పూర్తిగా అలసిపోయి ఇంటికి తిరిగి వచ్చిన అతనికి, రోజూలాగే తండ్రి నోటివెంట వచ్చే ఈసడింపు మాటలు వినవలసి వచ్చింది. పనిపాట లేనివాడు, పనికిరాని వెధవ, తెలివి తక్కువ సన్యాసి, అయోమయం, స్వార్థపరుడు వంటి తిట్లు తినడం అతనికేమీ కొత్త కాదు.
రోజూ వింటున్నా అన్నిటినీ విననట్లే ఊరుకుండిపోయేవాడు. ఇటువంటి ఎన్నో క్షణాలను మర్చిపోవాలనే అతని ప్రయత్నం. గుర్తుంచుకోవడంలో ఔచిత్యం ఏముంటుంది గనక! రోజూ ఇలాంటివి మామూలే! నిజమేమరి! 37 ఏళ్లు నిండినా ఏమీ చెయ్యలేకపోతున్నాడు గనక తండ్రి కోపాన్ని సహించవలసినదే! డబ్బు సంపాదించినా సంపాదించలేకపోయినా అవసరాలు అందరికీ కలుగుతాయి. అలాంటి అవసరాలను గడుపుకునేందుకు తండ్రి ఎదుట చెయ్యి చాపాల్సి వస్తుండడం మినహా మరొక దారిలేదు. కాసేపు ‘కుదరదు – చేతకాదు’ అని తిట్టినా, తండ్రే అవసరానికి ఆదుకుంటాడు. అయితే తనే, ఆ డబ్బునేమీ సరియైన విధంగా ఉపయోగించుకోలేకపోతున్నాడు. నిన్నటికి నిన్నటి మాటే తల్చుకుంటే, తను పంతంపట్టి, వాదించి మరీ తండ్రి నుంచి 5000 రూపాయలు తీసుకున్నాడు. తన స్నేహితుడు ఒకడు పేరున్న పెద్ద హోటల్లో కుక్‌గా కొలువు కుదురుస్తానని తనకు మాట ఇచ్చాడని! తండ్రి తన చేతుల్లో డబ్బుంచుతూ ప్రతిసారిలాగే ఈసారీ, ఇదే ఆఖరు సహాయంగా భావించుమని, భవిష్యత్తులో తన నుండి ఏమీ ఆశించవద్దన్న వార్నింగు కూడా ఇచ్చాడు.
సౌరభ్‌కు కూడా బాగా తెలుసు, తన తండ్రి ఆర్థికస్థితి ఏమీ బాగులేదని. అటు తిప్పి – ఇటు తిప్పి కేవలం ఆయనకొచ్చే పెన్షను మాత్రమే ఉన్న ఆధారం. అదీ ఒక్కొక్కసారి సమయానికి అందితే మరోసారి ఎన్నో నెలలపాటు ఆగవలసి వచ్చేది. ఆస్తి పేరున ఉన్నదంతా కేవలం ఇల్లు మాత్రమే! దానికీ ఎన్నో మరమత్తులు చేయించాలి. అతడికి ఏ రకమైన అలవాట్లు లేవు. డబ్బును పేటలోగాని, తాగుడు మీదగాని ఖర్చు పెట్టే మనస్తత్వం కాదు. కాని ఆదాయం వచ్చే మార్గాలు కూడా లేకపోవడంతో ఏనాడూ తన తండ్రికి వీసమెత్తు సహాయం చెయ్యలేకపోవటమే కాదు, పైపెచ్చు ఆయనకే భారమయి కూర్చున్నాడతను.
అతడికి తండ్రి అనుభవిస్తున్న బాధ తెలుసు. కాని పంచుకోలేకపోతున్నాడు. ఎన్నో చెయ్యాలనుకున్నా ఏదీ చెయ్యలేకపోయాడు. తండ్రి కడుపు కట్టుకుని మరీ కొంత – కొంత పైకాన్ని దాని ఉంచుతాడు. అవసరానికి ఎవరిముందు చెయ్యిజాచే దుస్థితి కలగకూడదని!
ఈసారి అతడు ఈ ఉద్యోగం వచ్చితీరుతుందని పూర్తిగా నమ్ముకున్నాడు. తన అదృష్టం తనను మోసం చెయ్యదని భావించాడు. అయితే అతడి స్నేహితుడు తన నుండి పుచ్చుకున్న డబ్బును పేకాట – తాగడంలో ఎగరగొట్టేసాడని తెలిసి మాత్రం హతాశుడయ్యాడు. అలాంటివేళ తండ్రి కోపగించుకోవటంలో తప్పేమీలేదు. అందుకే తలవాల్చుకుని మౌనంగా తండ్రి కోపాన్ని, తిట్లను వింటూ ఉండిపోయాడు.
“ఇక ఇంటి ఖర్చులకు కూడా ఇబ్బందే పడాలి. ఎవరెవరి ఎదుట చేయి జాపాలో! భగవంతుడు ఇంకా ఎంత పరీక్షిస్తాడో తెలియదుకదా! ఈ చేతగాని వాడి సహవాసం మంచిది కాదని తెలిసీ ఏ దుర్ముహూర్తంలో నేను ఈ పిచ్చిపని చేశానో కదా!’ అంటూ దుఃఖం నిండిన గొంతుకతో తనని తాను నిందించుకుంటూ తండ్రి రఘునందన మిశ్ర, తలపట్టుకు కూర్చుండిపోయాడు.
చాలా కొద్దిసార్లు మాత్రమే నిద్రిస్తున్న ఆత్మకు ఊపిరి వేడి సోకి అతడు విలవిలలాడే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రోజు కూడా అతడు తనను తాను నిగ్రహించుకుంటూ, మొహం దించుకుని, తిట్లు తింటూ మౌనంగా ఉండిపోయాడు. కాని ‘చేతగానివాడు’, ‘చేతగానివాడు’ అన్న మాటలను విని – విని అతడికి సహనం చచ్చిపోయింది. అందుకే విసుగ్గా, “నాకు మాత్రం తెలుసా అతడు ఇలా మోసం చేస్తాడని” అన్నాడు. “నీ కసలు దేని గురించి తెలుసు? ఈ రోజు వరకూ ఏమైనా చేస్తే కద, నీకు ఏపాటి అయినా లోకజ్ఞానం రావటానికి?” తండ్రి కోపంగా అన్న ఈ మాటల్లో అతని అహం దెబ్బతింది. అందుకే మొండిగా, “నేనేం చెయ్యకపోవచ్చు కాని దానర్థం నేనేమీ తెలియని వాడిని కాదు అని అనుకోవద్దు. ఏం తెలియకుండా, తెలుసుకోకుండా వృథా ప్రయత్నాలు ఏమి చెయ్యటం లేదు. అతడు పని తప్పక చేయించి పెడతానని నమ్మపలికాడు. నేనేం కల గనలేదు కదా, డబ్బులన్ని పేకాటలో ఎగరగొడతాడని?” అని తిరిగి జవాబిచ్చాడు. “నీ స్నేహితుడన్నవాడు తాగుబోతు, పేకాటరాయుడు అని కనీసం నీకు తెలుసుకదా! నువ్వు అలాంటి మనిషిని అసలు ఎలా నమ్మగలిగావు? నీకు బుద్దెప్పుడు వస్తుందో, ఎప్పుడు మనిషివి అవుతావో కదా!”
