[శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు నిర్వహిస్తున్న ‘వందే గురు పరంపరామ్’ అన్న శీర్షికని ధారావాహికగా అందిస్తున్నాము. ఈ నెల మృదంగ కళాకారిణి డా. మండపాక నాగలక్ష్మిగారిని పరిచయం చేస్తున్నారు రచయిత్రి.]
ప్రార్థనా గీతం:
ఓం గణపతయే నమః శ్రీ గణపతి తాళం
వికటోత్కట సుందర దంతి ముఖం/ భుజగేంద్ర సుసర్ప గదాభరణం
గజనీల గజేంద్ర గణాధిపతిమ్ /ప్రణతోస్మి వినాయక హస్తిముఖం ||
సురసుర గణపతి సుందర కేశం/ ఋషిఋషి గణపతి యజ్ఞ సమానం
భవభవ గణపతి పద్మ శరీరం/ జయజయ గణపతి దివ్య నమస్తే ||
తత్తధిం నంతరికు తరిఝణకు కుకుతద్ది /
కుకు తకిట డిండింగు డిగుణ కుకు తద్ది || 2 ||
తత్తఝం ఝంతరిత తఝం ఝంతరిత /
తకతఝం ఝంతరిత తఝం ఝంతరిత || 2 ||
తరిదణత దణఝణుత ఝణుధిమిత /కిటతక తరికిటతోం
తకిట కిటతక తరికిటతోం /తకిట కిటతక తరికిటతోం || 2 || తాం ||
తకతకిట తకతకిట తకతకిట తత్తోం /శశికలిత శశికలిత మౌలినం శూలినం
తకతకిట తకతకిట తకతకిట తత్తోం /విమలశుభ కమలజల పాదుకం పాణినం
ధిత్తకిట ధిత్తకిట ధిత్తకిట తత్తోం /ప్రమథగణ గుణకథిత శోభనం శోభితం
ధిత్తకిట ధిత్తకిట ధిత్తకిట తత్తోం /పృథులభుజ సరసిజ విషాణకం పోషణం || 2 ||
తకతకిట తకతకిట తకతకిట తత్తోం /పనసఫల కదళిఫల మోదనం మోదకమ్
ధిత్తకిట ధిత్తకిట ధిత్తకిట తత్తోం /ప్రణతగురు శివతనయ గణపతి తాళనం || 2 ||
గణపతి చేతిలోని మృదంగం అత్యంత ప్రాచీనమైన వాద్యపరికరం. దీనిని ‘తని’ వాద్యంగా పిలుస్తారు. సరస్వతిదేవి రెండు కళ్ళుగా మనం భావించే సంగీత నృత్యాలకు మూలము ఈ వాయిద్యము. సంగీతంలో శృతి మాత లయ పిత అంటే శృతిలయలు తల్లిదండ్రులు అందులో మృదంగము లయ ప్రధానమైనటువంటి వాయిద్యము.
వినాయకుడు మరియు మృదంగం మధ్య ఒక నిగూఢమైన సంబంధం ఉంది. హిందూ పురాణాలలో వినాయకుడిని మృదంగ వాద్యానికి అధిష్టానదైవంగా పూజిస్తారు. గణేశుడు స్వయంగా మృదంగవాద్యంలో నిపుణుడని చెప్పబడుతుంది. మృదంగం వాయించే వారిని మార్దంగికులు అని అంటారు. దక్షిణ భారతీయ శాస్త్రీయ సంగీత కచేరీలలో మృదంగవాదకులు తమ వాద్యాన్ని వాయించే ముందు గణేశ వందనంతో ప్రారంభించి, ప్రత్యేక కీర్తనలు మృదంగంలో వాయిస్తారు. సాధారణంగా గణేశా! కీర్తనతో మొదలవుతాయి. కొన్ని మృదంగం శబ్దాలు గణేశుని పేర్లతో సంబంధం కలిగి ఉంటాయి ‘గనధ’ వంటివి. మృదంగం కళాకారులు వినాయకుడిని ‘విఘ్నహంత’గా భావించి వాటి అభ్యాసం మరియు ప్రదర్శనలలో ఎలాంటి అడ్డంకులు రాకుండా ఆయనను ప్రార్థిస్తారు. ఈ విధంగా వినాయకుడు మృదంగ వాద్యకళకు రక్షకుడిగా, మార్గదర్శకునిగా పరిగణించబడతాడు.
మృదంగం అనేది దక్షిణ భారతీయ శాస్త్రీయ సంగీతంలో అత్యంత ముఖ్యమైన తాళ వాయిద్యం. ఇది రెండు వైపులా తోలుతో కప్పబడిన డప్పులాంటి ద్విముఖ తాళ వాయిద్యం. మృదంగం కర్ణాటక సంగీతంలో తాళానికి ప్రాణం పోస్తుంది. దీని మధ్యభాగం పనస చెక్కతో చేయబడుతుంది. సాధారణంగా ఎడమవైపు పెద్దది కుడివైపు చిన్నది అని రెండు భాగాలుంటాయి. కుడివైపు భాగంలో అన్నం ఇనుపపొడి ప్రత్యేకమైన మిశ్రమం వాడతారు. కుడివైపు భాగంలో ‘చకారి’ అనే ప్రత్యేక మిశ్రమం వాడతారు. ఇది అన్నం, ఇనుపపొడి మరియు తామరవేళ్ళతో చేయబడుతుంది. ఇదే శృతిని స్థిరంగా ఉంచుతుంది. మృదంగవాదకులు వేళ్ళు, అరచేతులు మరియు మణికట్టుల వాడడంతో వివిధశబ్దాలు సృష్టిస్తారు. కర్ణాటక సంగీత కచేరీలలో మృదంగం కేవలం తాళం మాత్రమే కాకుండా గాయకుడిని లేదా కళాకారున్ని ప్రోత్సహించే పాత్ర వహిస్తుంది.
‘తని ఆవర్తనం’ అనే ప్రత్యేక ప్రదర్శనలో మృదంగ కళాకారుడు తన నైపుణ్యాన్ని చూపిస్తాడు.
మృదంగంలో 4 రకాలు ఉంటాయి.
- కుచ్చి మృదంగం. 2.కప్పి మృదంగం 3. నట్ & బోల్ట్ మృదంగం 4. శ్రీ మృదంగం
‘తాళమణి‘ బిరుదాంకితురాలైన కుమారి డాక్టర్ మండపాక నాగలక్ష్మిగారు సంగీతంలో దిట్ట. వారసత్వంగా వచ్చిన ఈ సంగీత కళను తన స్వయంకృషితో మెరుగుపరుచుకొని ‘తాళమణి’గా పలువురుతో ప్రశంసలు పొందుతున్నారు. మృదంగం వాయిద్యంలో ప్రముఖ కళాకారిణిగా అత్యున్నత స్థానాలు అధిరోహించిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కుమారి డాక్టర్ మండపాక నాగలక్ష్మిగారి గురించి ఈనాటి మన ‘వందే గురుపరంపరామ్’ కార్యక్రమంలో తెలుసుకుందాము.
డాక్టర్ మండపాక నాగలక్ష్మి
వారసత్వము సంగీత సాహిత్యాలు:
మండపాక వంశీయులు రాజాస్థానాలలో ముఖ్యంగా బొబ్బిలి ఆస్థానంలో ఆస్థాన విద్వాంసులుగా పేరు ప్రఖ్యాతులు పొందారు. తాత, ముత్తాతలు కవికులానికి చెందినవారు. గొప్ప కవి అయిన మండపాక పేరయ్య కోనమ్మ దంపతులకు పెద్ద కుమారుడు కామకవి.
మండపాక కామకవిగారు (1810-1872) ఇతడు తండ్రి వద్దనే కావ్య పంచకము, అలంకారశాస్త్రము పూర్తిచేసి సాహిత్యంలో కృషి చేశారు. అష్టకాలు దండకాలు రాశారు.
కామకవి జోగమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు.
పెద్దకుమారుడు రామస్వామిశాస్త్రి (1831-1888) వేదాంతకృతికదంబము, గంగాలహరి, గంగాస్తవము, అవధూతానుభూతి, గీతాశాస్త్రము మొదలైన గ్రంథాలు రచించారు.
రెండవవాడు ప్రసిద్ధ విద్వత్కవి అయిన పార్వతీశ్వరశాస్త్రి ఇతను బొబ్బిలి ఆస్థాన విద్వాంసుడు. మూడవ కుమారుడు పేరయ్యశాస్త్రి మంత్ర శాస్త్రవేత్త. మండపాకవారి కుటుంబం అంతా సాహితీవేత్తలు.
అభినవాంధ్ర కవి పితామహుడు మండపాక పార్వతీశ్వరకవిగారు (1833-1897) హరి హరేశ్వర శతకము, విశ్వేశ్వర శతకము మొదలైన 30 శతకములు, యాత్రా చరిత్ర, రాధాకృష్ణ సంవాదము, బొబ్బిలి మహారాజా వంశావళి, అనేక దండకములు శతాధిక గ్రంథరచన చేసి ఆశు, చిత్రబంధ, గర్భ కవిత్వాలలో ‘అభినవాంధ్రకవి పితామహుడు’ అని పేరు పొందారు.
మండపాక పార్వతీశ్వరశాస్త్రి-2 (1885-1940) పాలవెల్లి, సుజనాను మోదిని, ప్రేమము, గులాబీ, పాతబండి, కొండకోన, ఉదంకుడు, సావిత్రి సత్యవంతము, తేనె పట్టు మొదలైనవి రచించారు.
నాగలక్ష్మిగారు తాత ముత్తాతల గురించి చిన్నప్పుడు నాయనమ్మ, తాతయ్యలు ద్వారా కథలుగా విన్నారు. ముత్తాతగారైన మండపాక పార్వతీశ్వర శాస్త్రి గారి గురించి కొంచెం తెలుసు.
నాగలక్ష్మిగారి మాతామహులు గున్నమ్మ. తాతయ్య వడుగూరు నీలకంఠశాస్త్రి. సంగీత విద్వాంసులు గాత్రం, మృదంగం విద్వాంసులు. సంగీతకచేరీలు చేసేవారు. వీరికి కోలంక వెంకట్రాజుగారు మృదంగం వాయించేవారు. 10/15 హరికథలు స్వయంగా రాసి విద్యార్థులకు నేర్పించేవారు. మృదంగం కూడా వాయించేవారు. ఆ మృదంగమే వారసత్వంగా నాగలక్ష్మిగారిని చేరింది. మేనమామ రామారావు లలితసంగీతం, ఘంటసాల పాటలు బాగా పాడతారు.
