Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వందే గురు పరంపరామ్-7

[శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు నిర్వహిస్తున్న ‘వందే గురు పరంపరామ్’ అన్న శీర్షికని దారావాహికగా అందిస్తున్నాము. ఈ నెల ‘మహామహోపాధ్యాయ’ బ్రహ్మశ్రీ డా. దోర్బల ప్రభాకరశర్మ గారిని పరిచయం చేస్తున్నారు రచయిత్రి.]

సద్గురుభ్యోనమః

“మానవ జన్మ, ముముక్షత్త్వం, మహాపురుషులతో స్నేహం – అనే ఈ మూడు లభించడం దుర్లభం కేవలం దైవానుగ్రహం వల్లనే ఇవి ప్రాప్తిస్తాయి.” – ఆది శంకరాచార్య

~

డా. దోర్బల ప్రభాకర శర్మ

‘మహామహోపాధ్యాయ’ బ్రహ్మశ్రీ డా. దోర్బల ప్రభాకరశర్మగారు మానవతావాది. సంస్కృత అవధూత. సరళ సంస్కృత భాషావ్యాప్తి జీవిత ఆశయంగా పనిచేస్తున్నారు.

తెలంగాణ మెదక్ జిల్లా రామాయంపేట గ్రామము వైదిక కార్యకలాపాలతో, నియమనిష్ఠలతో, వేదఘోషలతో, పండిత గోష్ఠులతో నిత్యమూ కళకళలాడుతూ ఉండేది.

దోర్బల రత్నయ్య దీక్షితులు ఉదయం 6 నుండి 12 వరకు అనుష్టానం, పౌరోహిత్యం చేసే నిత్యాగ్నిహోత్రులు, పౌరాణికులు ఇటువంటి వారికి నిలయమైన రామాయంపేట మంచి గురువులకు ఆవాసముగా ఉండేది.

తండ్రి రత్నయ్యదీక్షితులు, తల్లి అనంతలక్ష్మి

సర్వధారి నామ సంవత్సరం 1948 ఆశ్వీయుజమాసము, శుక్ల పక్షము, షష్టి తిథి, జ్యేష్ట నక్షత్రాన రామాయంపేటలో జన్మించారు. తండ్రి రత్నయ్యదీక్షితులు, తల్లి అనంతలక్ష్మి దంపతులకు అయిదవ సంతానంగా జన్మించారు.

పెద్దన్నయ్య దోర్భల విశ్వనాథశర్మ, చిన్నన్నయ్య దోర్బల దిగంబరశర్మ గొప్ప పండితులు. అక్కలు రమాదేవి, శారదాదేవి. చెల్లి ప్రభ.

ప్రభాకరశర్మగారి తాతగారు నిష్ఠాగరిస్టులు. పరమ భాగవతోత్తములు, శివభక్తులు వారి ఇంటి వెనుక భాగంలో వారు ప్రతిష్ఠించిన శివ కోవెలలోని శివయ్య ఇప్పటికీ వీరి చేతి అభిషేక జలాలకు పరవశించి పోతూనే ఉంటాడు.

తండ్రి రత్నయ్య దీక్షితులు చిన్న కూతురు ప్రభ మరణించడం వలన వైరాగ్యముతో ముందుగా శృంగేరి వెళ్ళి కంచి కామకోటి పీఠములో సన్యాసము గురించి అడుగగా వారు నిరాకరించారు. ప్రభాకరశర్మగారు కూడా తండ్రితో వెళ్ళి స్వామివారి ఆశీస్సులతో పాటు శారదామాత అనుగ్రహం కూడా పొందారు.

రత్నయ్యదీక్షితులు 1965లో విద్యాశంకరభారతీ స్వాములవారివద్ద సన్యాసం స్వీకరించారు. 1974 నుండి మచిలీపట్నంలోని గాయత్రీ పీఠం ఆశ్రమంలో పీఠాధిపతులుగా పనిచేశారు. అక్కడ నుండి చిదానంద భారతీ తీర్థస్వాములుగా ప్రసిధ్ధిగాంచారు.

తండ్రి సన్యాసం స్వీకరించడంతో ప్రభాకరశర్మగారి విద్యావ్యవహారాలు అన్నదమ్ముల పర్యవేక్షణలో నిజామాబాద్ లోని ఇందుపురిలో జరిగింది. సోదరుల ప్రేరణతో తరువాత నిజామాబాద్ లోని రఘునాథ సంస్కృత పాఠశాలలో చేర్చారు.