సౌరభ్ తిరిగి జవాబివ్వటంతో తండ్రి గొంతు కాస్త స్థాయి పెరిగింది. కోపం తారస్థాయికి చేరుకోవడంతో గొంతు కూడా ఎంత పైకి లేచిందంటే, ఇంటి గోడలు, పైకప్పులు కూడా కదిలి లేచిపోతాయనిపించింది. కిటికీల గ్రిల్సుకూడా ధనధనమని కదులుతాయనిపించింది. ఇంట్లోని ప్రతి వస్తువు ముడుచుకుపోయినట్లనిపించింది. అంత గట్టిగా అరవటం ఆయనకు మంచిది కాదు, అందుకే ఇక సౌరభ్ మిన్నకుండిపోయాడు.
ఆయన అన్నదాంట్లో నిజం ఉంది. తాను స్వయంగా కూడా ఆ స్నేహితుడిని ఎంతమాత్రం నమ్మడు. కాని ఉద్యోగం సంపాదించుకోవాలి అన్న ఆశ అతడికి ఇలా డబ్బు ఇచ్చేటట్లు చేసింది. అంతకన్న తను మాత్రం చెయ్యగలిగేదేముంది గనక? ఈ వయసులో ప్రభుత్వ ఉద్యోగం దొరికే అవకాశం ఎంతమాత్రం లేదు. ఏదో ఇలాంటి పనే దొరికించుకుంటే కాస్త ఆసరా లభించి, జీవితమనే బండి పట్టాలమీద కొస్తుందని ఆలోచించాడు. మనుషులు ఒకటి అనుకుంటే, అయ్యేది మరొకటి! సామాన్యుల జీవితాలలో ఎన్నో అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వారికి ఇష్టం లేకపోయినా! దాంతో ఏదో నడిచిపోతూ ఉంటుంది, కాని ఏమాత్రం ఉత్సాహమన్నది లేకుండా, నిరాశలో కూరుకుపోయి!
ఉద్యోగం లేదు, జీవించటానికి ఏ ఉపాయం లేదు, ఎవరికీ నమ్మకం లేదు, అన్నివైపులా ఉన్నది కేవలం అంధకారం మాత్రమే! అదేకదా సమాజవాదం. అందరూ ఒక్కలాగే ఉంటారు – ఇదే ప్రజాస్వామ్యం. చాలా హెచ్చుగా ఉంటుంది. తనూ ఒక స్థిరపడిన జీవితాన్ని నడపాలని కోరుకుంటాడు. తండ్రికి సహాయ పడాలనుకుంటాడు. అందరూ ఆలోచిస్తారు. అతడూ ఆలోచిస్తాడు. అంతే! ఆలోచిస్తూనే ఉండిపోతాడు. అదే లోకమంటే! ఆలోచన ఆలోచనగానే ఉండిపోతుంది తప్ప, ఎన్నటికీ నెరవేరదు. కనీసం ఆలోచనయినా వచ్చిందికదా, ఎందరికో ఆలోచన కూడా అడుగంటి పోతుందంటాడు తండ్రి. అతడికి తండ్రి అర్థం కాడు, తండ్రి తనను అర్థం చేసుకోలేడు. బహుశా భావ వ్యక్తీకరణలోని అవాంఛనీయమైన దూరం కట్టిపడేస్తుందేమోననిపిస్తుంది. అనుకోకుండా జరిగిన తప్పును అతడు తప్పుగా భావించడు. స్నేహితుడు దగా చేస్తే తన దోషం ఎంత? ఇవి అతడి ఉద్దేశాలు, కాని తండ్రి అభిప్రాయం వేరు. అన్ని రకాలుగా విఫలమయిన కొడుకును అర్థం చేసుకోగలిగే శక్తి ఆ తండ్రిలో నశించిపోయింది. ఇక కోపం కట్టలు తెచ్చుకునేందుకు సిద్ధంగా ఉంది. ఇక ఎప్పుడైనా వరదలా వచ్చి ముంచెయ్యవచ్చు. ఆయన క్షణ క్షణం వేడెక్కిపోతున్నారందుకే!
ఈ వేడి భరించలేని వేళ, సౌరభ్ తండ్రి ఎదుట ఉండడు. బహుశా తను కనిపించకపోతే ఆయన క్రోధాగ్ని చల్లారుతుందేమోనని ఆశ! వాస్తవానికి వైఫల్యమనే జ్వరం మహా బాధిస్తుంది. తండ్రి కేవలం అతడి వైఫల్యానికి మాత్రమే దుఃఖించటం లేదు. తనపట్ల తనకే మహావిసుగుగా అసహ్యించుకుంటున్నట్లు అనిపిస్తోందాయనకు. కొడుకు చేతకానివాడు కావటంతో సమాజంలో పరువు ఏం మిగులుతుంది? కొన్నిటిని బైటకు కొందరు అంటారు, మరో కొన్ని అనకుండానే అన్నట్లు అనిపింపచేస్తారు. సంఘంలో ఈ పద్ధతి ఎప్పటినుండో వస్తోంది. ఎవరూ తమ సరుకు మంచిది కాదనరు కదా! కొందరు మరొకరి జీవితాలను భోగి మంటలను ఎగసం తొయ్యటంలో సంతోషం పొందుతారు. పరువు – ప్రతిష్ఠ, గౌరవ – మర్యాదలు, వైఫల్యాలు, నిస్సహాతల కలగలుపుతో రాజుకుంటున్న అగ్ని, ఒక్కసారి మండటం మొదలెడితే, అతికష్టం మీదగాని శాంతించదు. ఇవాళ ఈ అగ్ని మహాత్రీవంగా ఉంది.
సౌరభ్ ఎన్నోసార్లు అనుకుంటాడు – మాకు కూడా ఎవ్వరి ఎదుటా చెయ్యి జాచనవసరం లేకుండా బోల్డంత డబ్బు ఎందుకు సమకూరదు? అని ఆలోచిస్తూ – ఆలోచిస్తూ అతడొక కలలోకి జారుకుంటాడు. అతడికి అపారమైన ధనం లభించింది. ఒకసారి లాటరీ రూపంలో తగులుతే, మరోసారి ఎక్కడో పాతిపెట్టిన లంకెబిందెల రూపంలో అప్పుడు తనవద్ద అన్ని సౌకర్యాలు సమకూరుతాయి. నౌకర్లు – చాకర్లు, కార్లు, బంగళాలు, ఎప్పటినుండో పొందాలని ఆశపడుతున్న అన్ని సదుపాయాలు, విలాసవంతమైన సామాగ్రి వచ్చి చేరుతుంది. పెద్ద క్లబ్బులకు వెళ్తాడు. తల్లి – తండ్రులను తీర్థయాత్రకు తీసుకువెళ్తాడు. హిల్ స్టేషన్లకు తిప్పుతాడు. తండ్రి ఎంతో గర్వంగా “అబ్బాయి! నువ్వు నా కోరికలన్నీ తీర్చేవురా!” అంటాడు. తాను సగర్వంగా వారినుండి సెలవు తీసుకుని పెద్ద ఓడలాంటి కార్లో కూర్చుని ఆఫీసుకెళ్తాడు.
