Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వందే మా ‘తరం’-21

[తరాలు మారుతున్నాయి. సమాజం వేగంగా పరుగులు తీస్తోంది. విశ్వగ్రామం అనే సిద్ధాంతం ప్రబలింది. 1947లో పుట్టి 80వ ఏట కాలిడబోతున్న ప్రముఖ రచయిత డా. రేవూరు అనంత పద్మనాభరావు మూడు తరాల ప్రముఖులతో కలిసి మెలిసి తిరిగారు. ఆ జ్ఞాపకాల పందిరిని దారావాహికంగా అందిస్తున్నారు.]

అలనాటి అవార్డులు, రివార్జులు:

కళాకారులకు, రచయితలకు, కవి పండితులకు, సామాజిక కార్యకర్తలకు గుర్తింపుగా అవార్డు లభిస్తే వారి జీవితం ధన్యమైనట్లు భావిస్తారు. జైళ్ల పాలయి కుటుంబాలను పట్టించుకోని స్వాతంత్ర సమరయోధులకు తామ్ర పత్రాలిచ్చి సత్కరిస్తే సంతోషించారు. ఆ అవార్డులు రకరకాలు. ప్రపంచవ్యాప్తిగా ప్రసిద్ధికెక్కిన నోబెల్ బహుమతి సాహిత్యపరంగా 1913లో రవీంద్రుని గీతాంజలికి లభించింది. ఠాగురుకు ఆంధ్రదేశంలోని మదనపల్లె బి.టి.కాలేజీతో అనుబంధం వుంది. గుంటూరు శేషేంద్ర శర్మ పేరు నోబుల్ బహుమతికి నామినేట్ అయినట్లు వార్త వచ్చింది.

భారతదేశంలోనే సాహిత్యపరంగా ప్రతిష్ఠాత్మకంగా భావించే జ్ఞానపీఠ పురస్కారం ముగ్గురు తెలుగువారికి లభించింది. విశ్వనాధ సత్యనారాయణ –  రామాయణ కల్పవృక్షం; డా. సి. నారాయణ రెడ్డి – విశ్వంభర; రావూరి భరద్వాజ – పాకుడురాళ్లు. టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక గ్రూప్ వారిది ఈ పురస్కారం. 1965లో తొలిసారిగా మలయాళ కవి జి.శంకర కురుప్‌ని ఈ అవార్డు వరించింది. 17 లక్షల రూపాయల నగదు (20 వేల డాలర్లు) అందిస్తారు. పారిశ్రామికవేత్త అయిన శాంతి ప్రసాద్ జైన్ ఈ సంస్థ స్థాపకుడు. జ్ఞానపీఠ బహుమతి ఎంపిక కమిటీలో లోగడ డా. బెజవాడ గోపాలరెడ్డి, పి.వి. నరసింహరావులు చైర్మన్లు. ఈ సంస్థ డైరక్టరుగా డా. ఇలపావులూరి పాండురంగారావు(1989) వ్యహరించారు.

జ్ఞానపీఠ వారే మూర్తిదేవి అవార్డును 1983 నుండి 4 లక్షల నగదుతో అందిస్తున్నారు. ఈ అవార్డును ఆచార్య కొలకలూరి ఇనాక్ ‘అనంత జీవనం’ నవలకు (2015) అందుకున్నారు. అదే రీతిలో కె.కె.బిర్లా ఫౌండేషన్ వారు 1991 నుండి 22 భాషల నుండి ఎంపిక చేసిన రచయితలకు 15 లక్షల రూపాయల నగదుతో ‘సరస్వతీ సమ్మాన్’ అందిస్తున్నారు. తొలి అవార్డు గ్రహీత హరివంశరాయ్ బచ్చన్. 2018లో కె.శివారెడ్డి కవితా సంపుటి  ‘పక్కకు వొత్తిగిలితే’ ఈ పురస్కారం అందుకొంది. ఈ రెండు పురస్కారాలు ప్రతిష్ఠాత్మకం.

కిన్నెర అవార్డు అందుకుంటున్న డా. రేవూరు అనంతపద్మనాభరావు

ఆస్కారు అవార్డు:

ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డు ఆర్.ఆర్.ఆర్ సినిమాకు ‘నాటు నాటు’ పాటకు వ్రాసిన చంద్రబోస్‌కు 2022లో లభించింది. గోల్డ్ గ్లోబ్ అవార్డు గా పేరు గాంచిన ఈ పురస్కారాన్ని కానుకుంట్ల సుభాష్ చంద్రబోస్ (1970) అందుకున్నాడు. ఆయన 1995లో తాజ్ మహల్ సినిమాకు గీతం వ్రాసి గత మూడు దశాబ్దాలుగా పేరు గడించాడు. జాతీయ స్థాయిలో ఉత్తమ గీతరచయితగా ఎంపికయ్యాడు (2002).

