Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వందే గురు పరంపరామ్-15

[శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు నిర్వహిస్తున్న ‘వందే గురు పరంపరామ్’ అన్న శీర్షికని ధారావాహికగా అందిస్తున్నాము. ఈ నెల తప్పెటగుళ్ల కళాకారులు నీలబోను సత్యంగారిని పరిచయం చేస్తున్నారు రచయిత్రి.]

ప్రార్థనా గీతం:

శివ శివ మూర్తివి గణనాథా! నువ్వు శివుని కుమారుడవు గణనాథా!
గణ గణ గంటల్లో గణనాథా! నువ్వు గున గున రావయ్య గణనాథా!
శివ శివ మూర్తివి గణనాథా! నువ్వు శివుని కుమారుడవు గణనాథా!
పాలు పండ్లు తెచ్చినాము గణనాథా! నీకు పాకమొండి పెట్టినాము గణనాథా!
తీరొక్క పూల తోటి గణనాథా! నీకు పూజలే చేసినాము గణనాథా!
బంగారు బిందెల్లో గణనాథా! నీకు గంగ నీళ్ళు తెచ్చినాము గణనాథా!
నీకు అభిషేకం చేసినాము గణనాథా! నీకు హారతులే ఇస్తాము గణనాథా!
గంపల్లో కుడుములు గణనాథా! నీకు సప్పాటి ఉండ్రాళ్లు గణనాథా!
ఎలగ పళ్ళు తెచ్చినాము గణనాథా! నువ్వు అలకమాని ఆరగించు గణనాథా!
లంబోదరుడవు గణనాథా! నువ్వు అంబాపుత్రుడవు గణనాథా!
దేవాది దేవుడవు గణనాథా! నువ్వు ఆది పూజ్యుడవు గణనాథా!
విద్యాబుద్ధులు ఇచ్చే గణనాథా! నువ్వు సిద్ధి గణపతివి గణనాథా!
విఘ్నాలు తొలగించే గణనాథా! మా విఘ్నాలాపవయ్య గణనాథా!
శివ శివ మూర్తివి గణనాథా! నువ్వు శివుని కుమారుడవు గణనాథా!

ఇలా వినాయకుడిని స్తుతిస్తూ, ఎన్ని పదాలైనా అల్లుకుంటూ, ఆ అమాయక గ్రామీణ తప్పెటగుళ్ల కళాకారులు చాలాసేపు పరవశించి పాడుతారు.

తప్పెటగుళ్ల బృందానికి ఒక నాయకుడు ఉంటాడు. ఆ బృందానికి అతనే గురువు. నాయకుని ఆట, మాట ప్రకారము నృత్యం జరుగుతుంది.

ఈరోజు మనము అటువంటి ఒక నాయకుడైన శ్రీ నీలబోను సత్యం గురించి మన వందే గురు పరంపరా 15వ అధ్యాయంలో తెలుసుకుందాము..

నీలబోను సత్యం

తప్పెటగుళ్ళ చారిత్రక నేపథ్యము:

‘తప్పెటగుళ్ళు’ అనే జానపదకళ అత్యంత ప్రాచీనమైన కళ అయినప్పటికీ ఉత్తరాంధ్రకి మాత్రమే పరిమితం కావడం, అదే విధంగా గొల్ల కులస్థులు మాత్రమే దీనిని ప్రదర్శిస్తూ ఉండడం వలన ఎక్కువ మందికి దీని గురించి తెలియదు. ముందుగా ఈ కళ యొక్క చారిత్రక నేపథ్యము; ఏ ప్రాంతంలో ఉంది? ఎలా ప్రదర్శిస్తారు? గురువులు ఎవరు? మొదలగు వివరాలను తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర ప్రాంతంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో మొదలై తూర్పు గోదావరి వరకు విస్తరించిన జానపద కళారూపం తప్పెట గుళ్ళు. ఉత్తరాంధ్ర యాదవుల కళారూపమైన ఈ తప్పెటగుళ్ళు. పగటివేష నృత్య రూపంగా ప్రసిద్ధి చెందింది.

దీని పుట్టుక మరియు చరిత్ర

శివుడు తన భక్తులకు అన్ని వాయిద్యాలు ఇచ్చిన తర్వాత మిగిలిన తప్పెటగుళ్ళను యాదవులకు అనుగ్రహించాడని ఒక కథ. ఇది సుమారు 400 సంవత్సరాల క్రితం శ్రీకాకుళం ప్రాంతంలో గొల్ల (యాదవ) శాఖ దీని మూలం అంటారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలలో గల గొల్లలు పెద్ద పెద్ద బృందాలుగా ఈ కళారూపంలో పేరు పొందారు. గొల్లవారి గ్రామాల్లో ప్రతిచోట ఈ బృందాలు ఏర్పడ్డాయి, ఇది యాదవుల సాంస్కృతిక గుర్తుగా మారింది. ఇది కళింగ కళారూపంగా కూడా పిలువబడుతుంది.

తప్పెటగుళ్ళు పశుపోషణకు సంబంధించిన దేవతారాధన నుండి ఉద్భవించిందని చెబుతారు. వర్షాలు పడకపోతే పశుగ్రాసం కోసం గ్రామదేవతలైన గంగమ్మ తల్లిని ప్రసన్నపరచడానికి యాదవులు ఈ నృత్యాన్ని ప్రదర్శించేవారని పశువుల కాపరులు మందలతో ఈ నృత్యం చేసేవారని ఒక కథ.