మండపాక నాగలక్ష్మికి మాత్రం ఆ మృదంగం అంటే ప్రాణం.
నాగలక్ష్మిగారి పితామహులు మండపాక జగన్నాథం పంతులుగారు కోటలో దివాన్ గా పని చేస్తూ ఉండేవారు. మహారాజావారు వారికి కోట ఎదురుగా ఉన్న గురాచారి వీధిలో నివాసము ఇచ్చారు. అది మండపాక వారి ఇల్లుగా ప్రసిద్ధము. నాయనమ్మ ఆధ్యాత్మిక కీర్తనలు పాడేవారు. పూర్వఆశ్రమంలో పెద్దమ్మ శ్రీ మాతాజీ త్యాగీశానంద పూరీజీ బాగా పాడతారు, శారద రామకృష్ణ పరమహంస devotees, రెండు ఆశ్రమాలు ఉన్నాయి. ఆవిడ ఇటీవలే సిద్ధిపొందేరు.
మండపాక నాగలక్ష్మిగారి తల్లిదండ్రులు మండపాక విమల మండపాక వేణుగోపాల జనార్దన కృష్ణమూర్తి గారు (M.V.J.K.Murty).
నాగలక్ష్మిగారి తండ్రి కృష్ణమూర్తిగారు విశాఖపట్నం కేంద్రంగా రైల్వేలో పని చేసేవారు. అందువలన వీరు విశాఖపట్నంలో ఉండేవారు. నాగలక్ష్మిగారు విశాఖపట్నంలోనే 25-12-1966 లో జన్మించారు. తోడ పుట్టినవారు మండపాక శారద, మండపాక సూరిచంద్రామణి, మండపాక శ్రీనివాస్, మండపాక నాగలక్ష్మి.
ఆ ఇల్లు ఒక సంగీత నిలయం. ఆ ఇంట్లోని వారందరూ శాస్త్రీయ సంగీతంలో నిష్ణాతులే! తరతరాలుగా ఆ ఇల్లు ఓం కార నాదంతో, గణపతి మృదంగ నర్తనలతో, సరస్వతి వీణా వాదనలతో, కర్ణాటక, శాస్త్రీయ, లలిత సంగీత గానముతో పరిసరాలను పులకింప చేస్తోంది.
సంగీతంలో వాద్య పరికరాలలో పురుషులకు మాత్రమే పరిమితమైన మృదంగం వాయిద్యాన్ని 10 సంవత్సరాల వయసులో అకుంఠిత దీక్షతో నేర్చుకుని 2000 పైగా కచేరీలలో దేశ విదేశాలలో వాయించి తనకంటూ ఒక స్థానాన్ని నిలుపుకున్న కుమారి మండపాక నాగలక్ష్మిగారు ఈ ప్రతిభకు కారణం వారసత్వంగా తాత ముత్తాతల నుండి తల్లిదండ్రుల నుండి సంక్రమించిందని, చక్కని సంగీత కుటుంబంలో జన్మించడం తన అదృష్టమని భావిస్తారు. అంతేగానీ తన కృషి ఫలితమని చెప్పుకోరు.
సంగీత సాహిత్యాలు వారసత్వంగా సంక్రమించడమే కాకుండా అమ్మ కడుపులో ఉన్న నాటి నుండి కూడా సంగీతం వినడం వలన, పుట్టినప్పటినుంచి ఇంట్లో సంగీత కార్యక్రమాలు జరుగుతూ ఉండడం వలన, వీరి తల్లి అక్కయ్య శారద కూడా ఆకాశవాణి రేడియో కేంద్రం విజయవాడలో లలిత సంగీతం, శాస్త్రీయ సంగీతం కచేరీలు చేస్తూ ఉండేవారు. అమ్మ శ్రీమతి విమల గాత్ర కళాకారిణి రేడియోలో ఇంచుమించు 30 సంవత్సరములు లలిత సంగీతం పాడారు.
నాగలక్ష్మి గారి తల్లి గారైన విమలగారు సాహిత్యం లో గల అభిమానముతో అనేక రచనలు చేసేవారు. దిన, వార, మాస పత్రికలలో సుమారుగా 300 రచనలు పైగా ప్రచురించబడ్డాయి.
నాగలక్ష్మిగారి తల్లి విమలగారు సంగీతం ప్రోగ్రాంలు ఇచ్చేటపుడు విజయవాడ ఆల్ ఇండియా రేడియోలో ‘పద్మశ్రీ’ శ్రీరంగం గోపాలరత్నంగారు; దండమూడి రామ్మోహనరావుగారు; ఓలేటి వెంకటేశ్వర్లు మొదలైనటువంటి ప్రముఖులు స్టాఫ్ గా పని చేసేవారు.
ఇంట్లోనే పాటలు రిహార్సల్ చేసుకోవడం వలన నాగలక్ష్మికి కర్ణాటక సంగీతం మాత్రమే కాకుండా మృదంగం, వయోలిన్, హార్మోనియం, డోలు, తబలా మొదలైన వాయిద్యాలతో పరిచయం ఉండేది.
అంతేకాకుండా నృత్యం పట్ల గల ప్రత్యేకమైన అభిమానంతో నాట్య ప్రదర్శనలు కూడా ఇచ్చేవారు.
చాలా చిన్నప్పటినుండి సంగీతం పట్ల అభిరుచితో బెరుకు లేకుండా ప్రదర్శనలు ఇచ్చేవారు. రైల్వే స్కూల్లో వినాయక చవితి, దసరా ఉత్సవాలు జరిపినప్పుడు శివతాండవం ఈమె నర్తించడం ఎంతో మందిని ఆకర్షింప చేసింది. నవరాత్రులలో ఈ కార్యక్రమం ఉందా లేదా అని వెతుక్కునేవారు ప్రేక్షకులు.
ఈమె ప్రాథమిక విద్య మరియు హైస్కూల్ విద్య రైల్వే స్కూలు విశాఖపట్నంలో జరిగింది.
“చాలా చిన్నపుడు స్కూలు నుండి ఇంటికి వచ్చేసరికి అమ్మా, అక్కయ్యా పాటలు రిహార్సలు చేసుకుంటూ ఉండేవారు. చిన్నతనం కావడం వలన ఆ పాటలు వింటూ అమ్మ ఒడిలోనిద్రపోయిన జ్ఞాపకాలు నాగలక్ష్మి గారి మనసులో ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి. ఆమెకు అమ్మ అంటే ప్రత్యేకమైన అభిమానము గుండెల నిండా. ఎందుకంటే మా నలుగురికీ సంగీతం అందించే అవకాశం ఇస్తూ అమ్మ తన సంగీతాన్ని మా కోసం త్యాగం చేసింది.
పెద్దక్క శారద గాత్ర కచేరీలు, చిన్నక్క వీణ వాయిద్యం, నాగలక్ష్మి మృదంగం ఇంట్లో సరస్వతీ నర్తన, శారద దరహాసాలు, మృదంగ తాళాలు వినిపించేవి.
సమిష్టి కుటుంబము కావడం వలన నాన్నగారి అన్నదమ్ములు, దూరంగా రైల్వే ఉద్యోగస్థులు కావడం వలన వారి పిల్లలను ఇంట్లో చదువులకు ఉంచేవారు. పిల్లలకు పనులు చెప్పకుండా అమ్మ తానే చేసుకుంటూ మమ్మల్ని ప్రాక్టీస్ చేసుకోమనేది.
ఆనందాల వెల్లువలో కొట్టుకుపోతున్న మా ఇంట్లో అతి పెద్ద విషాదము నాన్నగారు మాకు దూరం కావడం. నాన్నగారి ఉద్యోగం అన్నయ్యకు ఇస్తారన్నారు. కానీ 18 సం.లు లేవు. బి.ఎస్.సి. మొదటి సం. చదువుతూ ఉండగానే ఉద్యోగంలో చేరిపోయారు. అన్నయ్యకు చదువు అంటే చాలా ఇష్టం అందువలన పగలు ఉద్యోగం చేస్తూ సాయంత్రం నైట్ కళాశాలలో చేరారు. అన్నయ్యకు చదువుకోవడానికి వీలుగా అతను కాలేజీకి వెళ్ళినపుడు, ఉద్యోగానికి వెళ్ళినపుడు ప్రాక్టీస్ చేసుకునేవారు. ముఖ్యంగా నాగలక్ష్మిది మృదంగం కావడంతో శబ్దం వినబడకుండా ప్రాక్టీస్ ఎలా? భగవంతుని పరీక్షలు ఇలాగే ఉంటాయి. అన్నయ్య తన కోరిక మేరకు బి.ఎస్.సి.; ఏం.ఎ.(ఇంగ్లీష్); న్యాయశాస్త్రము. నచ్చినవన్నీ చదువుకున్నారు. వదిన లక్ష్మీగారు కూడా ఎం.ఎస్.సి. చదువుకున్నారు. గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపాలుగా పని చేస్తున్నారు. అన్నయ్య కూతురు కృష్ణ పూజిత కూడా సంగీతం నేర్చుకుని ఆధ్యాత్మిక కీర్తనలు ఆల్ ఇండియా రేడియో, విశాఖపట్టణం కేంద్రంలో పాడుతున్నారు.
పెద్దక్క కుమారి డా. మండపాక శారద 12-06-1957 లో విజయనగరంలో జన్మించారు. గాత్ర విద్వాంసురాలు. స్వరకర్త. 1965 లోనే మొదటి కచేరి ఇచ్చారు. ఐదు సంవత్సరముల వయసు నుండి పాడడం మొదలుపెట్టారు. సంగీతంలో ఎం.ఎ. పి.హెచ్.డి. డిగ్రీలతో పాటు గాత్రం (సంప్రదాయ, లలిత సంగీతం) లో పొందారు. వి.కె.మ్యూజిక్ అకాడమీ స్థాపించి, తరగతులు, వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు. సాంప్రదాయ సంగీతం, ఆధ్యాత్మిక సంగీతము, లలిత సంగీతము మూడు విభాగాలలో కూడా అద్భుతంగా పాడగలరు. ఆంధ్ర యూనివర్సిటీ మ్యూజిక్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ గా పనిచేసి, రిటైర్ అయ్యారు.