సినిమారంగంలో నంది అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు, సిమా అవార్డులు, జాతీయ ఫిల్మ్ అవార్డులు ప్రకటిస్తుంటారు. అందులో దాదాసాహెబ్ ఫాల్కె అవార్డు ప్రతిష్ఠాత్మకం. భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ వారు ఏటా సినీరంగానికి చెందిన అవార్డులను 1969 నుండి ప్రకటిస్తోంది. ఈ పురస్కారం పొందిన తెలుగు వారు బి.యన్.రెడ్డి (1990), యల్.వి.ప్రసాద్ (1982), బి.నాగిరెడ్డి(1986) అక్కినేని నాగేశ్వరరావు (1990), డి.రామానాయుడు (2010), కె.విశ్వనాథ్ (2016).

ఉత్తమ నేపథ్య గాయకుడిగా యస్.పి.బాలసుభ్రమణ్యం తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాలలో గానానికి ఆరు సార్లు జాతీయ స్థాయి అవార్డులు పొందారు. 16 భాషలలో దాదాపు 50 వేల పాటలు పాడి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించారు. 2016లో 47వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో Indian Film Personalities of the year గా సత్కరించబడ్డారు.

పద్మ పురస్కారాలు:

భారత ప్రభుత్వం 1954 నుండి పద్మ పురస్కరాలు ఏటా జనవరి 26న ప్రకటిస్తోంది. పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ లు ఈ కోవలోకి వస్తాయి. భారతరత్న, పురస్కరాలు విశిష్టం. తెలుగు మూలాలు గల వీరికి  భారతరత్న లభించడం గర్వకారణం. డా. సర్వేపల్లి రాధాకృషన్ (1954), మోక్షగుండం విశ్వేశ్వరయ్య (1955), జాకీర్ హుసేన్ (1963), వి. వి. గిరి (1975), పి. వి. నరసింహారావు (2024). తొలిసంవత్సరమే రాధాకృష్ణన్ పొందారు. వీరు తిరుపతి పాఠశాలలో చదివారు. అనంతరం కళాశాలలో అధ్యాపకులు. పద్మవిభూషణ్ 2024లో ముప్పవరపు వెంకయ్యనాయుడుకి, చిరంజీవికి లభించింది. అవధానులైన ముగ్గరికి పద్మశ్రీ లబించింది. ఆశావాది ప్రకాశరావు, గరికపాటి నరసిహారావు, మాడుగుల నాగఫణిశర్మ. ‘తెలుగు జాతికి భూషణాలు’ అనే పేర ఈ అవార్డులు పొందిన ప్రముఖుల జీవన రేఖలను ‘సంచిక’లో ప్రచురించాను. వివరాలు పాత సంచికలలో చదవవచ్చు త్వరలో నీల్ కమల్ పబ్లికేషన్స్ గ్రంథరూపంలో ప్రచురిస్తోంది.

1996లో విజయవాడలో ఆకాశవాణి సిబ్బందికి అవార్డులు అందజేస్తున్న అక్కినేని

కాళిదాస సమ్మాన్:

మధ్యప్రదేశ్ ప్రభుత్వం 1980 నుండి ఈ అవార్డు ప్రకటిస్తోంది. సంస్కృత కవి కాళిదాస పేర రెండు లక్షల రూపాయలు – శాస్త్రీయ సంగీతం, నృత్యం ప్లాస్టిక్ కళలో ప్రముఖులకు ఏటా అందిస్తారు. అందుకున్న తెలుగు ప్రముఖులు, వేదాంతం సత్యనారాయణశర్మ(1987-88, నృత్యం), వెంపటి చినసత్యం (1991-92 నృత్యం),  మంగళంపల్లి బాలమురళీకృష్ణ (1999-2000 సంగీతం), యామినీ కృష్ణమూర్తి (2001-2002 నృత్యం).

కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు:

1955లో తొలిసారిగా సాహిత్య అకాడమీ వివిధ భారతీయ భాషలలో ఎంపికైన గ్రంథానికి ఏటా పురస్కారం అందిస్తోంది. లక్ష రూపాయల నగదు లభిస్తుంది. తొలి పురస్కారం సురవరం ప్రతాపరెడ్డి ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’కు 1955లో లభించింది. గత ఏడు దశాబ్దులలో ఎందరో ప్రముఖులను పురస్కారం వరించింది. ప్రముఖులు వీరు – బాలాంత్రపు రాజనీకాంతరావు (1961), విశ్వనాథ సత్యనారాయణ (1962) త్రిపురనేని గోపీచంద్ (1963), గుర్రం జాషువా (1964), రాయప్రోలు సుబ్బరావు (1965), తుమ్మల సీతారామమూర్తి (1969). బాలగంగాధర తిలక్(1970), తాపీ ధర్మారావు (1971). శ్రీశ్రీ (1972), సి.నా.రె (1973), దాశరథి (1974), భోయి భీమన్న (1975), కుందుర్తి ఆంజనేయులు (1977), దేవులపల్లి కృష్ణశాస్త్రి (1978), పుట్టపర్తి నారాయణాచార్యులు (1979), నార్ల వెంకటేశ్వరరావు (1981), ఇల్లందల సరస్వతీదేవి(1982), రావూరి భారద్వాజ (1983), ఆలూరి భైరాగి(1984), పాలగుమ్మి పద్మరాజు (1985), జి.వి.సుబ్రమణ్యం (1989),  కె.శివారెడ్డి(1990), భరాగో (1991), మాలతీచందూర్ (1992), మధురాంతకం రాజారాం (1993), శేషేంద్రశర్మ(1994), కాళీపట్నం రామారావు (1995), కేతు విశ్వనాథ రెడ్డి(1996), అజంతా (1997), బలివాడ కాంతారావు (1998), వల్లంపాటి వెంకటసుబ్బయ్య (1999), యన్. గోపి (2000), తిరుమల రామచంద్ర (2001), చేకూరి రామారావు(2002), ఉత్పల సత్యనారాయణాచార్య (2003), అంపశయ్య నవీన్ (2004), అబ్బూరి ఛాయాదేవి (2005), మునిపల్లె రాజు (2006), గడియారం రామకృష్ణ శర్మ (2007), చిటిప్రోలు కృష్ణమూర్తి (2008), యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ (2009), సయ్యద్ సలీం (2010), సామల సదాశివ (2011), పెద్దిభొట్ల సుబ్బరామయ్య (2012). ఆ తర్వాతి వారు పలువురు.

