[తరాలు మారుతున్నాయి. సమాజం వేగంగా పరుగులు తీస్తోంది. విశ్వగ్రామం అనే సిద్ధాంతం ప్రబలింది. 1947లో పుట్టి 80వ ఏట కాలిడబోతున్న ప్రముఖ రచయిత డా. రేవూరు అనంత పద్మనాభరావు మూడు తరాల ప్రముఖులతో కలిసి మెలిసి తిరిగారు. ఆ జ్ఞాపకాల పందిరిని దారావాహికంగా అందిస్తున్నారు.]
రవీంద్ర భారతి:
భాగ్యనగర నడి బొడ్డున వెలసిన రవీంద్ర భారతి నిత్య కల్యాణం పచ్చతోరణంగా 1961 నుండి విలసిల్లుతోంది. మాది బుచ్చిరెడ్డిపాళెం. అక్కడ ప్రభవించిన మహోన్నత నాయకులు బెజవాడ గోపాలరెడ్డి. ఆయన స్వయంగా రవీంద్రభారతి నిర్మాణం గూర్చి నాతో ముచ్చటించారు. తన స్వీయ చరిత్రలో కూడా వివరాలు పొందుపరచారు. నెహ్రూ మంత్రివర్గంలో తొలిసారిగా ఆయన 1958-61 మధ్య కేంద్ర రెవిన్యూ, సివిల్ ఎక్స్పెండిచర్ సహాయ మంత్రి. ఆ సమయంలో రవీంద్ర శతజయంతి దేశ వ్యాప్తంగా జరుపుతూ వివిధ రాష్ట్రాలలో రవీంద్రసదన్లు ఏర్పాటు చేసే సంఘంలో ఆయన ప్రధాన వ్యక్తి. ప్రస్తుతం రవీంద్ర భారతి నిర్మించిన స్థలాన్ని అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ పన్ను శాఖ భవనాల నిర్మాణానికి కేటాయించింది. ఆ శాఖ తన అధీనంలో వుంది. మరొక చోట వారికి స్థలాన్ని కేటాయించి యిక్కడ రవీంద్ర భారతి నిర్మాణానికి 1960 మార్చి 23న ఆయనే శంఖుస్థాపన చేశారు. మహమ్మద్ ఫయాజుద్దీన్ అనే ఆర్కిటెక్ట్ నేతృత్వంలో భవన నిర్మాణం చకచకా 15 నెలల్లో పూర్తి అయింది. 1961 మే న ఉపరాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రారంభించారు.
రవీంద్ర భారతి ప్రాంగణంలోనే కళాభవన్ నిర్మించారు. అందులో సాంస్కృతిక శాఖతో బాటు వివిధ అకాడమీలు వెలశాయి. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ కార్యదర్శి దేవులపల్లి రామనుజరావు కొలువుదీరేవారు. అధ్యక్షులు బెజవాడ గోపాలరెడ్డి రెండు దశాబ్దాలకు పైగా తరచు సమావేశాలు జరిపేవారు. పాండురంగయ్య, అంజనేయులు ఆయనకు సన్నిహితులు. సంగీత అకాడమీకి డా. బాలమురళీ కృష్ణ అధ్యక్షులు. ఏలూరుకు చెందిన కె.వి.సుబ్బారావు కార్యదర్శి. ఆయన శతజయంతి ఏలూరులో జరిపినప్పుడు నేను, ఆర్.ప్రభాకరరావు (డి.జి.పి) విశిష్ట అతిథులం. నాటక అకాడమీకి పసల సూర్యచంద్రరావు తొలుత అధ్యక్షులు. తర్వాత సినీ నటి జమున అధ్యక్షురాలు. కృష్ణంరాజు కార్యదర్శి. నృత్య అకాడమీకి నటరాజు రామకృష్ణ అధ్యక్షులు. సాంస్కృతిక శాఖ సంచాకులు పి.యస్.ఆర్. అప్పారావు ఆఫీసు కళాభవనం లోనే. వాసుదేవరావు, సవోయ కార్యదర్శి. ముఖ్యమంత్రి యన్.టి.రామారావు అన్ని అకాడమీలను రద్దు చేశారు. సాంస్కృతిక శాఖ నేతృత్వం కె.వి.రమణాచారి, రాళ్లబండి కవితా ప్రసాద్, మామిడి హరికృష్ణ ప్రభృతుల సారధ్యంలో వైభవంగా జరిగింది. ప్రపంచ తెలుగు మహాసభల కార్యలయం కూడా అక్కడి నుండి పని చేసింది. ఆంధ్ర సాంస్కృతిక సంస్థకు సి.నారాయణరెడ్డి అధ్యక్షులుగా కళాభవనం నుండి సూచన లిచ్చారు.
