[తరాలు మారుతున్నాయి. సమాజం వేగంగా పరుగులు తీస్తోంది. విశ్వగ్రామం అనే సిద్ధాంతం ప్రబలింది. 1947లో పుట్టి 80వ ఏట కాలిడబోతున్న ప్రముఖ రచయిత డా. రేవూరు అనంత పద్మనాభరావు మూడు తరాల ప్రముఖులతో కలిసి మెలిసి తిరిగారు. ఆ జ్ఞాపకాల పందిరిని దారావాహికంగా అందిస్తున్నారు.]
సాంస్కృతిక రాయబారులు:
అమెరికాలోనే కాకుండా బ్రిటన్, జర్మన్, మారిషస్ తదితర దేశాలలో కూడా సాహిత్య సాంస్కృతిక రంగంలో పని చేసిన ప్రముఖులు పలువురు ఉన్నారు. భారత విదేశాంగ శాఖ నియామకంతో ఉస్మానియా విశ్వవిద్యాయానికి చెందిన ఇద్దరు ఆచార్యులు విదేశాలలో రాయబారులుగా పని చేశారు. సాధారణంగా ఐఎఫ్ఎస్ అధికారులే విదేశీ రాయబారులుగా వెళ్తారు, వీరి విషయంలో ప్రత్యేక నియమాకాలు జరిగాయి ఉస్మానియా జర్నలిజం విభాగాధిపతి ఫ్రొఫెసర్ బషీరుద్దీన్ ‘ఖతర్’ దేశంలో రాయబారిగా 1980వ దశకంలో వ్యవహరిచారు. ఆయన కుమారుడు సయ్యద్ అక్బరుద్దీన్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ లో భారత ప్రతినిధి. ఉస్మానియా సోషియాలజీ విభాగాచార్యులు ఫ్రొఫెసర్ సి. లక్ష్మన్న (1935 ఫిబ్రవరి – 2017 డిసెంబరు) 1990లో ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశ రాయబారిగా పని చేశారు. ఆయన అనంతపురం వాసి. తెలుగుదేశం పార్టీ పక్షాన 1984-90 మధ్య రాజ్యసభ సభ్యులు.
ఫ్రొఫెసర్ వేటూరి ఆనంద మూర్తి మారిషస్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు అక్కడ తెలుగు భాషాభివృద్ధికి అవిరళ కృషి చేశారు. మారిషస్ ఆంధ్రా మహాసభ తెలుగు భాష పాఠ్యాంశంగా స్కూళ్లలో ప్రవేశ పెట్టడానికి దోహదం చేసింది. గున్నయ్య అట్టో అనే పండితుడు విజయనగరం వెళ్లి తెలుగు నేర్చుకుని వచ్చారు. అలానే రామస్వామి తెలుగు బోధనకు పాటుపడ్డారు. 1958 ఆగస్టులో స్కూళ్లలో తెలుగు బోధన ఆరంభమైంది. హైదరాబాదు నుండి ఆచార్య ఆనందమూర్తి 1966-70, 1976-79 మధ్య అక్కడ పని చేశారు. తర్వాతి కాలంలో ఆచార్య యన్. శివరామ మూర్తి, (తెలుగు యూనివర్శిటీ రిజిష్ట్రారు) వెళ్లారు. అక్కడి రేడియో కేంద్రం తెలుగు విద్యార్ధులకు పాఠ్యాబాగాలు రికార్డు చేసి ప్రసారం చేసింది.
తానా మాజీ అధ్యక్షులు శ్రీ తోటకూర ప్రసాద్ గారితో
లండన్‌లో తెలుగు సారథులు:
కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణకు ఇద్దరు సోదరులు – వెంకటేశ్వర్లు; రామమూర్తి. సత్యనారాయణ కుమారులు అచ్యుతదేవరాయలు (అమెరికా); వెంకటేశ్వర్లు. సత్యనారాయణ కావ్యాలకు/రచనలకు వ్రాయసకాడు. స్వయంగా కవి. ఆయన కుమారుడు శ్రీకృష్ణదేవరాయలు అడ్వకేట్‌గా లండన్‌లో ఇన్‌కమ్ టాక్స్ డిపార్టుమెంటులో పదవీ బాధ్యతలు నిర్వహించారు. భగవద్గీతకి ప్రతిపదార్థ తాత్పర్యాలు సమకూర్చి ప్రచురించారు. లండన్ వెళ్లిన ఆంధ్ర రచయితలకు ఆయన ఆతిథ్యం గొప్పది. సత్యనారాయణ మరో సోదరుడు రామమూర్తి కుమారుడు శోభనాద్రి. ఆయన చక్కని పండితులు. తాతగారి పేరు ఆయనకు లభించింది.