చిన్నక్కయ్య సూరి చంద్రామణి వీణ, గాత్రంలో డిప్లమో బి.కామ్; ఏం.ఎ.మ్యూజిక్ చేశారు. ఆమె భర్త సూరి శ్యాం ప్రసాద్ గారు డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ గా పనిచేసి పదవీ విరమణ చేశారు.
అన్నయ్య శ్రీనివాస్ 18 సంవత్సరములకు ఉద్యోగంలో జాయిన్ అవ్వవలసి వచ్చింది. అతను గానం పట్ల అభిరుచితో అక్కాచెల్లెళ్ళకు సహాయంగా వెళ్ళేవారు. కానీ చదువు పట్ల గల అత్యంతమైన అభిమానంతో ఉద్యోగం చేస్తూనే అనేక డిగ్రీలని అందుకున్నారు. రైల్వేలో ఆఫీసర్.
నాగలక్ష్మి గారు ప్రస్తుతం మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో పూర్తిస్థాయి అధ్యక్షురాలిగా పని చేస్తున్నారు.
గాత్రం మృదంగం రెండిట్లో ఏది ముందు అంటే మృదంగమే అంటారు. 1977 నాటికి కచేరీలో మృదంగం వాయించడం మొదలుపెట్టారు
అక్కయ్యలిద్దరూ దగ్గర గాత్రసంగీతం నేర్చుకున్నారు. విశాఖపట్నంలో జన్మించడం వలన బాల్యము, చదువు, సంగీతం నేర్చుకోవడం అన్ని విశాఖలోనే. చిన్నతనంలో పెద్ద అక్కయ్య డాక్టర్ మండపాక శారద లలిత, భక్తి, కర్ణాటక సంగీతాల కచేరీలు చేస్తున్నప్పుడు ఇంట్లో రిహార్సల్స్ జరిగేవి. మృదంగం, తబలా మొదలగు లయ వాద్యాలు వాయించేవారు. ఇంటికి రిహార్సల్స్ కి వచ్చినవారిని గమనించడం, రిహార్సల్స్ అయిపోయి వారు వెళ్లిపోయిన తర్వాత తలుపుల మీద, కుర్చీల మీద, గిన్నెల మీద వాయిస్తుంటే లయవాయిద్యాల మీద ఉన్న ఆసక్తిని గమనించి అమ్మా,నాన్న, అక్కయ్య మృదంగం నేర్పించారు. అప్పటికి ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క స్త్రీ మాత్రమే మృదంగం వాయించేవారు. ఆమె శ్రీమతి దండమూడి సుమతి రామ్మోహనరావు. తర్వాత స్థానం నాగలక్ష్మిగారిది అయింది.
సంగీత గురువులు
తొలి గురువులు తల్లిదండ్రులు కాగా మలి గురువుగా అక్క శారద నాగలక్ష్మి గారిని గాత్రంలో తీర్చిదిద్దారు.
అమ్మ నుంచి గాత్రాన్ని ఒకరు, తాత నుంచి లయ వాయిద్యాన్ని ఒకరు ఇలా పుట్టుకతోనే సంగీతాన్ని వారసత్వంగా అంది పుచ్చుకున్నారు అక్క చెల్లెళ్ళిద్దరూ.
అక్క సరిగమలకు చెల్లి మృదంగం అందిస్తూ శ్రోతలను సంగీత ప్రపంచంలో ఓలలాడిస్తారు. తన అద్భుతమైన గాత్రానికి ఎందరో ఘనాపాఠీల ప్రశంసలు అందుకున్న అక్క శారదా, మొత్తం ఆంధ్రదేశంలో మృదంగం వాయించే ఇద్దరు మహిళలలో ఒకరుగా కీర్తి సంపాదించుకున్నా ఎక్కడా గర్వం కించిత్తు కూడా కనిపించని ఆ అక్క చెల్లెళ్లలో ఎదిగిన కొద్ది ఒదుగుతూ, సరిగమలే అలంకారంగా, సంగీతాన్ని తమ చిరునామాగా చేసుకున్నారు. వీరిద్దరిని అందరూ శృతిలయలు అని పిలుస్తారు.
అక్క శారద నాగలక్ష్మికి సంగీతంలో గాత్రానికి ఎన్నో మెళకువలను నేర్పించారు. వినికిడి ద్వారా సంగీతం వస్తుంది అన్నది రుజువు చేశారు. ఇంత విద్వత్తు ఉన్నా చక్కని వ్యక్తిత్వంతో, వినయ విధేయతలతో, అత్యంత నిగ్రహంతో, సహనంతో పరిస్థితులను ఎదుర్కొంటూ ముందుకు వెళ్లడం అనే ఒక గొప్ప గుణాన్ని కలిగి ఉన్నారు వీరు.
అక్కను నాగలక్ష్మి ఒక మంచి స్నేహితురాలుగా, ఫిలాసఫర్, గైడ్, గురువుగా భావిస్తారు. ఇద్దరి మధ్యా 10సం.ల వయోభేదం ఉన్నప్పటికీ వారిమధ్య అక్క చెల్లెళ్ల బంధం కంటే సంగీతంతో పెనవేసుకున్న అనుబంధమే ఎక్కువ.
సంగీత కచేరీ అంటే ఒక ఆహ్లాదకరమైన ప్రదర్శన అందువలన సహవాద్యకారులతోపాటు, నిర్వాహకులతో కూడా మనము ఎంతో స్నేహంగా ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే ఒక్కొక్కసారి తెలియకుండానే మైకు లాంటివి, ఇతరుల గొంతు సహకరించకపోవడం, వాయిద్యం సహకరించకపోవడం ఇలా ఎన్నో రకాలు ఉంటాయి. కానీ అన్నిటిని సమతుల్యతతో చిరునవ్వుతో ఎదుర్కోగలగడం అనేది అన్నిటికంటే కళాకారుని ఉన్నత స్థాయిలో నిలబడుతుంది.
సంగీతంలో ఆమె గురువులు విశాఖపట్నంలో నేమాని సోమయాజులు గారి దగ్గర1977లో ప్రాథమిక పాఠాల శిక్షణ ఒకటిన్నర సంవత్సరం నేర్చుకున్నారు. విశాఖలో 1978 నుండి అనేకమంది సంగీత విద్వాంసులకు మృదంగ వాద్యసహకారం అందిస్తున్నారు.
తదుపరి ఆల్ ఇండియా రేడియో నిలయ విద్వాంసులు ముళ్ళపూడి శ్రీరామ్మూర్తిగారి వద్ద మృదంగం వాదనములో శిక్షణ మెళకువలను అభ్యసించడం జరిగింది.
విద్యార్హతలు
బి.ఎ.గాత్రం ప్రధానాంశముగా చరిత్ర, తెలుగు ఉప అంశాలుగా ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం ఎం.ఏ. గాత్రం పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి నుండి సాంకేతిక విద్య డిప్లమోలో మృదంగం పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం, హైదరాబాద్ నుండి గాత్రం డిప్లమో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం, హైదరాబాద్ నుండి లలిత గీతాలు డిప్లమో ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం.
వృత్తి:
కొందరు అదృష్టవంతులకు వృత్తి – ప్రవృత్తి ఒకటేగా అమరుతాయి.
1992లో విజయనగరంలో మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో మృదంగ అధ్యాపకురాలిగా ఉద్యోగం రావడం వలన విశాఖపట్టణము నుండి విజయనగరానికి వెళ్లడం జరిగింది.
ఆ కళాశాల అధ్యక్షులుగా అప్పుడు స్వర్ణపతక విజేత, జాతీయ స్థాయిలో రెండుసార్లు రాష్ట్రపతి బహుమతి అందుకున్న గొప్ప వయొలిన్ విద్వాంసులు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారగ్రహీత ద్వారం దుర్గా ప్రసాద రావుగారి చేతుల మీదుగా మృదంగ అధ్యాపకురాలిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. 30 సం. లు కొనసాగి ప్రమోషన్ మీద రాజమండ్రి వెళ్ళారు.
పూసపాటి వంశీయులుతో మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో
డిపార్ట్మెంటల్ పరీక్షలు
ఇవే కాకుండా వృత్తిపరంగా అర్హతలు పెంచుకునేందుకు నిత్య విద్యార్థినిగా అనేక డిపార్ట్మెంటల్ పరీక్షలు కూడా రాసి ఉత్తీర్ణురాలైనారు.
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టెస్ట్
సబార్డినేట్ ఆఫీసర్ పార్ట్ వన్ & పార్ట్ టు కూడా ఆమె ఉత్తీర్ణురాలు అయ్యారు .
గౌరవ డాక్టరేట్లు
- డాక్టర్ ఆఫ్ మ్యూజిక్ యూనివర్సిటీ ఆఫ్ జెరూసలేం నుండి
- డాక్టర్ ఆఫ్ మ్యూజిక్ అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికా
ప్రవృత్తిపరంగా నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. సంగీతం లాంటి కళలకు నిత్యమూ పదును పెట్టుకోవలసిన అవసరం ఉంటుంది.
ఉద్యోగంలో చేరిన తర్వాత చెన్నైలో ఉన్నటువంటి కరైకూడి ఆర్.మణిగారి దగ్గరకు వెళ్లి విద్యను అభివృద్ధి చేసుకోవడం జరిగింది. చెన్నైలో కరైకూడి ఆర్.మణిగారు ఈమెకు మృదంగంలో మెళకువలను తెలియజేశారు
అభ్యసనంమీద గల శ్రధ్ధతో అందులో మెలకువలను నేర్చుకోవాలని ఎంతో కష్టనష్టాలకు ఓర్చి, ప్రతి వారం శుక్రవారం బయలుదేరి మెయిల్ లో బయలుదేరి, వెళ్లి మళ్లీ సోమవారం తిరిగి వచ్చేటట్లుగా మద్రాస్ వెళ్లి ప్రముఖ గురువుగారైన ప్రముఖ సంగీత విద్వాంసులైన శ్రీ కరైకూడి ఆర్ మణి గారి ఇంటికి వెళ్ళి, వారి దగ్గర మృదంగం వాయించడంలోని మెళకువలను తెలుసుకున్నారు. ఆదివారం సంగీతం నేర్చుకుని, సాయంత్రం బయలుదేరి, రైలులోమళ్ళీ విజయనగరం వచ్చి, సోమవారం కళాశాలకు వెళ్ళేవారు.
