[తరాలు మారుతున్నాయి. సమాజం వేగంగా పరుగులు తీస్తోంది. విశ్వగ్రామం అనే సిద్ధాంతం ప్రబలింది. 1947లో పుట్టి 80వ ఏట కాలిడబోతున్న ప్రముఖ రచయిత డా. రేవూరు అనంత పద్మనాభరావు మూడు తరాల ప్రముఖులతో కలిసి మెలిసి తిరిగారు. ఆ జ్ఞాపకాల పందిరిని దారావాహికంగా అందిస్తున్నారు.]
పరిచయాలు పెంచుకొన్న పార్లమెంటు సభ్యులు:
వృత్తి రీత్యా, ప్రవృత్తి రీత్యా పలువురు ప్రజా ప్రతినిధులు గత నాలుగు దశాబ్దాలలో ఆయా ప్రదేశాలలో పరిచయమయ్యారు. ఆ పరిచయాలను పంచుకొని పెంచుకోవడం నా సహజ స్వభావం. బహుశా ఏ ఇతర సహోద్యోగికీ ఇంతమందితో బహుముఖ పరిచయాలు వుండవేమోనని సవినయంగా పలుకుతున్నాను. పార్లమెంటు సభ్యుల పరిచయాలు ఆకాశవాణి పరిచయాలు (ఇంటర్వ్యూలు) మాత్రమే కాదు.
ప్రాతఃస్మరణీయులు బెజవాడ పాపిరెడ్డి, ఆయన మా బుచ్చిరెడ్డిపాళెంలో ప్రముఖ వ్యక్తి. శాసనసభ, శాసనమండలి, రాజ్యసభ, లోక్‍సభలు నాలుగింటిలో సభ్యులు. అట్టి గౌరవం పొందిన మరో వ్యక్తి నేదురుమల్లి జనార్దనరెడ్డి. అల్లూరు నియోజకవర్గ ఇండిపెండెంట్ ఎం.ఎల్.ఏ.గా పాపిరెడ్డి 1987 నుండి నాకు పరిచితులు. మా నాన్నగారు 1967 జులైలో వారిని కలసి “మా అబ్బాయి ఎం.ఏ.లో గోల్డ్ మెడల్‌తో పాసయ్యాడు” అనగానే పేరు అడిగి నోట్ చేసుకొన్నారు. మర్నాడే ఒక వివాహ వేడుకల్లో అప్పటి నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ నల్లపరెడ్డి చంద్రశేఖరరెడ్డిని కలిసినప్పుడు జేబులో కాగితం లేక సిగరెట్ పెట్టె లోపలి తగరం పేపరుపై నా పేరు, ఊరు వ్రాసి యిచ్చారు. వారం లోపు మా వూరి అడ్రసుకు నన్ను తెలుగు పండిట్‌గా అపాయింట్ చేస్తూ లెటర్ వచ్చింది. అది మొదలు నేను ఢిల్లీలో ఉద్యోగం చేసిన తోలి రోజులు 1987-1990 వరకు ఆయనకు పలుమార్లు కలిసి ఎన్నో ముచ్చట్లు, ఆయన హాస్యోక్తులు పంచుకున్నాను. వారి జమిందారీ గ్రామమే మా చెన్నూరు.
