[తరాలు మారుతున్నాయి. సమాజం వేగంగా పరుగులు తీస్తోంది. విశ్వగ్రామం అనే సిద్ధాంతం ప్రబలింది. 1947లో పుట్టి 80వ ఏట కాలిడబోతున్న ప్రముఖ రచయిత డా. రేవూరు అనంత పద్మనాభరావు మూడు తరాల ప్రముఖులతో కలిసి మెలిసి తిరిగారు. ఆ జ్ఞాపకాల పందిరిని దారావాహికంగా అందిస్తున్నారు.]
దూరదర్శన్ – హైదరాబాదు:
1974లో తెలుగు వారి ఆశాజ్యోతిగా టెలివిజన్ బేస్ ప్రొడక్షన్ సెంటరు ప్రారంభమైంది. ఆంధ్ర, కర్ణాటకలో కొంత భాగానికి SITE (Satellite Instruction Television Experiment) ద్వారా పాఠశాల విద్యార్ధులకు ఉపయోగించే కార్యక్రమాలు ప్రసారం చేశారు. ఆనాడు బి.యన్.యస్.రావు కార్యక్రమ రూపకర్త. తెలుగు ప్రసారాలను దూరదర్శన్ ద్వారా తొలి రోజుల్లో రాజ్‌భవన్ రోడ్డులో అద్దె బంగళాలో కొనసాగించారు. నండూరి విటల్ సారథి. అద్భుత గాత్ర సౌందర్యం గల వ్యక్తి. 1986 ప్రాంతాలలో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. వేదగిరి శర్మ, శ్రీ గోపాల్ ఆ బృందంలో సభ్యులు. వడ్డాది అప్పారావు ప్రొడ్యూసర్‌గా డైరక్టర్ హోదా పొందగలిగారు.
భద్రవ్రత 1982-84 మధ్య దూరదర్శన్ అధిపతి. తర్వాతి కాలంలో అనీసుల్ హక్, హెచ్.యన్. పాత్రో, వి.వి.కృష్ణశాస్త్రి, దేవళ్ల బాలకృష్ణ సారథ్యంలో ముందుకు నడిచింది. ఇతర ఛానళ్లు ప్రారంభం కాని కారణంగా దృశ్య మాధ్యమంగా ప్రేక్షకులను ఆకట్టుకొంది. సి.రామనుజాచార్యులు, టి.వి.రాఘవాచార్యులు ఆర్.ఆర్.కె. తర్వాతి అధికారులు.
అప్పటి ప్రధాని శ్రీ పి.వి. నరసింహారావు గారి నివాసంలో రచయిత
1977 అక్టోబరు 23న ఆనాటి రాష్ట్రపతి శ్రీ నీలం సంజీవరెడ్డి పూర్తి స్థాయి దూరదర్శన్ కేంద్రాన్ని ప్రారంభించారు. HPT లు, LPT లు వివిధ ప్రాంతాలలో నెలకొల్పి ప్రసారాలు రాష్ట్రమంతటా కనిపించే వెసులుబాటును కల్సించారు. 2003 ఏప్రిల్ 2న డి.డి. సప్తగిరిగా నామరకరణం జరిగింది. ఆంధ్ర రాష్ట్రాల విభజన తర్వాత 2014లో హైదరాబాదులో డి.డి. యాదగిరిగా రూపు దాల్చింది. విజయవాడలో డి.డి. సప్తగిరి కొనసాగుతోంది. రామంతపూరులో నూతన భవన నిర్మాణం జరిగింది. విజయవాడ పున్నమ్మతోటలో ఆకాశవాణి ప్రాంగణంలో సప్తగిరి భవనాలు నిర్మించారు.
ఛానాళ్ల సునామీలో దూరదర్శన్ కార్యక్రమాల వెలుగు రేఖలు క్రమక్రమంగా మరుగునపడే దశకు చేరాయి. ఈటి.వి ప్రభంజనం, ఆ తర్వాత పలు న్యూస్ ఛానళ్ల ఆవిర్భావము అందుకు ప్రధాన కారణం.
