[తరాలు మారుతున్నాయి. సమాజం వేగంగా పరుగులు తీస్తోంది. విశ్వగ్రామం అనే సిద్ధాంతం ప్రబలింది. 1947లో పుట్టి 80వ ఏట కాలిడబోతున్న ప్రముఖ రచయిత డా. రేవూరు అనంత పద్మనాభరావు మూడు తరాల ప్రముఖులతో కలిసి మెలిసి తిరిగారు. ఆ జ్ఞాపకాల పందిరిని దారావాహికంగా అందిస్తున్నారు.]
సాహిత్య దౌత్యవేత్తలు
విదేశాలలో దశాబ్దాలుగా స్థిరపడి సాహిత్య సాంస్కృతిక సేవ చేస్తూ తెలుగు సాహిత్యాన్ని, సంస్కృతీ మూలాలను కాపాడుతున్న వ్యక్తులలో నేనెరిగిన వారిని పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. 1960వ దశాబ్దంలోనో ఆ తర్వాతనో అమెరికాకు విద్య నిమిత్తం లేదా వృత్తిపరంగా చేరుకొని అక్కడ స్థిరపడిన కుటుంబాలు వేల సంఖ్యలో వుంటాయి. యాభై రాష్ట్రాలలో కొన్ని ప్రధాన పట్టణాలలో – న్యూయార్కు, చికాగో, శాన్ ఫ్రానిస్కో లలో వారు ఇళ్లు వాకిళ్లు ఏర్పరచుకొని తెలుగు సముదాయాలుగా ఏర్పడి ఆటా, తానా వంటి సంస్థలను ఏర్పరచుకొని రెండేళ్ల కొకసారి సంబారాలు జరుపుకొంటున్నారు. రెండో తరం పిలలు అక్కడే పుట్టి పెరిగి విద్యాబుద్ధులు నేర్చుకొని స్థిరపడ్డారు.
సాహిత్యపరంగా ప్రముఖ వ్యక్తులు వీరు:
విశ్వనాథ అచ్యుతదేవరాయలు:
కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ జేష్ఠ కుమారులు అచ్యుతదేవరాయలు. దూరదర్శన్ (ఢిల్లీ) లో ఛీఫ్ ఇంజనీరుగా పని చేసి పదవీ విరమణ చేశారు. అమెరికాలో స్థిరపడ్డారు. సంస్కృతాంధ్రాలలో దిట్ట. వీరి రచనలు – మా నాయనగారు, సీత, విశ్వేశ్వర మధ్యాక్కరలు, కథావీధి ప్రసిద్ధం. 2002లో వంగూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిట్టన్ రాజు ఏర్పాటు చేసిన సభలో వారిని నేను మరో మారు కలిశాను. తొలిసారిగా 1979లో ఆయన విజయవాడ దూరదర్శన్ కేంద్రాన్ని కొండపల్లి పై ఏర్పాటు చేసేందుకు సర్వే చేయడానికి రాగా నేను ఆకాశవాణికి యింటర్వ్యూ చేశాను. ఆయన పద్యం చదివితే విశ్వనాథ స్వయంగా గానం చేసినట్లు వినిపించేది.
డా. జంపాల చౌదరి
అమెరికాలో స్థిరపడి సాహిత్య సేవ చేస్తున్న డా. జంపాల చౌదరి, అరుణ దంపతులను డైటన్‌లో 2002లో కలిశాను. చౌదరి పశ్చిమ గోదావరి జిల్లా చాటపర్రులో జన్మించారు. తెనాలి వి.యస్.ఆర్ కళాశాల విద్యార్ధి. గుంటూరు మెడికల్ కాలేజిలో యం.బి.బి.యస్. చేశారు. 37 సంవత్సరాలు నార్త్ చికాగో, డైటన్ వైద్య కళాశాలల్లో బోధించారు. చికాగో మెడికల్ స్కూల్‌తో అనుబంధం. తానా ప్రారంభ దశలో ఆద్యులు. FOUNDATION FOR DEMOCRATIC REFORMS IN INDIA సంస్థ వ్యవస్థాపకులు. సైకియాట్రిక్ అసోసియేషన్ గౌరవించింది. తెలుగు సాహిత్యం పై ఆభిమానంతో కుమారులకు వేమన, నన్నయ అని పేర్లు పెట్టారు. ప్రస్తుతం చికాగోలో స్థిరపడ్డారు. మానసిక వైద్య పరిశోధనలో అగ్రగణ్యులు. సహృదయులు.