మరొక కథనం ప్రకారం, 12వ శతాబ్దంలో కాటమరాజు-సిద్దిరాజు యుద్ధంలో ఆలమందలను రక్షించుకోవడానికి గుండెలపై డప్పులతో కొట్టుకున్నారని చెపుతారు. అనేక తరాలుగా గొల్ల కులస్థులు ఈ జానపద కళా రూపాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. కోణారులు, యాదవులు, గొల్లలుగా పిలువబడే వీరు పగలంతా పశువులను మేపుకుంటూ రాత్రులందు వాటికి కాపలాగా ఉంటూ కుటుంబాలకు దూరంగా గడుపుతూ ఉంటారు. చదువులకు దూరమైన వీరు గుంపులుగా కూర్చుని నోటికి వచ్చిన పాటలు, కాలికి నచ్చిన గెంతులు వేసుకుంటూ ఉంటారు.

ఆహార్యం: తప్పెటగుళ్లను ప్రదర్శించేటప్పుడు కళాకారులు రేకుతో తయారు చేసిన తప్పెటలు (చిన్న డ్రమ్స్) రొమ్ములపై కట్టుకుంటారు. వీరు రంగురంగుల బనియన్లు ధరిస్తారు. కాళ్లకు గజ్జలు కట్టుకొని, ఒకే రకమైన నిక్కర్లు ధరించి, లంగోటి లాంటి గోచీలు ధరించి, రేకుతో తయారు చేసిన తప్పెట గుండును గుండెకు కట్టుకొని, రెండు చేతులతో వివిధ గతులలో ఉధృతంగా వాయిస్తారు. కేకలతో, అరుపులతో, కేరింతలు కొడుతూ, ఆనందంగా, గుండ్రంగా తిరుగుతూ, శాస్త్రీయమైన అడుగులతో, సుదీర్ఘ రాగాలతో ఆలాపన చేస్తూ, అందరూ తప్పెట్లను కొడుతూ పాటలు పాడుతారు,

తప్పెటగుళ్ల బృందానికి ఒక నాయకుడు ఉంటాడు. ఆ బృందానికి అతనే గురువు. నాయకుని ఆట, మాట ప్రకారము నృత్యం జరుగుతుంది. 15 నుండి 20 మంది వరకు సభ్యులు గల ఈ బృందం చేసే ఆట కన్నుల పండుగ ఉంటుంది. ఒకరిని మించి ఒకరు దరువులు వేస్తూ ఆడతారు. ప్రదర్శన పతాకస్థాయికి చేరుకునే సరికి సర్కస్ ఫీట్లను కూడా చేస్తారు. నృత్యం చేస్తూనే, లయ తప్పకుండe, వలయాకారంగా చిందులు తొక్కుతూనే, తప్పెటగుండు వాయిస్తూనే, ఒకరిపై ఒకరు ఎక్కుతూ గోపురం లాగా నిలిచి చివరన నిలబడిన వ్యక్తి తప్పెటగుళ్ళు వాయిస్తాడు. చివరికి ఒక్కొక్కరుగా దిగుతారు. మొగ్గలు వేస్తారు. ఒక వ్యక్తి కింద వెళ్ళకిలా పడుకుని, దరువులు వేస్తూ, కాళ్ళను భూమికి తాకిస్తూ, చుట్టూ తిరుగుతారు. కుండపై నిలుచుని నృత్యం చేస్తారు. రెండు మూడు చెంబులను నీటితో తలపై పెట్టుకుని, అవి పడిపోకుండా నృత్యం చేస్తారు.

తప్పెటగుళ్ళు ప్రదర్శన పిరమిడ్ ఆకారంలో

ప్రదర్శనా సందర్భాలు:

గొల్ల కులస్థులు ఈ కళారూపాన్ని గ్రామ సంబరాల్లోనూ, గంగాదేవి పండుగలలోనూ, గ్రామ దేవతల పండుగ, దేవుని సంబరాలు, శ్రీరాముని కొలువులోనూ ప్రదర్శనలు ఇస్తారు. అప్పుడప్పుడు రాజకీయ నాయకుల ప్రభుత్వ పథకాల ప్రచారాలలోనూ, ఊరేగింపులోనూ పాల్గొంటారు.

జాతరలో తప్పెట గుళ్ళు

ఈ కళాకారులు పాడే పాట–నృత్యము యొక్క అంశాలు:

ఒకే లయలో పాటలు పాడుతూ, రామాయణం, మహాభారతం, భాగవతం, పురాణకథలు గ్రామీణ యాసలో ఆలపిస్తారు. స్థానిక ఇతివృత్తాల ఆధారంగా పాటలు పాడుతారు. చెంచులక్ష్మి, సారంగధర పాట, తూర్పు భాగవతము దరువులు, లక్ష్మణ మూర్చ, తేలు పాట, గాజులోళ్ళ పాట, రెల్లిదాని పాట మొదలగునవి.

