“నేను బ్రిటీష్ వారికి కూడా గతంలో చెప్పాను. ఇప్పుడు మీకు చెప్తున్నాను. మీ జీవితకాలంలో కనుక హిందూ-ముస్లిమ్ అనైక్యతను తొలగించి ఐక్యతను సాధించలేకపోతే ఇది ఎప్పటికీ పరిష్కారం కాని సమస్యలా మిగిలిపోతుంది” అన్నాడు అభిజిత్..
రోగి గాయానికి మందు వేసి కట్టుకడుతున్న డాక్టర్ అమియ చక్రవర్తి అభిజిత్ వైపు తల ఎత్తి చూశాడు.
“అలా అన్నాడా డాక్టర్ సయ్యద్ అహ్మద్?” అడిగాడు శాంతంగా.
“నేను చెప్పానా! గాంధీ పని అయిపోయింది. ఆయన భోళా శంకరుడిలాంటివాడు. ప్రతి ఒక్కరినీ నమ్మేస్తాడు. మనుషుల్లో మంచి తప్ప చెడు చూడడు. అందరూ ఆయనని బోల్తా కొట్టిస్తున్నారు. నా మాట విను, గాంధీ మనల్ని రక్షించలేడు. ఆయన సిద్ధాంతానికే కాదు ఆయనకూ కాలం చెల్లిపోయింది. కాంగ్రెస్ వారే ఆయన మాట పట్టించుకోవటం లేదు. ఇక మనల్ని మనం రక్షించుకోవాలి” ఆవేశంగా అన్నాడు అభిజిత్.
అమియ చక్రవర్తి రోగిని పంపించేశాడు. మరో రోగి వచ్చాడు. అతడి గాయాలను శుభ్రం చేసి, మందువేసి, కట్టు కట్టటం ఆరంభించాడు మౌనంగా.
“ఏం మాట్లాడవేంటి? నీకు ఇంకా మహాత్మాగాంధీ విభజనని కానీ, ముస్లింలు హిందువులను ఊచకోత కోయటాన్ని కానీ ఆపుతాడన్న నమ్మకం ఉందా?” కోపంగా అడిగాడు అభిజిత్.
అవి దేశం స్వాతంత్ర్యం సాధించడంలో కీలకమైన రోజులు.
బ్రిటీష్ వారు దేశం వదిలిపోవటం తధ్యమన్నది స్పష్టంగా తెలుస్తోంది. కానీ ఈక్షణంలో హిందువులు అధికంగా ఉన్న భారతదేశంలో ముస్లింలకు అల్పసంఖ్యాక ఇతర మతాల వారికి రక్షణ లేదన్న ఆలోచననను మహమ్మద్ ఆలీ జిన్నా నేతృత్వంలో ముస్లిం లీగ్ విస్తృతంగా ప్రచారం చేసింది. దేశవ్యాప్తంగా ఇస్లామీయులు ఆ ప్రచార ప్రభావానికి గురయ్యారు. నమ్మారు. పాకిస్థాన్‌ను కోరారు. ముస్లింలకు ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేయాలని పెద్దఎత్తున ఉద్యమం ఆరంభించారు. ‘ఇస్లామీయులు, హిందువులు రెండు ప్రత్యేక దేశాలు. కలిసి ఉండటం కుదరదు. ఒకరి నాయకులు మరొకరికి ప్రతి నాయకులు. ఇలాంటి పరిస్థితిలో కలిసి ఉండటం ఎలా కుదురుతుంది?’ అని ప్రకటించి, పాకిస్థాన్‌ను కోరాడు. సర్దార్ పటేల్, పండిట్ నెహ్రు, రాజగోపాలచారి వంటి నాయకులు కూడా దేశ విభజన తప్ప మరో గత్యంతరం లేదన్నట్లు ప్రవర్తిస్తున్నారు.
ఒక్క గాంధీమహాత్ముడు మాత్రం దేశవిభజనను వ్యతిరేకిస్తున్నాడు. నాయకుల దృష్టిలో స్వాతంత్ర్య సాధనకు ప్రతిబంధకంగా నిలిచాడు. కానీ సామాన్యుల దృష్టిలో గాంధీ మహాత్ముడు. ఆయన తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. అలాంటప్పుడు హిందూ-ముస్లింలు కలిసి ఏకమైపోవటంలో ఆశ్చర్యం లేదు. కాబట్టి గాంధీ దేశవిభజన కానీయడు. ఆయన ఒక్కసారి సత్యాగ్రహం చేస్తే అంతా సవ్యమై పోతుంది. అన్ని సమస్యలు పరిష్కారమైపోతాయి. అని ప్రజలు నమ్మసాగారు. – ఎవరు ఎంతగా భయపెట్టినా, బెదిరించినా వారు గాంధీ మహాత్మునిపై నమ్మకంతో నిశ్చింతగా ఉండసాగారు.
కానీ పరిస్థితులు ప్రజలు ఊహించినట్టు లేవు.
గాంధీ మహాత్ముడంటే సామాన్య ప్రజలకు అచంచల విశ్వాసం ఉంది. కానీ ఆయన సహచరులే ఆయనను విమర్శిస్తున్నారు. ఆయన మాటలు పెడచెవిన పెడుతున్నారు. దేశంలో చెలరేగుతున్న పలురకాల సిద్ధాంతాలను నమ్మేవారు, తమతమ రంగుటద్దాలలో గాంధీ ప్రతిచర్యను చూసి దానికి విపరీతమైన వికృత వ్యాఖ్యానం చేసి ప్రచారం చేస్తూండటం వల్ల కూడా కొద్దిమందిలో గాంధీజీ పట్ల చులకన, నిరసనలు పెరుగుతూ వస్తున్నాయి.
గాంధీ మహాత్ముడికి నిజానిజాలు తెలుసు. ప్రజలు తనపై ఉంచిన విశ్వాసం తెలుసు. రాజకీయాలలో ఎలాగో తన అవసరం తీరిన తరువాత తనను పద్ధతి ప్రకారం పక్కకు నెడుతున్నారో తెలుసు. తన గురించి సమాజంలో ప్రచారం అవుతున్న అపొహలు, వికృత వ్యాఖ్యానాలు తెలుసు.
కానీ దైవంపై భారంవేసి ముందుకు సాగుతున్న ఆయన దేన్నీ పట్టించుకోలేదు. ఆత్మవిశ్వాసంతో ఆత్మ దిశానిర్దేశాన్ని అనుసరిస్తూ భగవన్నామ స్మరణతో ముందుకు సాగుతున్నాడు. ఎవరు తనను ఎంతగా పక్కకు నెట్టినా, తన మాటపట్ల ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని విస్మరించలేరని ఆయనకు తెలుసు. అందుకే ఆయన ‘దేశాన్ని విభజించే ముందు నా శరీరాన్ని ముక్కలు చేయండి’ అని కోరాడు. ఇది ప్రజలలో దేశవిభజన జరగదని, గాంధీజీ జరగనివ్వడు అన్న విశ్వాసాన్ని మరింత పెంచింది.
కానీ పాకిస్థాన్ సాధనలో గాంధీజీ అతిపెద్ద ప్రతిబంధకం అని ముస్లింలీగ్ నాయకులకు అర్థమయింది. వారు గాంధీజీ పట్ల ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తేగాని లాభంలేదని అర్థం చేసుకున్నారు. గాంధీజీ మంచితనాన్ని బలహీనతగా చూపి గాంధీజీ నిస్సహాయతను ప్రదర్శించాలని నిశ్చయించుకున్నారు.