భువనవిజయం నాటకంలో నూనెజ్గా డా. పద్మనాభరావు
డా. శారదాపుర్ణ శొంఠి దంపతులు
చికాగోలో 1975 నుండి స్థిర నివాసమున్న శారదాపూర్ణ శ్రీరామ్ దంపతులు సంగీత సాహిత్య పోషకులు. సుసర్ల గోపాలశాస్త్రి తనయ శారదాపూర్ణ. 1951లో తిరుపతిలో జన్మించారు. ‘తాళ్లపాక అన్నమాచార్య నృత్య సంగీత కళాభిజ్ఞత’ అనే అంశం పై 1997లో పి.హెచ్.డి పొందారు. 2010లో సంస్కృతంలో పి.హెచ్.డి సాధించారు. 1989లో SAPNA – అన్నమాచార్య ప్రాజెక్టు ఇన్ నార్త్ అమెరికా సంస్థను స్థాపించి ఏటా సంగీత, సాహితీవేత్తలను చికాగోకు ఆహ్వానించి సదస్సులు నిర్వహిస్తున్నారు. 2002లోను, 2003లోను నేను అన్నమాచార్య కీర్తనలపై చికాగోలో ప్రసంగించాను. ‘బ్రాహ్మి’ సాహిత్య పత్రిక సంపాదకురాలుగా సంచికలు వెలువరించారు. 1996లో డా. కె. వి. రమణాచారి కడప కలెక్టరుగా, నేను ఆకాశవాణి డైరక్టరుగా వున్న సమయంలో శారదా శ్రీరామ్ దంపతులు తాళ్లపాకలో అన్నమయ్య స్మారకం ఏర్పాటు చేయాలని ప్రయత్నించారు. డా.శ్రీరామ్ నేత్ర వైద్య నిపుణులు. గ్లోబల్ గాంధీ యూత్ కౌన్సిల్ స్థాపకులు. 2019లో గాంధీజీ 150వ జయంతిని అమెరికాలో ఘనంగా జరిపారు. శ్రీరామ్ 2025లో కాలధర్మం చెందారు.
అట్లాంటాకి చెందిన వల్లూరి రమేష్ గారితో, నటులు బ్రహ్మానందం గారి నివాసంలో
తోటకూర ప్రసాద్:
నిరంతర సాహితీ సేవకులలో ప్రసాద్ అగ్రగామి. వినుత్న కార్యక్రమాల రూపశిల్పి. సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాటలను నాలుగు సంపుటాలు వెలువరించిన ధీశాలి. కృష్ణాజిల్లాలో జన్మించిన వీరు 25 ఏళ్లుగా తానా ద్వారా అనేక కార్యక్రమాలు రూపొందించారు. 2011-2013 మధ్య తానా అధ్యక్షులు. మహాత్మాగాంధీ స్మారక ప్లాజా ఏర్పాటు చేశారు. అమెరికాలో స్థిరపడ్డ తెలుగు వారి కుటుంబాలలో మరణాలు సంభవిస్తే వారికి ఉపకరించేలా అంత్యక్రియలు ఏర్పాట్లు సిద్ధం చేశారు. కరోనా కష్టకాలంలో జూమ్ సమావేశాల ద్వారా నిరంతరం తెలుగు సంస్కృతీ వికాస కార్యక్రమాలు ప్రసారం చేశారు. డల్లాస్‌లో స్థిరపడ్డారు. ప్రతి నెలా జూమ్ సమావేశాల ద్వారా తెలుగు సాహిత్య సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.
