Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వందే గురు పరంపరామ్-18

[శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు నిర్వహిస్తున్న ‘వందే గురు పరంపరామ్’ అన్న శీర్షికని ధారావాహికగా అందిస్తున్నాము. ఈ నెల నవ సంగీతావధాని డాక్టర్ మీగడ రామలింగస్వామిగారిని పరిచయం చేస్తున్నారు రచయిత్రి.]

ప్రార్థనా పద్యం

శ్లో:

వాగర్థా వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే!
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ
శంకరా! శంభో! శంకరా!
ఈయరా! శుభముల నీయరా!
నారదుడే శృతిని జూప – చదువులమ్మ వీణ మీట
విఘ్నేశుడు తాళమేయ – ప్రమథగణము పాట పాడ
పార్వతితో పరవశించి – లాస్యమునే చేసినట్టి
చల్లనైన ఇల్లు నీది – చల్లనైన మనసు నీది
చల్లనైన సతులు నీకు – సహకారము చేయగా
చల్లనైన చూపులతో – జగాలన్ని బ్రోచుచున్న
శివ శివ శివ యన్నచో – చింతలెల్ల బాయునని
మధురమైన నీ నామము – మనసుదీర ప్రార్థింతము
మహాశివ మహానటా – మనసారా దీవించరా!!
డాక్టర్ మీగడ రామలింగస్వామి

రచన & స్వర రచన
శ్రీ మీరాకళాజ్యోత్స్నసమాజం (1982)

‘కళా రత్న’ డాక్టర్ మీగడ రామలింగస్వామి

ఈనాటి మన ‘వందే గురు పరంపరామ్’లో నవ సంగీతావధాని, తెలుగు భాషాభిమాని, పద్య నాటక ప్రియుడు, దర్శకుడు, విమర్శకుడు, ప్రిన్సిపాల్, ముఖ్యంగా సాహిత్యాన్ని, సంగీతంతో మిళితం చేసి రసవత్తరంగా ప్రేక్షకులకు అందించడానికి సంగీత నవావధాన రూపకర్త డాక్టర్ మీగడ రామలింగస్వామిగారి గురించి పరిచయం కాదు, ఎన్నో గొప్ప విజయాలు అతను ఏ విధంగా సాధించారో తెలుసుకుందాము.

జననం: శ్రీకాకుళం/విజయనగరం జిల్లాలకు చెందిన రాజాం ఊరికి దగ్గరలో గల మామిడి పల్లిలో ఒకటవ తేదీన ఫిబ్రవరి 1955లో జన్మించారు.

తల్లిదండ్రులు:

తండ్రి బహుముఖ ప్రజ్ఞాకళా దీప్తి ‘శివశ్రీ’ మీగడ దాలయ్య లింగం దేవర. కోవెలలో అర్చకత్వం, భరతశాస్త్రం, వైద్యము, వేదము వీటిలో నిష్ణాతులు. ఆ రోజులలో ప్రమాణ పత్రాల కోసం కాకుండా విద్య నేర్చుకోవడం కోసం ఎన్నో విషయాలను తెలుసుకుంటూ ఉండేవారు. అంతేకాక తన పిల్లలందరూ కూడా చదువుకొని గొప్ప స్థాయిలోకి ఎదగాలని కోరుకునేవారు.

తల్లి అప్పలనరసమ్మ గృహిణి. ఆరోజుల్లో ఆడవారికి ఎక్కువ మంది పిల్లలతో, వచ్చే పోయే అతిథులతో సంసారం నడపడమే ఒక పెద్ద ఛాలెంజ్. అదృష్టవశమున శతవత్సరాలు వీరితో గడిపారు.

పితామహులు: సన్యాసమ్మ భాగ్య లింగం గారు

మాతామహులు:అమ్మణ్ణమ్మ అప్పలస్వామి గారు

తోబుట్టువులు:

మీగడ రామలింగస్వామిగారు పెద్ద కుమారుడు కాగా వీరి తరువాత ఇద్దరు చెల్లెళ్ళు నలుగురు తమ్ములు జన్మించారు. మల్లికార్జునస్వామి; నిత్యానందస్వామి; డా.శశి భూషణ స్వామి; జితేంద్రియ స్వామి ఇద్దరు చెల్లెళ్ళు ఉమాదేవి మరియు బింబాధరి.

తమ్ముడు మల్లికార్జున స్వామి హార్మోనిస్ట్ గా పేరు గణించారు. పద్యం పట్ల అతనికి కూడా అభిరుచి ఉన్నది.

తమ్ముడు మల్లికార్జున స్వామి హార్మోనియం కళాకారుడు

బాల్యము విద్య

ప్రాథమిక & మాధ్యమిక విద్య ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు రాజాంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం సాగింది. బాల్యము గనక ఆట, పాటలతో సాధారణ స్థాయిలో చదివారు. 13సం. వయసులోనే పద్యాలు, పాటలు పాడుకుంటూ తిరిగేవారు. 1968లో అంటే 13 సంవత్సరాల వయసులో రామాంజనేయ యుద్ధం నాటకం కోసం ముఖానికి రంగు వేయడం జరిగింది.

హైస్కూల్ చదువుని పూర్తి చేశారు. మొట్టమొదటిసారిగా 15 సంవత్సరాల వయసులో ‘లోలుగాచారి’గా పిలువబడే జనావీరభద్రాచారి సంస్థలో వారి బృందం లో చేరారు. కానీ 1970 సంవత్సరంలో హరిశ్చంద్ర నాటకంలో నారదుని వేషధారణలో రంగస్థలంపై అరంగేట్రం చేయడం జరిగింది.

