Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వందే గురు పరంపరామ్-19

[శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు నిర్వహిస్తున్న ‘వందే గురు పరంపరామ్’ అన్న శీర్షికని ధారావాహికగా అందిస్తున్నాము. ఈ నెల జ్ఞాన శిరోమణి, సుప్రసిద్ధ సాహితీవేత్త ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యగారిని పరిచయం చేస్తున్నారు రచయిత్రి.]

సద్భుద్ధిస్సాధుసేవీ సముచిత చరిత స్తత్త్వబోధాభిలాషీ
 శుశ్రూషుస్త్యక్తమానః ప్రణిపతనపరః ప్రశ్నకాల ప్రతీక్షః
 శాంతో దాంతోనసూయ శ్శరణముపగతః శాస్త్ర విశ్వాస శాలీ
 శిష్యః ప్రాప్తః పరీక్షాం కృతవిదభిమతం తత్త్వతః శిక్షణీయః
(అను మహితోక్తికి నిలువుటద్దము కోవెల సుప్రసచాచార్యులు)

జ్ఞాన శిరోమణి, ఋషితుల్యులు, సుప్రసిద్ధ సాహితీ విమర్శకుడు, యోగి, అవధాని, కవి. సాహితీలోకం వారిని ‘ఆధునిక ఋషి’గా గౌరవిస్తుంది. ఈనాటి మన ‘వందే గురు పరంపరామ్‌’లో మనం జగమెరిగిన ఈ ‘ప్రతిభా సుప్రసన్ను’ని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము.

ఆయన వైష్ణవసంప్రదాయ విద్వత్ కుటుంబంలో జన్మించారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యులుగా సేవలు అందించారు. ఆయన 90వ జన్మదినోత్సవాన్ని నవతీ అభినందనోత్సవము ‘ప్రతిభాసుప్రసన్నము’ 26-03-2026 న జరుపుకున్నారు.

అనాదిగా అనంతంగా ఉన్నదానిని అందరికీ వెల్లడించాలని జన్మించిన కారణజన్ముడు, ఋషిపుంగవుడు. తన రచనల ద్వారా తనను తాను ఆవిష్కరించుకుని వెలువరించిన సనాతన సత్యమే ఆయన. భారతీయ చింతనను సంపూర్ణంగా దర్శించిన మహర్షి.

ప్రాచీన మరియు ఆధునిక సాహిత్య ప్రక్రియలో సమానమైన ప్రజ్ఞ కలిగినవారు. కవిత్వం, విమర్శ, పరిశోధనా వంటి అనేక విభాగాలలో వేలపుటల సాహిత్యాన్ని సృష్టించినవారు. సాత్వికత, సంయమనము కలిసిన వీరి వ్యక్తిత్వము తెలుగు సాహిత్యంలో మూడు తరాల రచయితలను విశ్లేషించగల సామర్థ్యాన్నీ, ఒక జాతీయ సాంస్కృతిక వారసత్వాన్నీ నిలుపగల సాధనంగానూ ఉపయోగపడింది. ఆయన రాసిన పీఠికల సంకలనం ‘అంతరంగం’ విమర్శనా సాహిత్యంలో ఒక మైలురాయిగా నిలిచింది.

అక్షరాలలో యీ ప్రపంచానికి ఒక కొత్త చూపునిచ్చే శక్తి ఉంటే అవి శాశ్వతంగా నిలిచిపోతాయి. శక్తి లేనప్పుడు అవి ఎవరివైనా రాలిపోక తప్పదు.” అంటారు.

జననము- పరిసరాలు- బాల్యము- స్నేహితులు

యువ నామ సంవత్సర ఫాల్గుణ మాస కృష్ణ పక్ష నవమి నాడు అనగా 17 మార్చి, 1936న ఓరుగల్లులో (వరంగల్) పరమ నిష్ఠాగరిష్ఠులైన లక్ష్మీనరసమ్మ, వేంకట నరసింహాచార్యులకు ప్రథమ సంతానంగా జన్మించారు.

సుప్రసన్న చిన్ననాడు తన చెల్లెళ్ళు కమల, ఇందిరలతో

పితామహులు: భగవద్రామానుజ సంప్రదాయులైన కోయిల్ కందాడై రంగాచార్యులు.

వీరికి నలుగురు కుమారులు. మొదటివారు వేంకట నరసింహాచార్యులు ‘బాలకవి’ పేరుతో పద్యాలు రాశారు. విగ్రహారాధనము అనే రచన చేశారు. వీరి కుమారులే ఈనాటి మన సుప్రసన్నులు. లక్ష్మీనరసింహాచార్యులు భగవద్గీత మీద వ్యాఖ్యానం రాశారు. ప్రముఖ సాహితీవేత్త సంపత్కుమారాచార్య ఛందో వ్యాకరణాలంకార శాస్త్రాలలో తనదైన ముద్ర వేశారు.

రజాకార్ల కారణంగా వారి కుటుంబము వరంగల్ నుండి కల్లెడకు, అక్కడి నుండి విజయవాడ, రాజమహేంద్రవరమునకు వలస వెళ్లింది. ప్రవాస సమయంలో వారు తమ తల్లి తండ్రుల వద్ద కాక పితామహుని వద్ద ఉండడం విద్యార్జనరీత్యా కలసివచ్చిన అంశం. వరంగల్లో ఆనాడు జరుగుతుండిన విద్వద్గోష్ఠులు, శైవారాధ్యులకు, వైష్ణవారాధ్యులకు మధ్యన జరిగే వాదోపవాదాలు, తొలుత ఆర్య సమాజంతోను, తదుపరి కాలంలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘంతోను ఏర్పడిన పరిచయము ఇత్యాదులన్నీ మత కలహాలతో అట్టుడికిపోతూ, అల్లకల్లోలంగా ఉన్న అప్పటి సమాజాన్ని ఆకళింపు చేసుకుందుకు సుప్రసన్నగారికి తోడ్పడినవి.

మాతామహులు: కవిపండితులైన ఉభయ వేదాంత దర్శనములలో నిష్ణాతులైన ఠయ్యాల లక్ష్మీ నృసింహాచార్యులు. వారే సాహిత్య గురువు కూడా. సుప్రసన్నచార్యులు గారి చేత 9 సం. ల వయసులో కంద పద్యాలు రాయగలిగినట్లు తీర్చిదిద్దారు. అంతేకాదు భారతీయ సంస్కృతి, సంస్కారములు, సంస్కృతాంధ్ర సాహిత్యాలను అవలోకనము చేసుకోగలిగినట్లు తీర్చిదిద్దారు.

సరస్వతీ కృప చేత ప్రశాంత చిత్తత, సమదృష్టి, స్థిత ప్రజ్ఞత ఉభయ భాషలలో గల పాండిత్యముతో అక్షరాలను కవిత్వంగా మలచి, అద్భుతాలను సృష్టించారు. వారు అలవరచుకున్న స్థితప్రజ్ఞత వారి జీవనయానంలో అడుగడుగునా వారి ఔన్నత్యాన్ని ప్రకాశింప చేసింది.

సాంప్రదాయ కుటుంబంలో పుట్టినా ఆధునిక భావజాలంతో సామాజిక దృక్పథం కలిగిన కవిగా ఎదిగారు. ప్రాథమిక విద్యార్థి దశలోనే ఉపనిషత్తులు, ఉభయ వేదాంత గ్రంథాలు, భగవద్గీత వంటి గ్రంథాలు చదివిన ప్రభావంతో తనను తాను శిల్పంగా చెక్కుకొని ఉన్నత వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకున్నారు.

విద్య:

‘ఆంధ్ర విద్యాభివర్దిని’ పాఠశాలలో చదువుకోవడం అన్నది సుప్రసన్నగారికి లభించిన వరము. ప్రధానోపాధ్యాయులు వై.కె.శాస్త్రిగారు, హరి రాధాకృష్ణమూర్తి గారు, విశ్వనాథ వెంకటేశ్వర్లు, ధూపాటి వెంకటరమణాచార్యులు, దెందుకూరి సోమేశ్వరరావు వంటి ఉద్దండ పండితుల వద్ద జరిగిన విద్యాభ్యాసము సుప్రసన్న వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో ప్రధాన పాత్ర వహించిందని చెప్పవచ్చును. పదవ తరగతిలో ఉండగా పోతన జయంతి ఉత్సవాలలో వక్తృత్వము, వ్యాసరచన, గ్రంథపఠన పోటీలలో మూడు ప్రథమ బహుమతులు వచ్చాయి. పోతన భాగవతంతో పాటు కవిత్రయ భారతం కూడా బహుమతిగా తొలి పురస్కారము. అందుకున్నారు.

ఇంటర్‌లో ఉండగా వరంగల్లులో కాకతీయ కళాసమితి వారు భారతీయ సంగీతం గురించి వ్యాస రచన పోటీ పెట్టగా గురువుల అనుమతితో ‘ది హిస్టరీ ఆఫ్ క్లాసికల్ సంస్కృత్ లిటరేచర్’ అన్న పుస్తకం ఆధారంగా వ్యాసం రాసి పంపగా ప్రథమ బహుమతి వచ్చింది. ఈ విధంగా పాఠశాల చదువులు ఎ.వి.వి.హైస్కూల్ వరంగల్లో పూర్తి చేశారు.

ఎ. వి. హైస్కూల్ విద్యార్ధులతో సుప్రసన్న 1950 సం.

వివాహము:

సుప్రసన్న గారి రెండవ మేనమామ వెంకట నరసింహాచార్యులు, లక్ష్మమ్మ లకు శారద, కమల మరియు శాంత అనే కుమార్తెలు, పార్థసారథి, జనార్ధనాచార్యులు, మాధవాచార్యులు మరియు కృష్ణమాచార్యులు అనే నలుగురు కుమారులూ ఉన్నారు. పెద్దకుమార్తె శారదను సుప్రసన్నకు ఇచ్చి 28-05-1954 లో వివాహం చేశారు.

