Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వందే మా ‘తరం’-20

[తరాలు మారుతున్నాయి. సమాజం వేగంగా పరుగులు తీస్తోంది. విశ్వగ్రామం అనే సిద్ధాంతం ప్రబలింది. 1947లో పుట్టి 80వ ఏట కాలిడబోతున్న ప్రముఖ రచయిత డా. రేవూరు అనంత పద్మనాభరావు మూడు తరాల ప్రముఖులతో కలిసి మెలిసి తిరిగారు. ఆ జ్ఞాపకాల పందిరిని దారావాహికంగా అందిస్తున్నారు.]

భాగ్యనగర సాహితీ ప్రముఖులు:

1980 దశాబ్దినాటి భాగ్యనగర సాహిత్యాకాశంలో వెలుగొందిన ఎన్నో నక్షత్రాలు నా మదిలో మెదలుతున్నాయి. కనిసమ్మేళనాలు, భువన విజయాలు, సాహిత్య సభలు, నాటకాలు తరచు జరిగేవి. ఆకాశవాణి అధికారిగా ఉద్యోగ ధర్మంలో భాగంగాను, వ్యక్తిగత హోదాలను వీటికి హాజరయ్యాను. కవిగా పాల్గొన్నాను. ప్రముఖుల సరసన తిరిగాను. “ఆ రోజుల్లో సభలలో A B C D లు తప్పనిసరి” అని చమత్కరించేవారు. అక్కినేని నాగేశ్వరరావు, సభాసామ్రాట్ కె. భాస్కరరావు, సి.నారె; దైవజ్ఞ శర్మలు.

విశ్వసాహితి పేర పోతుకూచి సాంబశివరావు నెలనెలా సమావేశాలు జరిపారు. విశ్వసాహితి మాసపత్రిక నడిపారు. అఖిల భారత రచయితల సభలు హైదరాబాదులో, విశాఖపట్టణంలో జరిపారు. గ్రంథావిష్కరణలకు వేదిక కల్పించారు. నవ్యనాటక కళా పరిషత్ పక్షాన మునిసిపల్ కమీషనరుగా రిటైరయిన వేమరాజు నరసింహారావు సాంస్కృతిక చైతన్య వారధి.

గుంటూరు శేషేంద్రశర్మ, ఇందిరాదేవి ధనరాజ్ గిరి దంపతుల జ్ఞాన్‌బాగ్ ప్యాలెస్ కవితా నిలయం. ‘ముత్యాల ముగ్గు’ సినిమాను బాపు అక్కడే చిత్రీకరించారు. ఐ.ఎ.యస్. అధికారులైన యల్. మాలకొండయ్య, జె. బాపురెడ్డి, డి. మురళీకృష్ణ, పేర్వారం రాములు (ఐపిఎస్) ప్రభృతులు రచయితలుగా పాల్గొనేవారు. చైతన్య భారతి ఇంజనీరింగ్ కళాశాల వ్యవస్థాపకులు ఉండేల మాలకొండారెడ్డి ప్రసిద్ధ కవి.

1993లో తెలుగు యూనివర్శిటీ నుంచి అవార్డు అందుకుంటున్న రచయిత

అనువాద విభాగ డైరక్టరుగా రిటైరయిన బోయి భీమన్న, వారి సతీమణి హైమవతి గారలు సాహిత్యదంపతులు. భీమన్న పాల్గొన్న కవి సమ్మళనాలు ఆకాశవాణిలో హైలైట్. విశ్వనాథ సాహిత్య పీఠం నెలకొల్పి విశ్వనాథ రచనలను ప్రచురించిన వెల్చాల కొండలరావు తెలుగు అకాడమీ డైరక్టరు. తెలుగు అకాడమీలో అక్కిరాజు రమాపతిరావు, ముకురాల రామారెడ్డి, పోరంకి దక్షిణామూర్తి, బోయి విజయభారతి పాఠ్యగ్రంథాల ప్రచురణలేగాక పరిశోధనా గ్రంథాలనూ వెలువరించారు. ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్ లైబ్రరీ సంచాలకులుగా ప్రసిద్ధ రచయిత వి.వి.యల్. నరసింహారావు తాళపత్రగ్రంథ పరిష్కరణలు చేసిన ఘనులు. ఆయన లోగడ ప్రభుత్వ కళాశాల, మాచెర్ల ప్రిన్సిపాల్‌గా వ్యవహారించారు. రచయిత్రిగా సి.వేదవతి ప్రముఖులు.

సాహిత్యాభిమాని అయిన ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిన్ ఆవుల సాంబశివరావు అడపాదడపా ‘సాహిత్య దర్బారు’ ఏర్పరచేవారు. వారి కుమార్తె ఆవుల మంజులత తెలుగు విశ్వవిద్యాలయ వైస్-ఛాన్స్‌లర్‌గా వున్నారు, నాన్నగారి పేర తెలుగు విశ్వవిద్యాలయంలో స్మారకోపన్యాసాలు ఏర్పాటు చేశారు.