ఫలితంగా ఆగష్టు 16, 1946ను ‘డైరెక్ట్ ఏక్షన్ డే’గా నిర్ణయించారు. ‘ముస్లింలీగ్’ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం ఆరంభించారు.
“ఈ రోజు నుంచీ మనం చట్టబద్దమైన చర్యలను వదిలేస్తున్నాం. మనం తుపాకీని చేపట్టాం. దాన్ని ఉపయోగిస్తాం’ అని ప్రకటించాడు మహమ్మదాలీ జిన్నా.
‘డైరెక్ట్ ఏక్షన్ అంటే రాజ్యాంగ వ్యతిరేక పద్ధతులను అనుసరించడం. ఏ పద్ధతిని అయినా వాడవచ్చు. డైరెక్ట్ ఏక్షన్ అంటే చట్ట వ్యతిరేక చర్య‘ అని జిన్నా కుడిభుజం లియాకత్ ఆలీఖాన్ ప్రకటించాడు.
“రక్తపుటేరులు పారందే పాకిస్థాన్ ఏర్పాటు సాధ్యం కాదు. ఒకవేళ రక్తపుటేరులే పారాల్సి వస్తే, అది ముస్లిమేతరుల రక్తమే అవ్వాలి‘ అని ప్రకటించాడు మరో ముస్లింలీగ్ నేత అబ్దుర్ రబ్ నిష్తార్.
అంటే గాంధీజీ నమ్మే అహింసాయుత ఉద్యమం కన్నా హింసాత్మక పోరాటం కోర్కెల సాధనకు అడ్డదారి అని ప్రపంచానికి నిరూపించాలని నిశ్చయించిదన్న మాట ముస్లింలీగ్. ఫలితంగా పాకిస్థాన్‌ను సాధించవచ్చు. గాంధీపట్ల దేశప్రజలలో నమ్మకాన్ని సడలించవచ్చు. గాంధీ, మహాత్ముడు కాదని, మామూలు మనిషి అని ప్రపంచానికి ప్రదర్శించవచ్చు. ఇదీ ముస్లింలీగ్ పథకం.
ఫలితంగా అహ్మదాబాద్, బొంబాయి, అలహాబాద్, అలీఘర్, ఢాకా వంటి ప్రాంతాలలో అల్లర్లు ప్రారంభమయ్యాయి. మారణాయుధాలు రహస్యంగా ముస్లింలీగ్ నేతల ఇళ్ళకు చేరసాగాయి. వారినుంచి కార్యకర్తలకు అందసాగాయి.
ఇదంతా అమియ చక్రవర్తికి తెలుసు.
అమియ చక్రవర్తి మహాత్మాగాంధీ భక్తుడు. ఆయన అడుగుజాడల్లో నడవాలని ప్రయత్నిస్తాడు. మహాత్మాగాంధీ బోధనలను తుచ తప్పకుండా అనుసరిస్తాడు. అహింస, సత్యాగ్రహం, అంటరానితన నిర్మూలన వంటి గాందీజీ ఆదర్శాలను ఆకళింపు చేసుకుని ఆచరణలో పెట్టాడు. శుచి, శుభ్రత, ప్రార్థన తప్పనిసరిగా సరిగ్గా గాంధీజీ లాగే, నిర్వహించే సమయానికి నిర్వహిస్తాడు. జీవితంలో ఒక్కసారయినా గాంధీజీని కలవాలన్నది ఆయన ఆశయం.
అందుకే అభిజిత్ మాటలలో నిజం ఉందని తెలిసినా గాంధీజీపై చెదరని విశ్వాసంతో సమాధానం ఇచ్చాడు అమియ చక్రవర్తి.
“గాంధీ మహాత్ముడే కానీ దివ్యాత్మ కాదు. సామాన్య మానవుడు తపన ఉంటే ఎలా మహాత్ముడిగా ఎదగగలడో నిరూపిస్తున్నాడు మహాత్ముడు. భారతీయ ధర్మంలో, భారతీయ తత్వంలో, భారతీయ సంస్కృతిలో అత్యుత్తమము, అత్యున్నతము అయిన దానికి ఆయన నిదర్శనం. కానీ ఆయన కూడా మనలాంటి మనిషే తనలోని మానవత్వాన్ని, దివ్యత్వాన్ని గుర్తించి దాన్ని ప్రస్పుటం చేసి ప్రపంచానికి మేలు చేయాలని ప్రయత్నిస్తున్నాడు. అంతే తేడా. నాకూ తెలుసు గాంధీ మహాత్ముడు దేశవిభజనను ఆపలేడని. అయినా నేను ఈ గ్రామం వదలిరాను. అవసరమైతే నా ప్రాణాలు ఇక్కడే వదులుతాను కానీ ఈ గ్రామం వదలిరాను. ఎలాంటి పరిస్థితులనయినా తట్టుకుని నిలబడేవాడే అసలయిన సత్యాగ్రాహి.”
“నీకు తెలుసా, ముస్లింలీగ్ వాళ్ళు ఆయుధాలు సమీకరిస్తున్నారు. హిందువులను, ఇతర మతాలవారిని బెదిరిస్తున్నారు. వాళ్ళు కసాయివాళ్ళు. వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. అందుకే అందరూ ఇళ్ళు, ఊళ్ళు వదలిపోతున్నారు. నేను కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. నువ్వూ వచ్చెయ్యి.”
ట్రీట్‌మెంట్ చేస్తున్న పిల్లవాడిని ప్రేమగా తాకాడు అమియ చక్రవర్తి. “కాస్త జాగ్రత్తగా చూసుకోమ్మా. తగ్గిపోతుంది” చెప్పాడు.
“మేము కూడా కలకత్తా వెళ్ళిపోతున్నాం తెల్లారే. ప్రయాణానికి మందులివ్వండి డాక్టర్” అడిగాడు.
ఎందుకు?” అని అడగలేదు అమియ చక్రవర్తి. మౌనంగా మందులు ఇచ్చి ‘జాగ్రత్తలు‘ చెప్పాడు.
ఆమె వెళ్ళగానే అన్నాడు అభిజిత్ “చూడు. గ్రామాలు గ్రామాలు తరలి సురక్షిత స్థలాలకు వెళ్ళిపోతున్నాయి. నువ్వొక్కడివే ఉండి ఏం చేస్తావు?”
“వైద్యం” నింపాదిగా సమాధానం ఇచ్చాడు అమియ చక్రవర్తి.
“ఎవరికి చేస్తావు? ముష్కరులకా? నిన్ను చంపేందుకు, నీ ఇల్లు లూటీ చేసేందుకు వచ్చిన గూండాలకా?” కోపంగా అడిగాడు అభిజిత్.
“మానవులకు. గూండాలు, ముష్కరులు, హిందువులు, ముస్లింలు ఇవన్నీ మనం పెట్టుకున్న పేర్లు. మనం సృష్టించుకున్న భేదభావాలు. అందరూ మనుషులే. ప్రతివాడిలో మానవత్వం ఉంటుంది. మనిషి మీద నమ్మకం ఉంటే రాక్షసుడు కూడా మనిషిగా ప్రవర్తిస్తాడు. నువ్వు ఎలా వ్యవహరిస్తే ప్రపంచం నీతో అలా వ్యవహరిస్తుంది. నువ్వు భయపడితే నిన్ను భయపెడుతుంది. నువ్వు ధైర్యంగా నిలబడి పశువులా ప్రవర్తించే మనిషిలోనూ మనిషిని చూడగలిగితే అలజడిలోని పశువు ఓడిపోతుంది. మానవత్వం జాగృతం అవుతుంది. ఇదే అహింస సిద్ధాంతం. ఇదే బాపూజీ చెప్పేది” నిర్భయంగా చెప్పాడు.