ఈనాటి ఎందరో శిష్యులకు మార్గదర్శకంగా నిలిచారు.
ఈమె శ్రమను గుర్తించిన మృదంగ విద్వాన్ కోలంక వెంకట్రాజుగారు బుర్ర సీతారామశాస్త్రి గారు మొదలైన ప్రముఖులు ఫోను సదుపాయం లేని ఆ రోజులలో ఆమె కృషిని శ్లాఘిస్తూ ఉత్తరాలు రాశారు. ఆ రోజుల్లో లేఖలే ఆధారం కనుక వాటి ద్వారా తమ యొక్క ఆనందాన్ని వ్యక్తపరిచారు.
అభినందన లేఖలు
బుర్రా సీతారామశాస్త్రి గారి లేఖ
“తాళమణి కుమారి మండపాక నాగలక్ష్మికి బుర్రా సీతారామశాస్త్రి ఆశీర్వదించి వ్రాయునది. గుంటూరులో నిర్వహించిన రెండు సంగీత కచేరీలకు ఒక ప్రత్యేకమైన ఘనత వచ్చినది. స్త్రీలలో కూడా ఇంత బాగా మృదంగం వాయించే వాళ్ళు ఉన్నారా? అని శ్రోతలు తమ సంతోషమును తెలియపరచినారు. నేను కూడా చాలా కాలంగా అనుకున్నది నెరవేరినదని అనుకున్నాను. చాలా సంతోషించాను. కచేరి ఫోటోలు రెండు పంపినాను. పేపర్ కటింగ్స్ తర్వాత పంపుతాను. శ్రీమతి లక్ష్మీ కృష్ణమూర్తి గారి శ్రీమతి మీనాక్షి శేషాద్రి గారికి కూడా ఫోటో పంపినాను.” ఆశీర్వచనములు
బుర్రా సీతారామశాస్త్రి
18-04-1996 గుంటూరు
డాక్టర్ కోలంక వెంకటరాజుగారి లేఖ
అత్యంత ప్రియమైన చిరంజీవి నాగలక్ష్మిని అభినందిస్తూ వ్రాయునది
“గురు సన్నిధి నుండి నీవు వ్రాసిన లేఖ చదువుకొని పరమానంద భరితుడైనాను. నీ గురుదేవులకు నా హృదయాంజలి.
పాఠాలు బాగా జరుగుతున్నాయని, ఇలా నేర్చుకుంటూ, నూతన సాధన చేసుకుంటూ, ఉంటే రోజులు తెలియడం లేదు. ఇక్కడ నుంచి విజయనగరం వెళ్లాలని అనిపించడం లేదు. ఒక్కొక్క మారు ఒకొక్క పాఠం ఒకదాన్ని మించి మరొకటి ఎంత బాగున్నాయో ఒక సంవత్సరం ఏమిటి జీవితాంతం నేర్చుకున్న తృప్తిరాదు.
పై సంగతులుతో పాటు నీ లేఖలోని విద్యార్థుల భావతరంగాలు, విద్యకు అంకితమై కృషి సల్పుతున్న తీరు, నీ మనోభావం నన్నెంతగానో ముగ్ధు డిని చేసింది. నీ తపస్సు సిద్ధించిననాడు నీకే కాక దేశానికి కూడా యశస్కాంతులు విరజిమ్ముతాయి. నీ కోరిక జయప్రదం కావాలని దైవాన్ని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ పేపర్లో వేశారు అని వ్రాశావు. ఇంకా ఎన్నో ఎన్నెన్నో జరుగుతాయి.”
డాక్టర్ కోలంక వెంకటరాజు
14-06-1997
సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత
కేంద్ర ఆడిషన్ బోర్డు సభ్యులు న్యూఢిల్లీ
ఆంధ్ర ప్రదేశ్ సంగీత నాటక అకాడమీ
ప్రభుత్వ ఉద్యోగినిగా, కళాకారిణిగా అనుభవాలు:
“తరగతిగదిలో సుమారు 30 /40 మంది శిష్యులు ఉండేవారు. ఇన్ని సంవత్సరాలలో కొన్ని వందల మంది శిష్యులు నాగలక్ష్మిగారి దగ్గర శిక్షణ పొంది ఉంటారు. మృదంగం నేర్చుకున్న శిష్యులందరూ చాలా చక్కగా ఉన్నత స్థాయి చేరి వారి వారి అభిరుచి గల ఉద్యోగాలలో స్థిరపడ్డారు. వారు చేసే ఉద్యోగాలు ఆలయాలలో దేవస్థాన విద్వాంసులుగా, ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలలో శిక్షకులుగా, రైల్వేలో కల్చరల్ ఉద్యోగస్తులుగా, సినిమా ఫీల్డ్ లో కూడా స్థిరపడిన వారు ఉన్నారు.”
నాగలక్ష్మిగారిని మృదంగం విద్వాంసురాలిగా మాత్రమే మనం చూడడం కాకుండా ఆమె బహుముఖ ప్రతిభాశాలి. గాత్రం, వయోలిన్, వీణ, గిటారు, ఫ్లూట్, మాండలిన్, గోటు వాయిద్యం లకు తన మృదంగ సహకారం అందించారు.
మృదంగం గురువులు ముగ్గురు నేమాని సోమయాజులు, ముళ్ళపూడి శ్రీ రామమూర్తి గారు, కరైకూడి ఆర్. మణి గారు.
గాత్రం లో మెళకువలు డాక్టర్ మండపాక శారద వద్ద నేర్చుకున్నారు
వయోలిన్ విద్వాంసులు ద్వారం దుర్గాప్రసాద రావు గారు, విజయేశ్వరరావు గారు, ద్వారం మనోరమ, ద్వారం సత్యనారాయణ, అవసరాల కన్యాకుమారి, డి.సూర్యప్రభ, తిరుపతి పున్నారావు, తిరుపతి రామానుజ సూరి గారికి మృదంగ సహకారము అందించారు.
వీణా విద్వాంసులు అయ్యంగారి శ్యామసుందర్, ఎం.జోగులాంబ, డాక్టర్ సరస్వతి వాసుదేవ్ డాక్టర్ మాధురీ దేవిలకు మృదంగ సహకారము అందించారు.
గిటార్ వాద్యనిపుణులు జోషి కి మృదంగ సహకారము అందించారు.
ఫ్లూట్ విద్వాంసులు ప్రొఫెసర్ ప్రపంచం సీతారాం, మాలాచంద్రశేఖర్, డాక్టరు జయప్రద రామ్మూర్తి లకు ఫ్లూట్, మృదంగ సహకారము అందించారు.
మాండలిన్ విద్వాంసులు యూ.పి.నాగమణి, మండలి సిస్టర్స్ లకు మృదంగ సహకారము అందించారు.
గోటు వాద్య నిపుణులు ఈమని లలితా కృష్ణకు మృదంగ సహకారము అందించారు.
దేశ విదేశాల్లో అనేక ప్రదర్శనలు ఇస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆమె పేరు మార్మోగుతోంది.
ప్రముఖులతో డా.మండపాక నాగలక్ష్మి గారు
నాగలక్ష్మిగారి ప్రముఖ శిష్యులు కొందరు
నాగలక్ష్మిగారిలో గల ఇంకొక మంచి సుగుణము ఆమెకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. తను చుట్టూ ఉన్న వారిని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా తనే అందులోకి ఆ పరిస్థితిలోకి ఇమిడిపోయి ఉంటారు. ఎక్కడ ప్రతిభ ఉన్న దాన్ని వెలికి తీసే తత్వం ఆమెది కావడంతో అనేక మంది శిష్యులు తయారు కావడమే కాకుండా వారంతా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఉన్నత స్థాయిలో ప్రదర్శనలు ఇవ్వగలుగుతున్నారు.
- బి.డి.శ్రీనివాసశర్మ ‘బి’ గ్రేడ్ ఆర్టిస్టు (మృదంగం, ఘటం, మోర్సింగ్, టీచరుగా త్రిబుల్ ఐటీ లో పనిచేస్తున్నారు.)
- పి. సురేష్ కుమార్ ‘బి’ హై గ్రేడ్ ఆర్టిస్ట్
- అనిల్ కుమార్ హైదరాబాద్ ‘బి’ హై గ్రేడ్ ఆర్టిస్ట్
- రాజేష్ న్యూఢిల్లీ
- ఎం. హరికృష్ణ అనంతపురం
- పి. సూరిబాబు అన్నవరం దేవస్థానం
- Famous pads artiste ఎం. పవన్ కుమార్; మహేష్; ఎం శివకుమార్ యాదగిరి రాజాం
- బి. శ్రీనివాసరావు మృదంగం అండ్ తబలా
- బి. రామకృష్ణ విజయనగరం బి గ్రేడ్ ఆర్టిస్ట్ టీచర్ గవర్నమెంట్ స్కూల్
- చక్రపాణి ప్రముఖ తబలా వాయిద్యం
- మాలతీరావు మృదంగం ప్రత్యేకించి హరికథలకు బాగా వాయిస్తారు.
- ఎన్. ఋషి కుమార్; డి.నాగరాజు; పి.వెంకటరావు; నాగలక్ష్మిగారు యూట్యూబ్‌లో పాటలు చెప్పినప్పుడు నేర్చుకుంటూ మృదంగం వాయించారు.
మండపాక నాగలక్ష్మిగారి శిష్యులైన ఎన్.రుషికేశ్; వి.గణేష్; పి.వెంకట్రావు; ఎన్. నాగరాజు వీరంతా మృదంగ లయ విన్యాసాలలో పాల్గొని చాలా చక్కగా ప్రదర్శిస్తారు.
ప్రముఖులతో డా.మండపాక నాగలక్ష్మి గారు
యూట్యూబ్‌లో పాఠాలు:
Mandapaka nagalakshmi అని యూట్యూబ్ చానల్
కరోనా సమయంలో దూరప్రాంతాల నుంచి రాలేని విద్యార్థుల కోసం చాలా రోజుల్లో ఆమె యూట్యూబ్‌లో పాఠాలు చెప్పేవారు. సుమారు 300 పైగా పాఠాలు వీడియోలుగా యూట్యూబ్‌లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఆ యూట్యూబ్ వీడియోలు చూస్తూ ప్రాక్టీస్ చేసిన విద్యార్థులు తమకు ఎంతో ఉపయోగంగా ఉంది అని ఆమెకు ప్రతిస్పందనలు తెలియజేశారు.
