Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వందే గురు పరంపరామ్-16

[శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు నిర్వహిస్తున్న ‘వందే గురు పరంపరామ్’ అన్న శీర్షికని ధారావాహికగా అందిస్తున్నాము. ఈ నెల ‘స్కిల్ మేడమ్’ గా పేరుపొందిన స్ఫూర్తిదాయక గురువు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మగారిని పరిచయం చేస్తున్నారు రచయిత్రి.]

కష్టమే ఎరగనీ జీవితం ఎపుడైనా
కొత్తగా చరితలో పుటలనే చేర్చేనా?
ఉలితో మలచనిదే శిల్పం మొలిచేనా ?
ఊహల మొలవనిదే నిజమై నిలిచేనా?
సాహసమే ఎపుడూ శక్తిగ నింపుకొని..
ఆటూ పోటులలో ముందుకు కదిలేయ్ రా..
హర్డిల్స్ అన్ని దాటేసేయ్..
నీ సత్తా ఏంటో చూపించేసెయ్..
శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ

~

‘అధిగమిస్తే ప్రతి ఓటమి గెలుపుకి తొలి మెట్టు’

ఈ భూమిపై ప్రతివారిని భగవంతుడు ఒక నిర్దేశించిన లక్ష్యం కొరకే ఊపిరి పోస్తాడు. వాళ్ళ లక్ష్యాలను వాళ్ళు గుర్తించేలాగా వారి జీవితాల్లో సంఘటనలను సృష్టిస్తాడు. భగవంతుని మార్గాలు మానవులకు అంతు పట్టవు. కొంతమందిని భగవంతుడు ఎటువంటి అడ్డంకులు లేకుండా తాను నిర్దేశించిన లక్ష్యం వైపు నడిపిస్తే, మరికొందరిని రకరకాల దారుల్లో మళ్ళించి, తమ తమ గమ్యాలను ఎంచుకునేలాగా చేస్తాడు. అదే కోవలో తాను పొందిన అనేక వైఫల్యాల నుండి, దానివల్ల వచ్చిన నిరాశ నుండి, తన్ను తాను మలుచుకొని, తన చుట్టూ ఉన్నవారికి ప్రేరణగా నిలిచిన ఒక విజేత విజయగాథకు ప్రతి రూపమే – శ్రీవాణీశర్మ. తాను ఎదుర్కొని బయటపడ్డ క్యాన్సర్ తనను ఆరోగ్యవంతురాలిగా నిలపడమేకాక, ఎదుటివారి బాధను తుడిచేలాగా, ఎంతో మంది క్యాన్సర్ బాధితులకు కౌన్సిలింగ్ చేస్తూ, మనోధైర్యాన్నిస్తూ, తన వంతు సేవలను నిరంతరంగా అందిస్తూ ‘స్కిల్ మేడమ్’గా ప్రతిఒక్కరూ ఆప్యాయంగా పిలుచుకునే స్ఫూర్తిదాయక శ్రీవాణీ జీవనయానమే ఈనాటి మన ‘వందే గురు పరంపరామ్’.. గురువు.

ఆర్. శ్రీవాణి శర్మ

కుటుంబ నేపథ్యం:

ఈమె తాతగారు కీ॥శే॥ కల్లుట్ల రామకృష్ణశాస్త్రి, స్వాతంత్ర్యసమరయోధుడు. ఆంధ్ర మద్రాస్ సంయుక్తరాష్ట్రంగా ఉన్నప్పుడు స్వయంగా ‘భారత జ్యోతి’ అనే పత్రిక సంపాదకులుగా, తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో నిర్వహించడమే కాక, ‘కృష్ణా’ పత్రికకు రిపోర్టర్‌గా పని చేసేవారు. ఈయనకు రాజాజీ గారితో సత్సంబంధాలు ఉండేవి. కడప మీదుగా మద్రాస్‌కు వెళ్తున్నప్పుడు, శాస్త్రిగారు ఆయనకు కడప స్టేషన్‌లో కాఫీ, ఇడ్లీ సాంబార్ అందించి రాజకీయాలు చర్చించేవారట! గాంధీ గారు కడపకు వచ్చినప్పుడు, మొదటగా ఖద్దరు కట్టిన వారు ఈయనే. బనారస్ హిందూ యూనివర్సిటీ నుండి బి.ఏ. చేసిన తొలి కడప వాసి కూడా ఈయనే అని చెప్తారు. నాయనమ్మ కీ॥శే॥ శ్రీమతి వెంకటసుబ్బమ్మ.. చేతికి ఎముక లేకుండా దానం చేసిన ఇల్లాలు.