గూటాల కృష్ణమూర్తి (1928 జూలై 10 – 2016 జూలై 13):
జి.కె.గా ప్రసిద్ధుడైన కృష్ణమూర్తి పర్లాకిమిడిలో జన్మించారు. విజయగరం, విశాఖపట్టణాలలో విద్యాభ్యాసం చేశారు. ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ఇంగ్లీషు బి.ఏ.ఆనర్స్ చేశారు. అమలాపురం కళాశాలలో ఆంగ్లోపన్యాసకులుగా పాఠాలు చెప్పారు. కొంత కాలం బిలాసపూరులో బోధించారు. ‘ఇన్నర్ లండన్ ఎడ్యుకేషన్ అథారిటీ సర్వీసు’ లో చేరారు. 1962లో లండన్ టైమ్స్ పత్రికా కార్యాలయంలో ఉద్యోగం లభించింది. 1967లో FRANCIS THOMAS – A CRITICAL BIOGRAPHY – అనే సిద్ధాంత వ్యాసానికి పి.హెచ్.డి సాధించారు. 1963లో – ‘1890 సోసైటీ’ని లండన్‌లో స్థాపించారు. 1975లో విదేశాంధ్ర ప్రచురణలు స్థాపించారు. పురిపండా అప్పలస్వామి ‘పులిపంజా’ ప్రచురించారు. శ్రీశ్రీ గొంతుకలో స్వయంగా మహాప్రస్థానం వెలువరించారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖామాత్యులు మండలి వెంకటకృష్ణారావు వీటిని ఆవిష్కరించారు. తాను స్వయంగా రచయిత – ‘జుబ్బా లేని అబ్బాయి’ నవల, భజగోవిందం రచించారు. 2016లో 73 ఏళ్ల వయస్సులో విశాఖలో కన్ను మూశారు. ఆయన చేసిన సాహిత్య సేవ బ్రౌన్ సాహిత్య సేవతో సమానంగా పరిశోధకులు లెక్కగడతారు.
కూచిభొట్ల ఆనంద్, పింగళి నరసింహం గార్లతో
టంగుటూరి సూర్యకుమారి (1925 నవంబరు 13 – 2005 ఏప్రిల్ 25):
సుప్రసిద్ధ గాయకురాలు, అలనాటి తెలుగు సినిమా నటి అయిన సూర్యకుమారి రాజమండ్రిలో జన్మించారు. ఆమె ప్రకాశం పంతులు తమ్ముడు శ్రీరాములు గారి కూతురు. 1937లో మదరాసు వెళ్లి సినీ రంగ ప్రవేశం చేశారు. 12, 13 ఏళ్ల వయస్సులో ఆమె ‘రైతు బిడ్డ’ సినిమాలో నటించారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలు నాలిగింటిలో 26 సినిమాలు నటించారు. లలిత గీతాలు (50), మొత్తం నూరు గ్రామఫోను రికార్డులకు పాడారు. ప్రైవేటుగా కేంబ్రిడ్జి సీనియర్ పరీక్ష వ్రాసి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలయ్యారు. శంకరంబాడి సుందరాచారి రచించిన ‘మా తెలుగు తల్లికి మల్లె పూదండ’ గీతాన్ని పాడారు. ఆంధ్రరాష్టావతరణ సందర్భంగా 1953 అక్టోబరు 1న కర్నూలులో నెహ్రూ, రాజాజీ, ప్రకాశం సమక్షంలో వందేమాతరం, మా తెలుగు తల్లికి గీతాలు పాడారు. 1960 దశకంలో లండన్‌లో ‘ఇండియన్ సెర్ఫార్మింగ్ ఆర్ట్స్’ సంస్థను స్థాపించారు. 1968లో ఈమె కృషిని బ్రిటీషు రాణి గుర్తించింది. 1984లో ఈమెకు శ్రీరాజలక్ష్మీ పురస్కారం లభించింది. లండన్‌లో 80వ ఏట కన్నుమూశారు.
