[శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు నిర్వహిస్తున్న ‘వందే గురు పరంపరామ్’ అన్న శీర్షికని ధారావాహికగా అందిస్తున్నాము. ఈ నెల ప్రముఖ కర్ణాటక గాత్ర విద్వాంసురాలు, సంగీత దర్శకురాలు, గురువు, స్వరకర్త డా. గుమ్మలూరి శారదా సుబ్రహ్మణ్యం గారిని పరిచయం చేస్తున్నారు రచయిత్రి.]
1. పరిచయం:
డా. గుమ్మలూరి శారదా సుబ్రహ్మణ్యం ప్రముఖ కర్ణాటక గాత్ర విద్వాంసురాలు, సంగీత దర్శకురాలు, గురువు, స్వరకర్త ఆకాశవాణి & దూరదర్శన్ ‘ఏ’ గ్రేడ్ కళాకారిణి, బహుముఖ ప్రజ్ఞాశాలి.
భారతీయ సంగీత రంగానికే వన్నె తెచ్చిన సమున్నత కళా శిఖరం – డా. జి. శారద గారు. గురువుల ఆశీస్సులు, అకుంఠిత దీక్ష, మరియు కళ పట్ల అపారమైన ప్రేమతో ఆమె సాధించిన ఉన్నతి, నేటి కళాకారులందరికీ ఒక ఆదర్శప్రాయమైన మార్గదర్శకంగా నిలుస్తుంది.
1985 నుండి 2026 వరకూ అంచెలంచెలుగా ‘బాల శారద’ కర్ణాటక సంగీతములో అత్యున్నత స్థాయిని ఎలా చేరుకున్నారో తెలుసుకోవడమే ఈనాటి వ్యాసము ముఖ్య ఉద్దేశము.
2. వారసత్వము
డా. శారదా సుబ్రహ్మణ్యంగారి పితామహులు శ్రీ ఇంద్రగంటి లక్ష్మీనారాయణ, శ్రీమతి అన్నపూర్ణమ్మ. అతను ఎలమంచిలి దగ్గర పెనుగొల్లు ధర్మవరం గ్రామంలో పోస్టుమాస్టర్‌గా పనిచేస్తూ, ఆ ఊరిలో ‘రామదాసు’గా పేరు ప్రఖ్యాతులు పొంది, దైవాన్ని అనేకసార్లు దర్శించిన మహానుభావులు. శారద గారు పుట్టకముందే వారి తాతగారు పరమపదించారు. పుట్టిన సంవత్సరంలో వారి నాయనమ్మ కూడా వెళ్లిపోయారు. అందువలన వారి గురించి ఆమెకు తెలీదు.
పెద్దలు చెప్పడం ద్వారా విన్న శారదగారు తాత, నాయనమ్మ గురించి ఇలా చెప్పారు. “వారు సప్తాహాలు, సప్తసప్తాహాలు చేసేవారు. సప్తాహము అంటే ఏడు రోజులు రాత్రి పగలు నిరంతరంగా పూజలు, పాటలు, భజనలు, జరుగుతాయి. అంటే చుట్టుపక్కల గ్రామాల వారందరూ వచ్చి రాత్రంతా ఉండి, పాటలు పాడి, భోజనాలు చేసి వారం రోజులు పాటు అన్ని కార్యక్రమాలు చేసేవారు. అప్పుడు వారికి పెద్దగా డబ్బులు లేకపోయినా, గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల వారంతా కూడా కలిసి చాలా చక్కగా శ్రీరామునికి సంబంధించిన పూజలు, నివేదనలు నిర్విఘ్నంగా జరిగిపోతూ ఉండేవి. పొలాల్లో పండిన పంటలు ప్రతి పంటను తీసుకొని వచ్చి ఇక్కడ అందించేవారు. అలా నిర్విరామంగా రామకార్యం జరుగుతూనే ఉండేది. రామ భక్తికి ప్రతీకలుగా మామ్మగారు తాతగారు ఆ గ్రామంలో ఉండేవారు. ఇప్పటికీ వారి పేరు చెబితే అందరూ చేతులెత్తి దండం పెడతారు. అలాంటి వంశంలో మేము జన్మించడం మాకు అదృష్టం.”
“మా తాతగారికి ముగ్గురు మగపిల్లలు. పెద్దనాన్న కూడా పోస్ట్ మాస్టరుగానే పనిచేసేవారు. రెండవవారు, మరియు మా (శారదగారి) నాన్నగారు రైల్వేలో జాబ్ చేస్తూ ఉండేవారు. తండ్రి జననానికి ముందు వీరు ఉన్న గ్రామానికి దగ్గరలో గల ఉప్మాక వేంకటేశ్వరస్వామి నాయనమ్మకు కలలో కనబడి, పుట్టబోయే బిడ్డకు తన పేరుపెట్టమని మాట తీసుకున్నారట. అందువలన శారదగారి నాన్నగారికి ‘ఇంద్రగంటి వెంకట లక్ష్మణశాస్త్రి’ అని పేరుపెట్టారుట. అతను ‘రామభక్తి సామ్రాజ్యం‘ అనే పుస్తకం రాశారు. అందులో తాతగారి గురించి వివరాలన్నీ చాలా చక్కగా రాశారు.” అని చెప్పారు.
తన తండ్రి అయిన ఇంద్రగంటి వెంకట లక్ష్మణ శాస్త్రి (ఐ.వి.ఎల్.శాస్త్రి) గురించి చెపుతూ ఇలా అన్నారు. “ఆ రోజులలో తక్కువ డబ్బులు, పెద్ద కుటుంబాలు, ఇతరులు తనకు ఏదో చేయాలని ఆశించకుండా, తాను ఏది ఇతరులకు చేయగలరో, అది చేసుకుంటూ వెళ్లిపోయేవారు. కుటుంబ సభ్యులకు గానీ, మిత్రులకు గాని, శిష్యులకు గాని ఎవరికి ఏ సహాయము అవసరమైన అది దైవానికి చేస్తున్నట్టుగా భావించుకుంటూ ఆ కార్యక్రమాలను నిర్వహించేవారు.”
ఇతరులను ఆర్థిక సహాయం అడగకుండా ఏ విధంగా నిర్వహించేవారు అనే విషయం పైన ఇతనిని అతి దగ్గరగా పరిశీలించిన శ్రీమతి శారద గారి భర్త సుబ్రహ్మణ్యం గారు ఒక దగ్గర ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ విషయములో ఉదాహరణ ఇవ్వవలసి వచ్చినప్పుడు అతను ఈ విధంగా చెప్పారు. “కుటుంబంలో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ విషయంలో ఇతరులపై ఆధారపడకుండా బ్రతకడమెలా? అంటే మా మామగారు నాకు ఆదర్శము.” అని చెప్పిన అల్లుడు ఉండడం కూడా అతనికి భగవంతుని కృపగానే భావిస్తారు ఆయన.
3.బాల్యం & సంగీత ప్రారంభం:
శారదగారు గొప్ప సంగీత కుటుంబ వారసత్వానికి చెందినవారు. ఆమె తండ్రి కులపతి శ్రీ ఐ.వి.ఎల్. శాస్త్రి గారు మరియు తల్లి శ్రీమతి సీతారామాంజనేయమ్మ గారికి నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. సరస్వతీ దేవి తన 4 అంశలనూ నలుగురు కుమార్తెలుగా పంపి ఉంటారేమో అనిపిస్తుంది.
కుటుంబసభ్యులు:
సంగీత కుటుంబమైన ఇంద్రగంటి వారి ఇంట్లో, పెద్ద అక్క – మంగళంపల్లి అన్నపూర్ణ; గాత్రము, వయొలినులలో డిప్లమో చేశారు.అనేక పాఠశాలలు, కళాశాలలలో మ్యూజిక్ టీచరుగా పని చేశారు. రెండవ అక్క – లక్ష్మి; బి.ఎ. మ్యూజిక్, గాత్రము, వీణ, హార్మోనీ చాలా చక్కగా వాయిస్తారు. కేంద్రీయ విద్యాలయంలో మ్యూజిక్ టీచరుగా పని చేశారు. అన్నయ్య ఇంద్రగంటి కాళీ ప్రసాద్ – గాత్రము, ఫ్లూట్ వాయిస్తారు. రైల్వేలో మ్యూజిక్ కోటాలో పని చేస్తున్నారు.మూడవ అక్క- సరస్వతీ విద్యార్థి – ఈమె ఇవటూరి విజయేశ్వరరావు గారి దగ్గర సంగీతం నేర్చుకున్నారు. తరువాత కొంతకాలము ‘కళానిధి’ నేదునూరి కృష్ణమూర్తి గారి శిష్యురాలు. ప్రొఫెసర్‌గా ఆంధ్ర విశ్వవిద్యాలయములో సంగీత విభాగానికి శాఖాధిపతిగా ఉన్నారు. శారద గారితో కలిసి ‘విశాఖ సిస్టర్స్’ గా ప్రసిద్ధి. ఐదవ బాలిక – ఈనాటి మన గురువు శారద – 28 ఫిబ్రవరి 1968 న జన్మించారు.
ప్రాథమిక గురువులు: తొలి అడుగులు:
అరంగేట్రము: బాల్య ప్రదర్శనల ప్రస్థానం: అక్షరాభ్యాసము కాకుండానే కాలికి మువ్వలు,. చేతిలో తంబూర పట్టుకున్న అపర శారదా స్వరూపము. శారదగారు తన కళా ప్రదర్శనల ప్రస్థానాన్ని అతి చిన్న వయస్సులోనే అంటే 1972లో కేవలం 5 సంవత్సరాల వయసులోనే వేదికపై ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు. చిన్నతనం నుండే అసాధారణ ప్రతిభను ప్రదర్శించారు. అందువలన ఆమెకు విస్తృతమైన అనుభవం లభించింది. అంతేకాకుండా దశాబ్దాలుగా రంగస్థలంపై తనదైన ముద్రను వేయడానికి, సంగీత పరిపక్వతను సాధించడానికి ఇది ఎంతో దోహదపడింది. ఆమె కంఠం నుండి జాలువారే ప్రతి స్వరం దేవలోక గానంలా, ఆమె పాదాల నుండి పుట్టే ప్రతి నాదం నాట్యబ్రహ్మ తాండవంలా ప్రేక్షకుల హృదయాలను స్పృశించి, వారిని ఆనంద పారవశ్యంలో ముంచెత్తుతుంది.