ఆనంద్ కూచిభొట్ల:
సిలికాన్ ఆంధ్రను 2001లో స్థాపించారు. ARIA విశ్వవిద్యాలయం నెలకొల్పి తెలుగులో ఎం.ఏ. కోర్సులు సి.మృణాళిని నేతృత్వంలో నడుపుతున్నారు. సిలికాన్ ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు భాషకు సేవ చేస్తుంది. ‘మనబడి’ ద్వారా తెలుగు భాషావ్యాప్తికి తోడ్పడుతున్నారు. పదివేల మంది విద్యార్థులు వీరి సంస్థలో పొల్గొంటున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ. ఎకనామిక్స్ పట్టా పొందిన ఆనంద్ అమెరికాలో పలు ప్రతిష్ఠాత్మక సంస్థలకు ఆధిపత్యం వహించి హైదరాబాదులో అన్నమాచార్య లక్ష గళార్చన గిన్నస్ బుక్‌లో స్థానం పొందింది. నిత్యోత్సాహి ఆనంద్.
డా. అప్పాజోస్యుల సత్యనారాయణ:
ప్రముఖ శాస్త్రవేత్తగా అమెరికాలో పేరు ప్రఖ్యాతలు గాంచిన సత్యనారాయణ చీరాల కళాశాలలో బి.యస్.సి చదివారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి యం.యస్.సి (టెక్), JNTU లో పి.హెచ్.డి చేశారు. అమెరికాలో ఐదు దశాబ్దాలకు పైగా వివిధ సంస్థలలో ఆచార్యుడిగా అధ్యయన అధ్యాపనాలు కొనగాగించారు. మాతృభూమి పై మమకారంతో స్వస్థలం చీరాలకు చేరుకొని స్థిరపడ్డారు. ‘స్టీవెన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ సంస్థలో ప్రొఫెసరు. 1993లో అప్పజోస్యుల విష్ణుభొట్ల ఫౌండేషన్ స్థాపించారు. ఏటా లక్ష రూపాయల పురస్కారంతో గత 32 సంవత్సరాలుగా సాహీతీ ప్రముఖులనూ సత్కరిస్తున్నారు. కందాళం వారితో కలిసి అప్పాజోస్యుల-విష్ణుభొట్ల-కందాళం ఫౌండేషన్ పేరిట ప్రతి సంవత్సరం జనవరి మొదటి వారంలో మూడు రోజులు నాటకాలు, సాహిత్య పురస్కార సభలు పది, పన్నెండు లక్షల వ్యయంతో ఘనంగా జరుపుతారు. 2024లో నాకు విశిష్ట సాహిత్య పరుస్కారం 50వేల నగదుతో విశాఖ పట్టణంలో అందించారు. సత్యనారాయణ ప్రాచీన కవుల ధోరణిలో తారావళి గ్రంధాలు ప్రచురించారు. ఏటా ప్రతిభామూర్తులకు లక్ష రూపాయలు, విశిష్ట సాహితీమూర్తులకు 50వేలు, రంగస్థల సేవా మూర్తులకు 25వేలు పురస్కారాలు అందిస్తున్న ఘనులు సత్యనారాయణ. దివాకర, మాహాదేవి, పానక, సుజల, వసుంధరా అంతరిక్ష, సమీర, నృత్యతారావళి లఘుకృతులు ఏడు ప్రచురించారు. సుగుణాఖ్య శతకం ప్రశస్తం, సౌజన్యమూర్తి సత్యనారాయణ.
డా. అప్పాజోస్యుల సత్యనారాయణ గారితో
డా. వెల్చేరు నారాయణరావు:
అమెరికాలో విస్కాన్సిన్ – మాడిసన్ విశ్వవిద్యాలయంలో సౌత్ ఇండియన్ స్టడీస్ ప్రోఫెసరుగా వీరు వ్యవహరించారు. 1971లో ఆ విశ్వవిద్యాలయ అధ్యాపకత్వ బాధ్యతలు స్వీకరించారు. శ్రీకాకుళం జిల్లా ‘అంబఖండి’లో జన్మించారు. 1968లో ఎం.ఏ, 1974లో పి.హెచ్.డి. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి చేశారు. అమెరికాలో తెలుగు పాఠాలు చెప్పారు. ఆంగ్లేయులకు తెలుగు సాహిత్య సౌరభాలు అందించడానికి డేవిడ్ షుల్మన్తో కలసి తెలుగు కావ్యాలను ఇంగ్లీషులోకి అనువదించారు. అవి –
- కన్యాశుల్కం – GIRLS FOR SALE
- మనుచరిత్ర – STORY OF MANU
- కళాపూర్ణోదయం – THE SOUND OF THE KISS
వీరిని కేంద్ర సాహిత్య అకాడమీ వారు 2021లో ఫెలోషిప్తో సత్కరించారు.
