[అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కవితని అందిస్తున్నారు డా. కె.ఎల్.వి. ప్రసాద్]
అవును..
వాళ్లిద్దరూ అంతే!
వాళ్లిద్దరికీ
నేను ఎంత ఇష్టమైన
వాడినో..!
నన్ను వాళ్లు
అసలు కష్టపడనివ్వరు
నేను బాధపడుతుంటే
అసలు ఓర్చుకోలేరు!
నా ఇష్టాలనే
వాళ్ల ఇష్టాలుగా
మార్చుకుంటారు!
నా ఆనందమే
వాళ్ల పరమానందంగా
భావిస్తారు..!
వాళ్లిద్దరి ప్రేమలో
నేను..
తడిసిముద్దయ్ –
పోతుంటాను..!
నా బ్రతుకంతా
ఇలా వారిద్దరి ప్రేమతో
సాగిపోవాలని కోరుకుంటా ,
వాళ్లకు సుఖమయ జీవితం
ఇవ్వాలని
ఆ దేవుడిని వేడుకుంటా..
ఇంతకీ..
ఆ ఇద్దరు ప్రేమమూర్తులూ
ఎవరంటా.. ఇంకెవరు.
ఒకరు నా సతీమణి..!
తర్వాత ఎవరుంటారు..
నా.. కూతురే..!!

వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.