అనేక రాష్ట్రస్థాయి జాతీయస్థాయిలో సంగీత పోటీల్లో పాల్గొని విజేతగా తెచ్చిన అనేక వెండి పతకాలు స్వర్ణ పతకాలు తన మృదంగానికి ధరింపజేశారు. కొన్నింటిని గురించి తెలుసుకుందాము..
1983లో హైదరాబాదులో నవ్య నాటక సమితి నిర్వహించిన జాతీయ స్థాయి సంగీతపోటీల్లో ప్రథమ స్థానంలో నిలచి, బంగారు పతకం ప్రథమ బహుమతిగా పొందారు.
1984లో విజయనగరం యూత్ అసోసియేషన్ కార్యక్రమంలో ప్రథమ బహుమతి అందుకున్నారు రాజమండ్రి కి చెందిన కళా జ్యోతి ద్వారా 1984లో ఘన సన్మానం పొందారు.
1985లో కాకినాడకు చెందిన శ్రీరామ సమాజం అవార్డును అందజేశారు.
1992లో ముంబైకి చెందిన సుర సింగార్ కళాశాల ‘తాళమణి‘ బిరుదు ఇచ్చి సన్మానించింది. 1992లో విశాఖపట్నం ఇన్నర్ వీల్ క్లబ్ ఏర్పాటు చేసిన సంగీత కచేరి సందర్భంగా మెరిట్ సర్టిఫికెట్ తో పాటు అవార్డును అందుకున్నారు.
1993లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వార్షికోత్సవంలో ఏర్పాటైన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి కేఆర్ నారాయణన్ తో పాటు రాష్ట్ర గవర్నర్ కృష్ణకాంత్ కూడా విచ్చేసి నాగలక్ష్మి సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు.
1995లో బొబ్బిలికి చెందిన ‘వివర్ధిని పరిషత్’ ఉగాది పురస్కారాన్ని అందించింది.
1996లో చెన్నైకి చెందిన శ్రీకృష్ణ గానసభ కృష్ణాష్టమి సందర్భంగా ఉత్తమ మృదంగ కళాకారిణిగా అవార్డును అందుకున్నారు.
1995లో ‘స్పిరిట్ ఆఫ్ యూనిటీ కన్సర్ట్’ కమిటీ పుట్టపర్తి సత్యసాయిబాబా జన్మదినోత్సవ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్న నాగలక్ష్మి సత్యసాయి ఆశీస్సులను పొందారు.
భారత్ కల్చరల్ ఇంటిగ్రేషన్ కమిటీ ఆధ్వర్యంలో స్పిరిట్ ఆఫ్ కాన్సెప్ట్ యూనివర్సల్ ఇంటిగ్రేషన్ కార్యక్రమంలో మైసూరు దత్తపీఠంలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి సమక్షంలో తన మృదంగం వాదన వినిపించారు. కోయంబత్తూరు శ్రీ వేంకటేశ్వర దేవస్థానం; కేరళలో శ్రీ సరస్వతి సంగీత కళాశాల; చెన్నైలోని మ్యూజిక్ అకాడమీ శ్రీకృష్ణ గాన సభ, శ్రీ నారద గాన సభ, పార్థసారథి సభ, భారత కళాచార్, శ్రీ త్యాగబ్రహ్మ గాన సభ హంస ధ్వని శృతిలయ సేవా ట్రస్ట్, మైలాపూర్ ఫైన్ ఆర్ట్స్ తదితర కళాక్షేత్రాల్లో ఆమె మృదంగ వాద్యముతో తమిళ ప్రజల అభిమాన పాత్రురాలు అయ్యారు. కర్ణాటక రాష్ట్రంలో హోస్పేటలోని ‘సంగీత భారతి’ మైసూరులోని శ్రీ గణపతి సచ్చిదానందస్వామి గురుదత్త పీఠంలో కూడా సంగీత కచేరీ కార్యక్రమాలలో పాల్గొన్నారు.
2005లో అప్పటి రాష్ట్ర మంత్రిగా శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారి చేతులమీదుగా ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సన్మానం చేశారు.
2006లో విజయనగరం ఇన్నర్ వీల్ క్లబ్; విశాఖపట్నం పి వి డబ్ల్యూ అసోసియేషన్
విజయనగరంలో సరోజినీ మహిళా మండలి ;నరసింహం ఫౌండేషన్
2007లో మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ సాయినాథ్ కళా సమితి
2008లో అనంతపురం రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్
2016లో విజయనగరం కలెక్టర్ వివేక్ యాదవ్ చేతుల మీదుగా సత్కారం పొందారు. అదే ఏడాది విజయనగరం ఎమ్మార్ ప్రభుత్వ కళాశాల యాజమాన్యం నుంచి సత్కారం పొందారు.
2017లో విజయనగరం అమ్మవారి ఉత్సవ కమిటీ; ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విద్యాలయం 2017లో ఉగాది సందర్భంగా అప్పటి కేంద్ర మంత్రి కిమిడి మృణాళిని చేతులమీదుగా సత్కారం పొందారు.
రాజమండ్రి విజయ శంకర ప్రభుత్వ సంగీత కళాశాల యాజమాన్యం; లక్ష్మీ త్యాగరాజ సంగీతం నృత్య కళాశాల యజమాన్యం నుండి అనేక సత్కారాలను పొందారు.
విశాఖ మ్యూజిక్ అకాడమీ, విజయవాడ కనకదుర్గ కళా సమితి; ఆంధ్ర మ్యూజిక్ అకాడమీ, ఒరిస్సాలో కటక్ లో నాదోపాసన, కర్ణాటక రాష్ట్రంలో సంగీత భారతి, భువనేశ్వర్ లో ఆంధ్ర అసోసియేషన్,
మధ్యప్రదేశ్ బిలాస్పూర్ సరస్వతి సంగీత సభ, 2000 పైగా కచేరిలలో మృదంగ సహకారం చేశారు.
రేడియో విశాఖపట్నం కేంద్రంలో ‘ఏ’ గ్రేడ్ ఆర్టిస్టుగా శ్రోతలను అలరిస్తున్నారు. అనేక టీవీ చానల్స్ లో వీరి కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి.
1978లో తన మొదటిగా కచేరిని ప్రారంభించిన నాగలక్ష్మిగారు 1988లో ఆల్ ఇండియా రేడియో ‘బి’ గ్రేడ్ 1998లో ‘హై’ గ్రేడ్, 2012లో ‘ఎ’ గ్రేడ్ పొందారు. ఆకాశవాణి, దూరదర్శన్ ప్రముఖ విద్వాంసుల కచేరీలకు వాద్య సహకారం అందిస్తున్నారు.
“మీరు వాయించే మృదంగ వాద్యానికి, మిగిలిన ‘మార్దంగికుల’ వాద్యానికీ గల తేడా అర్థమయ్యేటట్లు చెప్పగలరా?” అని అడిగినప్పుడు – “గాత్రానికి సరిగమలు ఎంత అవసరమో మృదంగానికి లయ బద్ధంగా జతులు అంతే అవసరము. గాత్రం కూడా అవగాహన ఉండి స్వరాలు, సాహిత్యం తెలుసుకున్న మృదంగ విద్వాంసులు వాయించే విధానంకి కేవలం మృదంగం మాత్రమే నేర్చుకున్నవారు వాయించే విధానానికి ఒక తేడా ఉంటుంది. అది లోతుకు వెళుతున్నకొలదీ ఆ కళలో ప్రావీణ్యం వినేవారికి మరియు వాయించే వారికి కూడా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. మిగిలినవారి కంటే వీరి ప్రదర్శనలో ఒక అద్భుతం గోచరిస్తుంది. అది భగవంతుడు దయవలన ఆమెకు ఈ రెండింటిలోనూ కూడా ప్రావీణ్యం ఉండడం వలన సాధ్యమవుతోంది. గాత్రంలో స్వరం సాహిత్యం కూడా ఉంటాయి. అది కచేరీలో ప్రదర్శన ఇస్తున్నప్పుడు గాయకుడు లేదా గాయకురాలు పాడిన స్వరానికి అనుగుణంగా వాయించడం, సాహిత్యానికి అనుగుణంగా కూడా వాయించగలడం అనే ఒక అద్భుతమైన ప్రావీణ్యం కలిగి ఉండడం భగవంతుని వరం” అంటారామె..
కచేరీలు చేసిన దేవస్థానాలు అరసవిల్లి, సింహాచలం, అన్నవరం, భద్రాచలం, తిరుపతి, బాసర, వెంకటేశ్వర దేవస్థానం కోయంబత్తూరు, శ్రీ స్వామినాథ సేవా సమాజ్ న్యూఢిల్లీ, శ్రీ దత్త పీఠం మైసూర్, ప్రశాంతి నిలయం పుట్టపర్తి, శ్రీ రామకృష్ణ ఆశ్రమం హైదరాబాదు, బాపట్ల, విశాఖ, ఆనంద వనం భీమిలి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ బెంగళూరు, అరబిందో ఆశ్రమం పాండిచ్చేరి లో మొదలైన దేవస్థానాలు ఏర్పాటు చేసిన అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో కచేరీలు నిర్వహించారు.
మీ కళను గుర్తించి వచ్చిన పురస్కారాలు- సన్మానాలు- బిరుదులు
చాలా వచ్చాయి. అవన్నీ గుర్తుపెట్టుకుని చెప్పడం కష్టం. ఎందుకంటే సాధన ద్వారా నిరంతరము కళామతల్లిని సేవించడం, జీవితాన్ని సంగీతం కోసం అర్పించడం, సంగీతంలో ఆధ్యాత్మికత కూడి ఉన్నది కనుక ఇహమూ, పరము రెండిటికీ ఉపయుక్తమైన దీనిని వారసత్వంగా అంది వచ్చిన దానిని ఎంతో ఇష్టంగా నిత్యము సాధన చేస్తూ గడుపుతున్నారు.
అందుకున్న అనేక పురస్కారాలలో లేదా మీరు చేసిన కచేరీలలో ఎంతో ఆనందాన్ని ఇచ్చినటువంటి సంతృప్తిని కలిగించినటువంటి కార్యక్రమం గురించి చెప్పగలరా?