సాయంత్రం అలసిపోయి ఇంటికొచ్చి, ఎవరో స్నేహితుని ఇంట్లో డిన్నరు చేసి వచ్చానని చెప్తే భార్య చిరుకోపంతో, “ఇంత ఆలస్యంగా రావటం, అదీ భోజనం కానిచ్చివచ్చారా? మీకు తెలుసా ఇంట్లో ఎవ్వరూ ఇంకా భోజనం చెయ్యకుండా మీకోసం ఎదురు చూస్తున్నారని!” అంటుంది. ఇంట్లో అందరినీ పేరు – పేరునా క్షమించమని కోరుకుంటాడు. ఇంట్లో వాళ్లు కూడా మహాగర్వంగా ఇంత గొప్పవాడు ఎంతమందిని సంతృప్తి పరచగలడనుకుంటూ అతడిని క్షమింపచేస్తారు. అతడి ఉదయం ఒక కప్పు స్ట్రాంగు టీతో మొదలవుతే, రాత్రి కుటుంబ సభ్యులంతా టీవి సీరియళ్ళు చూస్తూ వాటిని గురించి చర్చించుకున్న తరవాతే ఎవరి గదుల్లోకి వారు పడుకునేందుకు వెళ్లాకే రోజు ముగుస్తుంది.
కాని, కోడి కూతతో అతడి ఈ కలల మేడలన్నీ దబదబమని కూలిపోతాయి. అతడు జీవితంలో ప్రతి దుఃఖపూరిత క్షణాలను తిట్టుకుంటూ, తిరిగి హిమాలయాలవంటి ఎత్తైన, చేదుతో కూడుకున్న ఎత్తులను అధిరోహించాలన్న కష్టమైన ప్రయత్నంలో పడిపోతాడు.
బి.ఏ. పాసు కాగానే అతడు, ఇక జీవిత సాఫల్యం కొద్దిపాటి దూరంలోనే నిలబడి తనకోసం ప్రతిక్షిస్తోందని భావించాడు. అప్పుడు మంచి జోరుమీద ఉన్నాడు. ఎముకలలో బలం ఉంది. ఈరోజే తను ఆశించిన రోజు కావచ్చునన్న ఆత్మవిశ్వాసంతో ఆరోజుల్లో ఇంట్లో నుండి బైటపడేవాడు. వందలకొద్ది ప్రభుత్వ – ప్రైవేటు ఉద్యోగాల వేటలో తిరిగేసరికి పదులకొద్దీ చెప్పులు అరిగిపోయాయి. ప్రతి ఉదయం ఆశాకిరణం ఒకటి మిణుకు మిణుకుమనటం, సాయంత్రం అయేసరికి కాస్తా అది మణిగిపోవటం జరిగేది. ఒకనాడయితే పూర్తిగా, శాశ్వతంగా ఆవిరి అయిపోయింది. ఆనాటి నుంచి అతడు ‘చేతగాని తనం’ అనే వ్యథతో కుముల్తూ జీవిస్తూ వస్తున్నాడు. దానితో సహచర్యం అలవడటానికి సమయం పట్టింది. ఇప్పుడు అది తగ్గిందో లేక అలవాటయి తక్కువనిపిస్తోందో! స్నేహితులు – ఏదైనా హాస్యంగా వ్యంగ్యంగా అంటే మాత్రం తిరిగి తనను తాను అసహ్యించుకుంటాడు. తండ్రి తనను చేతగాని వాడు అని తిట్టితే పుండు మీద కారం చల్లినట్లయి, ఎక్కడైనా మునిగి చద్దామనిపిస్తుంది.
ఈలోగా మిత్రులిచ్చిన సలహా మేరకు ఏదైనా వ్యాపారం చేద్దామని ఆశ పుట్టుకొచ్చింది. చాలా ఆలోచించిన మీదట బొమ్మల దుకాణం తెరవడానికి ప్రణాళిక సిద్ధమయింది. కాని ఒక్కసారి ధనం పెట్టుబడి దొరకటం వద్ద కొచ్చి ఆగిపోయింది. తండ్రిని సహాయం అర్థించాడు. అతడి బలమైన అభిలాషను గమనించిన తండ్రి సరేనన్నాడు. అట్టహాసంగా తయారీలు మొదలయ్యాయి. ఒక మంచి ముహూర్తంలో దుకాణం ప్రారంభోత్సవమయింది. కాని వ్యాపారం అతనికి లోతు తెలియని నుయ్యిగా మారింది. అనుభవం లేక కొద్ది నెలల్లోనే దుకాణానికి తాళం పడింది. తండ్రిగా అప్పుగా తెచ్చిన డబ్బుతో మొదలు పెట్టిన దుకాణం అమ్మినా కూడా అప్పులు తీర్చలేకపోయారు.
దీనితో హతాశుడయిన సౌరభ్ ఎన్నో రోజులపాటు అలా గాలికి తిరుగుతూ ఉండిపోయాడు. కొన్నాళ్ళకు పళ్ళ వ్యాపారస్థుల వద్ద పనికి కుదురుకున్నాడు. కొన్ని డబ్బులేవో చేతిలో పడేవి. కాని చేతులు జాపి ఎదుట నిలబడవలసి రావటం అతనికి నచ్చలేదు. ఒకనాడు కోపంతో సేఠ్‌నే తిట్టేశాడు. దీనితో సేఠ్ నౌకరీనుండి పంపించి వేయడమే కాకుండా ఇవ్వవల్సిన జీతం కూడా ఇవ్వలేదు.
ఎలాగో తండ్రి సిఫార్సు చేసి బి.డి.ఓ. ఆఫీసులో ప్యూను ఉద్యోగాన్ని పెట్టించాడు. గవర్నమెంటు ఆఫీసుల్లో ప్యూను చాలా ముఖ్యమైన వాడే! అక్కడ కుదురుకో గలిగితే ఏ ఆఫీసరుకూ తీసిపోడు. ఇక పై ఆమ్యామ్యాల సంగతి చెప్పేదేముంది? చేతులకు మసి అంటుకోకుండా పనులు జరిపించి, ఆదాయాన్ని వెనకేసుకోవచ్చు. తండ్రి మిశ్రాగారు చాలా ఆశాజీవి. కొడుకు అక్కడ కుదురుగా ఉంటే మంచిది! కాని అధికారుల అనధికారమైన తిట్లు – చీవాట్లు అతడికి తొందరలోనే ఉద్యోగం వదిలేసే పరిస్థితిని సృష్టించాయి. నౌకరులాగ పని చెయ్యటానికి అభ్యంతరము ఏమీ లేదు. కాని అహాన్ని దెబ్బతియ్యటం అతను ఏమాత్రం భరించలేకపోయాడు. ఎవరో కాంట్రాక్టులు చెయ్యవచ్చు కదా అన్న సలహా ఇచ్చారు. కాని అటు డబ్బుగాని, ఇటు అధికారం గాని లేని తనలాంటి వాళ్లకు అందులో రాణించడం కష్టం. అన్నివైపుల నుండి నిరాశ కమ్ముకోవడంతో ఆఖరుకు వంటవాడిగా అయినా కుదురుకునేందుకు ప్రయత్నించాడు. కాని ఒకనాడు స్నేహితుడనబడేవాడు ఆ కాస్త మిగిలినదీ ఊడ్చిపడేశాడు. డబ్బు ఎలాగో పోయింది. తండ్రి దృష్టిలో మరోసారి చేతగాని వాడిగా మిగిలిపోయాడు.