కల్లుట్ల రామకృష్ణశాస్త్రి – వెంకట సుబ్బమ్మ దంపతులు

మాతామహులు కీ॥శే॥ కుందవరం వెంకటసుబ్బయ్య, శ్రీమతి రాధమ్మగార్లు. కవి చౌడప్పకు సంబంధించిన 1600 ఎకరాల సుక్షేత్రభూములు. రాజంపేటలోని మన్నూరు అటవీ ప్రాంతంలో వీరికి వంశపారంపర్యంగా సంక్రమించాయి. అటు తర్వాత ప్రభుత్వ జాతీయీకరణలో భాగంగా వారు వాటిని కోల్పోయి, చాలా కొద్ది కాంపెన్సేషన్‌తో సర్దుకోవాల్సి వచ్చింది.

కీ.శే. కుందవరం వెంకటసుబ్బయ్య, శ్రీమతి రాధమ్మ గార్లు

జననం; బాల్యం:

శ్రీవాణీశర్మ కడప జిల్లా కేంద్రంలోనే పుట్టి పెరిగింది. ముగ్గురు తమ్ముళ్లు, పక్క వాటాలోనే పెదనాన్న కొడుకు అందరితో కలిసి సంతోషంగా పెరిగింది. పెదనాన్నల సంతానం, మేనమామల పిల్లలు అందరూ వీలున్నంత ఎక్కువగా కలుసుకునేవారు. తల్లికి గల భక్తి; తండ్రి తాత్వికత, మానవత్వం, దయ చిన్నప్పటినుండి పిల్లలందరికీ అలవడ్డాయి. తాతగారికి దాదాపు 300 ఎకరాలు పంట భూములు ఉండి, ఆయన అకస్మాత్తుగా 53 ఏళ్లకే చనిపోవడంతో, నోటి మాటతోనే కౌలు చేసుకుంటున్న చాలామంది రైతులు భూములు స్వంతం చేసుకున్నారు. చార్జి తీసుకునేందుకు, ట్రాన్స్‌ఫర్‌పై వచ్చిన కలెక్టర్లకు ఆతిథ్యం ఇస్తూ, ఎనిమిది మంది పనివాళ్ళతో, రాజసంగా నడిచిన ఐదుగురు కొడుకులు, ఐదుగురు కూతుళ్లు ఉన్న ఆ ఉమ్మడి కుటుంబం ఆయన మరణంతో చెల్లాచెదురైంది.

తాతగారి కాలంలో ప్రతి సంవత్సరం కడప ఆర్ట్స్ కాలేజీలో 30 మంది విద్యార్థులకు, బట్టలు, పుస్తకాలు కొనిచ్చి, ఫీజులు కట్టేవారట! వీరి నాన్నగారు స్నేహితులను చూసి ‘అయ్యో! వాళ్ళు పాపం నూనెతో పిండి వంటలు చేసుకుంటారట’, అని బాధపడేవారట. కానీ, వీళ్ళ దాకా వచ్చేసరికి ఆర్థికంగా చితికిపోయి, మధ్యతరగతి సంసారాన్ని చూశారు. అయినా, అందరితో కలసి మెలిసి ఆత్మీయంగా ఉండేవారు. డబ్బు ఒక లేమిగా వాళ్ళకి ఎప్పుడూ అనిపించలేదు. సంతోషకరమైన వాతావరణంలో, సరదాగా కబుర్లు చెప్పుకుంటూ, ఈ వీధి నుండి ఆ వీధి వరకు ఉండే ఒక పెద్ద ఇంటిలో (తాతగారు ఉన్న ఇల్లు అదే) కూరగాయలు మొక్కలు పెంచుకుంటూ.. ఆనందంగా గడిపేవారు.

తల్లిదండ్రులు:

తండ్రి: కీ॥శే॥ ద్వారకానాథ్ – సీనియర్ జర్నలిస్ట్, కడప
తల్లి: కీ॥శే॥ శ్రీమతి. విజయభారతి, గేయ రచయిత్రి, గాయకురాలు

తల్లిదండ్రులు

ఒక మంచి సాహితీవేత్తగా రూపుదిద్దుకున్న వైనం:

సాహితీ పరిమళాలు గుబాళించే కుటుంబంలో జన్మించిన శ్రీవాణికి చిన్ననాడే సాహితీప్రియత్వం అలవడింది. తండ్రి వి.ఆర్.ద్వారకానాథ్, ‘భారత జ్యోతి’ అనే స్వంత పత్రికకు సంపాదకత్వం వహించడమే కాక, ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి, డెక్కన్ క్రానికల్ పత్రికలకు పాత్రికేయులుగా దీర్ఘకాలం పాటు పనిచేశారు. తల్లి శ్రీమతి విజయభారతి కుందవరం చౌడప్ప వంశస్థురాలు. ఆమె పెద్దగా చదువుకోకపోయినా చిన్నతనం నుండి భగవత్ ప్రసాదంగా సాహిత్యం అలవడింది. ఆమె పద్యాలు, పాటలు వ్రాస్తూ, స్వయంగా బాణీ కట్టి పాడుతూ ఉండేవారు. ఇటు తల్లి పాటలను, ఫెయిర్ చేసి వ్రాయడం, తండ్రి డిక్టేట్ చేస్తూ ఉంటే పత్రికా వార్తలు కానీ, సంపాదకీయాలు కానీ, తెలుగు, ఇంగ్లీషు భాషల్లో వ్రాయడం ఆమెలోని భాషా నైపుణ్యాలకు మెరుగుపెట్టాయి.

