Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వందే గురు పరంపరామ్-6

[శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు నిర్వహిస్తున్న ‘వందే గురు పరంపరామ్’ అన్న శీర్షికని దారావాహికగా అందిస్తున్నాము. ఈ నెల ఆచార్య సింహాద్రి జ్యోతిర్మయి గారిని పరిచయం చేస్తున్నారు రచయిత్రి.]

ధ్యానమూలం గురోర్మూర్తి పూజ మూలం గురోత్పదం।
మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురో కృపా॥

సనాతన ధర్మం ప్రకారం గురువులను గురించి 8 రకాలుగా చెప్తారు.

1.బోధక గురువులు 2. వేదక గురువులు 3. నిషిద్ధ గురువులు 4. కామ్యక గురువులు 5. సూచక గురువులు 6. వాచక గురువులు 7. కారణ గురువులు 8. విహిత గురువులు

మన ప్రయత్నాన్ని బట్టి, ప్రాప్తాన్ని బట్టి మనకు గురువులూ, వారి అనుగ్రహం అనాయాసంగా లభిస్తుంది.

ఈ ఎపిసోడ్‌లో మనం ఒంగోలుకి చెందిన ఒక విభిన్నమైన వ్యక్తిత్వం గల గురువుని గురించి తెలుసుకుందాం.

ఆమె శ్రీమతి సింహాద్రి జ్యోతిర్మయి. వయసు 58 సంవత్సరాలు (పుట్టిన తేదీ: 28.8.1966). హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎమ్.ఎ. తెలుగు చదివి, ఎమ్‌ఫిల్ డిస్కంటిన్యూ చేశారు. నర్సరావుపేట లోని పాలడుగు నాగయ్య చౌదరి & కొత్త రఘురామయ్య డిగ్రీ కళాశాలలో 1993 నుండి 2009 వరకూ 16 సంవత్సరాల పాటు తెలుగు లెక్చరర్‌గా పనిచేశారు. 2009 నుండి 2022 వరకు ఒంగోలు పబ్లిక్ స్కూల్‌లో 13 సంవత్సరాలు తెలుగు టీచర్‌గా పనిచేశారు. 2022వ సంవత్సరం నుండి ఉద్యోగానికి స్వస్తి చెప్పి పూర్తి సమయం సాహితీసేవకు వినియోగిస్తున్నారు.

వీరు ఉద్యోగం మానేశాక హైదరాబాద్ లోని ఒక పాఠశాల వారు ఫోన్ చేసి “మీ గురించి చాలా గొప్పగా విన్నాం, 45 వేలు జీతం ఇస్తాము రండి” అని ఆహ్వానించడం, అదే విధంగా ఒంగోలులోని మరో రెండు పాఠశాలల యాజమాన్యం వీరిని ఆహ్వానించటం చాలా సంతోషాన్ని కలిగించిన విషయం.

“ఇప్పుడు నేను గర్వంగా చెప్పుకుంటాను నేనొక రిటైర్డ్ టీచర్ ని అని. ఐ లవ్ మై ప్రొఫెషన్” అంటారామె చిరునవ్వుతో.

తల్లిదండ్రులూ- బాల్యం:

తండ్రి సింహాద్రి వీరభద్రాచారి (లేటు) తల్లి సోమయాజుల విశాలాక్షి. విశ్వబ్రాహ్మణ బి.సి.-బి సామాజిక వర్గానికి చెందినవారు మా తల్లిదండ్రులది కూడా ప్రేమ వివాహమే. నాన్నగారు విశ్వబ్రాహ్మణ సింహాద్రి వారింటి పేరు. అమ్మ బ్రాహ్మణులు. సోమయాజుల వారింటి పేరు. అమ్మానాన్నలకు మేం ముగ్గురం సంతానం. నేను పెద్దదాన్ని. నా తరువాత ఇద్దరు తమ్ముళ్ళు. పెద్దవాడు సింహాద్రి శ్రీరామమూర్తి. గుంటూరులో ఉంటాడు. చిన్న తమ్ముడు సింహాద్రి కిరణ్ కుమార్ అమెరికాలో శానోజ్‌లో ఉంటాడు. వీడిది కూడా ప్రేమ వివాహమే. బ్రాహ్మణ కుటుంబంలోని అమ్మాయిని చేసుకున్నాడు. అమెరికాలో స్వచ్ఛందంగా సిలికానాంధ్ర మన బడి తరపున భాషా సేవ చేస్తుంటాడు.

తమ్ముళ్ళూ మరదళ్ళతో

ఫాదర్స్ డే సందర్భంగా మా నాన్నతో నా జ్ఞాపకాల నిధి

నాన్నతో నా బంధం..
ఏమని చెప్పను? నాన్నతో నా బంధం
అది జ్ఞాపకాల అలలుగా ఎగసిపడే సాగరం
కోరినవన్నీ ఇచ్చే నాన్నలు చాలామందికి ఉంటారు
కోరుకున్నవాడిని ఆనందంగా ఇచ్చే
నాన్నలు ఎంతమంది ఉంటారు?
కులం పట్టింపు లేకుండా పరువుతక్కువ అని భావించకుండా
లోకాన్ని లెక్కచేయకుండా అంగరంగవైభవంగా
నా వివాహం జరిపించి ఆనందకరమైన జీవితాన్ని
వెలలేని కానుకగా నాకిచ్చిన నాన్న సంస్కారం ఏమని చెప్పను?
ఆడపిల్లలకు అంతంత చదువులెందుకు?
అని అందరూ అంటున్న ఆ రోజుల్లో
నాకు ఉన్నతవిద్యను నేర్పించిన నాన్న వ్యక్తిత్వం ఏమని చెప్పను?
వీళ్ళు మంచివాళ్ళు కాదు అని ఏనాడూ ఎవరి గురించీ
ఒక్క మాటైనా చెప్పని నాన్న సహృదయం ఏమని చెప్పను?
అమ్మను క్షణం విడిచి ఉండని నాన్న
అమ్మ చనిపోయి మేము తల్లడిల్లుతుంటే
మీకు నేనున్నానమ్మా! అంటూ మా కోసం జీవిస్తూ,
మీ అమ్మ చనిపోయి ఇన్ని రోజులయింది
అంటూ రోజులు లెక్కబెట్టుకుంటూ
కాలం వెళ్ళదీసిన నాన్న ప్రేమను ఏమని చెప్పను?
కడుపుతో ఉన్న కోడలికి కన్న కూతురిలాగా సేవలు చేసిన
నాన్నఅభిమానాన్ని ఏమని చెప్పను?
నా చిన్నతనంలో మేము డల్లాలో ఉన్నప్పుడు
నేను అన్నం తినకపోతే సర్దార్జీలకు ఇచ్చేస్తానని
అమ్మ భయపెడుతుంటే, అక్కున చేర్చుకుని అభయమిచ్చిన నాన్న
కేన్సర్ వ్యాధితో కొద్ది రోజుల్లోనే దూరమవబోతున్నారన్న
వార్త తెలిసి బాధను భరించలేని ఆయన కష్టం చూసి
దేవుడా! నాన్నను త్వరగా తీసుకుపో అని నిస్సహాయంగా
దేవుడికి మొరపెట్టుకున్న మా మనోవ్యథను ఏమని చెప్పను?
ఏ రూపంబున వ్యాధి గెల్తు..
ఎవ్వరడ్డమిక ఇవ్వ్యాధి ప్రసారోద్ధతిన్
వారింపదగు వారలెవ్వరంటూ
నేను గజేంద్రమోక్షం వినిపిస్తుండగా
పెద్దతమ్ముడి ఒళ్ళోనే తుదిశ్వాస విడిచిన
నాన్న నిష్క్రమణం గురించి ఏమని చెప్పను?
నాన్న నా హీరో అన్నది మాటవరసకు చెప్పే మాటకాదు
నేను మనస్ఫూర్తిగా అంటున్న మాట.