తరువాత సుమారు నాలుగు సంవత్సరాలు పాటు చదువు ఆగింది. కారణము అక్కడ కాలేజీలు లేకపోవడం వీరికి నాటకాల పట్ల అభిరుచి ఏర్పడడం జరిగింది. అందులో పేరుప్రఖ్యాతులు తెచ్చుకోవాలని ఆరాటంలో తిరగడం తండ్రికి కొంత వేదన కలిగింది.

ఈ సమయం లోనే హార్మోనియం వాయించడం కూడా నేర్చుకున్నారు. ఒక నాటకానికి తెల్లవార్లూ వాయిస్తే 50/- రూపాయలు వచ్చేదని ఆ రోజుల్లో అది చాలా ఎక్కువ అని చెప్పుకున్నారు. ఎంత ప్రావీణ్యతను సంపాదించారు అంటే తన గురువు రంగస్థలంపై నటించేటప్పుడు తానే హార్మోనియం వాయించేవారు. ఇది చాలా అరుదైన సంగతి. ఆ విధమైన సంగీత ప్రవేశము అతనికి భవిష్యత్తులో ఒక గొప్ప మార్పుకు దోహదం చేసింది అని చెప్పడంలో సందేహం లేదు.1981 వరకూ స్టేజి పై హార్మోనియం వాయించేవారు.

మీగడ వారి భవిష్యత్ ని నిర్దేశించిన ప్రముఖ వ్యక్తి

కారణజన్ములకు వారి జీవిత లక్ష్యం నెరవేరడానికి ఏదో ఒక రూపంలో వారితో ఒకరు పరిచయం అవుతారు. అది ఎక్కడిదాకా దారి తీస్తుంది అంటే వీరి జీవితమే ఉదాహరణ.

హైస్కూల్లో చదివే రోజుల్లో సంస్కృతం తన సబ్జెక్టు కాకపోయినా సంస్కృత విద్వాంసులు ముట్నూరి అనంతశర్మగారు మహా పండితులు. వారు సంస్కృతం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ రఘువంశము, అభిజ్ఞాన శాకుంతలము మొదలైన నాటకములతో పరిచయాన్ని ఏర్పరిచి పద్యం లోని సొగసును తెలియజేశారు.

అప్పటికే తెలుగు భాష పై మంచి పట్టు ఉన్న రామలింగస్వామిగారు 1975లో విజయనగర మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాలలో ‘భాషా ప్రవీణ’ లో చేరారు. అప్పుడు అక్కడ ‘మధుర వచశ్వి శ్రీ మానాప్రగడ శేషసాయిగారు ఉండేవారు. వారు గురు స్థానం వహించి రామలింగస్వామి గారి జీవితాన్ని ఒక అద్భుతమైన మలుపును తిప్పారు. మీగడవారు పద్యం పాడడం విని పరవశించి పోయేవారు. కళాశాలలో చేరుతూనే సాంస్కృతికశాఖ ప్రధాన కార్యదర్శిగా శ్రీ మీగడ రామలింగ స్వామి గారి పేరు బ్లాక్ బోర్డుపై పెయింట్ చేయబడింది.

ఆ నాలుగు సంవత్సరాలూ ప్రతిరోజు ఒక పండుగగానే గడిచేది.

మహారాజా కళాశాల శత వార్షికోత్సవాల సందర్భంగా పాటల పోటీలు నిర్వహించారు. ప్రవేశ రుసుము 25/- రూపాయలు. ఆ రోజులలో 25 రూపాయలు ఫీజు అంటే కట్టడానికి విద్యార్థుల దగ్గర ఉండేవి కావు. కానీ శేషసాయిగారి సతీమణి గురువుగారికి చెప్పి ఆ డబ్బు కట్టించారు.

ఆ పోటీకి న్యాయనిర్ణేతలుగా ప్రముఖ సినీకవి ఆత్రేయ గారు; జంధ్యాల పాపయ్యశాస్త్రి గారు; నేదునూరి కృష్ణమూర్తి గారు వ్యవహరించారు. సుమారు 70 కళాశాలల నుండి విద్యార్ధినీ విద్యార్ధులు హాజరయ్యారు.

ఎంతో గట్టి పోటీని ఎదుర్కున్న మీగడ రామలింగస్వామిగారికి ఆ పాటల పోటీలో ప్రథమ బహుమతి లభించింది. ఈ సందర్భంగా అప్పటి మహారాజా పూసపాటి విజయరామ గజపతి రాజు గారి సతీమణి కుసుమ గజపతిరాజుగారు విజేతలకు బహుమతులు అందజేస్తూ వీరికి వెండి కప్పును బహుమతిగా అందించారు. అది ఒక మధుర స్మృతిగా మిగిలింది. అంతేకాదు ఈ విజయానికి కారణం తనకు ఆ కళపట్ల గల గౌరవము, అచంచలమైన గురుభక్తి, అంకితభావం వెల్లడైనవి.

నాటక రంగము: పద్య నాటకము:

పద్య నాటకునికి ఉండవలసిన ముఖ్యమైనవి 3 లక్షణాలు.

1.సాహిత్యము 2. సంగీతము 3. నటన

వీటిలో ఏది లోపించినా పూర్ణత్వం ఉండదు కదా?