దూరదర్శన్ హైదరాబాదు కేంద్ర డైరక్టర్లలో ప్రముఖ వ్యక్తి ఆర్.వెంకటేశ్వర్లు. 1988లో యు.పి.యస్.సి. ద్వారా నేరుగా స్టేషన్ డైరక్టర్‌గా ఎంపికయ్యారు. తిరునల్వేలి, వరంగల్ రేడియో కేంద్రాలలో పని చేశారు. 1994 నుండి దశాబ్ది కాలం వివిధ హౌదాలలో దూరదర్శన్, హైదరాబాదు ప్రసారాలకు పుష్టిని చేకూర్చారు. సిబ్బందిని టీమ్ వర్క్ ద్వారా నడిపించారు. తర్వాతి కాలంలో దూరదర్శన్ ప్రధాన కార్యలయం ఢిల్లీలో డి.డి.జి.గా, ప్రమోషన్‌పై ఆకాశవాణి డైరక్టర్ జనరల్ గా 2013లో బాధ్యతలు చేపట్టారు. ఆ పదవినలంకరించిన తొలి తెలుగు వ్యక్తి వెంకేటేశ్వర్లు, సౌజన్యశీలి.
హైదరాబాదులో గతంలో పని చేసిన డైరక్టర్లలో సి.గురునాథ్ ప్రముఖులు. బొంబాయి కేంద్ర డైరక్టరుగా వుంటూ 1995లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. 1996లో నేను లండన్ బి.బి.సి కార్యాలయానికి వెళ్లగా అక్కడ కార్యక్రమ అధికారిగా తటస్థపడ్డారు.
తర్వాతి కాలంలో డి.ప్రసాదరావు రథసారధి. యి.పి.యస్.సి ద్వారా డైరక్టరు. తెలుగు ప్రసారాలకు చేవను చేకూర్చారు. పాలపర్తి మధుసూదన రావు చిరకాలం డైరక్టరుగా పేరు తెచ్చుకున్నారు. మృదుభాషి, వినయ సంపన్నుడు. శైలజాసుమన్ కేంద్ర బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీ ఆకాశవాణి కేంద్ర డైరక్టరుగా నా తర్వాతి కాలంలో 2006 మధ్య గుర్తింపు పొందారు.
దూరదర్శన్ అనగానే ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొనే వ్యక్తులిద్దరు. తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్. చిరకాలం తన వాక్చాతురితో ప్రేక్షకులను సతీమణితో కలిసి అలరించారు. మరో వ్యక్తి విజయదుర్గ.
కార్యక్రమాల రూపకల్పనలో, సంభాషణ చతురత, హావభావ ప్రకటనలో మేటి ఘనాపాఠీ – వోలేటి పార్వతీశం. సాహిత్య కార్యక్రమాల సారథి అతడు. ఇతరులతో పుట్టపర్తి నాగపద్మిని, శకుంతల, పద్మావతి, భగవాన్, పి.వి.రమణ. ప్రధానులు. ప్రస్తుతం కె.కామేశ్వరి అధిపత్య బాధ్యతలు చేపట్టారు.
‘పాలు – చేలు’ కార్యక్రమం తప్ప దూరదర్శన్ ప్రసారాలలో చేవ లేదనే అపవాదు నిలిచిపోయింది. సిబ్బంది కొరత ఆకాశవాణి, దూరదర్శన్ లను గత దశాబ్ది కాలంగా పీడిస్తోంది. నాణ్యత లోపానికి అసలు కారణం అది.
1998లో అప్పటి రాష్ట్రపతి శ్రీ కె.ఆర్. నారయణన్‌తో ఆకాశవాణి బృందం
రాజకీయ ప్రముఖులు:
1980వ దశకంలో 1982-87 మధ్య నేను ఆకాశవాణి ప్రధాన కేంద్రంలోను, వాణిజ్య ప్రసార విభాగంలోను, ప్రాంతీయ శిక్షణా కేంద్రంలోను ఐదేళ్లు పని చేశాను. నేను చేరిన కొద్ది రోజులకే రాష్ట్ర శాసన సభ ఎన్నికలు ప్రకటించారు. ప్రధాన రాజకీయ పార్టీలకు రేడియో, దూరదర్శన్ లలో ఎన్నికల ప్రసంగాలు చేసుకొనే ఏర్పాటు వుంది. అందులో భాగంగా కాంగ్రెసు, కమ్యూనిస్టు తదితర పార్టీల ప్రముఖులు రికార్డింగులకు స్టూడియోలకు వచ్చారు. అదే సమయంలో పార్లమెంటు ఎన్నికలు కూడా వచ్చాయి. 1983 జనవరి 9వ లాల్ బహదూర్ స్టేడియంలో తొలిసారిగా రాష్ట్రంలో కాంగ్రెసేతర పార్టీ తెలుగు దేశం అధిపతిగా యన్.టి.రామారావు 15 మంది మంత్రులతో కలసి ప్రమాణ స్వీకారం చేశారు. వెంటనే ఆకాశవాణి స్టూడియోలకు విచ్చేసి రాష్ట్రప్రజల నుద్దేశించి తొలి ప్రసంగం రికార్డు చేశారు. సినిమా రికార్డింగు ధోరణిలో పది వాక్యాల తర్వాత ‘కట్’ అని మళ్లీ రీరికార్డింగ్ చేశారు.