నారాయణరావు ఏలూరులో స్థిరపడ్డారు.
వంగురి చిట్టెన్ రాజు (1945):
కాకినాడలో బి.టెక్, బొంబాయిలో యెం.టెక్, పి.హెచ్.డి చేశారు. 1994లో వంగూరి ఫౌండేషన్ స్థాపించి ప్రపంచ వ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తున్నారు. హాస్య ప్రియులు. 1994లో మధురవాణి తెలుగు పత్రిక స్థాపించారు. అమెరికా తెలుగు కథానిక సంపుటులు 14 వెలువరించారు. వంశీ రామరాజతో కలిసి సాహిత్య సభలు జరుగుపుతున్నారు. 2013లో లోక్‌నాయక్ ఫౌండేషన్ అవార్డు స్వీకరించారు. వీరు ప్రచురించిన నూరవ గ్రంథం శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. (2021 ఆగస్టు). 2002, 2008లో డెట్రైయిట్, ఫ్రిమాంట్ లలో వీరి సదస్సులో మా దంపతులం పాల్గొన్నాం.
పద్మశ్రీ యస్వీరామారావు (1936):
గుడివాడలో 1936లో జన్మించిన సిరందాసు వెంకట రామారావు ప్రసిద్ధ చిత్రకారులు. చికాగోలో స్థిరపడ్డ వారికి 2001లో పద్మశ్రీ ప్రకటించారు. రాష్ట్రప్రతి భవనంలో శ్రీ అబ్దుల్ కలాం చేతుల మీదుగా పద్మశ్రీ స్వీకరించిన సన్నివేశంలో నేనూ హాజరయ్యాను. ఆంధ్రా యూనివర్శిటి నుండి అకౌంటింగ్, బ్యాంకింగ్‌లో డిగ్రీ పొందారు. 1955లో చెన్నై కళాక్షేత్రంలో చదివి ఫైన్ఆర్ట్స్లో డిప్లోమా సాధించారు. మాధవ పెద్ది గోఖలే ప్రోద్బలంతో మదరాసు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ స్కూలులో 1959లో డిగ్రీ సంపాదించారు. 1965లో ‘కామన్వెల్త్ ఫెలోషిప్’ లభించడం ఆయన జీవితంలో మలుపురాయి. అక్కడ చిత్రకారుడిగా పేరు గడించారు. ఆర్ట్స్ ప్రొఫెసర్‌గా వెస్ట్రన్ కెంటకీ యూనివర్శిటీలో బోధించారు. కవిగా రచనలు చేశారు. చికాగోలో వారి దంపతుల ఆతిథ్యం మా దంపతులం 2008లో స్వీకరించాము. వారి సతీమణి డా. సుగుణ వైద్యురాలు. కూతురు పద్మావతి నాట్యకళాకారిణి.
పద్మశ్రీ డా. యస్.వి. రామారావు దంపతులు
ఆఫ్సర్ దంపతులు:
ఖమ్మం జిల్లా చింతకానిలో 11 ఏప్రిల్ 1964 అప్సర్ మహ్మద్ జన్మించారు. 1985లో ఉస్మానియా బి.ఏ (గోల్డ్ మెడల్), 1988లో ఎం.ఏ. చేశారు. హిందూ ముస్లిం సంబంధాలపై పరిశోధన చేశారు. పెన్సిల్వెనియా యూనివర్సిటిలో పాఠాలు చెప్పారు. విస్కాన్సిన్ – మాడిసన్ యూనివర్శిటీలో అధ్యాపకులు. ఆధునిక కవిత్వం తెలంగాణా నేపధ్యం – అనే పరిశోధనా గ్రంథానికి పి.హెచ్.డి లభించింది. వీరి సతీమణి రెంటాల కల్పన ప్రముఖ రచయిత రెంటాల గోపాలకృష్ణ కుమార్తె, రచయిత్రి. రెంటాల జయదేవ ఈమె సోదరుడు.