నాన్నగారూ! మీ బిడ్డలమైనందుకు గర్విస్తూ సమర్పిస్తున్ననా జ్ఞాపకాల నివాళిని ఈ ఫాదర్స్ డే నాడు అందుకుని మమ్మల్ని ఆశీర్వదించండి.

సింహాద్రి వీరభద్రాచారిగారి అమ్మాయి

“మీ వైవాహిక జీవితం గురించి చెప్పండి? మీది ప్రేమ వివాహమని విన్నాను” అని అడిగితే, జ్యోతిర్మయిగారిలా చెప్పారు:

నా భర్త పేరు శ్రీ జంగం రాజశేఖరరావు. మావారు మాల సామాజిక వర్గం. జంగం వారింటి పేరు. మేము విశ్వబ్రాహ్మణులం. మాది వర్ణాంతర వివాహం. ఇరువైపులా పెద్దలు అంగీకరించి అంగరంగ వైభవంగా పెళ్ళి జరిపించారు.

జంగం నాగయ్య, రోశమ్మ అత్తామామలు. వారు చాలా సహృదయులు.

వారికి ఆరుగురు సంతానం. అందరూ మగపిల్లలే. మా వారు 5వ కొడుకు. రాజశేఖర రావు.

ఉన్నత చదువులు చదివి పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగం చేసి, జిల్లా పరిషత్ సి.ఇ.ఓ. గా పదవీ విరమణ చేశారు. మాకు ఇద్దరు పిల్లలు

కొడుకు: నిశాంత్ చంద్ర. కోడలు: శ్రావణసంధ్య. మనవలు/మనవరాళ్ళు – జాన్విక, నవధీర్.

కూతురు ప్రత్యూష. అల్లుడు జితేందర్ రాజు. మా అమ్మాయిది కూడా ప్రేమ వివాహమే. అల్లుడు రాజుల కులం. మనవలు/మనవరాళ్ళు: కామ్య చైత్రిక, సిద్ధార్థ్ రామ్ రాజు

కుటుంబం

సాహిత్య ప్రస్థానం:

రచనా వ్యాసంగం నా ప్రవృత్తి. నేను కవయిత్రిని. పద్య రచన గేయ కవితలు రాస్తుంటారు. కొన్ని కవితల పోటీల్లో బహుమతులు గెల్చుకున్నాను. పద్యం, గేయం, వచన కవిత, పేరడీలు రాస్తుంటాను.

నా అభిమాన ఛందస్సు.. కందం. నాకు నచ్చిన ప్రతి అంశాన్ని వీలైనంత వరకు కందంలో చెప్పడానికి ప్రయత్నిస్తుంటాను.

నా కలం పేరు సింహాద్రి. న.ర.సం. (నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం) రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా సాహితీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను.

నా రచనలు:

పద్య కవితలు

  1. శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం (కందానువాదం) ముద్రితం. ఈ పుస్తకాన్ని శ్రీ గుళ్ళపల్లి సుబ్బారావు సాహితీ సంస్థ, గుంటూరు వారు 2022 లో ప్రచురించారు.
  2. శ్రీ విష్ణు కందం: (బ్రహ్మోత్సవాలు, స్వామి వారి మూలమూర్తి వర్ణన, స్వామి మహిమలు,అవతారాల గురించి)
  3. భజ గోవిందం కందానువాదం స్వేచ్ఛానువాదం
  4. రాజశేఖర శతకం: స్త్రీల సమస్యలపై,ఔన్నత్యం పై తేటగీతిలో రాసిన శతకం
  5. సీసోత్తరం: ఉత్తర రామాయణం సీసపద్యాలలో (అసంపూర్ణం). పద్య స్పందన (వివిధ అంశాలపై, వివిధసందర్భాలలో రాసిన పద్యాలు, సంస్కృతశ్లోకాలకు తెలుగు అనువాదాలు, సమస్యాపూరణలు తదితరాలు)

వచన కవితలు

  1. గేయ రామాయణం: చిన్నారుల కోసం రామాయణాన్ని 1000 చరణాలలో యథా వాల్మీకంగా పాట రూపంలో వ్రాశాను. ఇది చిన్నారుల చేత పాడించి ప్రతివారం యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తున్నాను.ప్రస్తుతం చివరిదైన యుద్ధకాండ జరుగుతోంది.ఈ రామాయణంలోని (బాలకాండను) తన మేనకోడళ్ళతో భద్రాచల ఆలయ ప్రాంగణంలో గానం చేసినప్పుడు భద్రాచల ఆస్థాన పండితులు శ్రీమన్నారాయణాచార్యుల వారు విని, ఆనందించి ‘వనితావాల్మీకి’ అని, ‘అభినవ లవకుశులు’ అని మాకు ప్రశంసాపత్రం రాసి ఇచ్చారు.
  2. పాటల్లో పాఠాలు మన సంస్కృతి సంప్రదాయాలకు చెందిన అనేక అంశాలు పిల్లల కోసం పాటలుగా కూర్చినవి
  3. గేయారాధన: స్వామివారిపై రాసిన పాటలు, తెలుగులో తిరుప్పావై గేయాల అనువాదం తదితరాలు
  4. కళ్యాణం వైభోగం: సంప్రదాయ హిందూ వివాహంలోని 16 ప్రధాన ఘట్టాలపై పాటలు. వీటిని అమెరికాలో ‘మనబడి’ చిన్నారులు ఒక రూపకంగా ప్రదర్శించారు
  5. రోజుకో చరిత్ర : (ప్రతిరోజూ పండగే) వివిధ దినోత్సవాలపై 100 కు పైగా కవితలు (ప్రతిరోజూ ప్రత్యేకమే అంతర్జాతీయ దినోత్సవాలపై కవితలు)
  6. గుండె గొంతుకలో: పాటలు, పేరడీలు
  7. నేను చూసిన ఉగాదులు (ఉగాదులపై నేను రాసి,వివిధ సభల్లో చదివిన కవితలు)
  8. ఊహలు-ఊసులు తొలి తొలి ఊహలు
  9. నా (రీ) అనుభూతులు
  10. అనుభవాల సా(గ)రం నా అనుభవాల ఆధారంగా రాసిన కవితలు
  11. సుశ్లోక హృదయం
  12. సమస్యల వలయం (సమస్యాపూరణలు)
  13. అంబాళం ఆంతర్యం
  14. సుప్రభాత కాంతులు
  15. జాతిరత్న దీప్తులు (ప్రముఖుల జయంతులు,వర్ధంతుల సందర్భంగా రాసిన కవితలు,పద్యాలు)

ఇంకా అనేకం పూర్తికానివి ఉన్నాయి.