మాకినేని బసవపున్నయ్య, పి.వి.నరసింహారావు ప్రభృతుల ప్రసంగాలు 1985 జనవరిలో జరిగిన శాసన సభ/లోక్‍సభ ఎన్నికల సందర్భంగా రికార్డు చేశాము. రావూరి భరధ్వాజ, నేను (అసిస్టెంట్ స్టేషన్ డైరక్టర్), ఆ విధి నిర్వహణలో అధికారుల ప్రశంసలందుకున్నాం.
పి.వి.గారు ఢిల్లీ నుండి (విదేశాంగ శాఖ మంత్రిగా) స్టూడియోకి విచ్చేసి ఇంగ్లీషులో ఎన్నికల ప్రసంగాన్ని రికార్డు చేశారు. అది ఢిల్లీ నుండి మర్నాడు ప్రసారం కావాలి. రాజ్‌భవన్‌లో బస చేస్తున్న ఆయన చేతికి నేను సీల్డ్ కవర్‌లో ఆ టేప్‌ను అందించాను. మర్నాడు ఆకాశవాణి ఢిల్లీలో కేంద్ర అధికారులు అది అందుకొని దేశ వ్యాప్తంగా కాంగ్రెసు పార్టీ ఎన్నికల ప్రసంగంలో భాగంగా ప్రసారం చేశారు.
హైదరాబాదు రాజ్‌భవన్‌కు పలు మార్లు వెళ్లే సందర్భాలు వచ్చాయి. కేరళకు చెందిన కె.సి. అబ్రహం 1978 ఆగస్టు 15 నుండి 1983 ఆగస్టు 15 వరకు ఆంధ్రప్రదేశ్ గవర్నరు. వారి పి.ఏ. నాకు పరిచితులు. నేను 1982 అక్టోబరు 5న హైదరాబాదులో చేరాను. పది రోజుల్లోపు గవర్నర్ అపాయింట్‌మెంట్ లభించింది. కలిశాను. తర్వాత ఆగస్టు 15 వాటి గవర్నరు ప్రసంగం రాజ్‌భవన్‌లో రికార్డు చేశాం. 1983 ఆగస్టు 15న హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఠాకురు రామ్‌లాల్ గవర్నరుగా వచ్చారు. 1984 ఆగస్టు 15 ప్రసంగం రికార్డింగుకు స్టూడియోకి విచ్చేశారు. నాదెండ్ల భాస్కర రావును ముఖ్యమంత్రిగా నియమంచిన తొందరపాటు చర్యతో 29 ఆగస్టు 1984 నాడు పదవి నుండి వైదొలగారు. 1984 ఆగస్టు నుండి 1985 నవంబరు వరకు శంకరదయాళ్ శర్మ గవర్నరు.
దేశ స్వాతంత్ర్య స్వర్ణోత్సవాల సందర్భంగా అలంకృతమైన ఢిల్లీ ఆకాశవాణి కేంద్రం
మంత్రుల రికార్డింగులు:
హైదరాబాదు స్టూడియోకు 1982-85 మధ్య పలువురు మంత్రులు విచ్చేశారు. తుఫాను బీభత్సం సందర్భంగా వ్యవసాయ శాఖామాత్యులు నేదురుమల్లి జనార్దనరెడ్డి రాష్ట్ర ప్రజల నుద్దేశించి ప్రసంగించారు. యన్.జి.ఓల సుదీర్ఘ సమ్మె సందర్భంగా 1984 జూన్‌లో మఖ్యమంత్రి యన్.టి.రామారావు ఉద్వోగుల నుద్దేశించి విజ్ఞప్తి చేశారు. వారం రోజులలోపు రెండో ప్రసంగం విషయంలో కొంత వివాదం తలయెత్తి లోక్‌సభ, రాజ్యసభలలో స్టార్డ్ క్వశ్చన్ సందర్భంగా గంటల తరబడి చర్చకొనసాగింది – వాడిగా, వేడిగా.