హైదరాబాద్ లోని ‘వెంకటేశ్వర వేదాంతవర్ధని’ సంస్కృత కళాశాలలో న్యాయశాస్త్రంలో స్నాతదీక్ష తీసుకున్నారు. శ్రీ కోవెల కందాళై శఠగోప రామానుజాచార్యులు, శ్రీ పరకేడ్ కృష్ణాచార్య శ్రీచరణులు, శ్రీ శాస్త్రుల విఠలా శాస్త్రి శ్రీచరణులు, శ్రీ ఖండవల్లి నరసింహశాస్త్రి శ్రీచరణులు మొదలైన వారి పర్యవేక్షణలో సాగింది.

విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ‘దర్శన ఆచార్య’; ఎం. ఏ. ‘విద్యా వారధి’ చేసి, తరువాత పిహెచ్డి పూర్తి చేశారు.

పిహెచ్‌డిలో తీసుకున్న అంశం ఏమిటి, మీ పర్యవేక్షకులు ఎవరు, ఆ సమయంలో ఉపకులపతిగా ఎవరున్నారు అని అడిగితే,

“న్యాయ వైశేషిక యోః ఆత్మతత్త్వ సమీక్షణం
పథ నిర్దేశకులు
శ్రీ పి. శ్రీరామ్మూర్తి గారు
మరియు
శ్రీ అక్కుభొట్ల శర్మగారు ఉప సహాయకులుగా ఉన్నారు.” అని చెప్పారు.

ప్రభాకరశర్మగారు ఏకసంథాగ్రాహి. అలవోకగా అనేక గ్రంథాలు అధ్యయనం చేశారు. కాళిదాసు ‘అభిజ్ఞాన శాకుంతలం’ అంటే ఇష్టం. అందుకే ఆ నాటకాన్ని అనేకసార్లు తనదైన శైలిలో ప్రదర్శింప చేశారు.

శ్రీమతి లలిత శ్రీ ప్రభాకరశర్మగారు

ప్రతిదీ ఆచరించి ఇతరులకు చూపించే తత్వం ఆయనది. అందుకే తాను నమ్మిన సంస్కృత భాష వ్యాప్తి కోసం వివాహం అయిన వెంటనే సతీమణి అయిన శ్రీమతి లలితను ఆయన సంస్కృతంలో దిట్టను చేశారు.

శ్రీ ప్రభాకరశర్మగారు తన ఇంటికి వచ్చిన వారితో సంస్కృతం మాట్లాడడం

వారి బంధువులు పాలవాడు, పనిమనిషి, ఆటో వాడు కూడా సంస్కృతమే మాట్లాడుతారు. చిన్న చిన్న పదాలతో పిల్లలకు అర్థమైనట్లు కృష్ణ లీలలు చేయగలరు.

“సంస్కృతభాషపై ప్రేమ ఎలా కలిగింది? మీ విద్యాభ్యాసం గురించి తెలియజేయండి?” అని అడిగితే, “మా తండ్రిగారు, మా అన్నగారు పురాణాలు చెప్పడం వలన, బోధించడం వలన సంస్కృతంపై అభిరుచి కలిగింది. నిజామాబాద్ ఇందుపూర్‌లో ఉర్దూ,తెలుగు పాఠశాలలు ఉండేవి. రామాలయంలో సంస్కృత ఉన్నత పాఠశాల పెట్టడం వలన అందులో చేర్చారు.” అని చెప్పారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంట్రన్స్ పరీక్ష రాశారు. న్యాయశాస్త్రం అధ్యయనం చేశారు. అందులో పదార్థవిచారణశాస్త్రం, రసాయనశాస్త్రం, వేదాంతశాస్త్రం మొదలగునవి అభ్యసించారు.