శారదా, సుప్రసన్న దంపతులు

శ్రీమతి శారదగారు 5వ తరగతి వరకే చదివినా చదువు మీద గల మక్కువతో పరోక్షంగా అందరికీ తన సహాయ సహకారాలు అందించేవారు. భూదేవి అంత సహనముతో సంసారము నిర్వహిస్తూ, అతిథి అభ్యాగతులను ఆదరించేవారు. శారదా, సుప్రసన్న దంపతులకు శ్రీనివాసు, సంతోష్ కుమార్ అని ఇద్దరు కుమారులు, శ్రీవాణి శ్రీలత ఇద్దరు కుమార్తెలు. భర్త సాహిత్య సేవలో ఉంటే పిల్లల విద్యాబుద్ధులు కూడా ఆమె చూసుకున్నారు. తన పిల్లలకే కాక భర్త కోసం వచ్చే ప్రతి ఒక్కరినీ ఆమె తల్లిలా ఆదరించారు.

సుప్రసన్న గారి తల్లి, సతీమణి, కుమార్తెలు, కొడుకు, కోడలు, మనవలు,

సుప్రసన్నుల వారి ఉన్నత విద్య:

హైదరాబాద్‌లో 7 సంవత్సరాల పాటు అహరహమూ శ్రమించి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1955 నుండి 1962 వరకూ బి.ఎ.; ఎం.ఏ; పి.హెచ్.డి. చేశారు. వీరి పరిశోధనా అంశము ‘రామరాజ భూషణుని కృతులు’. ఈ సందర్భంగా తనకు కలిగిన ఒక సందేహాన్ని తీర్చుకుందికి విజయనగరం నుండి మద్రాసు వరకూ తిరిగి అనేక మంది పండితులను కలిసి, అనేకమైన పుస్తకాలను సంపాదించి, అనేక గ్రంథాలయాలను దర్శించి, నోట్సులు రాసుకుని, తన సందేహాలను తీర్చుకుని పరిశోధనను పూర్తి చేసారు. స్నాతకోత్సవంలో మైసూరు రాజా జయాచామ రాజేంద్ర వడియార్ చేతులమీదుగా పి.హెచ్.డి. పట్టాను అందుకున్నారు.

వృత్తి:

ఎం.ఎ. పూర్తి చేశాక సిటీ కాలేజీ, ఈవినింగ్ కాలేజీలలో పార్ట్‌టైమ్ లెక్చరర్‌గా చేశారు. 1961లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అడ్‌హాక్ లెక్చరర్‌గా నియమించబడ్డారు.1962 నుండి కాకతీయ విశ్వవిద్యాలయం లెక్చరర్‌గా, రీడర్‌గా, ప్రొఫెసర్‌గా వివిధ హోదాలలో పనిచేశారు. వరంగల్ ఈవినింగ్ కాలేజీకి ప్రిన్స్‌పాల్‌గా, కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖకు హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్‌గా, డీన్‌గా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఛైర్మన్‌గా సేవలను అందించారు.1996 లో పదవీ విరమణ పొందేవరకూ అనేక హోదాలు, పదవులూ వారిని వరించాయి.

2024 ఫిబ్రవరి 26&27 తేదీలలో “కాకతీయ విశ్వవిద్యాలయం- తెలుగుశాఖ ఆచార్యుల సాహిత్యసేవ” అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రారంభోత్సవ సమావేశానికి అతిథిగా హాజరై సభాధ్యక్షునిగా కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో చేసినటువంటి అనేకమైన కార్యక్రమాలను గురించి ప్రసంగించారు. తెలుగుశాఖ సిలబస్ రూపొందించడంలో ఇతర విశ్వవిద్యాలయ తెలుగు శాఖలకు ఏ విధంగా మార్గదర్శకంగా ఉందో తెలియ చేశారు.

శిష్యులు:

సుప్రసన్న గారి దగ్గర మొదటిగా పరిశోధక విద్యార్ధి సురేంద్రకుమార్ కాగా అనేక వేల మంది శిష్యులుగా తీర్చిదిద్దబడ్డారు. కొందరు పరిశోధక విద్యార్ధులు. డా. కె.వి.ఎన్.రాఘవన్; ఆచార్య కాత్యాయినీ విద్మహే; డా. గుంజి లక్ష్మీ నారాయణ; డా. గండ్ర లక్ష్మణరావు; డా. ఒద్దిరాజు వెంకట రామారావు; డా. పాతూరి రఘురామయ్య; డా. వజ్ఝల రంగాచార్య మొదలగు ప్రముఖులు.

‘ఆచార్య’ సుప్రసన్నగారు లాంటి విద్వద్విభూషితుల మార్గదర్శకత్వంలో (గైడెన్స్) 25 మంది పి.హెచ్.డి.లు 16 మంది ఎం.ఫిల్ పూర్తి చేశారు అన్నది ఒక గర్వించదగిన విషయం.

యః పాఠతి, లిఖతి, పశ్యతి, పరిపృచ్ఛతి, పండితానుపాశ్రయతి

 తస్యదివాకరకిరణైః నళినీదళ మివా వికాస్యతే బుద్ధిః” ని పరిశోధక శిష్యులకు అలవరచిన మేధావి. తమ పరిశోధక శిష్యులకు సాహిత్య తత్త్వ విషయక రహస్యములు విప్పి చెప్పిన తాత్త్వికులు. ఆచార్య సుప్రసన్నగారి రచనలపై పరిశోధనలు: అనేక విశ్వవిద్యాలయాల్లో పి.హెచ్.డి.లు, ఎం.ఫిల్.లు చేశారు. జాతీయస్థాయిలో 150 పైగా సదస్సులలో పాల్గొని అనేక అంశాలపై పరిశోధనా పత్రాలు సమర్పించారు.

ఆచార్య సుప్రసన్న ఆధ్యాత్మిక ప్రయాణంలో బాటలు వేసిన గురువులు:

తత్వవేత్తగా సుప్రసన్నచార్యులుగారు అరవిందులు, భగవాన్ రమణ మహర్షి, సద్గురు శివానంద మూర్తి మొదలగు సద్గురువుల భావజాలంతో కూడా ప్రభావితమై ఉన్నారు.

శ్రీ అరవిందుల వారు: శ్రీ అరవిందులు రచించిన ‘ది గాడ్’ అను పద్యము సుప్రసన్న గారికి పాఠ్యాంశంగా ఉండేది. శ్రీ దంతుకూరి సోమేశ్వరరావుగారు దానిని బోధించేవారు. దానిని బాగా అవగాహన చేసుకున్న సుప్రసన్నగారు తెలుగులోకి అనువాదాన్ని చేశారు. అదేవిధంగా 1957లో శ్రీ అరవింద దేహత్యాగానంతరము ‘భారతి’ పత్రికలో వేలూరి శివరామశాస్త్రి గారు అరవింద్ గురించిన వ్రాసిన వ్యాసాల ప్రభావం సుప్రసన్నగారిపై ఉంది. 1974లో జనవరిలో సుప్రసన్న పాండిచ్చేరికి మొదటిసారిగా వెళ్లారు. 24 సంవత్సరముల వయసులో పడిన ఆలోచనామృతబీజం శ్రీ అరవింద సమాధి దర్శనంతో ఒక్కసారిగా కవితాలతో ఇది పుష్పించి ఫలించింది. ‘పాండిచ్చేరి 12 గీతాలు’ అనే పేరుతో ప్రచురించబడ్డాయి. శ్రీ అరవింద మార్గంలోని వైశిష్ట్యం సంపూర్ణంగా వారి అవగాహన లోకి వచ్చింది. ఆనాటి నుండి పద్య, గద్య, వచన ప్రక్రియలలో ఏ అంశాన్ని గురించి వారు రచించినా అది శ్రీ అరవింద తత్వ దర్శన ప్రతిఫలమే తప్ప మరొకటి కాదు.

గాయత్రి తన బంగారు రెక్కలు విచ్చి/ ఆవరించి వినీల దురూహ్య గగనాన్ని
 బిందువు భూమండలమై వికసించి / దిగంతాలను ముడి వైచిన పంచదశి”

శ్రీ అరవిందుల తత్త్వం సుప్రసన్నను బాగా ప్రభావితం చేసింది. అంతః చైతన్యాన్నీ, అవచేతననూ ఆ తత్త్వదృక్కోణం నుంచే పరిశీలించేవారు. కళాసృజనల అనుభూతి ప్రపంచంలో వాటి ప్రభావాన్ని సుకుమారంగా సమీక్షించేవారు. తద్గత రహస్యాలని మేల్కొలిపే శక్తి కళారూపాలకు ఉందనీ, అస్మితా సమర్పణానుపదంగా అతిమనస్తేజశ్శకలాల అవతరణం కలుగుతుందని ప్రస్తావించినారు. ఇక్కడే మౌలికమైన ‘విశ్వలయ’ను ప్రతిపాదించారు. ఇతిహాస మహాకావ్య నిర్వచనం చేసారు. వ్యక్తి తన అంతస్సుతో, సమాజంతో, ప్రకృతితో, సర్వనియామకమైన దివ్యచైతన్యంతో, సామరస్యం సాధిస్తే ఇతిహాసంలో విశ్వలయ సిద్ధిస్తుంది. తాదృశమైన ఇతిహాసం మానవ చైతన్య విజయయాత్రలో ఒక ప్రధానఘట్టం. ఇతిహాసమహాకావ్య నిర్మాణ మహాయజ్ఞంలో “కవి తననుతానే ఆహుతి చేసుకుంటున్నాడు.” ఇది ఎలియట్‌ వివరించిన extinction of personality కంటె ఉదాత్తమైంది, ఉత్కృష్టమైంది.

ఓం తత్సవితుర్వరం రూపం జ్యోతిః పరస్య ధీమహి యన్నః సత్యేన దీపయేత్” (శ్రీ అరవింద గాయత్రి)

అనంతమైన నిశ్శబ్దం జాజ్వల్యమానమైన కాంతి శిఖరంగా దర్శనమిస్తుందని అరవిందుల బోధ

ఒకసారి నిశ్శబ్దాన్ని అందుకుంటే సూర్యోదయాదులు నీకు లేవు
ఒకసారి భౌతిక లోక ద్వారాలు దాటితే ఆత్మ కోసహశం స్ఫురించేను
కలుషమైన ప్రేమతో జగన్మాత ఒడిలో తల మోపినంత
నీవు వెలుతురు కొలనువై అనంత కాలహంసలకు మానసమై”

భారతీయ సమాజంలో వర్తమాన పరివర్తనల అనుకూల ప్రతికూల పరిస్థితులు అనే వ్యాసంలో అరవిందుల జీవితాన్ని, తత్వాన్ని, లక్ష్యాన్ని బిందువులో సింధువును దర్శింపజేసే రీతిలో రచించారు. ఇలా సంక్షిప్తంగా ఒక మహర్షి ఆత్మను దర్శింపచేసేటట్టు రచించడం కష్టం. సుప్రసన్నగారు ఆ పనిని అలవోకగా సాధించడం వెనుక అధ్యయనం, అవగాహన ఉన్నాయి.