1985-87 మధ్య రీజనల్ ట్రైనింగ్ సెంటర్ అధిపతిగా నేను ట్రైయినింగులు ఏర్పాటు చేశాను. దక్షిణాది రాష్ట్రాల నుండి 20 మంది దాకా ప్రోగ్రాం అధికారులు ప్రతి దఫా వచ్చేవారు. ఆ సందర్భాల ననుసరించి విద్యాశాఖా మంత్రి ముద్దు కృష్ణమనాయుడు, వ్యవసాయ శాఖా మంత్రి ఆర్. రాజగోపాలరెడ్డి, వైద్య శాఖా మంత్రి కోటీశ్వరావులు విచ్చేసి ప్రసంగించడం కొత్త చరిత్ర.
మహారాష్ట్ర గవర్నరు కోన ప్రభాకరరావు, మాజీ గవర్నరు కాసు బ్రహ్మానందరెడ్డి ఇంటర్య్వూలు రికార్డు చేశాము. ప్రకాశం అభివద్ధి అద్యయన సంస్థ సమావేశాలు అసెంబ్లీ ప్రాంగణంలోని జూబ్లీ హాల్‌లో జరిగినపుడు కుముద్ బెన్ జోషి, కాసు బ్రహ్మానంద రెడ్డిల సరసన వేదిక పై నేనూ ప్రసంగించాను.
1984లో రాష్ట్రపతి శ్రీ జ్ఞానీజైల్ సింగ్ వేసవి విడిది నిమిత్తం హైదరాబాదు రాష్ట్రపతి నిలయంలో బస చేసినపుడు మా స్టేషన్ డైరక్టరు లీలా బవ్‌డేకర్, నేను అతిథులుగా వెళ్లాము. ఇందిరా గాంధీ 1984 అక్టోబరు 31న హఠాన్మరణం చెందగా చితాభస్మాన్ని జూబ్లీ హాల్‌లో ప్రజల సందర్శనార్థం వుంచినపుడు ప్రత్యక్ష వ్యాఖ్యానాలు ఏర్పాటు చేశాం.
1996లో శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారితో రచయిత
ఒరిస్సా మాజీ గవర్నరు మీర్ అక్టర్ అలీఖాన్ స్టూడియోకి విచ్చేశారు. న్యాయమూర్తులు జస్టిస్ ఆవుల సాంబశివరావు, జస్టిన్ కొత్తపల్లి పున్నయ్య, జస్టిస్ ఆమంచర్ల గంగాధరరావు, జస్టిస్ ఐ. పాండురంగారావు, జస్టిస్ యస్. దశరథరామిరెడ్డి, జస్టిస్ పి. కోదండరామయ్య గార్లను పలు సమావేశాలలో కలిసే అవకాశం లభించింది.
పలువురు ఐఎఎస్ అధికారులు, ఐపిఎస్ అధికారులు, రైల్వే అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారులతో ముఖాముఖీ ఉద్యోగ రీత్యా తటస్థించింది.
(మళ్ళీ కలుద్దాం)
డా. రేవూరు అనంతపద్మనాభరావు అష్టావధాని, విమర్శకులు, ప్రముఖ సాహితీవేత్త. తెలుగు సాహిత్యం లోని అన్ని ప్రక్రియలలోనూ రచనలను చేశారు. 80 ఏళ్ళ వయస్సులో నిరంతర అధ్యయన, అధ్యాపనాలు కొనసాగిస్తూ 120 గ్రంథాలు ప్రచురించారు. 2005 లో దూరదర్శన్, ఢిల్లీ నుండి అదనపు డైరక్టర్ జనరల్‌గా పదవీ విరమణ చేశారు. పదవీ విరమణాంతరం గత 20 సంవత్సరాలలో 80 గ్రంథాలు వివిధ ప్రక్రియలలో ప్రచురించారు.
అనువాద సాహిత్యంలో తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం (1993); కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం (2000), అప్పాజోశ్యుల – విష్ణుభొట్ల – కందాళై ఫౌండేషన్ వారి విశిష్ట సాహితీ పురస్కారం లభించాయి. వీరి రచనలపై వివిధ కోణాలలో 5 విశ్వవిద్యాలయాల నుండి ఆరుగురు ఎం.ఫిల్/పిహెచ్డి పరిశోధనా గ్రంథాలు సమర్పించి పట్టాలు పొందారు.
సంచికలో వీరు గత ఐదు సంవత్సరాలలో – ఆకాశవాణి పరిమళాలు, కావ్యపరిమళం, జ్ఞాపకాలు-వ్యాపకాలు, ఆచార్య దేవోభవ, అవధానం ఆంధ్రుల సొత్తు అనే ఐదు గ్రంథాలు సమర్పించారు.