“మీరు న్యాయ శాస్త్రం చదువుకున్నప్పుడు అనేకమైన శాస్త్రాలను చదువుకున్నారు. వేదాంత అధ్యయనం చేశారు. ఇందులో మీకు ఏది అంటే ఎక్కువ ఇష్టం?” అని అడిగితే, “నిజం చెప్పాలంటే అన్ని శాస్త్రాలు ఇష్టమే. ఎందుకంటే తప్పనిసరిగా వేదాంత అధ్యయనం చేయాలి. సాహిత్య అధ్యయనం చేయాలి. వ్యాకరణం నేర్చుకోవడం అవధానాల కోసం ప్రారంభించాను. అందువలన నాకు ప్రతి విషయము పట్ల అభిరుచి ఉంది. కానీ న్యాయశాస్త్రముపై పట్టు ఉంది.” అని తెలిపారు.

భారత టుడే ఛానల్‌లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు వారు అడిగిన తిరుపతితో అనుబంధం గురించిన ప్రశ్నకు – తిరుపతితో అనుబంధం నిత్యానుబంధం. దైవికం – అని జవాబు ఇచ్చారు. వేద పాఠశాలలో సంస్కృతం కోసం ఒక కమిటీని సహాయకులుగా ఇచ్చి కార్యక్రమాలను చేశారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్‌లో సంస్కృతంలో భగవద్గీత చెప్పారు.

భగవంతుని యెడల అమిత భక్తి ప్రపత్తులు కలవారు ఇతరులను కూడా తరింప చేస్తారు. పరమ భాగవతోత్తములు. నారదమహర్షి చెప్పిన మూడు భక్తి సూత్రాలను రంగరించి, 64 విధాల ‘వెంకటేశ్వర మానస పూజా పుష్పం’  అనే మహత్తర ఆధ్యాత్మిక గ్రంథాన్ని అందించారు.

ఉద్యోగ జీవితము:

~

కుమార్తె గౌతమి హరిప్రియ

~

మీరు చేసిన అనేక కార్యక్రమాలలో మీకు బాగా నచ్చిన కార్యక్రమం చెప్పండి అని అడిగినప్పుడు, ‘బాలానంద సంఘం’  గురించి చెప్పారు.

వీరి ఇంట్లో ఉంటున్న బాలికలు

‘బాలానంద సంఘం’ పేరుతో 10 నుండి 20 సం.ల వయసు గల అనాధ పిల్లలను చేరదీసి తన ఇంటిని ఆవాసంగా ఇచ్చి తన ఏకైక కుమార్తె గౌతమి హరిప్రియతో సమానంగా పెంచారు. వారికి మన సంస్కృతిని నేర్పడం కోసం నడిపారు. మన సంస్కృతి నేర్పుతూ ఒక పది ఇరవై సంవత్సరములు నడిపారు. సంస్కృత కళాశాల వాతావరణం వారి అభివృద్ధికి ఎంతో దోహద పడింది. సంస్కృత కళాశాల వాతావరణం, సంస్కృత తెలుగు పండితుల వద్ద కవిత్వం వ్యాకరణం కావ్యాలు చదవడం భావుకత, శాశ్వతత్వం ఇవన్నీటి గురించి నేర్చుకోవడం జరిగింది.

~

దేవభాష వ్యాప్తి కోసం ప్రభవించిన వేదవ్యాసుడు.

సంస్కృతం క్షీరం గృహే గృహేచ పునరపి / జ్ఞానవైభవం వేదవాజ్ఞ్మయం

ధర్మం తెలుసుకోవాలంటే పూర్వులు చెప్పినది తెలుసుకోవడమే విద్య

75 సం.ల వయసులో 18 గంటలు పరిశ్రమిస్తున్న ఋషి పుంగవులు.

తన జీవితకాలంలో గురుస్థానాన్ని, ఆచార్యస్థానాన్ని ఎన్నడో అందుకున్నారు.

~

ఆయన నిర్వహించే కార్యక్రమాలు

2013 సం. గుడివాడలో త్యాగరాజస్వామి 166వ ఆరాధన ఉత్సవాల సందర్భంగాత్యాగరాజస్వామి ‘రామ భక్తి సామ్రాజ్యం’  అనే అంశంపై వ్యాఖ్యానం చేశారు ఈ సందర్భంగా ప్రార్థనా గీతం ఈ విధంగా పాడారు.