ఆనాటి తరువాత నుండి అతడు ఓడిపోయిన జూదగాడిలా అందరి చూపులు తప్పించుకు తిరగటం ప్రారంభించాడు. ఇంటి నుండి దూరం – దూరం అవటం మొదలయింది. ఓడిపోవటమన్నది ప్రకృతి నియమం. కాని అతడు కేవలం పరాజయాన్నే చూస్తూ వచ్చాడు. పూలహారం ఏనాటికయినా మెడలో పడదా అన్న ఆశతో జీవిస్తూ వచ్చాడు. ఉదయాన్నే ఎవరితో ఏం మాట్లాడకుండా వెళ్లిపోయి అతడు రాత్రెప్పుడో తండ్రి నిద్రపోయాకే తిరిగి ఇంట్లో కాలు పెట్టేవాడు. దాదాపు తండ్రితో మాట్లాడటం అన్నది పూర్తిగా ఆగిపోయింది. తల్లి మాత్రం వాచిన కళ్ళతో కొడుకును చూసుకుంటూ ఎదురుచూస్తూ ఉండేది.
ఒక్కొక్కసారి పార్కులో, మరోసారి రోడ్లమీద నడుస్తున్నప్పుడు బాల్యం గుర్తుకొచ్చి కళ్లు నీళ్లతో నిండిపోయేవి. తండ్రి వీపు మీద ఎక్కి వేలాడుతూ తిరునాళ్ళు చూచేవాడు. రకరకాల వస్తువులు తెచ్చివ్వమని పురమాయించేవాడు. జిలేబి పాకంతో నిండిన చేతులు ఆయన జుట్టుకి పూసినప్పుడు తండ్రి కోపంతో కర్ర పుచ్చుకుని వెంటపడేవారు. అమ్మ తన చీర కొంగులో దాచుకొని “నా కొడుకుని కొట్టకండి, ఇంకా పసివాడే. ఏదో ఒక రోజు పెద్ద లార్డు అవుతాడు. మీరే చూద్దురుగానీ!” అనేది.
చదువులో మాత్రం తను పనికిమాలినవాడే! పుస్తకాలను చూస్తూనే కడుపులో నొప్పి రావటమో, నిద్ర రావడమో జరిగేది. తండ్రి లక్షసార్లు పిలిచినా ఆయన వద్దకు మాత్రం వెళ్లేవాడు కాదు. ప్రొద్దున్నే తండ్రి బలవంతంగా లేపి తనతో తిప్పడానికి తీసుకువెళ్తూ దారి పొడవునా సంస్కృత శ్లోకాలను వల్లె వేయిస్తూ, చదువు – చక్కని జీవితం ఎంత విలువైనదో నేర్పించేవారు. తను ఏమాత్రం మనసు పెట్టకుండా ఊ కొట్టేవాడు. అంతే! ఒక రుషి మునిని గురించి ఆయన, తను కథ చెప్పమని మారాం చేస్తే వినిపించేవారు. ఈ రోజు పరిస్థితులన్ని మారిపోయాయి. తన మాటలు గరళంగా మారి ఆయననుండి దూరం పెడుతున్నాయి. బాల్యంతోపాటు తండ్రి ప్రేమ ఆప్యాయతలు కూడా గతించి పోయాయి.
ఇటువంటి ఎన్నో విషయాలు అతడిని పిండేస్తూ ఉంటాయి. తండ్రిని ఎప్పుడూ తను ఆదర్శంగా తీసుకోలేదు. బహుశా ఆదర్శంగా తీసుకుని ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో! ఈ పాపం గురించి ఆలోచన అతడిని మొత్తంగా నలిపి పడేస్తుంది. నిస్సహాయంగా మోకాళ్లు వెయ్యవలసినట్టనిపిస్తు రాబోయే జీవితం ఎత్తైన పర్వతం పైకి ఎక్కటంలా అనిపిస్తూ తనకు కేవలం కిందలోయల్లోకి జారటం అన్న ప్రమాదం మినహా మరేం మిగలలేదనుకుంటాడు.
ఆరోజు ఉదయం లేచాక అతడు తయారవుతుండగా, తండ్రి బజారు నుండి ఏవో తెమ్మన్నాడు. సౌరభ్‌ను బట్ట మిల్లు యజమాని రమ్మని కబురు పెట్టాడు. అతడు పనికి పెట్టుకుంటాడన్న ఆశ అతడిలో కలిగింది. అందుకే పిల్చిన సమయానికి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాడు. కొడుకు, కుదరదని చెప్పిన మాటను తండ్రి వేరే విధంగా అర్థం చేసుకుని, ఒక్కసారి కోపగించుకున్నాడు.
“ఇక ఇంటి పనులు చెయ్యటం కూడా నచ్చటం లేదని స్పష్టంగా చెప్పవచ్చుకదా!”
బట్టల మిల్లు యజమాని తనను పిలిచాడని చెప్తే తల్లి ఆశీర్వదించింది. తండ్రి కోపం ఇంకా పోలేదు. “చాల్లే! ఇక ఇలాంటి సాకులేం చెప్పకు! చెప్పింది నమ్మేటట్లు ఉండాలి కాస్త!” అన్నారు.
ఆయన మాటల్ని పట్టించుకోకుండా బైటకు వెళ్లటానికి నిశ్శబ్దంగా తయారయి వరండాలోకి వచ్చాడు. చూస్తే అక్కడ ఒక పెద్దమనిషి పంచ-లాల్చీ వేసుకుని, చత్వారం కళ్లజోడుతో చేతిలో గొడుకు పట్టుకు నిల్చుని కనిపించాడు. సౌరభ్ ఈ అపరిచితుడు ఎవరో నన్న సందేహపు చూపులకు జవాబు అన్నట్లు – ‘నేను లోపలికి రావచ్చా?” అన్న ప్రశ్న ఆయన వేశాడు.
“మీకు ఎవరు కావాలి?” సౌరభ్ ప్రశ్నించాడు.
“ఇంటి యజమాని”
“ఏం పని?”
“ఏం లేదు! మీ పక్క ఇంట్లో కొత్తగా అద్దెకి వచ్చాం. అందుకే పరిచయం చేసుకుందామని వచ్చానంతే!”
“సరే ఇలా ఈ కుర్చీలో కూర్చోండి. ఇప్పుడే పిలుస్తాను!” అంటూ ఆయనకు కుర్చీ చూపించి, సౌరభ్, తండ్రికి చెప్పటానికి ఇంట్లోకి వెళ్లాడు. బైటకు వచ్చిన రఘునందన మిశ్ర, ఎదురుగా ఉన్న అపరిచితుడిని చూసి ఆయన రావటానికి కారణం తెలుసుకుని ఆయనతో సంభాషణ మొదలు పెట్టారు. సౌరభ్ ఇంటర్వ్యూకి వెళ్లటానికి ఆలస్యం అవుతోందని, బైటకు వచ్చి తండ్రి కాళ్లకు దండం పెట్టి బైటపడ్డాడు. తండ్రి అన్యమనస్కంగానే కొడుకును చూసి, వచ్చిన అపరిచితునితో మాటలు కొనసాగిస్తూ పోయాడు.
గంటల కొద్దీ నిరీక్షిస్తూ కూర్చున్న అలసట కాస్తా, మిల్లు యజమాని పర్సనల్ సెక్రెటరీ వచ్చి సౌరభ్‌ను మర్నాటి నుండి పనిలో చేరమని చెప్పిన మరుక్షణం మాయమయిపోయింది. అయితే మూడు నాలుగు వేలు అటూ ఇటూగా ఖర్చు పెట్టవలసి వస్తుందని కూడా సూచించారు. చెప్పాలంటే బేరం ఫరవాలేదు. ఆరోజు మొట్టమొదటి సారి తనకి తాను మామూలు వ్యక్తుల నుండి తను వేరని భావించుకున్నాడు. సోషలిజమ్ మాయమయిపోయింది. డెమోక్రసీ చిన్నాభిన్నమయిపోయింది. డబ్బే మనిషికి గుర్తింపు తెస్తోంది. గౌరవాన్ని కలగజేస్తోంది. తండ్రి ఆదరణకు నోచుకోకపోయినా ప్రేమతో కూడిన నాలుగు మంచి మాటలు చెవిన పడ్డాయి తనకి అవి చాలు.
