[తరాలు మారుతున్నాయి. సమాజం వేగంగా పరుగులు తీస్తోంది. విశ్వగ్రామం అనే సిద్ధాంతం ప్రబలింది. 1947లో పుట్టి 80వ ఏట కాలిడబోతున్న ప్రముఖ రచయిత డా. రేవూరు అనంత పద్మనాభరావు మూడు తరాల ప్రముఖులతో కలిసి మెలిసి తిరిగారు. ఆ జ్ఞాపకాల పందిరిని దారావాహికంగా అందిస్తున్నారు.]
ప్రతిభామూర్తులు:
ఆ తరానికి చెందిన ఎందరో ప్రతిభామూర్తులకు జాతీయ స్థాయి అవార్డులు లభించాయి. వారి సేవకు గుర్తింపుగా సంస్థలు వాటిని ప్రకటించాయి. హైదరాబాదులోని రామకృష్ణామిషన్ ఆధ్యాత్మిక రంగంలో స్వామి రంగానాథానంద నేతృత్వంలో ఎంతో కృషి చేసింది. ఆయనకు వ్యక్తిగతంగా పద్మభూషణ్ ప్రకటిస్తే దానిని సున్నితంగా తిరస్కరించారు. రామకృష్ణామిషన్ సేవలకు గుర్తింపుగా 1987లో ఇందిరా గాంధీ జాతీయ సమైక్యతా అవార్డును, 1999లో గాంధీ శాంతి బహుమతిని స్వీకరించారు.
హైదరాబాదులో యం.వి.ఫౌండేషన్ (మామిడిపుడి వెంకటరంగయ్య) వ్యవస్థాపకురాలు శ్రీమతి శాంతాసిన్హా (1950 జనవరి 7) కు 2003లో కమ్యూనిటీ లీడర్షిప్ క్రింద రామన్ మెగససే అవార్డు లభించింది. ఆమె మామిడిపూడి వెంకటరంగయ్య మనుమరాలు (నెల్లూరు). హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసరు.
ప్రఖ్యాత సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణకు ఫ్రెంచి ప్రభుత్వం 2005లో చెవిలియర్ ఆర్డరు పురస్కారం అందించింది. వారికి రాజాలక్ష్మీ ఫౌండేషన్ అవార్డుతో బాటు అనేక పురస్కారాలు లభించాయి.
తెలుగు విశ్వవిద్యాలయం పురస్కార విజేతలు, 1994
రాజాలక్ష్మీ ఫౌండేషన్ అవార్డులు:
విజయనగరానికి చెందిన పి.వి.రమణయ్యరాజా 1979లో ఈ అవార్డు నెలకొల్పారు. లక్ష రూపాయల నగదుతో బాటు బహుమతి గ్రహీతకు అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన తెలుగు కళాసమితి పక్షాన డా.కె.వి.రావు, జ్యోతిరావులు రెండు వేల డాలర్లు నవంబరు 19న ఏటా ఇస్తారు.
అవార్డు గ్రహీతలు:
1979లో తొలిసారిగా శ్రీశ్రీకి, డా.బెజవాడ గోపాలరెడ్డి ఈ అవార్డు ప్రదానం చేశారు.
ఇతరులు:
బాలమురళి, వెంపటి చినసత్యం, వేణుమాధవ్, బాపు, వై.నాయుడమ్మ, టంగుటూరి సూర్యకుమారి, మాండలిన్ శ్రీనివాస్, జి.కె.రెడ్డి (ద హిందూ), డా. రామమూర్తి, డా. సి. నారాయణరెడ్డి, డా. బెజవాడ గోపాలరెడ్డి, లతా మంగేష్కర్, నటరాజ రామకృష్ణ, ద్వారం వెంకటస్వామి నాయుడు ట్రస్ట్, పి. సాయినాధ్, జి. రాంరెడ్డి, అబిద్ హుసేన్, భానుమతి, ఏ.యస్.రామన్, యస్వీరామారావు (యు.యస్.ఎ), శివానందమూర్తి, నేదునూరి కృష్ణమూర్తి, బిరుదరాజు రామరాజు, సుధామూర్తి, మల్లాది చంద్రశేఖరశాస్త్రి, యస్.పి. బాలసుబ్రమణ్యం, కోనేరు హంపి ప్రభృతులు. ఇతర పురస్కారాలు ఈ సంస్థవి.