“యా సంస్కృతి సంప్రదాయ జననీ
యా సర్వభాష ప్రసూః
యా దేశస్య జనస్య సర్వ వచసాం చ ఐక్య ప్రధానోదయతా
యా వేదోపనిషత్ పురాణచయ సత్కావ్య శ్రీయం రాజతే
సా భాషా ద్యు సదాం జయ సదా విజయతాం ఆ చంద్ర తారారుణం”

సంగీతకళాశాల ప్రధానాచార్యులు, జ్ఞానానంద తీర్థుల శిష్యులు, నోరి నాగభూషణంగారి శిష్యులు అయిన శ్రీ ఓగిరాల వీర రాఘవశర్మగారి వద్ద నేర్చుకున్న కొద్దిపాటి సంగీత కృప వలన ఈ మాత్రం వారి అనుగ్రహం వలన పద్యం గానం చేయగలిగే అదృష్టం కలిగింది అని తెలిపారు.

ధర్మమూలం పౌరోహిత్య వ్రతం అని చెప్తుండగా, “ధర్మము ద్వారా సమాజం యొక్క పరివర్తన చేయవలసిన కర్తవ్యం ఉండగా సమాజం చేత ధర్మము యొక్క పరివర్తన చేయవలసిన దుస్థితిలో మనం ఉన్నాం” అంటూ విజయేంద్ర శంకరులవారు అనగా, మనలో ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ ‘గురుచరణారవింద సమీపే ఏకత్వం భవతు’  అని ప్రభాకరశర్మగారు ముక్తాయింపు పలికారు.

సందర్భానుసారం మాట్లాడగలిగే సామర్థ్యం, నైపుణ్యతా గల మహా పండితులు, మహా మహోపాధ్యాయులు డాక్టర్ దోర్బల ప్రభాకర శర్మగారు.

పురోహితుల భాష సంస్కృతం. వారు సంస్కృతం వదిలివేసిన దగ్గర నుంచి సంస్కృతం యొక్క ప్రభావం తగ్గిపోతోంది. సంస్కృత అధ్యయనం, వేదాధ్యయనం చేశాక, ధర్మ శాస్త్రాన్ని ఆలంబనగా చేసుకుని, పౌరోహిత్యం చేస్తే, మన ధర్మం, మన భాష, మన వృత్తి, మన గౌరవం నిలబడుతుంది అన్నారాయన.

దీనికి నాలుగు మూల స్తంభాలు 1. అదీతిః 2. బోధః 3. ఆచరణ 4. ప్రచార ఇతి. “ఈ నాలుగు సవ్యంగా ఉన్న రోజు సమాజాన్ని మార్చగల శక్తి పురోహితులకు వస్తుంది.” అని అన్నారు నిర్భయంగా.

ఈ సందర్భంగా కంచి కామకోటి పీఠాధిపతులపై సంస్కృతంలో రాసిన స్తుతి వారు పఠనం చేస్తూ ఉండగా వినడం అనేది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఈ కాలంలో అంత వేగంతో సంస్కృతం చదవడం అనేది ఎక్కడో ఒకరిని చూస్తాము. వీరు కారణజన్ములు కనుక అది సాధ్యపడింది.

భక్తులను నిరంతరం భక్తి మార్గంలో నడిపించే నిరంతర సంఘ సేవ పరాయణులు సంస్కృతభాషలో శతావధానులు. పుంభావ సరస్వతి. ఆచార్య దోర్బల ప్రభాకరశర్మగారు.

తెలుగు భాషకా? సంస్కృత భాషకా? దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి? చాలామంది వీరిని అడుగుతారు. అందుకు జవాబుగా, “భారతదేశంలో పూర్వం ఛప్పన్నదేశాలు (56) ఉండేవి. అన్ని భాషలు, అన్ని రాజ్యాలు ఉండేవి. అన్నిటికీ అనుసంధాన భాష సంస్కృతం. శిలాశాసనాలు, తాళపత్ర గ్రంథములు, సంస్కృతంలో ఉన్నాయి. సంస్కృతం మాతృభాష అయితే ఇతర భాషలు దాని బిడ్డలు. ప్రామాణికతకు సంస్కృతమే మూలం. భాష అనేది ఎదుటివారి కోసం మనం నేర్చుకోవాలి. మాట్లాడాలి. ఎందుకంటే మనలో మనం మాట్లాడుకుందికి భాష అక్కరలేదు. అలాగే సృష్టిలోని ఇతర జీవజంతువులకు భాష లేదు. మనిషికి మాత్రమే ఉన్నది. భవిష్యత్తు దృష్ట్యా మనం అనాగరికులం అనిపిస్తోంది. ఎందుకంటే 250 కుటుంబాలు అమెరికాలో సంస్కృతం పట్ల అభిరుచిని చూపిస్తున్నారు. భారతీయ కళలను ఆదరిస్తున్నారు. కానీ భారతదేశంలో మన దేశీయతను, మన జాతీయతను పోగొట్టుకుంటున్నాము” అని చెప్పారు.