సమాచారం విన్న మిశ్రగారికి సంతోషం కలిగింది. కాని ఆ డబ్బును సమకూర్చటమెలా అన్న ఆలోచనలో పడిపోయారు. ఇంకా ఉద్యోగం దొరకలేదు, పైనుండి ముందే డబ్బివ్వాలి. ఎలా? ఇచ్చాక అయినా ఉద్యోగం దొరుకుతుందో – లేదో తెలియదు. ఈ రోజు వరకూ ఆయకు అర్థం కానిది ఒక్కటే – నౌకరీ సంపాదించుకునేందుకు డబ్బులు ఖర్చు పెట్టడం అన్నమాట. ఎక్కడినుండి ముల్లె వచ్చిపడుతుందని? డబ్బులన్నవి ఉద్యోగంలో చేరాక కదా దొరికేది? అలా డబ్బులే ఉంటే అసలు ఉద్యోగం ఎందుకు వెతుక్కుంటారు? సరే ఏదెలా ఉన్నా, సౌరభ్‌కు ఏదో ఒకలా ఏదో ఒక ఉద్యోగం దొరకటం కన్న ఆయనకు కావలసినదేముంది గనక?
కాని డబ్బెక్కడి నుండి వస్తుంది? మనిషికి సహజమైన చింత ఇది. జనన మరణాల అసాధారణ చింత నుండి ఎప్పుడో విముక్తి వచ్చేసిందాయనకి, ఉద్యోగ విరమణ తరవాత పెన్షను మీద జీవించేవారి వద్ద మూడు – నాలుగు వేలు వేరేగా దాచి ఉండవు. అటువంటప్పుడే భగవంతుడు గుర్తుకొస్తాడు. అన్ని పనులూ శివుడాజ్ఞతోనే నడుస్తాయి. మిశ్రగారు కూడా అందరు సామాన్యులలాగే ఈ పనిని కూడా ఈశ్వరుడి భారానికే వదిలేశారు. అన్నిటినీ చేయించేది చేసేది ఆయనే కదా! అన్ని పనులూ ఆయనే చేస్తే, ఈ పనినీ ఆయనే చేస్తాడు. అల్పులైన మనుషులు కేవలం ప్రార్థించగలరంతే! శివభక్తులయిన మిశ్రాగారికి భగవంతుని పట్ల అపారమైన భక్తి శ్రద్ధలున్నాయి. నిత్యమూ పూజ చేసుకోవటంతో బాటు బాధలో ఉన్నప్పుడు భగవద్భజనను చేసుకొని తనను తాను సంభాళించుకునేవారు.
ఆ రాత్రి కలలో ఆయనకు శివ దర్శనం అయి, సమస్యకు సమాధానం దొరికినట్లనిపించింది. రోజూలాగే ఉదయాన్నే నడకకు వెళ్తే, పార్కులో శాస్త్రిగారు కలిశారు. ఈ సరికి ఇద్దరి మధ్య ఆత్మీయత పెరిగింది. నమ్మకం కాస్తా భక్తి రూపాన్ని సంతరించుకుంది. ఆయన తన బాధను వెళ్లగక్కుకున్నారు. ‘మీరు చింతించకండి’ అన్న భరోసా లభించింది. ఇలాంటి సానుభూతితో కూడుకున్న మాటలు అమృతంలా వినిపిస్తాయి. ప్రత్యేకించి ఇటువంటి క్షణాల్లో! అయితే బెంగమాత్రం తగ్గలేదు. ఇంటికెళ్లి భార్య జమాఖర్చులను పరిశీలించారు. పదిహేనువందలు సమకూరాయి. భార్య మెల్లిగా తెలియకుండా దాచిన డబ్బు ఇవాళ ఇలా అవసరపడుతున్నాయి. కాని మిగిలిన పైకం ఎలా అన్న ఆలోచన ఒదలటం లేదు.
ఇంకా ఒక గంట సమయం గడిచిందో లేదో, శాస్త్రిగారు ఇంట్లోకి ప్రవేశించి, మిశ్రగారి చేతుల్లో రెండువేలు పెడుతూ ‘ఇదిగో మీ సమస్యకు సమాధానం దొరికింద’ని అన్నారు.
“కానీ….”
“కాని గాని మరోటేం అనొద్దు! ఇరుగు-పొరుగువారు అవసరానికి సహాయపడకపోతే ఇక ఇరుగు-పొరుగు అని అనుకోవటం దేనికి చెప్పండి?”
“కాని మీకు మేము పూర్తిగా తెలియనే తెలియదు కదా!”
“మనిషిని అర్థం చేసుకునేందుకు హెచ్చు సమయం అక్కరలేదు. మీ ముఖం చూడగానే మీరు శివభక్తులని అర్థం అయింది. శివభక్తులను కళ్లు చూసుకుని మరీ నమ్మొచ్చు!”
“అంటే మీరు కూడా…?”
“ఆయన లీలలు అనంతం! ఆయనకే ప్రతి పనికి ఆరంభం – అంతం కూడా తెలుసు!”
మిశ్రగారు భోళా శంకరుడిని స్మరించుకున్నారు. ఆయనకు ఈ పెద్దమనిషి మాటలు యథార్థం కావటం చూస్తే మహా ఆశ్చర్యంగా ఉంది. ఉదయం తన గోడు చెప్పుకుంటే, పని సానుకూలపడే అవకాశం పూర్తిగా ఉందని చెప్పటం జరిగింది. ఆయనకెలా తెలిసిందో మరి, సౌరభ్ ఉద్యోగం వెతుక్కుంనేందుకు బయటకు వెళ్తున్నాడని? తప్పక జ్ఞానో- ధ్యానో అయి ఉంటారు. మరి ఇప్పుడు తనని డబ్బు బాధ నుండి కూడా ఆ పెద్ద మనిషే బైటపడేశాడు.
ఆ తరువాత నుండి మిత్రాగారింటికి ఆ పెద్ద మనిషి రాకపోకలు చాలా సర్వసాధారణమయ్యాయి. రఘునందన్ మిశ్రాగారికి కూడా ఆ పెద్దమనిషి రాక హాయినిస్తోంది. ఆయన ఆధ్యాత్మికతతో కూడుకున్న, జ్ఞానంతో నిండిన పలుకులు వింటూ ఉంటే మిశ్రాగారికి తన జీవితం మారుతున్నట్లనిపిస్తోంది. ఆ పెద్దమనిషి పేరు పండిత విష్ణుశాస్త్రి, ఆయన తనను తాను పరిచయం చేసుకున్న దానిని బట్టి, ఆయన వాస్తుశాస్త్రంలో గొప్ప విద్వాంసుడు. కాశీ విద్యాపీఠంలో ఆచార్య విద్య నభ్యసించటంతోబాటు, వాస్తుశాస్త్రం పైన ప్రత్యేక పరిశోధన చేయటం జరిగింది. జ్యోతిష్యంలో విపరీతమైన ఆసక్తి ఉండటం వలన ఆయన దీనినే తన వృత్తిగా ఎంచుకుని ప్రజలకు సహాయపడాలని అభిప్రాయపడ్డారు. మాటల్లోనే ఆయన మిశ్రాగారి ఇంటికి ఎన్నో వాస్తుదోషాలుండటం వలనే ఇలా ఇబ్బందులు మీద పడుతున్నాయని కూడా తెలియజేశారు. ఆ దోషాలను సరిదిద్దుకున్న తరువాతే వారి ఇంట ఆటంకాలు, విఘ్నాలు తొలుగుతాయన్నారు.