వీటిలో ఏవీ పుస్తక రూపంలో రాలేదు. చాలా కొన్ని మాత్రం కొన్ని పత్రికలకు పంపగా అచ్చయ్యాయి, సాహితీ ప్రస్థానం, సాహిత్య కౌముది, ఆంధ్రజ్యోతి వంటి వాటిలో.

డా. సి. నారాయణ రెడ్డి ప్రశంసలు:

పేరడీ పాటలు రాయడంలో చేయి తిరిగిన కవయిత్రిగా అందరూ భావిస్తారు. జ్ఞానపీఠ్ అవార్డుగ్రహీత ‘విశ్వంభర’రచయిత డాక్టర్ సి.నారాయణరెడ్డిగారి సమక్షంలో అతను ‘గులేబకావళి’ సినిమా కోసం రాసిన ‘నన్ను దోచుకుందువటే’ వరుసలో సినారే గారు రచించిన గ్రంథాలను, అతని వ్యక్తిత్వాన్ని రచించి, వేదికపై అతని సమక్షంలోనే పాడి, మెప్పించిన సింహాద్రి మేరు నగధీర.

పదవిలో ఉండగానూ, పదవీ విరమణ తరువాత ఇతర సాహితీ సేవలు:

విద్యార్థుల చేత అష్టావధానం రూపకాలు, భువన విజయం, ఆధునిక భువన విజయం,హరికథ (సీతా కల్యాణం) బుర్రకథ (ప్రకాశం పంతులు) చేయించాను. అష్టావధానం రూపకం అమెరికాలో సిలికానాంధ్ర చిన్నారుల చేత కూడా చేయించాను.

“మీకోసం మీరే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలని ఎందుకు అనిపించింది?” అన్న ప్రశ్నకు “నేను నా 16 వ ఏట నుండి అంటే 1983 నుండి అంటే దాదాపుగా 37 సంవత్సరాలుగా కవిత్వం రాస్తున్నాను. సుమారు ఒక 20 పుస్తకాలు దాకా రాశాను. ఇంతవరకూ ఏవీ ముద్రించుకోలేదు. అందుకనే నా రచనలన్నీ కనీసం ఒక చోటైనా పెట్టుకుంటే బాగుంటుంది అనే ఆలోచనతో *జ్యోతిర్మయం* అనే బ్లాగ్‌ను తయారుచేసి ఇందులో నా రచనలన్నీ పెట్టాలని నిర్ణయించుకున్నాను” అన్నారు.

బ్లాగు లింక్ http://simhadrijyothirmai.blogspot.com

తెలుగు భాషాభిమానిగా తెలుగు భాషకు పట్టం కట్టిన స్వర్గీయ ‘నటరత్న’ నందమూరి తారక రామారావుగారి శత జయంతి సందర్భంగా వారి వీరాభిమానిగా గత 37 సంవత్సరాలుగా రాస్తున్న తన రచనలు అన్నిటిని ఒకచోట ఉంచాలి అని ఒక సదుద్దేశంతో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడం జరిగింది. అందులో ప్రముఖ వ్యక్తుల జయంతి వర్ధంతులు, భక్తి, సైన్స్, తెలుగు వ్యాకరణం, షాట్స్, పాటలతో పాఠాలు మొదలగు అనేక అంశాలపై సుమారు 300 పైగా వీడియోలను ఒక ఏడాదిలోగా చేశారు.

ప్రస్తుతం సింహాద్రి జ్యోతిర్మయి ‘నా కవిత్వమే నా సంతకం’ అనే పేరుతో భాషా సాహిత్యాలకు మాత్రమే పరిమితమైన యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు.

అందులోనే ‘నాన్నమ్మ సుద్దులు’ పేరుతో షార్ట్స్ చేస్తుంటారు. చిలక పలుకుల్లాగా ముద్దు ముద్దుగా ఒకటి లేదా రెండు నిమిషాలు మించకుండా ఉంటాయి పిల్లలను పెద్దలను ఆకర్షిస్తూ ఉంటాయి అందులో మహాభారతంలోని పర్వాలు ఉపపర్వాలు వాటికి ఆయా పేర్లు ఎలా వచ్చాయో పర్వదినాలు ప్రత్యేక దినాలు సందర్భంగా రచించిన కవితలను పిల్లలతో భాషా ప్రతిజ్ఞ చేయించడం అందరినీ ఆకర్షిస్తున్నాయి

ప్రపంచ కవితా దినోత్సవం నాడు మొదలుపెట్టి గురజాడ వారి ‘పుత్తడి బొమ్మ పూర్ణమ్మ’ కథను పిల్లలకు వినిపించారు. అదే విధంగా గుంటూరు శేషేంద్రశర్మగారు, శ్రీ. శ్రీ. మొదలు ప్రముఖ కవుల యొక్క ప్రముఖ రచనలను తన ఛానల్ లో వీడియోలు చేసి పెడుతూ ఉంటారు. తెలుగుభాషా పరిరక్షణకు తెలుగు భాషకే సొంతమైన పద్య చందస్సును పిల్లలకు, పెద్దలకు కూడా అరటిపండు ఒలిచి నోట పెట్టినంత సులువుగా నేర్పుతున్నారు.

వీరు రాసినవన్నీ ఏకదంతుని పూజకు ఉపకరించే ఏకవింశతి పత్రాల వలే 21 సబ్ టైటిల్స్ గా విభజించి పొందుపరుస్తున్నారు.

ఈమె అక్షరాకృతుల ఉప శీర్షికలు

“మీ రచనలలో చాలా వైవిధ్యం ఉంటుంది. ఎందువలన? ఉదాహరణ ఒకపక్క రామాయణాని పిల్లలకు చెపుతూమే ఎయిడ్స్ వ్యాధి గురించి రాస్తారు. పని చేస్తారు. ఒక పక్క సుప్రభాతం రాస్తూనే కలకత్తాలోని అమానవీయ సంఘటనకు చలించిపోతారు” అని అడిగితే, “బహుశా అది అంతర్లీనము కావచ్చు. అలాగే స్పందించేగుణం కూడా ఎక్కువ. అది సున్నితంగా ఉంటూనే ‘నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని’ అని సిరివెన్నెలగారు అన్నట్లు .. దీనికి బీజమూ ప్రోత్సాహమూ ఇచ్చినవారు..” అంటూ ఇలా చెప్పుకొచ్చారు:

“నేను ఇంటర్మీడియట్ నుంచి కవిత్వం రాస్తున్నాను. నాలో అంతర్లీనంగా ఉన్న ఆ కవితాత్మకతను తొలిసారిగా గుర్తించి ప్రోత్సహించిన వారు గుంటూరు ఉమెన్స్ కాలేజీలో తెలుగు లెక్చరర్ శ్రీమతి ఎన్.విజయలక్ష్మిగారు. ఆవిడ ప్రభావంతోనే ఇంటర్లో సైన్స్ విద్యార్థినైన నేను డిగ్రీలో బి.ఎ. తెలుగు తీసుకుని సాహితీ విద్యార్థినయ్యాను. అలా నా సాహిత్య జీవితం మొదలైంది. మేనమామల హాస్య చతురత, మా అమ్మకు తిరుమలేశునిపై ఉన్న భక్తి,, అమ్మానాన్నలకు ఉన్న సామాజిక స్పృహ, నేను చుట్టూ చూస్తున్న సమాజం, అన్యాయాన్ని సహించలేని నా వ్యక్తిత్వం, జీవితంలో ఎదురైన అనుభవాలు అన్నీ నా కవిత్వానికి ఆలంబనయై అన్ని విషయాల పట్ల కవితలు రాసేలా నన్ను మలిచాయి.