సుప్రసన్నగారి రచనలలో అరవిందుల ప్రభావం ‘అలల శృంగాలపైని బిందువులపై మెరిసే సూర్యకిరణాల వెలుగులా తళ తళలాడుతుంటాయి’ అని అంటారు.

అదేవిధంగా సద్గురు శివానంద మూర్తి గారి ప్రధాన స్రవంతిలో కూడా సుప్రసన్న గారు ఒక భాగం అయిపోయారు. ఎందుకంటే వారి అంతర్మథనంకు ఇది కూడా శ్రీ అరవింద మార్గమేనని అంతర్వాణి సమాధానం చెప్పింది.

శ్రీ కందుకూరి శివానంద మూర్తిగారు:

సద్గురువులు శ్రీ కందుకూరి శివానంద మూర్తిగారు మతాలకు అతీతమైన ఒక మహనీయుడు. అనంతాలకు ఆవల వ్యాపించిన ఒకానొక తాత్విక విశేషాన్ని తిలకించడానికి అనుభవించడానికి అవసరమైన ఒక వేదికను అందించారు. ప్రతి ఒక్కరితోనూ ఎంతో సన్నిహితంగా ఉండేవారు. వారిలో వారికి స్థాయి బేధాలు ఉన్నప్పటికీ గురువు దగ్గర అందరూ ఆంతరంగికంగానే ఉండేవారు. ఒక్కోసారి గురువు ఎవరో శిష్యులు ఎవరో అన్నది ‘రెండు లేదు అద్వైతం ఒకటే’ ఉండేది. ఈ విషయంలో సుప్రసన్నగారు గురు స్థానాన్ని అలంకరించారని చెప్పవచ్చును.

ఆయన విద్వత్తు, పెద్దరికం, సౌమ్యవర్తన, సదా చిరుహాసం, ముందుగా పలకరించే ఆప్యాయత తన ఇష్టదైవమైన కృష్ణుడిని అంతరంగంలో ప్రతిష్ఠించుకొని, తన ఉపాధినే కోవెల చేసుకున్న సుప్రసన్నాచార్యులవారు అందరికీ ప్రియతములు. సుప్రసన్నాచార్యుల వారికి శివానంద మూర్తి గారికి మధ్య ఎంతో లోతైన సుదీర్ఘ సంభాషణలు జరిగేవి. ఒక్కోసారి ఏమి మాట్లాడకుండానే మౌనవ్యాఖ్యతో సమయం గడిపేవారు.

శివానంద మూర్తిని గురువుగా భావించి ఆయన పుణ్య జీవన యానం ఒక మహత్ కళాఖండ రూపంలో సుప్రసన్నగారు సిద్ధపరిచారు. గురువుగారి ముఖతః కొంత సమాచారం, తన తపస్సుని ధారపోసి ఎంతో సమాచారం తెలుసుకుని, సుప్రసన్నగారు అందరూ హాయిగా పాడుకునే విధంగా ‘గురు తత్త్వ వైజయంతి’ అనే గీతమాలను సృష్టించారు. ‘శివానందాయనం’ అనే ఒక అద్భుత కవనము శిఖరాగ్రమానమై శివానంద మూర్తిగారిని బాలకృష్ణునిగా దర్శింపజేసింది. ప్రముఖ సంగీత విద్వాంసులు ‘శ్రీ పి.వి.ఎస్.శేషయ్యశాస్త్రిగారు’ సంగీతరూపకము అనే బంగారపు తూగుటుయ్యాలలో కూర్చుండబెట్టి ఊగించగా, ప్రఖ్యాత ‘సంగీత విద్వన్మణి’ ‘వర్ధమాన గాయని’ ధవళేశ్వరపు వర్దనిగారు తన మధుర గాత్రంతో ఆ కొంటె కృష్ణుడిని ఆడించి అలరించారు. ఈ గీత ప్రబంధాన్ని ‘కీర్తిశేషులు “నృత్య కళా విశారద” పర్వతరాజు రాజేశ్వరి మల్లికార్జున్’ తన సుశిక్షిత శిష్య బృందం శ్రీమతులు పద్మ, కళ్యాణి, ఎల్లాప్రగడ హేమ తదితరులతో కలిసి ఒక నృత్య రూపకంగా గురువుగారి ముందు ప్రదర్శించారు. ఒక అద్భుతమైన దృశ్య కావ్యం వీక్షకుల ముందు నిలిచింది.

ఆచార్య తాడేపల్లి పతంజలి గారు కోవెల సుప్రసన్నాచార్యగారి ‘శ్రీవిద్య’ ఉపాసన గురించి దాని లోతులు తెలిసిన జ్ఞానిగా వారి రచనలలో శ్రీవిద్యా తత్వం అంతఃస్రవంతిగా ప్రవహిస్తూ ఉంటుందని తెలియజేశారు. శ్రీవిద్య అంటే మంగళకరమైన జ్ఞానం మనలను మనం తెలుసుకునేది. శ్రీచక్రం అనేది అమ్మవారి యొక్క రూపం. విశ్వం మొత్తం ఎలా పుట్టిందో తెలిపే ఒక నమూనా. శ్రీవిద్యకు శ్రీచక్రానికి మధ్య ఉన్న సంబంధం భాషకు అక్షరానికి ఉన్నంత దగ్గర సంబంధం. శ్రీవిద్య అనేది ప్రయాణం శ్రీచక్రం అనేది దారి చూపే మ్యాప్. శ్రీవిద్యలో అత్యంత ముఖ్యమైన మంత్రం, యంత్రం, తంత్రం ఈ మూడు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. ఈ మూడింటి ద్వారా మనలో ఉన్న పరమశివుడిని, పార్వతీదేవిని దర్శించుకోవడమే! అయితే ఇది అంత సులభం కాదు. ఒక సమర్థుడైన గురువు మనకు లభించాలి. సాక్షాత్తు ఆదిదంపతులే గురువుగా, సాక్షాత్తు దైవముగా, యోగశక్తిని పొందిన గొప్ప సాధకులుగా, మనకు మంత్రోపదేశం చేసిన గురువులుగా మనలను నడిపిస్తారు.

నవావరణములు దాటి సహస్రార బిందువుని చేరాలంటే మొదటి మూడు ఆవరణలలో గురువు శిష్యునికి క్రమశిక్షణ నేర్పి ఇంద్రియాలను అదుపులో ఉంచుతారు. మధ్యలోని మూడు ఆవరణలలో సాధన ద్వారా శరీరంలోని ప్రాణ శక్తిని పెంచుతారు. జ్ఞానోదయం కలిగించి ఆత్మసాక్షాత్కారం చేసి సహస్రార బిందువును చేరేందుకు చివర మూడు ఆవరణలు దాటిస్తారు. మన శరీరంలో గల ఏడు చక్రాల ద్వారా మనం ప్రయాణం చేస్తున్నాము అన్నది మనకు తెలియకుండానే చేరుకుంటాము. ఎంతో కఠినతరమైన శ్రీవిద్యా పథగామి అయిన సుప్రసన్నాచార్యగారి కావ్యాలు చదివితే శ్రీవిద్యా తత్త్వఛాయలు పాఠకులకు దర్శనమిస్తాయి.

జిడ్డు కృష్ణమూర్తిగారు భూత, భవిష్యత్తులు, తనను తాను తెలుసుకున్నవారు. వారి తాత్త్వికత సుప్రసన్న గారి కవిత్వంలో ఉంటుంది. దీనికి కారణం 04-01-1986 లో మద్రాసులో జిడ్డు కృష్ణమూర్తి గారి చివరి ఉపన్యాసాన్ని సుప్రసన్నగారు వినడం జరిగింది. 17-02-1986 లో కృష్ణమూర్తిగారు కాలిఫోర్నియాలో తుది శ్వాస విడచినపుడు ఆ చివరి ఉపన్యాసంలో చెప్పిన మతం, కాలం మరియు జీవితం గురించి విపులంగా చర్చించిన విషయాలను సుప్రసన్నగారు వ్యాసంగా రాయగా ‘ఆంధ్ర ప్రభ’ పత్రికలో ప్రచురించారు.

సుప్రసన్నాచార్య గారి సుదీర్ఘ జీవితంలో ప్రభావం చూపినవి ఒకటి విశ్వనాథ సత్యనారాయణగారు, రెండు శ్రీ అరబిందో. వీరి ప్రభావం తనపై ఉన్నట్లు ‘పరిక్రమ’ అనే కవిత్వం పుస్తకం ముందుమాటలో చెప్పారు.

“నా చేతస్సును నిర్మించిన సాహిత్య గంధం విశ్వనాథ సత్యనారాయణది అయితే తాత్విక గంధం శ్రీ అరవిందులది సంప్రదాయం భగవద్రామానుజులది.” అంటారు.

సుప్రసన్నాచార్యగారు తాను రచించిన సమర్పణ, సమర్చన పుస్తకాలను శ్రీ శ్రీ శ్రీ సిద్దేశ్వరానంద భారతీ మహారాజ స్వామీజీ చే ఆవిష్కరణ చేయించారు.

మాజీ ప్రధాని శ్రీ పాములపర్తి వేంకట నరసింహారావుగారు విశ్వనాథ ఒక బ్రహ్మ రోచిస్సు.. సుప్రసన్న రెండవ ఉషస్సు ..అంటారు. వరంగల్ లో మాజీ ప్రధాని, అపర చాణక్యులు, బహుభాషా కోవిదులగు శ్రీ పి.వి.నరసింహారావు గారి పురస్కారం అందుకున్న సమయానికే వారి చూపు మందగించింది. కానీ అనివార్యమైన శారీరక మార్పులకు చింతించాల్సిన పని లేదనుకున్నారు. ”సర్వేంద్రియాణాం నయనం ప్రధానం” అయినప్పటికీ తన మనోనేత్రం తోనే లోకాన్ని దర్శిస్తున్న యోగులు వారు.