“ఊరంతా వెళ్ళిపోతుంది. ఒక్కడివి ముస్లింలీగ్ గూండాలను ఎదుర్కొంటావా? నువ్వు నీతులు చెప్పేలోగా నీ నాలుక కోస్తారు. నువ్వు సిద్దాంతం చెప్పేలోగా సర్వస్వం దోచుకుంటారు. నీ అహింస, సత్యాగ్రహం వారి కత్తులముందు నిలవలేదు. లాభం లేదు.” ఆవేశంగా అన్నాడు అభిజిత్.
“అది నీ అభిప్రాయం అభిజిత్. భయపడటం, పిరికితనం మానవలక్షణం కాదు. నేను ప్రాణాలు అరచేత పట్టుకొని పారిపోను. ముస్లింలీగ్ వాళ్ళకు కావలసింది అదే. మానవ వ్యక్తిత్వ నిర్మాణం గాంధీజీ ప్రధానోద్దేశ్యం. స్వాతంత్ర్యాన్ని సరైన రీతిలో నడిపించే మానసిక శక్తి, పరిణతి, మౌలిక విలువలు కల పౌరులను తయారుచేయటం గాంధీ పోరాట లక్ష్యం. మనుషులుగా ఎదగాలని ప్రయత్నిస్తున్న వారిపై దౌర్జన్యం చేసి, పశువుల్లా ప్రవర్తించి, వారిలోని భయాన్ని ప్రేరేపించటం ద్వారా, ఆత్మవిశ్వాసం కోల్పోయి మానవులుగా ఎదిగేవారు ప్రాణభయంతో అన్నిటినీ వదలి పారిపోవటం వారికి కావాల్సింది. తద్వారా మహాత్మాగాందీ పోరాటం విఫలమనీ అహింస లాభంలేనిదనీ, పనికిరానిదనీ నిరూపించటం వారి ఉద్దేశ్యం. అందుకే ‘హింస’ బెదిరింపులు చేస్తున్నారు. దానికి లొంగిపోవటం ఓటమిని ఒప్పుకోవటమే. మహాత్మాగాంధీ పట్ల అవిశ్వాసాన్ని ప్రకటించటమే” నిశ్చయంగా చెప్పాడు. అమియ చక్రవర్తి.
“అంటే….. అందరం మేకల్లా నిలబడి శాంతి శాంతి అంటూ ‘మే… మే…’ అనే మేకలు బక్రీద్ నాడు బలయినట్లు బలయిపోవాలా! అప్పుడు గాంధీజీ గెలుస్తాడా?’ వ్యంగ్యంగా అడిగాడు అభిజిత్..
“గాంధీజీ ఒక సందర్భంలో ఏమన్నారో తెలుసా? పోలీసులు, సైన్యం మిమ్మల్ని రక్షించాలని కోరుకోవటం యుద్ధం ఆరంభం కాకముందే ఓటమిని ఒప్పుకోవటం లాంటిది. పిరికి వారిని ఈ ప్రపంచంలో ఎంతమంది పోలీసులయినా, ఎన్ని సైన్యాలయినా రక్షించలేవు. వ్యక్తిలోని పిరికితనం, బలహీనతలు, ఆత్మవిశ్వాస రాహిత్యం ఇలా బేలగా ప్రవర్తించేట్టు చేస్తాయి. దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాడాలి. తల తెగిపడే వరకూ పోరాడాలి. ఒకవేళ గ్రామంలో అందరూ ముస్లింలై ఒక్క హిందూ ఉన్నా ఆ ఒక్క హిందూ వారి నడుమ బ్రతికే ధైర్యం చేయటమే కాదు అవసరమైతే వీరుడిలా పోరాడాలి. వీరమరణం చెందాలి. ధైర్యాన్ని, శౌర్యాన్ని మెచ్చుకొనివారుండరు. అలా మరణం చెందటమే ఉత్తమం. అదీ అహింస పోరాటం. పిరికివాడిలా పారిపోవటం కాదు అన్నారు. ఇప్పుడు చెప్పు గాంధీజీని విశ్వసించే నేను ప్రమాదాన్ని శంకించి పారిపోతే నేను సత్యాగ్రాహిని అవుతానా? బాపూజీ ముందు తలెత్తుకుని నిలబడి, కళ్ళల్లోకి సూటిగా చూడగలనా?” శాంతంగా అడిగాడు అమియ చక్రవర్తి.
అభిజిత్ మాట్లాడలేదు. ‘నీ ఇష్టం’ అన్నట్టు ఓసారి చూసి మౌనంగా వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిపోయిన తరువాత అమియ చక్రవర్తి స్నానం చేశాడు.
ప్రార్థనకు కూర్చున్నాడు.
ప్రతిరోజూ అతడి ప్రార్థనకు హిందువులూ, ముస్లింలు పెద్ద సంఖ్యలో వచ్చేవారు. ఆ రోజు ఎవ్వరూ రాలేదు.
అల్లా తేరోనామ్… ఈశ్వర్ తేరోనామ్
సబ్ కో సన్మతి దే భగవాన్
పాడటం ఆరంభించాడు అమియ చక్రవర్తి. అతడి ప్రశాంతతను దూరంగా వినిపిస్తున్న నినాదాలు భగ్నం చేశాయి.
‘అల్లాహో అక్బర్’
‘పాకిస్థాన్ జిందాబాద్’
‘లడ్కే లేంగే పాకిస్థాన్’
‘ముస్లింలీగ్ జిందాబాద్‘
వారి నినాదాలు వినబడకుండా ప్రార్థనను మరింత బిగ్గరగా పాడటం ఆరంభించాడు అమియ చక్రవర్తి.
***
‘డైరెక్ట్ ఏక్షన్’ అనగానే చరిత్రలో కలకత్తాలో జరిగిన మారణకాండ మాత్రమే స్ఫురిస్తుంది. ఇందుకు కారణం ఇతర ప్రాంతాలలో అల్లర్లు జరిగినా వాటిల్లో ముస్లింలు అధిక సంఖ్యలో దెబ్బ తినటంతో అనుకున్న ఫలితం రాలేదు.
కలకత్తా మారణకాండ’ అందుకు భిన్నం. కలకత్తాలో షహీద్ సుహ్రావర్దీ ముఖ్యమంత్రిగా ముస్లింలీగ్ ప్రభుత్వం ఉంది.
డైరెక్ట్ ఏక్షన్‌కు పిలుపు నిచ్చింది ముస్లింలీగ్.
దాంతో ఫలితాలు భారతీయులు ఆశించినట్టు కాదు ముస్లింలీగ్ కోరినట్టు ఉండటం సహజం.
పద్దతి ప్రకారం డైరెక్ట్ ఏక్షన్‌కి ముందే కీలకమైన పోలీసు పోస్టుల నుండి హిందూ ఆఫీసర్ల బదిలీలయ్యాయి. ఆగస్ట్ 15న అర్థరాత్రికి కలకత్తాలోని 24 పోలీసు స్టేషన్లలో 22 పోలీసు స్టేషన్లు ముస్లిం ఆఫీసర్ల ఆధీనంలోకి వచ్చాయి. మిగతా రెండు పోలీసు స్టేషన్లలో ఆంగ్లో ఇండియన్లు అధికారులుగా ఉన్నారు. ఆగష్టు 16న రాష్ట్రప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించింది. ఆ రోజు పలురకాల మారణాయుధాలు ముస్లింలీగు కార్యకర్తలకు అందేయి. ఇతర ప్రాంతాల నుండి ముస్లింలీగు కార్యకర్తలు పెద్ద ఎత్తున కలకత్తాలోని ప్రవేశించారు.
