[తరాలు మారుతున్నాయి. సమాజం వేగంగా పరుగులు తీస్తోంది. విశ్వగ్రామం అనే సిద్ధాంతం ప్రబలింది. 1947లో పుట్టి 80వ ఏట కాలిడబోతున్న ప్రముఖ రచయిత డా. రేవూరు అనంత పద్మనాభరావు మూడు తరాల ప్రముఖులతో కలిసి మెలిసి తిరిగారు. ఆ జ్ఞాపకాల పందిరిని దారావాహికంగా అందిస్తున్నారు.]
అలనాటి రాజకీయ ముఖచిత్రం (1975-2005):
ఆకాశవాణి, దూరదర్శన్‌లో నేను మూడు దశాబ్దులు (1975-2005) వివిధ ప్రాంతాల్లో, వివిధ హోదాల్లో పనిచేశాను. అందులో 10 సంవత్సరాలు రాయలసీమలో, 10 సంవత్సరాలు దేశ రాజధాని ఢిల్లీలో ఉద్యోగ ప్రస్థానం సాగింది. మిగతా కాలంలో హైదరాబాద్, విజయవాడల్లో ఉద్యోగం. ఆయా సందర్భాలలో పలువురు ప్రముఖ రాజకీయనేతలతో పరిచయాలు, సంభాషణలు, ఇంటర్వ్యూలు, సభా వేదికలపై ప్రసంగాలు చేసే అవకాశం లభించింది. ముందుగా అలనాటి రాష్ట్రపతుల ప్రస్తావన చేస్తాను.
రాష్ట్రపతులు:
వి.వి. గిరి జీవిత చరిత్ర నా తొలి రచన (1969). వారిని 1976లో ఢిల్లీలో కలిసి వారికి ఆ గ్రంథం సమర్పించాను. సంతోషించారు. 1983లో రాష్ట్రపతి నిలయంలో జ్ఞాని జైల్‌సింగ్ వారం రోజులు విడిది చేశారు. ప్రసార మాధ్యమ వ్యక్తులతో ఒక సాయంత్రం గడిపారు. నేను, మా డైరక్టరు వారితో కలిసి ఫొటో దిగాము. 1977లో నీలం సంజీవరెడ్డి తిరుపతికి వచ్చినప్పుడు రికార్డు చేశాము. రేణిగుంటలో రైల్వే వ్యాగన్ రిపేర్ ప్లాంట్ ప్రారంభ సంరంభం గొప్పగా సాగింది. కడపకోటిరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు సంజీవరెడ్డి. శంకర్ దయాళ్ శర్మ పుట్టపర్తి సాయిబాబా జన్మదినోత్సవాలకు 1991, 1992లో విచ్చేశారు. బాబా రాష్ట్రపతిని ఘనంగా ప్రశంసించారు. ఆ రికార్డింగ్ టేప్ కావాలని ప్రత్యేకంగా రాష్ట్రపతి నన్ను పిలిచి కోరారు. అందించాము. ఢిల్లీలో డైరెక్టరుగా, కె.ఆర్. నారాయణన్ రిపబ్లిక్ డే దినోత్సవ సందేశం రికార్డు చేశాను. అబ్దుల్ కలాం గారి సరసన వేదికపై కూర్చుని, సర్దార్ పటేల్ స్మారకోపన్యాస సభ ఆకాశవాణి ద్వారా నిర్వహించాను. శంకర్ దయాళ్ శర్మ మృతి సందర్భంగా శ్రద్ధాంజలి కార్యక్రమం 1999 డిసెంబరు 26న అంతిమ సంస్కారాలకు ప్రత్యక్ష వ్యాఖ్యానం 10 గంటల వ్యవధిలో ఢిల్లీ కేంద్రం నుండి హడావిడిగా నిర్వహించాను. వరుసగా 4 సంవత్సరాలు ఆగస్టు 15, జనవరి 26 సాయంత్రాలు రాష్ట్రపతి భవన్‍లో ‘AT HOME’ తేనేటి విందు కార్యక్రమాలలో సతీ సమేతంగా పాల్గొన్నాను. ఆర్. వెంకట్రామన్‌ని విశ్రాంత జీవిత సమయంలో కలిశాను. అవి తీపి జ్ఞాపకాలు. 1975లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలకు ఫక్రూద్దీన్ అహ్మద్ వచ్చినప్పుడు నేను ప్రతినిధిని.
శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయితో ఢిల్లీ ఆకాశవాణి బృందం
ప్రధానమంత్రులు:
మొరార్జీ దేశాయ్ 1979లో తుఫాను ప్రభావిత ప్రాంత పరిశీలనకు వచ్చినప్పుడు విజయవాడ కేంద్రం తరఫున వెళ్లి రికార్డు చేశాను. 1980 ఎన్నికల సభలో పాల్గొనడానికి రాజంపేట అభ్యర్థి పి. పార్థసారథి గెలుపు కోసం ఇందిరాగాంధీ వచ్చారు. దాన్ని రికార్డింగు చేసి ఢిల్లీకి శారదాప్రసాద్ ద్వారా పంపాము. 1984లో ప్రకాశం అభివృద్ధి సంస్థ ప్రకాశం జయంతికి ఢిల్లీ విజ్ఞాన భవన్‌కు రాజీవ్ గాంధీ ముఖ్య అతిథి. ఆ వేదికపై మాట్లాడే అవకాశం నాకు లభించింది. అటల్ బిహారీ వాజ్‌పేయి సందేశాలు వారి నివాసంలో 1998-2000 మధ్య పలుసార్లు ఢిల్లీ స్టేషన్ పక్షాన రికార్డ్ చేసే బృందాలకి నాయకత్వం వహించాను. ఎన్నికల ప్రసంగాల్లో భాగంగా ఐ.కె. గుజ్రాల్, దేవెగౌడ, వి.పి. సింగ్‌లు ఢిల్లీ స్టూడియోలకు వచ్చినప్పుడు స్వాగతం పలికాను. తదనంతర కాలంలో వారు ప్రధానులు (అద్వానీ ఉప ప్రధాని) అయ్యారు. పి.వి. నరసింహారావు సాహిత్య ప్రియులు. వారు మా సంగీత రికార్డింగులు కావాలని సెక్రటరీ ద్వారా 1991లో కోరారు. అది మొదలు తరచు వారిని నివాసంలో కలిసినప్పుడు సాహిత్య విషయాలు ప్రస్తావించేవారు.
రాష్ట్ర గవర్నర్లు:
పలువురు గవర్నర్లతో సన్నిహితంగా తిరిగే అదృష్టం వరించింది. 1972లో నెల్లూరు ఓరియంటల్ కాలేజీలో నేను చేసిన అష్టావధానం ఆసాంతం తిలకించి బెజవాడ గోపాలరెడ్డి నన్ను గౌరవించారు. అది మొదలు వారు జీవించినంత కాలం ఎక్కడ కలిసినా ఆదరంగా పలకరించేవారు. బెజవాడ గోపాలరెడ్డి అవార్డును 2004లో నాకు ప్రదానం చేశారు. బీహార్ గవర్నరు పెండేకంటి వెంకటసుబ్బయ్య గారికి నాకు ‘రామాయణంలో స్త్రీ పాత్రలు’ పుస్తకం అంకితం చేశాను. 1987లో అక్టోబరులో ఢిల్లీ బదిలీ ఐనప్పుడు బీహార్ భవన్‌లో నెల రోజులు వారి అతిథిగా ఉన్నాను. నెల్లూరు వాస్తవ్యుడైన పశ్చిమ బెంగాల్ గవర్నరు కె.వి. రఘునాథరెడ్డిని ఢిల్లీలో బెంగాల్ భవన్‌లో కలిశాను.
1982 అక్టోబరులో హైదరాబాద్ కేంద్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా వెళ్ళినప్పుడు వారం రోజుల్లో అప్పటి గవర్నర్ కె.సి. అబ్రహం అపాయింట్‌మెంట్ దొరికింది. వారి తర్వాత వచ్చిన రామలాల్ స్టూడియోలో రికార్డింగుకు వచ్చినప్పుడు స్వాగతించాను. కుముద్ బెన్ జోషి పాల్గొన్న సమావేశంలో ప్రకాశం గూర్చి మాట్లాడాను. ‘నరుని సేవలో నారాయణుడు’ (APVN శర్మ) అనే జీవిత చరిత్రను ఇ.ఎన్.ఎల్. నరసింహం రాజభవన్‌లో ఆవిష్కరించారు. తమిళసై సౌందరరాజన్ గవర్నరుగా రెండు సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా వారి ప్రెస్ సెక్రటరీ మల్లాది కృష్ణానంద్ ఆహ్వానం మేరకు నేను గవర్నర్‌ని ప్రశంసిస్తూ మాట్లాడాను. బీహార్ గవర్నరుగా పనిచేసిన అనంత శయనం అయ్యంగార్ తో తిరుపతిలో, ‘సభాపతిగా నా అనుభవాలు’ అనే అంశం రికార్డ్ చేశాను (1977).