శ్రీవాణి L.K.G.నుండే స్కూల్లో వివిధ సందర్భాల్లో ప్రసంగాలు ఇవ్వడం, వక్తృత్వపోటీలలో పాల్గొంటూ, జిల్లా, రాష్ట్రస్థాయిలలో బహుమతులు గెల్చుకోవడం జరిగింది. వీటన్నిటి వెనుక తన బాబాయి కీ॥శే॥ కృష్ణ భగవాన్ గారి ప్రోత్సాహం, తర్ఫీదు ఉన్నాయని శ్రీవాణి చెప్పారు.

శ్రీవాణి బాల్యం విద్యాభ్యాసమంతా కడపలోనే జరిగింది. చిన్నప్పటినుండి ఐదవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో చదువుకున్నారు. అటు తర్వాత, ఇంగ్లీష్ మీడియం దగ్గరలో లేకపోవడంతో, కడపలోని సి.ఎస్.ఐ. ప్రభుత్వపాఠశాలలో చేరారు.

శ్రీవాణి ఎనిమిదవ తరగతి చదువుతున్న రోజుల్లోనే ఆంగ్లంలో ‘మై టీచర్’, ‘ద రిపబ్లిక్ డే’ అనే కవితలు రచించారు. తర్వాత బాలికల జూనియర్ కళాశాలలో, S.K.R. & S.K.R. మహిళా కళాశాలలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. డిగ్రీ చదువుతున్న సమయంలో తెలుగులో కూడా రచనలు ప్రారంభించారు. తెలుగులో ఆమె వ్రాసిన తొలి పాట ‘తిరుమల రాయని గడప-దేవుని గడప’ అనే భక్తిగీతం.

శ్రీవాణి విద్యార్హతలు:

డిగ్రీ తర్వాత, ప్రభుత్వపాలన శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి గోల్డ్ మెడల్ సాధించారు.

గురువుల గురించి అడగగా ఇలా అన్నారు.

‘నా గురువులందరూ కూడా నాపై ప్రభావం చూపిన వారే. స్వామి వివేకానంద వారి బోధనలు స్కూలు వయసు నుండి కూడా నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి. ఆ కొటేషన్లను మననం చేస్తూ, నన్ను నేను ప్రోత్సహించుకుంటూ, వాటిని అమలు చేయడానికి ప్రయత్నించేదాన్ని’

స్నేహితులు:

తనకు బాగా సన్నిహితులైన ఇద్దరు స్నేహితులు దురదృష్టవశాత్తు, అకాల మరణం పొందారు. ఇప్పుడు తనకున్న ప్రాణస్నేహితులు శ్రీవాణీ అర్జున్, జ్వాలా అనురాధ. తన సాహితీప్రయాణంలో తల్లిదండ్రులు, ముగ్గురు తమ్ముళ్ళు, అక్కయ్యలు, అన్నలు,స్నేహితులు..అందరూ ప్రోత్సాహం ఇచ్చినవాళ్లే, ఆస్వాదించినవాళ్లే.

ఆమె ముగ్గురు సోదరులలో చిన్నవాడైన సాయి శ్రీకాంత్ నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడే కాక, పాటల రచయిత.

సోదరులు శ్రీకాంత్, శ్రీకర్, శ్రీరాం.. (కుడి నుండి ఎడమకు)
వారి సతీమణులు అనురాధ, ఉషా కుమారి, స్వప్న(ఎడమ నుండి కుడికి)

అత్త మామలు:

అత్త మామలు కీ.శే. ఆర్. సి. సుబ్బారాయుడు గారు, శ్రీమతి హైమవతమ్మ

భర్త:

డాక్టర్ ఆర్.ఎన్. శర్మ – MA History, M, Phil., Ph.D.; M.A., Telugu, అధ్యాపకులు, రచయిత, చరిత్రకారుడు.

డాక్టర్. ఆర్.ఎన్.శర్మగారితో ఈమె వివాహం ప్రొద్దుటూరులోని జరిగింది. ఆయన చరిత్రలో ఎం.ఏ; ఎం.ఫిల్; పి.హెచ్.డి.చేసి, తెలుగులో కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ‘థామస్ మన్రో’ పై ఈయన వ్రాసిన పరిశోధనాగ్రంథాన్ని, అదే విశ్వవిద్యాలయం వారు ప్రచురించారు. చరిత్ర మీద ఎంతో మక్కువతో శర్మగారు 50 కి పైగా పరిశోధన పత్రాలు సమర్పించారు. తెలుగుభాష చరిత్రపై, ఈశ్వరునిపై, ఇతర సామాజిక అంశాలపై ఈయన ఇప్పటికి ఐదు పుస్తకాలు వ్రాశారు.