సౌరభ్‌కు ఈ మాటల్లో ఏమంత నమ్మకం లేదు. అయితే తన నౌకరీ గురించి సరియైన భవిష్యవాణి చెప్పినందున అతడు కూడా శాస్త్రిగారు గొప్ప విద్వాంసుడునేనని ఒప్పుకోక తప్పలేదు.
“మనిషి జీవితం వివిధ రకాల శక్తుల (ఎనర్జీ) ద్వారా నడపబడుతుంది. వాస్తు శాస్త్రమన్నది ఒక కళ. భవన నిర్మాణంలో ఆ శక్తులను ప్రత్యేక రీతిలో నియంత్రించడం వాస్తు ద్వారా జరుగుతుంది. ఇంటి నిర్మాణంలో పొరపాట్లు జరిగితే, ఈ శక్తులపైన నియంత్రణ ఉండదు. ఎన్నో అవాంఛనీయ పరిస్థితులకు అవకాశం ఏర్పడుతుంది. అందుకే ఈ దోషాల నుండి ఎంత వేగంగా వీలయితే అంత వేగంగా విముక్తులవాలి” శాస్త్రిగారి సీదాసాదాతనమే ఆయనకు గుర్తు. అలాంటి సీదాసాదా వ్యక్తులు సహజంగానే విశ్వాసాన్ని అందరి నుండీ చూరగొంటారు. మిశ్రగారి నమ్మకం మరింత దృఢమయింది. ఇప్పుడాయన ఎలా చెప్తే అలా నడవటానికి సిద్ధంగా ఉన్నారు. బాధల నుండి తప్పించుకోవాలని అందరూ కోరుకుంటారు కదా!
శాస్త్రిగారు, తను చెప్పిన ప్రకారం అన్నీ ఆచరిస్తే, అన్నిరకాల దోషాలనుండి తప్పించగలనని ఘంటాపథంగా చెప్పారు. ఆయన చెప్పిన జోస్యం నిజమయి, ఆయన శక్తి – సామర్థ్యాలకు మరింత బలం చేకూరింది. భగవంతుని పట్ల భయభక్తులు, నమ్మకం మెండుగా ఉన్న మిశ్రగారికి ఇదే ఉత్తమ ఉపాయంగా తోచటంతో ఇక ‘దోషనివారణ దండయాత్ర’ ప్రారంభం అయింది.
మొట్టమొదట వంట ఇంటిని దోషాల నుండి తప్పించాలి. అది ఆగ్నేయదిశలో లేనందున మిశ్రగారి కుటుంబంపై అగ్గివర్షం కురిపిస్తోంది. హడావిడిగా కొత్త వంటగది కట్టించి, పాత వంటింటిని కాస్తా కూలగొట్టి అందులో ఒక మంచాన్ని వెయ్యటమయింది. ఆ తరువాత ఈశాన్య దిక్కులో పూజగదికి చోటు దక్కింది. దక్షిణాన్ని బరువు హెచ్చు చేయ్యాలన్న కారణంగా డాబా మీద మరొక రేకుల షెడ్డు వేసిన గది ఒకటి తయారయింది. ఇలాంటి ఎన్నో మార్పులు చేర్పులు చకచకా సాగిపోయాయి. ప్రతి మార్పు తరవాత దోషనివారణ పూజలు-శాంతులు కూడా చేయించారు. వీటన్నిటి వలన ఇప్పటివరకూ కేవలం చిన్న – చిన్న అప్పులు మాత్రమే చేస్తూ వస్తున్న రఘునందన్ మిశ్ర ఇప్పుడు పీకలదాకా అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. సౌరభ్ కాస్త చేతికి ఆసరా కావటం వలన ఇంటి ఖర్చుకు ఇబ్బంది లేకపోయినా, అప్పుల భారం తగ్గటానికి బదులు, రోజు రోజుకూ మరింత పెరుగుతూనే ఉంది. అటుపైన కూతురి పెళ్లి బెంగ మిశ్రగారిని సగం చేసేసింది. అప్పుడప్పుడు సౌరభ్ ఈ వృథా ఖర్చులు చూసి వ్యతిరేకించినా, అతడి గొంతును నొక్కేయటం జరిగేది. ఎందుకంటే మూఢనమ్మకాల చలవకళ్లజోడు ధరించిన మిశ్రగారి నెత్తిమీద దోషనివారణ అనే దెయ్యం సవారీ చేస్తోంది. చెప్పాలంటే తప్పు ఆయనది కాదు, పండిత విష్ణుశాస్త్రి ఆయనను దాదాపు తన వశం చేసుకున్నాడు.
“నాన్నగారూ! మీరెందుకు అర్థం చేసుకోవటం లేదు? ఈ శాస్త్రి మీ మూఢనమ్మకాలను తన ప్రయోజనానికి వాడుకుంటున్నాడు!”
“అవేం మాటలు?”
“నేను నిజమే చెప్తున్నాను”
“అలాంటిదేమి లేదు. నీకింకా అర్థం కాదులే!!”
“ఏంటి అర్థం చేసుకోలేను? ఈ శాస్త్రి మిమ్మల్ని మూర్ఖుడుని చేస్తున్నాడని తెలియటం లేదు.?”
“ష్ మాట్లాడకు. నీ ఇల్లు కట్టించుకుంటున్నప్పుడు నీలెక్కన కట్టించుకో!” సాధారణ సంభాషణ ఇలాంటి మలుపు వద్దకు వచ్చి ఆగిపోతుంది.
“నా జీవితం అయిపోయింది. నా గురించి నాకేం బెంగలేదు. ఇవన్నీ నేను మీ కోసం చేస్తున్నాను. భవిష్యత్తులో మీకేమి ఇబ్బందులు రాకూడదని నా తాపత్రయమంతా! శాస్త్రిగారు మంచాయనే! ఎన్నోసార్లు భోజనం కూడా చెయ్యకుండానే వెళ్లిపోయారు. ఆయనకు లోభత్వం ఉంటే అలా చేస్తారా చెప్పు?” మిశ్రగారు చటుక్కున తరఫ్‌దారీ చేస్తారు.
ఈ అమాయకత్వాన్ని ఏమనుకోవాలి? అప్పటికీ సౌరభ్ తన అభిప్రాయాలను వైజ్ఞానికంగా చెప్పేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాడు.
“వాస్తు శాస్త్రమన్నది ఏమీ అశాస్త్రీయం కాదు. ఇది ఇల్లు కట్టుకునే కళ మాత్రమే. ప్రదేశాన్ని, వాతావరణాన్ని, దిక్కులను దృష్టిలో పెట్టుకునే అందరూ ఇళ్లు నిర్మించుకుంటారు. అయితే నూటికి నూరు శాతం వాస్తుననుసరించే ఇల్లు కట్టలేం. మూడువైపులా ఇళ్లు కట్టి ఉండి, రోడ్డు కేవలం దక్షిణ దిక్కుకే ఉంటే, ద్వారం దక్షిణానికే కదా ఎత్తాలి. ఇలాంటి పరిస్థితిలో ఎవరయినా ఉత్తరానికో, తూర్పుకో ద్వారం ఎలా పెట్టుకోగలరు? కట్టుకున్న ఇల్లు సౌకర్యవంతంగా, మీకు నచ్చినట్లు సదుపాయాలతో ఉండాలన్నదే వాస్తు శాస్త్రం తెలియజేసేది!!”