“సుప్రసన్నగారి జీవనసంపుటిలో అనేక తాత్త్వికవిచారధారల సమన్వితస్థితి దృశ్య మానమవుతుంది. దేశీయమైన ప్రాచీన మంత్ర తంత్రధారలూ, అద్వైత విశిష్టాద్వైత ధారలూ, ఆధునికమైన వివేకానంద, శ్రీ అరవింద, రమణ మహర్షి, జిడ్డు కృష్ణమూర్తి, సద్గురు శివానందమూర్తి విచారధారలూ ఒక సమన్వయాన్ని సంపాదించుకున్నవి.” అని సుప్రసన్న గారి సృజనాత్మకతను ప్రభావితం చేసిన అంశాలు అంటూ ‘మణిసేతువు’ పుస్తకానికి ముందుమాటలో ఆచార్య కోవెల సంపత్కుమారాచార్య గారు రాశారు.

ప్రజాకవి కాళోజీ ఇలా అంటారు – “పూర్వ ఋషుల సంప్రదాయానికి తోడు ఆధునిక తాత్త్విక విచారధారను జోడించి నవీన తాత్త్విక సంప్రదాయాన్ని ఏర్పాటు చేసిన వారిలో ఒకరు సుప్రసన్న.”

మార్క్సిజం అయినా, ఆధ్యాత్మికవేత్తలైనా, అంబేద్కర్ అయినా వారి భావజాలాన్ని సానుకూలంగానే అర్ధం చేసుకునే గుణం ఉంది కనుకనే వారి ప్రపంచం విస్తృతమవుతుందే తప్ప సంకుచితం కాదు. అందుకనే వీరి శిష్యులైన ఆచార్య బన్న అయిలయ్య గారు ‘ఆధునిక ఋషి’ గా సంబోధించారు.

రచనలు:

సుప్రసన్నగారి రచనలు చదవాలంటే పాఠకులలో అంతర్గతంగా ఒక జ్వలన ఉండాలి. అది దొరికేచోటు వెతుక్కునే చీకటిలో చైతన్యపు వెలుగురేఖ మెల్లమెల్లగా దృశ్యమానమై గగనమంతా నిండిన వెలుతురులో విభ్రాంతులమవుతాము. నూతనమార్గానికి దారి చూపే ఆ భావాలూ, ఆ రచనలూ అద్భుత ప్రపంచాన్ని చేరుస్తాయి. అది అత్యంత ప్రాచీనమైనా.. అత్యంత ఆధునికమైనా ఎందుకంటే విషయం చెప్పడంలో ఆయనలో ఘర్షణ లేదు. ఎంత లోతుగా విశ్లేషించవలసి వచ్చినా సంయమనాన్ని పాటిస్తూ, సూటిగా తన అభిప్రాయాన్ని చెప్పగలరు.

విశ్వాంతరాళంలో ఉన్న అదృశ్యశక్తిని అన్వేషించి, దృశ్యమానం చేసుకొని, విశ్వంతో మమేకమై, విశ్వలయలో అనుభూతి చెందిన మహామనీషి కోవెల సుప్రసన్నాచార్యులు. అందరిలో ఆ భావనను అపేక్షించి సమాజాన్ని ప్రభావితం చేయటానికి ‘విశ్వరూప సౌందర్యా’న్ని దర్శింప చేయడానికి ఆయన పడిన తపన వర్ణనాతీతం. ప్రాచీన సాహితీ సంపదను ఒడిసిపట్టిన కవిగా, రచయితగా, విమర్శకుడిగా, ఉదాత్తమైన వ్యక్తిత్వంతో కవిత్వ స్వరూపస్వభావాలను చిత్రించిన విజ్ఞాన సంపన్నుడు. ఆయన ప్రాచీన సాహిత్యానికి ఆధునిక సాహిత్యానికి వారధిలా నిలిచి విశ్వజనీనతను వాంఛించారు.

శ్రీ సుప్రసన్న సాధకుడు. ఆయన ఆధ్యాత్మిక భావసంపుటి ప్రధానంగా సాహిత్య నిర్మితి, విమర్శ రూపుదిద్దుకున్నాయి. సాహిత్య ప్రక్రియలన్నింటిలో సిద్ధహస్తుడైన మనీషి, గాఢమననశీలి. పద్యం, వచనం, వచనపద్యం, కథ, గేయం ఇవన్నీ అప్రయత్నంగా సిద్ధించినట్లు తెలుస్తుంది. ఆయన మననశీలి, కావున మితభాషి. సత్యం స్పష్టంగా స్ఫురించనిదే, దాని కనుగుణమైన వ్యక్తీకరణ లభించనిదే ఆయన పలకరు. ‘సత్యాయ మితభాషిణాం’ గుర్తుకువస్తుంది.

1954లో ‘హృద్గీత’తో ప్రారంభమైన సుప్రసన్నుల కవిత్వసృష్టి.. ఇందులో “జడమై, ప్రాణమై, మనస్సువై, విజ్ఞానంబవై, సృష్టిగా పొడ చూవపగలవాడవై” అన్న పద్యం సృష్టి పరిణామక్రమాన్ని వివరించారు. ఇది విశ్వనాథవారి పీఠికతో సుప్రసన్నులవారి సాహిత్యయాత్రకు శ్రీకారం చుట్టబడింది. ‘వనవాస రాఘవం’తో 26 కావ్యములను అందించారు.

సాహిత్య వ్యాస సంపుటులు:

1971లో సాహిత్య వివేచన పేరుతో వెలువడిన విమర్శనా వ్యాస సంపుటి, భావుక సీమ సాహిత్య వ్యాస సంపుటి; భావ సంధ్య వ్యాస సంపుటి; కావ్య ప్రమితి వ్యాస సంపుటి; విశ్వనాథ సమన్విత దృక్పథం 2025 లోని 11 రచనలు సాహిత్య విమర్శకే వినూత్న పోకడలు నేర్పాయి.

వచన కవితా రచనలు:

దీపవృక్షం, రస రాజధాని వంటివి ఆరు

రస రాజధాని పుస్తకం 120 సం. ల విశ్వనాథకు సాహిత్య నీరాజనం

వేదసూక్త సౌర్యం’ మంత్రవ్యాఖ్య శివానంద మూర్తి ప్రభావ ఫలితం అనుభవసంపుటి (13) స్వీయ సంపాదకత్వంలో తెలుగు సాహిత్య సరస్వతికి సమర్పించారు. వేద రహస్యాన్ని సామాన్య పాఠకులకు అందించే సంకల్పంతో వేదాలలోని ఎంపిక చేసిన సూక్తాలకు సరళమైన వ్యాఖ్యానం చేశారు.

సంపాదక వ్యాస సంపుటులు: వసు చరిత్ర సంపాదకత్వం; చేతన వర్తం-1 సంపాదకత్వం; హిరణ్యగర్భ సంపాదకత్వం; విశ్వనాథ వాంగ్మయసూచిక సంపాదకత్వం; ధూపాటి వెంకటరమణాచార్యుల జీవితచరిత్రము సంపాదకత్వం; వసుచరిత్ర వైభవము సంపాదకత్వం; విశ్వనాథ సహసంపాదకత్వము

పీఠికలు: ‘అంతరంగం’

సుప్రసన్న సాహిత్య విమర్శలో ‘పీఠికల’కు ప్రత్యేకస్థానం ఉన్నది. 65 పీఠికలను సంకలనం చేసి ‘అంతరంగం’ అనే పేరుతో ప్రకటించారు. పీఠికలు కేవలం ప్రశంసలు కావు. కావ్యగర్భంలోనికి ప్రవేశించి దాని పరమార్థాన్ని వ్యాఖ్యానించేవి. దాని కుదురు లోంచి ఎదిగివచ్చి తత్వమును విశదం చేసేవి.

స్వతంత్ర రచనలు: దీప వృక్షం; చందన పాడి; దర్పణం; సమార్చన; సమర్పణ; సంపరాయం; శేఫాలిక; శ్రీ వేద సూక్త సౌరభం: కృత్తిత; ఆనందలహరి; అపర్ణ; సాహిత్య వివేచన; రుతంభర;

సహృదయ చక్రం: శతాంకుర; ఏకశిలా సాహిత్య సౌందర్యము ప్రసంగ వ్యాసాలు

2002 లో ప్రచురింపబడిన ‘సంపరాయం’ తెలుగు సాహిత్యంలో మొట్ట మొదటి ఆధునిక ఇతిహాస గ్రంథంగా “EPIC OF ETERNITY” అని పేరు కలదు. ఇందులో 12 అధ్యాయాలు, 546 పద్యాలు ఉన్నవి.

పద్యకవిగా శ్రీ నృసింహ ప్రపత్తి– అంతర్ముఖీన యాత్రను ఎరుక పరచే భక్తి, ఆధ్యాత్మిక, యోగా త్రయీ కాంతిపుంజమే ఈ కావ్యము; సుప్రసన్నాచార్యులు పరమయోగి పుంగవులు.

32 నృసింహ రూపాలకు మూలం 32 అక్షరాల అనుష్టుప్ ఛందమే!

ఉగ్రం, వీర్యం, మహావిష్ణుం, జ్వలంతం, సర్వతోముఖం

నృసింహం, భీషణం భద్రం, మృత్యు మృత్యుం నమామ్యహం

సుప్రసన్న గారు ఎంచుకున్నది యోగమార్గం. యోగ నరసింహుడే తన కోర్కెను తీర్చగలరని గట్టిగా నమ్మారు. సంసార చక్రపరిభ్రమణం నుండి తొలగించి పరమపద ప్రస్థానాన్ని అర్థించారు. యోగమార్గమే శరణ్యమని భావించినారు. యోగ చిత్తవృత్తి నిరోధః అన్న పతంజలి యోగ సూత్రం యోగ నిర్వహిస్తుంది అంటే మనసులోని అలజడులను, వికారాలను, భావాలను, నిశ్శబ్దంగా నియంత్రించడమే యోగం. గీతాచార్యుడు భగవద్గీతలో ఉపదేశించినదంతా యోగమార్గమే.

భగవంతుని సాన్నిహిత్యం పొందడానికి శ్రీకృష్ణ భగవానుడే ఒక గురువుగా తెలిపిన ఈ సాహిత్యమే కృష్ణ చైతన్యం. ఈ చైతన్యాన్ని అందుకోవాలని తపించారు సుప్రసన్నగారు.