~

భాషా పరిరక్షణకు మీరు చేసే కార్యక్రమాలు ఏమిటి? అన్న ప్రశ్నకు, “ముందుగా మనకు ఉండవలసినది భాష పట్ల అభిమానం జీవనం అంటే ధర్మం పట్ల అభిమానం కలిగి ఉండాలి శ్రవణం అంటే వినడం ద్వారా ఆ భాష యొక్క అందము భావము తెలుస్తాయి. ప్రస్తుతం తెలుగు భాష మృత భాష అవుతోందని అందరూ వాపోతున్న తరుణంలో తెలుగు మాట్లాడేవారు కూడా ఆంగ్లభాష పదం వాడకుండా తెలుగు మాట్లాడలేకపోతున్నారు. దీనికి కారణం ఇది ఒక తెలుగుకు మాత్రమే పరిమితం కాదు. అన్ని భాషలూ ఇదే సమస్యతో కొట్టుమిట్టాడుతున్నవి. వేదం సంస్కృతం లాగా విశాలమైనది. యాది సస్య జనస్య ఐక్య ప్రధానో సర్వ కార్య శ్రేయః సదా విజయానికి తార్కాణం. అన్ని శాస్త్రాలు ఇష్టమే! వేదాంత అధ్యయనం, సాహిత్య అభిరుచి, వ్యాకరణం వీటన్నిటిని అవధానాల కోసం నేర్చుకోవడం జరిగింది” అని జవాబిచ్చారు.

సంస్కృతం నేర్చుకోవడం కష్టం అనే వారికి మీ సమాధానం ఏమిటి? అని అడిగితే, “సంస్కృతం నేర్పడం చాలా సులభం” అంటూ – “సరళ సంస్కృత భాషణం/జగతి భారత పూర్వవైభవ శక్తి గౌరవ కారణం/ స్వయం వచో ముక్తకంఠం/మధుర సంస్కృత భాషణం” అని అన్నారు.

ఎప్పుడూ చుట్టూ విద్యార్థులను పెట్టుకొని వారికి ఏదో బోధిస్తూ చెబుతూ కనిపిస్తారే తప్ప ఒంటరిగా ఎప్పుడు కనబడరు. ధ్యాన సమయంలో కనిపిస్తారు తాను చెబుతూ సంస్కృతం సరళ పదాలను సరళ వాక్యాలను పిల్లల చేత చెప్పించుతారు. అలాగే శారీరక హావభావాల ద్వారా వాటి అర్థం తెలుసుకునేటట్లు చూస్తారు. ఈ విధంగా అనేకమందికి ఒకేసారి చెప్పడం అనేది వాళ్ళు నేర్చుకోవడం అనేది జరుగుతుంది.

అవసరం అనేది ఏర్పడితే ఏ భాష అయినా వస్తుంది. ఇది ధర్మం ఇది మన భాష అనే ఇష్టంతో నేర్చుకుంటే తొందరగా వస్తుంది.

“సంస్కృతం ‘ దేవభాష’  అని తక్కువ పదాలలో ఎక్కువ భావం చెప్పవచ్చునని అంటారు. సంస్కృతానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి?” అన్న ప్రశ్నకు జవాబుగా, “సంస్కృతం ఋక్ వ్యాకరణ శుద్ధమైన భాష. అశ్లీలత లేని భాష సంస్కృతం. త్రిలింగ తెలంగాణ తెలుంగుగా మారింది అలసత్వం ఆలస్యం ఒకే అర్థంలో వాడుతున్నారు. ఒకానొక సమయంలో మన పూర్వీకులలో చాలామందికి అష్టవిద్యలు వచ్చి ఉండేవి. కానీ అందరికీ అవి పనికిరావు. విజ్ఞానము అనర్ధదాయకమై వినాశానికే కారణమని నిరూపించబడింది. అందువలన ఏది ఎవరికి ఎంత చేరాలో అంతవరకు నేర్పాలి. తల్లిదండ్రులను గౌరవించడం, ఆచార్యులను గౌరవించడం, మన సంస్కృతిని నిలపాలంటే మన కుటుంబ వ్యవస్థను పునరుద్ధ్ధరించుకోవాలి.” అని అన్నారు.