రక్షణ శాఖ మంత్రి శ్రీ జార్జ్ ఫెర్నాండెజ్ గారితో రచయిత
నెల్లూరు పార్లమెంటు సభ్యులు రేబాల లక్ష్మీనరసారెడ్డి ధార్మిక జీవనులు. 1962 లో స్వామీ చిన్మాయనంద ఉపన్యాసాలు టౌన్ హాల్‌లో ఏర్పాటు చేసినపుడు బి.ఏ. విద్యార్ధిగా వ్రాసుకొన్న నోట్స్ నా వద్ద పదిలంగా వుంది. 1971లో నెల్లూరు నుండి అత్యధిక మెజారిటీతో లోక్‌సభకు ఎన్నికైన దొడ్డవరపు కామాక్షయ్య మృదు స్వభావి. వారిది రేవూరు గ్రామం. మా బంధువులు ఆ ఊరి కరణం. కామాక్షయ్య నార్త్ ఎవెన్యూలో ఉండేవారు. తరువాతి కాలంలో వారి కుమార్తె డా. వి. రాజేశ్వరమ్మ నెల్లూరు నుండి గెలిచారు. పుచ్చలపల్లి పెంచలయ్య రెండు మార్లు ఎం.పి. అదే రీతిలో కుడుముల పద్మశ్రీ, తర్వాత పనబాక లక్ష్మి, బల్లి దుర్గా ప్రసాద్‌లు లోక్‌సభకు గెలిచారు. కావలి నుండి గెలిచిన మలి వెంకటరెడ్డి ఎన్నికల లెక్కింపు సమయంలో నేను కౌంటింగ్ ఆఫీసరుని. వారు కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా వుండగా ఢిల్లీలో శ్రమశక్తి భవన్‌లో వారిని కలిస్తే ఆ శాఖ ఆఫీసర్లు అందరినీ పిలిపించి నన్ను పరిచయం చేశారు.
ఒంగోలు లోక్‌సభకు గెలిచిన కొంగర జగ్గయ్య విజయవాడలో మా యింటి ఆతిథ్యం తీసుకొని ఆకాశవాణి వార్షికోత్సవ సభలో 1992 డిసెంబరు 1న పాల్గొన్నారు. ఒంగోలు అనగానే మాగుంట కుటుంబం ఔదార్యం గుర్తుకు వస్తుంది. మాగుంట సుబ్బరామిరెడ్డి, వారి మరణానంతరం ఆయన సతీమణి పార్వతమ్మ, వారి సోదరులు శ్రీనివాసులు రెడ్డి గత మూడు, నాలుగు దశాబ్దాలుగా లోకసభ సభ్యులు. అందరూ నన్ను ఆదరంగా చూశారు. 1997 ఆక్టోబరులో నాకు ఢిల్లీ బదలీ అయింది. పార్వతమ్మగారి క్వార్టర్స్ లోనే నెల రోజులు నేను బస చేసి, తర్వాత క్వార్టర్స్ లోకి మారాను. మా బాల్యంలో గురువుగారు నేలనూతల గోపాలకృష్ణయ్య వద్ద బుచ్చిరెడ్డిపాళెంలో ఆమె కూడా ట్యూషన్ చెప్పించుకొన్నారు.
కడప ఆకాశవాణిలో 1975లో చేరేనాటికి ఎద్దుల ఈశ్వరరెడ్డి కమ్యూనిస్టు పార్టీ పక్షాన లోకసభ సభ్యులు, సౌమ్య స్వభావి. వారి తర్వాత కందుల ఓబుల్ రెడ్డి గెలిచారు. వై.యస్. రాజశేఖరరెడ్డి ఒక పర్యాయం గెలిచారు. రాజంపేట పార్లమెంటు సభ్యులు పి. పార్థసారథి నాకు బెజవాడ గోపాలరెడ్డి ద్వారా పరిచయం. ఇందిరాగాంధీ మంత్రివర్గంలో ఆయన పార్లమెంటరీ వ్యవహారాల డిప్యూటీ మంత్రి 4, జంతర్ మంతర్ రోడ్డు, న్యూఢిల్లీలో మంత్రికి క్వార్టర్స్ అలాట్ చేశారు. అందులో నేను 1976లో ట్రైయినింగ్‌కు వెళ్లినప్పుడు మూడు నెలలు బస చేశాను. కడప నుండి రాజ్యసభకు మహమ్మద్ రహంతుల్లా ఎన్నికయ్యారు. ఎంతో గౌరవంగా చూసేవారు. వారి కుమారులు అజంతుల్లా కడప మేయరు. కడప కో-ఆపరేటివ్ కాలనీలో ఆకాశవాణి భవనాల పక్కనే ఆయన నివాస గృహం. రోజూ కలిసే వారం. వై. ఆదినారాయణరెడ్డి రాజ్యసభ సభ్యులు.
జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి గారితో రచయిత
అనంతపురం 1990లో నేను వెళ్లేనాటికి అనంత వెంకటరెడ్డి లోక్‍సభ సభ్యులు. మృదు స్వభావి. తరువాత ఆయన కుమారుడు వెంకట్రామిరెడ్డి రెండు దఫాలు ఎన్నికయ్యారు. రాజ్యసభ సభ్యులుగా హఫీయుల్లా ఎంపికయ్యారు. ఆయన లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆయన అల్లుడు పోలీసు డి.జి.పి. ఏ.కె. ఖాన్. తర్వాతి కాలంలో కాలువ శ్రీనివాసులు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆయన ఈనాడు విలేకరిగా ప్రసిద్ధులు.
చిత్తూరు అనగానే సాహితీ ప్రముఖులైన పార్లమెంటు సభ్యులు పి. రాజగోపాల నాయుడు గుర్తుకు వస్తారు. స్వయంగా రచయిత. ఆయన కుమార్తె గల్లా అరుణకుమారి. ఆమె కుమారుడు లోక్‌సభ సభ్యుడు. గల్లా జయదేవ్. తిరుపతి నుండి టి. బాలకృష్ణ, చింతా మోహన్‌లు ఎన్నికయ్యారు. మోహన్ డాక్టరు. కేంద్రంలో ఎరువులు, ఫెర్టిలైజర్స్ శాఖ సహాయ మంత్రి. పలుమార్లు తిరుపతి నుండి ఎన్నికయ్యారు. సన్నిహితంగా మాట్లాడేవారు.
నంద్యాల కాంగ్రెస్ కంచుకోట. కాని 1977లో జనతాపార్టీ పక్షాన గెలిచిన నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి అయ్యారు. 1991లో ప్రధాని అయిన తర్వాత పి.వి.నరసింహారావు నంద్యాల నిండి గెలిచారు. వృత్తిరీత్యా ఇరువురితో పరిచయాలు.
వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారితో రచయిత
విజయవాడలో పని చేసిన కాలంలో మచిలీపట్నం లోక్‌సభ సభ్యులు కావూరి సాంబశివరావు పరిచయామయ్యారు. 1987లో నేను ఢిల్లీలో పని చేస్తుండగా ప్రకాశం అభివృద్ధి అధ్యయన సంస్థ పక్షాన ఢిల్లీలో ప్రకాశం పంతులు విగ్రహ స్థాపనకు జి.వి.జి. కృష్ణముర్తి సారథ్యంలో కమిటీ ఏర్పడింది. నేను కన్వీనరుని. కావూరి సాంబశివరావు క్వార్టర్స్‌లో పలు మార్లు కమిటీ సమావేశాలు జరిగాయి. ఆయన 10 లక్షల తొలి విరాళం ఇచ్చారు. గుంటూరు లోక్‌సభ సభ్యులు రాయపాటి సాంబశివరావు పండారా రోడ్డులో మా క్వార్టర్స్ పక్కనే వుండేవారు. ఆ పరిసరాలలో క్వార్టర్స్‌లో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రామ్మోహన్, యల్.కె.అద్వానీ, సి.హెచ్.విద్యాసాగర్ రావు, కృష్ణంరాజు, బి.సత్యనారాయణరెడ్డి ప్రభృతుల క్వార్టర్స్ వుండేవి. వాకింగ్‌లో కలిసేవాళ్లం.