డా. జె. హరగోపాల్ (బర్మింగ్‌హం):
తెలంగాణాలో స్వాతంత్ర సమర యోధులు జమలాపురం కేశవరావు (1908-1953). నిజాం నిరంకుస ఫాలనను ఎదిరించిన వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు కమిటీ తొలి అధిపతి. తెలంగాణా ప్రజలు ఆయనను గౌరవంగా ‘సర్దార్’ అని పిలిచేవారు. జైలు జీవితంలో మానసిక ఒత్తిడికి లోనయ్యారు. 46వ ఏట కన్నుమూశారు. వారి జీవిత చరిత్రను ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలుగు అకాడమీ వారి కోరిక మేరకు నేను వ్రాశాను. కేశవరావు కుమారులు డా. హరగోపాల్ ఐదు దశాబ్దాలుగా బర్మింగ్‌హాంలో డాక్టరుగా ప్రసిద్ధులు. వారి సతీమణి డా. పి. సామ్రాజ్యలక్ష్మి, ప్రసిద్ధ శిశువైద్య నిపుణులు డా. పి. తిరుమరావు (హైదరాబాదు) కుమార్తె. ఇద్దరూ డాక్టర్లు. అక్కడే స్థిరపడ్డారు. 2024లో హరగోపాల్ కన్నుమూశారు. బర్మింగ్‌హాంలో ప్రతి ఏటా శ్రీరామ నవమి కల్యాణోత్సవాలను 25 సంవత్సరాలు హారగోపాల్ ఘనంగా జరిపారు. భారతదేశం నుండి ఒక పురోహితుని, ఒక ప్రత్యేక వ్యాఖ్యాతను బర్మింగ్‌హాం ఆహ్వానించి దాదాపు 400 తెలుగు కుటుంబాలు వైభవంగా సీతారామ కల్యాణం జరపడం ఆనవాయితీ. 1999లో నేను ప్రత్యక్ష వ్యాఖ్యానానికి వెళ్లి వారి ఆతిథ్యం స్వీకరించాను.
నెవార్క్‌లో 2008నాటి ఆటా సభలలో వంగూరి చిట్టెన్‌రాజు గారితో
మాధవకుమార్/తురుమెళ్ల:
లండన్‌లో స్థిరపడ్డ మాధవకుమార్ ఐటి, డాటా బిజినెస్ కన్సల్టెంట్. హోరోలో టాటా కన్సల్టెంట్ సర్వీసులో ప్రముఖ వ్యక్తి. రచయితగా ‘BIRDS OF DESTINY’ అనే ఆడియో గ్రంథం వెలువరించారు. ఆధ్యాత్మిక భావ సంపద గల వ్యక్తి. యు.కె.లో వివిధ సంస్థలకు సలహాదారు. 1999 నుండి ఐ.టి. రంగంలో కృషి చేస్తున్నారు. భారతీయ వేదాంత శాస్త్రంలో ఉపనిషత్తులపై 1988లో డిప్లోమా పొందారు. వార్దా సేవాగ్రామ్‌లో 1987లో సివిల్ ఇంజనీరింగ్ డిప్లోమా చేశారు. సమాజ సేవలో భాగంగా COUNCIL OF DHARMIC STUDIES సంస్థను 2011లో స్థాపించి డైరక్టరుగా వున్నారు. ‘హిందూ ఫోరం ఫర్ బ్రిటన్’ పాలకమండలిలో ప్రధాన వ్యక్తి. జర్మన్, ఇంగ్లీషు, ఉర్దూ భాషలలో ప్రావీణ్యం సంపాదించారు. 2014 జనవరిలో ‘భారత్ గౌరవ్’ పురస్కారం పొందారు.
ఇతరులు:
జర్మనీలోని కోలోన్ విశ్వవిద్యాలయంలో ఆచార్య కోరాడ మహాదేవ శాస్త్రి రెండేళ్లు (1976-78) అధ్యయన అధ్యాపనలు కొసాగించారు. విస్కాన్సిన్ విశ్వవిద్యాలయం (అమెరికా)లో డా. జి.యన్.రెడ్డి గతంలో అధ్యాపకులు. అదే చోట ఆర్.వి.యస్.సుందరం, వేదుల సుబ్రమణ్యశాస్త్రి విజిటింగ్ ఫ్రొఫసర్లు. డా. యార్లగడ్డ బాలగంగాధరరావు ప్రభృతులు విదేశీ విశ్వవిద్యాలయ అధ్యాపకులుగా వ్యవహరించారు. లెనిన్ గ్రాడ్ విశ్వవిద్యాలయంలో ఆచార్య యస్. వి. జోగారావు అధ్యపకులు (1976 -1979).
లక్ష్మణ ద్వయం:
పాత్రికేయ రంగంలో లబ్ధప్రతిష్ఠులైన జె. వి. లక్ష్మణరావు, వై.వి. లక్ష్మణరావులు విదేశాలలో ఖ్యాతిగడించారు.