ఇలా సౌరభ్ తన జ్ఞానధారను ప్రవహింపజేస్తూ ఉంటాడు, కాని తండ్రి ఎప్పుడూ కొడుకుతో ఏకీభవించడు. ఒకరోజు అయితే మొత్తం అంతా సర్వనాశనం అయిపోయిందనిపించింది. సౌరభను నౌకరీ నుండి తీసేశారు. అతడు మజుదూర్ యూనియన్ల కార్యకలాపాల్లో మహా ఉత్సాహంగా పాలు పంచుకోవటం యజమానికీ, మేనేజరుకు కూడా ఎంతమాత్రం నచ్చలేదు. సౌరభ్ కాళ్లావేళ్లా పడి బతిమాలుకున్నా కాదు పొమ్మన్నారు. తనకు – తన కుటుంబానికి ఆధారమైన ఏకైక సాధనానికి నీళ్లు ఒదులుకున్నాడు. పండిత విష్ణుశాస్త్రిని ఈ దోషనివారణకు పూజ – శాంతి చేయించాలని పిలిపిద్దామనుకుంటే ఆయన జాడ ఎక్కడా దొరకలేదు. ఆయన ఎక్కడికో వెళ్లిపోయాడని తెలియవచ్చింది. తనుంటున్న కిరాయి ఇంటిని కూడా ఖాళీ చేసారు. అంతేకాదు, ఆ ఊల్లో తమలాంటి ఎంతోమంది ఆయన సలహాననుసరించి తమ ఇళ్ల రూపురేఖలను పూర్తిగా మార్చుకోవటం, దోష శాంతుల పేరిట పూజలు – దానాలు చేయించుకున్నారన్న విషయం కూడా తెలిసింది. వేలకొద్దీ రూపాయలు ఖర్చు చేయించాడాయన. కాని ఏ దోష నివారణా కాలేదు. మిశ్రగారికిది అఘాతమే! నమ్మకానికి గట్టి దెబ్బ తగిలింది. ఈ బాధను తట్టుకోలేక ఆయన ఏకంగా పరలోకానికే వెళ్ళిపోయారు.
మళ్ళీ సౌరభ్ కాళ్లరిగిపోయేలా తిరగటం మొదలయింది. ఈసారికి అతడి మానసిక స్థితి మారిపోయింది. అప్పుడంటే తండ్రి ఆసరాగా ఉండేవాడు. ఇప్పుడలాంటి ఆశేం లేదు. బాధ్యతలు ఇంత కఠినంగా ఉంటాయని అర్థమయి కేవలం పశ్చాత్తాప పడటం మినహా మరేం చెయ్యలేని నిస్సహాయత ఆవరించింది. పోయేవాళ్లు పోతారు. కేవలం వారి జ్ఞాపకాలు మాత్రమే శరీరంపైన మానని మచ్చల్లా మిగిలిపోతాయి. ఇప్పటికి ఆ విషయం అర్థమయింది. అదీ చిన్న సంగతేమీ కాదు. అయితే తరుణం మించాక తెలిసినా ఏది వెనక్కిరాదు. ఎక్కడిది అక్కడే ఉంటుందని గ్రహించుకున్న మనిషి పూర్తిగా కుంగిపోతాడు. తనను తానే పరిపరివిధాల తిట్టుకుంటాడు. మండిపోతాడు. ఇవేవీ మంచి లక్షణాలు కావు. తప్పించుకోవాలనుకున్నా సాధ్యం కాని పరిస్థితి! ఇంట్లో తిండిగింజలే కరవవుతుంటూ, అప్పులవాళ్ళ నోళ్లు పెద్దవవుతాయి. వయసొచ్చిన అక్కచెల్లెలు ఇంట ఉంటే కష్టాలు అగ్ని జ్వాలలై కబళించి మీదకొస్తాయి. సంఘం శత్రువవుతుంది. మనిషి కాస్తా నరమాంస భక్షకుడవుతాడు. జంతువులు నరమాంసం తిన్నా, అవి అడవులలోనే ఉంటాయి. మనిషి మాత్రం ఇంటి వాకిట్లోకి వచ్చి పడతాడు. ఇటువంటి సమయంలో జీవితం దుర్భరమనిపిస్తుంది. ఇక పోరాడే శక్తి కూడా క్షీణించి పోతుంది. నిరాశ మనస్సును పూర్తిగా ఆవరిస్తుంది. చుట్టాలు, స్నేహితులు, బంధువులు అందరూ దూరమవుతారు.
సౌరభ్‍కు కూడా ఇదే పరిస్థితి ఎదురయింది. బాధలను మర్చిపోవడానికి, చీకట్లోంచి బైటపడటానికి, తనకు తను స్థైర్యం సమకూర్చుకునేందుకు అతడు తాగుడు అనే మార్గంలోకి వచ్చాడు. ఒకనాడు అతను విపరీతంగా తాగి – తాగి ఒంటిమీద తెలివి లేకుండా పడిపోయాడు. ఎన్నో గంటలపాటు రోడ్డుమీదే పడుకున్నాడు. చచ్చినవాడిలా! ఎవరో అగంతకుడు అతడి శరీరాన్ని రోడ్డు వరకు ఈడ్చిపడేశాడు. బాగుందనిపించింది. ఏమీ గుర్తులేవు. ఇల్లు-వాకిలి ఏ బెంగ గుర్తుకురాలేదు.
ఇక తరచూ సారా అంగడిని వలకరించడం హెచ్చయింది. డబ్బుల్లేకపోవటంతో సారా అంగడి యజమాని బాగా దేహశుద్ధి చేశాడొకసారి. నిరాశ నిస్పృహలకు లోనయి ‘అయ్యో! ఇదీ ఒక జీవితమేనా’ అన్న భావం కలిగింది. ఇంతకన్నా చావు నయమనిపించింది. మందుల షాపుకు వెళ్లి ఎలకలను చంపే మందు కొనుక్కుని తద్వారా, తను, తన కుటుంబం తక్కువలో కష్టాల నుండి గట్టెక్కే సులభమయిన మార్గాన్ని ఎంచుకునేందుకు సిద్ధపడ్డాడు. బాధల నుండి విముక్తుడవటానికి సరళమైన ఉపాయం! ప్రాణాలూ మిగలవు, కష్టాల అనుభవాలు ఉండవు. మత్తులో ఉన్నవారికి ఆలోచించగలిగే శక్తి నశించిపోయి, తీసుకున్న నిర్ణయం మరింత బలపడుతుంది. ఈ కఠోర నిర్ణయం తరువాత ఇంటికి దారితీసాడు. మరోసారి అతడిలో తను తక్కిన సామాన్యుల కంటే వేరయిన వాడినన్న భావం మొదలవుతుంది.
తోవలో అతడికి ఒక బిచ్చగాడు కనిపించాడు. కాసిని డబ్బులు వేస్తారన్న ఆశతో ఒక ప్రదేశంలో కూర్చుని వచ్చి పోయే వారిని అడుక్కుంటూ వారిని దీవిస్తున్నాడు. “ఏదైనా సహాయం చెయ్యండి నాయనా! ఈ బీదవాడి దీవెనలు మీకు తప్పక లభిస్తాయి!”