ఐదు సంవత్సరముల వయసులో సంగీతములో సంగీత కళా సమితి నిర్వహించిన పోటీలలో సబ్- జూనియర్స్ విభాగములో ప్రథమ బహుమతి పొందినప్పటి, గౌన్ వేసుకున్న పాప శారద గారు
శారదగారికి ఇష్టమైన రాగాలు : కళ్యాణి, ఆరభి, రేవతి
1980-90 ప్రాంతములో
యుక్త వయసులో శారదగారు చెన్నై వెళ్ళి సంగీత కచేరీలు చేసేవారు. ఈ కాలంలో ఆమె త్యాగరాజ కృతులు, దీక్షితార్ కృతులు, శ్యామ శాస్త్రి పాటలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
జనవరి 1985 – ‘విశాఖకు కొత్త స్వరం’ శీర్షికతో విశాఖ మ్యూజిక్ అకాడమీ కచేరీలో రాగాలు: తోడి, కల్యాణి, భైరవి. త్యాగరాజ కృతి ‘ఎందరో మహానుభావులు’ రాగాలను పాడి శ్రోతలను అలరించారు. ఆ కార్యక్రమానికి ప్రముఖ సంగీత విద్వాంసులు డా. ఎం.బాలమురళీకృష్ణ గారు ముఖ్య అతిథిగా హాజరై శారద గారిని అభినందించారు.
జూలై 1985. ఆకాశవాణి సంగీత పోటీలు – ఆకాశవాణి కేంద్రం, విశాఖపట్నం కర్ణాటక సంగీతం – బాలికల విభాగం: కుమారి ఇంద్రగంటి శారద గారు ప్రథమ బహుమతి గెలుచుకున్నారు.
తరువాత ‘సంగీత కళానిధి’ డా. నేదునూరి కృష్ణమూర్తి గారి దగ్గర సంగీతం నేర్చుకుంటూ తన ప్రావీణ్యాన్ని మరింత మెరుగుపరుచుకున్నారు.
డా. శారదా సుబ్రహ్మణ్యం గారు ప్రసిద్ధ భరతనాట్యం గురువులు పసుమర్తి రామ్మూర్తి గారు మరియు కూచిపూడి టేకుమళ్ళ శ్యామల గారి దగ్గర అభ్యసించారు. నృత్యకారిణి కూడా. ఆమె అనేక నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. శారదా దేవి ట్రస్ట్ నుండి సంగీతం కొరకు నటరాజ రామకృష్ణ జాతీయ స్కాలర్షిప్ను రెండు సంవత్సరాలు అందుకున్నారు.
వెనుకనున్నవారు తండ్రి శ్రీ ఐ. వి. ఎల్. శాస్త్రిగారు, కులగురువు శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యులు, అన్నయ్య శ్రీ కాళీ ప్రసాద్ గారు. ముందు పెద్దక్కయ్య మంగళం పల్లి అన్నపూర్ణ, శారద, మరియు అక్క కుమారుడు మరియు శారద చేసిన నాట్య ప్రదర్శన.
విశాఖ సిస్టర్స్:
వీరి మూడవ అక్క సరస్వతీ విద్యార్థి. వీరిరువురు చాలా చిన్న వయసులోనే అంటే సుమారు ఐదు సంవత్సరాల వయసులోనే వేదికల పైన కూచిపూడి నాట్యం చేసేవారు. ‘విశాఖ సిస్టర్స్’ గా పేరుపొంది, వేదికల పైన సంగీత కచేరీలు కూడా చాలా ఎక్కువగా ఇచ్చేవారు. ఇరువురు కూడా బాలల అకాడమీ విజేతలుగా చిన్ననాడే పురస్కారాలు అందుకున్నారు రైల్వేలో వీరి నాన్నగారు పని చేయటం వలన జోనల్ వైజ్‌గా కూడా పోటీలు ఉంటూ ఉండేవి. అందువలన ఖరగ్‌పూర్, కలకత్తా మొదలైన చోట ఫైనల్స్ జరుగుతూ ఉండేవి. విశాఖ సిస్టర్స్ అన్నింటికీ వెళ్లి ప్రథమ బహుమతులు తెచ్చుకొని వచ్చేవారు.
విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ప్రారంభించబడి దాని ప్రారంభోత్సవానికి ఎంతో మంది కేంద్ర మంత్రులు ప్రముఖులు వచ్చిన సందర్భంలో వీరిద్దరూ శ్రీ సరస్వతి నృత్య కళా నికేతన్ అనే బేనరు పైన నాట్య ప్రదర్శన చేయడం అనేది ఎంతో ఒక చక్కని అవకాశంగా అందరి ప్రశంసలను ఆశీస్సులను పొందారు.
1990 నుండి వీరు విశాఖ సిస్టర్స్‌గా విశాఖపట్నం ప్రాంతానికి మాత్రమే పరిమితం కాలేదు చెన్నై, బొంబాయి, హైదరాబాద్, తిరుపతి అలా ఎక్కడ అవకాశం వచ్చినా కూడా వాళ్లు వెళ్లి ప్రదర్శన ఇచ్చి వచ్చేవారు.
రోలింగ్ కప్: 1987 సం. బి.వి.కె. కళాశాలలో బి.ఎ. 2వ సంవత్సరం చదువుతున్నపుడు అమలాపురంలో జరిగిన శాస్త్రీయ సంగీత పోటీలో రోలింగ్ కప్ గెలుచుకున్నారు. గత మూడు సంవత్సరాలుగా వరుసగా ప్రథమ బహుమతి విజేత గెలిచినందుకు కళాశాలకు రోలింగ్ కప్ లభించింది.
జాతీయ స్థాయి పోటీలలో విజయాలు: శారదగారి అసాధారణ ప్రతిభ అనేక ప్రతిష్ఠాత్మక జాతీయ పోటీల ద్వారా గుర్తింపు పొందింది:
1988 లో ఔరంగాబాద్ యూనివర్సిటీ, అఖోలాలో జరిగిన జాతీయస్థాయి అంతర్ విశ్వవిద్యాలయ యువజనోత్సవాలలో 42 విశ్వవిద్యాలయాలు పాల్గొన్నాయి. ఆంధ్రా యూనివర్సిటీ: హిందుస్థానీ, కర్ణాటక సంగీతాలను ఒకే వేదికపై నుండి నిర్వహించిన పోటీలో నృత్య, సంగీత విభాగాల్లో ప్రతిష్టను నిలుపుకుంది. కుమారి ఇంద్రగంటి శారద, బి.వి.కె. కళాశాల విద్యార్థిని కర్ణాటక సంగీతంలో – ప్రథమ బహుమతి+ స్వర్ణ పతకం అందుకున్నారు. కుమారి సి. సంధ్యశ్రీ, N.V.P. కళాశాల – భరతనాట్యంలో – ప్రథమ బహుమతి + స్వర్ణపతకం అందుకున్నారు. అకోలాలో జరిగిన ఈ పోటీలో భారతదేశం నలుమూల నుండి వచ్చిన 42 విశ్వవిద్యాలయాలతో పోటీపడి ప్రథమ బహుమతి మరియు బంగారు పతకాన్ని సాధించారు. దీనితో అంతర్జాతీయ యూత్ ఫెస్టివల్ లకు ఎంపికయ్యే అర్హతను కూడా పొందారు.
ఫోటో: తంబూరాతో కూర్చున్న శారద నృత్యం చేస్తున్న సంధ్యశ్రీ
ఆకాశవాణి పోటీ– 1990 లో సంగీత కళా సమితి ఆధ్వర్యంలో అంజనేయస్వామి టెంపుల్లో జరిగిన కచేరీలో కళాకారిణి ఇంద్రగంటి శారద జాతీయ స్థాయి AIR పోటీలకు వరుసగా 3వ సారి జోనల్ లెవెల్ కి ఎంపికయ్యారు. కర్ణాటక సంగీత గానంలో విజేతగా నిలిచి, గ్రేడెడ్ ఆకాశవాణి మరియు దూరదర్శన్ కళాకారిణిగా గుర్తింపు పొందారు.
1990 లో వచ్చిన జాతీయ స్థాయి విజయం – గాన వి’శారద’కు స్వర్ణపతకం. నవ్యనాటక సమితి త్యాగరాజ గానసభ వారు నిర్వహించిన అఖిలభారత సంగీత పోటీలు ‘SPIRIT OF FREEDOM TALENT CONTEST’ కర్ణాటక గాత్రం సీనియర్ విభాగంలో కుమారి ఇంద్రగంటి శారదకు ప్రథమ బహుమతి + బంగారు పతకం లభించింది
1991 SCZCC/నాగ్‌పూర్ పోటీ – ఉడిపి మరియు ఇండోర్‌లో జరిగిన జాతీయ స్థాయి పోటీలలో ప్రథమ బహుమతి సాధించారు.
సెప్టెంబర్ 1991: యువశక్తి ఛారిటబుల్ ట్రస్ట్, విశాఖపట్నం వారు యువతలో ప్రతిభను ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం వివిధ రంగాల ప్రతిభా మూర్తులకు సంగీతరత్నాలకు ‘యువ పురస్కారం’ – వైజాగ్ సబ్ జూనియర్ ఛాంబర్ వర్ధమాన సంగీత విద్యాలయ కార్యదర్శి డా.ఆర్.వి.వి. సత్యనారాయణమూర్తి గారు. సెప్టెంబర్ 16, 1991 శారదగారికి అందచేశారు.
1993: ‘సునాదభరితం – విశాఖ సిస్టర్స్ గానం’
జూలై 16, 1993 శుక్రవారం సాయంత్రం కళాభారతిలో విశాఖ మ్యూజిక్ అకాడమీ ఏర్పాటు చేసిన ‘విశాఖ సిస్టర్స్’ గాత్ర సంగీత యుగళ కచేరీ ‘విశాఖ సిస్టర్స్’ శ్రీమతి కె.నరస్వతి విద్యార్థి, కుమారి ఇంద్రగంటి శారద సోదరీమణులు గాత్ర కచేరీతో శ్రోతలను అలరించారు. అంటే ఇది సోదరీమణుల జుగల్బంది.
