Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వందే మా ‘తరం’-15

[తరాలు మారుతున్నాయి. సమాజం వేగంగా పరుగులు తీస్తోంది. విశ్వగ్రామం అనే సిద్ధాంతం ప్రబలింది. 1947లో పుట్టి 80వ ఏట కాలిడబోతున్న ప్రముఖ రచయిత డా. రేవూరు అనంత పద్మనాభరావు మూడు తరాల ప్రముఖులతో కలిసి మెలిసి తిరిగారు. ఆ జ్ఞాపకాల పందిరిని దారావాహికంగా అందిస్తున్నారు.]

సంపాదకవర్గంతో సంపర్కం:

నేను ఆకాశవాణిలో పని చేయడం వల్ల, స్వయంగా రచయితను కావడం వల్ల పలువురు పత్రికా సంపాదకులతో సాన్నిహిత్యం కలిగింది. నెల్లూరులో చదువుతున్నప్పుడు (1962-65 బిఏ డిగ్రీ) కళాశాలకు సమీపంలోని జమీన్ రైతు వారపత్రిక కార్యాలయానికి అప్పుడుప్పుడు వెళ్లేవాడిని. నా తొలి రచన (గేయం) జమీన్ రైతులో ప్రచురింతమైంది. సంపాదకులు నెల్లూరు శ్రీరామమూర్తి. ఉప సంపాదకులు బంగోరె, గోపి నా అష్టావధాన పర్యటనలను వార్తలుగా వేశారు. ఉగాది ప్రత్యేక సంచికలో ‘విధి నిర్ణయం’ అనే నా తొలి కథానిక వచ్చింది.

దినపత్రికలకు వ్రాయడానికి ముందు నేను హైదరాబాదు నుండి వెలువడే దక్షిణ భారత హిందీ ప్రచారసభ వారి స్రవంతి మాసపత్రికలో 1966 నుండి దాదాపు మూడు దశాబ్దాలు యాభై దాకా వ్యాసాలు ప్రచురించాను. గుంటూరు నుండి వెలువడే సాధన మాస పత్రిక సంపాదకులు, మన్నవ గిరిధరరావు ఎం.ఎల్.సి. ప్రత్యకాభిమానం చూపారు. కాకినాడ నుండి వెలువడే త్రైమాస సాహిత్య పత్రిక ‘ఆంధ్రసారస్వత పరిషత్ పత్రిక’లో ‘ఉత్తరారామాయణము – తిక్కన, కంకటి పాపరాజు’ అనే పరిశోధనాత్మక వ్యాసం ఎం.ఏ. విద్యార్ధిగా 1966లో వెలువడింది. అధ్యాపకులు ప్రశంసించారు.

భద్రాచలం ఆలయ వేడుకల వ్యాఖ్యాతల బృందంతో రచయిత

ఆంధ్రపత్రిక సంపాక వర్గంలోని శివలెంక రాధకృష్ణ, వీరాజీ, నండూరి పార్థసారథి ప్రభృతులు చిరపరిచితులు. భారతి మాసపత్రికలో 1969లో ‘ప్రయోగా విశేషు’ అనే పేర బాల ప్రౌఢలు సాధింపని ప్రయోగవిశేషాలు – అనే వ్యాకరణ సంబంధ వ్యాసం ప్రచురించాను. కొద్ది చేర్పులతో ఆ వ్యాసం వేలూరు నుండి వెలువడే ‘సాహితీ స్రవంతి’ మాస పత్రికలో సామవేదం జానకీ శర్మ ప్రచురించారు.