పాడే విధానము:

ఒక చరణము పాడి, దానిని అనేక తాళ వరుసలలో పాడి, దరువులు వేసి, నృత్యం చేసి, సుమారు కొన్ని గంటల పాటు రెండు మూడు చరణాలను సాగదీసి పాడతారు. వీరి పాట కంటే తప్పెటగుళ్ళు శబ్దం ఎక్కువగా ఉండటం చేత పాట కొన్నిసార్లు బయటకు వినిపించదు. వారి కాలి గజ్జెల శబ్దానికి చిన్న పిల్లలు భయపడతారు.

నిరక్షరాస్యులు కావడం వలన మాండలికాలు, యాసలు ప్రాధాన్యత వహించడం వలన భాషాపరంగా కొన్ని అపశబ్దాలు ఉంటాయి. మౌఖికంగానే తప్ప లిఖితపూర్వకంగా సాహిత్యం లేకపోవడం వలన ముందు తరాలకు దీనిని పదిల పరచవలసిన అవసరం కళాకారుల పైన మాత్రమే కాదు ప్రభుత్వము పైన కూడా ఉంది. వీరి పాటలో “శివ శివ మూర్తివి గణనాథా! నీవు శివుని కుమారుడవు గణనాథా!” ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్న పాట ప్రార్థన తర్వాత రామాయణ మహాభారతాలలోని ముఖ్య ఘట్టాలు పాడుతారు.

విజయనగరం జిల్లాలోని కళాకారులు:

డెంకాడ మండలం పోతయ్యపాలెం గ్రామానికి చెందిన బొంతపల్లి అప్పలనాయుడు బృందంవారు రవీంద్రభారతి, ట్యాంక్ బండ్, శిల్పారామం, ఢిల్లీ తెలుగు మహాసభలు, హర్యానా, ఆగ్రా, బీహార్, బొంబాయిలలో కూడా ప్రదర్శనలు ఇచ్చారు.

పెద తాడివాడకు చెందిన బంగారమ్మ తప్పెటగుళ్ల నృత్యం చేసిన తొలి మహిళగా పేరుపొందినది. స్త్రీలు సైతం ఈ కళలో రాణించగలరని నిరూపించి చరిత్రకెక్కిన ఈమె బృందం ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్రవేశారు. బంగారమ్మ వచ్చి చిందేస్తే మల్లయుద్ధం చేసినట్లు, తప్పెటలపై దరువేస్తే శత్రువులపై పడి పిడిగుద్దులు గుద్దినట్లు ఉంటుంది. ఆమె నాట్యానికి లయబద్దంగా మ్రోగే మువ్వల మోత పశువులను, శిశువులను సైతం కండ్లు అప్పగించేలా చేసేది. గ్రామంలో ఆట కట్టడానికి వస్తే ఆబాల గోపాలం ఆత్రంగా రావాల్సిందే. అందరూ మైమరచి ఆనందించవలసిందే!

తప్పెటగుళ్లతో ఉత్తరాంధ్ర కళా హృదయాలను పులకింపచేసిన బంగారమ్మ 1999లో విధి వక్రించి, చిన్నవయసులోనే కన్నుమూశారు. తప్పెటగుళ్ళ కళారూపంలో ఈమె చెల్లెలు చిన్నతల్లి ఈ వారసత్వాన్ని కొనసాగిస్తోంది. ఈ బృందంలో సుమారు 20 మంది దాకా ఉంటారు. ఎలమంచిలి బంగారమ్మ ఉన్నప్పుడు అనేక ప్రదర్శనలో పాల్గొంది.

జానపద సాహిత్యం

తప్పెటగుళ్ళు వారు పాడే చారిత్రక కథలు ప్రధానంగా జానపద సాహిత్యం, గ్రామీణయాసలో మౌఖికంగా ప్రచారంలో ఉన్నాయి. తప్పెటగుళ్ళు గురించి ప్రత్యేక పరిశోధనా రచనలు తక్కువగా ఉన్నాయి,

ప్రధాన జానపద గ్రంథాలు– తెలుగువారి జానపద కళారూపాలు:

ప్రముఖ రచయిత బలివాడ నారాయణమూర్తిగారు రచించిన 19వ శతాబ్దపు ‘శ్రీకృష్ణ’ కథాగేయం తప్పెటగుళ్ళు కళాకారులకు మొదటి ముద్రిత రచనగా ప్రసిద్ధి.

డా. బెల్లంకొండ నాగేశ్వరరావుగారు తన రచన ‘తెలుగువారి జానపద కళారూపాలు’లో ‘తప్పెటగుళ్ళు’ గురించి పరిశోధన చేసి వివరణ ఇచ్చారు. శివుడు తప్పెటగుళ్ళు యాదవులకు అనుగ్రహించిన కథ, గంగమ్మ దేవత కథలు వివరించబడ్డాయి.

డా. జి. ఎస్. మోహన్ గారు తాను రచించిన ‘జానపద విజ్ఞాన అధ్యయనము’ లో జానపదుల జట్టు నృత్యాలలో తప్పెటగుళ్ళను గురించి ప్రస్తావించారు. ‘మూసీ’ పత్రికలో వెలువడిన ‘జానపద కళలు’ వ్యాసములో కూడా ఈ కళారూప ప్రస్తావన చేశారు.