కిరణ్ ప్రభ:
కౌముది వెబ్ మాసపత్రికను 2007లో ప్రారంభించి ‘టాక్ షో’లు నిర్వహిస్తున్నారు. జీవితచరిత్రల డాక్యుమెంటరీలు వెలువరిస్తున్నారు. సాహిత్య సాంస్కృతిక సంఘాలకు వారధి.
సాంస్కృతిక రాయబారులు:
కొవ్వలి గోపాలకృష్ణ:
గురుజాడ అప్పారావు ఎన్నడో స్థాపించిన ప్రకాశికను వారి సతీమణి అరుణతో కలసి గత 5 సంవత్సరాలుగా నడుపుతున్నారు. భీమవరం కాలేజీలో చదువుకొన్నారు.
జీడిగుంట విజయసారధి:
హైదరాబాదు ఆకాశవాణి ప్రయోక్త రామచంద్రమూర్తి కుమారులు. ఫిలిడెల్ఫియాలో ఇన్ఫోసిస్‌లో ప్రిన్సిపాల్. కథలు, నవలలు, రేడియో నాటకాలు రచించారు.
డా. హనిమిరెడ్డి లకిరెడ్డి
వృత్తి రీత్యా 45 ఏళ్ల క్రితం అమెరికాలో డాక్టరుగా స్థిరపడ్డారు. గొప్ప దాత. పేద విద్యార్థులకు చేయూత నందించారు. మైలవరంలో ఇంజనీరింగ్ కాలేజీ స్థాపించారు.
మారేపల్లి వెంకటశాస్త్రి:
ఫ్రీమాంటోలో వేదవిద్యను బోధిస్తూ ముఫ్పయి ఏళ్లుగా సేవ చేస్తున్నారు. అక్కడి సత్యనారాయణ స్వామి ఆలయంలో 2008లో నేను ప్రసంగించాను. విజయవాడకు చెందిన వారు వెంకటశాస్త్రి.
వింజమూరి అనసూయాదేవి (1920 మే – 2019 మార్చి)
కాకినాడలో జన్మించారు. సీతా అనసూయ సోదరీమణులు జానపద సంగీతానికి విశేష కృషి చేశారు. అనసూయ తన కుమార్తె రత్న పాప దగ్గర హ్యూస్టన్‌లో చివరి రోజుల్లో నివసించారు. ఆమె కూచిపూడి కళాకారిణి. సీతాదేవి రేడియోలో ప్రొడ్యూసరుగా (హైదరాబాదులో) పని చేసి రిటైరయ్యారు. అనసూయకు ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి కళాప్రపూర్ణ బిరుదు లభించింది.
డా. నోరి దత్తాత్రేయడు (21 అక్టోబరు 1947):
ప్రముఖ క్యాన్సర్ వైద్యనిపుణులు. కృష్ణా జిల్లా మంటాడలో జననం. 2015లో పద్మశ్రీ అలంకృతులు. కర్నూలు వైద్య కళాశాలలో యం.బి.బి.యస్, ఉస్మానియాలో యం.డి సంపాదించారు. మహిళల్లో క్యాన్సర్ నివారణ నిపుణులు. బసవతారకం – ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ వ్వవస్థాపకులలో ప్రథములు. నోరి వారు 1972-73 మధ్య గాంధీ ఆసుపత్రిలోను, 1973-76లో ఉస్మానియా ఆసుపత్రిలోను పని చేశారు. ప్రస్తుతం అమెరికాలోని మెమోరియల్ స్లోన్ కేటరింగ్ హాస్పిటల్లో ఉన్నతాధికారి. 2025 ఆగస్టులో అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి దోహదం చేశారు. 2025 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ సలహాదురుగా నియమించింది.