సౌరభ్ ఐదు రూపాయల నోటు తీసి బిచ్చగారికి ఇచ్చాడు. ఇక డబ్బంటే అతడికి ఎంతమాత్రం వ్యామోహం మిగలలేదు. బిచ్చగాడు ఆనందంగా, ఆశ్చర్యంగా అతడిని చూస్తూ బోల్డంత ఆశీర్వదిస్తున్నాడు. “భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి! మీకు ఎప్పుడూ మంచి బుద్ధినివ్వాలి, మీ కష్టాలు తొలగిపోవాలి. మీరు పిల్లాపాపలో చల్లగా ఉండాలి. మీ కుటుంబం వృద్ధి చెందాలి. మీరు నా ఆయుషు కూడా పోసుకుని పదికాలాలు చల్లగా ఉండాలి!!”
బిచ్చగాడి మాటలు వింటూ చిరునవ్వుతో సౌరభ్ ఇంటివైపు అడుగులు వేస్తూ అనుకున్నాడు ‘ఇక కష్టాలన్నిటినుంచీ విముక్తేన’ని! దీర్ఘాయుషు దీవెన వింటే నవ్వు వచ్చింది. ఎవరికెంత ఆయువు ఉందో ఎవరికి తెలుస్తుంది? మరుక్షణం ఏం జరగబోతోందో ఎవరికెరుక?
కాని బిచ్చగాడి మాటలు అతని మనసులో నాటుకుపోయాయి. సుఖం కష్టం, సద్బుద్ధి – సాఫల్యం వంటి మాటల్ని అతడు మర్చిపోవాలనుకుంటున్నాడు. ఒక దీర్ఘమైన నిట్టూర్పుతో బాటు అతడు వీటన్నిటినీ ఎప్పటికీ వదిలెయ్యాలని ఆలోచిస్తున్నాడు. అతడిని ఆలోచన వదలకుండా ఉంది. ఆలోచనే కదా మనిషిని ఇది మంచి, ఇది చెడు అని ఆలోచించేందుకు వివశులను చేస్తుంది. తను తప్పు నిర్ణయం తీసుకోవటం లేదు కద! జీవితాన్ని అంతం చేసుకోవడం అన్నది ఒక సులభమయిన అడుగు వెయ్యటం కావచ్చు. జీవితాన్ని ఒక లక్ష్యంతో జీవించటం చాలా కష్టం. అయితే తను సులభమయిన మార్గాన్ని ఎంచుకోవాలనుకుంటున్నాడా? బాధ్యతల నుండి తప్పించుకుంటూ యుద్ధభూమిని వదిలి పారిపోయే పిరికివాడా తను? తన జీవితాన్ని అంతం చేసుకునే నిర్ణయం తను తీసుకోగలడేమో గాని, తల్లి చెల్లి జీవితాల గురించి నిర్ణయం తీసుకునేందుకు తనేం భగవంతుడు కాదు కద! కాదు-కాదు. ఎంతమాత్రం కాదు; తనలో బాధ్యతలను భుజాలపైకి ఎత్తుకోగలిగే సామర్థ్యం ఉంది, జీవించాలన్న బలమైన కోరిక కూడా ఉంది.!
తండ్రి ఎప్పుడూ అంటూ ఉండేవాడు, మనిషి ఆశను వదిలెయ్యకూడదు, సమస్య ఎదురయితే దాని పైన బాగా ఆలోచించాలి అని! ఆలోచిస్తేనే కదా, మంచి – చెడుల జ్ఞానం వచ్చేది. ఈరోజు సౌరభ్ విషయంలో కూడా అదే జరిగింది. అతడు ఎలకల విషం సీసాను రోడ్డు పక్క విసిరికొట్టేడు. సీసా ముక్క – ముక్కలయింది. మందు కాస్తా ఇటు అటు చెదిరి మట్టిలో కలిసిపోయింది. చెడు ఆలోచనలనే రాక్షసుడు అతడి మనసులోనుండి బైటకు వచ్చి పారిపోయాడు.
తాగుడు మత్తు మెల్లిగా దిగుతూ ఉంటే, సౌరభ్ మనసులో తను, తన కుటుంబం సుఖంగా జీవించగలిగే మార్గం ఏముందా అని పక్కమీద వాలి ఆలోచించటం మొదలు పెట్టాడు. ఒక్కక్షణంలో అతడి మనసులో ఆలోచన తళుక్కుమంది. తను బ్రాహ్మణుడు, పండితుల గుణాలు చిన్నతనం నుండి ఒంట్లో ఉండనే ఉన్నాయి. వాస్తుశాస్త్రం ప్రాక్టీసు చేసి, ప్రజల కష్టాలను ఎందుకు నివారించకూడదు? పండిత విష్ణుశాస్త్రి ఉదాహరణ ఎదురుగా ఉండనే ఉంది. శాస్త్రిగారిని సౌరభ్ ఎన్నడూ మరిచిపోలేదు. ఎందుకంటే తమ కుటుంబం కష్టాలలో పడటానికే ఆయన కారణం అని బలంగా నమ్ముతున్నాడు. సుఖపెట్టేవారు మరుపుకు వచ్చినా, కష్టపెట్టేవారిని ఎప్పుడూ మనసులోంచి తీసెయ్యలేము. ఈ రోజు కష్టం కాస్తా ప్రాణాంతకం అయింది. తన ఆలోచన మంచిదే! ఈ పని చెయ్యటానికి ఎవరి పైరవీ చెయ్యనవసరం లేదు. ఎవరి నుండి సర్టిఫికేటు తెచ్చుకోనవసరం లేదు. తన ఆలోచనలు ఒక కొలిక్కి రావటంతో సౌరభ్ సుఖంగా నిద్రపోయాడు.
మర్నాటి నుండే వాస్తు శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలను సమకూర్చుకోవటంలో అతడు మునిగిపోయాడు. ఆరు నెలల్లో హిందీ, ఇంగ్లీషు, సంస్కృత భాషలలో డజన్ల కొద్దీ పుస్తకాలను అధ్యయనం చేశాడు. టీక-టిప్పణీల నుండి మూలగ్రంథాల అధ్యయనం చేసేసరికి, ఇది ఒక శాస్త్రీయ సిద్ధాంతం అని, దానిని సరిగా ఉపయోగించుకోవాలని అర్థమయింది. సరిగ్గా ఉపయోగించుకుంటే బహుశా పండితులు చెప్పేటంత హెచ్చు లాభం ఉండకపోయినా, హాని కూడా పెద్దగా ఉండకపోవచ్చు.
ఒకనాడు మంచి ముహూర్తం చూసుకొని సౌరభ్ ఇంటి బైట బోర్డు ఒకటి వేలాడదీశాడు. దానిపైన ఇలా వ్రాయించాడు
“పండిత్ సౌరభ్ మిశ్ర” – వాస్తుపండితుడు, గృహ నిర్మాణానికి ముందే వాస్తుశాస్త్రాన్ని గురించి తప్పక ఆలోచించండి. మీకు సుఖాలలో తోడుంటూ, కష్టాలను తగ్గించే మహత్తరమైన – శాస్త్రీయ మార్గం.!
హిందీ మూలం: విశ్వజిత్ ‘సపన్’
తెలుగు: డా. సుమన్‌లత రుద్రావజ్ఝల