ప్రారంభం: ‘వాతాపి గణపతి’ – హంసధ్వని రాగం ప్రధానం: కాంభోజి రాగం – నరస్వతి గారు సాగించగా, కుమారి ఇంద్రగంటి శారద గారు కూడా కలిసి త్యాగరాజ కృతిని చక్కని స్వరకల్పనతో వినిపించారు. ‘సంగీత జనకులం’లో కలిసి పెరిగిన అక్క చెల్లెళ్లు సరస్వతి, శారద చిన్నతనం నుండి కలిసి సాధన చేసిన ఫలితం ఆ రోజు ‘సునాదభరితంగా’ వినిపించింది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల కృతులతో జాతీయ సమైక్యతను ప్రతిబింబించారు. ప్రత్యేకంగా కాంభోజి రాగంలో ఇద్దరూ కలిసి చేసిన స్వరకల్పన శ్రోతలకు మరపురాని అనుభూతిని ఇచ్చింది. తాత్విక కోణం: ‘సంగీతం కుటుంబ బంధం’ – గురువు తండ్రి, సహ కళాకారిణి అక్క. ఇదే ఇంద్రగంటి కుటుంబ సంగీత సంప్రదాయం. సునాదభరితంగా సాగడమే కాక జాతీయ సమైక్యతను ప్రతిబింబించాయి.
పాడిన ఇతర భాషా కృతులు:
కుంతలవరాళి: ‘భోగేంద్ర శయనం’
మిశ్ర శివరంజనిరాగం- ఎన్నవి పారినాళం- తమిళ కృతి;
భుజంగిడి రాగం: ‘ఎదుటనున్నాడు అన్నమయ్య’ తెలుగు;
స్వాతి తిరునాళ్ మహారాజు రచించిన ‘ధనశ్రీ రాగ తిల్లానా’ తో ముగింపు.
విద్య
జననం: 1968, విశాఖపట్నం. సంగీత కుటుంబం గురువు: తండ్రి శ్రీ I.V.L.శాస్త్రి – సంగీతకారుడు, మృదంగ విద్వాంసుడు, వేణువు వాదకుడు. తల్లి సీతారాంజనేయమ్మ తొలి గురువులు. శారద గారు బాల్యము నుండి మూడవ తరగతి వరకూ ఎక్కిరాల కృష్ణమాచార్యులు స్థాపించిన “జనకులం” లో చదువుకున్నారు.
తరువాత 4, 5 తరగతులు డైమండ్ పార్క్ వద్ద గల మ్యున్సిపల్ పాఠశాలలో చదువుకున్నారు. 6 నుండి 10 వరకు గవర్నమెంట్ హైస్కూల్, రైల్వే కాలనీలో చదివారు.
అనంతరం ఇంటర్మీడియట్ పూర్తి చేసి, బి.ఎ. డిగ్రీలో సంగీతాన్ని ప్రధాన సబ్జెక్టుగా తీసుకుని ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణులయ్యారు.
M.A. సంగీతం కూడాలో ఆంధ్ర విశ్వ విద్యాలయము నుండి. 1992 కేంద్ర ప్రభుత్వ ప్రతిభా స్కాలర్షిప్లు అందుకుని చదివారు. సంగీతంలో తన అభిరుచికి తగ్గట్టుగా ఎం.ఎ.మ్యూజిక్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలు అయ్యారు.
ఎం. ఎ. పూర్తి చేశాక బి.వి.కె. కాలేజీలో జాబ్ చేస్తూ ఉండేవారు ఆ సమయంలో వీరి నాన్నగారు “మీరు ‘విశాఖ సిస్టర్స్’ పేరు నిలపాలంటే ఇద్దరు ఒకేచోట ఉండవలసిన అవసరం ఉంటుంది. కనుక ఆడపిల్లలకు వివాహానంతరము మార్పులు అవసరం కనుక మీరు విడివిడిగా ప్రదర్శనలు ఇవ్వడం అలవాటు చేసుకోండి” అని చెప్పిన తండ్రి మాటని వీరు శిరసావహించి ఆ విధంగా కూడా నిర్భయంగా ఎన్నో పోటీలలో పాల్గొనడం ఎన్నో ప్రదర్శనలు ఇవ్వడం అలాగే ‘ఆల్ ఇండియా రేడియో’లో టాప్ గ్రేడ్ ఆర్టిస్టులుగా కూడా పేరు పొందారు.
వివాహము – కుటుంబము
తండ్రి కోరిక మేరకు గుమ్ములూరి వెంకట సుబ్రహ్మణ్యం గారితో శారదగారి వివాహం జరిగింది. అతను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి, డిఫెన్స్ ఎం. బి. ఎ. చేశారు. ఇండియన్ నేవీలో ఆల్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ ద్వారా ఐ. ఎన్. ఎం. ఎం. ఎస్. సీనియర్ డైరెక్టర్ గా పదవీ విరమణ చేశారు. 1994 లో వివాహమైన తరువాత కొంతకాలం ఉద్యోగరీత్యా ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, విశాఖపట్నం మొదలైన ఊర్లు తిరుగుతూ ఉండవలసి వచ్చింది..
శ్రీమతి శారద మరియు శ్రీ సుబ్రహ్మణ్యం గారు
వీరి కుమారుడు శశాంక్ తరువాత ముంబైలో ఇంజనీరింగ్ చేసి ఎం. ఎస్. చదవడానికి అమెరికా వెళ్ళారు. అక్కడ సోనీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఢిల్లీలో ఇంజనీరింగ్ చదివిన దీక్షితుల శృతి కూడా ఎం. ఎస్. చేయడానికి అమెరికా వెళ్ళి, అక్కడే ఉద్యోగము కూడా చేస్తున్నారు. పెద్దలకు కూడా చిన్ననాటి నుండి తెలిసిన కుటంబస్థులు కావడం వలన వివాహ సంబంధం కలుపుకోవాలని అందరి అంగీకారముతో నవంబరు 2025 లో వివాహము జరిపించారు.
శశాంక్ అమెరికాలో కాలిఫోర్నియాలో ఉద్యోగం చేస్తున్నారు. శృతి కూడా ఆమెజాన్లో సియాటిల్‌లో పనిచేస్తున్నారు
‘సంగీత కళానిధి’ నాదయోగి డాక్టర్ నేదునూరి కృష్ణమూర్తి గారి వద్ద ప్రత్యేక శిక్షణపొందారు. నృత్యంలో శిక్షణ, అనేక బహుమతులు వచ్చినప్పటికీ సంగీతంపై ప్రేమతో గాత్రం పైనే దృష్టి పెట్టారు. శారదగారికి నటరాజ రామకృష్ణగారి శారదాదేవి స్కాలర్‌షిప్‌తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ సీనియర్ స్టూడెంట్స్‌కి ఇచ్చే స్కాలర్షిప్ కూడా రెండు సంవత్సరాలు సంగీత కళానిధి డాక్టర్. నేదునూరి కృష్ణమూర్తి గారి వద్ద సంగీతం నేర్చుకోవడానికి అందుకున్నారు.
M.Phil. కూడా సంగీత రంగంలోనే పూర్తి చేశారు. 1999-2000 లో ఢిల్లీలో ఉండడం వలన ఢిల్లీ విశ్వవిద్యాలయము నుండి, మనోధర్మ సంగీతము –విశిష్టత అనే క్లిష్టమైన అంశము తీసుకుని పరిశోధన చేసి, పట్టా అందుకున్నారు.
సంగీత సేవలకు గుర్తింపుగా 2023లో ఛత్తీస్‌గఢ్ లోని రాయ్‌పూర్ విశ్వవిద్యాలయం వారు ఆమెకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. ఈ అవార్డు తీసుకున్న రోజు ఉదయం డిగ్రీ అందుకుని, అదే రోజు రాత్రి కచేరీ చేయడం ఆమె క్రమశిక్షణకు, సంగీతం పట్ల అంకితభావానికి నిదర్శనం.
నెహ్రూ సెంటర్ లో జరిగిన ‘కుమార గాంధర్వ సంగీత సమారోహ’ ప్రదర్శనలు: ఆంధ్రప్రదేశ్; భోపాల్; బిలాస్ పూర్; ఉజ్జయిని; ఇండోర్; మధురై; మద్రాస్ తో సహా అనేక: జాతీయస్థాయి పోటీల్లో అనేక బంగారు పతకాలు పొందారు. దీనితో కర్ణాటక సంగీతంలో దేశానికి ప్రాతినిధ్యం వహించే అర్హత పొందారు.
ప్రముఖ సంగీత వేత్తలను ఇంటర్వ్యూ చేసేటపుడు చాలా మంది ఆడగాలనుకునే ప్రశ్న
డా.జి.శారదగారు ఇంత ప్రతిభావంతులు కదా! రోజుకు ఎన్ని గంటల సాధనతో ఇంత ఉన్నత స్థానాన్ని అందుకో గలిగారు?
“సంగీతంలో ప్రారంభములో సుమారు 4 గంటల సాధన అవసరం. తరువాత లోతుకు వెళ్తున్న కొద్దీ ఆ మాధుర్యము అర్ధమైనాక మనకు తెలియకుండానే 6, 8,10 గంటలు కూడా సాధన చేస్తాము.”
మరి మీరు సాధనలో ఉన్నపుడు తప్పొప్పులు ఎవరు సవరిస్తారు?
“నా గురువులైన తండ్రి గారు శ్రీ ఐ.వి.ఎల్.శాస్త్రిగారు, నా సంగీత గురువు ‘సంగీత కళానిధి’ ‘నాదయోగి’ శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు నన్ను ఎంతలా తీర్చిదిద్దారంటే బేసిక్స్‌లో తప్పులూ, పొరబాటులూ రావు. ఇప్పుడు నేను సంగీతంలో అడ్వాన్స్డ్ భాగమైన మనోధర్మం, స్వరకల్పన, రాగాలాపన మొదలగు విషయాలకు సంబంధించిన మెళకువలూ నేర్పుతాను కనుక అదే నాకు సాధన అవుతుంది.” అని ఎంతో వినమ్రంగా గురువులనూ, విద్యార్ధులనూ కూడా ఎంతో గౌరవంగా సంబోధించారు.