కృష్ణా పత్రిక మచిలీపట్నం నుండి ముదిగొండ సుబ్రమణ్యశర్మ సంపాదకత్వంలో వార పత్రికగా వెలువడేది. ముట్నూరి కృష్ణారావు తర్వాత చాలా కాలానికి వీరు బాధ్యత స్వీకరించారు. నావి పలు సాహిత్య వ్యాసాలు ముద్రితమయ్యాయి. కృష్ణాపత్రిక కొంత కాలానికి మూతబడింది. 1985 ప్రాంతంలో హైదరాబాదులో పిరాట్ల వెంకటేశ్వర్లు దినపత్రికగా వెలువరించి ఆర్థికంగా చేతులు కాల్చుకొన్నారు. ఆయన ఆర్.యస్.యస్ కార్యకర్త. ప్రకాశం అభివృద్ధి అద్యయన సంస్థ కార్యకలాపాలలో నేను, పిరాట్ల, టంగుటూరి సూర్యనారాయణ 1982 – 1995 వరకు చురుకుగా పాల్గొన్నాం. ఢిల్లీలోని ఏ.పి.భవన్ ముగింట ప్రకాశం విగ్రహావిష్కరణకు పాటుపడిన వ్యక్తులలో మేమున్నాం. కార్యచోదకులు ఎన్నికల సంఘ కమీషనర్ జి.వి.జి.కృష్ణమూర్తి. పి.వి.నరసిహారావు ప్రధానిగా విగ్రహావిష్కరణ 1991 ఆగస్టులో చేయడం చారిత్రాత్మికం. ఢిల్లీలోని పత్రికలన్నీ ఆ వార్త ప్రముఖంగా ప్రచురించాయి. జి.కె.రెడ్డి హిందూ సంపాదక వర్గంలో వుండగా 1976 ప్రాంతాలలో నేను వారిని కలిసేవాడిని. ఆయన మా నెల్లూరువాడు.

విజయవాడ పత్రికా సంపాదకులు:

ఆంధ్రప్రభ:

ఆంధ్రప్రభ దిన పత్రికలో నీలంరాజు వెంకటశేషయ్య, నార్ల వెంకటేశ్వరరావులది తొలి తరం. 1978 ప్రాంతాలలో విజయవాడలో కూచిమంచి సత్యసుబ్రమణ్యం సంపాదకులు. సాహిత్యానికి ప్రాధాన్యమిస్తూ వున్న దినపత్రిక అది. తర్వాత పాత్రికేయ దిగ్గజం పొత్తూరి వెంకటేశ్వర రావు సంపాదక బాధ్యతలు స్వీకరించారు. ఆయనది గుంటూరు జిల్లా ప్రసాదరాయ కులపతితో సాన్నిహిత్యం. రాజకీయాలలో పి.వి.నరసింహారావు ప్రధానిగా వుండగా ఆయన సలహాలందించారు. ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా పాత పత్రికలను వెబ్ సైట్‌లో పెట్టే కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. జస్టిస్ పి. కోదండరామయ్య ప్రచురించిన మహాభారత సంపుటాల సంపాదకవర్గంలో ఒకరు. మృదుస్వభావి. అనారోగ్యఛాయలు బయటకు కన్పించనీకుండా చరమదశలో హైదరాబాదులో జీవించారు. ఆంధ్రజనత (1957), ఈనాడు, ఆంధ్రప్రభలలో పని చేశారు. పొత్తూరి (మరణం 2015 జనవరి 29) పాత్రికేయ రంగంలో వివాదరహితుడు.

తర్వాత తరంలో వి.వాసుదేవ దీక్షితులు ఆంధ్రప్రభ సంపాదకులు. 1967లో సబ్ ఎడిటర్‌గా చేరి అంచెలంచెలుగా ఎదిగి 1991లో సంపాదకులయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ అధ్యక్షులుగా పని చేసిన వీరు 2019 ఏప్రిల్‌లో గతించారు. ప్రభ వారపత్రికలో పనిచేసిన విద్వాన్ విశ్వం పెన్నేటిపాట సుపరిచితం. ఆకాశవాణిలో స్క్రిప్ట్ రైటర్‌గా రెండు దశాబ్దాలు పని చేసిన ఇంద్రగంటి శ్రీకాంతశర్మ ఆంధ్రప్రభ వారపత్రిక బాద్యతలు చేపట్టారు. శర్మ (1944 మే – 2019 జులై) ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి కుమారులు. ఆకాశవాణిలో వీరు రూపొందించిన సంగీత రూపకాలకు జాతీయ స్థాయి బహుమతులు లభించాయి. ఆంధ్రప్రభ దినపత్రికలో సబ్ ఎడిటర్‌గా పని చేసిన రేవూరు ఉమామహేశ్వర రావు ప్రస్తుతం హైదరాబాదులోని రచనా జర్నలిజం కళాశాల ప్రన్సిపాల్‌గా గత దశాబ్దికి పైగా ఎందరో పాత్రికేయుల భవితవ్యాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఆంధ్రప్రభలో పని చేసిన ఏ.బి.కే. ప్రసాద్ ఈనాడు తదితర పలు దినపత్రికల సంపాదకులు. యోజన పత్రిక సంపాదకులు శ్రీపతిరావు నా చేత పలు వ్యాసాలు అనువదింప జేసి ప్రచురించారు.