తిరుమల తిరుపతి దేవస్థానం నాదనీరాజనం వేదికపై అనేకమార్లు కచేరీలు చేసి ప్రతిసారి ఎక్కువ సంతృప్తిని పొందాను అన్నారు. ప్రతిసారీ దేవుడి ఎదురుగుండా గానం చేస్తున్నట్టుగా ఉండేది. అంతేకాకుండా ఆ కచేరిని విన్నటువంటి, చూసినటువంటి ప్రముఖులెందరో ప్రశంసలు ప్రత్యక్షంగా పరోక్షంగా అందించడం అనేది తృప్తిని కలిగించిన విషయం.
ఎందరో సంగీత కళాకారులకు మృదంగం వాయించడం వారి మనసులను చూరగొన్నది. ఏలూరులో ఎం.సి.ఏ.హాల్లో అంతర్జాతీయ కర్ణాటక సంగీత నృత్య కళాకారుల సంఘం 13-12-2022 పద్మశ్రీ పురస్కారగ్రహీత కుమారి అవసరాల కన్యాకుమారి చేతుల మీదుగా సీనియర్ వయోలిన్ కళాకారులు పద్మశ్రీ అన్నవరపు రామస్వామిగారి ఆధ్వర్యంలో సాగిన సత్కార సభలో ఇరువురు పద్మశ్రీల చేతులమీదుగా ‘మృదంగ వాద్య ప్రవీణ’ బిరుదుతోపాటు సువర్ణ ఘంటా కంకణం కూడా అందుకొనడం ఎంతో సంతృప్తిని కలిగించిందని అంటారామె.
అదేవిధంగా సాక్షాత్తు భగవత్ స్వరూపులుగా భావించే ‘పద్మ భూషణ్’ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణగారి కచేరీలో వాయించడం అనేది చాలా తృప్తిని కలిగించింది. ఎందుకంటే వారు గాత్రం ఒక్కటే కాదు సహవాయిద్యాలన్నింటి నిష్ణాతులు. అందువలన ప్రదర్శనకు వీలైనంత అవకాశాన్ని అందించి ప్రశంసిస్తారు.”
పురస్కారములు
- స్వర్ణ పతకము నవ్య నాటక సమితి హైదరాబాద్ 1983
- బెస్ట్ మృదంగం ఆర్టిస్ట్ శ్రీరామ సమాజం వారిచే కాకినాడ 1985
- బెస్ట్ ఆర్టిస్ట్ ఇన్నర్ వీల్ క్లబ్ విశాఖపట్నం 1992
- ఉగాది పురస్కారం వివర్ధిని సభ బొబ్బిలి 1993
- బెస్ట్ అకౌంట్ ఇన్ గోకులాష్టమి సిరీస్ ఆఫ్ శ్రీకృష్ణ గాన సభ చెన్నై 1996
- స్వర్ణ పతకము విజయ త్యాగరాజ సంగీత సభ విశాఖపట్టణం 2004
- ఆర్టిస్ట్ ఆఫ్ డిస్టెన్స్ అవార్డు విత్ గోల్డ్ మెడల్ విశాఖ మ్యూజిక్ అకాడమీ విశాఖపట్నం 2009లో
- బెస్ట్ టీచర్ అవార్డు విత్ గోల్డ్ మెడల్ ముఖ్యమంత్రి డాక్టర్ ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి గారి చేతులమీదుగా 2013లో
- బెస్ట్ మృదంగం ఆర్టిస్ట్ అవార్డు డా. రోశయ్య గవర్నర్ మద్రాస్ మ్యూజిక్ అకాడమీ 2014
- భారత గౌరవ్ నేషనల్ అవార్డు శ్రీ భీష్మ నారాయణ సింగ్ గవర్నర్ తమిళనాడు అస్సాం మరియు 7 ఇతర రాష్ట్రాలు ఇండియా ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ సొసైటీ న్యూఢిల్లీ 2016
- గ్లోరీ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ అవార్డు ఫ్రం ది హాండ్స్ ఆఫ్ హెచ్ డబరామ్ సి ఫార్మర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ థాయిలాండ్ బై ఎన్ డి ఓ థాయ్ ఫ్రెండ్షిప్ ఆర్గనైజేషన్ హైలాండ్ 2016
- బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ ఇండియా ఇంటర్నేషనల్ పబ్లిష్ సింగ్ హౌస్ న్యూఢిల్లీ 2016
బిరుదులు
- తాళమణి సురుసింగార్ అకాడమీ బొంబాయి 1992
- గాయత్రీ సంగీత విద్వన్మణి గాయత్రీ మహిళా సంగీత సన్మాండలి గుంటూరు 2017
- మహిళా శక్తి శిరోమణి 75వ ఆజాదీకా అమృత మహోత్సవ ఐ.ఐ.ఎఫ్.ఎస్.న్యూఢిల్లీ 2022
- మృదంగం విద్యా ప్రవీణ ఐ.సి.ఎం.డి.ఏ. చెన్నై డిసెంబర్ 2022
- మృదంగం మహారాణి ఎమ్మెస్ బాలసుబ్రమణ్య శర్మ స్మారక సంస్థ తెలుగు కళావాహిని శ్రీ కళాభారతి విజయవాడ 2024
- సంగీత సరస్వతి కళాప్రియ నృత్య కళాక్షేత్రం రాజమహేంద్రవరం 2024
- లయ గంగాతరంగిణి త్యాగరాజ చారిటబుల్ ట్రస్ట్ చెన్నై హిందూ బనారస్ యూనివర్సిటీ వారణాసి పద్మశ్రీ ఎల్లా వెంకటేశ్వరరావు గారి చేతులమీదుగా
- లయప్రవీణ దండమూడి రామ మోహన్ రావుగారు 95 వ జయంతి వేడుకలలో లయ వేదిక ఆర్గనైజేషన్ విజయవాడ 2025
- మృదంగరత్న టైటిల్ అవార్డు ఏం.జి.జి.పి.ఎఫ్.ఇండియా -2025
“ఇది ఎంతో ప్రాచీనమైన కళాశాల 5 వ తేదీ. ఫిబ్రవరి 1919 న ప్రారంభింపబడిన ఈ కళాశాల ఎన్నో రంగాలలో తన గొప్పదనాన్ని చాటుకున్నది. ఇప్పటికీ చాటుతూనే ఉన్నది. మన పూర్వీకులు ఎందరో దీనికి కొన్ని నిర్దేశితమైన సూత్రాలను, సంప్రదాయ బద్ధమైన సంగీతానికి అనువైన నియమాలను పెట్టి ఉంచారు. వాటిని నిలబెట్టడం అనేదే నాకున్న లక్ష్యము.
ఎందుకంటే ఇంతకుముందు కళాశాలలో విద్యార్ధుల సంఖ్య పెంచాలి అంటే పాఠశాల సమయాన్ని ఇతర ప్రభుత్వ పాఠశాలలతో సమానంగా ఉండడం వలన విద్యార్థులు తక్కువగా వచ్చేవారు. మొట్టమొదటిసారిగా మన కళాశాల నుంచి ప్రభుత్వం వారికి ఒక వినతిపత్రం మేము పెట్టాము. విద్యార్థులకు రెగ్యులర్ పాఠశాల చదువులకు ఈ కళాశాల చదువులకు మధ్య సమయం వ్యత్యాసం ఉండాలి. అందువలన ఉదయం 7 గంటల నుంచి 9:30 సాయంత్రం 4:30 నుంచి 7 గంటల వరకు అని వెసులుబాటు కల్పించడం వలన ఎంతో మంది విద్యార్థులు చేరుతున్నారు.. వయోపరిమితి కూడా విధించకపోవడం వలన ఇప్పుడు పదవీ విరమణ పొందిన తరువాత కూడా ఎక్కువ మంది చేరుతున్నారు.
ఈ కళాశాలలో ఉన్న విభాగాలు7. గాత్రము, వీణ, వయోలిన్, మృదంగం, డోలు, సన్నాయి, నృత్యం అని ఏడు విభాగాలలో జాతీయస్థాయిలో విద్యార్థులు తమ యొక్క ప్రదర్శనలు ఇస్తున్నారు అని చెప్పడానికి ఇక్కడ అధ్యాపకులు అందరూ ఎంతో గర్వపడుతూ ఉంటారు. అదేవిధంగా మొదటి నుంచి ఆమెకు తెలిసిన అధ్యాపకులు మాత్రమే కాదు ఇక్కడ పని చేసే సిబ్బంది కూడా తెలిసినవారు కావడం వలన ప్రత్యేకమైన ఛాలెంజెస్ లేవు వాళ్ళందరితో స్నేహపూరిత వాతావరణంలో కార్యక్రమాలు చక్కగా నిర్వహించుకుంటూ ఉంటారు. ఈ కళాశాలలో మొట్టమొదటిగా వినాయక చవితితో ప్రారంభిస్తారు. నవరాత్రులు ఉత్సవాలు ఇక్కడ చదువుకుని వెళ్లిన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కళాకారులను ఏ విభాగమైనా గాని వారిని వేదిక ప్రదర్శనకు ఆహ్వానిస్తుంది. అదేవిధంగా జూనియర్ విద్యార్థులు సీనియర్ విద్యార్థులు కూడా తమ తమ రంగాలలో ఈ వేదిక మీద ప్రదర్శన ఇవ్వడం ఎంతో అదృష్టంగా భావిస్తూ ఉంటారు.
జాతీయ పండుగలు అయిన రిపబ్లిక్ డే, స్వాతంత్రదినోత్సవము అందరూ కలిపి ఆనందోత్సాహాలతో చేస్తారు.
ఆషాడ మాసంలో వచ్చే గురుపూర్ణిమ, సెప్టెంబర్ లో వచ్చే ఉపాధ్యాయ దినోత్సవం కూడా పిల్లలు ఉపాధ్యాయులు కూడా స్నేహపూరిత వాతావరణంలో చక్కగా జరుపుకుంటారు.సంగీతంలో ఏ విభాగంలో వారైనా సరే ప్రముఖుల జయంతి వర్ధంతి కూడా మెయిన్ హాల్లో సమావేశపరిచి, వారిని స్మరించుకోవడం జరుగుతూ ఉంటుంది.ముఖ్యంగా సంగీత త్రయంలో త్యాగరాజు వారి ఆరాధన ఉత్సవాల సమయంలో పంచరత్న కీర్తనలు సామూహికంగా అందరూ పాడడం అనేది ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది.అలాగే ఇక్కడ వర్క్ షాపులు నిర్వహించడానికి ఆయా విభాగాలలో పెద్దలు వచ్చి రెండు/మూడు రోజులు శిక్షణను ఇస్తారు” అని వివరించారు.