సతీ సమేతంగా సంప్రదాయబద్ధంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించడం

“మీరు అనేక సంస్కృతగ్రంథాలు చదివారు కదా! అవి భాషా కౌశలం పెంపొందించుకుందికే తప్ప వాస్తవంగా ప్రయోజనం ఉంటుందా? ఈరోజుల్లో?” అని అడిగితే, “సంస్కృతం వినకపోవడం వలన చదవకపోవడం వలన వచ్చిన దురభిప్రాయం ఇది. సంస్కృత గ్రంథాలు ఏవి చదివినా అవి ధర్మాన్ని తెలియజేశాయి. అధర్మ గ్రంథాలు లేనే లేవు. వృత్త సాహిత్యంలో వేల గ్రంథాలు ప్రచురింపబడ్డాయి. సంస్కృత కవులు రచయితలు, ఉద్యమంతో రాశారు. వాక్యపద దోషాలు ఉన్నాయి గాని ధర్మ విరుద్ధంగా ఉన్న కావ్యం లేదు. పరిశీలించకపోవడం, చదవకపోవడం, సంస్కృతం రాకపోవడం ఈ మూడు తప్పులు.  ధార్మికమైన వార్తల ప్రచారం కంటే రాజకీయ నాయకుల అవినీతి అధర్మ వార్తలు మనకు మీడియా ఎక్కువగా చూపిస్తుంది. ధార్మికదేశంలో ప్రముఖ వార్తలు ధార్మికమైనవే ఉండాలి. ప్రాధాన్యత దానికే ఉండాలి. సత్యానికి ప్రాధాన్యత లేదు. ఉండదు. అటువంటి అప్పుడు ధర్మానికి గ్లాని జరగకుండా మనకు కావలసిన హిందూ ధర్మాన్ని నేర్పలేదు. భాషా సాంస్కృతిక రంగాలకు ఆటంకము ఏర్పడుతుంది. అందువలన భాష అంటే సంస్కృతి తెలంగాణ భాషను విలన్లకు మాట్లాడే భాషగా వాడారు. అనేక మీడియాలో మన సంస్కృతిని పాటించడం అగౌరవంగా భావించేలాగా చేశారు. అదే విధంగా కుటుంబ నియంత్రణ అనేది హిందువులకు మాత్రమే పరిమితం చేశారు” అన్నారు.

కుటుంబ నియమావళి ప్రకారం గో సేవ

ధర్మపరిషత్తులో హిందూ కుటుంబంలో ఉండాల్సిన మూడు ముఖ్యమైన నియమాలు ఒకటి సత్యం పలకమని రెండు గో సేవ చేయాలని మూడు వ్యవసాయ క్షేత్రంలో పనిచేయాలని.

~

“మీరు సంస్కృత భాషాభివృద్ధి అనే జాతీయోద్యమంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. మీకు అవరోధాలు ఏర్పడలేదా? ఏర్పడితే ఎలాంటివి?” వివరించమని కోరినప్పుడు, “ఈ దేశంలో వాక్ స్వాతంత్రం ఉంది. నేను చెప్పేది మంచి విషయం కనుక అందరూ వింటున్నారు. ప్రోత్సహించిన వాళ్లు ప్రోత్సహిస్తున్నారు. గౌరవిస్తున్నారు. అవరోధము అంటే హిందూ బ్రాహ్మణ అభిమానులే దీనిని నమ్మడం లేదు. పాశ్చాత్యాభిమానులుగా ఆ భాషా సంస్కృతి పట్ల మారిపోతున్నారు. అందువలన ముందు మన సంస్కృతిని నిలపాలంటే మన కుటుంబ వ్యవస్థను పునరుద్ధరించుకోవాలి” అని అన్నారు.

~

శ్రీ ప్రభాకరశర్మగారు రాసిన గ్రంథములు

సంస్కృత నాటికలు, భక్తి గీతాలు, దేవతా శ్లోకాలు రాశారు. లఘుకావ్యాలు ఎన్నో రాశారు. వీరి రచనలు ప్రదర్శనా యోగ్యమైనవి. పండితుల మెప్పు పొందడమే కాక విమర్శకుల మెప్పును కూడా అందుకున్నవి.