నేను టీచర్ ని అయ్యేదాకా వ్రాసిన కవిత్వం ఒక ఎత్తు. టీచర్ని అయ్యాక నా కవిత్వం బహుముఖం అయింది” అన్నారు.

“మీకూ, మీ కవిత్వానికీ స్ఫూర్తి ఎవరు?” అని ప్రశ్నిస్తే, “నా విద్యార్థులే నాకు స్ఫూర్తి. వారి కోసమే అనేక విషయాల పట్ల ఆసక్తి పెంచుకుని విభిన్నంగా భాషా సంప్రదాయాలకు సంబంధించిన అనేక విషయాలును వారికి సులభంగా గుర్తుండేలా నేర్పటం కోసం ‘పాటల్లో పాఠాలు’ అంటూ పాటలుగా వ్రాయటం మొదలుపెట్టాను. అదే నన్ను ఒక ఉత్తమ ఉపాధ్యాయినిగా నిలబెట్టి నా వృత్తి, ప్రవృత్తి ఒక్కటై నా సంతృప్తికి కారణమయ్యాయి” అన్నారు.

అందుకున్న కొన్ని పురస్కారాలు:

అనేక కవిసమ్మేళనాల్లో పాల్గొని అనేక పురస్కారాలు అందుకున్నాను. పద్య కవితా పురస్కారం, ఉగాది పురస్కారం, విశిష్ట పురస్కారం మొదలైనవి.

“మీరు తెలుగు భాష కోసం ఇంత కృషి చేస్తున్నారు కదా! నేటి బాలలే రేపటి పౌరులు అంటారు కదా! వారి భవిష్యత్ ఉపాధ్యాయుల చేతిలోనే ఉంది. వారికీ మీరు ఇచ్చే సలహాలు, సూచనలూ ఏమైనా ఉన్నాయా?” అని అడిగితే, “ప్రస్తుతం చాలా మంది ఉపాధ్యాయులు మాత్రమే కాదు అన్ని రంగాలవారు అనేక సంస్థల వారూ భాషాభివృధ్ధికి చాలా కష్టపడుతున్నారు. అయినప్పటికీ ఈ కార్యక్రమం ప్రభుత్వం పైనా, ఉపాధ్యాయులపైనా అధిక భాగం ఉంది అని చెప్పుకోవాలనిపిస్తుంది. ఎవరికీ సలహాలు ఇచ్చేంత గొప్పదాన్ని కాకపోయినా ఒక ఉపాధ్యాయినిగా నా పరిశీలనకు వచ్చిన కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను.

నేనొక రిటైర్డ్ టీచర్ని. ఎన్నో ‘టీచర్స్ డే’లు విద్యార్థులతో ఎంజాయ్ చేశాను. ఎంతోమంది టీచర్స్‌తో కలిసి పనిచేశాను. నిబద్ధత కలిగి తమ విజ్ఞానాన్ని గోరుముద్దలుగా విద్యార్థులకు పంచిపెట్టి తమ వృత్తిని అరుదైన అవకాశంగా, తమ అదృష్టంగా భావించి పిల్లలకు చదువునేర్పే టీచర్స్‌ని చూశాను. అలాంటి వారు నా కొలీగ్స్ అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను.

మరికొందరు ఏ మాత్రం కష్టపడకుండా, పవిత్రమైన తమ వృత్తిని సంపాదనా మార్గంగా మాత్రమే చూస్తూ తమ జ్ఞానాన్ని ఏమాత్రం పెంచుకోకుండా, గైడ్స్ సహాయంతోనో, మరో సులభమైన మార్గం లోనో మ్యాగీ నూడుల్స్ కలిపేసినట్టు ఇన్‌స్టంట్‌గా చెప్పేసి మమ అనిపిస్తారు.కానీ నూడుల్స్ పిల్లలకు ఎలాంటి పోషకాలను, బలాన్ని ఇవ్వలేవు. ఆ సంగతి వారికి తెలియదు. పసితనం. ఏదో ఆకర్షణీయంగా తిన్నాం అంతే చాలు అనుకుంటారు. కానీ అమ్మ గోరుముద్దలు ప్రేమను, ఆరోగ్యాన్ని, ఆయుష్షును, భవిష్యత్తును కూడా అందిస్తాయి. అది ఆ వయసులో అర్థం కాదుగా.

టీచింగ్ కూడా నా దృష్టిలో అలాంటిదే. నా సబ్జెక్టే తీసుకుంటే నా ముప్పై ఏళ్ళ సర్వీసులో ఎంతోమంది తెలుగు టీచర్లను చాలా దగ్గరగా అబ్జర్వ్ చేశాను. వాళ్ళకు పట్టుమని పది పద్యాలు పాడటం రాదు. దీర్ఘ సమాసాలు పలకటం రాదు. పద విభజన తెలీదు. తెలుగు, సంస్కృత సంధులకు తేడా తెలియదు. ఒక కవి గురించి పదినిమిషాలు మాట్లాడలేరు. రామాయణ, భారత, భాగవతాల గురించిన అవగాహన లేదు. ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో ఉన్నాయి.

అయినా పాఠశాలల యాజమాన్యానికి ఇవేవీ పట్టవు. ఎవరు దొరికితే వారే చాలు. సిలబస్ పూర్తయిందా! పిల్లలకు మార్కులు వచ్చాయా లేదా అంతే వారి లెక్క. టీచర్‌కి డిగ్రీ ఉంటే చాలు. నాలెడ్జ్ అవసరం లేదు. ఈ పరిస్థితి చూసి నేను చాలా సిగ్గుపడుతున్నాను. విద్యార్థికి సబ్జెక్టు పట్ల పరిపూర్ణ జ్ఞానాన్ని ఇవ్వలేని టీచర్లను చూసి జాలిపడుతున్నాను” అన్నారు.

“మీ 58 సంవత్సరాల వైవిధ్యభరితమైన జీవితంలో మీకు బాగా తృప్తిని ఇచ్చిన సమయం ఏదంటారు?” అన్న ప్రశ్నకు “ఒక ఉపాధ్యాయురాలిగా నా జీవితం నాకు సంతృప్తికరం. నా పిల్లలు నేను తరగతి గదిలో అడుగుపెట్టే వేళకు ముక్తకంఠంతో పద్యాలు వల్లె వేస్తుంటారు. అది నా క్లాస్ అని స్కూల్ మొత్తానికి చెప్పకుండానే తెలిసిపోతుంది. వాళ్ళు భారతంలోని పద్దెనిమిది పర్వాల పేర్లు తడుముకోకుండా చెప్పగలరు. రామాయణంలోని కాండలు వరుసగా చెప్పగలరు. జ్ఞానపీఠ గ్రహీతల పేర్లు, అష్టదిగ్గజాలు వారి కావ్యాల పేర్లు చెప్పగలరు. శ్రీశ్రీ, దాశరథి గేయాలు పాడగలరు. ఆముక్తమాల్యద లోని ‘అందుండుం ద్వయసద్మపద్మవదనుం డద్వంద్వుడు’ లాంటి కఠినమైన పద్యాలను కంఠోపాఠంగా తడుముకోకుండా అప్పజెప్పగలరు. 60 సంవత్సరాల పేర్లు చెప్పగలరు. క్విజ్‌లు, పద ప్రహేళికలలో ఉత్సాహంగా పాల్గొనగలరు. బుర్రకథ అయినా, హరికథ అయినా చక్కగా అభినయించగలరు. అవధానం, భువనవిజయం కూడా రక్తికట్టించగలరు.