నెల్లూరులో పురస్కారం స్వీకరిస్తున్న రచయిత
నాటకరంగ వైభవం:
1980వ దశాబ్దంలో భాగ్యనగరంలో నాటక రంగం ఉజ్జ్వలంగా ప్రకాశించింది. విద్యుచ్ఛక్తి శాఖలో పని చేస్తున్న ఏ.ఆర్.కృష్ణ వినూత్న ప్రక్రియలతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నాటకాలు ప్రదర్శించారు. మాలపల్లి నవల ఆధారంగా 1974లో మాలపల్లి నాటకంగా మలచి విభిన్నమైన 12 వేదికలపై ఒకేసారి ప్రదర్శించారు. 1954లో ఆంధ్ర ప్రదేశ్ నాట్య సంఘం స్థాపించారు. ఆయనకు పద్మభూషణ్ లభించింది. School of Theatre Arts ద్వారా నాటకంలో వివిధ విభాగాలలో శిక్షణనిచ్చారు.
మొదలి నాగభూషణశర్మ ఉస్మానియా విశ్వవిద్యాలయంలోను, హైదరాబాదు విశ్వవిద్యాలయంలోనూ థియేటర్ ఆర్ట్స్ కోర్సులను నడిపారు. ఎందరినో తీర్చిదిద్దారు. చాట్ల శ్రీరాములు ప్రముఖ నటులు. తెలుగు విశ్వవిద్యాలయంలో రంగస్థల పాఠాలు బోధించారు. కన్యాశుల్కం నాటకాన్ని రసరంజని ద్వారా జి.నారాయణ వంటి ప్రముఖులు ప్రదర్శించారు. గరిమెళ్ల రామమూర్తి, యన్.తారకరామారావు, డి.యస్.యన్.మూర్తి ప్రభృతులు విశేష కృషి చేశారు. 1990లో భూమిక థియేటర్ గ్రూప్ స్థాపించారు. 1991లో మహానగరం నాటకం ప్రదర్శించారు.
రసరంజని ప్రత్యేకత టికెట్ కొని నాటకం చూసే పద్దతి. యన్.జె.భిక్షు, జి.యస్.యన్.శాస్త్రి, రామకోటేశ్వరరావు, ఆకెళ్ల సుబ్బరాయశర్మ, బుర్రా సుబ్రమణ్యశాస్త్రి ప్రభృతుల కృషి అభినందనీయం. కె.వి.రమణాచారి వివిధ నాటకరంగ సంస్థలకు చేయూత నొసగారు.
సురభి నాటక రంగానికి చెందిన ఆర్.నాగేశ్వరరావు (బాబ్జీ) ఆ సంస్థకు వెన్నెముక. హైదరాబాదులోనే గాక దేశ విదేశాలలో మాయాజాలాన్ని సృష్టించి అనేక ప్రదర్శనలిచ్చారు. 135 సంవత్సరాల నాటి ప్రాచీన రంగస్థల సంస్కృతి ఇది. కుటుంబమంతా నటులే. రంగస్థలంపై వెంకటేశ్వర సురభి థియేటర్ పేరు గడించింది. బాబ్జీకి 2013లో పద్మశ్రీ లభించింది. శ్రీకాకుళం జిల్లా గిమిడిపేటలో 1949లో జన్మించి 2022లో 73వ ఏట హైదరాబాదులో కాలధర్మం చెందారు.
కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం, 2000
వివిధ సంస్థలు
ఆంధ్ర సారస్వత పరిషత్ బొగ్గులకుంటలో విశాల ప్రాంగణ భవనాలలో దేవులపల్లి రామానుజరావు నేతృత్వంలో సభలు, సమావేశాలు నిర్వహించేది. సి.నారాయణరెడ్డి ప్రభృతులు కార్యవర్గంలో సారథులు. సి.నా.రె. రాజ్యసభ సభ్యులుగా M.P.LADS నిధుల నుంచి అందంచిన సహకారంతో నూతన భవనాలు నిర్మితమైనాయి. సి.నా.రె. అధ్యక్షులు అయి జవసత్వాలు చేకూర్చారు. ఓరియంటల్ కళాశాలను కె.కె.రంగనాథాచార్యులు, సి.చంద్రశేఖరరెడ్డి సమర్థవంతంగా నడిపి ఎందరో తెలుగు పండితులను దేశానికి అందించారు.
ప్రస్తుతం –
శ్రీ ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షలుగా, జె.చెన్నయ్య కార్యదర్శిగా, రమణాచారి నూతనోత్తేజంతో తెలంగాణా సారస్వత పరిషత్ నడుస్తోంది. కె.ఐ.వరప్రసాదరెడ్డి పరిషత్ ఆడిటోరియం పునరుద్ధరణకు విరాళం అందించారు.