‘ఈశ్వరాభిముఖ ప్రయాణం’ అనేది సుప్రసన్నగారి విద్యార్థిదశలో (1958) ‘శ్రీలక్ష్మీ నృసింహోదాహరణ’ కావ్యరచన కాలం నుంచే మొదలైంది. ‘శ్రీ నృసింహ ప్రపత్తి’ కావ్యరచన (2001) సమయానికి “కన్నుల మధ్య నిలుపంగనే వలయు నిన్ను శ్రీ నృసింహ ప్రభూ!” అని తన స్థితిని ఎరుక పరచగలిగాడు. నరసింహస్వామిని వేదోపనిషత్తు వీధులలో విహరించే ప్రణవనాద స్వరూపునిగా చిత్రించారు. ‘వరి ముల్లు’ వలె అనురూపంతో హృదయంలో ఉంటాడని, అలాగే మహద్రూపంతో విశ్వమంతా వెలుగులు ప్రసరిస్తాడని తాను రాసిన పద్యాలలో పేర్కొన్నారు.

ఇతర పద్య రచనలు: స్తుతి ప్రబంధము, తేజశ్చక్రము; దుఃఖయోగిని, అధునా; కృష్ణరశ్మి; శ్రీ నిరుక్తి;, ప్రీతి పుష్కరిణి; మణి సేతువు; పరిక్రమ; వనవాస రాఘవము; శ్రీరామకథాసుధ; పాంచాలరాయ శతకం – విశిష్టాద్వైత సంప్రదాయ సిధ్ధాంత భావనతో ఈ శతకాన్ని రచించారు. జీవుని ఆర్తి ఈ శతకములోని ప్రతి పద్యములోనూ తొంగి చూస్తుంది.

పాండిచ్చేరి గీతాలు; కన్నీటికొలను; అంగద విజయం; శుక్తిమతి నాటిక; ‘సౌభద్రుని యాత్ర’; ‘తెలుగు ఋతువులు’; ‘అన్నదమ్ములు’ రేడియో నాటికలు; మణికర్ణిక కావ్యసంపుటి; శివాభిసారిక; శ్రీకృష్ణోపనిషత్; ప్రీతిపుష్కరిణి; అశ్రుభోగ; ‘శివాభిసారిక’కావ్యానికి కీ.శే.రాళ్ళబండి కవితాప్రసాద్ అద్భుతమైన ముందుమాట రాశారు.

విలక్షణమైన విమర్శకులు: ఆధునిక తెలుగు సాహిత్యంలో సుప్రసన్నాచార్యులు లబ్ధప్రతిష్ఠులైన కవి మాత్రమే కాదు విలక్షణమైన విమర్శకుడు కూడా. ‘అధునా మొదలు ప్రీతి పుష్కరిణి’ దాకా 17 కావ్యాలు రచించారు. సాహిత్య వివేచన మొదలు భావ సంధ్య’ దాకా పదికి పైగా విమర్శ గ్రంథాలు వెలువరించారు.

1954 నుంచే సుప్రసన్న సాహిత్య ప్రస్థానం ప్రారంభించారు. ‘గోలకొండ’ పత్రికలో ఉదాహరణ కావ్యాలను గూర్చి మొదటి వ్యాసం ప్రచురితమైంది. 1960 నాటికి సుప్రసన్న విమర్శపై స్పష్టమైన అభిప్రాయమును వ్యక్తీకరించారు. నేటి విమర్శలో ఉన్న దోషం అది పాఠకుడి దగ్గర కాక కవి దగ్గర ప్రారంభమైంది. దానివల్ల అనుభూతి కన్నా శిల్పం ప్రాధాన్యం వహించింది. అభివ్యక్తి కన్నా వ్యుత్పన్నతకు కిరీటం వచ్చింది. ఇంకనైనా సహృదయుడు ఆధారంగా మన విమర్శ పునర్నిర్మించవలసి ఉన్నది. అనుభూతి మార్గం కావ్యం విలువలను సరిగా అంచనా వేయటానికి ఉపకరిస్తుంది. ఆ కొలతల వల్ల దేశ కాలాల వ్యక్తిత్వ పరిమితులు నిబంధించే పరిమితులను మనం దాటగలుగుతాము అని ‘దర్పణం’ అని విమర్శ గ్రంథంలో పేర్కొన్నారు. ఆధునిక తెలుగు సాహిత్య ఉద్యమాలు వాటి అంతస్తు పరిశీలనలో సమకాలీన రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, మత, ఆధ్యాత్మికత స్థితిగతులను స్పష్టంగా విశ్లేషించారు. ‘సాహిత్యము- జాతీయకరణ’ అన్న వ్యాసంలో నేటి విమర్శ విజాతీయులకు ఎలా అమ్ముడుపోయిందో చెబుతూ మన సాహిత్య విమర్శలో ఈ కాలంలో ఏర్పడ్డ అవ్యవస్థకు కూడా ఇదే కారణం. మన దేశము సాహిత్యాన్ని విదేశీ ప్రమాణాలతో కొలవడం దానిని ఎలాగోలాగ అన్వయించాలని కోరిక ఎన్నో తప్పుడు నిర్ణయాలకు కారణం అవుతున్నది. మన పరిస్థితులు, మన భాషల జీవ లక్షణం, మన అవసరాలు, మన సంస్కృతీ సంప్రదాయాలు మన సాహిత్య శాస్త్ర సంపద అన్ని ఆధారంగా ఒక వ్యవస్థ ఏర్పరచవలసి ఉన్నది అని ‘సాహిత్యము – సాహిత్య విమర్శ’ జాతీయీకరణ కావలసిన అంశాన్ని విశదం చేశారు.

సుప్రసన్న విమర్శలో స్ఫుటంగా వ్యక్తమయ్యే అంశం మనో లోక ద్వారాలు తెరచి కావ్య గర్భంలోకి ప్రవేశించడం, అంతస్తులోని ఆ సృజన భూమికల అన్వేషణ, వాటి విశ్లేషణ, ఆయన విమర్శలో కనిపించే కొత్తదనం. ఇందుకు సహాయకారిగా ఆయన ‘మనస్తత్వ శాస్త్రాన్ని’ ఆశ్రయించారు. “కవిత్వము సృజన మూలాలు” (భావుకసీమలో ప్రచురితం) అనే వ్యాసంలో సృజన మూలాల అన్వేషణ, విశ్లేషణ, సాహిత్య విమర్శకు కొత్త కోణాన్ని జోడించింది. కళాసృష్టి సమిష్టి చైతన్యస్పర్శ చేత రూపాంతరీకరణ పొంది వ్యక్తిగతమైన జీవన భావనల పరిధి నుంచి విముక్తమవుతున్నది. ఆయా జాతి జనుల మౌలికానుభవాలకు రూపం ఇస్తున్నది. ఇందువల్ల ఆ రచన సీమలను దాటి విశ్వజనీనమైనదిగా వెల్గొందుతుంది.” అని ఒక కావ్యము దాని అనుభవము ఎలా విశ్వజనీనతను పొందుతుందో చెప్పారు. “కళా సృజనల అనుభూతి ప్రపంచం- మూడు స్తరాల సమన్వయం” (దర్పణం) అనే వ్యాసంలో కవి- సహృదయుడు- సృజన భూమికలు- మొదలైన అంశాలపై విపులమైన విశ్లేషణ కనిపిస్తుంది.

ప్రతీకలు- ప్రాగ్రూపాలు, బింబాలు- సాహిత్య నిర్మాణంలో వాటి ప్రాధాన్యత, అవసరము గూర్చి ‘సాహిత్యానుశీలనలో ప్రాగ్రూపాల పురాగాథల ప్రాధాన్యము (భావుక సీమ) అనే వ్యాసంలో సాహిత్యానుశీలనంలో ప్రాగ్రూప పార్శ్వమును గురించి విశ్లేషణ కనిపిస్తుంది. అవి

“ఏ మహా రచన అయినా ఈ మూడు భూమికలలో సువ్యక్తమవుతుంది. రచయిత రచనా వైలక్షణ్యం ఇది ఏ మహా గ్రంథానికైనా ప్రాథమిక లక్షణం. చైతన్యంలోని ప్రధాన లక్షణాలన్నింటిని ప్రస్ఫుటం చేయగల గాఢత్వం ఆ రచన జీవించడానికి, దేశ కాలాలకతీతంగా మానవీయ చైతన్య లక్షణాలకు అవసరమైన రూపుకట్టించే శక్తి.

సహృదయ చక్రం’ లో మహా గ్రంథాలు (క్లాసిక్స్) ఎలా చదవాలో, అధ్యయనం చెయ్యాలో వాటి లక్షణాలు ఏమిటో విశ్లేషించి మహాకావ్యాల అధ్యయనానికి మార్గదర్శకత్వం చేశారు. సుప్రసన్న సాహిత్యవిమర్శలో వర్తమాన సమకాలీనాంశాలను, మానసిక సౌందర్యానుభవాలను విశ్లేషించటంతో ఆగిపోక, ఆధ్యాత్మిక పార్శ్వమును కూడా జోడించారని. ఇలా ఆధ్యాత్మికాంశాలను ప్రతీకాత్మకంగా విశ్లేషించడం ద్వారా సుప్రసన్న సాహిత్య విమర్శకు క్రొత్త వాకిళ్లను తెరిచారు. “లోకోత్తర కావ్యాలన్నీ ఒక సామాన్య లక్షణం కలిగి ఉంటాయి. అవి దేశ కాలాలకు అతీతంగా ఎదిగిపోతూ ఉంటాయి. ఆ కావ్యాలు సానలు తీరిన జాతి రత్నాల మాదిరిగా బహుముఖీన ప్రకాశం ప్రసారం కలిగి ఉంటవి. అని ‘వేయిపడగలు-ఆధ్యాత్మిక భావభూమిక’ అనే వ్యాసంలో పేర్కొన్నారు. ఈ విధంగా త్రివిధ భూమికలలోని అనుభవావిష్కరణ ఆయన విమర్శలోని ప్రత్యేకత. కల్పవృక్షము – ఆధునిక మహేతిహాసము; వేయిపడగలు – విశ్వలయ, విశ్వనాథ వాఙ్మయాధ్యయనం – సమన్విత దృక్పథం – మొదలైన వ్యాసాలలో ఈ విశ్లేషణ చూడవచ్చు అలాగే ‘వసు చరిత్ర’ను మూడు అంతరాలలో దర్శించి విమర్శను కొత్త దారికి తిప్పినారు. సుప్రసన్న ప్రాచీన అర్వాచీన ఇతిహాసాల కావ్యాల అధ్యయనంలో క్రొత్త ద్వారాలు తెరవటం కావ్యాధ్యయాయనానికి క్రొత్త ప్రమాణాలను నిర్దేశిస్తూ వాటి సూత్రాలను విశ్లేషించారు.