ఇదంతా పిల్లలకు ఒక టీచర్ గురుస్థానంలో ఉండి తన పిల్లలకు అందించే అమృతగుళికలు. టీచర్లోని ఉత్సాహం, తపన, విషయ పరిజ్ఞానం ఒక చెట్టులోని సారం పుష్పాలు, ఫలాల రూపంలో పుష్పించి ఫలించినట్లుగా టీచర్ నైపుణ్యం విద్యార్థి టాలెంట్ గా బహిర్గతం మవుతుంది. పిల్లలకు మన మాతృభాషను ఇలా నేర్పాలి అన్న తపన ఉన్న టీచర్లకు, అలాంటి టీచర్లను ప్రోత్సహించే యాజమాన్యాలకు నమస్సులు.” అన్నారు.

“కాలేజీలో పని చేసేటప్పుడూ, హైస్కూలులో పని చేసేటప్పుడూ విద్యార్థులలో వయో వైవిధ్యాన్ని అసమానతలను కలుపుకుపోవడానికి మీరు ఏఏ కార్యక్రమాలు చేసేవారు?” అని అడిగితే, “కాలేజీలో ఉన్నప్పుడు జాతీయ సేవా పథకం (NSS) బాలికా విభాగానికి ప్రోగ్రాం ఆఫీసర్‌గా పిల్లలతో అనేక సేవా కార్యక్రమాలు (పారిశుధ్యం, మొక్కలు నాటడం వంటివి) నిర్వహించాను. ‘కాలేజ్ టాక్ ఎయిడ్స్’ కార్యక్రమంలో పాల్గొని ఆనాటి యువతలో చాపకింద నీరులా విస్తరిస్తున్న HIV గురించి పిల్లలకు అవగాహన కలిగించడం, కౌన్సెలింగ్ నిర్వహించాను. కాలేజీలో ప్రతి గాంధీ జయంతికి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి, పిల్లలచేత రక్తదానం చేయించేవాళ్ళం.

NSSలో భాగంగానే క్యాంపులు నిర్వహించి చుట్టు పక్కల ఉన్న గ్రామాల మహిళలకు ఆరోగ్యం,పోషకాహారం ప్రాధాన్యత, ఎయిడ్స్ అవేర్నెస్ వంటి కార్యక్రమాలు చేపట్టటం జరిగింది. డిగ్రీ విద్యార్థినిగా చదువుకునే రోజుల్లో నేను కూడా ఎన్ ఎస్ ఎస్ విద్యార్థినినే. గుంటూరు ఉమెన్స్ కాలేజీ లో చదువుకున్నాను” అని వివరించారు జ్యోతిర్మయి.

సాహిత్యపరంగా – విద్యార్థులతో ఆధునిక భువన విజయం – అవధానం అని 8 మంది ప్రముఖులైన ప్రాచీన కవులు, 8 మంది ఆధునిక కవులు స్వర్గంలో శ్రీకృష్ణదేవరాయల సభలో, (తిమ్మరుసు కూడా ఉంటారు) కొలువుదీరటం. ఒక్కొక్కరికి ఒక్కో పద్యం ఆ కవిది నేర్పించాను. ఆ ఎనిమిదిమంది కవులూ కవిత్రయం, పోతన, శ్రీనాథుడు, పెద్దన, నంది తిమ్మన, వికటకవి; ఆధునిక కవులు గురజాడ, రాయప్రోలు, శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి, దాశరథి, కరుణశ్రీ, జాషువా, సినారె. అష్టావధానం ఒక రూపకంలా తయారుచేసి ఒకసారి రాహుల్ అనే విద్యార్థి తోనూ, ఒకసారి వినీల అనే అమ్మాయితోనూ చేయించాను. రెండు సార్లు స్క్రిప్ట్ కి పద్యాలు, అప్రస్తుత ప్రసంగం అన్నీ నేనే రాసుకున్నాను

మరొక సంఘటన.

డిసెంబర్ ఒకటో తేదీ వరల్డ్ ఎయిడ్స్ (ఎవేర్ నెస్) డే సందర్భంగా నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ..

నా అనుభవం నేను నర్సరావుపేటలో డిగ్రీ కాలేజ్ లెక్చరర్ గా ఉద్యోగం చేసే రోజుల్లో కాలేజ్‌లో నేను ఎన్.ఎస్.ఎస్. బాలికా విభాగం ప్రోగ్రామ్ ఆఫీసర్‌ని కూడా. అప్పట్లో కళాశాల విద్యార్థులలో కూడా హెచ్.ఐ.వి. పాజిటివ్ కేసులు వెలుగు చూసి ఆందోళనకు గురిచేస్తున్న కాలమది. పందొమ్మిది నుండి ముప్పై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు వాళ్ళల్లో కూడా నలభై శాతం ఈ వైరస్ విస్తరిస్తోందని గుర్తించిన ఈ నేపథ్యంలో ప్రభుత్వం మేల్కొని కళాశాల విద్యార్థులను అప్రమత్తం చేయవలసిన ఆవశ్యకతను గుర్తించి, ఆ భారాన్ని లెక్చరర్ల భుజాలపై ఉంచింది. ముందుగా వారికి ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించి వారి ద్వారా విద్యార్థులను మేల్కొలపాలని నిర్ణయించింది.

అందుకోసం ప్రతి కాలేజ్ నుండి ఒక లేడీ మరియు జంట్ లెక్చరర్‌ను పంపమని కళాశాలలను ఆదేశించింది. కానీ ఈ వ్యాధి పేరు చెబితేనే బెంబేలెత్తిపోయే ఆ రోజుల్లో ఆ ట్రైనింగ్‌కి వెళ్ళడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు.

అప్పుడు ఎన్.ఎస్.ఎస్. ఆఫీసర్లుగా మా సామాజిక బాధ్యతను గుర్తించిన నేను, నా తోటి లెక్చెరర్ శ్రీ గురుకిషన్ ఆ ట్రైనింగ్‌కి వెళ్ళడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చాము. ఆ ట్రైనింగ్ మాలోని ఎన్నో అపోహలను తొలగించింది. మాకు చెప్పకుండానే హెచ్.ఐ.వి. పాజిటివ్స్‌తో కరచాలనం, భోజనం వంటి పనులు చేయించి అది ఆ రకంగా వ్యాపించదనే వాస్తవాన్ని తెలియజెప్పారు. నిజం చెప్పొద్దూ! డాక్టర్లే భయపడి పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి నిరాకరించిన ఆ రోజుల్లో ఆ భయం మమ్మల్ని కొద్ది సేపు వెంటాడింది.