ఆగష్టు 15 అర్థరాత్రి ముస్లింలీగ్ నినాదాలు పాకిస్థాన్‌ను సమర్థిస్తూ నినాదాలిస్తూ మారణాయుధాలు ధరించిన ముస్లింలీగ్ కార్యకర్తలు కలకత్తా వీధులలో విశృంఖలంగా తిరిగారు. అర్థరాత్రి వారి నినాదాలతో గడగడ వణికింది.
ఆగష్టు 16 ఉదయం నుండి కలకత్తాలో కనివినీ ఎరుగని రీతిలో అతి ఘోరంగా హత్యలు, లూటీలు, గృహదహనాలు, మానభంగాల పర్వం ఆరంభమయింది. గతంలో, ఏప్రిల్ 1946లో ‘ముస్లింలీగ్ లెజిస్లేచర్ కన్వెన్షన్‘లో సర్ ఫిరోజ్‌ఖాన్ నూన్ మాట్లాడుతూ ‘ముస్లింలు భవిష్యత్తులో జరిపే మారణకాండ చెంగిజ్ ఖాన్ సైతం సిగ్గుపడేలా చేస్తుంది” అన్నాడు. అతడి మాటలను నిజం చేస్తూ ముస్లింలీగ్ కార్యకర్తలు ఆ రోజు చెంగిజ్ ఖాన్ సైతం దయాళువుగా అనిపించే రీతిలో హింసను నెరపారు. ముస్లింలీగ్ కార్యకర్తలు ఇలా దారుణ మారణకాండను జరుపుతున్నప్పుడు పోలీసులు మౌన ప్రేక్షకులలా నిలబడ్డారు. ఈ అల్లర్లలో పాల్గొనని ముస్లింలను ముఖ్యమంత్రి స్వయంగా రెచ్చగొట్టి మరీ ముందుకు నడిపాడు. విపరీతమైన ఆస్తినష్టం, ప్రాణనష్టం సంభవించింది. కలకత్తా స్థంభించిపోయింది. ఇంతటి రాక్షసత్వం మనుషుల్లో చూసి స్థాణువైపోయింది. కలకత్తా మొత్తం ఆర్తనాదాలతో, హాహాకారాలతో, పాశవిక శక్తుల నినాదాలతో, హర్షధ్వానాలతో ‘కాళిక’ సైతం కంపించే రీతిలో రాక్షసుల కరాళనృత్యంతో తల్లడిల్లిపోయింది. వీధులు శవాలతో, రక్తపుటేర్లతో నిండిపోయాయి. శవాలను నక్కలు, కాకులు, గ్రద్దలు పీక్కు తినసాగాయి.
అయితే, ఇక ఎవ్వరూ తమని రక్షించరని గ్రహించిన కలకత్తాలో ముస్లిమేతరులు తిరగబడటం ప్రారంభించారు. మూడోరోజుకల్లా ముస్లింలీగు కార్యకర్తలు తోక ముడవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు రాష్ట్రప్రభుత్వం సైన్యం సహాయాన్ని కోరింది. దాంతో కలకత్తాలో శాంతి భద్రతలు నెలకొన్నాయి.
ఇంత జరిగాక, మహమ్మదాలీ జిన్నా, కలకత్తాలో జరిగిన మారణకాండ ‘ముస్లింలీగ్’కు చెడ్డపేరు తేవటం కోసం హిందువులు మూకుమ్మడిగా జరిపిన కుట్రగా అభివర్ణించాడు.
***
‘కలికతార్ ప్రతిశోధ చాయ్”
‘కలకత్తాకు ప్రతీకారం తీర్చుకుంటాం’
ప్రార్థన పూర్తయింది. కళ్ళు తెరిచాడు అమియ చక్రవర్తి. అతనొక్కడే ఉన్నాడు ప్రార్థనలో.
బయట శబ్దమయింది. తొంగి చూశాడు.
“డాక్టర్ సాబ్! మా చిన్నదానికి బాగాలేదు” పాపని టేబిల్ పై పడుకోబెట్టాడు అహ్మద్.
అమియ చక్రవర్తి మౌనంగా పరీక్షించాడు. మందులు ఇచ్చాడు. బయట దూరంగా ముస్లింలీగ్, పాకిస్థాన్‌ను సమర్థిస్తూ నినాదాలు వినిపించాయి.
అహ్మద్, అమియ చక్రవర్తి చేయి పట్టుకున్నాడు. “డాక్టర్ సాబ్! మీరు మంచివారు. కానీ మీ ప్రాణాలకు ప్రమాదం. మీరు వెళ్ళిపోండి ఇక్కడినుండి. రోజులు బాగాలేవు” అన్నాడు.
శాంతంగా నవ్వాడు అమియచక్రవర్తి.
“నేను కూడా వెళ్ళిపోయి ఉంటే, నీ పాపకు చికిత్స ఎవరు చేసేవారు?” అడిగాడు.
“డాక్టర్లంతా హిందువులు. అందరూ ఊళ్ళు విడిచి వెళ్ళిపోతున్నారు. మా ఊళ్ళో వైద్యుడు లేక ఇక్కడికి రావాల్సి వచ్చింది. కానీ మీరు ఇక్కడే ఉండటం క్షేమకరం కాదు” పాపని ఎత్తుకుని చెప్పాడు అహ్మద్.
“ఫి అమానిల్ల’ అన్నాడు అమియ చక్రవర్తి. “ఫి అమానిల్ల. అల్లా తుమ్తో రక్షాకరే” అని వెళ్ళిపోయాడు అహ్మద్. అతడు వెళ్ళిన తరువాత ఒంటరిగా కూర్చున్నాడు అమియ చక్రవర్తి.
గాంధీగారి ఫోటోకు దండం పెట్టుకున్నాడు. ‘రామ రామ రామ’ అనుకుంటూ కూర్చున్నాడు. దూరంగా నినాదాలు వినిపించాయి.
* * *
కలకత్తాలో డైరెక్ట్ ఏక్షన్ విఫలమయ్యేందుకు ముస్లింల సంఖ్య తక్కువగా ఉండటమేనని ముస్లింలీగ్ నేతలు భావించారు. కలకత్తాకి ప్రతీకారం ‘నవఖలి’ లో తీసుకోవాలని నిశ్చయించారు.
నవఖలి జిల్లా విస్తీర్ణం 1658 చదరపు మైళ్ళు. ఆ జిల్లాలోని 25 లక్షల జనసంఖ్యలో 81 శాతం ముస్లింలు. హిందువులు 19 శాతమే అయినా 64 శాతం జమీందారీ హిందువులదే. పంటపొలాల్లో పనిచేసేది, అధిక సంఖ్యలో ముస్లింలు. దేశంలో ఇతర ఏ ప్రాంతాలలో లేనంతమంది మౌలానాలు, ముల్లాలు నవఖలిలో ఉన్నారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ముస్లింలు నవఖలి వచ్చి చేరారు.
