇలా కానలపాలు చేస్తున్నాడు ప్రభువు. ఆ ప్రభువే నాకు ఈ శిక్ష విధించాడు – నిన్న ఇక్కడ దించి రమ్మని! నావంటి మందభాగ్యుడిని విధి ఏవిధంగా సృష్టించాడో తల్లీ’’ అని పాదాలబడి విలపించాడు.

పిడుగు పాటుకు గురియైనట్టు వణికింది సీత. నిలువునా నీరయిపోయింది. తూలి, కూలి నేలమీద కూర్చుంది.

క్షణాల తర్వాత, గొంతు పెకల్చుకుని, ‘‘మీ అన్నగారు ఇంతటి కఠోర నిర్ణయం తీసుకున్నారా? నిజమేనా? నీవేమీ పొరపాటున వినలేదు కదా?’’ అని వ్యథ చెందింది. ‘‘ఇదంతా సరేనయ్యా. రాఘవుల చిత్తం స్వస్థంగా వున్నదా – అసలు. విషయం ఇంత దుర్భరమైనది అయితే, నన్ను పిలిచి చెప్పవచ్చును కదా. ఈ దొంగవేటు ఎందుకు?’’

ఠక్కున తలయెత్తి వదినగారిని చూశాడు లక్ష్మణుడు. ఎంతమాట – ‘దొంగవేటు’ అవును. ఆమె దుఃఖానికి తగిన మాట. గుండెమంట ఎగసినప్పుడు పలుకు పదునుదేరుతుంది! సహజం!

సీత తన మనసులోని మాటల్ని చాలా విధాలుగా ప్రవహింపజేసింది.

మౌనశ్రోతగా లక్ష్మణుడు.

కొంతతడవు ఆగి, ‘‘సతి పరుని ఇంట వున్నదనే మాట మాత్రమే ప్రజలకు పాకింది. అది పిచ్చికుక్కకాటు వంటిది తల్లీ. ఆ విషం చకచకా ఎల్లెడలా వ్యాపించింది’’ అన్నాడు డగ్గుత్తికతో. ‘‘లోకాలన్నీ సీతాసతి వలన పావనమైతే, ప్రజల నింద మీపాలిట అపావనమై క్రమ్మింది’’ అనీ అన్నాడు.

సీత వాస్తవస్పృహలోకి తేరుకుని, ‘‘ఇదంతా సరే లక్ష్మణా! భర్తృపరిత్యాగిగా రేపు ముని ముఖ్యులకూ, తపస్వినులకూ నా మొహాన్ని ఎలా చూపను’’ అని తన అడకత్తెరలో – పోక స్థితిని తలచి దుఃఖించింది.

‘‘సరే. విచారంతో పల్కినవన్నీ మర్చిపో. నీవిక అయోధ్యకు వెళ్లు. వెళ్లి అందరినీ పేరుపేరునా అడిగినానని చెప్పు. మీ అన్నగారిని – ప్రజల్నీ, బంధువుల్నీ చక్కగా శ్రేయోదాయకంగా పాలించమన్నానని విన్నవించు. నా చిత్తం రామాయత్తమై వుంటుందని చెప్పు. మనవారందరినీ నన్ను మరచిపోవద్దని వేడుకున్నానని చెప్పు’’ అన్నది.

ఆమెకు ఏడుపు బుగ్గ పొంగింది.

లక్ష్మణుడికి మాట రావటం లేదు, వెనుకకు మరలటానికి కాళ్ళూ రావటం లేదు.

దిక్కులు చూస్తూ నిలిచి నిముషాల తర్వాత ‘‘తల్లీ! నాకు సెలవు. అలతిదూరంలోనే వాల్మీకి ఆశ్రమం. అరుగో ఇద్దరు ముగ్గురు మునిబాలకులు ఈ వైపు వస్తున్నారు. వారు నిన్ను వాల్మీకి కడుకు చేరుస్తారు. ఆయనే నీకు రక్ష!’’ అన్నాడు.

క్షణాల తర్వాత ఆమెకు ప్రదక్షిణ చేసి, శోకభారంతో, గబగబా అడుగులు వేస్తూ తిరిగి వెళ్ళి నావను ఎక్కేశాడు.

ఆవలితీరం చేరి సుమంత్రుని రథంలోకి చేరేడు.

మునిబాలకులు:

సీతను చూసి, ఆమె ఆహార్యాన్నీ, వాలకాన్నీ చూసి శీఘ్రంగా వెళ్ళి వాల్మీకికీ వార్తని తెలియజేశారు.

వాల్మీకి మహర్షి బ్రహ్మ వాక్ప్రసాదితుడు. ఆయనకు భూత వర్తమాన భవిష్యత్తులు తెలుసు. తన దివ్యదృష్టితో గ్రహించాడు. ఆమె ఎవరో తెలుసు. వెంటనే అర్ఘ్యంతో ఆమె వున్న స్థలానికి వచ్చేశాడు. పక్కన శిష్యులూ, మునిపత్నులూ.

సీతకు అర్ఘ్యమిచ్చి, ఆమె గాథనంతా తానే చెప్పాడు. ఊరడించాడు. ఆశ్రమానికి తీసుకొని వచ్చి తపస్వినులకు ఒప్పజెప్పాడు. “ఇక్కడ నీకు సుఖంగా వుంటుంది. వీరంతా నీకు కావలసినవన్నీ అమరుస్తారు” అని నెనరుతో చెప్పాడు.

సీతకు ఇప్పుడు మరో వనవాసం ప్రారంభమైంది!

(సశేషం)

Exit mobile version