కానీ క్లాసులు పూర్తిగా విన్న తరువాత ధైర్యం వచ్చింది. *కాలేజ్ టాక్ ఎయిడ్స్* పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థులను దిద్దవలసిన మా బాధ్యత వైపు నడిపించింది. యుక్తవయసులో పిల్లల్లో వచ్చే శారీరక, మానసిక మార్పులపై అవగాహన, అపోహలు, వాస్తవాలు, పర్సనల్ హైజీన్, పిల్లలకు ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించడంలో తల్లిదండ్రులు మరియు లెక్చరర్ల బాధ్యత, పీర్ గ్రూప్ ప్రభావాలు వంటి అంశాలన్నీ ఇందులో చర్చకు వచ్చాయి.

కళాశాలకు తిరిగి వచ్చాక మా పట్టణంలోని కొన్ని కళాశాలలకు వెళ్ళి, విద్యార్థులకు కౌన్సిలింగ్ క్లాసులు తీసుకున్నాము. దీనికి కారణం ఏంటంటే తమ లెక్చరర్లయితే విద్యార్థులు వినడానికి, సందేహాలు అడగడానికి ఇబ్బంది పడతారని భావించి, ఒక కాలేజ్ లెక్చరర్లను మరొక కాలేజీకి పంపే ఏర్పాటు చేశారు. ఆ తర్వాత చాలా కాలం మమ్మల్ని ఎయిడ్స్ సార్, ఎయిడ్స్ మేడమ్ అని సరదాగా అనుకునేవాళ్ళు. అలాగే డిసెంబర్ ఒకటో తేదీన ఎయిడ్స్ అవేర్నెస్ ర్యాలీకి కూడా భారీగా బయల్దేరినా ఆ ర్యాలీ లోనడవడానికి కూడా మొహమాటపడి నాలుగడుగులు మాతో వేసినట్టే వేసి మాయమయ్యేవాళ్ళు. చివరకు చాలాకొద్దిమంది విద్యార్థులు, మేం ముగ్గురం ఎన్ ఎస్ ఎస్ ఆఫీసర్లం మిగిలేవాళ్ళం.

ఆ తర్వాత కాలేజ్‌లో ఈ విషయంపై ఏర్పాటు చేసిన బాలికల గ్రీవెన్స్ వింగ్‌ని కూడా నేనే నిర్వహించాను. ఈ విధంగా నేను సైతం.. అంటూ శ్రీశ్రీ స్ఫూర్తితో ఒక లెక్చరర్ గా నా బాధ్యతను నేను మనస్ఫూర్తిగా నిర్వహించగలిగినందుకు; “నిశ్శబ్దాన్ని ఛేదించండి ఎయిడ్స్ గురించి మాట్లాడండి” అంటూ ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం గారితో ఉపన్యాసాలు ఏర్పాటు చేయించటం వంటి కార్యక్రమాలలో నేను పాల్గొన్నందుకు ఇప్పటికీ గర్వంతో కూడిన సంతృప్తిని పొందుతుంటాను.

కాలేజీకి డాక్టర్ సమరం గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి, ఆ సభాధ్యక్షురాలిగా సభను నిర్వహిస్తున్న జ్యోతిర్మయి.

నాతో పాటు మా కాలేజ్ ఎన్.ఎస్.ఎస్. ఆఫీసర్లు శ్రీ జె. ప్రభాకర్, శ్రీ కె. గురుకిషన్ ల గారిని కూడా ఈ సందర్భంగా ప్రశంసించటం నా విధి.

గాంధీ జయంతికి మేము ప్రతీ సంవత్సరం ముగ్గురం కలిసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేసేవాళ్ళం. బ్లడ్ రిపోర్ట్‍౬లు పరిశీలించి నప్పుడు అక్కడక్కడా ‘పాజిటివ్’ అని రిపోర్ట్ వచ్చినప్పుడు మా బాధ వర్ణనాతీతం. ఆ పసివయసులో తెలిసీ తెలియక చేసిన చిన్నతప్పుతో జీవితాన్ని మృత్యుముఖంలోకి నెట్టేసుకున్నారని జాలి కలిగేది. ఆ విషయం అత్యంత గోప్యంగా ఉంచి, వారిని రహస్యం గా పిలిపించి, హెచ్చరించి, ధైర్యం చెప్పి జాగ్రత్తలు చెప్పేవాళ్ళం. ఇవండీ కాలేజ్ టాక్ ఎయిడ్స్‌తో నా జ్ఞాపకాలు.

ఈ సందర్భంగా అప్పటి నా కవిత

మన (సు) కర్తవ్యం
అమాయకపు పసితనం అంటురోగాన్ని కావలించుకుంటోంది
చేసిన తప్పును చెప్పుకోలేక పశ్చాత్తాపంతో పరితపించి
హీనంగా చూడబడుతూ తల ఎత్తుకు తిరగలేక
మంచానికి అంటుకుపోయి మరణానికి చేరువవుతోంది
మందులేని ఈ మహమ్మారికి నివారణ మార్గమొక్కటే!
అది నిశ్శబ్దాన్ని ఛేదించటమే.
నేడు మనం సిగ్గుపడితే రేపు జాతి యావత్తూ
సిగ్గుతో తలదించుకోవలసిన దుర్గతి దాపురిస్తుంది
అందుకే మౌనాన్ని వీడుదాం మాట్లాడుదాం
మన యువతను సుందర భవితకు
మళ్ళించుకుంటూ చైతన్యవంతమైన
సమాజాన్ని సృష్టించుకుందాం

ఈ కవిత నేను కాలేజ్ టాక్ ఎయిడ్స్ ట్రైనింగ్ కి వెళ్ళినప్పుడు ఒక పూట సభను నా ఆధ్వర్యంలో నడిపి, అక్కడ వినిపించి సన్మానం అందుకున్న కవిత.

“మీరు గత సంవత్సరం ఒక వినూత్న నిర్ణయం తీసుకున్నారని విన్నాను. మాతో పంచుకోగలరా?” అని అడిగితే, “నేను ఏడాది క్రితం స్వామికి మొక్కుకున్నాను శ్రీలక్ష్మీ. ఇకపై ఎవరికీ సన్మాన పత్రాలు రాయను, సన్మానాలు స్వీకరించను అని. అందుకని ఒకరిద్దరు అడిగినా సున్నితంగా తిరస్కరించాను” అన్నారు.

కొన్ని వందల కొద్ది సన్మాన పత్రాలు చాలా అద్భుతంగా రాశారు. చాలామంది తన దగ్గరకు వచ్చి రాయించుకుంటారు. అటువంటిది అకస్మాత్తుగా ఎందుకలా?ఎందుకలా? ఆశ్చర్యంగా చూస్తున్న నా వేపు ఒక చిరునవ్వుతో తలపంకించారు. ఆమె నవ్వులో తెలుగు తల్లి కనిపించింది. తెలుగు భాషాభిమానిగా అప్రయత్నంగా నమస్కరించాను.

ఆమెకు గల స్వంత గ్రంథాలయంలో గల వందలాది పుస్తకాలు చదవమని ప్రేరేపిస్తున్నాయని సమయాన్ని కోరుకుంటున్నారని అర్థమైంది.

జ్యోతిర్మయికీ, రాజశేఖరునికీ వివాహమై 35 సంవత్సరాలు నిండింది. అందరూ వారిది అన్యోన్య దాంపత్యం అంటారు. ఎలా చెప్పగలం?

మానవ సంబంధాల పునరుద్ధరణ.. ఇలాగేనా!!

అత్తమ్మ స్మృతిలో..