కలకత్తాలో జరిగిన ఎదురుదెబ్బను నవఖలిలో ప్రతీకారం తీర్చుకునేందుకు పథకాలు సిద్ధమయ్యాయి. పద్ధతి ప్రకారం మారణకాండకు రంగం సిద్ధమయింది. అక్టోబర్ 10, లక్ష్మీపూజ రోజు నవాఖలిలో మారణకాండ ఆరంభమయింది. ముందుగా నవాఖలి జిల్లాను చేరే రోడ్లను ధ్వంసం చేశారు. బ్రిడ్జిలను కూలగొట్టారు. టెలిఫోన్, టెలిగ్రాఫ్ వైర్లను తెంపేశారు. ఎలాంటి వెరపు, జంకు లేకుండా ముస్లింలీగ్ కార్యకర్తలు ఉదయం నుండి మారణకాండను ఆరంభించారు. పిశాచాల్లా చెలరేగిపోయారు. ‘కలికతార్ ప్రతిశోధ చాయ్’ అని అరుస్తూ ముస్లిమేతరులపై విరుచుకుపడ్డారు. అందినవారిని అందినట్టు చంపారు. మానభంగాలు చేశారు. మహిళలను బలవంతంగా మతం మార్చారు. వారి బంధువుల ముందే వారి భర్తలను, పిల్లలను చంపిన వాడికిచ్చి వివాహం చేశారు. బలవంతంగా మతమార్పిడులు చేశారు. ప్రతి గుంపుతో పాటు పెళ్ళిళ్ళు చేసేందుకు మతం మార్చేందుకు ముల్లాలు, మౌల్వీలు ఉండేవారు. ఇక లూటీలు, దహనాలకు కొదువలేదు. నవఖలిలో జరుగుతున్నది తెలిసి దేశమంతా హాహాకారాలు చెలరేగాయి. ప్రతీకారంగా బీహార్లో ముస్లింలపై దాడులు ఆరంభమయ్యాయి.
దాడులకు గురయి ప్రాణాలు కోల్పోతున్నవారు, నష్టపోతున్నవారితో సహా ప్రతి బాధితుడి మనస్సులో ఒకటే ప్రశ్న మెదలుతోంది? గాంధీ మహాత్ముడు ఏం చేస్తున్నాడు? గాంధీ మహాత్ముడు ఏం చేస్తున్నాడు?
* * *
అందరి సలహాలను పెడచెవిలో పెట్టాడు గాంధీజీ. కలకత్తా ప్రయాణమయ్యాడు.
“మీ ఆరోగ్యం బాగాలేదు. మీరు యువకులు కారిప్పుడు. సత్యాగ్రహం చేయకండి. ప్రాణాలకు ప్రమాదం.”
“పోనీ.. ప్రాణాలు పోయినా ఫరవాలేదు.”
“మీ ప్రాణాలు పోవటమే వారికి కావాల్సింది. అయినా మనుషులు పిశాచాల్లా ప్రవర్తిస్తున్న చోటుకి మీరు వెళ్ళి ఏం చేస్తారు?”
ప్రశ్న అడిగిన వారివైపు చూశాడు మహాత్మాగాంధీ. “నేనేం సాధిస్తానో నాకే తెలియదు. కానీ నేను అక్కడికి వెళ్ళకపోతే నన్ను నేను క్షమించుకోలేను. ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే వారి నడుమ నిలవనివాడు ప్రజాసేవకుడు కాదు” అన్నారు గాంధీ నిశ్చయంగా.
* * *
“మహాత్మాగాంధీ నవఖలీ వస్తున్నాడు.”
కార్చిచ్చులా ఈ వార్త ప్రాంతమంతా వ్యాపించింది.
కానీ వార్త విన్న హిందువులలో సంతోషం లేదు. గాంధీజీ వచ్చి ఏం చేస్తాడు?
“చనిపోయినవారిని బ్రతికిస్తాడా?”
“పోయిన మా ఆస్తులను మాకు అప్పగిస్తాడా?”
“మారిన మతం నుండి మమ్మల్ని రక్షిస్తాడా?” ఇలాంటి పలు ప్రశ్నలు నిరాశలో హిందువులు అడుగుతున్నారు.
“రానీ. గాంధీకి ముస్లింలీగ్ తడాఖా చూపిస్తాం.”
“పాకిస్థాన్‌కు అడ్డుపడితే అడ్డంగా నరుకుతాం.”
హిందువులలోనూ, ముస్లింలలోనూ తనపట్ల ఉన్న అనుమానాలు, ఆవేశాలు గాంధీజీకి తెలుసు. కానీ ఆయనకు సత్యం పట్ల అచంచల విశ్వాసం ఉంది. మనుషులలోని మంచి పట్ల నమ్మకం ఉంది. దైవంపై నమ్మకం ఉంది. ఆత్మవిశ్వాసం ఉంది.
“బెంగాల్ పూర్తిగా శాంతిమయం అయ్యేవరకూ నేను ఇక్కడినుంచి కదలను. సంవత్సరాలైనా ఇక్కడే ఉంటాను. అవసరమైతే ఇక్కడే మరణిస్తాను. కానీ నా వైఫల్యాన్ని అంగీకరించను. నేను ఇక్కడ ఉండటం వల్ల ప్రజలలో ఆశాభావం చిగురించపోతే, నామీద నమ్మకం లేకపోతే నేను బ్రతకటం కన్న మరణమే మంచిదని భావిస్తాను.” అని ప్రకటించాడు మహాత్మాగాంధీ..
ఆయన నవఖలి వెళ్ళకుండా ముస్లింలీగ్ నేతలు అడ్డుపడ్డారు. కుంటిసాకులు చూపారు. నిష్ఠూరాలాడేరు. ‘మీరు బీహార్‌కి వెళ్ళాల్సింది. అక్కడ ముస్లింలు ఊచకోతకు గురవుతున్నారు. నవఖలికి మీరు రాకున్నా ఫరవాలేదు’ అన్నారు.
మహాత్మాగాంధీ ఎవరి మాటా వినలేదు. బీహార్ విషయమై జవహర్లాల్ నెహ్రూతో మాట్లాడేడు.
బెంగాల్లో జరిగిన దానికి బీహార్ ప్రతీకారం అన్న వాదనను గాంధీజీ అంగీకరించలేదు.
“ఒకడు చెంపమీద కొట్టి పారిపోతే ఆ మతానికి చెందిన ఇతరుల మీద ప్రతీకారం తీర్చుకోవటం మానవత్వం కాదు. ఎవడో నా కూతురిని అపహరిస్తే, వాడి స్నేహితుడి కూతురిని నేను అపహరించటం ప్రతీకారమా? నవఖలికి ప్రతీకారం బీహార్లో తీర్చుకోవటం అర్థవిహీనం” అని మందలించారు.
అంతేకాదు ‘హింసకు దిగుతున్న వారిని నియంత్రించేందుకు సైన్యం అవసరమని తోచిందంటే, నాయకులకు ప్రజలపై పట్టు లేదన్నమాట’ అని నాయకులను విమర్శించారు.
నవఖలి వైపు సాగారు.
***
“డాక్టర్ సాబ్! మీరు దేవుడు. నా భార్య ప్రాణం కాపాడేరు” చేతులు జోడించాడు అబ్దుల్
అతడి చేతులను పట్టుకున్నాడు అమియ చక్రవర్తి.
“అందరి ప్రాణాలు కాపాడేది, తీసేది దైవం. మనం నిమిత్త మాత్రులం. మన కర్తవ్యం మనం నెరవేర్చాలి. అంతే” అన్నాడు.
డాక్టర్‌కి అభివాదం చేసి రెండడుగులు ముందుకు వేసిన అబ్దుల్ మళ్ళీ వెనక్కు వచ్చాడు. ఏదో చెప్పాలని సంశయిస్తూ ఆగాడు.
“ఏంటది అబ్దుల్? ఇంకా ఏమన్నా కావాలా?” అడిగాడు అమియ చక్రవర్తి.