చినజీయర్ స్వామివారితో రచయిత

ఆంధ్రజ్యోతి సంపాదకత్రయం:

పాత్రికేయరంగ భీష్ములు నార్ల వెంకటేశ్వరావు. వారి తర్వాతి తరంలో నండూరి రామమోహనరావు (1927 ఏప్రియల్ – 2011 సెప్టెంబరు) విస్సన్న పేటలో జన్మించారు. ఆంధ్రపత్రికలో 1948 నుండి 1960 వరకు పని చేశారు. ఉదయం దినపత్రిక గౌరవ సంపాదకులు. 1960లో ఆంధ్రజ్యోతిలో సబ్ ఎడిటర్‍గా చేరి సంపాదకులై 34 సంవత్సరాల తర్వాత 1994లో రిటైరైయ్యారు. ఆయన రచనలో విశ్వరూపం, నరావతారం, విశ్వదర్శనం, అనుపల్లవి, చిరంజీవులు తదితరాలు ప్రసిద్ధం. నండూరి తర్వాత ఎ. వెంకటరావు పగ్గాలు చేపట్టారు.

ఆంధ్రజ్యోతి వార పత్రిక సంపాదక బాధ్యతలు వహించిన పురాణం సుబ్రహ్మణ్యశర్మ వారపత్రిక స్థాయిని పెంచారు. కథా రచనలో సిద్ధహస్తులు. గొలుసు నవలలు ధారావాహికంగా ప్రచురించి ఒరవడి సృష్టించారు.

చిత్రజ్యోతి సంపాదకులే అయినా జ్యోతి దినపత్రికలో బాధ్యతలు నిర్వహించిన తుర్లపాటి కుటుంబరావు (1933 ఆగస్టు – 2021 జనవరి) వక్తగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించారు. 2002లో పద్మశ్రీ పొందారు. 16వేల ప్రసంగాలు చేశారు. నాలుగు వేల జీవిత చరిత్రలు దిన పత్రికలో ప్రచురించారు. ఆంధ్ర ప్రదేశ్ గ్రంథాలయ సంస్థ అధ్యక్షలుగా నియిమితులయ్యారు.

విజయవాడ రాజకీయ ముఖచిత్రం (1975 – 2000)

ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో గుంటూరు, విజయవాడ, మచిలీపట్టణాలు ప్రధాన పాత్ర పోషించాయి. యన్.జి.రంగా, డా. కె. యల్. రావు, పర్వతనేని ఉపేంద్ర, రాయపాటి సాంబశివరావు, కావూరి సాంబశివరావు, ప్రభృతులు జాతీయస్థాయిలో నిలిచారు. విజయవాడ లోకసభ నియోజక వర్గం నుండి రాష్ట్రేతరులైన ఇద్దరు ఎన్నికయ్యారు. 1952లో హరీంద్రనాథ చటోపాధ్యాయ (స్వతంత్ర), 1977లో గోడే మురహరి (రాజ్యసభ ఉపాధ్యక్షులు) గెలిచారు. స్వాతంత్ర సమర యోధురాలు కొమర్రాజు (బండారు) అచ్చమాంబ 1957లో ఎన్నికయ్యారు.

రాజకీయాలతో సంబంధం లేని సాంకేతిక ఇంజనీరుగా ప్రసిద్ధులైన డా. కొమర్రాజు లక్ష్మణరావు (కె. యల్. రావు) మూడు సార్లు 1962, 1967, 1971 లలో విజయవాడ నుండి గెలిచారు. జలవనరుల నిపుణులైన వారిని నెహ్రు తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు. ఒక దఫా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండేసి సార్లు గెలిచిన లోక్‌సభ సభ్యులు – చెన్నుపాటి విద్య (1980, 1989), పి. ఉపేంద్ర (1996, 1998) – (వీరు కేంద్రంలో సమాచార ప్రసార శాఖలు, పార్లమెంటు వ్యవహారాల మంత్రి) కావూరి సాంబశివరావు (1984, 1989, మచిలీపట్నం), వడ్డే శోభనాద్రీశ్వరరావు (1984,1991). సినీనటులు కైకాల సత్యనారాయణ మంచిలీపట్నం నుండి 1996లో గెలిచారు.