మా అత్తగారి పేరు రోశమ్మ. ఆవిడ 2012 ఆగస్ట్ 2వ తేదీన చనిపోయారు. నేటికి ఆవిడ మాకు దూరమై పుష్కర కాలం గడిచిపోయింది. చనిపోయే నాటికి ఆవిడ వయసు సుమారుగా 85 సంవత్సరాలు. దాదాపుగా పాతికేళ్ళ అనుబంధం మాది.

నా జీవితంలో అంత సహృదయం కలిగిన స్త్రీమూర్తిని నేను చూడలేదు. మా జీవితంలో ఒక్క విషయంలోనూ అభిప్రాయ భేదం రాలేదంటే మీరు నమ్మగలరా! కానీ ఇది అక్షర సత్యం. ఆవిడేమీ చదువుకోలేదు. ఆరుగురు కొడుకులు. కూతుళ్ళు లేరు. నేను ఐదవ కోడల్ని. నాతోనే కాదు ఏ కోడలితోనూ ఆవిడకు గొడవలు లేవు. నాకు కూతుళ్ళయినా కోడళ్ళయినా వాళ్ళే అని మురిపెంగా చెప్పుకునేది.

మా అత్తగారికి నాకూ ఎంత స్నేహం అంటే మా ఆయనకు నాకు మధ్య కొన్ని రహస్యాలు ఉన్నాయిగానీ, ఆవిడకీ నాకూ రహస్యాలే లేవు. అన్ని విషయాలు చెప్పేసేదాన్ని. ఈ మాట అబ్బాయితో అనకులేమ్మా!కోప్పడతాడేమో అనేది. ఆయన నన్ను ఒక చిన్న మాట కూడా అననిచ్చేది కాదు.

నన్ను అంతగా ప్రేమించే ఆవిడ మా పెళ్ళికి ముందు మాత్రం చాలా బాధ పడ్డారట. ఎందుకంటే ఆవిడకు ఒక కోయదొర ‘నీ ఆరుగురు కొడుకుల్లో ఒకడు నీకు దూరం అవుతాడు’ అని చెప్పాడట. అందుకని నన్ను పెళ్ళి చేసుకుంటానని ఆయన ఇంట్లో చెప్పడంతోటే ఆ కొడుకు ఈయనే అని అనుకున్నారు.

ఆ అమ్మాయి చదువుకున్న పిల్ల, పెద్దింటి పిల్ల నా కొడుకుని నాకు దూరం చేస్తుంది అని ఏడ్చిందట. అయినా కొడుకు మీద ఉన్న ప్రేమతో పెళ్ళిని కాదనలేక పోయింది. ఆ తరువాత నాకు ఆ సంగతి తెలిసి అడిగాను. ‘అమ్మాయ్!నువ్విలా కలిసిపోతావని నాకేం తెలుసు?’ అని నవ్వింది.

మేం మా ఊరికి వెళ్లినప్పుడు ఇద్దరం ఆరుబయట మంచం వేసుకుని కూర్చుని కబుర్లు చెప్పుకోవడం చూసి ‘ఏం పెద్దమ్మా! ఈ కోడలు గురించి అప్పుడు ఏడిస్తివే!’ అని ఆమెను చూట్టుపక్కల వాళ్ళంతా ఆటపట్టించేవాళ్ళు. మంచంలో ఉన్న మా మావగారికి ఏడేళ్ళ పాటు ఎంతో సేవ చేసింది. ఆయన చనిపోయిన ఇరవై రోజులకి మా పాప పుట్టింది. మనవరాలిని చూసుకోవడానికి అప్పుడు మా దగ్గరికి వచ్చేసింది. అప్పటినుంచీ మా అనుబంధం మరింతగా బలపడింది. మా కాలేజీ వెనకే మా ఇల్లు ఉండేది. ఎప్పుడైనా నేను కాలేజీ నుంచి రావటం లేటయితే కేరేజీ సర్దుకుని తెచ్చేసేది. సాయంత్రం ఇంటికి రాగానే ‘చూడు!ఎంత సాలిపోయావో’ అంటూ కొంగుతో మొహం అద్దేది. గ్లాసుతో మంచినీళ్ళు తెచ్చిచ్చేది. ఆవిడకి గ్యాస్ పొయ్యి వెలిగించడం అంటే భయం. అందుకని వెళ్ళి కాస్త కాఫీ కలుపుకుని తాగమని చెప్పేది. నేను చెప్పే కబుర్లన్నీ ఆసక్తిగా వినేది.

అప్పట్లో మాకు సప్లిమెంటరీ పరీక్ష పేపర్లు ఇంటికి ఇచ్చేవారు దిద్దడానికి. అవి నేను దిద్దుతుంటే నా పక్కనే కూచునేవారు. ఎవరైనా ఫెయిల్ అయ్యాడు అని తెలిస్తే ‘అమ్మాయ్! నాలుగు మార్కులు వేసి పాస్ చెయ్యమ్మా! పాపం! వాళ్ళ అమ్మానాన్నలు ఎంత కష్టపడి చదివిస్తున్నారో? ఏమో?’ అనేది. నా స్నేహితులందర్నీ ఆప్యాయంగా పలకరించేంది.

ఒకటేమిటి! ఆవిడతో ఎన్ని అందమైన స్మృతులు పెనవేసుకున్నాయో! ‘నా కొడుకుని కోరి చేసుకుంది కదా!’ అని ఎంతో అపురూపంగా చూసుకునేది.

పిల్లల నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించి ఎరుగదు. నా పెన్షన్ నాకు వస్తుంది. మీరెందుకివ్వాలి అనేది. నేనేమో ‘అత్తమ్మా! నీకు ఆరుగురు కొడుకులు ఉండీ నీ మందులు నువ్వు ఎందుకు కొనుక్కోవాలి? అయినా ఇది నీ కోడలి సంపాదన’ అని చెప్పి నేనే బలవంతంగా మందులకు, హాస్పిటల్‍కు ఇచ్చేదాన్ని. క్రిస్మస్‌కి, ఈస్టర్‌కి, రెండేసి చీరల చొప్పున కొనేదాన్ని. ఆ మాత్రానికే ఊళ్ళో అందరికీ నా కోడలు కొనిచ్చింది అని సంతోషంగా చూపించి చెప్పేది.

2002 లో మా అమ్మ చనిపోయింది. నేను ఏడుస్తుంటే ‘అమ్మాయ్! ఊరుకో! మీ అమ్మ లేకపోతే ఏం? నేను లేనూ!’ అని ఓదార్చింది.

అన్నట్టుగానే నాకు ఆపరేషన్ జరిగినప్పుడు నా తల్లిలాగే నాకు అన్ని సేవలూ చేసింది. కానీ ఆవిడకు ప్రేమను పంచడమే గానీ, సేవ చేసే భాగ్యం మాత్రం నాకు కలగలేదు. ప్రైవేటు, ఉద్యోగం కావడం, నెలకు రెండుకంటే ఎక్కువ సెలవులు ఇవ్వకపోవడం చేత ఆవిడకు అనారోగ్యం కలిగినప్పుడు మా శాంతక్కే (మా 4వ తోడికోడలు) ఎంతో సేవ చేసింది. కనీసం హాస్పిటల్ ఖర్చన్నా పెట్టుకుందామని బిల్లు మేం కడితే, కాస్త ఓపిక రాగానే బ్యాంకుకి వెళ్ళి మా డబ్బు వెనక్కి తిరిగి ఇచ్చేసింది. ‘నా కాడ లేకపోతే మీరు పెట్టాలి. ఉన్నాయి కదా!’ అని అన్నది. అప్పట్లో ఆ బిల్లు పెట్టుకుంటే 80 శాతం రీ-ఇంబర్స్మెంట్ ఉంటుందని మా వారికి తట్టలేదు. తరువాత ఎప్పుడో చాలా కాలానికి ఆ సంగతి గుర్తుకొచ్చింది.