తలవంచుకుని లో-గొంతుకలో చెప్పాడు అబ్దుల్ “డాక్టర్ సాబ్! మీరు ఇక్కడ ఉండటం ప్రమాదకరం. ఇంతకాలం మీపై దాడికి వచ్చిన గూండాలను మేము అడ్డుకున్నాం. మిమ్మల్ని ఇకపై కాపాడుకోలేం” విచారంగా చెప్పాడు అబ్దుల్
“ఏమైంది అబ్దుల్? ఇప్పుడు పరిస్థితి ఇంకా మెరుగుపడాలి. మహాత్మాగాంధీ వచ్చారు. గొడవలు సద్దుమణగాలి. ఇంక ఏం ప్రమాదం ఉంది?” అడిగాడు అమియ చక్రవర్తి అనునయంగా..
“డాక్టర్ సాబ్! గాంధీజీ హిందువుల నాయకుడు. దాంతో హిందువులకు ధైర్యం వచ్చింది. మతం బలవంతంగా మారిన వారు మళ్ళీ హిందూ ధర్మానికి మారిపోతున్నారు. ముస్లింలీగు వారిపై కేసులు పెడుతున్నారు. ఇది ముస్లిం లీగు వారిలో కోపం కలిగిస్తోంది. కేసులు ఉపసంహరించుకుంటే హిందువులను తమ మధ్య ఉండనిస్తామని కొందరు గాంధీగారితో అంటే ఆయన అందుకు ఒప్పుకోలేదు. ‘నేరం చేసినవాడు శిక్ష అనుభవించాలి. సిగ్గుతో పశ్చాత్తాపపడాలి. నేరం చేసి, మళ్ళీ నేరారోపణను ఉపసంహరించుకోవడం అర్థంలేని పని. అదీగాక అన్నదమ్ముల్లా కలిసి ఉండాల్సినవారు నిబంధనల నడుమ కలిసి ఉండటం స్నేహం కాదు’ అన్నారు గాంధీ. ఇది ముస్లింలీగు వారిలో కలవరం కలిగిస్తోంది. గాంధీ మిలటరీని తెచ్చి ముస్లింలను హింసిస్తాడు. హిందువులకు ఆస్తులు కట్టుబెడతాడని వారు భావిస్తున్నారు. అందుకని తమ నేరాన్ని గుర్తించి చెప్పే సాక్షులు ఎవరూ ఉండకూడదని వారు దాడులు చేస్తున్నారు. మాకు కూడా వర్తమానం వచ్చింది. అడ్డుపడితే ఈసారి మిమ్మల్ని కూడా నరికేస్తాం అంటున్నారు. కాబట్టి మీరు త్వరగా సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోండి” కన్నీరు కారుతుండగా చెప్పాడు అబ్దుల్లా,
అతడివైపు జాలిగా చూశాడు అమియ చక్రవర్తి.
“ఏడవకు అబ్దుల్లా. నాకేం కాదు. నేను ఇక్కడినుంచి ఎటూ కదలను. అందులో మహాత్మాగాంధీ ఇక్కడికి వస్తారు. అప్పుడు ఆయనకి నేను గర్వంగా చెప్పాలి. మీ సిద్దాంతం ఎన్నటికీ విఫలం కాదు. సత్యమేవ జయతే.. సత్యం దైవం. సత్యాగ్రహం తిరుగులేని ఆయుధం. అహింస పరమోధర్మ అని నిరూపించానని చెప్పాలి. నేను ఎక్కడికీ వెళ్ళను. నా గురించి భయపడకు.” ఆన్నాడు అమియ చక్రవర్తి.
అబ్దుల్లా తలవంచుకుని వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళినవైపు కాసేపు చూస్తూ నిలబడ్డాడు అమియ చక్రవర్తి. తరువాత ప్రార్థన ఆరంభించాడు.
వైష్ణవ జనతో తేనే కహియెజె పీడ్ పరాయీ జాణేరే...
* * *
ప్రార్థన ఆరంభించాడు మహాత్మాగాంధీ.
అనేక ప్రాంతాలలో జరిగినట్టే ఆయన ప్రార్థన ఆరంభించగానే ‘రామ’ శబ్దం వినటంతోటే ముస్లింలు లేచి వెళ్ళిపోతున్నారు.
కానీ బలవంతాన మతమార్పిడికి గురయి మళ్ళీ హిందూమతం స్వీకరించిన వారు ఉత్సాహంతో రామ నామస్మరణ చేస్తున్నారు.
గాంధీజీ మనస్సులో వేదన వీచిక కదలాడింది.
ఆయనకు ఒక విషయం స్పష్టంగా అర్థమయింది. ఇక ఈ ప్రజల నడుమ ఈ అనుమానాలు, వైషమ్యాలు ఎల్లప్పటికీ ఉంటాయి. ప్రజల మనస్సుల్లో విషం ఎంత లోతుగా చేరిందంటే దాన్ని ప్రక్షాళన చేయటం, అంత సులభం కాదు. దారుణ మారణకాండ ఆనవాళ్ళను ప్రత్యక్షంగా చూస్తున్న ఆయన హృదయం కన్నీరు మున్నీరయింది. కానీ కంట ఒక్క నీటి చుక్క కూడా రాలేదు. స్వయంగా కన్నీళ్ళు కార్చేవాడు ఇతరుల కన్నీళ్ళు తుడవలేడని ఆయనకు తెలుసు. కానీ ఆయన మనస్సులో ఎక్కడో ఇన్నేళ్ళ తన ప్రయాస, ప్రజల మనస్సుల్లో నిండిన విషంతో వ్యర్థం అవుతున్నదన్న వైఫల్య భావన కలుగుతోంది. ఆ నిరాశ భావనలో స్నేహితుడికి ఉత్తరం రాశారు గాంధీజీ.
“ఇక్కడ నేను చేస్తున్న పని నా జీవితంలో చివరిది అవుతుందేమో. ఒకవేళ ఇక్కడ నుంచి నేను బ్రతికి బట్టకట్టి విజయవంతంగా బయటకు వస్తే అది నాకు నూతన జన్మ అవుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా నా అహింస కఠోర పరీక్షను ఎదుర్కొంటోందిక్కడ” అని రాశారు గాంధీ.
“గాంధీజీ ఎల్లప్పుడు నవాఖలిలో ఉండరు. ఆయన వెళ్ళిన తరువాత మీకు దిక్కెవరు?” అని ముస్లింలీగు గూండాలు హిందువులను బెదిరిస్తున్నారని గాంధీజీకి తెలిసింది.
హిందువులు తనని ముస్లింల పక్షపాతి అనుకుంటున్నారని, ముస్లింలు తనని హిందూ సమర్ధకుడిగా భావిస్తున్నారని ఆయనకు తెలుసు.
“నా జీవితంలో ఇంతటి చీకటిని నేను ఎన్నడూ ఎదుర్కోలేదు. రాత్రి సుదీర్ఘంగా అనిపిస్తోంది. నేను అన్నిటికీ సిద్దం. విజయం సాధిస్తాను. లేకపోతే మరణిస్తాను. విజయం అంటే హిందూముస్లింలు సామరస్య భావనతో సహజీవనం సాగించటం, ఇది వీలు కాకపోతే అందుకు ప్రయత్నిస్తూ ప్రాణాలు విడుస్తాను. దేవుడి ఇచ్ఛానుసారం ఏమవ్వాలో అదే అవుతుంది” అన్నారు గాంధీజీ ఓ సందర్భంలో.
మరో సందర్భంలో “నా మాటకు విలువలేదని అర్థమౌతోంది” అన్నారు. కానీ మొండిగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగారు.