ఆధునిక కాలంలో కూడా ఇతిహాసాల నిర్మాణం కొనసాగుతూ ఉందని నిరూపిస్తూ వాటి లక్షణాలను నిర్దేశించడం ఆయన సాగిస్తున్న సాహిత్య కృషిలో మరో పార్శ్వం. “ఆధునిక కాలంలో విమర్శకులు శ్రీ అరవిందుల ‘సావిత్రి’ని ఇతిహాసంగా పేర్కొన్నారు. అలాగే తెలుగు సాహిత్యంలో ఆధునిక కాలంలో వెలువడ్డ ఇతిహాసాలు మాలపల్లి, వేయిపడగలు, శ్రీమద్రామాయణ కల్పవృక్షము” అంటూ వాటిలోని ఐతిహాసికతను నిరూపిస్తూ అనేక వ్యాసాలు ‘విశ్వనాథ మార్గము’ అనే విమర్శ గ్రంథంలో విపులంగా చర్చించారు.

1960లో సుప్రసన్న రాసిన ‘నేటి కవిత – సంప్రదాయం’ అనే వ్యాసంలో అనేక ఆధునిక కావ్యాల విశ్లేషణలో ‘నవ్య సంప్రదాయం’ అనే పేరును స్థిరపరచడం జరిగింది. సుప్రసన్న విమర్శలో కనిపించే మరొక ప్రత్యేకాంశము ఆధునిక సాహిత్యచరిత్ర పరిణామాలను అధ్యయనం చేయటం. ఈ అధ్యయనంలో ఆయనకు ఆధునిక సాహిత్య చరిత్ర అంతా రెండు పాయలుగా గోచరించింది. ఒక భాగం ఆత్మ న్యూనతా భావంలో నుంచి పుడితే, రెండవ ధోరణి ఆత్మవిశ్వాసంలో నుంచి పుట్టినట్లుగా గుర్తించినా వాటి విశ్లేషణలో ఒక సమన్వయ దర్శనం చేసే ప్రయత్నం చేశారు.

“సుప్రసన్న సృజనాత్మకత, దర్శనము, సమన్వయ దృష్టి, అంతర్ముఖీనత కావ్యాలకే పరిమితం కావు. అవి ఆయన సృష్టించిన విమర్శను కూడా ప్రకాశవంతం చేశాయి. “నాకు కవిత్వంగాని విమర్శ కానీ పారమార్థికంగా భిన్నాంశాలు కావు. ఒకటి అనుభవము. రెండవది దాని అధ్యయనము. ధర్మ వేదం చేత రెండుగా పేర్కొన్న అది అద్వయమైనదే.” అని సుప్రసన్న ఒక చోట స్వయంగా తన కావ్య విమర్శ భూమిక లో స్పష్టం చేశారు. ‘చందన శాఖ’ విమర్శ గ్రంథానికి ముందు మాటగా “నా సాహిత్య విమర్శకు మూలస్థానం రచన చదివినప్పుడు నా వ్యుత్పత్తి, లోకజ్ఞత ఉపకరిస్తున్నది. ఆ సరస్వతీ తేజస్సును వ్యక్తీకరించేందుకు చేసిన ప్రయత్నమే విమర్శ ప్రస్థానం. మానవ జీవితంలో సమస్తమైన అనుభవాలకు ఆవిష్కారస్థానంగా భావించటం చేతనే ఆయన విమర్శ కావ్యము సమన్వయ దర్శనంతో కూడుకున్నవి.” వీరి గురించి కె.వి.ఎన్.రాఘవన్ లాంటి ఎందరో రచయితలు తాము వారిని వారి భావాలను అర్థం చేసుకున్న విషయాలను వ్యాస రూపంలో వ్యక్తీకరించారు.

పురస్కారాలు:

జీవిత విశేషాలు

కోవెల సుప్రసన్నాచార్య కవితల్లో కొన్నిటిని ఆంగ్లం, హిందీ భాషలలోకి పలువురు సాహితీవేత్తలు అనువదించడంతో అవి ఆయా భాషల్లో ప్రచురితమయ్యాయి.

ఆయన రచనలపై విమర్శకులు, రీసెర్చ్ స్కాలర్సు, సాహితీవేత్తలు అనేక పుస్తకాలు ప్రచురించారు. ఉదాహరణకు

60వ జన్మదిన సంపుటి ప్రసన్న శారద

70 వ జన్మదిన సంపుటి సుప్రసన్న సాహితీ వైజయంతి

80వ జన్మదిన సంపుటి సన్నుతి పుస్తకాలు ఆ కోవలోనివే.

ఇప్పుడు 90వ జన్మదిన సంపుటిగా ప్రతిభా సుప్రసన్నము వెలువరించారు. (సంచిక అంతర్జాల పత్రికలో 4 వ్యాసాలను ప్రచురించారు, వ్యవస్థాపకులు శ్రీ కస్తూరి మురళీ కృష్ణగారు. అంతే కాదు ఆ పుస్తకంపై మంచి సమీక్షను కూడా రాసి ప్రచురించారు.) బహుశా ఇంతటి సమ్మానము మరే ఇతర కవికి జరిగి ఉండదు అని తెలుగువారి భావన.

సారస్వత సేవ – ఎన్నో సంస్థలకు అధ్యక్ష, కార్యదర్శులుగా ఉన్నారు. వారిలోని పట్టుదల, కార్యదీక్ష, పరిపాలనా నైపుణ్యముతో అనేక సంస్థలను అభివృధ్ధి వైపు నడిపించారు.

1954లో ‘సాహితీబంధు బృందం’ అనే సంస్థను స్థాపించి అధ్యక్షుడిగా ఉన్నారు. 1957లో ‘మిత్రమండలి’ స్థాపించారు. 1958లో హైదరాబాదులో ‘రసధుని’ అనే సంస్థను మొదలి నాగభూషణశర్మ, మాదిరాజు రంగారావులతో కలిసి ప్రారంభించారు. 1960లో ‘కులపతి సమితి’ని స్థాపించారు. ‘జాతీయ సాహిత్యపరిషత్తు’లో జీవితసభ్యునిగా, ‘విశ్వనాథభారతి’ సంస్థలో జీవితసభ్యునిగా, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ సభ్యుడిగా ఉన్నారు. ‘పోతన విజ్ఞానపీఠం’ ప్రధాన కార్యదర్శిగా బహుభాషా కవి సమ్మేళనాలు, బృహత్ కవి సమ్మేళనాలు, అవధానాలు, నాటకాలు పోతన విజ్ఞాన పీఠం కళకళ లాడేటట్లు చేశారు. 1996 లో ‘సహృదయ’ సాహిత్య సాంస్కృతిక సంస్థ ద్వారా సుప్రసన్నగారి పరిణత జ్ఞానపరిధిని తెలియజేసే విధంగా అనేక ఉపన్యాసాలు ఇచ్చారు. మహాభారత దర్శనం; భాగవత సుధా స్రవంతి; రామకథా పరిమళం; ఉవపనిషచ్ఛంద్రిక; గీతామృతం; వేదసూక్తకౌముది వంటి కార్యక్రమాలలో తన సహకారాన్ని అందించారు. తాను రచించిన ‘కృష్ణరశ్మి’ భావకావ్య ఆవిష్కరణతో పాటు అనేక ప్రముఖుల పుస్తకావిష్కరణ కార్యక్రమాలను జరిపి, వాటిని సమగ్రంగా సభకు పరిచయం చేసేవారు.

చైతన్యావర్తనం: 1965 లో ఏర్పడిన దిగంబర కవులకు ధీటుగా చేతనావర్త కవుల హృదయ ప్రకంపనగా కవిత్వాన్ని ప్రకటించిన నలుగురు ప్రముఖ కవులు సుప్రసన్న, పేర్వారం జగన్నాథ, సంపత్ కుమార్, వే, నరసింహారెడ్డి గారు. 1967 లో, 1970 లో, 1992 లో సంపుటులు వెలువరించింది. భూమిక ఒకటే అయినా, అభివ్యక్తి, నిర్మాణశక్తి, శిల్ప, వాస్తు, భాషా ప్రయోగ దృష్టిలో ఆత్మాశ్రయ మార్గమే ఉత్తమం అంటూ, సమగ్ర మానవ వికాస ధ్యేయంతో బాధ్యతతో పనిచేసి విమర్శకుల ప్రశంసలు పొందింది.

పదవీ విరమణ తరువాత ‘విశ్వేశ్వర సంస్కృతాంధ్ర కళాశాల’ కార్యదర్శిగా ఉంటూ అనేక సాహిత్య సదస్సులు నిర్వహించారు.

అవధానం: 1973లో 37 సం. ల వయసులో ఉగాది రోజు పడిశాల వీరభద్రయ్య కాలేజీలో సుప్రసన్న గారు మొదటిసారి అవధానం చేశారు. తరువాత కరీంనగర్, వేములవాడ, ములుగు, ఘన్‌పూర్, హనుమకొండ తదితర ప్రాంతాలలో సుమారు 60-70 అవధానాలు చేశారు.

వర్ణనలో అంతా స్త్రీ మయం అనే అంశానికి తాత్త్విక మనోహరమైన పూరణ ఇలా..

పుడమి బుట్టె సీత, పొలిచిరి అచ్చరల్
 జలములందు, అగ్ని సంపుటమున
 యజన సేని, వాయువండుల వాగ్దేవి
 ఆకాశమున బుట్టె నాత్మ వనిత”

వరంగల్ లో తొలి ప్రపంచ తెలుగు మహా సభల సమావేశ నేపథ్యములో అష్టావధానం చేసిన సుప్రసన్నగారు మాజీ ప్రధాని శ్రీ పి.వి.నరసింహారావుగారు శ్రోతగా వచ్చి కూర్చుండగా డా. లక్ష్మణ మూర్తి గారు “స్తంభాగ్రంబున కూర్చుండుటకు గద్దా పెద్ద వైనావటే” అని సమస్యను ఇవ్వగా ఎంతో ఆహ్లాదకరమైన విధంగా సుప్రసన్నగారు పూరించడం చూసిన పి.వి. గారు ప్రశంసించారు. సన్మానము కూడా జరిగినది.

