[బాలబాలికల కోసం ‘వానా వానా వల్లప్పా’ అనే చిన్న కథని అందిస్తున్నారు శ్రీమతి పి.యస్.యమ్. లక్ష్మి.]
బయట వాతావరణం చల్లగా వుంది. వాన కురిసేటట్లు వుంది. ఆకాశంలో మెరుపులు విద్యుత్ తీగలలా మెరుస్తున్నాయి. అప్పుడప్పుడూ ఉరుములు కూడా మేమూ వున్నాము అన్నట్లు భీకరంగా అరవటానికి ప్రయత్నిస్తున్నాయి.
బాల్కనీలో నుంచుని ఆకాశాన్ని చూస్తున్న ఐదేళ్ళ వాన్య పరుగు పరుగున ఇంట్లోకి వస్తూ “ఐ యామ్ స్కేర్డ్” అని భయంగా తిరిగి తిరిగి అనటంతో నాన్నమ్మ దగ్గరకి తీసుకుని “ఎందుకు నాన్నా, ఏమైంది?” అని అడిగింది అచ్చ తెలుగులో.
మాతృభాష మమకారం పెద్దలకి ఎక్కువే. కానీ పాపకి అర్ధం కావాలని ఇంగ్లీష్‌లో ముందు చెప్పి, తర్వాత తెలుగులో చెప్తుంది. దానికి తెలుగు రాకపోతే మరి తను కథలు చెప్పటం ఎలా? అది నేర్చుకున్నంత త్వరగా తను వేరే భాషలకి మారిపోలేదు కదా!
స్కూల్ ప్రభావంతో వాన్యకి ఇంగ్లీష్ తొందరగా అర్థమవుతుంది. అంతకు ముందు మహారాష్ట్రలో వుండి రావటం వల్ల మరాఠీ రాలేదు గానీ, అక్కడ స్కూల్ ప్రకారం హిందీ వచ్చింది కొంత. తండ్రి ఉద్యోగం హైదరాబాద్‌కి మారటం వల్ల నెల క్రితం హైదరాబాద్ వచ్చారు.
వాన్యకి వర్షమంటే ఇష్టం. బాల్కలో నుంచుని వాన చినుకులు ముఖం మీద పడుతుంటే ‘మై హైర్, మై ఐస్’ అంటూ వాన పడ్డ చోటంతా చూపిస్తుంది. ‘క్లౌడ్ క్లౌడ్ డిషుం డిషుం ఇన్ స్కై ఎండ్ దేర్ ఈజ్ రైన్’ అంటుంది.
మళ్ళీ వానలోకెళ్ళి తడుస్తూ ‘రైన్ రైన్ గో ఎవే, లిటిల్ జానీ వాంట్స్ టు ప్లే’ అని తనకొచ్చిన రైమ్ పాడసాగింది. అది విన్న నాన్నమ్మ మనసు బాధపడింది. ‘చిన్నప్పుడు వానలో తడుస్తూ ‘వానల్లు కురవాలి వాన దేవుడా, వరిచేలు పండాలి వాన దేవుడా’ అంటూ పాడేవాళ్ళు. ఆ పాట వల్ల వాన వల్ల ఉపయోగం, పంటలు పండటం, చెరువులు నిండటం వగైరాలన్నీ తెలిసేవి. ఈ ఇంగ్లీషు చదువుల వల్ల ఏమి తెలుస్తోంది.. వచ్చే వానని వద్దని చెప్పటం వీళ్ళాడుకోవాలని. అసలు వాన అవసరం వీళ్ళకి తెలుసా? మనిషి జీవితానికి అవసరమైన నీరు లేకపోతే ప్రాణులు ఎక్కడ వుంటారు? చినుకు పడుతూనే ఆచ్ఛాదన కోసం వెతుక్కునే ఈ కాలం మనుషులకి వానలో తడవటంలో సరదా తెలియదు. వానలో తడుస్తూ ఆడుతుంటే ఆ మజానే వేరు కదా.
అయినా వీళ్ళనని ఏం లాభంలే. సిటీల్లో చిన్న వానకైనా రోడ్లమీద పరుగులుతీసే వరద ప్రవాహాలు, రోడ్ల గుంటల్లో నిలిచి ఎవరు వెళ్తున్నా అందరిమీదా చిందే బురద నీళ్ళ చికాకులతో సతమతమయ్యే వీళ్ళకి స్వచ్ఛమైన వాన నీటిలో తడిసే అవకాశం ఎక్కడనుంచి వస్తుంది.