వీరి ఏకైక కుమారుడు ఆర్.సి.ఎస్.సిద్ధార్థ్, ఎం.ఎస్., సైంటిస్ట్ NREL, USA. పెట్రోలియం ఇంజనీరింగ్‌లో గోల్డ్ మెడల్ సాధించి, విజ్ఞాన్ యూనివర్సిటీ నుండి బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్‌గా మరొక గోల్డ్ మెడల్ సాధించాడు. అమెరికాలో జియో ఇన్ఫర్మేటిక్ సిస్టమ్స్ అండ్ కార్టోగ్రఫీలో మాస్టర్స్ డిగ్రీ చేసి, యు.ఎస్. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ ఒక విభాగమైన NREL లో సైంటిస్ట్ గా ఉద్యోగం సాధించాడు.

అమెరికాలో కూడా మన జాతీయస్థాయి పోటీలలో పాల్గొని ఎన్నో అవార్డులు సాధించాడు. శ్రీవాణి శిక్షణలో మెరుగుదిద్దుకున్న ఉత్తమ విద్యార్థులలో సిద్ధార్థ కూడా ఒకడు. ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీతో నిండి, తన చుట్టూ ఉన్నవారికి వీలైనంత సహాయ సహకారాలు అందిస్తూ, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న మిత్రులకు, జూనియర్లకు తగిన కౌన్సిలింగ్ చేస్తూ, వారు ఉన్నత శిఖరాలు అందుకోవడానికి నిరంతరం కృషి చేస్తూ ఉంటాడు. కుటుంబమంతా కూడా సామాజిక కార్యకలాపాల్లో మనస్ఫూర్తిగా పాల్గొంటారు.

శ్రీవాణి, డా. శర్మ, సైంటిస్ట్ సిద్ధార్ధ్

2026 డిశంబరు – జనవరిలో అమెరికా తమ కుమారుని దగ్గరకు వెళ్ళి వచ్చిన ఆనందాన్ని పంచుకుంటూ.. “అక్కడ అందమైన ప్రకృతి దృశ్యాలకు, ప్రశాంతతకు ఆలవాలమైన, అద్భుతమైన నేషనల్ పార్కులు, బీచ్ లూ, చూడడమే కాక, వారి సంస్కృతి పట్ల కూడా మంచి అవగాహన కలిగింది. విదేశీ విమాన ప్రయాణంతో పాటు, పసిఫిక్ మహాసముద్రం పై ఓడలో ప్రయాణించి ఆల్కట్రాస్ అనే ఒక దీవిని కూడా చూశారు. ఇటు గగనయానం, సముద్రయానం, రెండూ- జీవితంలో మర్చిపోలేని అనుభూతులను మిగిల్చాయి.” అంటారామె.

జనవరి 2026 అమెరికాలో

పడిలేచిన కెరటం:

శ్రీవాణి సివిల్ సర్వీసెస్ లక్ష్యంగా రెండేళ్లపాటు తీవ్రమైన పట్టుదలతో కృషి చేశారు. మొదటి ప్రయత్నంలోనే ప్రిలిమినరీ క్లియర్ చేయగలనని ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. కానీ, ఫలితాలు వచ్చాక, జనరల్ స్టడీస్ లో క్వాలిఫై అయ్యి, తను ఎంచుకున్న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో కటింగ్ మార్కుల కన్నా రెండు మార్కులు (మరొక్క బిట్ కరెక్ట్ అయ్యుంటే వచ్చి ఉండేవి) రావడంతో, అతి కొద్దిలో మెయిన్స్ రాసే అవకాశాన్ని కోల్పోయారు.

మొదటిసారి సాధించలేకపోతే ఇంక ఎప్పటికీ ప్రయత్నమే చేయననే మొండి పట్టుదల వల్ల, ఎక్కడా వైఫల్యం ఎదురుచూడని మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల ప్రయత్నాలను అపేశారు. తరువాత గ్రూప్ వన్-ఎ, గ్రూప్ టు-బి కలిపి పెట్టిన ఏ.పి.పి.ఎస్సి. పరీక్షలో ప్రిలిమినరీ క్లియర్ చేసి, మెయిన్స్ కు అర్హత సాధించారు. మెయిన్స్ కోసం ఆమె ఎంచుకున్న సబ్జెక్టులు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మరియు సోషియాలజీ. అయితే, ఆ హాల్ టికెట్ పొలిటికల్ సైన్స్ అండ్ సైకాలజీ ఆప్షన్స్ గా రావడంతో అక్కడ కూడా నిరాశ ఎదురయింది.