రాజలక్ష్మీ సాహితీ పురస్కరాలు:
రావూరి భరద్వాజ (1987), నాగభైరవ కోటేశ్వరరావు, తిరుమల రామచంద్ర, బోయి భీమన్న, శ్రీ భాష్యం అప్పలాచార్యులు, మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, పి.యస్.ఆర్ అప్పారావు, ముళ్లపూడి వెంకటరమణ, మాలతీ చందూర్, మల్లంపల్లి శరభేశ్వరశర్మ, రామలక్ష్మి ఆరుద్ర, కొత్తపల్లి వీరభద్రరావు, ద్వివేదుల విశాలాక్ష్మి (1999), 2025 సంవత్సరానికి విజయవాడకు చెందిన పి.సత్యవతికి లభించింది.
రాజలక్ష్మీ వైదిక పురస్కరాల పేర 1994 నుండి వేద పండితులకు నగదు పురస్కారాలు ప్రకటిస్తున్నారు. ప్రత్యేక బహుమతులు అందుకొన్న ప్రముఖులు – పాలగుమ్మి పద్మరాజు, భావరాజు సర్వేశ్వరరావు (వి.సి), గొల్లపూడి మారుతీరావు, బాపు-రమణులు.
1987లో పద్మనాభరావు గారిని సత్కరిస్తున్న అప్పటి గవర్నర్ శ్రీ కోన ప్రభాకరరావు
గుప్తా ఫౌండేషన్ అవార్డులు:
చెన్నై – ఏలూరులకు చెందిన ఈ సంస్థ 1989 నుండి అవార్డులు ప్రకటిస్తోంది. పుట్టపర్తి నారాయణాచార్యులు, యం.యస్.సుబ్బులక్ష్మి, పద్మా సుబ్రమణ్యం, స్వామి రంగనాథానంద, పినాకపాణి, ఆరుద్ర, బాపు, రమణులు, గణపతి స్థపతికి అవార్డులు లభించాయి.
ప్రెసిడెంట్ సర్టిఫికెట్ అవార్డులు:
కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖవారు సంస్కృతం, అరబిక్, పాళి భాషాపండితులకు 5 లక్షల రూపాయల నగదు అందిస్తారు. సంస్కృతంలో పొందిన తెలుగు ప్రముఖులు కొందరు – గుళ్లపల్లి వెంకట నారాయణ ఘనాపాఠీ (2015), వెంపటి కుటుంబశాస్త్రి (2014), విష్ణుభట్ల సుభ్రమణ్యశాస్త్రి (2008), యస్. సత్యనారాయణమూర్తి (2019).
2018లో తెలుగు ప్రాచీన భాష పేర ఆచార్య బేతవోలు రామబ్రహ్మం, 2019లో ఆచార్య రవ్వా శ్రీహరికి 5 లక్షల పురస్కారం లభించింది. బాదరాయణ వ్యాస సమ్మన్ పేర 50 వేల రూపాయల నగదు, 2018లో అద్దంకి శ్రీనివాస్, వి.త్రివేణి, డి.కె.ప్రభాకర్ లకు లభించింది. తర్వాత ఈ పథకం నిలిచిపోయింది.
భారతీయ భాషా పరిషత్, కలకత్తా అవార్డులు:
1975లో కలకత్తాలో సీతారాం సేక్సేరియా ఈ అవార్డు స్థాపించారు. ఈ సంస్థ డైరక్టర్లుగా ఇలపావులూరి పాండురంగారావు, బాలశౌరిరెడ్డి గతంలో వ్యవహరించారు. తెలుగువారు పలువురు లక్ష రూపాయల పురస్కారం అందుకున్నారు. 2000 సంవత్సరం వాసిరెడ్డి సితాదేవికి లభించింది.
యువ పురస్కారం పేర ఈ సంస్థ అవార్డను 2025లో ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖ అసిస్టెంట్ ప్రొఫెసర్ బి.ఆదినారాయణకు 50 వేల నగదు లభించింది. ఆయన కవితకు అది దక్కింది.