1976లో సంస్కృత కళాశాలలో వార్షికోత్సవంలో సంస్కృత నాటకము ‘అభిజ్ఞాన శాకుంతలమును ప్రధానంగా రచించి ప్రదర్శించడం జరిగింది. అందులో మీగడ రామలింగస్వామిగారు కణ్వ మహర్షి పాత్రను ధరించారు. ఆ రోజు శేషసాయిగారు, పి.వి.జి.రాజుగారు మొదలైన ప్రముఖులంతా ఎన్నో ప్రశంసలు అందించడమే కాకుండా ‘రాజర్షి గా పిలువబడే రాజుగారు ఇతనికి కరచాలనం ఇవ్వడం అనేది ఎంతో అపురూపమైన బహుమానంగా భావించారు.

ఈ సంఘటనలు అతనిలో ఒక కొత్త ఒరవడిని సృష్టించడానికి బీజం వేసాయి.

‘భాషా ప్రవీణ’ పరీక్షలో తనతో పాటు ఉన్న విద్యార్థులందరిలో ప్రథమ స్థానంలో నిలిచి గురువుల యొక్క పేరుని నిలిపారు.

పి.ఓ.ఎల్. పరీక్షలను కూడా ఒకేసారి రాసి ఆ సెంటర్ కి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు.

ఆ ఫలితంతో ఇంక వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకపోయింది

వెంటనే ఎమ్మే తెలుగులో ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థిగా చేరారు. ఆ కేంద్రం నుండి పరీక్ష రాసిన 180 మంది విద్యార్థులు అందరిలో కూడా ప్రథమ స్థానంలో నిలిచారు. అంటే అతనికి తెలుగు భాష పట్ల గల అభిరుచి, తాను నేర్చుకున్న విద్య పట్ల గల అవగాహన అతనిని ప్రథమ స్థానంలో నిలుపుతూనే వచ్చాయి. విద్యార్జన అంచెలంచెలుగా సాగుతూనే ఉన్నది.

వివాహము:

మీగడ రామలింగస్వామిగారికి పెద్దలు కుదిర్చిన విజయలక్ష్మి గారితో వివాహం 1982 మార్చి 12న జరిగింది.

డాక్టర్ మీగడ రామలింగ స్వామి గారు సతీమణి విజయలక్ష్మి గారు

బి.ఎ. చదివిన ఆమె గృహిణి గానే ఉండడానికి ఇష్టపడ్డారు.

వీరికి ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి.

పెద్ద కుమార్తె చంద్రజ్యోత్స్న ఐ.టి. ప్రొఫెసర్, గాయత్రి ఇంజినీరింగ్ కాలేజ్‌లో పని చేస్తున్నారు. కుమారులు ఇద్దరు ఒకరు దుర్గాశివ ప్రదీప్ USA మరియు సిద్ధార్థ USAలో ఉంటున్నారు.

మీగడ రామలింగస్వామి గారి స్నేహితుడైన గ్రంధి ఈశ్వర్ అన్నయ్య గ్రంధి మల్లికార్జున రావు (ప్రస్తుతము జిఎంఆర్ సంస్థ అధిపతి) వీరి తండ్రి గ్రంధి సన్యాసి రాజు గారు 1968లో ఒకసారి ఇలా అన్నారు. “నువ్వు పద్యాలు బాగా చదువుతున్నావు కదా! పద్యానికి ఒక రూపాయి చొప్పున ఇస్తాను. ఎన్ని పద్యాలకు అన్ని రూపాయలు అని వేసిన పందెములో 7 పద్యాలు చెప్పగలిగారు. 1984 సం:లో వారి ప్రోత్సాహముతో “కాళహస్తీశ్వర మాహాత్మ్యము పద్య నాటకము రాశారు. ఆ నాటకానికి రచన, సంగీతము, దర్శకత్వము తానే చేసి ఈ రోజుకి 1500 నాటక ప్రదర్శనలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇస్తూ, పద్యనాటకములలో అందెవేసిన చేయి అనిపించుకున్నారు. ఈ అనుభవము విద్యలో కూడా కొంత లోతుకు వెళ్ళి చదవాలంటే ఎం.ఫిల్. చేయాలనే ఆలోచన వచ్చింది.

శ్రీ తిరుపతి వేంకట కవులు (దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి) సంస్కృత భారతాన్ని తెలుగులో ఆరు పద్యనాటకాలుగా రచించారు. అవి.

1.పాండవజననము; 2.పాండవప్రవాసము; 3.పాండవరాజసూయము; 4.పాండవోద్యోగము; 5.పాండవ విజయము; 6. పాండవ అశ్వమేధము.

ఈ ఆరు నాటకాలు కలిపి మొత్తం భారత కథను చూపిస్తాయి. అందులో పాండవోద్యోగము మరియు పాండవ విజయము నాటకాలు చాలా ప్రసిద్ధి చెందాయి – వీటిని సంకలింప చేసి తర్వాత “కురుక్షేత్రము” అనే ఒక్క నాటకంగా కూడా ప్రదర్శించేవారు.

“పాండవోద్యోగ విజయాలు” అనేది ఈ రెండు నాటకాలను కలిపి పిలుచుకునే పేరు, ప్రత్యేకంగా ఆరు నాటకాల పేరు కాదు.

మీగడ రామలింగస్వామి గారు తనకున్న పౌరాణిక, ఆధ్యాత్మికజ్ఞానంతో భాషపై, పద్యము పై గల పట్టుతో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో డాక్టర్ కొర్లపాటి శ్రీరామమూర్తి గారి మార్గదర్శకత్వంలో సంస్కృత, తెలుగు భారతాల మధ్య తులనాత్మక అధ్యయనము ‘పాండవోద్యోగ విజయాలు’ పరిశోధనాంశముగా తీసుకుని ఎం.ఫిల్.చేసారు. తర్వాత అదే అంశము కొనసాగింపుగా వారి మార్గదర్శకత్వం లోనే పి.హెచ్.డి. పూర్తిచేసి డాక్టరేట్ పట్టాను అందుకున్నారు.