ఈ పుస్తకాలు ఆన్లైన్ తెలుగు బుక్ స్టోర్ శ్రీ శివ కరుణామృతము దోర్భల విశ్వనాథ శర్మ గారి వద్ద, www.vedadharma.org అనే వెబ్‌సైట్ లోను కొనుగోలు చేయవచ్చు.

‘మహా మహోపాధ్యాయ’ దోర్బల ప్రభాకర్ శర్మ గారి సందేశం

ఎస్.ఎల్.ఎం.టి.ఎస్. వేద పాఠశాల బంధువులకు తన సందేశమును వ్రాతపూర్వకంగా ఇచ్చారు. వారితో చాలా సమయం గడిపి సంస్కృత నాటకమును విద్యార్థులు వేశారు.

తాను సంపాదించిన సమస్తాన్ని ఇతరులకు ఖర్చు చేసి, సంపాదించిన ప్రతి రూపాయిని పేదవాడికి ఖర్చుచేసి, మన కళ్లముందున్న శిబి చక్రవర్తి శ్రీ ప్రభాకరశర్మ దాతృత్వం, ప్రియ వక్తృత్వం, ధీరత్వం, స్థితప్రజ్ఞత్వం ఛత్వారే సహజ గుణః అభ్యాసేన లభ్యతే అంటారు. అది నిజమని వారిని చూస్తే తెలుస్తుంది.

కుటుంబ సభ్యుల ఆత్మీయ కలయిక

~

అవధాన ప్రక్రియలో ఈయనకు ఈయనే సాటి. సంస్కృత, తెలుగు పండితులైన రావూరి వేంకటేశ్వరరావు; రెంటచర్ల శ్రీనివాసాచార్యులు వద్దకొంత శిక్షణ తీసుకున్నారు. అవధానాలు చేయాలంటే అధ్యయనము, కవిత్వము, భావుకత, వ్యాకరణము, మొదలగునవన్నీ రావాలి అప్పుడు వాటికి శాశ్వతత్వము ఉంటుంది. దేశంలోని అనేక ప్రాంతాలలో ఆయన చేసిన సంస్కృత అష్టావధానాలకు, శతావధానాలకు లెక్కలేదు.

శృంగేరిలోని శంకరమఠం, రామకృష్ణ మఠాలలోనూ, దత్తపీఠంలోనూ, తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలోనూ, పాండిచ్చేరిలో గల రాష్ట్రీయ సంస్థాన్ లోనూ, పూణే లోని తిలక్ విద్యాపీఠంలోనూ ఆయన చేసిన సంస్కృత అవధానం పండితుల ప్రశంసలకు పాత్రమైంది.

సంస్కృత భాషా వ్యాప్తి కోసం కాశీలోని హిందూ విశ్వవిద్యాలయంలో ఆయన చేసిన సంస్కృత శతావధానాన్ని చూసిన పలువురు పండితులు పీఠాధిపతులు ఆయన అపూర్వ జ్ఞానానికి పాండిత్యానికి అబ్బురుపడి జేజేలు పలికారు.

సంస్కృత అష్టావధానము నిర్వహిస్తూ..

హైదరాబాదు రవీంద్ర భారతిలో జరిగిన సభలోని అష్టావధానంపై ఆయనకున్న అపార ప్రతిభకు తార్కాణంగా నిలుస్తాయి నిరుపమ అవధాన ప్రక్రియలో ఆయనకు ఆయనే సాటి.

తెలుగు రాష్ట్రాలలో ఆయన అవధానం చేయని విశ్వవిద్యాలయం లేదంటే అతిశయోక్తి కాదు విశ్వవిద్యాలయ వీధుల్లో సంస్కృత భాషా వైభవానికి పునర్వైభవం కావాలని ప్రతిక్షణం ఆరాటపడుతున్న అభినవ కాళిదాసు మన ప్రభాకర్ శర్మగారు.

నమోస్తు గురవై ఇష్టదేవ స్వరూపిణైః

య వాగమృతం హన్తి. సంకులమ్

కొవ్వూరులోని పురుషోత్తమ ధర్మప్రచార సభ, షిర్డీ సాయి ఆధ్యాత్మిక కేంద్రం, ఆంధ్ర గీర్వాణి విద్యాపీఠం గుంటూరులోని శ్రీ చైతన్య తపోవనంలోనూ అనేక కార్యక్రమాలు నిర్వహించారు. జెమిని టి.వి.లో రఘు వంశంలో సంస్కృతాంధ్ర ప్రసంగం చేశారు..