గిడుగు రామ్మూర్తి కళాపీఠం వ్యవస్థాపకులు, జానపద కళలకు గురువు, ప్రోత్సాహకులు అయిన డా. బద్రి కూర్మారావుగారు రచించిన ‘ఉత్తరాంధ్ర జానపద కళలు’ గ్రంథములో ఈ తప్పెటగుళ్ళ ప్రస్తావన, ఆడే విధానం ప్రస్తావించారు.

అయితే జానపద కళారూపాల అధ్యయనాల్లో భాగంగా డిజిటల్ గ్రంథాలు మరియు పత్రికల్లో వివరాలు కనిపిస్తాయి. ముద్రిత గ్రంథాల్లో తక్కువగా కనిపిస్తాయి.

కాటమరాజు-సిద్ధిరాజు యుద్ధకథ మరియు పశుపోషణ డాక్యుమెంట్ చేయబడ్డాయి.

ఔచిత్యమ్ పత్రిక: తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed), జానపద కళలపై వ్యాసాలు ప్రచురిస్తుంది. తలతోటి పృథ్వీరాజ్ గారు సమర్పించిన సెమినార్ పేపర్ ‘కళింగాంధ్ర జానపదకళ’లో తప్పెటగుళ్ళపై పరిశోధనాపత్రం వ్రాసారు.

ఔచిత్యమ్ మే 2025 ప్రత్యేక అంకం యాదవుల కళలను ప్రచురించింది.

‘తెలుగు సంస్కృతి- జానపద కళారూపాలు’ అధ్యాయాల్లో చారిత్రక కథలు సేకరించబడ్డాయి. ఈ కథలు ఎక్కువగా మౌఖిక సంప్రదాయంలో యాదవ కులంలో కొనసాగుతున్నాయి.

ఈనాటి మన గురువు నీలబోను సత్యం జీవిత విశేషాలు తెలుసుకుందాం.

తప్పెటగుళ్ళు కళారూపాన్ని నేర్పి శిష్య బృందముతో ప్రదర్శనలు ఇచ్చే గురువు నీలబోను సత్యం 01-01-1971లో నీలబోను అప్పలస్వామి, నీలబోను సూరమ్మ దంపతులకు ఏకైక కుమారునిగా జన్మించారు. వీరి స్వగ్రామం జి.కె.ఆర్.పురంగా పిలువబడే గోపాలకృష్ణ రంగారాయపురం; పినపెంకి పోస్ట్; బాడంగి మండలం; విజయనగరం జిల్లా వీరి ఫోన్ నెంబరు: 9440460957.

వీరి తల్లిదండ్రులు గ్రామీణ ప్రాంతం కనుక వ్యవసాయం చేసుకునే రైతులు వీటితోపాటు తమ యాదవ కులానికి తరతరాలుగా వస్తున్న తప్పెటగుళ్ళు ప్రదర్శన చేసేవారు. సత్యంగారి తాత అప్పయ్య తప్పెటగుళ్ళు కళాకారుడు. అనేక బృందాలకు నేర్పేవారు. ఆటకు వారి ఇంటికే అందరూ వచ్చి ఆడినప్పుడు వారంతా వీరి ఇంట్లోనే భోజనాలు, ఉండడము చేసేవారు. వ్యవసాయదారుల కుటుంబము కనుక లోటు ఉండేది కాదు. వారసత్వముగా అతని దగ్గర సత్యం తండ్రి అప్పలస్వామి నేర్చుకుని తప్పెటగుళ్ళు ప్రదర్శించేవారు. ఆ విధంగా చిన్ననాటి నుండి ప్రదర్శన చూడడం, అందులో పాల్గొనడం చేస్తూ ఉన్నటువంటి నీలబోను సత్యంగారికి తప్పెటగుళ్ళు ఆడే కళలో ప్రథమ గురువులు తాత మరియు తండ్రి అని గర్వంగా చెప్పుకుంటారు.

విద్య: ప్రాథమిక పాఠశాలలో ఏడవ తరగతి వరకు చదివారు.

కుటుంబ పరిస్థితుల వలన చదువు అంతగా సాగలేదు. వారి పెద్ద నాన్నగారు చనిపోవడంతో ఆ కుటుంబానికి ఆసరాగా, వారి వ్యవసాయ పనులు చూస్తూ వారి ఇంట్లోనే ఉండేవారు. వారికి నలుగురు ఆడపిల్లలు. అందువలన ఈ రెండు కుటుంబాలకి ఏకైక మగపిల్లాడుగా అతను వారికి వ్యవసాయంలో సహాయపడుతూ ఉండేవారు. తర్వాత వారి అమ్మాయికి వివాహమైన తర్వాత అల్లుడు ఇల్లరికం వచ్చి, వ్యవసాయం చూసుకుంటూ ఉంటే సత్యంగారు తిరిగి తన తల్లిదండ్రుల దగ్గరకు వచ్చారు ఆ విధంగా అతనికి నాలుగైదు సంవత్సరాల పాటు చదువు దూరం అయింది.

తన తల్లిదండ్రులకు కూడా ఏకైక కుమారుడు కావడంతో వ్యవసాయంతో పాటు 1989 నుండి వారసత్వంగా వచ్చిన తప్పెటగుళ్ళు కళలో ప్రవేశించడం జరిగింది.