పనిచేసిన ప్రదేశాలు:
- ప్రస్తుతము మహారాజా ప్రభుత్వ సంగీతనృత్య కళాశాల విజయనగరములో కళాశాల అధ్యక్షురాలిగా
- విజయశంకర ప్రభుత్వకళాశాల సంగీత నృత్యవిభాగము రాజమహేంద్రవరంలో 01-06-2023 నుండి 09-07-2025 వరకు కళాశాల అధ్యక్షురాలిగా పని చేశారు.
- మృదంగ లెక్చరర్ గా మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల లో మృదంగం విభాగంలో 1992 నుంచి 2023 వరకు 31 సంవత్సరాలు అధ్యాపకురాలిగా పనిచేశారు.
- Empanelled artist by Indian council for cultural relation ICCR New Delhi వారి తరఫున పని చేశారు.
- ఆకాశవాణి మరియు దూరదర్శన్ కేంద్రములలో మృదంగంలో ‘ఏ’ గ్రేడ్ ఆర్టిస్ట్ గా పని చేశారు.
విదేశీ పర్యటనలు
2002 & 03 లో పిట్స్బర్గ్ వారి ఆహ్వానం మేరకు అమెరికాలో మృదంగ శిక్షణ ఇచ్చారు. అక్కడ శ్రీ వేంకటేశ్వర ఆలయంలో నిర్వహించిన కచేరీలో పాల్గొన్నారు. వాషింగ్టన్, క్లీన్ ల్యాండ్, న్యూయార్క్, న్యూ జెర్సీ, యంగ్ స్టన్ వంటి ప్రముఖ ప్రదేశాలలో కచేరీలు చేశారు.
ప్రముఖులతో చేసిన కచేరీలు.
సాంప్రదాయ వాయిద్యాలతో మహిళల కచేరీ
2012లో సంగీత కళానిధి అవసరాల కన్యాకుమారి గారు సాంప్రదాయ వాయిద్యాలు నడుమ కచేరీ చేసినప్పుడు అందరూ మహిళలతో చేయించినప్పుడు మృదంగం డాక్టర్ మండపాక నాగలక్ష్మి గారు తబలా అనురాధ పై ఘటం రమ్యా రమేష్ కంజీర లతా రామచారి, మాండలిన్ సోదరీమణులు శ్రీ ఉష శిరీష సహకారము అందించారు.
పుంభావ సరస్వతి శ్రీమత్ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు వారి జయంతి సందర్భంగా తిరుమల కొండపై గల నాదనీరాజనం కార్యక్రమంలో 01-09- 2016న కుమారి మండపాక శారద గారి గాత్రకచేరి జరుగగా శ్రీలత సహకారం అందించారు. కుమారి మండపాక నాగలక్ష్మిగారి మృదంగం, ఘటం కె. వి. కృష్ణ గారు తిరుమల తిరుపతి దేవస్థానం భక్తి ఛానల్లో ఇది ప్రసారమైంది.
విశాఖ మ్యూజిక్ అకాడమీ నిర్వహించిన కచేరీలో గాత్రం బి లలితా చంద్రశేఖర్ వయొలిన్ శ్రీ రమ్య మృదంగం డాక్టర్ ఎం నాగలక్ష్మి మోర్సింగ్ శ్రీ జి వెంకటేశ్వర్ గారు
ఐడియల్ టీచింగ్ అవార్డ్స్ ప్రోగ్రాంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా 2020 ఉత్తమ మృదంగం ఉపాధ్యాయ పురస్కారం
ట్యూటర్స్ ప్రైడ్ అవార్డు:
రాజారత్న గ్రూప్ ఆఫ్ సంస్థలు రామచంద్రపురం కోనసీమ జిల్లాకు చెందిన ట్యూటర్స్ ప్రైడ్ అవార్డు తీసుకున్నారు.
ఈ పురస్కారం కోసం 1100 దరఖాస్తులు రాగా ఎంపిక చేసిన వారిలో డాక్టర్ మండపాక నాగలక్ష్మి గారు ఉండడం ఎంతో ఆనందదాయకం. దీనికివారు ఒక గంట నిడివిలో ఆన్లైన్ ద్వారా పాఠాలు చెప్పడం పరిగణనలోకి తీసుకొని యూట్యూబ్ ఛానల్ యూరి కమిటీ సబ్జెక్టు రిసోర్స్ కమిటీ కలిపి నిర్ణయించారు. యూట్యూబ్ లో ఆమె నేర్పినప్పుడు పంచ జాతులకు చెందిన తిస్రా, చతురస్ర, ఖండ, మిశ్రా, సంకీర్ణ జాతులకు చెందిన 15 పైగా తాళములను ముందుగా స్వరాలను మృదంగ ధ్వనులతో నేర్పి, తర్వాత మృదంగంపై వాయించడం శిక్షణను ఇచ్చారు. ఇది ఎందరో విద్యార్థులకు ప్రత్యక్ష పరోక్షంగా ఉన్నవారికి చాలా ఉపయోగపడింది.సాధకుల కృషిని గుర్తించి సంస్థలు ప్రభుత్వాలు ఇచ్చేవి అవార్డులు
మహిళాశక్తి ఆజాదీ కా అమృత మహోత్సవంలో ఢిల్లీ ఇండియా ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ సొసైటీ ద్వారా మహిళా శక్తి పురస్కారం వచ్చింది.
ఐ.సి.ఎం.జి.ఏ.వారు ప్రపంచ ప్రఖ్యాత గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వాళ్లు విజయవాడలో,చెన్నై లో, వారణాసిలలో, నిర్వహించిన అయిగిరి నందిని కోసం సర్టిఫికేట్, జ్ఞాపిక, ఇచ్చారు.
మధుర జ్ఞాపకాలు
కోలంక వెంకటరాజుగారు. మృదంగం వాయిద్యంలో పథ నిర్దేశకుడు ఆ వాయిద్యాన్ని నూతన విధానంలో ప్రాచుర్యంలోకి తెచ్చిన వ్యక్తిగా చెప్పుకోవచ్చును.
పెద్దక్క కుమారి మండపాక శారదగారి గాత్రకచేరి తునిలో జరిగిన సమయంలో కోలంక వెంకటరాజుగారు వచ్చి ఆహూతులలో ముందు వరుసలో కూర్చున్నారు. అప్పుడు నాగలక్ష్మి మృదంగం వాయిస్తున్నారు. తన్యావర్తనం పూర్తి అయిన వెంటనే ఆయన వేదిక మీదకు వచ్చి తాను వేసుకున్న శాలువా తీసి నాగలక్ష్మికి కప్పి, ఇంటి నుండి తాను వాడుతున్న ఎలక్ట్రానిక్ శృతి బాక్స్ అప్పటికప్పుడు తెప్పించి కుమారి నాగలక్ష్మి గారికి వేదిక మీద బహుమతిగా ఇవ్వడం ఒక మధుర స్మృతిగా ఆమె చెబుతారు.
శ్రీ కమలాకరరావుగారు రాజమండ్రి వచ్చి కచేరి విన్న తర్వాత ఇలా అన్నారు “ఆడవాళ్లు మృదంగం వాయించడమే అరుదు. ఎవరు వాయించగలరు? అని అడిగితే మొట్టమొదటిగా నాగలక్ష్మి పేరు మాత్రమే చెప్పవలసి ఉంటుంది. అంత శుద్ధంగా వాయిద్యాన్ని వాయించినవాళ్ళు ఈ రోజుల్లో అరుదుగా ఉన్నారు.”
అదేవిధంగా డి.కె.పట్టమ్మాళ్ గారు 1991లో విశాఖపట్నం వచ్చినప్పుడు ఆమె ఎదురుగా కచేరీలో మృదంగం వాయించడం ఆమె పరిశీలనగా చూసి “ఆ అమ్మాయి శుద్ధంగా వాయించారు.” అని చెప్పారు.
తిరుమల కొండపై నాదనీరాజనం కార్యక్రమంలో మృదంగం వాయించిన తరువాత వంకాయల వెంకటరమణగారు మెసేజ్ పెట్టారు
“అమ్మా! నువ్వు శుద్ధమైన వాయిద్యం వాయిస్తున్నావు. ఆధునికతలో అందరూ చప్పట్ల కోసం వాయిద్యాలు తీరును మార్చుకున్నారు. కానీ మీరు మాత్రము సంప్రదాయ పద్ధతిని వీడలేదు అని ఇది మాకు ఎంతో గర్వకారణం.” అని మెసేజ్ పంపించారు
అనుసరణలో లాలిత్యానికి, లెక్కల్లో దారుఢ్యానికి మారుపేరైన ముళ్ళపూడి వారి సంప్రదాయంలో శిక్షణ పొందడం నాగలక్ష్మిగారి ఔన్నత్యానికి పూలబాట వేసింది. ముళ్ళపూడి బాణి అని అందరిలో ప్రతీతి. నాగలక్ష్మిగారి దగ్గర ఉన్న పాఠము శుద్ధమైనది అది మరియొకరి దగ్గర మనం చూడము.” అని అందరూ ప్రశంసిస్తూ ఉంటారు.
ఎం.జి. గోపాలకృష్ణన్ గారు
“I appreciate your mridangam teaching to your students with utmost care and affection with a natural smile and kind hearted you are truly deserving senior mridangam artists.”
అయ్యగారి శ్యామసుందరంగారు “ఆరోజు కచేరీలో మీ మృదంగం అద్భుతంగా ఉందమ్మా!” అన్నారు. అయ్యగారి జయలక్ష్మి గారు “నాదనీరాజనంలో నీవు వాయించిన తని ఎప్పటికీ మర్చిపోలేను. అది విని నీ అభిమానిగా మారిపోయాను నాగలక్ష్మి!” అన్నారు.
వెంకటరమణమూర్తిగారు నాదనీరాజనంలో తానవర్త కచేరి అయిన తర్వాత ప్రశంసించారు.