కాకతీయ సిమెంట్స్ అధినేత పి. వెంకటేశ్వర్లు అష్టాదశ పురాణాలు ప్రచురించారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‍గా పని చేశారు. బాదం రామస్వామి సాంస్కతిక కళారంగ పోషకులు.

విశ్వవిద్యాలయ వెలుగులు:

ఉస్మానియా విశ్వవిద్యాలయం అతి ప్రాచీనం. శత వసంత శోభతో తెలుగుశాఖ ఎందరో ఆచార్యులను తీర్చిదిద్దింది. తెలుగు విశ్వవిద్యాలయానికి పలువురు వైస్-ఛాన్స్‌లర్లను అందించింది. సజీవులైన వారిని స్థలాభావంతో ఉదహరించలేకపోతున్నాను. ఉస్మానియా ఆర్ట్స్ కళాశాలలోని తెలుగు శాఖలో దిగ్దంతులైన పండితులు ఆచార్య పదవి నదిష్ఠించారు. ఏకసంథాగ్రాహి అయిన దివాకర్ల వెంకటావధాని యువభారతి పక్షాన పలు సాహిత్య ప్రసంగాలు చేశారు. వీరి ప్రసంగం ఒకనొక రోజు వానలో గొడుగులు పట్టుకుని విన్నారంటే ఆశ్చర్యం వేస్తుంది. తొలి తరం ఆచార్యులతో పల్లా దుర్గయ్య, కురుగంటి సీతారామాచార్యులు, పాటిబండ మాధవశర్మ, అమరేశం రాజేశ్వరశర్మ, కె. గోపాలకృష్ణారావు, యం. కులశేఖరరావు, ఇరివెంటి కృష్ణమూర్తి, పాకాల యశోదారెడ్డి, ఎల్దండ రఘుమారెడ్డి చిరస్మరణీయులు.

జానపద వాఙ్మయోద్ధారకులు బిరుదురాజు రామరాజు. ఆ కోవలో నాయని కృష్ణకుమారి నడచి తెలుగు విశ్వవిద్యాలయ సారథ్యం చేశారు. ముదిగంటి సుజాతారెడ్డి తెలుగుశాఖలోను, వారి భర్త గోపాలరెడ్డి సంస్కృతంలోనూ ఆచార్యులు. చెలమచర్ల రంగాచార్యులు, బొడ్డపాటి కుటుంబరాయశర్మ, వేటూరి ఆనంద మూర్తి, యస్వీ రామారావు ఆ తరం వారసులు.

నాగార్జున సాంస్కృతిక కేంద్రం గుంటూరు వారి సన్మానం, 2005

ఈ పట్టికలో తప్పనిసరిగా నిలిచే ఇద్దరు ప్రసిద్దులను ప్రస్తావించడం ప్రధానం. వారే ‘ఏ దేశమేగినా ఎందు కాలిడినా’ గీత రచయిత రాయప్రోలు సుబ్బారావు. వారు తెలుగుశాఖకు ఆద్యులు. మహాభారత సంశోధనాప్రతుల సంపాదకులు ఖండవల్లి లక్ష్మీరంజనం యశోధనులు. వారి గ్రంథం ‘ఆంధ్రుల చరిత్ర – సంస్కృతి’ పోటీపరీక్షల అభ్యర్థులకు కరదీపిక.

భాషా శాస్త్రవిభాగం:

సాహిత్యంతో బాటు లింగ్విస్టిక్స్ విభాగం కూడా ఉస్మానియాలో ప్రసిద్ధి. దానికి ఆద్యులు భద్రిరాజు కృష్ణమూర్తి. విదేశాలలో పాఠాలు బోధించారు. పి.వి ప్రధానిగా వున్న సమయంలో వారి ప్రతిభకు పట్టం గట్టి హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీ వైస్-చాన్స్‌లర్‌గా (1986-1993) నియమించారు. అదే విభాగంలో ఆచార్యులు చేకూరి రామారావు ఎందరో శిష్యులకు మార్గదర్శి. విశ్రాంత జీవన వేళ త్యాగరాయ గానసభలో కార్యక్రమాలకు ప్రతి నిత్యం హాజరయ్యేవారు. భాషాశాస్త్రవేత్తగా ఉత్తములు.

సంస్కృత విభాగంలో పుల్లెల శ్రీరామచంద్రుడు వాల్మీకి రామాయణ వ్యాఖ్యానం వ్రాసిన మహనీయులు. పద్మశ్రీ విరాజితులు. హిందీ విభాగంలో భీమ్‌సేన్ నిర్మల్ ఆకాశవాణి హిందీ నాటకాలను, జాతీయ నాటక ప్రసారాలకు తెలుగు అనువాదం చేశారు. నాటక విభాగంలో మొదలి నాగ భూషణ శర్మఎందరో ఔత్సాహికులకు దిగ్దర్శనం చేవారు. అప్పాజోశ్యుల విష్ణుభొట్ల ఫౌండేషన్ వారి లక్షరూపాయల పురస్కారం అందుకున్నారు. వెల్చేరు నారాయణరావు ఉస్మానియాలో పరిశోధన కొనసాగించారు.

హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం:

ఇక్కడి తెలుగు శాఖలో అసమాన ప్రతిభా పాండిత్యాలు గల పలువురు ఆచార్య పదవులను అధిష్ఠించారు. స్మరణీయులనే పేర్కొంటాను. కొత్తపల్లి వీరభద్రరావు ఇక్కడ పనిచేసి అధికార భాషా సంఘం అధ్యక్షులు కూడా అయినారు. రాయప్రోలు వారి అల్లుడు ఈయన. జి. వి. సుబ్రమణ్యం ఇక్కడ పనిచేసి తెలుగు యూనివర్శిటీ వైస్-చాన్స్‌లర్ అయ్యారు. అలాగే రవ్వా శ్రీహరి కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయం వైస్- ఛాన్స్‌లర్. ఆంధ్ర సారస్వత పరిషత్ ప్రిన్సిపాల్‌గా వ్యవహరించిన కె.కె. రంగనాధాచార్యులు సెంట్రల్ యూనివర్శిటీ ఆచార్యులు. సి. ఆనందారామం ఇక్కడ పాఠాలు బోధించారు. నవలారచయిత్రి. ఇటీవలి కాలంలో ఇక్కడి ఆచార్యులు తుమ్మల రామకృష్ణ కుప్పం విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పని చేసి దివంగతులయ్యారు. అభ్యుదయ కవి ఎండ్లూరి సుధాకర్ అకాలమరణం దురదృష్టకరం. వర్తమాన ఆచార్యులు ఘనకీర్తిపరులు.

సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉపకులపతిగా సి.నా.రె. అగ్రగణ్యులు. ఆర్.వి.ఆర్. చంద్రశేఖరరావు రాజనీతి శాస్త్ర ఘనాపాఠి. తొలి వైస్-ఛాన్స్‌లర్ జి. రామిరెడ్డి నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ ఉన్నత పదవి నలంకరించారు. ఆయన ఉస్మానియా, సార్వత్రిక, జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయాల అధిపతిగా రికార్డు సృష్టించారు.

సార్వత్రిక విశ్వవిద్యాలయంలో తెలుగు కథకులు కేతు విశ్వనాథరెడ్డి ఆచార్యులు. 1967-70 మధ్య వారు, నేను కందుకూరు ప్రభుత్వ కళాశాల అధ్యాపకులం. ఇక్కడ ఆచార్యలు కె.యస్. రమణ (కె. సభా కుమారులు) అకాలమరణం చెందారు. శతాధిక గ్రంథకర్త రావికంటి వసునందన్ దూరవిద్యా మార్గదర్శి. పబ్లిక్ రిలేషన్స్ విభాగంలో సి.వి. నరసింహారెడ్డి గణనీయ కృషి చేశారు.

1987లో అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్.టి.రామారావుగారితో ఢిల్లీలో ఎపి భవన్‌లో సమావేశం

తెలుగు విశ్వవిద్యాలయం:

ప్రారంభ గురువు తూమాటి దోణప్ప. ఆ తర్వాత స్మరణీయులలో జి.వి. సుబ్రమణ్యం ప్రముఖులు. పేర్వారం జగన్నాధం ఈ విశ్వవిద్యాలయ సారథ్యం వహించిన రోజుల్లో 1993లో నేను అనువాద పురస్కారం స్వీకరించాను. నాయని కృష్ణకుమారి విదుషీమణి, వైస్-ఛాన్స్‌లర్. నాయని సుబ్చారావు తనయ. ఇక్కడ రిజిస్తారు యన్. శివరామమూర్తి విశిష్టులు.

కాకతీయ విశ్వవిద్యాలయ ప్రతిభ:

హైదరాబాదు ఆకాశవాణి పరిధిలో వరంగల్ కూడా భాగం. ఈ విశ్వవిధ్యాలయ ఆచార్యులు కీర్తిశేషులను స్మరిస్తాను. కేతవరపు రామకోటి శాస్త్రి అగ్రగణ్యులు. వీరి కుమార్తె కాత్యాయనీ విద్మహే. కోవెల సంపత్కుమార, సుప్రసన్నలు విద్వత్కవులు. మాదిరాజు రంగారావు ఇక్కడ పనిచేసి హైదరాబాదులో స్థిరపడి కాలధర్మం చెందారు. హరిశివకుమార్ చక్కని పరిశోధకులు. రామరాజు తనయ రుక్మిణి ఆచార్య పదవి నలంకరించారు.

వరంగల్ అనగానే సుప్రసిద్ధ కవి కాళోజీ నారాయణరావు స్ఫురణకు వస్తారు. వీరి ‘నా గొడవ’ జీవితచరిత్ర ప్రసిద్ధం. 2002లో వారు నన్ను వరంగల్ సభలో సత్కరించారు. సద్గురు శివానందమూర్తిగారి వజ్రోత్సవ సభలో నేను సత్కృతి అందుకున్నాను వరంగల్‌లో.

2005లో తిరుపతిలో పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ వారి సభలో ప్రసంగిస్తున్న రచయిత

అలంపురం అనగానే పరిశోధకులు గడియారం రామకృష్ణ శర్మ స్మరణకు వస్తారు. శాసన పరిశోధకులుగా ప్రశస్తి.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version