శారదగారి సంగీత విద్య ప్రతిభ సహజంగా రాగాలాపనలోనూ, స్వరకల్పనలోనూ కనిపిస్తూ ఉంది. రెండింటిలోనూ మనోధర్మాన్ని ప్రదర్శిస్తూ, కీర్తనలో సాహిత్యం సుందరంగా పలుకుతూ శృతిశుద్ధంగా, విరిసిన సంగీత కుసుమం ఆమె.
డా. శారద గారి ఇంటర్వ్యూలు గానకళ, వనిత, ఆంధ్ర ప్రభ లలో ప్రచురించగా ఆంగ్ల మాగజైన్లు మరియు శృతి లలో కూడా ప్రచురించబడ్డాయి.
అమెరికా నుండి వెలువడే టోరీ రేడియోలో రెండు గంటల సేపు ఇంటర్వ్యూ ప్రసారం చేశారు.
దూరదర్శన్ నేషనల్, భక్తి చానల్, సహ్యాద్రి (మహారాష్ట్ర )శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్, సప్తగిరి మొదలైన ఛానళ్ళలో సంగీత కచేరీలు మరియు ఇంటర్వ్యూలు కూడా ప్రసారం ఆయాయి.
విద్యా సేవలు & బోధన
శ్రీమతి డా.జి. శారదా సుబ్రహ్మణ్యం గారు గొప్ప సుప్రసిద్ధ కర్ణాటక గాయని. భారతదేశ సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా, సంగీతం మరియు నృత్యం అనే రెండు దివ్య కళలను తనలో ఇముడ్చుకుని, ప్రపంచానికి భారత కళా వైభవాన్ని చాటిచెబుతున్న అపురూప కళాకారిణి డా.జి.శారద గారు. ఆమె అనేక సి.డి.లను స్వయంగా కంపోజ్ చేసి నిర్మించారు. అలాగే టి.టి.డి., శ్రీ నేదునూరి కృష్ణమూర్తి, సద్గురు శివానంద మూర్తి, భైరవానంద స్వామి, శ్రీ పి.వి. రమణ, శ్రీ సామవేదం షణ్ముఖశర్మ మొదలైన వారు నిర్మించిన అనేక సి.డి.లలో భాగస్వామ్యం వహించారు.
సంగీత విద్య పట్ల ఆమెకు ఉన్న అంకితభావం దశాబ్దాలుగా అనేక వేదికల ద్వారా కొనసాగుతోంది:
సంగీత జనకులం (23 సంవత్సరాలు) – విశాఖపట్నంలో ప్రాథమిక మరియు అడ్వాన్స్డ్ కర్ణాటక సంగీత కోర్సులకు ఉచిత తరగతులు నిర్వహించారు.
ఆంధ్ర మ్యూజిక్ అకాడమీ (8 సంవత్సరాలు) – సద్గురు శ్రీ శివానంద మూర్తి గారి ఆశీస్సులతో ఉచిత సంగీత తరగతులు నిర్వహించారు.
VMDA మ్యూజిక్ కాలేజ్ (7 సంవత్సరాలు) – సంగీత లెక్చరర్ గా పనిచేశారు.
గ్లోబల్ ఆన్లైన్ బోధన – USA, UK, సింగపూర్, ఇండోనేషియా, మొదలగు పెక్కు దేశాలు మరియు చెన్నై, హైదరాబాద్, తిరుపతి & విశాఖపట్నం లోని విద్యార్థులకు ఇంటర్నెట్ ద్వారా తరగతులు చెబుతున్నారు.
BVK కళాశాల (1993-1998) – సంగీత లెక్చరర్ గా పనిచేశారు.
ఢిల్లీ తరగతులు (1999-2001) – ఆన్లైన్ ఉపాధ్యాయురాలిగా కూడా ఆమె మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా స్కైప్ ద్వారా ఆమె వద్ద అనేక వందల మంది విద్యార్థులు నేర్చుకుంటున్నారు. ఆమె విద్యార్థులలో 50 మందికి పైగా ఆకాశవాణిలో గ్రేడ్ పొందారు. సంగీతాభిమానుల కోసం మరియు అన్నమాచార్య కీర్తనలపై ప్రతి 2 వారాలకు ఒకసారి ఉచిత సంగీత తరగతులు నిర్వహించారు. ఈ తరగతులలో 80 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారిలో మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ N. గోపాల స్వామి గారు కూడా ఉన్నారు.
05-10-2002- ‘స్వరలయ’ ప్రారంభం శారదగారు విశాఖలో సంగీతసేవ చేయాలని సంకల్పించారు. పేద విద్యార్థులకు ఉచిత శిక్షణ కోసం సంగీత పాఠశాల ప్రారంభించారు.
సంగీత గురువుగా ఒక సంగీత వారసత్వానికి నిజమైన వారసురాలు అనిపించుకున్నారు. కొత్తతరానికి అందేలా తనవంతు కృషి చేశారు. ఒక విద్యావేత్తగా, ప్రదర్శకురాలిగా, సాంస్కృతిక రాయబారిగా ఆమె చేసిన కృషి భారతదేశంలోనే కాక అంతర్జాతీయంగా శాశ్వతంగా తనదైన ముద్రవేశారు. పెద్దక్క మంగళంపల్లి అన్నపూర్ణ. వీరికి ఏకైక కుమారుడు మంగళంపల్లి శ్రీనివాస్ చెన్నైలో ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో జాబ్ చేస్తున్నారు.
చిన్నక్కకు ఒక అమ్మాయి శ్రీ పల్లవి లండన్‌లో జాబ్ చేస్తున్నారు, సంగీతం నేర్చుకున్నారు.
శారదగారి అన్నయ్య కాళీప్రసాద్‌కు ఇద్దరు ఆడపిల్లలు. కాత్యాయని అమెరికాలోని ఓహ్యో లోనూ, దుర్గాప్రియ దర్శిని పూణేలోనూ ఉంటున్నారు. వీరిరువురూ కూడా శారదగారి దగ్గరే ఇప్పటికీ నేర్చుకుంటున్నారు.
మూడవ అక్కయ్య ప్రొఫెసర్ సరస్వతీ విద్యార్ధి ఆకాశవాణి టాప్ గ్రేడ్ కళాకారిణి. ఆంధ్రాయూనివర్సిటీ సంగీత విభాగ్యశాఖాధిపతిగా ఉంటున్నారు. వారి కుమార్తె లహరి హైదరాబాద్ లో ఆల్ ఇండియా రేడియోలో పని చేస్తూ సంగీతంలో టాప్ గ్రేడ్ కళాకారిణిగా చైల్డ్ ప్రోడజీగా మంచి పేరుప్రఖ్యాతులు తెచ్చుకుంటున్నారు.
పెద్దవారై ఉద్యోగాలలో స్థిరపడ్డాక వారు కూడా సంగీత పాఠాలు ఆన్లైన్ మరియు ఆఫ్‌లైన్‌లో చెప్తూ ఉంటారు.
శారదా సుబ్రహ్మణ్యం గారికి ఒక్కడే కుమారుడు శశాంక్. ఢిల్లీకి చెందిన తమకు ఎంతో బాగా తెలిసిన కుటుంబములోని అమ్మాయి. ఆమెకు కూడా చిన్నపుడు సంగీతము నేర్పారు శారద. శృతి అనే అమ్మాయితో వివాహం జరిపించారు ఈ విధంగా వీరి కుటుంబం అంతా సంగీత సాహిత్యాలు లోనే కాకుండా సాధారణ విద్యలో కూడా ఉన్నతస్థానాన్ని చేరుకొని ఉన్నత ఉద్యోగాలను నిర్వహిస్తున్నారు.
గురుపరంపర: సంగీతసంప్రదాయం– ఆధ్యాత్మిక గురువులు & గురు కృప
డా. గుమ్మలూరి శారదా సుబ్రహ్మణ్యం గారి జీవితంపై ఆధ్యాత్మిక గురువుల ప్రభావం చాలా లోతుగా ఉంది. ఆమె కళ కేవలం వినోదం కోసం కాదు, అది మనిషిలోని మంచితనాన్ని మేల్కొలిపే, సమాజంలో శాంతిని నెలకొల్పే ఒక దివ్య శక్తి.
ఆధ్యాత్మిక గురువులు
చిన్నప్పటి నుంచే తండ్రి గారితో పాటు బ్రహ్మశ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారి దగ్గర ఉండే అవకాశం లభించింది. ప్రతి సంవత్సరం జనవరి 11, 12, 13 తేదీల్లో జరిగే గురుపూజలలో పాటలు పాడడం, నృత్యం చేయడం అలవాటు. ఎక్కిరాల కృష్ణమాచార్యులు వారు 1984 హోలీ రోజు శివైక్యం చెందారు.
శృతి లయలు చలన చిత్రంలో కూడా నటించారు. 1987 లో, కె. విశ్వనాథ గారి దర్శకత్వములో విడుదలైన సంగీత ప్రాధాన్యత గల చిత్రములో కుమారి శారద నటించారు. క్లైమాక్స్ సన్నివేశములో త్యాగరాజస్వామి వారి ఫోటో పట్టుకుని వీధులలో తిరిగేటపుడు తాళాలు వాయిస్తూ “శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీపతి వల్లభా!” అన్నమాచార్య వారి కీర్తన పాడుకుంటూ వెళ్ళే సన్నివేశములో కుమారి శారద ఉన్నారు.
1990 నుండి సద్గురు శివానందమూర్తి గారి అనుగ్రహం లభించింది.
సద్గురు శ్రీ శివానందమూర్తిగారి ‘గీత శివానందం’ లోని పాటలతో పాటు, శంకరాచార్యుల ‘గురుపాదుకా స్తోత్రం’, ‘దక్షిణామూర్తి స్తోత్రం’, ‘మూకపంచశతి’ లకు స్వరపరిచి పాడడం వల్ల గురువుగారి ఆశీస్సులు పొందారు. భీమిలి లోని వారి స్టూడియోలో వారి కనుసన్నలలో రికార్డింగ్ లు జరిగాయి. గురువుగారు రచించిన ‘అనురాగ మాలిక’ సి.డి. లో లహరి, సరస్వతీ విద్యార్థి, శారద గారు కలిసి పాడారు.
“ఈ చల్లని రేయి మరల రానే రాదు
నీ వదనము చూడ నాకు తనివి తీరదు”
అనే పాట గురువుగారి మనసును ఎంతగానో హత్తుకుంది. శిష్యులు ఆయనను ‘నడిచే శివుడు’ గా భావిస్తారు.