గుంటూరు నియోజక వర్గం నుండి రాజకీయ కురు వృద్ధులు – కొత్త రఘురామయ్య తిరుగులేని నాయకులు. 1957, 62, 67, 71, 77 ఎన్నికలలో ఐదుసార్లు వరుసగా గెలిచారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా నెహ్రు, ఇందిరాగాంధీ, మంత్రి వర్గాలలో పని చేశారు. ఆచార్య యన్. జి. రంగా 50 సంవత్సరాల పార్లమెంటరీ జీవితాన్ని అనుభవించిన ఘనులు. 1980, 84, 89 ఎన్నికలలో విజేత. రాయపాటి సాంబశివరావు – 1996, 98, 2004, 2009, 2014(నరసరావు పేట) లలో విజయం సాధించారు. 2024 ఎన్నికలలో గెలిచిన డా. పెమ్మసాని చంద్రశేఖర్ మోదీ మంత్రివర్గంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రి. విదేశాలలో ఉద్యోగం వదలి వచ్చారు. బాపట్ల నుండి గెలిచిన ఉమారెడ్డి వెంకటేశ్వర్లు కేంద్రంలో వ్వవసాయ శాఖ సహాయమంత్రి.

పాతతరానికి చెందిన కొండా వెంకటప్పయ్య వారి తనయ పార్వతి (MLA), మన్నగిరి ధరరావు (MLC), జూపూడి యజ్ఞనారాయణ, వావిలాల గోపాలకృష్ణయ్య (MLA) పాత్రఃస్మరణీయులు. నాదెండ్ల భాస్కరరావు (ముఖ్యమంత్రి), నాదెండ్ల మనోహర్ ప్రస్తుత మంత్రి – ఆంధ్ర రాజకీయ చతురులు. కాసు బ్రహ్మానంద రెడ్డి నరసారావుపేట లోకసభ సభ్యులుగా 1977, 1980లో గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. కొణిశేటి రోశయ్య ఒక సంవత్సరం 1998లో సభ్యులు. నేదురుమల్లి జనార్ధనరెడ్డి 1999లో గెలిచారు. ముగ్గురు ముఖ్యమంత్రులు ఇక్కడి వారే – కాసు బ్రహ్మానందరెడ్డి, నేదురుమల్లి జనార్ధనరెడ్డి కె. రోశయ్య, కొద్దికాలం నాదెండ్ల భాస్కరరావు. విజయవాడ తొలి మేయరు జంధ్యాల శంకర్. 1995 ప్రాంతంలో టి. వెంకటేశ్వరరావు మేయరు. గుంటూరులో శారద మేయరు.

గణపతి సచ్చిదానంద స్వామివారితో రచయిత

సినీరంగ ప్రముఖులు:

1995-97 మధ్య నేను ఆకాశవాణి విజయవాడ కేంద్రం డైరక్టరుగా వుండగా పలువురు సినీ ప్రముఖులను స్టూడియో రికార్డింగులు చేశాము. 1996లో డిసెంబరు 1న కేంద్ర వార్షికోత్సవానికి కొంగర జగ్గయ్య విచ్చేశారు. మా యింటి ఆతిథ్యం స్వీకరించారు. అక్కినేని నాగేశ్వరావు ఆకాశవాణి వార్షిక పోటీ విజేతలకు బహుమతులు లందించారు. సుప్రసిద్ధ నటీమణి పి.భానుమతితో నేను ఇంటర్య్వూ చేశాను. అదొక హైలైట్.