శ్రీ కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం శతజయంత్యుత్సవాలు జరుపుకొంది. ఇక్కడి లైబ్రరీ పురాతనం. భాషానిలయం అనగానే యం.యల్.నరసింహరావు గుర్తుకొస్తారు. రమణాచారి, ఉడయవర్లు ఈ సంస్థ సారధులు.
త్యాగరాయ గాన సభ చిక్కడపల్లిలో సాంస్కృతిక వైభవానికి ప్రతీక. కళాదీక్షితుల దీక్షా దక్షతలతో వివిధ సాంస్కృతిక సంస్థల సభలకు వేదికగా అది నిలచింది. కళా జనార్ధనమూర్తి హయాంలో ఆరు సమావేశ మందిరాలకు అవకాశం కలిగింది.
ఆశోక్ నగర్ సిటీ సెంట్రల్ లైబ్రరీ కేవలం గ్రంథాలకు నిధిగానే గాక చిన్నపాటి సమావేశాలకు నిలయమైంది. ఇటీవలి దశాబ్దిలో బి.ఆర్.యస్.నేత కె.తారకరామారావు చొరవతో పోటీ పరీక్షల అభ్యర్థులకు ఆ ప్రాంగణంలో కుర్చీలు ఏర్పడి సాయంకాలాలలో నిండుకుండలా వెలుగుతోంది.
నెహ్రూ బాలభవన్ వాసిరెడ్డి సీతాదేవి, శారదా అశోకవర్ధన్లు, రసమయి రాము సారథ్యంలో పబ్లిక్ గార్డన్స్‌లో బాలబాలికల కళాసాంస్కృతిక ప్రదర్శనలకు నెలవైంది.
ఆంధ్ర యువతీ మండలి, ఆంధ్ర మహిళా సభల సంకల్పం దుర్గాబాయమ్మది. పాఠశాలలు, విద్యాలయాలు, వైద్యశాల, సామాజిక కార్యకలాపాలకు ఈ సంస్థ విశేషకృషి చేసింది. 1938లో ఆంధ్ర మహిళా సభ స్కూలు మద్రాసులో ప్రాంరంభమై దినదిన ప్రవర్ధమానం చెందింది. 1962లో హైదరాబాదులో 15 పడకల ఆసుపత్రి మొదలుపెట్టారు. క్రమక్రమంగా పెద్ద హాస్పిటల్ గా రూపొందింది. 14 విభాగాలు పని చేస్తున్నాయి. స్కూళ్లు, కాలేజీలు నడుస్తున్నాయి. 2024 సెప్టంబరులో ఈ సంస్థ అధ్యక్షురాలిగా శ్రీమతి ఉషా కందా (మోహన్ కందా సతీమణి) ఎన్నికయ్యారు. 1988 నుండి 1994 వరకు శ్రీమతి కె.సుగుణమణి, 1994 నుండి 99 వరకు డా. వనజా అయ్యంగార్, అధ్యక్ష పీఠాన్ని అలంకరించి సంస్థ పురోభివృద్ధికి తోడ్పడ్డారు.
1998లో శ్రీ జి.వి.జి. కృష్ణమూర్తి గారి చేతుల మీదుగా డిల్లీ తెలుగు అకాడమీ వారి అవార్డు స్వీకరిస్తున్న రచయిత
పబ్లిక్ రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ హైదరాబాదులో దశాబ్దాలుగా నడవడానికి మూలపురుషుడు సి.వి.నరసింహారెడ్డి. ఆయన పౌర సమాచార శాఖలో డైరక్టర్‌గా రిటైరయ్యారు. జాతీయ స్థాయిలో పబ్లిక్ రిలేషన్స్ గురువుగా ఖ్యాతి గడించారు. వారి కుమార్తె రమాదేవి భారతీయ విద్యాభవన్ ప్రిన్సిపాల్‌గా ఏటా వార్షికోత్సవాలు జరిపారు. జాతీయ స్థాయిలో సంస్థకు బహుమతులు లభించాయి. ప్రస్తుతం కూడా బాబ్జీ, వేణుగోపాల రెడ్డి సంస్థ సారథులు.