పద్మభూషణ్ మంగళంపల్లి మురళీకృష్ణగారి కచేరీకి మృదంగం వాయించడం అరుదైన అవకాశం గా అందరూ భావిస్తే అంతటి మహనీయుడు ఆమె భుజం తట్టి “బాగా వాయించావు” అని ప్రశంసించడం ఆశీస్సులుగా భావించారు. అతని చేతినుండి సన్మానం పొందడం ఇంకా అదృష్టంగా అనుకున్నారు.
ప్రముఖ కళాకారులకు సహకారం సంగీత కచేరీలలో కుమారి మండపాక నాగలక్ష్మి గారు
‘సంగీత కళానిధి’ కన్యాకుమారిగారు; కుమారి మండపాక శారద; డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణగారు; బొంబే సిస్టర్స్; హైదరాబాద్ సిస్టర్స్; ద్వారం భావనారాయణ గారు; డి.కె.పట్టమ్మాళ్ గారు; వాయులీన విద్వాంసులు ద్వారం దుర్గాప్రసాదరావుగారు; వేణుగాన విద్వాంసులు ప్రొఫెసర్ పి.సీతారాం; ఇవటూరి విజయేశ్వరరావు గారు; కోటిపల్లి ప్రకాష్ రావు గారు; కొమండూరి కృష్ణమాచారిగారు; అరుంధతి సర్కార్; జయ పశుపతి; బి. ఇందిరా కామేశ్వరరావు; ఎం.సుధారాణి; ద్వారం విజయలక్ష్మి; మాల చంద్రశేఖర్; సుగుణ పురుషోత్తం వంటి సంగీత విద్వాంసులుతో కలిసి అనేక కచేరీలు ఇచ్చారు. ప్రముఖులకు వాద్య సహకారంలో భాగంగా ఎస్.పి.బాలసుబ్రమణ్యం గారు నిర్వహించిన ‘పాడాలని ఉంది’ కార్యక్రమానికి రెండు ఎపిసోడ్ లకు న్యాయనిర్ణేతగా పాల్గొన్నారు.
టీవీలో ప్రదర్శనలు, దూరదర్శన్, భక్తి ఛానల్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, ఇతర ప్రైవేటు ఛానల్స్ లో, కన్నడ ఓవర్సీస్ ఇతర స్థానిక చానల్స్ లో నాగలక్ష్మి గారి కార్యక్రమాలు ప్రసారమయ్యాయి. పలు సంగీత కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. సప్తగిరి దూరదర్శన్ ఛానల్ ప్రసారం చేస్తున్న విష్వక్సేనుడు సీరియల్ కు మరియు, వివిధ ప్రైవేటు ఛానల్ ను నిర్వహించే వివిధ కార్యక్రమాలకు సంగీతంలో మృదంగవాద్య సహకారం అందిస్తున్నారు. డాక్టర్ మండపాక నాగలక్ష్మి సంగీత వాద్య వీణ కచేరీలకు సంబంధించి అనేక ఆడియో, వీడియో, సీడీలను వెలువరించారు.
తనకు ప్రత్యేకమైనటువంటి ఛానల్ ఉండింది అందులో సుమారు 300 పైగా పాఠాలను మృదంగం అభ్యాసకులకు అనుగుణంగా వీడియోలను తయారు చేసి ఉంచారు.
రెయిన్బో ఎఫ్ఎం రేడియోలో మెట్రో మహిళ అనే ప్రత్యేక కార్యక్రమంలో స్పెషల్ ఫోకస్ టీవీ 9 లోను నాగలక్ష్మి గారి ఇంటర్వ్యూలు ప్రసారమయ్యాయి.
నాగలక్ష్మి గారి ఇంటర్వ్యూలు తెలుగు, ఇంగ్లీషు, తమిళ, మళయాళము,ఒరియా, కన్నడ దినపత్రికలలో ప్రచురించగా, వార్తా, ఆంధ్ర భూమి, లీడర్, కళారవి, వాణిజ్య వాణి, భక్తి సమాచారం లలో జరిగిన కార్యక్రమాలను పూర్తిస్థాయిలో ప్రచురించారు.
కళాకారిణి గా సంస్థలతో అనుబంధము:
‘గానకళ’ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ స్టీరింగ్ కమిటీ సభ్యురాలుగా ఉన్నారు. ఛత్తీస్గడ్ ఇందిర కళా సంగీత విశ్వవిద్యాలయ ఎక్స్పెక్ట్ కమిటీ సభ్యురాలుగా వ్యవహరిస్తున్నారు. ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ కార్యదర్శిగా, కేంద్రీయ విద్యాలయ మేనేజ్మెంట్ కల్చరల్ కమిటీ సభ్యురాలిగా తన సేవలను అందిస్తున్నారు. గోవింద జగన్నాథం మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ మెంబర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఆశయాలు:
భారతీయ సంస్కృతి సంప్రదాయ సంగీతాన్ని పదికాలాలు పరిమళించేందుకు కృషి చేస్తున్న నాగలక్ష్మి ఈనాటి విద్యా వ్యవస్థను చూస్తూ తన అభిప్రాయాన్నిలా పంచుకున్నారు”.తల్లిదండ్రులు పిల్లలు ఎంచుకునే రంగంలో ప్రోత్సహించకుండా తమకు ఆసక్తిగల రంగంలో పిల్లలకు శిక్షణ ఇస్తూ వారిని మానసికక్షోభకు గురి చేస్తున్నారు. తాను సుమారు 16 గంటలు మృదంగంపై ప్రతిరోజు అభ్యసనం చేసేదాన్నని. కానీ నేడు విద్యార్థులు కనీసం రెండు గంటలు కూడా శాస్త్రీయ సంగీతంపై దృష్టి పెట్టలేకపోతున్నారు. శాస్త్రీయసంగీతం నేర్చుకోవడం వలన మానసిక ప్రశాంతత ఉంటుందని పిల్లలకు శాస్త్రీయసంగీతాన్ని నేర్పేందుకు కొంత సమయమైనా కేటాయించాలన్నారు”
ఆధునిక సంగీత ప్రపంచంలో సాంకేతికతను అందిపుచ్చుకుంటూ నేర్చుకుంటున్న విద్యార్థులు గురించి మీ అభిప్రాయం –
“ఆధునిక విద్యార్థులు పర్ఫామెన్స్ పట్ల మాత్రమే దృష్టి ఉంచుతున్నారు. కానీ తాము నేర్చుకుంటున్న విద్యలో సముద్రంలోతులలోకి వెళ్ళి రత్నాలను మనం ఏరుకోవాలి. ఈ విషయంలో విద్యార్థులను కళలవైపు ఆకర్షించడానికి పాఠశాలలు కొంత బాధ్యతను తీసుకోవలసిన అవసరం ఉంటుంది. కొన్ని పాఠశాలలు వేసవిలో సంగీత శిక్షణ శిబిరాలను నెలకొల్పి పిల్లలను ఆ ఒత్తిడి నుంచి బయటపడవేయడానికి కొన్ని కార్యక్రమాలను చేపడుతున్నారు. అది చాలా ముదావహం. ఈ విషయంలో మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల కొద్ది రోజుల క్రితం సుమారు ఒక వెయ్యి మంది విద్యార్థులకు సంప్రదాయ సంగీతం పట్ల అవగాహన పెంచడం అదేవిధంగా వాయిద్య పరికరాలను వాయించడంలోని మెలకువలను తెలియజేయడంలోనూ శిక్షణ ఇచ్చింది. ఇది ఎంతో గర్వకారణం.
“అమెరికాలో నివసిస్తున్న ప్రజలకు మన భారతీయ సంగీతం అంటే మిక్కిలి అభిమానం.” అని చెపుతూ, “అమెరికాలో తాను శిక్షణ ఇచ్చేటప్పుడు ఎలివేరియం అనే వ్యక్తి రెండేళ్లలో నేర్చుకోవలసిన శాస్త్రీయసంగీతాన్ని అకుంఠిత దీక్షతో కేవలం రెండు నెలల్లోనే నేర్చుకున్నారు. విదేశీయులు మన సంగీతానికి ఎంతో ప్రాముఖ్యతను ఇస్తున్నారు.” అన్నారు.
ఇన్ని సంవత్సరాలుగా స్త్రీలు సంగీతంలో అనేక విభాగాలలో ప్రతిభను సాధిస్తున్నప్పటికీ మృదంగం లో వెనుకబడి ఉండడానికి కారణం ఏమిటి? అనే ప్రశ్నకు జవాబుగా
“మృదంగం పురుషుల వాయిద్యం. స్త్రీలు సాధారణంగా వీణ, వయోలిన్ మొదలగు సున్నితమైన వాద్యాలను ఎంచుకోవడం జరుగుతుంది. మృదంగం వాయించడానికి శారీరక దృఢత్వం తప్పనిసరి. అయినప్పటికీ చిన్నతనం నుంచి ఉన్న ఆసక్తితో మృదంగం నేర్చుకుని పురుషులతో సమానంగా వాయించడం జరుగుతున్నది. ఇందులో శారీరకశ్రమ అధికంగా ఉంటుంది. దానికి తగ్గట్టుగా మానసిక దృఢత్వం కూడా అవసరమవుతుంది. స్త్రీలు వాయించగలమా అనే మీమాంస, భయాన్ని అధిగమించడానికి మానసిక బలం చాలా అవసరం. ఆడపిల్లలు అన్ని రంగాల్లో పురుషులతో పోటీ పడుతున్న నేటి రోజుల్లో ఆడపిల్లలు ఎక్కువమంది మృదంగం కూడా అభ్యసించాలి అని కోరుకుంటున్నారు ” అని జవాబిచ్చారు.
శ్రోతలు/ప్రేక్షకులు మనలనుండి ఆశించేది చక్కని ప్రదర్శన మాత్రమే! స్త్రీలా పురుషులా లేదా ఇతరములైన అసమానతలను చూడరు. అన్నది ఇన్ని సంవత్సరాల నా అనుభవంలో తెలుసుకున్న విషయం.
(మళ్ళీ నెల మరొక సద్గురువుతో కలుద్దాము.)
శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి కథ రచయిత్రి. చక్కని కవయిత్రి. విజయనగరం గురించి పరిశోధించి ‘విజయనగర వైభవానికి దిక్సూచి’ అనే 1100 పేజీల పుస్తకం వ్రాశారు. దేశవ్యాప్తంగా గల 116 మంది కవులతో ‘ఆది నుండి అనంతం దాకా…’ అనే వచన కవితల సంకలనం, ‘లేతమనసులు’ కథాసంపుటి వెలువరించారు.