అయినా తనలాంటి అమ్మమ్మలూ, నాన్నమ్మలూ వున్నదెందుకు, వాళ్ళకీ విషయాలూ, వాటితో నేర్చుకునే విజ్ఞానం గురించి చెప్పకపోతే రైన్ రైన్ గో ఎవేలే వస్తాయి. ఆ రైమ్స్ నేర్చుకునే చెట్ల విలువ మర్చిపోయి ప్రకృతిని నాశనం చేస్తున్నారు’ అనుకుంది
నెమ్మదిగా వాన్య దగ్గర చేరి “చిన్నులూ, వాన రాకపోతే నువ్వు రోజూ లాల పోసుకోవటానికి నీళ్ళెక్కడనుంచి వస్తాయమ్మా. మరి కుకింగ్‌కి వాటర్ కావాలి కదా. మరి నువ్వు రోజూ చెట్లకి నీళ్ళు పోస్తావు కదా. నీకు పూలూ, కాయలూ ఇస్తాయి కదా చెట్లు. వాన లేకపోతే వాటికి నీళ్ళెక్కడనుండి వస్తాయి?” అంది.
ఇదివరకు పిల్లలకి మల్లే వీళ్ళకి పంటలూ, చేలూ, అర్ధం కావులే, పల్లెటూరి మొహం చూడలేదు కదా, అని దానికర్ధమయ్యే విషయాలు, అర్ధం అయ్యేటట్లు దాని మాటల్లోనే చెప్పింది నాన్నమ్మ. అయితే వాన్యకి నాన్నమ్మ తప్పు చెబుతోందనే అభిప్రాయం కలిగింది. “యూ ఆర్ టెల్లింగ్ రాంగ్ గ్రాండ్మా. ఇన్ అవర్ స్కూల్ టీచర్ టోల్డ్ లైక్ దిస్ ఓన్లీ” అంటూ తిరిగి వానని చూడటంలో నిమగ్నమయింది.
‘పిల్లలకి చిన్నప్పటినుంచీ అన్నీ చెప్పాలి. అది పెద్దవాళ్ళ బాధ్యత అని చెప్తారు. పెద్దవాళ్ళు ఇలాంటి పిల్లలకి ఏం చెప్తారు, ఎలా చెప్తారు. ఈ తరం పిల్లలలోనే ఈ ధోరణి వున్నదా, సమాజంలో ఉన్నత స్ధాయికోసం ఇంగ్లీషు చదువులంటూ పాకులాడుతున్న పెద్దలదా. తల్లీ, తండ్రీ ఉద్యోగాలతో సతమతమవుతూ పిల్లలని పట్టించుకోవటానికి లేని సమయానిదా తప్పు, న్యూక్లియర్ ఫేమిలీలంటూ అమ్మమ్మా, నాన్నమ్మలని దూరంగా వుంచటమా. మారుతున్న కాలంతో బాటు మారలేక ఇంకా వానా వానా వల్లప్పలనే పిల్లలకి నేర్పించాలనే ముందు తరం వాళ్ళదా’ ఆలోచనలో పడింది నానమ్మ.
శ్రీమతి పులిగడ్డ శ్రీమహలక్ష్మి కథారచయిత్రి, నాటక రచయిత్రి. ఎ.జి. ఆఫీస్, హైదరాబాద్‌లో సీనియర్ ఎకౌంట్స్ ఆఫీసర్‌గా పని చేసి రిటైరయ్యారు. భర్త శ్రీ మానేపల్లి వెంకటేశ్వర్లుతో కలిసి పురాతన ఆలయాలు దర్శించటంలో ఆసక్తి మెండు. ఇప్పటిదాకా 450 పైన వ్యాసాలు, 20 కధలు వివిధ అచ్చు, ఆన్లైన్ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ‘యాత్రా దీపిక’ శీర్షికన 9 పుస్తకాలు వ్రాశారు. వీటిలో 6 పుస్తకాలు అచ్చయినాయి, మిగతావి కినిగె.కామ్‌లో ఈబుక్స్ రూపంలో లభిస్తాయి. నాలుగు నాటికలు వ్రాశారు.. అందులో రెండు.. రెండు హాస్యనాటికలు పేరుతో కినిగెలో ఈబుక్‌గా వచ్చింది.