2017లో పద్మనాభరావు గారికి భాషా పురస్కారం అందజేస్తున్న ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు
గృహలక్ష్మి స్వర్ణకంకణం:
ప్రముఖ ఆయుర్వేద వైద్యనిపుణులు చెన్నపట్టణంలో 1928లో స్త్రీల సంక్షేమం కోసం గృహలక్ష్మి మాసపత్రిక ప్రారంభించారు. స్త్రీ విద్యావ్యాప్తికి, వారి రచనా ప్రోత్సాహానికీ ఈ పత్రిక కృషి చేసింది. రచయిత్రులను ఏటా పురస్కారాల క్రింద స్వర్ణకంకణం ఇచ్చే విధానాన్ని 1934 నుండి ఆరంభించారు. గృహలక్ష్మి స్వర్ణకంకణం స్వీకరించడం గొప్ప గౌరవంగా భావించేవారు. విశిష్ట సేవలకు గుర్తింపుగా ఇది ప్రకటిస్తారు. బహుమతి గ్రహీతలలో ప్రముఖులు – కనుమర్తి వరలక్ష్మమ్మ (1934), చిలకపాటి సీతాంబ (1935), కాంచనపల్లి కనకాంబ (1936), ఇతరులు – ఉన్నవ లక్ష్మీబాయమ్మ, బెంగుళూరు నాగరత్మమ్మ, ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ, పొణకా కనకమ్మ, కొమ్మూరి పద్మావతీ దేవి, కె.రామలక్ష్మి, దేశిరాజు భారతీదేవి, ఇల్లిందల సరస్వతీదేవి, తెన్నెటి హేమలత, ద్వివేదుల విశాలాక్షి. కోడూరి కౌసల్యాదేవి, ముప్పాళ్ల రంగనాయకమ్మ, యద్దనపూడి సులోచనారాణి, ఐ.వి.యన్. అచ్యుతవల్లి, డి.కామేశ్వరి, సి.ఆనందారామం, కోడూరి లీలావతి, వాసిరెడ్డి సితాదేవి, మాదిరెడ్డి సులోచన, తురగా జానకీరాణీ, వింజమూరి సీతాదేవి, జె.భాగ్యలక్ష్మి(ఢిల్లీ), నాయని కృష్ణకుమారి, వేదుల మీనాక్షి, ఉన్నవ విజయలక్షి, పోలాప్రగడ రాజ్యలక్ష్మి, శారదా అశోక్‌వర్ధన్, వాసా ప్రభావతి, ప్రభృతులు, దరిమిలా పత్రిక నిలిచిపోవడంతో అవార్డులు నిలిచిపోయాయి.
కేసరి లోధ్ర హెయిర్ ఆయిల్ కంపెనీతో బాటు లోధ్ర ప్రెస్‌లో గృహలక్ష్మి పత్రికను ముద్రించేవారు. గరిమెళ్ల సత్యనారాయణ (మా కొద్దీ తెల్లదొరతనం గీత రచయిత) 1930లో ఈ పత్రిక సంపాదకులుగా కొంత కాలం పని చేశారు. కనుపర్తి వరలక్ష్మమ్మ ‘శారద లేఖలు’ ఇందులో బాగా ప్రచారం పొందాయి.
ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ:
ఈ అకాడమీ వారు గ్రంథరచనా పోటీలు నిర్వహించి నగదు బహుమతి ప్రకటించేవారు. ఒకసారి ‘తెలుగు కావ్యాలలో అవతారికలు’ అనే అంశం పైన, మరోకసారి ‘తెలుగు కావ్యాలలో ప్రకృతి వర్ణనల’ పైనా పోటీలు నిర్వహించారు. యన్.టి.రామారావు అకాడమీలు రద్దు చేశారు. ఆ తర్వాత తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారాలు, కీర్తి పురస్కారాలు, ధర్మనిధి పురస్కారాలు, వివిధ ప్రక్రియల ఉత్తమ రచనా పురస్కారాలు ఏటా ప్రకటిస్తోంది. అంతర్జాతీయ తెలుగు కేంద్రం పక్షాన మండలి వెంకటకృష్ణారావు, బోయి భీమన్న ప్రభృతుల స్మారక పురస్కారాలు అందిస్తున్నారు. తెలుగు అకాడమీ జాషువా పేర లక్ష రూపాయల బహుమతి అందించింది.
తెలంగాణా ప్రభుత్వం దాశరథి, కాళోజీ పురస్కారాలు ఏటా అందిస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తెలుగు భాషా దినోత్సవ పురస్కారాలను, ఉగాది పురస్కారాలను అందిస్తోంది. పింగళి వెంకయ్య స్మారకంగా, ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ లో 75 లక్ష రూపాయలను ఆయన కుమార్తె సీతామహాలక్ష్మికి ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహనరెడ్డి మాచర్ల వెళ్లి స్వయంగా అందించడం విశేషం.