నీలబోను సత్యంగారు తండ్రి, తాతల దగ్గర నేర్చుకున్నప్పటికీ గురువులు దేవర రాములు, గుడుపూరు పైడయ్యల దగ్గర రెండు సంవత్సరాల పాటు ఈ కళలోని మెళకువలు తెలుసుకున్నారు. హార్మోనియం వాయించడం కూడా నేర్చుకున్నారు. ఈ కళలో శిష్యులతో పాటు గురువు కూడా ప్రదర్శనలో పాల్గొంటారు.

ఇతను 20 సంవత్సరాల వయసు నుండి అనగా 1991 నుండి తప్పెటగుళ్ళు కళలో పూర్తిస్థాయిలో ప్రవేశించడం జరిగింది.

కుటుంబ సభ్యులు:

సత్యంగారి భార్య తేజమ్మ. ఆమె తల్లిదండ్రులు తాతమ్మ సింహాచలంగారు. వారికి నలుగురు ఆడపిల్లలు. వీరికి అలివేలు అనే కుమార్తె; తిరుపతిరావు పెద్ద కుమారుడు. తరువాత రామలక్ష్మణులనే కవలలు జన్మించారు.

నీలబోను సత్యంగారి కుటుంబము

సత్యం గారికి తన కళ పట్ల ఎంతో గౌరవము అంటే కుమారులు ముగ్గురు కూడా ఈ తప్పెట గుళ్ల ప్రదర్శనలో పాల్గొంటూ ఉంటారు.

సత్యం తన సొంత డబ్బులతో తన తన ఊరి వారికే కాక చుట్టుపక్కల గ్రామాలలో 18 సంవత్సరాల వయసుగల యువకులను చేరదీసి వారికి ఈ తప్పెటగుళ్ళు నేర్పిస్తారు. ఎక్కడైనా గ్రామదేవతల పండుగలో కార్యక్రమాలు చేయాలి అంటే ముందు వీరి ఇంటి దగ్గర రిహార్సులు వేసుకుంటారు. ఆ సమయంలో ఇతని భార్య వారందరికీ వంటలు వండి, భోజనాలు పెట్టి వారికి సదుపాయాలు చేస్తూ ఉంటారు. ఆమె ఈ పనిని ఎంతో సంతోషంగా చేస్తూ ఉంటారు. పెద్ద కుమారుడు తిరుపతిరావు కూడా బాడంగి, మరుపల్లి, కే.కోటపాడు, ఆర్లి మొదలైన ప్రదేశాలకు వెళ్లి అక్కడ పిల్లవాళ్ళకు ఈ తప్పెట గుళ్ళు నేర్పిస్తూ ఉంటారు.

ఎంతో కష్టమైన ఈ కళను తాను చేయడమే కాక తన సొంత పిల్లలను ఇందులో ప్రవేశపెట్టి తనతో పాటు ప్రదర్శనకు తీసుకువెళ్లడం అనేది ఎంతో అంకితభావం ఉంటే తప్ప జరగదు. అంతేకాదు తన తర్వాత ఈ కళ మరుగున పడకూడదు అనే ఉద్దేశంతో అతను మూడు జిల్లాలలో గల 35 గ్రామాల వారికి నేర్పగా అందులో 15 మందిని గురువులుగా తీర్చిదిద్దారు.

ఈ కళకు ఎలాగైనా రాష్ట్రస్థాయిలో, జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకురావాలి అనే తపన అతనికి ఎల్లప్పుడూ ఉండేది.

“రాష్ట్రంలో ఎక్కడ ఎటువంటి జాతరలు, పండుగలు జరిగినా వాటిలో తప్పనిసరిగా తప్పెటగుళ్ళు ప్రదర్శించడానికి టీములను తయారు చేస్తారు. చాలా గ్రామాలలో ఉన్న యాదవకులము వారే ఈ కళ నేర్చుకుందికి ఉత్సాహం చూపిస్తారు. వీరు నేర్పిస్తాము అన్నా వేరే కులంవారు అత్యంత క్లిష్టమైన ఈ విద్యను నేర్చుకుందికి ఇష్టపడరు. ముఖ్యంగా పదవతరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షలు ఆయాక ఖాళీ సమయములో నేర్చుకుంటారు.” అని తెలియజేశారు.

ప్రఖ్యాత శాస్త్రవేత్త మన భారతదేశ మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం గారు ఇలాంటి యువతను దృష్టిలో పెట్టుకునే ఇలా అన్నారు “కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి” అని.

సత్యంలోని తపన, లక్ష్యశుద్ధి అతనిని అంచెలంచెలుగా ముందుకు తీసుకుని వెళ్ళింది.

నీలబోను సత్యం గారు అందుకున్న బిరుదులు– సన్మానాలు:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘శిల్పా’ అవార్డు 2008లో హైదరాబాద్ శిల్పారామంలో ‘నటకిరీటి’ డా.రాజేంద్ర ప్రసాదుగారి చేతుల మీదుగా అందుకున్నారు.

2010 లో నటరాజ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ విశాఖపట్నం వారిచే ‘జానపద శుభాకర’ బిరుదు అందుకున్నారు.