చివుకుల ఉపేంద్ర:
1950 అక్టోబరు 8న జన్మించారు. 2002-14 మధ్య 12 సంవత్సరాలు న్యూజెర్సీ జనరల్ అసెంబ్లీ సభ్యులు. 2007-14 మధ్య అక్కడ డిప్యూటీ స్పీకర్. 2014 సెప్టెంబరులో న్యూజెర్సీ బోర్డ్ ఆఫ్ పబ్లిక్ యూటిలిటీస్ కమీషనరుగా నియమితులయ్యారు. ఉపేంద్ర గిండీ ఇంజనీరింగ్ కాలోజీ నుండి బి.ఇ. చేశారు. న్యూయార్క్ సిటీ కాలేజిలో ఎం.ఇ. చేశారు. న్యూజెర్సీలోని సోమర్సెట్లో స్థిరపడ్డారు.
అస్సాం అసోసియేషన్ వారి 2023 దసరా వేడుకలలో
తెలుగు సంస్థలు:
తానా:
న్యూయార్క్ తదితర ప్రాంతాలలో హిందూ దేవాలయాలు వెలశాయి. తానా, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త అమెరికా 1977లో ప్రారంభమైంది. తొలి సదస్సు డా. కాకర్ల సుబ్బారావు, గుత్తికొండ రవీంద్రనాథ్, దూర్వాసుల శాస్త్రి సారథ్యంలో నడిచింది. 1978లో సంస్థగా రూపొంది ప్రతి రెండేళ్లకు సదస్సులు నిర్వహిస్తోంది. లక్ష మంది దాకా సభ్యులు. తోటకూర ప్రసాద్ వీరికి వెన్నెముక. సాహిత్య, సాంస్కృతిక, సమాజ సేవా కార్యక్రమాలు నడుపుతోంది.
ఆటా:
ATA 1990లో 150 మంది తెలుగు వారి సంకల్పబలంతో ఆరంభమైంది. అమెరికా భారతి పేర న్యూస్‌లెటర్ నడుపుతున్నారు. 1992లో తొలి సభలు జరిగాయి. 2008లో నెవార్క్లో జరిగిన సభలలో మా దంపతులం పాల్గొన్నాం. వంగూరి చిట్టెన్ రాజు సాహిత్య సభల సమావేశకర్తగా వ్యవహరించారు. గొల్లపూడి మారుతీరావు ఆ సభలలో పాల్గొన్నారు. ఈ విధంగా అమెరికాలో తెలుగు సాహిత్య చైతన్య స్రవంతి దశాబ్దాలుగా కొనసాగుతోంది.
(మళ్ళీ కలుద్దాం)
డా. రేవూరు అనంతపద్మనాభరావు అష్టావధాని, విమర్శకులు, ప్రముఖ సాహితీవేత్త. తెలుగు సాహిత్యం లోని అన్ని ప్రక్రియలలోనూ రచనలను చేశారు. 80 ఏళ్ళ వయస్సులో నిరంతర అధ్యయన, అధ్యాపనాలు కొనసాగిస్తూ 120 గ్రంథాలు ప్రచురించారు. 2005 లో దూరదర్శన్, ఢిల్లీ నుండి అదనపు డైరక్టర్ జనరల్‌గా పదవీ విరమణ చేశారు. పదవీ విరమణాంతరం గత 20 సంవత్సరాలలో 80 గ్రంథాలు వివిధ ప్రక్రియలలో ప్రచురించారు.
అనువాద సాహిత్యంలో తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం (1993); కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం (2000), అప్పాజోశ్యుల – విష్ణుభొట్ల – కందాళై ఫౌండేషన్ వారి విశిష్ట సాహితీ పురస్కారం లభించాయి. వీరి రచనలపై వివిధ కోణాలలో 5 విశ్వవిద్యాలయాల నుండి ఆరుగురు ఎం.ఫిల్/పిహెచ్డి పరిశోధనా గ్రంథాలు సమర్పించి పట్టాలు పొందారు.
సంచికలో వీరు గత ఐదు సంవత్సరాలలో – ఆకాశవాణి పరిమళాలు, కావ్యపరిమళం, జ్ఞాపకాలు-వ్యాపకాలు, ఆచార్య దేవోభవ, అవధానం ఆంధ్రుల సొత్తు అనే ఐదు గ్రంథాలు సమర్పించారు.