అనంతపురంలో ముల్క్‌రాజ్ ఆనంద్ గారితో
జె.వి. లక్ష్మణరావు (18 ఆగస్టు 1937):
తణుకులో పుట్టి రాజమండ్రిలో పెరిగిన వీరు భారతదేశంలో హితవాది, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికలలో ప్రధాన పాత్ర పోషించారు. 2002లో చికాగోలోని ‘ఇండియా ట్రిబ్యూట్’ పత్రికా సంపాదకులుగా ప్రవేశించి 20 సంవత్సరాలు పత్రిక బాధ్యతలు వహించారు. 60 ఏళ్ల పత్రికానుభవం గల వీరు 2021 జూలైలో స్వదేశానికి తిరిగి వస్తన్న సమయంలో వీరి స్వీయ చరిత్ర ఆవిష్కరణ, ఘనంగా వీడ్కోలు సభగా జరిగింది. ప్రస్తుతం హైదరాబాదులో స్థిరపడ్డారు. 2002లో చికాగోలో మేము కలిసిన సందర్భంగా ఇండియా ట్రిబ్యూన్‌లో నా గురించి చక్కని వ్యాసం ప్రచురించారు.
వై. వి. లక్ష్మణరావు:
భారత ప్రభుత్వ సమాచార మంత్రిత్వ శాఖలో భాగమైన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్స్ (ఢిల్లీ) డైరెక్టరుగా వీరు 1980వ దశకంలో పని చేశారు. సివిల్ సర్వీసులలో ఇండియన్ ఇన్‌ఫర్మేషన్ సర్వీసులో సెలక్టు అయిన వారికి ఈ సంస్థలో సంవత్సరకాలం శిక్షణ యిస్తారు. లక్ష్మణరావు స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం పరిశోదక విద్యార్థి. ప్యారిస్ లోని యునెస్కోలో మాస్ కమ్యూనికేషన్ విబాగ డిప్యూటీ డైరక్టర్ స్టేట్స్‌మన్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికలలో పని చేశారు. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా డిప్యూటీ డైరక్టరు. రెండు భారత గ్రామాల పురోగతిని అధ్యయనం చేసి, ‘కమ్యూనికేషన్ అండ్ డెవలప్‌మెంట్’ గ్రంథం ప్రచురించారు.
నరిశెట్టి రాజు:
ప్రముఖ హేతువాది నరిశెట్టి ఇన్నయ్య (1937) కుమారులు రాజు. యూరప్ ప్రాంత ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ సంపాదకులు. ఆ పత్రిక డిజిటల్ మీడియా బాధ్యతలు వహించారు. మింట్, వాషింగ్టన్ పోస్ట్ పత్రికల సంపాదకులు. గిజిమాడో డిజిటల్ కంపెనీ సీ.ఈ.వో. గా బాధ్యతలు వహిస్తున్నారు.
1996లో విజయవాడలో ఖుష్వంత్‍సింగ్ తదితరులతో
గుజ్జుల రవీంద్ర జర్మనీ దేశంలో మేయర్‌గా ఎన్నికై ప్రఖ్యాతి గాంచారు. ఇలా విదేశీ ప్రాంతాలలో పలువురు తెలుగు వారు ప్రసిద్ధి వహించారు.
(మళ్ళీ కలుద్దాం)
డా. రేవూరు అనంతపద్మనాభరావు అష్టావధాని, విమర్శకులు, ప్రముఖ సాహితీవేత్త. తెలుగు సాహిత్యం లోని అన్ని ప్రక్రియలలోనూ రచనలను చేశారు. 80 ఏళ్ళ వయస్సులో నిరంతర అధ్యయన, అధ్యాపనాలు కొనసాగిస్తూ 120 గ్రంథాలు ప్రచురించారు. 2005 లో దూరదర్శన్, ఢిల్లీ నుండి అదనపు డైరక్టర్ జనరల్‌గా పదవీ విరమణ చేశారు. పదవీ విరమణాంతరం గత 20 సంవత్సరాలలో 80 గ్రంథాలు వివిధ ప్రక్రియలలో ప్రచురించారు.
అనువాద సాహిత్యంలో తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం (1993); కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం (2000), అప్పాజోశ్యుల – విష్ణుభొట్ల – కందాళై ఫౌండేషన్ వారి విశిష్ట సాహితీ పురస్కారం లభించాయి. వీరి రచనలపై వివిధ కోణాలలో 5 విశ్వవిద్యాలయాల నుండి ఆరుగురు ఎం.ఫిల్/పిహెచ్డి పరిశోధనా గ్రంథాలు సమర్పించి పట్టాలు పొందారు.
సంచికలో వీరు గత ఐదు సంవత్సరాలలో – ఆకాశవాణి పరిమళాలు, కావ్యపరిమళం, జ్ఞాపకాలు-వ్యాపకాలు, ఆచార్య దేవోభవ, అవధానం ఆంధ్రుల సొత్తు అనే ఐదు గ్రంథాలు సమర్పించారు.