ప్రకాశం అభివృద్ధి అధ్యయన సంస్థ అనగానే నిస్వార్ధ సేవకుడు టంగుటూరి సూర్యనారాయణ గుర్తుకు వస్తారు. లక్డీకపూల్ లోని వాసవీ కాలేజీ వెనుక గదిలో చాలా కాలం ఈ సంస్థ నడిచింది. హైకోర్టు జడ్జి జస్టిస్ ఆమంచర్ల గంగాధరావు 1980 ప్రాంతంలో అధ్యక్షులు. ఉస్మానియా వైన్ ఛాన్సలర్ జి.రామిరెడ్డి తర్వాత ప్రధాన పోషకులు. నాబార్డు చైర్మన్‌గా చేసిన ఐఎఎస్ అధికారి ఎం. రామకృష్ణయ్య తర్వాత అధ్యక్షులు. సోమరాజు రాయ్, జి. నారాయణ రావు, ఐఎఎస్; సీతయ్యగుప్త, మల్లికార్జున శర్మ ప్రభృతుల సాహచర్యంలో ప్రధాన కార్యదర్శి టి.సూర్యనారాయణ కొనసాగారు. 1982-95 మధ్య నేను కూడా ఈ సంస్థ కార్యకలాపాలలో నా వంతు సహకారం అందించాను. 1992లో ఢిల్లీలో పి.వి.భవన్ ముంగిట ప్రకాశం విగ్రహావిష్కరణను ప్రధాని పి.వి.నరసింహరావు చేతుల మీదుగా జరగడానికి ఎన్నికల సంఘ సభ్యులు జి.వి.జి.కృష్ణ మూర్తి ప్రధాన కారకులు.
భాగ్యనగరంలో వివిధ సాంస్కృతిక సంస్థలు ఐదు దశాబ్దులుగా చైతన్య భరితంగా పని చేస్తున్నాయి. వంశీ ఇంటర్నేషనల్ సంస్థ నిత్యయువకుడైన వంశీ రామరాజు ఆధ్వర్యంలో సభలు జరుపుతోంది. వంశీ బర్కీలీ అవార్డులు సినీ ప్రముఖులకు అందించారు.
కిన్నెర సాంస్కృతిక సంస్థకు 1980 దశకంలో అప్పటి పోలీసు డైరక్టర్ జనరల్ యం.వి.నారాయణరావు అధ్యక్షులు. అప్పటి నుండి ఇప్పటి దాకా కార్యాదక్షులైన మద్దాళి రఘురామ్ సంస్థను నడుపుతున్నారు. పోలీసు డైరక్టర్ జనరల్ గా పని చేసిన రొద్దం ప్రభాకరరావు అధ్యక్షులు. కిన్నెర ఉగాది పురస్కారాలు, హరికథా, నాటక సప్తాహాలు అవిశ్రాంతంగా కిన్నెర రఘురామ్ అలుపెరుగక కొనసాగిస్తున్నారు సహచర మిత్రులతో.
ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా శ్రీ జి.ఎం.సి. బాలయోగి గారి ఆధ్వర్యంలో పుస్తకావిష్కరణ, 2000
రసమయి యం. కె. రాము దశాబ్దాల తరబడి సాంస్కృతిక సభలు నిర్వహిస్తున్నారు. వీరి సతీమణి ఆశాలత వ్యాఖ్యానంలో దిట్ట. మరెన్నో పదుల సంఖ్యలో సాహిత్య సాంస్కృతిక సంస్థలు నడుస్తూనే వున్నాయి. స్థలాభవం!
(మళ్ళీ కలుద్దాం)
డా. రేవూరు అనంతపద్మనాభరావు అష్టావధాని, విమర్శకులు, ప్రముఖ సాహితీవేత్త. తెలుగు సాహిత్యం లోని అన్ని ప్రక్రియలలోనూ రచనలను చేశారు. 80 ఏళ్ళ వయస్సులో నిరంతర అధ్యయన, అధ్యాపనాలు కొనసాగిస్తూ 120 గ్రంథాలు ప్రచురించారు. 2005 లో దూరదర్శన్, ఢిల్లీ నుండి అదనపు డైరక్టర్ జనరల్‌గా పదవీ విరమణ చేశారు. పదవీ విరమణాంతరం గత 20 సంవత్సరాలలో 80 గ్రంథాలు వివిధ ప్రక్రియలలో ప్రచురించారు.
అనువాద సాహిత్యంలో తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం (1993); కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం (2000), అప్పాజోశ్యుల – విష్ణుభొట్ల – కందాళై ఫౌండేషన్ వారి విశిష్ట సాహితీ పురస్కారం లభించాయి. వీరి రచనలపై వివిధ కోణాలలో 5 విశ్వవిద్యాలయాల నుండి ఆరుగురు ఎం.ఫిల్/పిహెచ్డి పరిశోధనా గ్రంథాలు సమర్పించి పట్టాలు పొందారు.
సంచికలో వీరు గత ఐదు సంవత్సరాలలో – ఆకాశవాణి పరిమళాలు, కావ్యపరిమళం, జ్ఞాపకాలు-వ్యాపకాలు, ఆచార్య దేవోభవ, అవధానం ఆంధ్రుల సొత్తు అనే ఐదు గ్రంథాలు సమర్పించారు.