తరువాత శ్రీ చాగంటి కోటేశ్వరావు గారితో 12 రోజుల పాటు హృషీకేశ్, హరిద్వార్ యాత్రలకు శారద గారు మరియు అక్క సరస్వతీ విద్యార్థి గారు వెళ్లారు. యాత్రా విశేషాలు చెప్తూ, ప్రవచనాల సమయంలో సందర్భానుసారంగా వేదికపై గురువు చెంత కూర్చుని పాటలు పాడేవారు.
బొంబాయిలో ఉన్నప్పుడు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారితో ఆధ్యాత్మిక అనుబంధం ఏర్పడింది. ఆయన ప్రవచనాలలో త్యాగరాజ, అన్నమయ్య, దీక్షితుల కీర్తనలకు శారద గారు గానం చేయగా, ఆయన వ్యాఖ్యానం చేసేవారు. షణ్ముఖ శర్మ గారు రాసిన ‘శివపదాల’కు రాగాలు కట్టి పాడారు. ఆయన రాసిన “శివదీపం” మరియు ” శుభోదయం” అనే రెండు సి.డి. లకు శ్రీమతి శారదగారు సంగీతము సమకూర్చి, గానం చేశారు.
విశాఖ శ్రీ శారదా పీఠం స్వరూపానంద సరస్వతి గారు మరియు చిన్న స్వామి గారు చిన్నప్పటి నుంచి పరిచయం. భైరవానంద స్వామి గారి సి.డి.లలో కూడా అనేక పాటలకు స్వరం కూర్చి పాడారు.
సంగీత గురువులు & ఇతర అనుబంధాలు
సంగీతంలో ‘సంగీత కళానిధి’ నేదునూరి కృష్ణమూర్తి గారు శారద గారిపై పుత్రికా వాత్సల్యముతో ప్రత్యేక అభిమానం చూపించేవారు. శారదగారికి తన తల్లిదండ్రులూ, డా. నేదునూరి కృష్ణ మూర్తిగారు తప్ప మరివేరే సంగీత గురువులు లేరు. 1992 లో ఆయన దగ్గర సంగీతం నేర్చుకోవడం ప్రారంభించారు. ఢిల్లీ, బొంబాయి, చెన్నై ఏ ఊరిలో ఉన్నా గురువుగారు వచ్చి వారం పది రోజులు ఉండి శిక్షణ ఇచ్చేవారు. ‘నాదయోగి – నేదునూరి’ కార్యక్రమంలోను, భక్తి టీవీలో రామదాసు కీర్తనల బోధనలోను పాల్గొన్నారు. గురువుగారితో కలిసి అన్నమయ్య, త్యాగరాజ కీర్తనల సి.డి.లలో కూడా గానం చేశారు.
సంగీత కళానిధి, నాదయోగి డా. నేదునూరి కృష్ణమూర్తిగారు మరియు తండ్రి అయిన శ్రీ ఐ. వి. ఎల్. శాస్త్రిగారితోనూ డా. శారదా సుబ్రహ్మణ్యం గారు
బొంబాయిలో ఉన్నప్పుడు ‘పుచ్చా రమణ దంపతులు’ శారద గారిని కుమార్తెగా ఆదరించారు. వారు రాసిన పాటలకు ‘పదం శబ్దం నాదం బ్రహ్మం’ అనే పేరుతో 2 సి.డి.లకు సంగీతం కూర్చి పాడారు. రమణ గారు, లలిత గారు (బొంబాయి అమ్మ, నాన్న) రాయపూర్‌లో డి.లిట్ సభలో శారద గారిని పాటతో స్వాగతించడం ఒక గొప్ప అనుభవం.
విశాఖపట్నంలో జరిగిన సన్మానంలో ‘గాంధర్వామృత వర్షిణి’ బిరుదు లభించింది. ఆ సభలో చిన్ననాటి మిత్రుడు ‘రాంభట్ల నృసింహ శర్మ’ గారు శారద గారి జీవితాన్ని ఆధారంగా చేసి, రాసిన పాటను ‘భావన’ ఆ సభలో ఆలపించడం విశేషం.
హైదరాబాద్ లో రామ్ రాసిన శివరాత్రి పాటకు శారదా గారు సంగీతం స్వరపరిచి పాటను పాడారు.
అంతర్జాతీయ గుర్తింపు:
శ్రీమతి డా.జి.శారదా సుబ్రహ్మణ్యంగారు గొప్ప సుప్రసిద్ధ కర్ణాటక గాయని. భారతదేశ సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా, సంగీతం మరియు నృత్యం అనే రెండు దివ్య కళలను తనలో ఇముడ్చుకుని, ప్రపంచానికి భారత కళా వైభవాన్ని చాటిచెబుతున్న అపురూప కళాకారిణి డా. జి. శారదా సుబ్రహ్మణ్యం గారు.
దేశ సరిహద్దులు దాటి, విదేశాలలో కూడా భారతీయ శాస్త్రీయ సంగీతం మరియు నృత్యం యొక్క గొప్పతనాన్ని చాటిచెప్పి, మన జాతికి అంతర్జాతీయ స్థాయిలో గౌరవాన్ని తీసుకొచ్చిన వారిలో ఆమె ఒకరు.
అమెరికా, మారిషస్ మరియు సింగపూర్లలో అనేక సంగీత వర్క్‌షాప్‌లు నిర్వహించారు మరియు కచేరీలు ఇచ్చారు.
మారిషస్ (ఫిబ్రవరి 2012) – ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ICCR) మరియు మారిషస్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన సంగీత ఉత్సవంలో పాల్గొన్నారు.
సింగపూర్ – 2015 & 2017 లో సింగపూర్ వెళ్ళి కచేరీలు, అనేక వర్క్ షాపులు నిర్వహించారు.
అమెరికా 2018 లో 60 రోజులు మరియు 2019 లో 40 రోజులు ఉండి అమెరికాలోని వివిధ రాష్ట్రాలలో పెక్కు సంగీత సభలూ, ఆధ్యాత్మిక ప్రాంతాలలో కచేరీలు, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. సిలికానాంధ్ర వారి అమెరికా రాష్ట్ర నేషనల్ కాంపి టీషన్స్ కి న్యాయ నిర్ణేతగా వెళ్ళి, వారి సంస్థలో కూడా కచేరీ చేశారు. ఇద్దరు మృదంగ విద్వాంసులు శారదగారి కచేరీలో ఆరంగేట్రం చేయడం ఒక మధురానుభూతి.
ఇతర జాతీయ స్థాయి పోటీలు – సంస్కారభారతి, ఆల్ ఇండియా స్పిరిట్ ఆఫ్.. వంటి సంస్థల నుండి కూడా అనేక ప్రథమ బహుమతులు పొందారు.
భారతదేశం నలుమూలలా అనేక ప్రతిష్ఠాత్మక వేదికలపై ఆమె సంగీతప్రదర్శనలు ఇచ్చారు: అనేక ప్రాంతాల్లో ఆమె కచేరీలు చేసి, పలు సన్మానాలు అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరియు మహారాష్ట్ర లలోని అనేక సంగీత సభలలో ప్రదర్శనలు కృష్ణ గానసభ, చెన్నై; ఆంధ్రప్రదేశ్ భవన్, అశోక్ విహార్, న్యూ ఢిల్లీ; నేహ్రూ సెంటర్ ఆడిటోరియం, ముంబై; షణ్ముఖానంద సభ, ఢిల్లీ మరియు ముంబై; ఇతర నగరాలు: తిరుపతి, హైదరాబాద్, విజయవాడ, భోపాల్, బిలాస్పూర్, ఖరగ్‌పూర్, ఉడిపి, ఇండోర్, అకోలా, మధురై, బొంబాయి, రాయపూర్, ఢిల్లీ, చెన్నై, రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం, భద్రాచలం.
శారదా సుబ్రహ్మణ్యం గారు ప్రత్యేకమైన దినాలలో ఆయా కార్యక్రమాలను అద్భుతంగా రంజింప చేస్తారు. త్యాగరాజస్వామి, దీక్షితార్, శ్యామశాస్త్రి, పురందరదాస్, అన్నమాచార్య, భద్రాచల రామదాసు, నేదునూరి కృష్ణమూర్తి గారు మొదలగు వారిపై కచేరీలు చేసి విభిన్నమైన రాగాలతో పాటలను చక్కని రాగ,తాన, పల్లవులతో స్వర ప్రస్తారం చేసి, మనోధర్మ సంగీతంతో భక్తి, తాత్వికత, ఆరాధన ముప్పేటలా కలిసిన మూర్తి స్వరూపమే డా. శారదా సుబ్రహ్మణ్యం. ఆమె ఉనికి వల్లనే మన తెలుగు నేల ఇంకా సుగంధభరితంగా ఉంది, మరియు ఆమె కళ వల్లనే మన భారతీయ సంస్కృతి కాల ప్రవాహంలో చెక్కుచెదరకుండా సజీవంగా నిలిచింది. ఇది ఆమె అభిమానులు, శిష్యులు, శ్రోతలు అనుకునే మాట.
అక్టోబరు 2001 అన్నమయ్య వర్ధంతి సందర్భంగా “అన్నమయ్య ఒక్క కీర్తన భావాన్ని గ్రహించగలిగితే చాలు అనుభవమే ఎంతో మేలు చేస్తుంది.” బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు అన్నారు. స్థలం: ముంబై, నవీ ముంబై అన్నమాచార్య కళాక్షేత్రం సెంటర్ ఆధ్వర్యంలో 18వ అన్నమయ్య వర్ధంతి సందర్భంగా గాయని శారదా సుబ్రహ్మణ్యం గారు పాల్గొని అన్నమయ్య కీర్తనలు పాడి అందరినీ ముగ్ధుల్ని చేశారు. “శ్రావ్యంగా సాగిన శారద గానం”: “యువ గాయని శారద సుబ్రహ్మణ్యం గారి గాత్ర సంగీత కచేరి అద్భుతంగా శ్రావ్యంగా సాగింది.
2001 శ్రీ సత్యసాయిబాబా ఆరాధన సందర్భంగా రామ మందిరంలో కచేరి: యువ గాయని శారద సుబ్రహ్మణ్యం గారు సాయంత్రం మృదుమధురంగా సాగిన గాత్ర సంగీత కచేరి ఆహూతులను మైమరిపించింది. ఆమె కచేరి శ్రావ్యత అలరారడంతో ప్రారంభమై చివరి వరకు అంతటా మహోద్వేగం మెదిలింది.