తర్వాత, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ లో అసిస్టెంట్ ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగం కోసం ఒక వ్యాసాన్ని వ్రాసి దరఖాస్తు చేయగా, సౌత్ ఇండియా మొత్తానికి శ్రీవాణి గారి ఒకే ఒక్క అప్లికేషనే ఇంటర్వ్యూకు అర్హత సాధించింది.

అయితే, దురదృష్టవశాత్తు, ఇంటర్వ్యూ తేదీ కన్నా ఒక్కరోజు ముందే టెలిగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ రావడంతో, ముంబైకి విమానయానం చేసే ఆర్థికస్థాయి కానీ, అవకాశం కానీ లేకపోవడంతో, అది కూడా విఫలమైంది. కడప ఆల్ ఇండియా రేడియో స్టేషన్లో నాలుగేళ్ల పాటు క్యాజువల్ అనౌన్సర్‌గా పనిచేస్తూ, అక్కడే అనౌన్సర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయగా.. ఇంటర్వ్యూలో ఎంపికైనప్పటికీ, కొన్ని రాజకీయ కారణాల వల్ల ఫైనల్ సెలక్షన్ లిస్ట్ తారుమారైంది.. 21 సంవత్సరాల వయసులో. ఉన్నతమైన ఆశయాలు ఉండి కూడా.. ఇన్ని వరస వైఫల్యాలతో నిరాశ చెంది.. ఒకలాంటి డిప్రెషన్ కు గురయ్యారు.. తీవ్రమైన మనోవేదన చెందారు. మళ్లీ ప్రయత్నం చేయమన్న ఎవరి సలహాలు కూడా తీసుకోలేని విధంగా మనసు ‘న’కారాత్మకంగా మారిపోయింది. అందులో నుండి బయటపడడానికి, విధి తనపై విసిరే ప్రతి రాయినీ ఒడుపుగా అందుకుంటూ తన జీవిత సౌధానికి పునాది రాళ్ళుగా పేర్చుకుంటున్న శ్రీవాణి తనను తాను మోటివేట్ చేసుకోవడానికి, స్ఫూర్తినిచ్చే ఎన్నో ప్రపంచ స్థాయి ఉత్తమ వ్యక్తిత్వ వికాస గ్రంథాలను చదివారు. హెలెన్ కెల్లర్, స్టీవెన్ హాకిన్స్, నిక్.. వంటి స్ఫూర్తిదాతల బయోగ్రఫీలు చదివారు. మైండ్ పవర్, పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ వంటి వాటిపై మంచి అవగాహన పెంచుకున్నారు.

గేయం:
ఆడిన ఆటే ఆడాలి – ఓడిన చోటే గెలవాలి
ఓడిన చోటే గెలవాలి – ఓటమినే ఓడించాలి..
పరుగు పందాన తడబడిపోతే, అడుగులు మళ్లీ చక్కబెట్టుకుని..
గెలుపను గమ్యం చేరాలంతే ఏక దీక్షగా ముందుకు సాగి //ఆడిన //
శిఖరం నుండి జారుతు ఉంటే, ఒక్కో రాయిని ఊత పట్టుకొని..
శిఖరాగ్రాన్ని చేరాలంతే, ఏక దీక్షగా ముందుకు సాగి //ఆడిన //
చీకటి రక్కసి మింగేస్తుంటే, మిణుగురు పురుగుల జాడ పట్టుకొని..
వెలుగు బాటను చేరాలంతే ఏక దీక్షగా ముందుకు సాగి //ఆడిన //
మహారణ్యమే మాయమ్మయినా కొత్త విత్తులను చేత పట్టుకొని..
కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ ఏక దీక్షగా ముందుకు సాగి //ఆడిన //
అలవై గగనం చేరకపోతే , ఆవిరి మేఘపు జాడ పట్టుకొని..
గగనపు అంచులు తాకాలంతే ఏక దీక్షగా ముందుకు సాగి //ఆడిన //
విశ్వపు అంచులు చేరాలంటే, విరిగిన రెక్కలు కూడ గట్టుకొని..
ఊపిరి శక్తిగ ఆశ నింపుకుని ఏక దీక్షగా ముందుకు సాగి //ఆడిన //
శోక సంద్రమే నిను ముంచేస్తే, చిన్న తెప్పలా ఆశ హత్తుకొని..
ఆనందపు తీరం చేరాలంతే ఏక దీక్షగా ముందుకు సాగి //ఆడిన //
మృత్యువు రమ్మని పిలుస్తు ఉంటే, కొత్త రూపున మళ్ళీ పుడుతూ..
చావు పైన నువు గెలవాలంతే ఏక దీక్షగా ముందుకు సాగి //ఆడిన //

మేలి మలుపుతిప్పిన వీడియో:

ఎన్నో మోటివేషనల్ వీడియోస్ చూశారు. వాటన్నింటిలోనూ అత్యంత ప్రాణప్రదమైనది, తన ద్వారా వేల మందికి స్ఫూర్తి నింపింది.. ‘ద స్టోరీ ఆఫ్ యాన్ ఈగల్’ అనే మోటివేషనల్ వీడియో.