ఆయన అడుగుపెట్టిన చోట శాంతి నెలకొనటం ఆరంభించింది. దేశం నలుమూలల నుంచి సహాయం అందసాగింది.
కానీ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తూ, అక్కడివాళ్ళ అనుభవాలు వింటున్న ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీళ్ళు ఊరసాగాయి. హృదయం బద్దలవసాగింది.
తన మనోభావాలు పైకి కనబర్చకుండా మహాత్మాగాంధీ అందరికీ విశ్వాసాన్నిస్తూ అడుగుపెట్టిన చోట శాంతి నెలకొల్పుతూ ముందుకు సాగుతున్నాడు.
***
అల్లాహో అక్బర్
పాకిస్తాన్ జిందాబాద్
మహాత్మాగాంధీ ముర్దాబాద్
ముస్లింలీగ్ జిందాబాద్….
అరుపులు రాను రాను దగ్గరవుతున్నాయి. నిద్రలోంచి ఉలిక్కిపడి లేచాడు అమియ చక్రవర్తి. బయట అరుపులు వినిపిస్తున్నాయి. దివిటీలు కదుల్తున్నాయి. వెలుగునీడలు ఇంటి గోడలమీద భయంకరంగా కదులుతున్నాయి. ఇంతలో ఎవరో అరిచారు. “బాహర్ ఛేంచో సాలె మారే కాఫిర్ కో” భయంకరంగా వినిపిస్తున్నాయి అరుపులు. దేవుడిని తలుచుకున్నాడు అమియ చక్రవర్తి. మహాత్మాగాంధీకి నమస్కరించాడు.
‘నేను ఎంత నిజాయితీ కల సత్యాగ్రహినో నిరూపించుకునే అవకాశం లభిస్తోంది. మీకు నా మీద ఉన్న నమ్మకాన్ని నిలుపుకుంటాను’ అనుకున్నాడు.
ఇంతలో తలుపు పగిలింది.
సముద్రంలా లోపలికి దూసుకువచ్చారు ముస్లింలీగు గూండాలు. వారి చేతుల్లో రకరకాల మారణాయుధాలున్నాయి.
లోపలికి వస్తూనే అన్నిటినీ విరగొట్టటం ప్రారంభించారు. దోచుకోవడం ప్రారంభించారు. జరుగుతున్నదాన్ని తనది కానట్టి ఓ విచిత్రాన్ని చూస్తున్నట్టు చూడసాగాడు అమియ చక్రవర్తి. మనుషుల్లా కాదు రాక్షసుల్లా కదలుతున్నాయి వాళ్ళ నీడలు చీకట్లో.
ఇంతలో ఒకడి దృష్టి బొమ్మలా నిలబడి ఉన్న అమియ చక్రవర్తిపై పడింది. “మార్దే సాలెకో” అరిచాడు. ఓ గుంపు అతడివైపు దూకింది.
అందినచోటల్లా అతడిని తన్నారు. రక్తసిక్తమయ్యాడు అమియచక్రవర్తి. ఒకడు కత్తి మెడమీద పెట్టి అడిగాడు.
“మతం మారతావా? ప్రాణాలు కోల్పోతావా?”
అమియ చక్రవర్తి “హే రామ్” అన్నాడు.
“రామ్ నై కుచ్ నై హమ్ హై. చర్మం వొలుస్తాం. పళ్ళు పీకుతాం. చెవులు, ముక్కు కోస్తాం. ఘోరమైన చావు చస్తావు. మతం మారు. బ్రతికిపోతావు” మౌల్వీ ముందుకు వచ్చి చెప్పాడు.
“హే రామ్” అన్నాడు అమియ చక్రవర్తి.
ఒకడు కత్తితో అతని ముఖం మీద గాటుపెట్టాడు. వాడు కత్తి తీస్తున్నప్పుడే వెనుక నుంచి ఎవరో కత్తితో అమియ చక్రవర్తిని పొడవటానికి ముందుకు వంగాడు. దాంతో వెనక్కి తీస్తున్న కత్తి అతడికి గుచ్చుకుంది.
“యా అల్లా” అరిచాడు. అమియ చక్రవర్తిని వదలి అందరూ అతడి చుట్టూ మూగారు.
అతడు బాధతో కేకలు పెడుతున్నాడు. లుంగలు చుట్టుకుపోతున్నాడు. అతడికి లోతైన గాయమైంది.
అమియ చక్రవర్తి తేరుకున్నాడు. జరిగింది గ్రహించాడు. అతడు ఆ గుంపుకు నాయకుడని గ్రహించాడు.
వెంటనే వాళ్ళని జరగమన్నాడు. “రోగికి గాలిని అందనీయండి” అరిచాడు తన కిట్ బ్యాగ్ తీసుకున్నాడు.
నేలమీద పొర్లుతున్న అతడి కాళ్ళు చేతులు కదలకుండా పట్టుకోమని పురమాయించాడు. గాయాన్ని పరిశీలించాడు. చికిత్స ఆరంభించాడు. అందరూ మౌనంగా జరుగుతున్నది గమనించసాగారు.
దోపిడీ ఆగిపోయింది. లూటీ ఆగిపోయింది. నినాదాలు ఆగిపోయాయి. హింస ఆగిపోయింది. సర్వం నిశ్శబ్దమైపోయింది. అది మానవత్వం విజయం సాధించినపుడు నెలకొనే నిశ్శబ్దం. మనిషి తనలోని దైవత్వ భావనను గుర్తించినప్పుడు విస్తుపోయి అభినందనగా ప్రపంచం నివాళులర్పించే నిశ్శబ్దం.
గంటన్నర అయింది.
“ప్రాణాలకు ప్రమాదం లేదు. కానీ రక్తం పోయింది కాబట్టి నీరసంగా ఉంటాడు. ఈ మందులు గంటగంటకు ఇవ్వండి రేపు సాయంత్రం ఓసారి తెచ్చి చూపించండి” అన్నాడు అమియ చక్రవర్తి.
వారు తలలాడించారు. డాక్టర్‌కు నమస్కరించారు. తమ నాయకుడిని తీసుకుని వెళ్ళిపోయారు, ఎక్కడివక్కడ వదిలేసి..
వాళ్ళు వెళ్ళిన తరువాత ఆమియ చక్రవర్తికి తన గాయాల గ్రహింపు వచ్చింది. గాయాలకు కట్టు కట్టుకొన్నాడు. మందు వేసుకొన్నాడు. ఈ పని చేస్తున్నంతసేపూ అతని మనసులో ఒకేపాట మార్మోగుతోంది.
‘వైష్ణవజనతో తేనే కహియెజె… పీడ్ పరాయీ జాణేరే...
గాంధీ మహాత్ముడి పటం ముందు పడిపోయాడు.
* * *
కొంచెం తేరుకోగానే గాంధీజీ రాకకోసం ఎదురుచూడటం ఆరంభించాడు.
కానీ బీహార్లో మతకల్లోలాలు తీవ్రమవటంతో గాంధీజీ నవఖలి వదలి అటు వెళ్లాడని తెలిసి నిరాశ చెందాడు. అమియ చక్రవర్తి గాంధీజీని దర్శించుకోవాలన్న అతడి కోరిక తీరలేదు.