ప్రపంచంలో తెలుగు భాషలో మాత్రమే ఉన్న పద్య నాటకాలకు పరమ గురువులుగా భావించే ‘తిరుపతి వెంకటకవుల’ నాటకాల ఆధారంగా చేయబడిన పరిశోధన 700 పేజీల గ్రంథాన్ని గాన గంధర్వుడుగా పిలువబడే శ్రీఎస్.పి.బాలసుబ్రమణ్యంగారు అచ్చు వేయించారు. కృతజ్ఞతా పూర్వకంగా వారికి ఈ పరిశోధనా గ్రంథాన్ని అంకితం ఇచ్చారు పెద్ద మనసు గల డాక్టర్ మీగడ రామలింగ స్వామి గారు.

వృత్తి: 1987 నుండి అనేక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలలో అధ్యాపకునిగా పనిచేశారు. తరువాత ప్రధానాచార్యులుగా 2013 వరకు మొత్తం 26 సంవత్సరాలు పని చేశాక పదవీ విరమణ గావించారు.

తరగతి గదిలో పద్యమును రాగయుక్తంగా ఆలపించడం విద్యార్థులను సమ్మోహితులను చేస్తుంది. వారిని చురుకుగా ఉంచుతుంది. తరగతి గదిలో పాఠాన్ని పద్యరూపంగా పాడి వినిపించే సమయంలో ఇతర అధ్యాపకులు, ఒకోసారి ప్రిన్సిపాల్ కూడా వచ్చి కూర్చుని వినేవారు అంటే “ఆ గొప్పదనం నాదికాదు మన తెలుగు పద్యానిదే!” అంటారాయన.

పరిశోధన: మీగడ రామలింగస్వామి గారి పైన వారి రచనల పైన ఎం.ఫిల్. చేసిన వారు ఇద్దరు అదేవిధంగా ముగ్గురు పి.హెచ్.డి.పట్టాను పొందారు.

ప్రవృత్తి: నాటక రంగం 1970 నుండి నటుడు, హార్మోనిస్టు, సంగీత దర్శకుడు నాటకకర్త, దర్శకుడు, విమర్శకుడు, నృత్య సంగీత నవావధాన రూపశిల్పి.

పూర్తి సమయాన్ని కోరే ఈ వృత్తి ప్రవృత్తిల మధ్య సమన్వయం ఏ విధంగా కొనసాగిస్తూ న్యాయం చేయగలిగారు? అని ప్రశ్నించగా ఈ విధంగా చెప్పారు.

“ఉద్యోగం నాటకం నాకు రెండు కళ్ళు లాంటివి. అందువలన రెండింటినీ ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం కూడా నాదే! అందువలన నేను శని, ఆదివారాలు, వేసవి సెలవులు మొదలైన సమయంలో నా ఉపన్యాసాలు, నాటకాలకు డేట్లు ఇచ్చేవాడిని. ఇంకా చెప్పాలంటే నా ఉద్యోగ జీవితంలో ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా ఉద్యోగధర్మాన్ని నిర్వహించగలిగిన సంవత్సరాలు ఉన్నాయనేది నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తి ప్రవృత్తులకు సమ ప్రాధాన్యాన్ని ఇవ్వడమే నేను చేశాను. పదవీవిరమణ తరువాత కూడా నా తెలుగు భాషని, పద్యాన్ని, బాలబాలికలకూ, యువతకూ అందించే ప్రయత్నం చేస్తున్నాను.”

వర్తమానములో తెలుగు భాషలో మనం స్కూలులో తెలుగుపాఠాలలో చదువుకునే వేళ్ళతో లెక్కపెట్టగలిగే ఉత్పలమాల, చంపకమాల, మత్తేభ, శార్దూలాలే కాదు ఛందస్సు అంటే తెలుగులో 13 కోట్ల 42 లక్షల 26 వేల 296 వృత్తాలున్నాయి. అన్నమాట వింటే మనం పోగొట్టుకున్నదెంత??? అని తలచుకుంటే తెలుగు పరిస్థితి??? అందుకే ఒక ఉద్యమము లాగా ప్రారంభించిన ఈ కార్యక్రమం నేనున్నంత కాలం సాగుతుంది. నా తరువాత ఒక సైన్యాన్ని తయారు చేస్తున్నాను.

తెలుగు భాష ఎన్నటికీ మృత భాష కాదు.

ఎందుకంటే అది అమ్మ భాష అమృత భాష కనుక.” అన్నారు, తనలోని నమ్మకాన్ని కనులలో మెరుపులతో.

అదే విధంగా “నేను ఉద్యోగం చేస్తూనే ఎం.ఫిల్ మరియు పి.హెచ్.డి. డిగ్రీలు పూర్తి చేశాను. ఫెలోషిప్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం ఎఫ్.ఐ.పి. అంటారు. ఆ ప్రకారం నాకు విద్యాసెలవును ఇస్తారు. కానీ నేను అది వాడుకోకుండా పూర్తి చేయగలిగాను” అంటారాయన.

ముందుగా తెలుగుభాష గురించి చెపుతూ

తెలుగు భాష ఎంత గొప్పది అంటే అనేక ఉపమానాలతో పోలుస్తూ సీస పద్యములో ఇలా అంటారు.