చెన్నుపాటి విద్య, ఉపేంద్ర, యన్.జి.రంగా. వడ్డె శోభనాద్రీశ్వరరావులు విజయవాడ కేంద్రం ద్వారా పరిచితులు. యన్.జి.రంగా చేత నెహ్రూ జన్మదినోత్సవ ఇంటర్వ్యూ 1996లో రికార్డు చేశాను. బోళ్ల బుల్లిరామయ్య, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు కేంద్రమంత్రులుగా అదే సంవత్సరం స్టూడియో రికార్డింగులు చేశారు. ఉపేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రిగా స్టూడియోలకు వచ్చారు.
యస్.బి.పట్టాభిరామరావు (ఆర్ధికశాఖ), యస్.బి. సత్యనారాయణరావు (వ్యవసాయ శాఖ) సహాయ మంత్రులు. ఇద్దరూ సోదరులు. జమీందరీ కుటుంబాల వారు. యం.వెంకయ్యనాయుడు, ఎర్రం నాయుడు, బంగారు లక్ష్మణ్, యస్.వేణుగోపాలచారి కేంద్ర మంత్రులుగా పరిచితులు. యన్. జనార్ధనరెడ్డి పార్లమెంటు లాబీలో నన్ను చూచి “పద్మనాభరావ్! మాకంటే పార్లమెంటుకు రెగ్యులర్‌గా నువ్వు వస్తున్నావే!” అని అన్నారు. డిప్యూటీ డైరక్టర్ జనరల్‌గా పార్లమెంటులో మా శాఖ ప్రశ్నోత్తరాల సమయంలో నేను కంపల్సరీగా వెళ్లవలసి వచ్చేది. మా శాఖ మంత్రులు – రవి శంకరప్రసాద్, సుష్మా స్వరాజ్, యస్. జైపాల్ రెడ్డిలు పార్లమెంటులో ‘స్టార్డ్ క్వశ్చన్’లకు సమాధానాలు ఇచ్చేటప్పుడు పార్లమెంటు లోపల రాజ్యసభ, లోక్‌సభలలో ఆఫీసర్ల గ్యాలరీ పాస్ నాకు యిచ్చారు. ఆయా రోజుల్లో తప్పనిసరి హాజరు. ముందు రోజు మంత్రుల ఇంటి వద్ద ఆ ప్రశ్నకు సంబంధించి భ్రీఫింగ్ వుండేది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మీటింగులు దేశవ్యాప్తంగా జరిగాయి. సోమనాథ్ చటర్జీ ఆ కమిటీ అధ్యక్షులు. ప్రసార భారతిని చీల్చి చెండాడేవారు. మా మంత్రి అధ్యక్షతన కన్సల్టేటివ్ కమిటీ మీటింగులు జరిగేవి.
ఇంధన శాఖ మంత్రి రంగరాజన్ గారితో రచయిత
పార్లమెంటరీ స్టాండిగ్ కమిటీ మీటింగులు పలు ప్రదేశాలలో జరిగాయి. దూరదర్శన్ డైరక్టర్ జనరల్ ప్రతినిధిగా నేను జమ్ము కాశ్మీరు, అహమ్మదాబాదు, సోమనాథ్, పోర్ట్ బ్లయిర్, త్రివేండ్రం కమిటీ సభ్యుల ప్రశ్నలకు దీటుగా సమాధానాలిచ్చాను. ఉండవల్లి అరుణ్ కుమార్, సోమనాథ చటర్జీ, మంధా జగన్నాథం, పళ్లంరాజులు ఆయా కమిటీల చైర్మన్లు. పోర్ట్ బ్లయిర్‌లో ఆంధ్రా అసోసియేషన్ వారు మమ్ము సత్కరించారు. రాజ్యసభ సభ్యులు సి.లక్ష్మన్న ఆదరంతో పిలిచేవారు. యం.అనంతరాములు ఆప్యాయంగా పలకరించేవారు.