శ్రీమతి పి. సుశీల, శ్రీ జంధ్యాల శంకర్ గారితో రచయిత

ముధుర గాయని పి. సుశీలతో ఇంటర్య్వూ శ్రోతల నాకర్షించింది. జంధ్యాల, కోట శ్రీనివాసరావులు ఆకాశవాణికి సుపరిచితులు. రేడియో నాటికాలతో అనుబంధమున్నవారు. ఓ సాయంకాలం (ఆదివారం) 4 గంటల వేళ మా క్వార్టర్స్ లో ఇంటి బెల్ మోగింది. తలుపు తీస్తే ఎదురుగా ఊహ కందని వ్యక్తి అల్లు రామలింగయ్య. మేమిద్దరం ఒకే కార్లో జాలాది ఆహ్వానంపై ఒక సభలో పాల్గొనడానికి నందిగామ వెళ్లాలి. ముందుగా యింటికి వచ్చారు. సరదాగా కబుర్లు చెబుతూ రామలింగయ్య గారు ఎన్నో విషయాలు చెప్పారు.

గుంటూరులో సన్యాశ్రమ స్వీకారం చేసిన ధూళిపాళ నెల్లూరు టౌన్ హాలులో ఆహూతుల సమక్షంలో ఏర్పాటు చేసిన సభకు ముందు శకుని పాత్ర వేషం నటించారు. ఆ సభకు యస్.పి. బాలసుబ్రమణ్యం ప్రత్యేకాకర్షణ. బెజవాడ గోపాలరెడ్డి ముఖ్య అతిథి.

విజయవాడలోనే నివాసముంటున్న మిక్కలినేని రాథాకృష్ణమూర్తి అనేక సందర్భాలలో స్టూడియోకి విచ్చేసి ఆఫీసు సిబ్బందితో సరదాగా గడిపారు. విజయవాడ పర్యటనకు వచ్చిన హాస్యనటులు బ్రహ్మానందం స్టూడియోకి విచ్చేసి ఇంటర్వ్యూ రికార్డ్ చేశారు. ఆచంట వెంకట రత్నం నాయుడు, కర్నాట లక్ష్మీనరసయ్య రంగస్థల నటులు.

డి.వి. నరసరాజు ఆకాశవాణి ఇంటర్వ్యూ పూర్తి కాగానే ఒక కోరిక కోరారు. ఆయనకు పాఠశాలలో చదువు చెప్పిన గురువుగారిని కలవాలన్నారు. ఆయన పేరు తప్ప యింటి వివరాలు తెలియవు. మా సిబ్బంది కష్టపడి మరునాడు వారిద్దరి మధ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన ఆనందానికి అవధులు లేవు.

మా ఆఫీసులో ఉద్యగి అయిన వీరభద్రరావు – జంధ్యాల ప్రాపకంతో సినీ నటుడై సుత్తి వీరభద్రరావుగా పేరు తెచ్చుకున్నాడు. శంరాభరణంలో సంగీతం మేష్టారుగా శ్రీ గోపాల్ రాణకెక్కాడు. సినీ గీత రచయిత జాలాదిని ఇంటర్వ్యూ చేశాము. ఆయన నందిగామలో రామాలయ వార్షికోత్సవాలకు నన్ను, అల్లు రామలింగయ్యను ఆహ్వనించారు (1992).

పి.బి. శ్రీనివాస్ మధుర గీతాలు ఆకాశవాణి శ్రోతలను అలరించాయి.

పలువురు ఆధ్యాత్మిక గురువులు స్టూడియోకి వచ్చేసి ఆశీర్వదించారు. కంచికామకోటి పీఠాధిపతి – జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి, గణపతి సచ్చిదానంద స్వామి, విశ్వయోగి విశ్వంజీ, మాతా శివచైతన్య, సుందరచైతన్య, గన్నవరం స్వామి, సీతానగరంలో నివసించిన చినజీయ్యర్ స్వామీ, ప్రభృతులు సందేశాలను రికార్డు చేయడం భాగ్యం.

కడపలో విద్యా ప్రకాశవందగిరి స్వాముల భగవద్గీత రికార్డు చేశాం (1994).

సినీ ప్రముఖులతో మాటామంతీ:

నా జీవితంలో వివిధ సందర్భాలలో సినీరంగ ప్రముఖులతో ముఖాముఖీ తటస్థపడింది. 1964లో వి. ఆర్. కాలేజీ నెల్లూరులో డిగ్రీ చదివే రోజుల్లో సాంస్కృతికోత్సవాలకు విచ్చేసిన సినీనటులు బాలయ్యను ప్రశంసిస్తూ ఓ పద్యం చదివి ప్రశంసలు పొందాను. కందుకూరు ప్రభుత్వ కళాశాల అధ్యాపకత్వ రోజుల్లో సి. నాగభూషణం, నేను ఓ సభలో మాట్లాడాము.