సీ:
పాలమీగడ కన్న పాయసాన్నము కన్న
తీయనైనది మన తెలుగు భాష
పంచదారలకన్న పనస తొనలకన్న
తీయనైనది మన తెలుగు భాష
జుంటి తేనెల కన్న జున్ను ముక్కల కన్న
తీయనైనది మన తెలుగు భాష
తీయ మామిడి కన్న తీపులన్నిటికన్న
తీయనైనది మన తెలుగు భాష

గీ.

తెలుగు భాషలో పుట్టుటే దివ్య వరము
తెలుగు తల్లిని ఎదలోన తలచుకొంచు
పూజ్య భావము తను వెల్ల పులకరింప
అంజలింతము రండి! ఓ అమ్మలారా!
అంజలింతము రండి! ఓ అయ్యలారా! అంజలింతమురండి! ఓ ఆంధ్రులారా!

మాతృభూమి గురించి మన భరతమాత గొప్పతనాన్ని కూడా ఒక సీస పద్యంలో ఇలా వివరించారు.

సీ:

వేదముఖుల తోడ వేద ఘోషల తోడ
విలసిల్లినట్టిదీ వేద భూమి
రత్నాల రాశులన్ రమణీయ శోభతో
ప్రసరించినట్టిదీ రత్నభూమి
మిస మిసలాడిన పసిడి పంటల తోడ
బాసురం బైనదీ భరత భూమి
విజయలక్ష్మిని గొన్న వీరులందరితోడ
వెలుగుందినట్టిదీ వీర భూమి
అన్ని మతాలకు ఆరాధనీయమై
గణ్యత గొన్నదీ పుణ్యభూమి

గీ:
నిఖిల విఖ్యాత కవులకు నిలయ భూమి
సకల విజ్ఞాన ధనులకు జన్మభూమి
అట్టి సద్భూమిలో హృదయమ్ము పొంగ
మమ్ము పుట్టించితివి తదృణమ్ము దీర్ప
వందనమ్మును చేతుమో భరతమాత!

ప్రతి బాలబాలికలు, యువతీయువకులు ప్రతి ఒక్కరు ఈ రెండు పద్యములు కంఠతా పట్టి ఎప్పుడైనా పాడమని అడిగినప్పుడు ఈ పద్యాలు పాడితే ఎంతో ఆనందం పాడే వారికి వినేవారికి కలుగుతుంది అనడంలో సందేహం లేదు.

పద్య నాట్యకాభిమానిగా స్వయంగా సంస్కృతావధాని, స్పష్టమైన భావయుక్తమైన వాచకము, మనోహరమైన గానము పద్య నాట్యకాభిమానులకు కర్ణపేయము.

నిర్వహించిన పదవులు:

సౌత్ జోన్ కల్చరల్ కమిటీ మెంబర్ (ఎస్. జెడ్.సి.సి.) పూర్వసభ్యుడు, నన్నయ విశ్వవిద్యాలయ పూర్వ సభ్యుడు, ఆంధ్ర పరిషత్తు నాటక విభాగ సభ్యులు.

గిడుగు, గురజాడ, కందుకూరి,వంటి సంస్థలతో సన్మానాలు, అనుబంధాలు, సావనీర్లు, దూరదర్శన్, ఆకాశవాణి కార్యక్రమాలు, ముఖ్యంగా విశ్వవిద్యాలయ స్థాయి వరకు పాఠ్యపుస్తకాల రచయితగా అనేక కార్యక్రమాలు చేసినప్పటికీ తెలుగు భాష కోసం ఇంకేదైనా చేయాలనే తపన నిరంతరం ఉండేది.

డాక్టర్ మీగడ వారు ధరించిన వివిధ పాత్రలు

సంగీత నవావధానం

ప్రాచీన భాషా పరిరక్షణ కోసం, మాతృభాష పరిరక్షణ కోసం, మన పద్య మాధుర్య పరిరక్షణ కోసం, మహాకవుల పద్య మాధుర్యాన్ని తెలుగు యువతరం కి అందించడం కోసం, తెలుగు యువతకు తెలుగు వెలుగు జిలుగులను అందించడం కోసం, మానవ విలువలను పరిరక్షించడం కోసం ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.

2006సం. దీనిని ప్రారంభించిన దగ్గర్నుంచి నిరంతరాయంగా కొనసాగుతూ వచ్చింది.

అందరికీ తెలిసిన అష్టావధానములో 8 మంది పృచ్ఛకులు ఉంటారు.

ఈ సంగీత నవావధానంలో 9 మంది ప్రాశ్నికులు ఉంటారు(కొత్తపదం).

సంగీత నవావధానము జరిపే విధానం:

తెలుగు భాషను 7 విభాగాలు చేశారు. ఒక్కో భాగము నుండి 20 పద్యములు

  1. హైందవ సంస్కృతికి కల్పతరువు అయినటువంటి పురాణాలు నుండి 20 పద్యములు
  2. తెలుగు భాషకి మాత్రమే సొంతమైన విశిష్టమైన శతకాలు నుండి 20 పద్యములు
  3. 18 వర్ణనలతో కూడిన కావ్య విశేషం ప్రబంధాలు నుండి 20 పద్యములు
  4. దృశ్య శ్రవణ మాధ్యమం నాటకాలు నుండి 20 పద్యాలు
  5. (అష్టావధానం నుండి పంచ సహస్రావధానాల వరకు చేయగలిగిన ఒకే ఒక ప్రక్రియ తెలుగుజాతికే సొంతమైన) అవధానాలు నుండి 20 పద్యాలు
  6. విభిన్న ప్రక్రియలతో కూడిన ఆధునిక పద్యాలు నుండి 20 పద్యాలు
  7. మన సాహిత్య సంపద నిక్షిప్తమై ఉన్న శ్లోకాలు నుండి 20 పద్యాలు

ఈ విధంగా ప్రాశ్నికులకు 140 పద్యాలు ఇవ్వబడతాయి. ఒక్కొక్క ఆవర్తమునకు ప్రాశ్నికుడు తనకు ఇవ్వబడిన 20 పద్యాల నుండి ఒక పద్యమును ఎంపిక చేసుకోవాలి.