రచయిత సలీం గారికి విజయనగరంలో చాసో పురస్కారం ప్రదానం

సాహిత్య అకాడమీ 2010 నుండి బాలసాహిత్య పురస్కారాలు అందిస్తోంది. తొలి పురస్కార గ్రహీత కలువకొలను సదానంద. అదే రీతిలో 1989 నుండి అనువాద సాహిత్య పురస్కారాలు ఏటా ప్రకటిస్తోంది. తొలి పురస్కారం బెజవాడగోపాలరెడ్డికి లభించింది. 2000 సంవత్సరంలో ఈ రచయిత (అనంత పద్మనాభరావు) అమితావ్ ఘోష్ ‘షాడో లైన్స్’ ఆంగ్ల గ్రంథానువాదం ‘ఛాయరేఖల’కు అందుకొన్నారు.

2011 నుండి సాహిత్య అకాడమీ యువ సాహిత్య పురస్కారాలను ప్రకటిస్తోంది. 50 వేల రూపాయల నగదు అందిస్తారు. తొలి పురస్కారం వేంపల్లి గంగాధర్ అందుకొన్నారు. రాష్ట్రపతిగా శ్రీ ప్రణబ్ ముఖర్జీ వున్న కాలంలో గంగాధర్ ‘WRITER IN RESIDENCE AT RASHTRAPATI BHAVAN’ రాష్ట్రపతి నిలయంలో మూడు వారాల అతిధిగా వున్నారు. సాహిత్య అకాడమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు సౌజన్యంతో ఆ అవకాశం గంగాధర్‌కు 2014లో సెప్టంబర్ 8 నుండి 26 వరకు దక్కింది. సిక్కిం, చెన్నై, ముంబైల నుండి మరో ముగ్గురికి ఈ అవకాశం అదే సమయంలో లభించింది. శాంతినికేతన్‌కు చెందిన ఆచార్యులు జోగేన్ చౌదరి తొలిసారిగా ఈ గౌరవం 2013లో పొందారు.

భాషా సమ్మాన్ పేర సాహిత్య అకాడమీ ఏటా నలుగురిని సత్కరిస్తుంది. 1996 నుండి ఇది ప్రారంభమైంది. తమ్మపూడి  కోటీశ్వరరావు (2001), 2006లో వేటూరి ఆనందమూర్తి, 2009 లో కొర్లపాటి శ్రీరామమూర్తి, నాగళ్ల గురు ప్రసాదరావు (2015) జి. వెంకటసుబ్బయ్య (2017), బేతవోలు రామబ్రహ్మం(2021) ఈ సమ్మానం పొందారు.

1984లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ భాస్కరన్ గారి నుంచి స్వర్ణపతకం స్వీకరిస్తున్న డా. రేవూరు అనంతపద్మనాభరావు

సాహిత్య అకాడమీ గౌరవ ఫెలో గాను, ఫెలోగాను సత్కరించిన తెలుగు ప్రముఖులు వీరు – సర్వేపల్లి రాధాకృష్ణన్ (1968), విశ్వనాథ సత్యనారాయణ(1970), గుంటూరు శేషేంద్రశర్మ(1999), ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి (2004),  సి.నారాయణరెడ్డి (2014).

గౌరవఫెలోగా ఎన్నికైన వారు – వెల్చేరు నారాయణరావు (2020). ఇది అకాడమీ అందించే అతి విశిష్ట గౌరవం. నారాయణరావు విస్కాన్సిన్ విశ్వ విద్యాలయంలో తెలుగు బోధించారు. విదేశాలలో నివసించిన వారికి ఈ గౌరవం లభిస్తుంది. మిగతా ఇతర సంస్థల వివరాలు మరో వారం.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version