2004 విశాఖపట్నం, కళాభారతి ముత్తుస్వామి దీక్షితుల 169వ వర్ధంతి
త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ & విశాఖ మ్యూజిక్ అకాడమీ కచేరిలో: “ఆకట్టుకునే ఆలాపన” ప్రముఖ కళాకారిణి జి. శారద సుబ్రహ్మణ్యం గారి గాత్ర కచేరి సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది. దీక్షితుల కృతులను ఎంపిక చేయడంలో ఆమెకు ఉన్న సంగీత, సాహిత్య పరిజ్ఞానం స్పష్టంగా కనిపించింది. ఇది దీక్షితులకు చేసిన “భక్తిపూర్వకమైన నివాళి” అని రివ్యూయర్ A.R. గారు రాశారు. వాయిద్య సహకారం: K.V.S. ప్రసాద్ – వయోలిన్, ధన్వాడ ధర్మారావు – మృదంగం.
భువన విజయం –20 నవంబర్ 2004 శ్రవణపేయం శారద సోదాహరణ ప్రసంగం – కళాభారతిలో “సోదాహరణ ప్రసంగం” – అంటే పాటతో పాటు ఆ కృతి గురించి, రాగం గురించి వివరణ ఇస్తూ పాడారు. పాడిన ప్రధాన కృతులు: శివకామేశ్వరి – కళ్యాణి రాగం – విస్తృతమైన రాగాలాపన, నీరజాక్షి కామాక్షి – హిందోళం, స్వామినాథేన – బృందావన సారంగ, సిద్ధివినాయకం – షణ్ముఖప్రియ, కమలాంబికే – సహాన, సదా చలేశ్వరం- భూపాలం, అన్నపూర్ణే విశాలాక్షి – సామ, శ్రీ నాథాది గురు గుహ – శుద్ధ సావేరి”. శారద సుబ్రహ్మణ్యం గారు దీక్షితుల కృతుల్లోని సాహిత్య, సంగీత భావాలను అద్భుతంగా ఆవిష్కరించారు. రాగాలాపన, నెరవల్, స్వరకల్పన అన్నీ సమపాళ్లలో ఉండి శ్రోతలను మంత్రముగ్ధులను చేశాయి. ఇది నిజంగా శ్రవణపేయంగా ఉంది.
నవంబర్ 2005 శ్రీమాన్ పురందర దాసుల 441వ వర్ధంతి వేడుకలు– కావేరి కన్నడ సంఘం, సీతమ్మధార, విశాఖపట్నం “సంగీత ప్రస్థానం & ప్రముఖ కచేరీలు”
ప్రారంభోత్సవం: సంగీత కళానిధి డా. నేదునూరి కృష్ణమూర్తి గారు మొదటి రోజు: పురందర దాసు కృతులు పాడిన విషయం ఆయన సంగీత పరిపక్వతను చూపిస్తుంది. కర్ణాటక సంగీత పితామహుడు రెండో రోజు కచేరి: పురందర దాసు కృతులతో డా. జి. శారద సుబ్రహ్మణ్యం గారు గాత్ర కచేరి చేశారు. మూడో రోజు “పురందర దాస” అనే నాటకం ప్రదర్శించారు.
“సంగీత కళానిధి,” నాదయోగి డా. నేదునూరి కృష్ణమూర్తి గారికి సన్మానం చేస్తున్న శిష్య బృందం డా. శారదా సుబ్రహ్మణ్యం గారు
కళాభారతిలో 2019 లో శ్యామశాస్త్రి వర్ధంతి సందర్భంగా డా. శారదా సుబ్రహ్మణ్యం గారితో పాటు సీనియర్ సహాధ్యాయినులు రెండు గంటల సేపు శ్యామశాస్త్రి కీర్తనలు సోదాహరణంగా కచేరీ చేశారు.
2023 లో గౌరవ డాక్టరేట్ (డి.లిట్. డిగ్రీ) జాతీయ స్థాయి కార్యక్రమాలు: ITM యూనివర్సిటీ రాయ్‌పూర్ “సంగీత సమర్పణం” 2023 సెప్టెంబర్ 15వ తేదీన కర్ణాటక సంగీతానికి “జి. శారదా సుబ్రమణ్యం” గారికి ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా ఛత్తీస్‌గఢ్‌లోని ఐ.ఐ.ఎం. విశ్వవిద్యాలయం, రాయ్‌పూర్ వారు గౌరవ డాక్టరేట్ (డి.లిట్. డిగ్రీ) ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్ గౌరవ గవర్నర్ శ్రీ బిస్వభూషణ్ హరిచందన్ గారు, ‘పద్మ విభూషణ్’ శ్రీ ఆర్. చిదంబరం గారు – ఛైర్మన్, అటామిక్ ఎనర్జీ, బార్క్, ముంబై, ఐ.టి.ఎం. గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఛైర్మన్ మరియు ఐ.టి.ఎం. విశ్వవిద్యాలయ ఛాన్సలర్ డా. పి.వి. రమణ గారు పాల్గొన్నారు. “విద్య అనేది జీవితాంతం కొనసాగే ప్రయాణం. నేర్చుకునే ప్రక్రియ ఎప్పుడూ ఆగకూడదు. విద్యార్థుల్లో ఆవిష్కరణ, సృజనాత్మకత మరియు జీవితాంతం నేర్చుకునే భావన ఉండాలని” గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గారు అన్నారు.
శారద గారు గవర్నర్ గారి దగ్గర నుండి ప్రశంసా పత్రం తీసుకుంటున్నారు. మెడలో IIM శాలువా ఉంది.
‘సంగీత సమర్పణం’ ఈ సందర్భంగా ITM యూనివర్సిటీ వారు ‘సంగీత సమర్పణం’ పేరుతో రాయ్‌పూర్ లోని పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ఆడిటోరియంలో కర్ణాటక సంగీత కార్యక్రమం నిర్వహించారు. ప్రసిద్ధ కర్ణాటక గాయని డాక్టర్ జి. శారద సుబ్రమణ్యం గారు 5 భారతీయ భాషల్లో భజనలు పాడి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. కన్నడలో రాఘవేంద్ర స్వామి భజన, రామాయణం ఆధారంగా ITM ఛాన్సలర్ Dr PV రమణ గారు రాసిన తెలుగు భజనను కూడా పాడారు.హిందీలో మీరాబాయి భజన పాడి ప్రేక్షకులను అలరించారు. కన్నడ, హిందీ, తెలుగు, మరాఠీ భాషల్లో పాడారు. ప్రత్యేకత: సహకారం: వయోలిన్ – డా. శ్రీరామమూర్తి, మృదంగం శ్రీ అప్పలస్వామి; తబలా -ధనుంజయ్, కీబోర్డ్ – పవన్ కుమార్, విశాఖపట్టణము నుండి వచ్చారు. అది అందరినీ ఆకట్టుకుంది.ఈ కార్యక్రమానికి ITM గ్రూప్ ఛైర్మన్ మరియు ఛాన్సలర్ Dr P V రమణ, Vice Chancellor Dr Sumer Singh తో పాటు రాయ్‌పూర్, దుర్గ్, భిలాయ్ నుండి పెద్ద సంఖ్యలో సంగీత ప్రియులు హాజరయ్యారు. డాక్టర్ శారదా సుబ్రమణ్యం గారు అందరి మనసులు గెలిచారు.
“శ్యామశాస్త్రి సంగీత రత్న” 2025 లో కంచి కామకోటి పీఠములో శ్యామశాస్త్రి గారి సంగీతోత్సవం సందర్భంగా డా. శారదా సుబ్రహ్మణ్యం గారిని పిలిచి, కచేరీ చేయించారు. అనంతరం “శ్యామశాస్త్రి సంగీత రత్న” బిరుదు తో సత్కరించారు.
కంచి కామకోటి పీఠం లో జరిగిన శ్యామశాస్త్రి జాతీయ సంగీత వారోత్సవాలలో శ్యామశాస్త్రి కీర్తనలు పాడుతున్న డా.శారదా సుబ్రహ్మణ్యం గారికి మరియు ‘శ్యామశాస్త్రి సంగీతరత్న’ బిరుదు పీఠాధిపతులు అందిస్తున్న సన్నివేశములు
“గాయత్రి విద్యా పరిషత్ లో వార్షికోత్సవ వేడుకలు”
విశాఖపట్నం- గాయత్రి విద్యా పరిషత్ ఇంజనీరింగ్ కళాశాలకార్యక్రమ వివరాలు – తెలుగులో: ముఖ్య అతిథి: “సంగీత సుధా నిధి” డా. శారద సుబ్రహ్మణ్యం గారు వేదికపై ఉన్నవారు:
ప్రిన్సిపాల్ డా. ఏ.బి. కోటేశ్వరావు, వైస్ ప్రిన్సిపాల్ డా. ఏ. శ్యామసుందర్, ప్రొఫెసర్ పి. సోమరాజు, పాలక మండలి సభ్యులు, రిజిస్ట్రార్ డా. పి. రాజా గణపతి తదితరులు ముఖ్య అతిథిగా విచ్చేసిన “సంగీత సుధా నిధి” డా. శారద సుబ్రహ్మణ్యం గారు విద్యార్థులకు “క్రమశిక్షణతో పాటు చదువు, కళలు రెండూ ముఖ్యమే” అని సందేశం ఇచ్చారు.
గుంటూరు, నెల్లూరుపురంలోని శ్రీ త్యాగరాజ కళావేదిక నిర్వాహకులు: శ్రీ గాయత్రి మహిళా సంగీత సమితి”విద్వాన్ డాక్టర్ శారదా సుబ్రహ్మణ్యంకు ‘గాయత్రి సంగీత విద్వన్మణి’ బిరుదు ప్రదానంతో సన్మానం” తర్వాత శారదగారు శాస్త్రీయ సంగీత కచేరి చేశారు.