తరువాత సంగీతంలో చాలా ప్రముఖమైన రాగాలు కళ్యాణి, మోహన, హిందోళ, హంసానంది, భీమ్లాస్, దర్బార్, కానడ, శంకరాభరణం, హంసధ్వని, మధ్యమావతి, ఆనందభైరవి, చక్రవాకం, బిలహరి, కేదారగౌళ, శివరంజని, భైరవి, షణ్ముఖప్రియ, భాగేశ్వరి, మాండు, అఠాణ మొదలైన 20 రాగాలలో తాను అడిగిన రాగములో పద్యాన్ని ఆలపించమని ప్రాశ్నికులు కోరవచ్చును.

అంటే 140 x 20= 2840

8వ వ్యక్తి అత్యంత ప్రముఖపాత్ర వహిస్తూ అవధానికి, ప్రాశ్నికులకు మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తారు.

9వ వ్యక్తి సంగీత ‘నవావధాని. సంగీతములో ఆయా రాగాలతో పరిచయము లేని శ్రోతలకోసము నవావధాని వారికి పరిచయమున్న సినిమా పాటలను ఆ రాగములో రెండు, మూడు పాటల పల్లవులు పాడి వినిపిస్తారు. అయితే మోహన రాగములో అందముగా ఉన్న పద్యాన్ని శివరంజని, చక్రవాక రాగాలలో అడిగితే ఎలా ఉంటుందన్నది అతను పాడితేనే వినాలి.

ప్రదర్శనలో అవధానికి ఇవ్వబడిన సమయమును బట్టి ఆవర్తముల సంఖ్య నిర్ణయించబడుతుంది.

ముఖ్యంగా ఎ.బి.ఎన్. ఛానల్ వాళ్ళు వీరి యొక్క సంగీత నవావధానం ప్రక్రియను గురించి ఇంటర్వ్యూ చేసినపుడు ‘రాధాకృష్ణతో హృదయావిష్కరణ అని తన మనసులోని మాటలను పద్య/గద్య,పాటల రూపంలో వివరించారు.

తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్లు వారి ఛానలు శ్రీ ఎస్.వి.బి.సి. కోసం సంగీత నవావధానం మూడు గంటల చొప్పున ప్రదర్శనకు రెండుసార్లు అవకాశం కల్పించారు. అక్కడ సంగీత నవావధానములో ప్రాశ్నికులుగా వచ్చిన వాళ్ళందరూ కూడా మహామహులు. ప్రతి ఒక్కరూ 20 పుస్తకాలకు పైగా రాసి ప్రచురించుకున్నవారు. సంధానకర్తగా అద్భుతమైన వ్యక్తి చింతా రామకృష్ణగారు వ్యవహరించారు.

సద్గురు శివానందమూర్తి గారు భీమిలిలో 50వ ‘సంగీత నవావధానం మూడు గంటల పాటు ఏర్పాటు చేశారు. శ్రీ భాట్టం శ్రీరామమూర్తి గారు దానికి అధ్యక్షులుగా వచ్చారు.

కార్యక్రమం అనంతరం సద్గురు శివానందమూర్తి గారు ఆశీస్సులు అందిస్తూ తమ అభిభాషణలో “ఇది మూడు గంటల పాటు జరిగే కార్యక్రమం కాదు. మూడు రోజులు చేయవలసిన ముచ్చటైన కార్యక్రమం. అందరినీ మంత్రముగ్ధులను చేసింది.” అని అందరికీ తెలిపారు. అదేవిధంగా అధ్యక్ష స్థానం వహించిన శ్రీ భాట్టం శ్రీరామమూర్తి గారు కరచాలనం చేస్తూ నగదు బహుమతి కవర్లో పెట్టి ఇవ్వడం అందరిని ఆశ్చర్యచకితులను చేసింది.

ఋషి వాక్యం

“సంగీతానికి సాహిత్యానికి సమ ప్రాధాన్యం కలిగి ఉంది కాబట్టి ఈ సంగీత నవావధానం సంపూర్ణ సరస్వతి సాక్షాత్కారం”

కుర్తాళం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సిద్దేశ్వరానంద భారతీస్వామి లలితా పీఠం విశాఖపట్నం 2009

“ఈ సంగీత నవావధానానికి వచ్చి పది నిమిషాలు కూర్చుని వెళ్దాం అనుకున్నాను కానీ రెండున్నర గంటలు కదల లేకపోయాను.”

హంపి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విరూపాక్ష స్వామి బృందావన్ గార్డెన్స్ గుంటూరు, 2013

“మీగడ వారి సంగీత నవావధానం కేవలం రెండు గంటలు అయితే ఎలా కనీసం ఇలా మూడు రోజులు పాటు వింటే తృప్తి కలుగుతుందేమో”

పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సద్గురు కందుకూరి శివానందమూర్తి ఆనందవరం భీమిలి 2013

50 సంగీత నవావధానం సద్గురు శివానందమూర్తి గారు భీమిలిలో మూడు గంటల పాటు ఏర్పాటు చేశారు. శ్రీ భాట్టం శ్రీరామమూర్తి గారు దానికి అధ్యక్షులుగా వచ్చారు.