ప్రధాని శ్రీ చంద్రశేఖర్‌తో డా. సి. నారాయణ రెడ్డి
కోన ప్రభాకరరావు మహారాష్ట్ర గవర్నర్‌గా ఉండగా వంశీ ఇంటర్నేషనల్ సంస్థ రామరాజు త్యాగరాయ గానసభలో నా సాహితీ రజతోత్సవం జరిపారు. ఆ సభలో నన్ను ప్రభాకరరావు సన్మానించి, మా దూరపు బంధుత్వాన్ని ప్రస్తావించారు. కాసు బ్రహ్మానంద రెడ్డి (మహారాష్ట్ర) హైదరాబాద్ స్టూడియోకు వచ్చినప్పుడు నేను ఇంటర్వ్యూ చేసి రికార్డ్ చేశాను. మహారాష్ట్ర మరో గవర్నర్ సి.హెచ్. విద్యాసాగర్ రావు కేంద్ర మంత్రిగా – ఢిల్లీలో నేను ఏర్పాటు చేసిన ఆనంత లక్ష్మీకాంత సాహితీ పీఠం సభలో మా నాన్నగారి స్మారక పురస్కారం రావూరి భరద్వాజకు అందించారు (2004లో). ఆ సభలో దత్తాత్రేయ (తర్వాత కాలంలో హర్యానా గవర్నరు) కేంద్ర మంత్రిగా పాల్గొన్నారు.
తమిళనాడు గవర్నర్లుగా పనిచేసిన మర్రి చెన్నారెడ్డి, కె. రోశయ్య లను పలుమార్లు కలిసి రికార్డింగులు చేశాను. ముఖ్యమంత్రిగా చెన్నారెడ్డి పుట్టపర్తి సాయిబాబా జయంతి ఉత్సవాలకు వచ్చారు. రికార్డింగులు చేశాము. రోశయ్య తమిళనాడు గవర్నరుగా ఉండగా రెండు, మూడు దఫాలు రాజ్‌భవన్‌లో కలిశాను. వారి కార్యదర్శి తుల్జా సింగ్‌కు ఫోను చేసినప్పుడల్లా వెంటనే అపాయింట్‌మెంట్ లభించేది.
మా ఇంటి ఆతిథ్యం స్వీకరించిన గవర్నర్ల సహృదయతను మరువలేను. కడపలో బెజవాడ గోపాలరెడ్డి, అనంతపురంలో పెండేకంటి వెంకట సుబ్బయ్య, ఢిల్లీలో సిక్కిం గవర్నర్ వి. రామారావు నా శ్రీమతి శోభాదేవి వంటలు రుచి చూశారు.
తమిళనాడు గవర్నర్ పి.ఎస్. రామమోహన్ రావు (IPS) త్యాగరాయ గానసభలో రసమయి యం.కె. రాము నాకు అందించిన పైడి లక్ష్మయ్య పురస్కారాన్ని 2023లో ప్రదానం చేశారు.
ఢిల్లీలో న్యాయ శాఖలో 1963లో చేరడానికి ముందు వి.యస్. రమాదేవి ఆకాశవాణి హైదరాబాదులో అనౌన్సర్‌గా మహిళా కార్యక్రమాలు ప్రెజంట్ చేసేవారు. హిమాచల్, కర్ణాటక రాజభవన్‍లలో వారిని కలిశాను. మా చిన్నబ్బాయి జనార్దన్, జ్యోతిల వివాహానంతరం కర్ణాటక రాజభవన్‌లో వారిని పరిచయం చేసినప్పుడు ఆమె వారిని ఘనంగా సత్కరించారు.
ఢిల్లీలో పండారా పార్క్ సమీపంలో నా క్వార్టర్స్ పక్కనే ఉత్తర ప్రదేశ్ మాజీ గవర్నర్ బి. సత్యనారాయణ రెడ్డి నివసించేవారు. ఢిల్లీ స్టూడియోలో వారిని రికార్డు చేశాను, నిరాడంబర వ్యక్తి. మీర్ అక్బర్ అలీ ఖాన్ (ఒరిస్సా గవర్నరు) హైదరాబాద్ స్టూడియోలకు పలుమార్లు విచ్చేశారు.
ఉప రాష్ట్రపతి కృష్ణకాంత్
కేంద్ర మంత్రులు:
మూడు దశాబ్దాల ఉద్యోగ జీవితంలో కేంద్ర, రాష్ట్ర మంత్రులతో కలిగిన పరిచయాలు, స్టూడియోలో రికార్డు చేసిన మధుర స్మృతులు పంచుకుంటాను.