డా. సి.నారాయణరెడ్డి కుటుంబ సభ్యులు ఏటా సుశీలా నారాయణరెడ్డి అవార్డు, నారాయణరెడ్డి అవార్డు ప్రకటిస్తున్నారు. తెలంగాణా సారస్వత పరిషత్ వారు పూర్వ ఉప రాష్ట్రపతి శ్రీ యం. వెంకయ్యనాయుడు అందించిన విరాళంతో 2021 నుండి ఏటా పోలూరి హనుమజ్జానకీ రామశర్మ అవార్డు 25 వేల రూపాయలు ఒక పండితునికి అందిస్తున్నారు. 2025లో చాగంటి కోటేశ్వరరావు అందుకున్నారు. వరల్డ్ తెలుగు ఫెడరేషన్ (మదరాసు) అవార్డులు ప్రకటిస్తుంది. ఢిల్లీ తెలుగు ఆకాడమీ, మదరాసు తెలుసు అకాడమీ ఏటా అవార్డులు అందించాయి.
2004లో నెల్లూరులో అనంత లక్ష్మీకాంత సాహిత్యపీఠం వారి స్వర్ణకంకణ పురస్కారాన్ని స్వీకరిస్తున్న ఎస్. పి. బాలసుబ్రమణ్యం
ఆంధ్ర విశ్వవిద్యాలయం ‘కళాప్రపూర్ణ’ బిరుద సత్కారాన్ని దశబ్దాలుగా అందించింది. గౌరవ డాక్టరేట్లను పలు విశ్వవిద్యాలయాలు ప్రకటిస్తున్నాయి. వీటికి నగదు బహుమతి లేదు. వ్యక్తిగత స్మారక అవార్డులు పలు సంస్థలు ప్రకటిస్తున్నాయి. 1970ల నుండి నెల్లూరు వర్ధమాన సమాజం వారు కవిత్రయ జయంతుల అవార్డులు ప్రకటించి మూడు రోజులు ఉపన్యాసాలు ఏర్పాటు చేసేవారు. బెజవాడ గోపాలరెడ్డి పేర అవార్డులు కూడా వెలశాయి. అనంత లక్ష్మీకాంత సాహితీ పీఠం పేర మా నాన్నగారి స్మారక పురస్కారాలు 2001 నుండి 25 సంవత్సరాలుగా అందిస్తున్నాను. ఎర్రన సాహిత్య ఫీఠం (ఒంగోలు), నాగభైరవ కళాఫీఠం (ఒంగోలు), పులికంటి కృష్ణారెడ్డి సాహితీ పీఠం, రావిశాస్త్రి అవార్డు. నూతలపాటి గంగాధరం అవార్డు, బొమ్మిడాల కృష్ణముర్తి ఫౌండేషన్, ప్రసాదరాయ కులపతి అవార్డు, పైడి లక్ష్మయ్య అవార్డు, వంశీ బర్కిలీ అవార్డు, కిన్నెర ఉగాది పురస్కరాలు. గ్లోబల్ మ్యూజక్ ఫౌండేషన్, విశాఖపట్టణం వారు 2025లో వీణాగాయత్రికి విజయదశమి నాడు లక్ష రూపాయలు (రామవరపు విజయలక్ష్మి పేర) అందించారు. జానమద్ది సాహితీ పురస్కారం (కడప).
(మళ్ళీ కలుద్దాం)
డా. రేవూరు అనంతపద్మనాభరావు అష్టావధాని, విమర్శకులు, ప్రముఖ సాహితీవేత్త. తెలుగు సాహిత్యం లోని అన్ని ప్రక్రియలలోనూ రచనలను చేశారు. 80 ఏళ్ళ వయస్సులో నిరంతర అధ్యయన, అధ్యాపనాలు కొనసాగిస్తూ 120 గ్రంథాలు ప్రచురించారు. 2005 లో దూరదర్శన్, ఢిల్లీ నుండి అదనపు డైరక్టర్ జనరల్‌గా పదవీ విరమణ చేశారు. పదవీ విరమణాంతరం గత 20 సంవత్సరాలలో 80 గ్రంథాలు వివిధ ప్రక్రియలలో ప్రచురించారు.
అనువాద సాహిత్యంలో తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం (1993); కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం (2000), అప్పాజోశ్యుల – విష్ణుభొట్ల – కందాళై ఫౌండేషన్ వారి విశిష్ట సాహితీ పురస్కారం లభించాయి. వీరి రచనలపై వివిధ కోణాలలో 5 విశ్వవిద్యాలయాల నుండి ఆరుగురు ఎం.ఫిల్/పిహెచ్డి పరిశోధనా గ్రంథాలు సమర్పించి పట్టాలు పొందారు.
సంచికలో వీరు గత ఐదు సంవత్సరాలలో – ఆకాశవాణి పరిమళాలు, కావ్యపరిమళం, జ్ఞాపకాలు-వ్యాపకాలు, ఆచార్య దేవోభవ, అవధానం ఆంధ్రుల సొత్తు అనే ఐదు గ్రంథాలు సమర్పించారు.