గురువు నారాయణరావు గారు కూడా ఆమెలో సానుకూల ధోరణిని నింపడంలో ఎంతో ప్రేరణనిచ్చారు. వీటన్నిటి వల్ల పూర్తిగా తనను తాను పాజిటివ్ శక్తితో నింపుకున్నారు.. అప్పటినుండి, తన జీవితగమ్యాన్ని నిర్దేశించుకున్నారు. తన పొరపాటు వల్ల, ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల, పొందిన వైఫల్యాలు ఇతరులు పొందకుండా విద్యార్థులకు ప్రేరణగా నిలవాలని నిశ్చయించుకొని, అధ్యాపక వృత్తిని చేపట్టారు.. శ్రీవాణి తను మోటివేషనల్ స్పీకర్ అవ్వడం వెనుక ఉన్న గతాన్ని గుర్తు చేసుకుంటూ ఆ వివరాలన్నీ తెలియజేశారు.

శ్రీవాణి ఉద్యోగ జీవితం- సాధించిన విజయాలు – ఆమె మాటల్లోనే

ప్రస్తుత హోదా:

డైరెక్టర్ & శిక్షకురాలు: ట్రెండ్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్ & సాఫ్ట్ స్కిల్స్

ప్రారంభంలో

“ఈ వృత్తిలో నాకు ఎంతో ఆనందం ఉంది. నా జన్మ సార్థకమైందని అనిపిస్తుంది”.. ఎంతో ఆర్ద్రతతో, ఆనందంతో శ్రీవాణి చెప్పిన మాటలివి.

తన పిల్లలలాగా విద్యార్ధులకు చేయూతను అందించిన వారిలో కొన్ని ఆణిముత్యాలు

కేరళ వరద బాధితుల సహాయం కోసం నేను సైతం అంటూ..

విద్యారంగంలో 30 సంవత్సరాలకు పైగా అధ్యాపక వృత్తిలో రాణించడమే కాక, మోటివేషనల్ స్పీకర్ గానూ, సాహితీ పరంగానూ, సామాజిక సేవా పరంగానూ, పాటల రచయిత్రిగానూ, ఆధ్యాత్మికకోణంలోనూ సేవలందిస్తున్న శ్రీవాణీశర్మలాంటివాళ్లు, సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా కనపడకుండా తెర మరుగున ఉన్నా, వారి సేవలు అందవలసిన వారికి అందుతూనే ఉన్నాయి. ఈమె మోటివేషనల్ స్పీకర్ గా కడప, కర్నూల్, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బద్వేల్, హైదరాబాదులలోని కళాశాలలో తన ప్రసంగాలు ఇచ్చారు. టీచర్ ట్రైనింగ్ సెషన్లలో భాగం పంచుకున్నారు. పేరెంట్ క్లబ్బులలో సభ్యులుగా ఉంటూ. ఎన్నో సెషన్స్ తీసుకుంటూ అందరికీ ప్రేరణ నిస్తున్నారు.

శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఎం.ఏ గోల్డెమెడల్ సాధించారు. డా॥ ఆర్.ఎన్.శర్మతో వివాహమయ్యాక శ్రీవాణి రాజనీతి శాస్త్రం, ఆంగ్లంలో ఎం.ఏ చేశారు. అమె రచనాసక్తిని పరిశీలించిన భర్త ఆర్ఎన్.శర్మ ఆమెను ఎంతగానో ప్రోత్సహించారు. ఆమె శతకాలు, హిందీ నుంచి అనువాద గీతాలు, పేరడీ పాటలు, జానపద బాణీలో గేయాలు, భక్తిగీతాలు, దేశభక్తి గీతాలు, గజళ్ళు రచించారు. ఈమె రచించిన ‘గాయత్రీ దండకం’ లాంటి వందలాది పాటలు యూట్యూబ్లో లభ్యమవుతున్నాయి. పలు యూట్యూబ్ చానళ్ళకు శ్రీవాణీశర్మ భక్తి గీతాలను అందిస్తున్నారు.

మనోబలంతో ఏ సమస్యనయినా జయించవచ్చును అనే దానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తారు.