మార్చి 2026 ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా “శతాబ్ది కళా ఉత్సవం”
AU సంగీత, నృత్య విభాగం – సాగరతీరం కన్వెన్షన్ సెంటర్సన్మానం కలెక్టర్ మాటలు: “విద్యార్థులే AU కు బ్రాండ్ అంబాసిడర్లు. వారి ప్రదర్శన వర్సిటీకి గర్వకారణం” “తల్లిదండ్రులు, గురువును మరువకూడదు. సంగీతం సాధన వల్ల శరీరంలో నాడులన్నీ ప్రభావితమవుతాయి. గురువు లేకుంటే ఈ స్థాయిలో ఉండేదానిని కాదు.”
మార్చి 2026 ఐ.వి.ఎల్.శాస్త్రి – 99వ జయంతి వేడుకలు త్యాగరాజ ట్రస్ట్ ఆధ్వర్యంలో
ఐ.వి.ఎల్.శాస్త్రి గారు: శారద గారి తండ్రి మరియు గురువు గారు. “నిస్వార్థ సంగీత సేవకుడు”. సంగీతంతో పాటు వేదసూక్తులు కూడా విద్యార్థులకు నేర్పేవారు. జనకులం ఏర్పాటు: 1979 లో కులపతి ఎక్కిరాల కృష్ణమూర్తిగారి ఆశీస్సులతో “సంగీత జనకులం” ప్రారంభించారు. 2022 లో మాస్టర్ పార్వతీకుమార్ గారి ఆశీస్సులతో త్యాగరాజ ఆరాధనా ట్రస్టు ప్రారంభించారు. శారదగారు ఐ.వి.ఎల్. శాస్త్రి కుమార్తె, ట్రస్ట్ సభ్యులుగా ఉన్నారు. 5 రోజుల పాటు జరిగే కార్యక్రమంలో 150 మంది విద్యార్థులు త్యాగరాజ కీర్తనలు పాడారు.ఈ కార్యక్రమంలో శారద గారిని ముఖ్య అతిథిగా సత్కరించారు.
చేపట్టిన పదవులు– పొందిన పురస్కారాలు; బిరుదులు:
ఆమె కంఠం నుండి జాలువారే ప్రతి స్వరం దేవలోక గానంలా, ఆమె పాదాల నుండి పుట్టే ప్రతి నాదం నాట్యబ్రహ్మ తాండవంలా ప్రేక్షకుల హృదయాలను స్పృశించి, వారిని ఆనంద పారవశ్యంలో ముంచెత్తుతుంది.ఆమె ప్రతి ప్రదర్శన ఒక తపస్సు, ప్రతి గానం ఒక ప్రార్థన, ప్రతి నృత్యం ఒక కావ్యంగా మారి, చూసేవారందరికీ మరచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది.
పదవి: కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ – సంగీతం & నాటక కళల నిపుణుల కమిటీ సభ్యురాలు, న్యూఢిల్లీ వారు ఆమెను నామినేట్ చేశారు.
సంస్థలలో వివిధ బాధ్యతలు:
సంస్కార భారతి : సూక్ష్మ కళలను ప్రోత్సహించేందుకు పనిచేసే అఖిల భారత సంస్థ అయిన సంస్కార భారతిలో రాష్ట్ర స్థాయి మరియు జాతీయ స్థాయిలో రెండు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఆంధ్ర ప్రాంత్ సంగీత సంయోజక్ – రాష్ట్ర ఉపాధ్యక్షులు, సంగీతం
అఖిల భారతీయ తొలి సదస్య – సంగీత విద్య కొరకు జాతీయ బృంద సభ్యులు
కె.వి. సలహా కమిటీ సభ్యురాలు
ఆకాశవాణి ఆడిషన్ బోర్డు సభ్యురాలు
పురస్కారాలు: ప్రధాన బిరుదులు:
కర్ణాటక సంగీత విద్వాంసురాలు జి.శారదా సుబ్రమణ్యం గారికి లభించిన అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులు దక్కాయి.
- 1987లో అప్పటి భారత రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ గారి చేతుల మీదుగా, భారత్ వికాస్ పరిషత్ నిర్వహించిన జాతీయ పోటీలలో బహుమతి అందుకున్నారు.
- అక్టోబర్ 2022లో విశాఖ మ్యూజిక్ అకాడమీ వారు “సంగీత కళానిధి డా. నేదునూరి కృష్ణమూర్తి అవార్డు” ప్రదానం చేశారు.
- 2023లో “గాంధర్వామృత వర్షిణి” మరియు ఇలా అనేక సన్మానాలు, అవార్డులు అందుకున్నారు.
- “సంగీత భూషణ” ముంబై శ్రీరంజని సంగీత సభ వారు “సంగీత భూషణ” బిరుదు ప్రదానం చేశారు
- సంగీత సుధా నిధి విశాఖపట్నం శ్రీ విజయ త్యాగరాజ సంగీత సభ వారు “సంగీత సుధానిధి” బిరుదు ప్రదానం చేశారు.
- స్వర సుధా కళా ప్రపూర్ణ అమెరికా, న్యూజెర్సీ స్వర రాగ సుధ కళా అకాడమీ వారు “స్వర సుధ కళా ప్రపూర్ణ” బిరుదు ప్రదానం చేశారు.
- శ్యామశాస్త్రి సంగీత రత్న 2025 లో శ్రీ కంచి కామాకోటి పీఠాధిపతుల చేతుల మీదుగా “శ్యామశాస్త్రి సంగీత రత్న” బిరుదు అందుకున్నారు.
- గాయత్రి సంగీత విద్వన్మణి 2025 ఆగస్టు లో గుంటూరు గాయత్రి మహిళా సంగీత సన్మండలి వారు లక్ష్మీపురం త్యాగరాజ కళావేదిక డాక్టర్ జి. శారద సుబ్రహ్మణ్యం గారికి “గాయత్రి సంగీత విద్వన్మణి” బిరుదు ప్రదానం చేశారు. వి.వి.టి. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్ ముఖ్య అతిథి. సంస్థ అధ్యక్షులు డా. పి. విజయ, ఎం. శేషరాణి, నల్లపాటి ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.సత్కారం అనంతరం శారద గారి సంగీత కచేరి జరిగింది.
- ఆంధ్ర అసోసియేషన్ ఢిల్లీ. ఆంధ్ర ప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవం – ఢిల్లీ AP భవన్ లో మాజీ గవర్నర్ రంగరాజన్ గారి చేతుల మీదుగా
- వేదిక్ సేవా ట్రస్ట్ – విశాఖపట్నం ఉగాది పురస్కారం ఇతర అనేక సంస్థలు – వైజాగ్ జూనియర్ ఛాంబర్, వైజాగ్ డ్యాన్సర్స్ అసోసియేషన్, వేగి నాటి బ్రాహ్మణ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు ఇతర సంస్థలు
విశాఖ మహానగర్ నిగమ్ లో వందేమాతరం 150 సంవత్సరముల ఉత్సవాల సందర్భంగా డాక్టర్ శారదా సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో పూర్తి గీతము శతగళార్చన గావించబడినది 800 పైగా ఆహూతులు వచ్చి తాము కూడా పాడారు.
గ్లోబల్ అవుట్‌రీచ్ & ఆధునిక బోధనా పద్ధతులు
ప్రసిద్ధ ప్రదర్శన కళాకారిణిగా ఉండడమే కాకుండా, సంగీత ప్రచార రంగానికి ఆమె చేసిన కృషి అత్యద్భుతమైనది. ఆమె తండ్రి స్థాపించిన సంగీత జనకులం ద్వారా మరియు శ్రీ సద్గురు శివానంద మూర్తి గారు నిర్వహిస్తున్న సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్, శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారి నాద సుధా తరంగిణి వంటి వివిధ సంస్థల ద్వారా గత 35 సంవత్సరాలుగా విశాఖపట్నం, ఢిల్లీ మరియు ముంబైలలో ప్రారంభ మరియు అధునాతన స్థాయి విద్యార్థులకు ఉచిత సంగీత తరగతులు నిర్వహించారు.. డా. శారద గారు గురువుల దగ్గర ఉన్న ప్రతి ఆశ్రమంలో, గురుకులంలో తన సంగీతాన్ని బోధించారు. ఆమెకు దేశ విదేశాలలో అనేకమంది శిష్యులు ఉన్నారు. ప్రస్తుతం ఆమె ఆన్లైన్ మరియు ఆఫ్‌లైన్ రెండు పద్ధతుల్లోనూ సంగీత విద్యను నేర్పుతున్నారు.
ఆమె ఆన్లైన్ బోధనా పద్ధతులను అవలంబించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు చేరువయ్యారు. ఇది ఆధునిక సాంకేతికతకు ఆమె ఎంత అనుకూలంగా మారగలరో చూపిస్తుంది. అదే సమయంలో సాంప్రదాయ బోధనా విలువలను కూడా కొనసాగించారు. ఈ గ్లోబల్ అవుట్‌రీచ్ వల్ల కర్ణాటక సంగీతం అంతర్జాతీయ ప్రేక్షకులకు చేరుకుంది. భౌగోళిక సరిహద్దులు దాటి ఈ సంప్రదాయాన్ని కాపాడటానికి సహాయపడింది.
గాంధర్వ గానామృత వర్షిణి బిరుదు సందర్భంగా శ్రీ రాంభట్ల వారు వ్రాసిన పాట భావన పాడి వినిపించగా తన కుమారుడు భర్తతో డా. శారద గారు
శతాబ్దాలుగా మన పూర్వీకులు కాపాడుకుంటూ వస్తున్న సంప్రదాయ కళలకు ఆధునిక కాలంలో కొత్త ప్రాణం పోసి, వాటిని యువతరానికి చేరువ చేస్తున్న ఒక జీవన సేతువుగా డా. శారద గారు నిలిచారు.