నేను అందరికీ అన్నీ ఎక్కువ ఎక్కువగా ఇచ్చేస్తానని ‘అమ్మాయ్!ఎందుకలా అందరికీ అన్నీ పెడతావు, డబ్బులుంటే చద్ది పడతాయా!’ అంటూ మందలించేది. వెంటనే నేను ‘సంతోషముతో ఇచ్చెడివాని ఎంతో దేవుడు ప్రేమించునులే!’ అని ఒక బైబిల్ పాట పాడేదాన్ని. వెంటనే మురిపెంగా నవ్వుకునేది. అత్తమ్మా! దేవుడికి దశమభాగం ఎందుకు? ఎవరైనా పేదవాళ్ళకు నీకు తోచినంత సహాయం చేయచ్చు కదా! అని నేను, మా వారు కూడా చెప్పేవాళ్ళం. కొడుకు మాటంటే ఎంతో గురి ఆవిడకు. తరువాత తను కూడా తన పెన్షన్ తీసుకోగానే పిల్లలు పట్టించుకోని ఇద్దరు ఆడవాళ్ళకు చెరొక వంద రూపాయలు ఇవ్వటం మొదలుపెట్టింది. అలా ఆవిడను మా దారిలోకి మార్చేశాము. ఎన్నని చెప్పను?

మా అత్తమ్మతో అనుబంధం తీయతీయని జ్ఞాపకాల ఊట. దాన్ని తవ్వేకొద్దీ ఆనందాల దోసిళ్ళు నిండుతూనే ఉంటాయి. ఒక్కసారైనా, ఒక్క చిన్నమాట తేడా అయినా రాకుండా ఏ అనుబంధమూ ఉండదు. అత్తాకోడళ్ళ బంధం అసలే ఉండదు. కానీ మా బంధం మాత్రం లోకానికి భిన్నమనే చెప్పాలి. దానికి కారణం నూటికి నూరుపాళ్లు ఆవిడ సహృదయమే. ఇదంతా విని నేనెంత కట్నం తెచ్చానో! అనుకునేరు. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు సుమండీ!

అత్తను కూడా అమ్మలాగే చూసుకోవాలి అని నా తల్లి నేర్పిన సంస్కారం తప్ప నేను పట్టుకెళ్ళినది ఏమీ లేదు. ఆవిడ మధురస్మృతులు మనసంతా నిండిపోగా మనసులోనే మా అత్త(అ)మ్మకు అంజలి ఘటిస్తూ నేను సమర్పిస్తున్న నివాళి.

~

నరసం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అయినందుకు మేము గర్విస్తున్నాం..

ఒంగోలుకి చెందిన నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల వ్యవస్థాపక అధ్యక్షురాలు అరుణ తేళ్ళ – సింహాద్రి జ్యోతిర్మయి యొక్క వ్యక్తిత్వం గురించి ఇలా అన్నారు.

శ్రీమతి తేళ్ళ అరుణ, నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల వ్యవస్థాపక అధ్యక్షురాలు

“సింహాద్రి జ్యోతిర్మయి బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆమె గొప్ప అధ్యాపకురాలే కాక మంచి వక్త, పండితురాలు కూడా. పద్య కవిత్వం, వచన కవిత్వం, గేయ కవిత్వం మూడు సమానంగా రాయగలిగినటువంటి గొప్ప రచయిత్రి ఆమె. అంతేకాక సునిశితమైన హాస్యంతో సభను అలరించేలా మాట్లాడటం ఆమె ప్రత్యేకత. ఆమెను న.ర.సం. ఉపాధ్యక్షురాలుగా తీసుకున్న తర్వాత తన సాహిత్యప్రభలతో నరసాన్ని వెలిగింపచేస్తోంది. పరిపూర్ణమైన వ్యక్తిత్వం కలిగిన స్త్రీమూర్తి. ఆమె రాసిన పుస్తకాలు వచ్చినది ‘సుప్రభాత కందకం’ ఒకటే. అముద్రితంగా ఉన్నవి కొన్ని వేలసంఖ్యలో ఉన్నాయి. గేయ రామాయణం, అంతర్జాతీయ ప్రత్యేక దినాలు దగ్గరదగ్గర 300 దినాలపై ఆవిడ కవిత్వం రాశారు. అదే కాకుండా స్త్రీవాద కవిత్వం నుంచి ఎన్నో విభిన్న కోణాలలో స్త్రీలు పడుతున్న బాధల గురించి ఆమె రాసిన కవిత్వం ఎందరి హృదయాలనో కదిలించింది.

ముఖ్యంగా ఆమె వెంకన్న భక్తురాలు. ఆమెకు సింహాద్రి జ్యోతిర్మయి అనే పేరుతో ‘నా కవిత్వమే నా సంతకం’ అని టైటిల్‌తో ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఛానల్ ద్వారా పిల్లలకు తెలుగు సరళంగా ఎలా బోధించాలో ఆమె నేర్పిస్తున్నారు. అంతేకాకుండా మనం మర్చిపోయిన ఎన్నో తెలుగు పదాలను, సామెతలను, వివిధ ప్రక్రియలను ఆ ఛానల్ ద్వారా పరిచయం చేస్తున్నారు. ఆమె పిల్లలను ముఖ్యంగా తన విద్యార్థులను ఎంతో ప్రేమించేవారు. ఎప్పటికప్పుడు భాషలో, సబ్జెక్టులో నూతనత్వం ఉండాలి అని తపన పడి వినూత్నంగా పిల్లలకి ఆకర్షణయంగా పాఠాలు చెప్పటంలో ఆమె తన ఆసక్తిని, ప్రేమను, శ్రద్ధను విద్యార్థులు పట్ల చూపించేవారు. గలగల పారే సెలయేరులా కొన్నిసార్లు, ప్రశాంత గంగానదిలా మరికొన్నిసార్లు బహు ముఖరూపాలతో అరుదైన వ్యక్తిత్వంతో ఉన్న జ్యోతిర్మయి భవిష్యత్తులో తనకు సాటి లేదనిపించే కవయిత్రి అనిపించుకుంటుందనటంలో ఎంత మాత్రం సందేహం లేదు. స్నేహశీలి ఆయిన ఆమె నరసం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అయినందుకు మేము గర్విస్తున్నాం.

అటు కుటుంబాన్ని ఇటు సాహిత్యాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకుంటున్న ఆమె ధన్యురాలు.. ఇటీవల అంబేద్కర్ పై మణిపూర్ ఘటనపై అమ్మపై తనరాసిన గేయాలను ఇక్కడి సిటీ కేబుల్ ఛానల్ లో పని చేసే ప్రజా గాయకుడు శరత్ వీడియోలుగా చేసి ప్రదర్శించడం జరిగింది. అవి ఎంతో ఆదరణ పొందాయి.”

***

(మళ్ళీ నెల మరో గురువు పరిచయం)

Exit mobile version