ఈమె జీవితంలో మరొక పెద్ద ఘటన, ఈమె క్యాన్సర్ బారిన పడడం. అంత పెద్ద సమస్యను కూడా చిరునవ్వుతో ఎదుర్కొని ఆరోగ్యంగా బయటపడ్డారు. ఈ ఆపరేషన్ జరిగి ఇప్పటికి 14 సంవత్సరాలు అయింది. కొన్ని కారణాల వల్ల ఈమెకు యూట్రెస్ కూడా తొలగించాల్సి వచ్చింది.

వైద్య పరంగా చాలా కాలం పాటు తన సోదరుడు హోమియో ప్రొఫెసర్ (పెదనాన్న కొడుకు) కృష్ణకుమార్ తనకు తోడుగా ఉన్నారు. అటు తర్వాత డాక్టర్ ఆదిలక్ష్మి, Dr. JVRK ప్రసాద్ దంపతులు.. ప్రొద్దుటూరులోని డాక్టర్ స్వాతి, డాక్టర్ విశ్వనాథ రెడ్డి గార్లు ఈమెకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు వైద్య సహాయాన్ని అందిస్తున్నారు. తను ఇంత ఆరోగ్యంగా, ఆనందంగా జీవితాన్ని గడపడంలో, తన మనోధైర్యానికి ఎంత పాత్ర ఉందో ఈ వైద్యులు, కుటుంబ సభ్యుల పాత్ర కూడా అంతే ఉందని, నన్ను నిస్వార్ధంగా ప్రేమించే వేలాదిమంది విద్యార్ధులు, వెన్నంటి ప్రోత్సహిస్తూ నాతోపాటు నడుస్తున్న వారందరి అభిమానమే నాకు బలం, చేయూత అంటూ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

ఈమె శ్రీవారు శర్మగారు క్యాన్సర్ నుండి కోలుకున్నప్పటి నుండి ఒక స్నేహితుడిలాగా ఆమెకు తోడుగా వుంటూ, ఎంతో సున్నితంగా ఆత్మీయంగా చూసుకుంటున్నారు. ఆమె కుమారుడు, ఆరోగ్ సమస్య వచ్చినప్పుడు, కూతురు లేని లోటును తీరుస్తూ (అప్పుడు సిద్ధార్థ్ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు), ఆమెకు అన్ని సపర్యలు చేస్తూ, అపురూపంగా చూసుకున్నాడు.

మూడేళ్ల క్రితం శ్రీవాణి ‘ట్రై జమ్నల్ న్యూరాల్జియా’ అనే చాలా ఇబ్బందికరమైన సమస్యను ఎదుర్కొని న్యూరో సర్జరీ చేసుకోవాల్సి వచ్చింది. ఇవి ఏవి కూడా ఆమెను జీవితంలో ఇసుమంతైనా కృంగదీయలేకపోయాయి. అదే మనోధైర్యంతో ఆమె వృత్తిని, ప్రవృత్తిని నిరాటంకంగా కొనసాగిస్తూ, సమాజానికీ, విద్యార్థులకూ సేవలను అందిస్తూనే ఉన్నారు. క్యాన్సర్ నుండి బయటపడ్డ రెండవ సంవత్సరం నుండి క్యాన్సర్ బాధితులకు ధైర్యాన్నిస్తూ, వాళ్ళ ఇండ్లకు వెళ్లి కౌన్సిలింగ్ చేసి, కుటుంబాలకు ధైర్యంచెప్పి ఎంతో ఊరటను కలిగిస్తున్నారు. ఆమె భర్త తోడుగా పక్కఊర్లకు కూడా తీసుకువెళ్లి, ఆమెకు పూర్తి తోడ్పాటును అందిస్తున్నారు. ఈమె పలుచోట్ల క్యాన్సర్ అవగాహనా సదస్సులను కూడా నిర్వహించారు.

ప్రొద్దుటూరు నివాసి అయిన శర్మగారితో వివాహం జరిగిన తర్వాత, ఆమె ప్రొద్దుటూరులో పలు కళాశాలల్లో పని చేసారు.

Trendz Institute of Communication & Soft Skills అనే స్పోకెన్ ఇంగ్లీష్ సంస్థను, 2000వ సంవత్సరంలో ప్రారంభించి, గత 25 ఏళ్లుగా గ్రామీణ విద్యార్థులకు నిరంతరంగా సేవలు అందిస్తున్నారు.

పేదవారికి కేవలం మెటీరియల్ ఖర్చు మాత్రమే తీసుకొని, కొంతమందికి సగం ఫీజు మాత్రమే తీసుకొని ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ లో శిక్షణ ఇస్తున్నారు. ఇంగ్లీషు, వ్యక్తిత్వవికాసం సహాయంతో విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి, వారి ప్రగతికి బాటలువేస్తూ తాను ఎంతో సంతృప్తిని పొందుతున్నానని.. జీవితానికి సార్థకత చేకూరిందని ఆమె అంటారు.

సంస్థలో వచ్చిన ఆదాయంలో 50 శాతాన్ని క్యాన్సర్ పేషంట్ల సహాయార్థం వాడుతున్నారు.