75 వ సంగీత నవావధానము సందర్భంగా చేసిన వీడియో లో మీగడ రామలింగస్వామి గారు తన లక్ష్యం దెబ్బతినకుండా బాల బాలికలకు యువతి యువకులకు ప్రాశ్నికులుగా అవకాశాన్ని కల్పించారు. తనను ప్రశ్నించే సందర్భంగా వారు ఆ 20 పద్యాలను చూసి అయినా రాగయుక్తంగా చదవాలని ప్రయత్నం చేస్తారు అన్నది అతని లక్ష్యం.

100 వ సంగీత నవావధానం 100 మంది విద్యార్ధినీ విద్యార్ధులతో చేయడము మీగడ వారు తన లక్ష్యాన్ని చేరుకుంటున్నారు అనే ఆశను కలిగిస్తోంది. మనందరం చిన్న చిన్నగా అడుగులు వేస్తూ, 10,20,30,…… 50,…. 100 పద్యాలు కంఠోపాఠంగా చదివి నేర్చుకుందాము. పద్యంతో పలకరించుకోవడం తెలుగువారిని పోల్చుకోగలిగే ప్రత్యేకత కావాలి.

130 సంగీత నవావధానం ఆవిముక్త క్షేత్రమైన వారణాశిలో 2019లో చేశారు. వేద విజ్ఞాన వేదిక ధారావాహిక కార్యక్రమంలో 104 వ ది గా మన పద్య నాటకాలు- మానవ విలువలు అనే అంశం పైన ప్రసంగించారు. పద్యాలను రాగయుక్తం గా పాడుతూ ఆద్యంతమూ సభను రంజింప చేశారు.

వారంవారంమీగడ కార్యక్రమంలో తెలుగు భాషాభిమానుల కోసం విభిన్న అంశాలను మనోహరంగా తెలియజేస్తూ ఉంటారు. వినాయక ప్రార్ధన తప్పుగా చదివే వారి కోసం అర్ధ సహితముగా వివరించడం, తెలుగు భాష ఎప్పటిదని ఆధారాలు తెలపడం; గురువులకోసం; వ్యక్తిత్వ వికాస తరంగాలు; గిడుగు-పిడుగు; అమరావతి- ఆంధ్రావని పాట; తెలుగే వెలుగు; శ్రీ సిటీ లో 10,000 మొక్కల మధ్య తిరుగాడుతూ వాటిని పరిచయం చేయడం ఒకసారి ఆ పద్య ప్రపంచములోకి అడుగుపెడితే సమయమే తెలియదు.

సమాచార రంగం:

వీరి కార్యక్రమాలు, ప్రదర్శనలు, ప్రసంగాలు వీటన్నింటి గురించిన వివరాలు ఎప్పటికప్పుడు వార్తలుగా, వ్యాస రూపంగా అందించేందుకు ఈనాడు, జ్యోతి, వార్త, సాక్షి మొదలైన ప్రముఖ దినపత్రికలే కాకుండా హిందూ, దక్కన్ క్రానికల్ మొదలైన అనేక ఆంగ్ల పత్రికలు కూడా ప్రచురించేవి. అదేవిధంగా అనేక వార్తా ఛానల్స్ వీరికి కార్యక్రమాలను, వీరికి జరిగిన సన్మానాలను గురించి తమ చానల్స్ లో వార్తలుగా చెప్పడం, వీడియోలు చూపించడం ద్వారా ఎంతో ప్రోత్సహిస్తున్నారు..

హిందూ దిన పత్రికలో ప్రతి శుక్రవారము రివ్యూలలో వీరి కళా కార్యక్రమం ఉంటే తప్పనిసరిగా ఫోటోలతో పాటు వేస్తారు,

కుంతీ – కర్ణ పౌరాణిక నాటకములో కర్ణునిగా వీరి ప్రతిభను చూసి “సాంప్రదాయ నాటికలు తిరిగి జన్మించాయి” అని రాశారు.

సంగీతనవావధానం వివరాలు 27-02-2019

విజయనగర ఉత్సవాలు సందర్భంగా మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాల అధ్యక్షురాలు డాక్టర్ పి. స్వప్న హైందవి గారు డాక్టర్ మీగడ రామలింగస్వామి గారిచే సంగీత నవావధానం ఏర్పాటు చేశారు. అనేకమంది ఆహూతులచే సభాప్రాంగణం కిటకిటలాడింది.

మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాలలో డాక్టర్ స్వప్న హైందవి ప్రిన్సిపల్ గారి పర్యవేక్షణలో 16 మంది ప్రాశ్నికుల నడుమ సంగీత నవావధాని డాక్టర్ మీగడ రామలింగ స్వామి గారు

రచనారంగం:

పద్య నాటకాలు 28
సాంఘిక నాటకాలు 28
సినిమాలు 2
టీవీ సీరియల్స్ 3
ఏకపాత్రలు 20
పరిశోధనలు 11
ప్రబంధ నాటికలు 20
నృత్య రూపకాలు 4

ఇతరములు

సీడీలు 11 ఈటీవీ 70 శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ 20 ఎపిసోడ్స్ ఆదివారం తెలుగు వారం ఏబీఎన్ వారి 100 ఎపిసోడ్లు

పొందిన ఘన సన్మానములు

1995లో స్వర్ణ కిరీటం
2000 స్వర్ణపుష్పాభిషేకం
2004లో స్వర్ణ మకర కుండలాలు
2006లో స్వర్ణ కంకణాలు