ఆకాశవాణి వరంగల్‌తో అనేక సంవత్సరాల అనుబంధము: ‘అరవిందుల సావిత్రి’ వంటి అపురూప ప్రసంగాలు; కవి సమ్మేళనాలు; ప్రత్యేక టాక్ షో లు; ప్రయోగాత్మకంగా రేడియో మాధ్యమం గా ఫోన్-ఇన్ అవధానం నిర్వహణ; కార్యక్రమాల ప్రణాళికకి సంబంధించి కూడా అనేక అమూల్య సలహాలూ, సూచనలూ ఇచ్చారు. ఆకాశవాణిలో ప్రసారమైన కాకతీయుల చరిత్ర, సాహిత్యం, కళలు వంటి ఓరుగల్లుకి చెందిన 19 సాహిత్య ప్రసంగాలను “ఏకశిలా సాహిత్య సౌందర్యము” సంకలనంగా రూపుదిద్దుకోవడములో ప్రధాన సంపాదక పాత్ర వహించారు శ్రీ సుప్రసన్నగారు. ప్రముఖ సాహితీవేత్తల కృషిని రికార్డు చేసే ప్రయత్నంలో శ్రీ గిరిజా మనోహరబాబు గారు పరిచయకర్తగా సుప్రసన్నగారితో ఎంతో లోతైన సాహిత్య అంశాలు చర్చించారు.

వరంగల్ రేడియో కేంద్రం తరఫున 13-01-2025 భోగి పండుగ రోజు వారి చిన్న కూతురు డా. శ్రీలత గారి ఇంట్లో గురువుగారిని ఇంటర్వ్యూ చేయాలి అనుకున్నప్పుడు అయిలయ్య గారి పేరు ప్రతిపాదించారు. ఆ ఇంటర్వ్యూలో 1953లో తాను రాసిన తొలి కవితను వినిపించడంతో మొదలుపెట్టుకొని 75 ఏళ్ల సామాజిక, రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక అంశాలను జోడిస్తూ ఇంటర్వ్యూ ఇచ్చారు. వ్యక్తిగత జీవితం, సాహిత్య నేపథ్యం, తమ గురువులు, తాము చదివిన స్కూళ్ళు, పుస్తకాలు, ఉస్మానియాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, కాకతీయ విశ్వ విద్యాలయం లో ఉద్యోగం, కవిత్వ్యోద్యమ ఆవిర్భావం, జాతీయత మొదలగు విశేషాలు, ఎంతో ఓపికతో ఇచ్చిన ఇంటర్వ్యూ నాలుగు విభాగాలుగా రేడియో కేంద్రం వారు ప్రసారం చేశారు. వారికి వర్తమాన సమస్యలన్నిటి పట్లా స్పష్టమైన అవగాహన ఉంది.

ఆచార్య సుప్రసన్నగారి రచనలను ప్రచురించిన పత్రికలు: గోలకొండ పత్రిక, స్రవంతి, తెలుగుదేశం, ప్రభాస, జయంతి, ఆంధ్రప్రభ, ఆంధ్రప్రదేశ్, భారతి, జనధర్మ, జ్యోతి, విమర్శిని, జాగృతి, మూసీ, సాధన మొదలైన పత్రికలలో ఇతని రచనలు ప్రచురింపబడ్డాయి.

కళకి దివ్యమూలావశ్యకతను చెప్పినారు. యజనానికి పూర్వం ధ్యాన మావశ్యకమైనట్లు తద్భావనాభావితంగా కళాసృష్టికి పూనుకోవాలి. ఆ కళారూపం తానై పరిణమించాలని వ్యాఖ్యానిస్తూ, కళారూపాలు ప్రతీకలో, స్ఫురణలో, సంకేతాలో అవుతాయని, దర్శనం ‘ఋతజాత’మై భద్రంకరమై ఉంటుందని వివరించినారు. సంప్రదాయపరమైన అనుస్యూతినీ కాలానుగతమైన విపరిణామాన్నీ ఇట్లా వ్యక్తం చేసినారు: “ఒక మహావృక్షం యుగయుగాలుగా అలాగే ఉన్నట్లు కన్పించినా మూలం తప్ప ప్రతీదీ మారిపోతున్నది. స్కంధము, శాఖలు, పత్త్ర పుష్పాలు అన్నీ. ఈ జీవంతమైన సంప్రదాయం క్రొత్త దర్శనానికి కారణమౌతున్నది. ప్రతియుగం సత్యాన్ని కొత్త సౌందర్యంతో ఆవిష్కరించుకొని మరల మరల ‘శివ’ శిఖరం వైపుగా అధిరోహింపజేస్తున్నది. దీన్నే మరింత స్పష్టం చేస్తూ నిత్య పరివర్తన శీలమైన ఈ సంప్రదాయం పాతబడిన ఆకులను బెరడులను పుష్పాదులను పరిత్యజిస్తుంది. మృత్యులక్షణాలను తొలగించుకొని ప్రాణోద్విగ్నవసంత లక్షణాలతో ప్రకాశిస్తుంది. కవి తన అనుభవాన్ని ధ్యానించి, మనోమయంగా సర్వాంగీణంగా భావించి, అలంకారాది సామగ్రితో అభివ్యక్తీకరించి కావ్యంగా ఆవిష్కరిస్తాడు. కావ్యాన్ని అభివ్యక్తి సామగ్రీ పరిశీలనమారంభంగా అలంకారాదులను వివేచించి మనోమయ విషయభావన చేసి ధ్యానావస్థిత తద్గత మనస్కుడై కవి హృదయాన్నావిష్కరించుకొని సహృదయుడు ఆనందాన్ని అనుభవిస్తాడు. ఈ రహస్యజ్ఞత స్ఫురన్మనీషా లక్షణంగా గోచరిస్తుంది.

అవిరోధమన్నది సుప్రసన్న ప్రధానలక్షణము. సర్వతత్త్వములతో సర్వమార్గాలతో అవిరోధం సుప్రసన్న జీవనంలో మార్గదర్శనం చేసింది. అందువల్ల ఏ వస్తువును గురించి రాసినా ఈ సమన్వయమే దర్శనమయింది. ఈ వెలుగు ఆధారం చేసుకుని సుప్రసన్న సాహిత్యం మొత్తం నిర్మాణమయింది.సాహిత్య విమర్శ నిర్మాణం జరిగింది. సుప్రసన్న సాహిత్యక్షేత్రమంతా ఆధ్యాత్మిక ధారాపరిప్లుతమే. జీవితలక్ష్యాన్ని అన్వేషించే సాధనంగా సాహిత్యాన్ని భావించారు.తనపై ప్రభావం చూపిన వివిధ సంప్రదాయాలను వాటి పరిమితులనూ, అవి జీవిత దర్శనంలో ఒకదశలో చేసిన మేలునూ తన వ్యాసాల్లో అక్కడక్కడ వివరించినారు. స్వీయ వ్యక్తివికాసాన్ని అరమరికలు లేకుండా చిత్రించినారు. అనుసరణీయ జీవనమార్గాన్ని సుప్రసన్న భావించారు:

మానవుడి జీవనం సర్వజీవుల జీవనంతో విశ్వము వ్యవహరించే అనంతకాల ప్రవృత్తిలోని ‘లయ’తో అనుబద్ధమైనది. ఈ జీవనం, జీవుని జడప్రవృత్తి నుంచీ ఆనందమయమైన, దేశకాలాతీతమైన దివ్యత్వం వైపుగా సాగే అనంతమైన ప్రయాణం. ఈ ప్రయాణంలో ఈ బ్రతుకు ఒక మజిలీ. ఇక్కడ జీవుడు తన కర్మ అంతా తన అనంతప్రయాణ లక్ష్యానికి అనుగుణంగా తీర్చిదిద్దుకోవలసి ఉన్నది. అయితే మన జన్మభూమి భోగభూమి కాదు. కర్మభూమి. ఈశ్వరమయమైన ఈ జగత్తులో అంతా సమాజానికే సమర్పించి తరువాత మిగిలిన దానిని తాను అనుభవించాలి. ధర్మము యదభిముఖముగా చెప్పబడినదో అది తదభిముఖముగా వ్యాఖ్యానింపబడాలి. లేక అపముఖముగా చూస్తే ఈ సర్వధర్మమూ దోష సంకులముగా కానవస్తుంది.

ఆధునికంగా భారతీయ సాహిత్యాన్ని భిన్నసంస్కృతి ప్రమాణాలతో విశ్లేషించి దానికి న్యూనత నాపాదించే పద్ధతికి ప్రచారం విశేషంగా ఉన్నది. సంప్రదాయంతో ప్రాప్తించిన అత్యుదాత్తమైన విలువల్ని విస్మరించడం లేదా వ్యంగ్యంగా వక్రీకరించడం వలన సాధించేదేమీ లేదు. దశలక్షణ యుక్తమైన ధర్మాన్ని సంకుచితపరిధిలో నిర్వచింపలేదు. దాన్ని ‘సార్వభౌమం’ అనే అన్నారు. దేశకాలాదులతో పరిచ్ఛిన్నం కాని యమ నియమాలను పతంజలి ‘సార్వభౌమం మహావ్రతమ్‌’ అని పేర్కొన్నాడు.

అష్టాదశ శక్తిపీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టోత్తర శత దివ్యక్షేత్రాలు, భిన్న ప్రకృతులూ ఉన్న మణి ద్వీపమే భారతదేశము. తన మాతృభూమిని జగన్మాతగా దర్శిస్తూ..

అఖిల జగముల కాటపట్టైన నిన్ను/ అఖిల జగముల నేది కాదైన నిన్ను
ఎటుల కొల్చుటరెద నిల్పుటెటుల సర్వ / వియదనంత సమావేశ వృక్షమూర్తి
అఖిలమున కాది మూలమైనట్టి నీవు / అంతమున పరిణతి సహస్రారమగుచు
మణిద్వీపమున రాజ్ఞివౌచు నిలుతు/ గుండెలో సూక్ష్మ షట్పద గుప్తమూర్తి”

బీజంలో జడంగా నిద్రిస్తున్న చైతన్యమూర్తి, అంకురమై, మొలకై, చెట్టై, వృక్షమై విశ్వంగా పరిణామం పొందింది.