‘కళాప్రపూర్ణ’ డా. ఎస్. మురళీబాబుగారి సారథ్యంలో పిల్లలచే నిర్వహించిన 24 గంటల 48 గంటల నిర్విరామ జానపద కళాప్రదర్శనలో ‘తప్పెటగుళ్ళ’ కళను చిన్నారులకు నేర్పించి, భావితరాలకు ఈ కళను అందించిన ఉన్నతోన్నతులు అని కీర్తించారు.

2011లో ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జానపద కళాకారులు సంఘము, విశాఖ, విజయనగరం జిల్లాలకు చెందిన జానపద కళాకారులు విజయనగరం ఆనందగజపతి కళా క్షేత్రములో సుమారు 2,000 మంది తప్పెటగుళ్ళ కళాకారులతో ప్రదర్శన ఇప్పించిన గురుదేవునిగా నీలబోను సత్యం గారిని కీర్తిస్తూ ‘జానపద కళా ప్రవీణ’ బిరుదు ఇచ్చారు.

2018 లో ‘నృత్య కళా రత్న’ బిరుదు ఇచ్చారు.

2019 లో స్నేహాంజలి ఆర్ట్స్ అసోసియేషన్ ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా విశాఖ పౌర గ్రంథాలయములో సత్కరించుకుంది.

2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సాంస్కృతిక కమీషన్ తెలంగాణా భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో రైటర్స్ అకాడమీ వారి చేతులమీదుగా ‘జానపద సామ్రాట్’ గౌరవ పురస్కారాన్ని అందించారు.

2024 లో శ్రీ దాసరి నారాయణ రావు కల్చరల్ అకాడమీ మరియు విశాఖరత్న కళా పరిషత్ సంయుక్తంగా ఉగాది సందర్భంగా ‘జాతీయ రత్న’ బిరుదుతో సన్మానించుకుంది.

2025 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం- భాషా సాంస్కృతిక శాఖ వారి ఆధ్వర్యంలో ‘గిడుగు రామమూర్తి పంతులుగారి జయంతి సందర్భంగా ‘తెలుగు భాషా పురస్కారం’ ఇచ్చి గౌరవించుకుంది.

ప్రదర్శనలు: నీలబోను సత్యంగారు తన శిష్య బృందంతో అనేక ప్రాంతాలు పర్యటించారు. ప్రదర్శనలు ఇచ్చారు. అందులో ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, గుజరాత్, రాజస్థాన్, నాగాలాండ్, చెన్నై, హైదరాబాద్, కోల్కతా, భువనేశ్వర్, పూరీ మొదలైన ప్రాంతాలలో ఇచ్చారు.

చలనచిత్ర రంగంలో అవకాశాలు:

సత్యంగారు సినిమాలలో కూడా తన ప్రదర్శనలు ఇచ్చారు. కె. రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ చిత్రంలో, అక్కినేని నాగార్జున నటించిన ‘దేవదాసు’ చిత్రంలో, ఆర్ నారాయణమూర్తి గారు నటించిన ‘అన్నదాత సుఖీభవ!’ సినిమాలలో నటించారు. నూతనంగా గోపీచందు సినిమాలో నటించారు.

సినీ ప్రముఖులతో నీలబోను సత్యంగారు

సినిమాలలో మీరు నటించారా?లేక ప్రదర్శన ఇచ్చారా? అని అడిగినప్పుడు “లేదు మా తప్పెటగుళ్ళ ప్రదర్శన మా శిష్యులతో కలిపి చేసాము.” అని చెప్పారు. తనతో పాటు మరొక పది 12 మందికి సినిమాలలో అవకాశాన్ని ఇప్పించిన ఆ గురువుకి ప్రణామములు.

ఇవి మాత్రమే కాకుండా కళాకారుడిగా గర్వించదగిన క్షణాలు అతని జీవితంలో ఎన్నెన్నో.

ఐదు విశ్వవిద్యాలయాల స్థాయిలో పరిశోధనలు:

తాను కలలుగన్న కళారూపం తన కన్నతల్లి ‘తప్పెటగుళ్ళు’ కళారూపాన్ని విశ్వవిద్యాలయ స్థాయిలో నిలపగలిగే అవకాశం వచ్చింది.

సుమారు ఐదుగురు ఈ కళ మీద పరిశోధన చేయడానికి ఇతని దగ్గరకు వచ్చి పరిశోధనాపూర్వకంగా అనేక విషయాలు తెలుసుకొని డాక్టరేట్లు పొందారు. అన్నది అతనికి ఎంతో గర్వకారణంగా అతని మాటల్లోనే అనిపించింది.

విజయనగరానికి చెందిన లక్ష్మీ గారు పరిశోధన చేశారు ప్రస్తుతం ఆమె అండమాన్‌లో ఉంటున్నారు.

విశాఖపట్నం చెందిన చిన్నారావు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో

తెలంగాణలో గిరీశం

కాకతీయ విశ్వవిద్యాలయం లో గణపతి

తన మీద, తన కళారూపం మీద ఐదుగురు పిహెచ్.డి చేశారు అని తెలుసుగాని వివరాలు చెప్పలేకపోయిన ఆ అమాయకత్వానికి నాకు కూడా గర్వంగా అనిపించింది.