ఇతర ప్రజాప్రతినిధులు:
హైదరాబాదులో పని చేసిన కాలంలో పలువురు పరిచయమయ్యారు. రాష్ట్రమంత్రులు కరణం రామచంద్రరావు, కె.జానారెడ్డి, ఆర్. రాజగోపాల రెడ్డి (కడప), యస్. రామమునిరెడ్డి (కడప), పాతకాలపు మంత్రి పి.బి. రాజు, జి.యస్. మేల్కోటే, యం.యస్.రాజలింగం, టి.హయగ్రీవాచారి, దివి కొండయ్య చౌదరి (కందుకూరు), కోన ప్రభాకరరావు, అశోక్ గజపతిరాజులను పలు సందర్భాలలో కలిశాను.
ఇలా వారి సాన్నిహిత్యం బహుముఖాలుగా విస్తరించింది.
శాసనసభ సభాపతులుగా పనిచేసిన వీరితో ప్రకాశం అభివృద్ధి అద్యయన సంస్థ సమావేశాల ద్వారా పరిచయాలు కలిగాయి. వరుస క్రమంలో స్పీకర్లు –
- జి. నారాయణరావు -1985-89
- డి. శ్రీపాదరావు – 1991-95 (ప్రస్తుత మంత్రి శ్రీధరబాబు తండ్రి)
- ప్రతిభాభారతి – 1999-2004 (జస్టిస్ కె. పున్నయ్య కుమార్తె)
- నాదెండ్ల మనోహర్ – 2011-2014 (నాదెండ్ల భాస్కరరావు కుమారుడు)
- కోడెల శివప్రసాద్ – 2014-2019
- మండలి బుద్ధప్రసాద్ 2014 – 2019 (డిప్యూడీ స్పీకర్)
- పిడతల రంగారెడ్డి 1972 – 1974
- దివికొండయ్య చౌదరి, రేబాల దశరధరామిరెడ్డి (1975 – 78)
- కోనప్రభాకరరావు 1981
- అగరాల ఈశ్వరరెడ్డి 1982 -1983 (తిరుపతిలో సన్నిహిత పరిచయం)
ఈ పరిచయాలు ఎన్నడూ వాడుకోలేదనీ, అందువలననే వారు నన్ను గౌరవంగా చూశారనీ గుండె మీద చెయ్యి వేసి చెప్పగలను.
(మళ్ళీ కలుద్దాం)
డా. రేవూరు అనంతపద్మనాభరావు అష్టావధాని, విమర్శకులు, ప్రముఖ సాహితీవేత్త. తెలుగు సాహిత్యం లోని అన్ని ప్రక్రియలలోనూ రచనలను చేశారు. 80 ఏళ్ళ వయస్సులో నిరంతర అధ్యయన, అధ్యాపనాలు కొనసాగిస్తూ 120 గ్రంథాలు ప్రచురించారు. 2005 లో దూరదర్శన్, ఢిల్లీ నుండి అదనపు డైరక్టర్ జనరల్‌గా పదవీ విరమణ చేశారు. పదవీ విరమణాంతరం గత 20 సంవత్సరాలలో 80 గ్రంథాలు వివిధ ప్రక్రియలలో ప్రచురించారు.
అనువాద సాహిత్యంలో తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం (1993); కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం (2000), అప్పాజోశ్యుల – విష్ణుభొట్ల – కందాళై ఫౌండేషన్ వారి విశిష్ట సాహితీ పురస్కారం లభించాయి. వీరి రచనలపై వివిధ కోణాలలో 5 విశ్వవిద్యాలయాల నుండి ఆరుగురు ఎం.ఫిల్/పిహెచ్డి పరిశోధనా గ్రంథాలు సమర్పించి పట్టాలు పొందారు.
సంచికలో వీరు గత ఐదు సంవత్సరాలలో – ఆకాశవాణి పరిమళాలు, కావ్యపరిమళం, జ్ఞాపకాలు-వ్యాపకాలు, ఆచార్య దేవోభవ, అవధానం ఆంధ్రుల సొత్తు అనే ఐదు గ్రంథాలు సమర్పించారు.