అయితే ఆ తరువాత పరిస్థితులు అతి వేగంగా జరిగిపోయాయి. దేశంలో ఏదో ఓ ప్రాంతంలో మత కల్లోలాలు జరగటం ప్రారంభమయింది. ఇంతలో దేశ స్వాతంత్ర్యం ప్రకటన, విభజన ప్రకటన వెలువడ్డాయి. విభజనను వ్యతిరేకించి గాంధీజీ కలకత్తా చేరాడు. తప్పని పరిస్థితులలో అమియ చక్రవర్తి నవఖలి వదిలి కలకత్తా ప్రయాణమయ్యాడు. నవఖలి తూర్పు పాకిస్తాన్ పరమయింది..
దేశవిభజన వల్ల గాంధీపై అమియ చక్రవర్తికి విశ్వాసం సడలలేదు. మనసంతా చేదు భావన నిండింది. అతడికి గాంధీజీని చూడాలనిపించింది. దేశంలో చెలరేగుతున్న విద్వేషాలను చల్లార్చేందుకు మహాత్మాగాంధీ సత్యాగ్రహం ప్రారంభించారు. కలకత్తాలో శాంతి నెలకొన్నాక ఆయన ఢిల్లీ ప్రయాణమయ్యారు.
అమియ చక్రవర్తికి కలకత్తాలో ఉండాలనిపించలేదు. అతడికి తన దేశంలో తానే కాందిదేశీకుడయిన భావన కలగసాగింది. పైగా, ప్రజలు దేశ విభజనకు మహాత్మాగాంధీని బాధ్యుడిని చేయటం బాధ కలిగిస్తోంది.
మహాత్మాగాంధీని కలిస్తే కానీ తనకు శాంతి లభించదనిపించింది. ఢిల్లీ ప్రయాణమయ్యాడు.
* * *
ఢిల్లీ నగరం కాందిశీకులమయంగా ఉంది. వారి దీనగాథలు వింటున్న అమియ చక్రవర్తి మనస్సు కరిగిపోయింది. అవసరమైన వారికి వైద్యం అందిస్తూ శిబిరాల్లో ఉండిపోయాడు.
వారి దీనగాథలు వింటుంటే ‘దేశ విభజన’ ఎంతటి దారుణమో బోధపడింది. మహాత్మాగాంధీ ఎందుకని స్వాతంత్ర్యాన్నయినా వదలుకోవటానికి ఇష్టపడ్డాడో, దేశ విభజనను వ్యతిరేకించాడో బోధపడింది.
ఇంతలో ఢిల్లీలో మత సామరస్యం నెలకొల్పాలని గాంధీజీ మళ్లీ సత్యాగ్రహం ఆరంభించారని విన్నాడతడు.
అతడి మనసు చలించిపోయింది.
గాంధీజీలో మరణేచ్ఛ పెరుగుతోందన్న భావన కలిగింది అమియ చక్రవర్తికి . సత్యాగ్రహంలో ‘నిరాహార దీక్ష’ అన్నది ఆగ్రహంతో కాదు తనలోని దోషాలను ప్రక్షాళన చేసుకోవటం కోసం. ప్రస్తుతం దేశంలో చెలరేగుతున్న రాక్షసత్వానికి, విద్వేషాలకు గాంధీజీ బాధ్యత తనదేగా భావిస్తూ. ఆ నేర భావన ప్రక్షాళనకోసం నిరాహార దీక్ష చేస్తున్నట్టు తోచింది అమియ చక్రవర్తికి. ఇంతలో గాంధీజీ నిరసన విరమించారని తెలిసింది. కానీ ఒక నీలి వార్త ప్రచారంలోకి వచ్చింది.
పాకిస్థాన్‌కి చెల్లించాల్సిన డబ్బులు చెల్లించాలని గాంధీజీ నిరాహార దీక్ష చేశారని, ఆయన ఒత్తిడికి లొంగి ప్రభుత్వం డబ్బు చెల్లించిందని కాందిశీకులు ఆగ్రహంతో చర్చించటం విన్నాడు అమియ చక్రవర్తి.
గాంధీ నిరాహార దీక్ష చేసింది మతసామరస్యం కోసం. పాకిస్థాన్ డబ్బులకోసం కాదు అని అరిచి అందరికీ చెప్పాలనిపించింది. కానీ ఎవరూ వినేవారు లేరు.
ఎవరికి వారు తమకు తోచిందే సత్యమన్నట్టు ప్రవర్తించసాగారు. ప్రతి ఒక్కరికీ గాంధీజీ అంటే ఎందుకో ద్వేషం.
ప్రజలు ఆయనని ఎంతగా నమ్మారంటే, జరుగుతున్న ప్రతిదానికీ ఆయనని బాధ్యుడిని చేయసాగారు. ఇప్పుడు ఆయన నిస్సహాయుడని, ఆయన అవసరం అందరికీ తీరిందని గ్రహించలేకపోతున్నారు ప్రజలు. ఇంతలో గాంధీజీపై బాంబుదాడి జరిగింది.
ఇదంతా చూస్తున్న అమియ చక్రవర్తికి గాంధీజీని ఒకసారి చూడాలన్న కోరిక బలపడింది. ఇక ఆగకలేకపోయాడు.
గాంధీజీ ప్రార్ధన స్థలానికి చేరుకున్నాడు. ఆరోజు గాంధీజీ ఆలస్యంగా వచ్చారు ప్రార్ధనకు. ఆయనను చూడగానే ప్రజలు గుమిగూడారు.
‘దారివ్వండి… దారివ్వండి’ అంటూ అందరినీ చీల్చుకుని గాంధీజీ వస్తున్నారు.
ఆయనను చూడాలని మునివేళ్లపై నిలబడ్డాడు అమియ చక్రవర్తి. కానీ ఆయన కనబడటం లేదు. తోసుకొని ముందుకు వెళ్లబోయాడు. ఇంతలో ఎవరో అమియ చక్రవర్తిని పక్కకు తోసి గాంధీజీ మార్గంలోకి చేరారు.
తూలి క్రింద పడకుండా తట్టుకునేలోగా ‘ఢాం ఢాం ఢాం’ అంటూ పిస్తోలు పేలిన శబ్దం వినిపించింది.
హాహాకారాలు చెలరేగాయి. ‘గాంధీజీని కాల్చారు. ఆయన మరణించారు’ అంటున్నారెవరో. అమియ చక్రవర్తి కళ్లు బైర్లు కమ్మాయి. ‘మహాత్మా’ అనుకున్నాడు మనసులో.
మనసులో బాధ ధారాపాతంగా కురుస్తున్నా కంట్లోకి నీళ్లు రానీయలేదు అమియ చక్రవర్తి.
స్వయంగా కన్నీరు కార్చేవాడు ఎదుటివాడి కన్నీళ్లు తుడవలేడు. ‘బాపూజీ…. భౌతికంగా ఈరోజు మరణించారు కానీ దేశ విభజన ప్రతిపాదన అంగీకారం పొందినపుడే ఆయన మానసికంగా మరణించారు’ అనుకున్నాడు. కానీ మరణం శరీరానికే. ఆత్మకు కాదు. ఆయన సిద్ధాంతానికి కాదు.
‘బాపూ… నీ సిద్ధాంతాలను భావితరాలకి అందించటానికి నా జీవితం అంకితం’ అనుకున్నాడు.
బాపూజీ పార్ధివ శరీరం వైపు చూడకుండా ముందుకు నడిచాడు అమియ చక్రవర్తి ‘వైష్ణవ జనతో తేనే కహియె జే పీడ్ పరాయీ జాణేరే‘ అని పాడుకుంటూ.
(ప్యారేలాల్ రచించిన ‘మహాత్మాగాంధీ ది లాస్ట్ ఫేజ్’ లోని ఓ యదార్థ సంఘటన ప్రేరణతో సృజించిన కథ ఇది.)