ఆకాశవాణి కవిసమ్మేళనాలలో కడప, విజయవాడ, హైదరాబాదులలో శ్రీశ్రీ, ఆరుద్ర, దాశరథి ప్రభృతులు పాల్గొన్నారు. దేవులపల్ల కృష్ణశాస్త్రి, బాపు, రమణులను వారి స్వగృహాలలో కలిశాను. SVBC భక్తి చానల్ లోగో తయారు చేసి యివ్వమని బాపుగారిని కోరాను. బాపు, బాలు లతో బాటు దుబాయ్‌లో నాకూ సన్మానం జరిగింది. గొల్లపూడి మారుతీరావు, నేనూ కడప ఆకాశవాణిలో 1980, 81 సంవత్సరాలలో పని చేసే సమయంలో ‘బావగారి కబుర్లు’ చేశాం. కోడి రామకృష్ణ అక్కడికి వచ్చేవారు, గొల్లపూడి, నేను ఒక నాటిక ‘ఆడది’లో వేషాలు వేశాం. రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించిన ‘కాబోయే అల్లుడు’ సినిమాలో 1987లో గొల్లపూడితో బాటు నేను అతిథి నటుడిని. నాగేశ్వరావు చేతుల మీదుగా మదరాసు తెలుగు ఆకాడమీ అవార్డు 2002లో, యునిసెఫ్ అవార్డు 2013లో అందుకున్నాను.

అక్కినేని నాగేశ్వరరావు గారితో రచయిత

1978లో కడపలో ప్రభుత్వోద్యోగుల సంస్థ సభకు విచ్చేసిన హరనాథ్ ప్రశంసాపత్రం నేనే తయారు చేసి సభలో చదివి సమర్పించాను. హైదరాబాదులో నాగభైరవ కళాఫీఠం వారి అవార్డును ‘గుమ్మడి’ చేతుల మీదుగా స్వీకరించాను. తిరుపతిలో అన్నమయ్య ‘600 జయంతి’ సందర్భంగా కె. రాఘవేంద్రరావు, విశ్వనాథ్ భారవి, కాంచన, శోభన, దొరస్వామి, రాజు, తనికెళ్ల భరణి, చంద్రమోహన్ ప్రభృతులతో సభలలో పాల్గొన్నాను. రావి కొండలరావు, జె.వి. సోమయాజులు, రమణమూర్తి, సాక్షి రంగారావు, కాకరాల, పద్మనాభం, ప్రభృతుల ఇంటర్వ్యూలు హైలైట్. 1983లో అక్కినేని నాగేశ్వరావుగారు తమ కుమారుని (నాగార్జున) వివాహానికి ఆహ్వానించగా మా డైరెక్టర్‌తో కలసి హాజరయ్యాను. బ్రహ్మానందం గారు తమ కుమారుడు సిద్ధార్ధ వివాహానికి పిలువగా సకుటుంబంగా వెళ్లాము.

శ్రీ ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారితో రచయిత

బ్రహ్మానందం నా పుస్తకావిష్కరణ చేశారు. సినీ గేయ రచయితలు వందేమాతరం శ్రీనివాస్, వేటూరి సుందరరామమూర్తి, అనంతశ్రీరామ్, సాహితి ప్రభృతులు సుపరిచితులు. 50 ఏళ్ల నాడు నిర్మించిన లక్ష్మణరేఖ చిత్ర దర్శకుడు నిట్టల గోపాలకృష్ణ సన్నిహిత మిత్రులు. అనూరాధా పౌడ్వాల్, లతామంగేష్కర్, కోటి, సురేష్ ఒబెరాయ్, పరిచితులు. మాతో కడపలో పని చేసిన యం. యస్. శ్రీరామ్ సినీ దర్శకులు, నిర్మాత. ఢిల్లీలో కృష్ణంరాజు వున్న పండారా రోడ్‌లో మేమూ వున్నాము. హైదరాబాదు కేంద్రంలో యన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా తొలిసారి రికార్డింగు 1983 జనవరి 9న నేను చేశాను. ఇలా ఎన్నో జ్ఞాపకాలు.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version