“నేను జీవాన్ని, వృక్షాన్ని, ఫలాన్ని, రసాన్ని/ నేను ఆవర్తాన్ని, బుద్బుదాన్ని, తరంగాన్ని
తథాగతము,తథాదృష్టము, తథాభావితము /నిత్యభావం కనిన స్వప్నము, అర్థరాత్రి గర్భంలో పగలు
ఆ తామసీ గర్భంలోనుంచి ఉషశ్శిశువు జన్మనెత్తింది/ గింజ మట్టిని చీల్చేవేళ ఊపిరినంతా బిగగట్టి
పైకి పొడ్చుకువచ్చి ఒకసారి తన్నుతాను ప్రకటించుకునే క్షణం/చివురు విచ్చుకునే వేళ, మొగ్గ కనబడే వేళ/ వినబడని మట్టి మూలుగు ఆ లిప్త విశ్వచైతన్య సంవేదన..
అవ్యక్త బీజంలోనుంచి / నిర్గమించిన అశ్వత్థ వృక్షం జీవ కిసలయితమై
ఆకాశాన్ని కప్పివేసింది స్వర్గపు తొలి మొలక తాను / స్కంధంలో ఎన్ని ఎన్ని ప్రాణరహస్య కోటరాలు”

ఎంతో తాత్విక దృష్టితో యౌగిక జీవనం గడుపుతూ అనేకమైన మహాకావ్యాలను వెలువరించిన వ్యక్తి భౌతిక జీవనంలో ఆటుపోటులను ఎలా ఎదుర్కొంటారు అని పరీక్షించాలని అనుకున్నాడేమో భగవంతుడు వారికి కష్టాలు కెరటాల లాగా రావటం మొదలుపెట్టింది. వారి పెద్ద కుమారుడు కోవెల శ్రీనివాస్ గారు (2008); తరలిపోవడంతో ఆ దంపతులు శారీరకంగా, మానసికంగా క్రుంగిపోయారు. సుప్రసన్నగారు దుఃఖముతో అంతర్ముఖులై ‘మణికర్ణిక’గా రూపుదాల్చారు. చిన్నాన్న సంపత్ కుమార్ గారు (2010) లో కైవల్యము పొందారు. సుప్రసన్న గారి ధర్మపత్ని శారదమ్మ గారు మాత్రం కోలుకోలేక (2011)లో తనువు వీడారు.ఆ శోకము ‘అశ్రుభోగ’ కావ్యముగా రూపు దిద్దుకొంది. ఇవి చాలక చిన్న కూతురు భర్త అంటే చిన్న అల్లుడు వీరందరి అకాలమరణం వారి మనోధైర్యాన్ని దెబ్బతీసింది. సాగర కెరటాలు ముంచెత్తుతుంటే మునిగిపోకుండా ఎలా లేవగలరా? అని అందరూ కాలానికే వదిలివేశారు. మంచి-చెడు, కష్టం-సుఖం, దుఃఖం-ఆనందం ఈ ద్వంద్వాలు జీవితంలో తప్పనిసరి రెండింటిని అనివార్యంగా ఆహ్వానించవలసినదే! అని ఒక సభలో చేసిన తాత్విక ప్రసంగం దుఃఖ భాజనులైన ప్రతి వ్యక్తికి కూడా ఆలోచింపజేసి సంఘటనను మూడవ వ్యక్తిగా చూస్తూ ఉండడం వలన దుఃఖం యొక్క గాఢత తగ్గుతుంది అని భావించారేమో?

మృత్యువును దర్శించే తీరును ఆయన రచనలు ‘మణికర్ణిక’, ‘అశ్రుభోగ’, ‘పరిక్రమ’(2013) ఈ కవితా సంపుటాలలో మనకు స్పష్టంగా కనబడతాయి.

తల్లి యెరుగును తొల్త, తల్లి తొలగు
చెలి ఎరుంగును, పిమ్మట చెలి తొలగును
సంతతి పొసంగు, దూరమై సంతు తొలగు
 ఏమి మిగులును, బ్రతుకునకెప్పుడైన” (పరిక్రమ)

ఈ కావ్యాలు వ్యక్తిగత విషాదాలు మాత్రమే కాదు. ప్రపంచంలో దుఃఖం అంటే ఏమిటో తెలుస్తుంది.

అపరిమిత దుఃఖము కంటి చూపు మందగించింది. సుప్రసన్నగారి రచనావిధానము వారి రచనకూ, వ్యక్తిత్వానికీ అబేధము. నిరంతర గంగా ప్రవాహము. కానీ భౌతికంగా రాయలేని స్థితి. ధారగా వచ్చ్చే పద్యాన్ని వారి అనుంగు శిష్యుడు డాక్టర్ పాతూరి రఘురామయ్య ఒడిసి పట్టుకొని అక్షరీకరించారు. ఇలా మూడు కావ్యాలు వ్రాయబడ్డాయి. “శ్రీ సీతారామ కథాసుధ, శ్రీకృష్ణ శరణం మమ, వనవాస రాఘవము” ఇవి మూడు కావ్యాలు కావు. మూడింటిని కలిపి ఒకే కావ్యంగా చదువుకోవాలని” సుప్రసన్నగారి శిష్యులు డా.కె.వి.రాఘవన్ అంటారు.

2020 నుంచి గ్లకోమా రూపంలో మెల్లమెల్లగా చీకట్లు అలముకుంటూ 2022 నాటికి పూర్తిగా చూపు పోయింది. అంతర్ముఖులైన వారికి అంతరంగపు జ్యోతియే ఆధారముగా మసలుతున్నవేళ భాషాభిమాని, సాహిత్యాభిమాని, భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు దేవి నవరాత్రులలో సాయం సంధ్యా వేళలో, తెలంగాణ సారస్వత పరిషత్‌లో తన చిన్ననాటి గురువుని స్మరించుకుంటూ డా. కోవెల సుప్రసన్నాచార్యులవారిని సగౌరవంగా అనేకమంది ఆహూతుల మధ్య ఘనంగా సత్కరించుకోవడం అనేది వారిలోనున్న శారదామాతకే ఆ సత్కారములు.

ఆ సందర్భంగా వ్యాసకర్త చివుకుల శ్రీలక్ష్మి తాను 116 మంది ప్రముఖ రచయితలతో భారతమాత చరిత్రను వచన కవితల రూపములో వ్రాయించి, సంకలనము చేసిన ‘ఆది నుండీ.. అనంతం దాకా..’ పుస్తకము ఉపరాష్ట్రపతి వారికి ఇవ్వడంతో పాటు డా. సుప్రసన్నాచార్యుల వారి చేతికి అందించడము వారి ఆశీస్సులు అందుకొనడం జరిగింది.

వానప్రస్తము: సుప్రసన్నగారి రెండవ కుమారుడు సంతోష్ కుమార్ పాత్రికేయుడు. ‘స్వాధ్యాయ’ అనే యూట్యూబ్ చానల్ నడుపుతున్నారు.. ఇతను రాసిన ‘దేవరహస్యం’ గ్రంథం తెలుగు నాట ప్రాచుర్యం పొందిన పుస్తకం.

‘దేవరహస్యం’ పుస్తకావిష్కరణ 2014

సుప్రసన్నగారు కుమారుడు సంతోష్, మనుమడు అనిరుధ్ వద్ద ఉంటున్నారు. వారిని చూసినట్లయితే ఒక వాల్మీకి మహర్షి, ఒక వేదవ్యాసుడు వారు రాసిన గ్రంథాలను విద్యార్థులు పఠిస్తూంటే, ఆనందిస్తూ, వారు చదువుతున్నప్పుడు పఠనదోషాలు సవరిస్తూ, భావం అర్థం చేసుకోవడంలో గాని, అందలి తాత్విక భావనలు విడమరిచి చెప్పడంలో గాని పరవశం పొందుతూ, ఒక తాపసిగా వానప్రస్త ఆశ్రమంలో ఉంటున్నారేమో అనే భావన మనలో కలుగుతుంది‌.

వరంగల్లులో కేంద్ర సాహిత్య అకాడమీ తరఫున 4 కార్యక్రమాలు చేశారు. “తెలంగాణా ఉద్యమ సాహిత్యం” పై ఒక రోజు సదస్సు; అందులో 90 సం. ల వయసు గల సుప్రసన్నాచార్యులు ఒక గంటసేపు ‘తెలుగు సాహిత్య విమర్శ’కు తను రాసిన 15/20 గ్రంథాలు, తన సేవ గురించి మాట్లాడారు. అలాగే భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవనం, విశ్వనాథ మహా భారతం, మొదలైన విమర్శ వ్యాసాలలో తను ప్రతిపాదించిన నూతన అంశాలను అందరికీ తెలియ జేశారు. తరువాత తన వద్ద మొదటి పి.హెచ్.డి. పట్టాను పొందిన డా.జి.వి.రత్నం రాసిన “మహా భారతం- విజ్ఞాన సర్వస్వం” గ్రంథాన్ని ఆవిష్కరించారు.

ఇంతసేపూ కదులుతూ ఉన్న క్షణాలు / ఇక్కడ గడ్డ కట్టినయ్
మనసు ఎదుటనే మేల్కొన్నది క్షీర సముద్ర ఖండం
నైశ్చల్యం పొంగినట్లు, అనాహాటం మ్రోగినట్లు
అవ్యక్త భవిష్యజ్జీవనం అంతటా పొదువుకున్నట్లు..”

జీవితాన్నే ఒక యోగ్యంగా భావించిన శ్రీ సుప్రసన్నగారిని ఒక యోగిగా దర్శించి, వారి సాహిత్యాన్నీ అధ్యయనం చేయాలి.

భాష పట్ల, సంస్కృతి పట్ల వారికి గల అపేక్ష ఈ నాలుగు మాటల్లో..

ప్రతి రక్తపు బిందువున పగులబడు నావేశ
మిదె తెన్గుజాతి తన యెదయెల్లవిచ్చినది
నా జాతి విశ్వనీరద చంచలాలతిక
నా భాష జీవ సంతాన సత్య పతాక”

తెలుగు అక్షరానికీ, తెలుగు సంస్కృతికీ మూర్తీభవించిన రూపమే సుప్రసన్నులు.

నడిచే నిఘంటువు, వారి సాహిత్య సంపద, వారి అనుభవమూ తరతరాలకూ మార్గదర్శకం.

జ్ఞానపీఠ్ పురస్కారం వారి కీర్తి కిరీటములో వెలుగులీనాలని కోరుకుంటున్న తెలుగు ప్రజ.

🙏

Exit mobile version