ప్రస్తుతం ‘తేజ్ జ్ఞాన్ ఫౌండేషన్’ అనే ఆధ్యాత్మికసంస్థలో సభ్యురాలిగా చేరి, తేజ్ గురు సర్ శ్రీ గారి బోధనలతో ప్రభావితమై, సంస్థకు కూడా పలు సేవలను అందిస్తున్నారు.

ప్రముఖుల ప్రశంసలు

గ్రామీణ స్థాయి తెలుగు విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్సెస్ ను మరింత విస్తృతంగా వారి దగ్గరికి తీసుకువెళ్లాలని, ఆరోగ్య సంబంధమైన కౌన్సిలింగ్ సేవలను ఇంకా ఎక్కువ మందికి చేర్చాలనీ, తాను ఆధ్యాత్మిక శిక్షణ ద్వారా పొందుతున్న ఆనందాన్ని వేల వేల మందికి చేర్చాలని ఆమె ఆకాంక్ష.

తాను ఇచ్చే పలు ప్రసంగాలలో తాను నమ్మిన ముఖ్యమైన, బలమైన సూత్రాలు.

కడప ఉత్సవాల సంబరాల కోసం రాసిన గీతం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమైంది.

పల్లవి:
కడపోత్సవాల సంబరాల కాంతి ధామమీ కడప
గరుడోత్సవాల స్వామి నెలకొన్న ఈ గడప
ఇది బంగరు కడప- ఘన వైభవాల గడప
గర్వంగా కదలిరండి కడపోత్సవాలకు
ఘనమైన కడప చరిత చాటు ఉత్సవాలకు
కదలిరండి, కలసి రండి, కలసి కదలిరండి- కడప ఘనత చాటండి..
చరణం:
తాళ్లపాక అన్నమయ్య పద కవితలకి ఇది గడప
కాలజ్ఞానం పలికిన పోతులూరిదీ గడప
భక్తకవి పోతనకు, ప్రజాకవి వేమనకు
అల్లసానికీ మొల్లకు ఆలవాలమీ గడప
ఇది బంగరు కడప, కవి గాయకులకు గడప

ఇలా ఈ పాట కడప చరిత్రను, ఆనవాళ్లను, సంస్కృతిని, సహజ వనరులను, జానపదకళలను.. అన్నిటినీ ప్రతిబింబిస్తూ 8 చరణాలుగా సాగుతుంది. అయితే కడప ఉత్సవాల ముగింపు సంబరాల్లో, కడప కళాక్షేత్రంలో గాయక బృందంలో ఆమె కూడా ఉన్నారు. అప్పుడు ఒక అపూర్వమైన సంఘటన జరిగింది. అప్పటివరకు కడపలో పనిచేసిన 9 మంది కలెక్టర్లు మొదటి వరుసలో కూర్చుని ఉన్నారు.. వారందరూ లేచి నిలబడి ‘ఇది బంగరు కడప, ఘన వైభవాల గడప’ అంటూ మూడు మార్లు కోరస్ పాడడం జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేని సజీవమైన అనుభూతి.’అంటారామె .

అలాగే 2006లో మరో గీతానికి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డిగారి నుండి ‘ఉత్తమ గేయ రచయిత్రి’గా అవార్డులు అందుకున్నారు. అటు తరువాత ఆమెను పలు అవార్డులు వరించాయి.

ఆమె జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలలో ఎన్నో బహుమతులు, ప్రముఖ సంస్థల నుంచి ‘ఉగాది పురస్కారం’, ‘సాహితీ రత్న’, ‘సాహిత్య వతంశి’ బిరుదులను పొందారు.

J Mag National level magazine, Woman’s Day, Special Number.

రచనలు – 500 పైగా కవితలు, మరియు 500 పైగా పాటలు

అనువాదాలు:

అవార్డులు మరియు పురస్కారాలు:

~

శ్రీవాణి నిత్యమూ తనలో తను పాడుకునే స్వీయ రచన ఇలా సాగుతుంది.

పల్లవి:
బాల్యమే గురువుగా నేర్పినా తొలి పాఠమూ
తడబడే అడుగుతో మొదలయే పోరాటమూ
పరిగెత్తు ప్రాయమే, హద్దంటు లేనిదై..
ఊరించు ఆశగా.. సాగేనే..
ప్రతి ఒక్క అనుభవం, ఓ కొత్త ఊపిరై..
పోరాడి గెలవడం నేర్పేనే..

“Every day’s mine, I’ll make a great Sunshine,
Every game I win, ‘N keep the life on spin.”.

శ్రీమతి ఆర్. శ్రీవాణి శర్మ
మొబైల్: +91 9441324587
ఈ మెయిల్: sreevanitrendz@gmail.com

Exit mobile version