నట సరస్వతి కళా రూపంలో ఉన్న
వీరిని సన్మానించిన ప్రముఖులు మాన్య ప్రధానమంత్రి పీవీ నరసింహారావు గారు;
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు (ముగ్గురు);
వివిధ రాష్ట్రాల గవర్నర్లు (ఆరుసార్లు);
ముఖ్యమంత్రులు (పదిసార్లు); వీరేకాక లోక్ సభ ,శాసనసభ స్పీకర్లు, కేంద్ర రాష్ట్ర మంత్రివర్యులు, ఎం.పీ.లు; విశ్వవిద్యాలయ ఉపకులపతులు; ఐఏఎస్. అధికారులు; ప్రాచార్యులు వీరిని సత్కరించి తమ జన్మ ధన్యమైనట్లు భావించారు.

పద్య నాటకము గురించి డా. మీగడ రామలింగస్వామి గారు నంది పురస్కార గ్రహీతగా 28 నందులను తెచ్చి తన ఇంట శివుని ముందు ఉంచారు.

శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ థియేటర్ వారిచే
గరుడ పురస్కారములు 28 తెచ్చి విష్ణుమూర్తి ముందు ఉంచారు.

అందుకున్న పురస్కారాలు:

పర్యటించిన ప్రాంతాలు:

తను నమ్ముకున్న కళ కోసం, సరస్వతి దేవి ఆరాధన కోసం, తెలుగు భాషావ్యాప్తికోసం అనేక ప్రాంతాలు పర్యటించారు. అందులో భారత దేశంలో 11 రాష్ట్రాలు; అమెరికాలో 20 రాష్ట్రాలు; ఇంగ్లాండ్; లండన్; బర్మింగ్ హామ్; సింగపూర్; ఆస్ట్రేలియా మొదలైన ప్రాంతాలను పర్యటించి తన కళను ప్రదర్శించారు.

వారం వారం మీగడ— గురువారం ప్రతి ఆదివారం మీగడ పద్యోద్యమం

సమాజ హితులారా! నాటక సాహితీ బుధులారా! యువ సోదర సోదరీ మణులారా! ఎంతో మంది పెద్దలు యువకులు ఆదివారం +గురువారం రోజులు+ ముఖ్య పండుగ దినాల్లో నేను పంపుతున్న చరవాణీ సందేశాల కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్తున్నారు. ధన్యవాదాలందరికీ. నిజం .ఎంతో కష్టపడి మీ కోసం పంపుతున్నాను. యూట్యూబులో dr meegada గంట గుర్తు నొక్కండి. 450 “వీడియోలు” ఎంచుకొని చూడండి. మీ కోసమే! మీ ఈ స్పందన చాలు .dr meegada Subscribe చేసేస్తే.. ఇంకా ద్విగుణితోత్సాహం తో పంపుతూ ఉంటా,. ఇందులో 1) యామునాచార్య నాటకం లో నృత్య సన్నివేశం (నేను + పద్మావతి) 2) పిల్లలు చదివిన పద్యాలు వినాల్సిందే ! వంద భాగాల్లో 4 వ భాగం .ఇవి చూసిన వారికి ధన్యవాదాలు . మీ మిత్రులకు ఈ సందేశాలు పంపండి. మరీ సదా సాహితీ కళా నాటక సేవలో… కళారత్న డా.మీగడ

వారం వారం ఆదివారం మీగడ

తెలుగు వెలుగు సోదరులారా!. అందరికీ అమ్మ ఉన్నా, ఎవరి అమ్మ వారికే గొప్ప . అలాగే ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నా మన తెలుగు భాషా ప్రపంచానికి *అమ్మ* తెలుగు భాషే! అందుకే ఇవాళ మనకు పెద్ద పండుగ. తెలుగు భాష కోసం జీవితాంతం కృషిచేసిన కవులకు పెద్దలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు, అర్పించుకోవడం, తెలుగు వాడిగా మన విధి . అందుకే ఇవి వినండి ! పిల్లలకు ఈ ఆటలు, పాటలు, పద్యాలు నేర్పించండి!

సదా మాతృ భాషా సేవలో.. *కళారత్న డాక్టర్ మీగడ

నా dr meegada (You tube )11వందల దాటి వివిధాంశాలపైన

మన భాగవతం; మన భారతం; మన రామాయణ ఘట్టాలు; మన శతకాలు; నా సంగీత నవావధానాలు; మన నాటకాలు [ప్రదర్శనలతో]; మన మహా కవులు. వ్యక్తిత్వ వికాసాలు; గొప్పవారి జీవన చిత్రాలు మరియు నా మా ‘నవ’ పురాణం ఇలా ఎన్నో ?!!!..

మన తెలుగు వారైన పిల్లలకు, యువతకు, పెద్దలకు ఎంతో ఉపయుక్త మైనవి పొందు పరిచాను. ఎవరి శక్తి కొలది, ఆసక్తి కొలది వారు అందుకొని ఆనందిస్తారనీ, ఇంత శ్రమ పడి నా ధర్మం గా చేస్తున్నాను ; చేస్తాను.

గీ౹౹

అరయ కుడికన్నునాటకమ్మౌను నిజము
ఎడమ కన్ను సాహిత్యమౌ ఎంచి చూడ
బొట్టగును కాదె సంస్కృతి పూర్ణముగను
గాత్ర మానంద సంధాన పాత్రమగును
విదిత మీగడ రూపిది విజ్ఞులార!

కళారత్న డా.మీగడ

Exit mobile version