ప్రముఖులతో నీలబోను సత్యంగారు

నేను ఫోన్ చేసే సమయానికి “పొలంలో ఉన్నాను. వరి పంట అయిందికదా! ఇప్పుడు జొన్నలు వేస్తున్నాము. నీరు పెట్టడానికి వచ్చాను.” అన్నారు.

ప్రముఖులతో నీలబోను సత్యంగారు

భూమాతని, కళామాతని నమ్ముకుని జీవితం గడుపుతున్న ఆ తరతరాల నీలబోను కుటుంబానికి చెందిన వ్యక్తులందరూ కూడా దేశమాత ముద్దుబిడ్డలుగా భావించాలి ఎటువంటి పురస్కారం ఎంత పెద్ద పురస్కారం మనం ఇచ్చినా కూడా వారి త్యాగాల ముందు తక్కువే అనిపించింది.

ప్రస్తుతము తప్పెట గుళ్ళు పరిస్థితి:

జాతీయ అంతర్జాతీయ స్థాయిలకు ఎదిగిన కళ ఇది. ఇది రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా, ఢిల్లీ గణతంత్ర దినోత్సవ సంబరాలలో, బొంబాయి, పాట్నా వంటి ప్రదేశాలలోనే కాకుండా శ్రీలంక మొదలగు దేశాలలోనూ T.A.N.A.సభలలోను ప్రదర్శింపబడ్డాయి.

వర్తమానంలో ఈ కళారూపం అంతరించిపోయే ప్రమాదంలో ఉంది, కళాకారులు ప్రభుత్వం నుండి సహాయం కోరుతున్నారు. యాదవుల సాంస్కృతిక జీవనంలో ముఖ్యమైనదిగా ఉన్నప్పటికీ, ఆధునికతతో దూరమవుతోంది.

విశాఖపట్నం సమీపంలో బృంద నాయకుడు పెద్దపోతురాజు కళను రక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇతర బృందాలలోని కళాకారులు గ్రామాల్లోని యాదవ బృందాలకు చెందినవారు, గంగాదేవి, గంగమ్మ జాతరల్లో తప్పకుండా ప్రదర్శిస్తారు. కళారక్షణ కోసం కళాకారులు సమావేశాలు నిర్వహిస్తూ, ప్రభుత్వ సహాయం కోరుతున్నారు.

విజయనగరం జిల్లాలో ఇతర తప్పెట గుళ్ళు బృందం సమాచారం:

ప్రసిద్ధ కళాకారులు నీలబోను సత్యం: శ్రీకాకుళం జిల్లా నుండి, గంగమ్మ జాతరల్లో, గ్రామదేవత జాతరల్లో తప్పెటగుళ్ళు బృందాన్ని నడిపించి ఈ కళను ప్రదర్శించి పేరు తెచ్చుకున్నారు. BBC కథనాల్లో ప్రస్తావించబడ్డారు. కొంటి రామయ్య: విజయనగరం ప్రాంతంలోని గ్రామాల నుండి, పండుగల్లో రామాయణ కథలతో ప్రదర్శనలు చేస్తారు. వీర సాగరములో పిల్లల సూరప్పడు బృందం గొలగాని వెంకట్రావు బృందం కిత్తన్నపాలెం ఎస్.కోట మండలంలో కటారి ఈశ్వరరావు బృందం వాండ్రంగీ ఇసరపు గంగమ్మ బృందం బియ్యాలపేటలో ముద్దాడ అచ్చన్న సూరప్పడు బృందం ముద్దాళ్ళ ముద్దాడ అప్పలస్వామి గురువులు పల్ల కూర్మయ్య ముద్దాడ పేట గొల్ల మండలాలలో తప్పెటగుళ్ల బృందాలు ఉన్నాయి. ఇవి కాక గరికపేట, గజపతినగరం పరిసరాలలో సుమారు 40 బృందాలు ఉన్నాయి.

వీరందరినీ ప్రభుత్వం దత్తత తీసుకొని వారికి సరి అయిన అవకాశాలు కల్పించి ఈ కళను మరింత అభివృద్ధి చెందే దిశగా, ఎంతో మంది నేర్చుకునేందుకు గురువులు ఉండగానే అవకాశాలు కల్పించినట్లయితే ఈ తప్పెటగుళ్ళ కళాకారులు జాతీయస్థాయిలో ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందగలరు అనడంలో సందేహం లేదు.

ఎందుకంటే ప్రతి సంవత్సరము విజయనగరం పైడితల్లమ్మ వారి పండుగ సందర్భంగా విజయనగర ఉత్సవాలు జరిపినప్పుడు అయోధ్య మైదానంలో ఈ కళను ప్రోత్సహిస్తూ కళాకారులందరికీ ప్రదర్శనకు ప్రత్యేకమైనటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది విజయనగరం ప్రభుత్వ యంత్రాంగం.

వీరిలో ఎక్కువమంది నిరక్షరాస్యులు, నిరుపేదలు. కనుక వీరికి సరైనటువంటి వయోజన విద్యాపథకం ద్వారా కనీసమైన విద్యను అందించడం మరియు ప్రాచీనమైన ఈ కళను బ్రతికించే కళాకారులకు జీవనోపాధిని కల్పించవలసిన ఆవశ్యకత ఉంది.