సాంస్కృతిక & సామాజిక ప్రభావం
డా. శారద గారు తన మధురమైన మరియు బహుముఖ ప్రజ్ఞ కలిగిన గాత్రానికి ప్రసిద్ధి చెందారు. ఆమె పరిణతి చెందిన మరియు క్లిష్టంగా అల్లిన మనోధర్మ ప్రదర్శనకు ప్రసిద్ధి. ఆమెకు వివిధ ప్రాంతాలు మరియు వివిధ స్వరకర్తల రచనలపై విస్తృతమైన అవగాహన ఉంది. కేవలం కచేరీల కళాకారిణిగా మాత్రమే కాకుండా, ఒక గురువుగా, ఒక సాధకురాలిగా, ఒక సంస్కృతి పరిరక్షకురాలిగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తూ, సమాజానికి కళ యొక్క విలువను తెలియజేస్తున్నారు. ఆమె ప్రతి ప్రదర్శన ఒక తపస్సు, ప్రతి గానం ఒక ప్రార్థన, ప్రతి నృత్యం ఒక కావ్యంగా మారి, చూసేవారందరికీ మరచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది. గురువుల ఆశీస్సులు, అకుంఠిత దీక్ష, మరియు కళ పట్ల అపారమైన ప్రేమతో ఆమె సాధించిన ఉన్నతి, నేటి కళాకారులందరికీ ఒక ఆదర్శప్రాయమైన మార్గదర్శకంగా నిలుస్తుంది.
శిష్య-ప్రశిష్యులు: దేశ విదేశాలలో డా. శారదాసుబ్రహ్మణ్యం గారి శిష్యులు సంగీత సంస్థలను, విద్యాలయాలను ప్రారంభించి, ఎందరినో సంగీత కళాకారులుగా తీర్చి దిద్దుతున్నారు. ప్రవాస భారతీయులు ఈ విధంగా భారతీయ కర్ణాటక సంగీతం నేర్చుకుంటూ శిష్య ప్రశిష్యులను తయారు చేస్తూ ఎంతో తృప్తిని అందిస్తున్నందుకు తన తల్లిదండ్రులకూ, సంగీత, ఆధ్యాత్మిక గురువులకూ, సంగీత సరస్వతికి ప్రణామములు సమర్పిస్తూ తన దగ్గర నేర్చుకున్న కొందరి పేర్లను ఉదాహరించారు. “శాస్త్రీయ సంగీతమైనా, లలిత సంగీతమైనా, సినిమా సంగీతమైనా అన్నింటినీ దైవదత్తంగానే భావించాలి,. దేనినీ తక్కువ చేయకూడదు. తన శిష్యుల అభిరుచిమేరకు, వారి గాత్ర ధర్మాన్ని అనుసరించి నేర్పడం గురువుగా నా బాధ్యత. తన శిష్యులు పాడుతా తీయగా, ఇండియన్ ఐడల్, మొదలైన రియాల్టీ షోలలో పాల్గొని ఎన్నో మంచి అవకాశాలు తెచ్చకోవడము, సినీ నేపథ్య గాయకులుగా స్థిరపడడము, ఆనందాన్ని ఇస్తోందని” తెలిపారు. వీరిలో కొందరి పేర్లు: ధీరజ్, ప్రకృతి రెడ్డి, ఆకాంక్ష వల్లి, సుధీష్ణ, శ్రీకృతి, నందిత, శ్రీ శైలజ మొదలగువారెందరో.
డా.శారదా సుబ్రమణ్యంగారి – ముఖ్యమైన సామూహిక కార్యక్రమాలు: శారదా సుబ్రమణ్యం సంగీతానికి ఆమె ప్రాణం, నృత్యానికి ఆమె ఆత్మ, మరియు భారతదేశానికి ఆమె ఒక అద్భుతమైన మానవ వనరు.. ఆమె వ్యక్తిగతంగా మరియు సామూహికంగా శిష్యులతో రికార్డు స్థాయిలో కార్యక్రమాలు చేయగలరు. కొన్ని ఉదాహరణలు మాత్రమే ఇక్కడ ఇస్తున్నాము.
- అన్నమయ్య కీర్తనల సామూహిక గానం – విశాఖపట్నంలో సుమారు 600 మందితో కలిసి ఆలపించారు.
- వందేమాతరం శతగళార్చన – విశాఖపట్నంలో పూర్తి పాటను ఆమె నేర్పించారు. ఈ కార్యక్రమానికి సుమారు 800 మంది ప్రేక్షకులు హాజరయ్యారు.
- భారత రాజ్యాంగ వజ్రోత్సవ వేడుకలు రాజాం ప్రభుత్వ కళాశాల ఫోటో
- భద్రాచల రామదాసు కీర్తనలు – భద్రాచలంలో భక్తితో పాడారు.
- నాద నీరాజనం – తిరుపతిలో జరిగిన నాద నీరాజనం కార్యక్రమంలో ప్రదర్శన ఇచ్చారు.
- రాజమండ్రి కచేరీ– రాజమండ్రిలో ఒక పెద్ద సంగీత ప్రదర్శనను నిర్వహించారు.
ఇలా దేశ విదేశాల్లో ఆమె సంగీతం ద్వారా భక్తిని, సంస్కృతిని వ్యాప్తి చేస్తున్నారు.
కచేరీ ప్రత్యేకతలు : నెరవు, రాగాలపన, స్వరకల్పన, పల్లవి (2004 ఆగస్టు 13 నాటి The Hindu పేపర్లో) వచ్చిన సంగీత సమీక్ష. వైవిధ్యమైన రాగాలతో సంగీత కచేరిశ్రీ విజయ త్యాగరాజ సంగీత సభ ఆధ్వర్యంలో శ్రీ-శంకర మఠ ప్రాంగణంలో జి. శారద సుబ్రహ్మణ్యం గారి గాత్ర సంగీత కచేరి జరిగింది. ఈ కచేరిలో దాదాపు 10 మంది వాగ్గేయకారుల కృతులు ఆలపించబడ్డాయి. పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ రచించిన ‘భైరవి’ రాగంలోని ‘ఆదితాళ వర్ణం’ తో కచేరి ప్రారంభమైంది. తర్వాత కనకదాసు ‘హంసధ్వని’ లోని ‘వమ్మమ్మ శారదే’, త్యాగరాజు ‘ఋషభప్రియ’ లోని ‘మహిమ తెలుసుకోవయ్య’,’’, దీక్షితులు ‘నాటకురంజి’ లోని ‘పార్వతీకుమార’, పెర్లియూర్ దొరైస్వామి అయ్యంగార్ ‘ఫరస్’ లోని ‘ఆడేనమ్మ శివుడు’, స్వాతి తిరునాళ్ ‘కుంతలవరాళి’ లోని ‘భోగేంద్రసాయినం’, శ్యామశాస్త్రి ‘లలిత’ లోని ‘నన్నుబ్రోవు’ వంటి ముఖ్యమైన కృతులను ఆలపించారు. ఇక చివరి భాగంలో కడలూర్ సుబ్రహ్మణ్యం ‘రేవతి’ లోని ‘జనని జనని’, అన్నమయ్య ‘వకుళాభరణం’ లోని ‘ఇన్నిచదువుల’, లాల్గుడి ‘రాగేశ్వరి’ లోని ‘తిల్లానా’ వంటివి వినిపించారు. ‘మనోధర్మ’ను వ్యక్తపరచడంలో ఆమె ఉత్సాహం బాగా కనిపించింది. ‘నాటకురంజి’, ‘ఋషభప్రియ’, ‘లలిత’ రాగాలలోని రాగం, స్వరం, నెరవు లలో అది స్పష్టంగా ప్రతిబింబించింది. ఈ కచేరి సంగీత పండితుల నుండి ప్రశంసలు అందుకుంది. శ్రీకాకుళం కి చెందిన మావుడూరి సత్యనారాయణ శర్మ గారు వయోలిన్ పై, Y.P.S. మధుబాబు గారు మృదంగం పై ఎంతో సమర్థవంతంగా సహకారం అందించారు. శర్మ గారి చక్కని ప్రతిస్పందనలు, మధుబాబు గారి పరిజ్ఞానంతో కూడిన ‘తాని’ కచేరికి మరింత శోభ తెచ్చాయి.”His guru’s DISCIPLE” – ఇదే మొత్తం సంగీతం వృత్తి కాదు, రక్తంలోనే ఉంది. I.V.L. శాస్త్రి గారి వారసత్వం కుమార్తె గా మాత్రమే కాదు, శిష్యురాలిగా కూడా తండ్రి పేరు నిలబెట్టారు. శంకరమఠంలో ప్రశంసలు పొందిన గుమ్మలూరి శారద సుబ్రహ్మణ్యం.
భారత రాజ్యాంగ వజ్రోత్సవాల సందర్భంగా రాజాం డిగ్రీ కళాశాలలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డాక్టర్ శారదా సుబ్రహ్మణ్యం
శారదా సుబ్రహ్మణ్యం: 50 ఏళ్ల స్వర ప్రయాణం
స్వరాలతో సమాజానికి సేవ; సంగీతం కేవలం వినోదం కాదు. అది ఆత్మకు ఆహారం. ఆ మాటను నిజం చేస్తున్న వారిలో శారదా సుబ్రహ్మణ్యం గారు ఒకరు. విశాఖపట్నం కు చెందిన డా. ఇంద్రగంటి / గుమ్మలూరు శారద గారు కర్ణాటక సంగీతంలో ప్రావీణ్యం సంపాదించారు. చిన్నప్పటి నుండి సంగీతంపై ఉన్న మక్కువతో గురువుల దగ్గర కఠోర సాధన చేశారు. ఆమె కంఠంలోని మాధుర్యం, రాగాలను పలికించే నైపుణ్యం శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తుంది. కచేరీలతో పాటు శారదా గారు సంగీత విద్యను వ్యాప్తి చేయడంలోనూ కృషి చేస్తున్నారు. ఎందరో విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇచ్చి, భవిష్యత్ కళాకారులను తీర్చిదిద్దుతున్నారు. “సంగీతం అందరికీ చెందాలి” అనేది ఆమె సిద్ధాంతం. ఇటీవల ఆమె చేసిన సాంఘిక సేవా కార్యక్రమాలు, సంగీత కచేరీలకు గాను “సంగీత సరస్వతి శారదా సుబ్రహ్మణ్యం”గా పిలువబడుతూ ఇహ-పర సాధనకు బాటలు వేస్తూ సాగుతున్నారు.
శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి కథ రచయిత్రి. చక్కని కవయిత్రి. విజయనగరం గురించి పరిశోధించి ‘విజయనగర వైభవానికి దిక్సూచి’ అనే 1100 పేజీల పుస్తకం వ్రాశారు. దేశవ్యాప్తంగా గల 116 మంది కవులతో ‘ఆది నుండి అనంతం దాకా…’ అనే వచన కవితల సంకలనం, ‘లేతమనసులు’ కథాసంపుటి వెలువరించారు.