- పెండేకంటి వెంకటసుబ్బయ్య – కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి.
- జెడ్. ఆర్. అన్సారీ – కేంద్ర జలవనరుల శాఖ స్వతంత్ర మంత్రి.
- సి. కె. జాఫర్ షరీఫ్ – కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి.
- మల్లికార్జున్ – కేంద్ర రైల్వే శాఖ ఉప మంత్రి.
- పులి వెంకటరెడ్డి – కేంద్ర కార్మిక శాఖ ఉప మంత్రి.
విజయవాడ ఆకాశవాణిలో:
- డా. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు – కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి.
- డా. సముద్రాల వేణుగోపాలాచారి – కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి.
- బోళ్ళ బుల్లిరామయ్య – కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి.
- పర్వతనేని ఉపేంద్ర – కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి.
ఢిల్లీ కేంద్రంలో నెలనెలా మంత్రులతో ముఖాముఖీ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రులు:
షీలా దీక్షిత్, సుష్మా స్వరాజ్, మర్రి చెన్నారెడ్డి, వెంగళరావు, భవనం వెంకట్రామ్, ఎన్. జనార్ధన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి, రోశయ్య, ఎన్.టి. రామారావు.
1998లో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రంలో మణిశంకర్ అయ్యర్ గారితో
రాష్ట్ర మంత్రులు:
కడపలో రేడియో ప్రొడ్యూసర్‍గా 1975-82 మధ్య పలువురు మంత్రులను స్టూడియోలో ఇంటర్వ్యూ చేశాను.
- భాట్టం శ్రీరామమూర్తి, సాంఘిక సంక్షేమ శాఖ.
- డా. సి. హెచ్. దేవానంద రావు – గ్రంథాలయ శాఖ.
- యం. బాగా రెడ్డి – పంచాయతీ రాజ్ శాఖ.
- టి. హయగ్రీవాచారి – దేశీయ వైద్య విధానం.
- పరకాల శేషావతారం – పంచాయతీ రాజ్ శాఖ.
- నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి – పంచాయతీ రాజ్ శాఖ.
- పి. నరసారెడ్డి – న్యాయ శాఖ.
- మండలి వెంకట కృష్ణారావు – విద్యా శాఖ.
- పి.వి. చౌదరి – దేవాదాయ శాఖ.
- సి. దాస్ – ఇరిగేషన్ శాఖ.
- అగిశం వీరప్ప – విద్యుచ్ఛక్తి శాఖ.
- ఎన్. అమరనాథ్ రెడ్డి – సహకార శాఖ.
- బి. శేషశయనారెడ్డి – న్యాయ శాఖ.
- పి. అశోక్ గజపతి రాజు – ఆర్థిక శాఖ.
ఈ లిస్టు సంక్షిప్తం.
(మళ్ళీ కలుద్దాం)
డా. రేవూరు అనంతపద్మనాభరావు అష్టావధాని, విమర్శకులు, ప్రముఖ సాహితీవేత్త. తెలుగు సాహిత్యం లోని అన్ని ప్రక్రియలలోనూ రచనలను చేశారు. 80 ఏళ్ళ వయస్సులో నిరంతర అధ్యయన, అధ్యాపనాలు కొనసాగిస్తూ 120 గ్రంథాలు ప్రచురించారు. 2005 లో దూరదర్శన్, ఢిల్లీ నుండి అదనపు డైరక్టర్ జనరల్‌గా పదవీ విరమణ చేశారు. పదవీ విరమణాంతరం గత 20 సంవత్సరాలలో 80 గ్రంథాలు వివిధ ప్రక్రియలలో ప్రచురించారు.
అనువాద సాహిత్యంలో తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం (1993); కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం (2000), అప్పాజోశ్యుల – విష్ణుభొట్ల – కందాళై ఫౌండేషన్ వారి విశిష్ట సాహితీ పురస్కారం లభించాయి. వీరి రచనలపై వివిధ కోణాలలో 5 విశ్వవిద్యాలయాల నుండి ఆరుగురు ఎం.ఫిల్/పిహెచ్డి పరిశోధనా గ్రంథాలు సమర్పించి పట్టాలు పొందారు.
సంచికలో వీరు గత ఐదు సంవత్సరాలలో – ఆకాశవాణి పరిమళాలు, కావ్యపరిమళం, జ్ఞాపకాలు-వ్యాపకాలు, ఆచార్య దేవోభవ, అవధానం ఆంధ్రుల సొత్తు అనే ఐదు గ్రంథాలు సమర్పించారు.