ప్రధాన వార్తా కథనాలు

తప్పెటగుళ్ళు గ్రామదేవతల జాతరలు, పండుగల్లో ప్రదర్శించబడుతూ ప్రముఖ వార్తాపత్రికల్లో వీరిని గూర్చి అనేక కథనాలు వచ్చాయి, ముఖ్యంగా గంగమ్మ బోనాలు, గ్రామదేవత సంబరాల సందర్భంగా. ఈ కథనాలు కళారూపం ఉనికి, కథలు, ప్రదర్శనలను వివరిస్తాయి.

BBC Telugu (2021): ‘ఉత్తరాంధ్ర తప్పెటగుళ్లు’ – రామాయణ కథలతో గ్రామదేవత జాతరల్లో ఆట పాటలు, గంగాదేవి పండుగలు పేర్కొన్నారు.

ABP Live Telugu (2022): ‘కష్టాల బాటలో తప్పెటగుళ్ళు’ – శ్రీకాకుళం పండుగలు, గంగమ్మ కథ, యాదవుల ఆరాధనలో తప్పెటగుళ్ళు ప్రదర్శనలు వివరించారు.

Teluguism Traditions (2022):

గ్రామదేవతల సంబరాలు, జాతరల్లో తప్పెటగుళ్ళు తప్పనిసరి ప్రదర్శన అని తెలిపారు.

జాతర సందర్భాలు గంగాదేవి పండుగలు, గ్రామదేవత పండుగలు, శ్రీరామకొలువుల్లో ప్రదర్శనలు జరుగుతాయని, గంగమ్మ కథతో ముడిపడి ఉందని వివరించారు.

తెలంగాణ బోనాలు కథనాల్లో గ్రామదేవతల జాతరల్లో జానపద నృత్యాలు (తప్పెటగుళ్ళు వంటివి) ప్రస్తావించబడ్డాయి.

కొసమెరుపు:

మారుమూల ‘కు’గ్రామములో ఉన్న ఒక వ్యక్తి గ్రామస్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయి దాటుకొని జాతీయస్థాయిలో ఎదుగుతున్న తన కళకు ఊపిరి పోస్తున్న నీలబోను సత్యం యొక్క తపనను గ్రహించి ఒక మంచి అవకాశము వెతుక్కుంటూ వచ్చింది.

కేంద్ర ప్రభుత్వము జపాన్ దేశంలో జానపద కళల కోసం ఏర్పాటు చేసిన ప్రదర్శనకు వీరి బృందాన్ని పంపించడానికి ఎంపిక చేసింది. తనతో పాటు మరొక ఐదుగురిని తీసుకుని వెళ్లే అవకాశం దక్కింది. కల్చరల్ డిపార్ట్మెంట్ నుండి శ్రీనివాసరావుగారు, ఇకో బోర్డు డెవలప్మెంట్ ఆఫీసర్లు, మంగళగిరి నుండి అధికారులు, విమానం ఎక్కి జపాన్ దేశం చేరారు.

అక్కడ 100 ఎకరాల జాగాలో, వంద దేశాల ప్రతినిధులు టెంట్లు వేసుకుని ప్రదర్శనలు ఇస్తూ ఉంటే ప్రతి ఒక్కరూ అత్యంత ఆసక్తిని కలిగించే తప్పెటగుళ్ళు ప్రదర్శనను వీక్షించారు. భాష విషయంలో భోజనాల విషయంలో ప్రభుత్వం వారు చక్కగా వసతులు కల్పించారని ఎటువంటి ఇబ్బంది కలగలేదని ఎంతో ఉన్నతమైనటువంటి మనసుతో అందరినీ ప్రశంసించిన అతనిలోని గొప్పగుణాన్ని మనం అలవరచుకుంటే చాలా బాగుంటుంది కదా! అతని నుండి మనం నేర్చుకోవలసినది ఎంతో ఉంది.

జపాన్‌లో ప్రదర్శన సందర్భంగా

28-12-2025 సాయంత్రము బొబ్బిలి కోటలో ‘బొబ్బిలి కళోత్సవ్’ పేరిట జానపద కళా ప్రదర్శన ఏర్పాటు చేశారు. బొబ్బిలి వీరత్వం గురించి, బొబ్బిలి చరిత్ర గురించి ప్రముఖులు ప్రసంగించగా “రంగస్థలం ఫేమ్ తప్పెటగుళ్ళు కళాకారుడు నీలబోను సత్యం తన శిష్య బృందముతో ఇచ్చిన ప్రదర్శన ఆహూతులను ఆకట్టుకుంది.” అని ప్రముఖ పత్రికలు ప్రశంసించాయి. స్థానిక ఎం.ఎల్.ఎ. బేబీనాయనగారు కళాకారులను సత్కరించారు. పట్టణంలోని ప్రముఖులు హాజరయ్యారు.

ఎం.ఎల్.ఎ. బేబీనాయనగారు నీలబోను సత్యంగారి సన్మానిస్తున్న ఫోటో

ఈ తప్పెటగుళ్ల గురువు గురించి మనం చదువుతూ ఉంటే మనకు అనిపిస్తుంది నిజం ఇలాంటి గురువులు ఉంటే ఏ కళ అయినా అమృత కళే! ఏ భాష అయినా అమృత భాషే!

Exit mobile version