~

బిరుదులు-పురస్కారాలు

వేద సంస్కృత పాఠశాల అనేక అఖిల భారత సంస్థలతో పురస్కారాలు బిరుదులు అనేకం అందుకున్నారు.

దోర్బల ప్రభాకర శర్మ దంపతులకు సన్మానం

అత్యున్నత పురస్కారం ‘మహా మహోపాధ్యాయ’  బిరుదు.

ఆయన నిర్మలత్వం, నిరాడంబరత్వం ఆయనను అవధూతగా నిలుపుతాయి. ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండే పసి పిల్లవాడి మనస్తత్వం పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ పసి పిల్లవానిగా ఆనందిస్తారు.

~

శాస్త్ర విషయాలు చర్చిస్తున్నప్పుడు మహా జ్ఞాని. భజనలు చేస్తున్నప్పుడు భక్తితో తూలిపోతారు. ధ్యానం చేస్తూ మహాయోగిలాగ వెలిగిపోతారు. విద్యార్థులకు బోధిస్తూ మహా మేధావిలాగా భాసిస్తారు. నాట్యం చేస్తూ నటరాజులాగా, ఉపాధ్యాయులతో సంభాషిస్తూ ఆత్మీయుడిలాగా, గోవులతో మమేకమై జీవప్రేమికునిలాగా, మహిళలతో దైవ సేవకుడిగా, ధర్మసందేహాలు తీరుస్తూ ఋషిలాగా, అయిన వారితో అన్ని మరచి పసి బాలుడిగా – ఒకే వ్యక్తి బహురూపిగా ప్రత్యేక ప్రయోజనాలు వ్యక్తి నుంచి వ్యవస్థగా ఎదిగిన మహనీయుడు.

పురవీధులలో భజనలు చేసుకుంటూ వచ్చిన శర్మ గారిని పాద పూజలు చేసి కృష్ణునిగా పూజించడం

ఆయన దృష్టిలో సంస్కృతభాష ప్రియమైనది అంటారు. ప్రేక్షకులకు సంస్కృతం వినిపించడం వలన అభిరుచి పెరుగుతుంది. మనకు భాష ఎందుకు రాదు అంటే??? వినకపోవడం వలన రాదు. అవసరం లేకపోవడం వలన రాదు. భాష వెనుక సంస్కారం ఉంటుంది.

ధర్మమూర్తికి, సంస్కృతభాష తల్లి రూపునకు, బహుముఖ ప్రజ్ఞాశాలికి, యోగికి, వేదమూర్తికి పురస్కారాలన్నీ తృణప్రాయం.

ఏమిచ్చి ఆయన ఋణం తీర్చుకోగలం? మనం కూడా మన బాటను నడచి, అనేక విషయాలపై జ్ఞానసంపదను తనలో ఇముడ్చుకున్న సంస్కృత భాషను నేర్చుకుంటూ పదిమందికి నేర్పుతూ ముందుకు సాగడమే!

~

“మీకు భాష పట్ల ఇంకా ఉండిపోయిన కోరిక ఏమిటి? అదే మీ లక్ష్యం అనుకుందామా?” అని అడిగితే, “17 సంవత్సరాల నుండి, 75 సంవత్సరాల వరకు సంస్కృతభాష నా ప్రాణంగా పనిచేస్తూ ఉన్నాను. నేను 90 సంవత్సరములు బ్రతికి ఉంటే అన్ని రాష్ట్రాలలో సంస్కృతం మాట్లాడేటట్లు చేయాలని ఉంది. 100 సంవత్సరములు బ్రతికి ఉంటే విశ్వమంతా సంస్కృతం మాట్లాడేటట్లు చేయాలని ఉంది” అన్నారు నవ్వుతూ.

చూశారా! అందుకే వారు మహనీయులు. మహామహోపాధ్యాయులు. అటువంటి గురుపరంపరలోని గురువులకు మనసా ప్రణామములు.

***

(మళ్ళీ నెల మరో గురువు పరిచయం)

Exit mobile version