[తరాలు మారుతున్నాయి. సమాజం వేగంగా పరుగులు తీస్తోంది. విశ్వగ్రామం అనే సిద్ధాంతం ప్రబలింది. 1947లో పుట్టి 80వ ఏట కాలిడబోతున్న ప్రముఖ రచయిత డా. రేవూరు అనంత పద్మనాభరావు మూడు తరాల ప్రముఖులతో కలిసి మెలిసి తిరిగారు. ఆ జ్ఞాపకాల పందిరిని దారావాహికంగా అందిస్తున్నారు.]
1987 జనవరి.
సరిగ్గా 40 ఏళ్లు నిండాయి నాకు.
వంశీ ఇంటర్నేషనల్ సంస్థ పక్షాన వంశీ రామరాజు, బి.వి. పట్టాభిరామ్ గార్లు హైదరాబాదు త్యాగరాయగాన సభలో నా సాహితీ రజతోత్సవ సభ జరిపారు. ముగ్గురు వైస్ ఛాన్సలర్లు – ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి (హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీ), డా. సి. నారాయణరెడ్డి (ఓపెన్ యూనివర్శిటీ), ఆచార్య తూమాటి దోణప్ప (తెలుగు యూనివర్శిటీ) సభలో అతిథులు. మహారాష్ట్ర గవర్నరు కోన ప్రభాకరరావు ముఖ్య అతిథి. పుష్పగిరి పీఠాధిపతి శ్రీ శ్రీ నృసింహభారతీ స్వామి విచ్చేసి ఆశీర్వదించారు. నేను హైదరాబాదు ఆకాశవాణిలో చేరి ఐదేళ్లు కావస్తోంది.
అప్పుడు నేను ఆకాశవాణి రీజనల్ ట్రెయినింగ్ సెంటర్ అధిపతిని. దక్షిణ ప్రాంత ఐదు రాష్ట్రాల ఆకాశవాణి అధికారులకు ట్రెయినింగ్ ప్రతి నెలా వివిధ రాష్ట్రాలలో ఏర్పాటు చేశాను. నాకు ముందున్న అధికారులు మూడేళ్లలో నాలుగు ట్రెయినింగులు జరిపితే నేను రెండేళ్లలో 18 జరిపాను. ప్రశంసాపూర్వకంగా మా డైరక్టర్ జనరల్ అమృతరావు షిండే నన్ను ఢిల్లీలోని జాతీయ ట్రైయినింగు సెంటర్‌కు బదిలీ చేశారు. అది ప్రమోషన్ లాంటిది. ప్రధాని రాజీవ్ గాంధీ అప్పుడు శిక్షణా సంస్థలలో పని చేసే ఆఫీసర్లకు 20 శాతం జీతం అదనంగా ఏర్పాటు చేశారు. అది నాకు వరం. ముగ్గురు పిల్లల చదువులు హై స్కూలు స్థాయిలో వున్నాయి. అయినా సాహసం చేసి ఢిల్లీకి 1987 జూన్‌లో మకాం మార్చాను.
1998లో అప్పటి రైల్వే శాఖ మంత్రి శ్రీ నితీష్ కుమార్ గారితో రచయిత
ఎల్లలు దాటి ఢిల్లీకి:
1967 నుండి 8 ఏళ్లు కందుకూరు కాలేజి అధ్యాపకుడి గాను; 1975 నుండి 1987 వరకు 12 ఏళ్లు కడప, విజయవాడ, హైదరాబాదు ఆకాశవాణిలోను గడిపాను. ఢిల్లీలో ఆఫీసు క్వార్టర్సు దొరికితే అంతకు మించిన సౌకర్యం లేదు. విశాలమైన క్యార్టరు, ఎదురుగా ఆఫీసు.. నిరంకారీ కాలనీలో నివాసం. సిటీకి 20 కిలోమీటర్లు దూరం. పిల్లలు ముగ్గురికీ ఐ.టి.ఓ.లో ఆంధ్రా ఎడ్యుకేషన్ స్కూల్లో సీట్లు దొరికాయి. క్రమంగా సిటీ వాతావరణానికి అలవాటు పడ్డాం. ఆంధ్రప్రదేశ్ భవన్‌లో తరచూ జరిగే సమావేశాలు, ఢిల్లీ తెలుగు అకాడమీ సభలు, ఇతరత్రా సందర్భాలలో వెళ్లడం దూరమైనా హజరయ్యేవాడిని. ఢిల్లీ ఆంధ్రా అసోసియేషన్ వి.కృష్ణమూర్తి ఘనంగా ఉత్సవాలు నిర్వహించి నాకూ భాగస్వామ్యం కల్పించేవాడు. 1987-90 మధ్య మూడేళ్లు, 1997-2005 మధ్య ఎనమిదేళ్లు – మొత్తం ఢిల్లీలో 11 సంవత్సరాలు గడిపాను. ఢిల్లీలో ఆ తరం వ్యక్తులనగానే ముందుగా ఆకాశవాణి ప్రముఖులు గుర్తుకొస్తున్నారు.
ప్రసార ప్రముఖులు:
సమాచార ప్రసార మంత్రిత్వశాఖ మంత్రులుగా గత 75 సంవత్సరాలలో ఆరుగురు ఆంధ్రులు సారధ్యం వహించారు. ప్రాతఃస్మరణీయులు, మా బుచ్చిరెడ్డిపాళెం వారైన డా. బెజవాడగోపాలరెడ్డి. ప్రధాని నెహ్రూ మంత్రి వర్గంలో 1962-64 మధ్య మా శాఖ మంత్రి. వారి హయాంలోనే 1963 జూన్‌లో కడప కేంద్రం హైదరాబాదుకు రిలే కేంద్రంగాను, విశాఖపట్టణం విజయవాడకు రిలే కేంద్రంగాను ప్రారంభమయ్యాయి. ఆయన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా 1955 లోను, విశాలాంధ్ర ఏర్పడిన తర్వాత నీలం సంజీవిరెడ్డి మంత్రి వర్గంలో ఆర్థిక మంత్రిగాను వ్యవహరించారు.
ఆయన తర్వాత వి.పి.సింగ్ మంత్రి వర్గంలో విజయవాడ నుండి గెలిచిన పర్వతనేని ఉపేంద్ర (తెలుగు దేశం) 1988లో సమాచార ప్రసార శాఖల మంత్రి. రైల్వేలు, పార్లమెంటరీ వ్యవహారాలు కూడా చూశారు. అంతకు ముందు ఇందిరాగాంధీ మంత్రివర్గంలో తెలంగాణా యువనేత మల్లికార్డున్ ప్రసారమంత్రిత్వ శాఖ డిప్యూటీ మంత్రి.
1997లో నేను ఢిల్లీ ఆకాశవాణి డైరక్టరుగా చేరేనాటికి తెలంగాణా బిడ్డ, పోరాట యోధుడు అయిన యస్. జైపాల్ రెడ్డి మా శాఖ మంత్రి. ఆయన హాయాంలో పార్లమెంటు ప్రశ్నలకు దూరదర్శన్ పక్షాన సమాధానాలు తయారు చేసే బాధ్యత నా పై పడింది. తరచు వారి బంగళాలో కలిసి ‘బ్రీఫింగ్’ యిచ్చేవారం.
1996లో విజయవాడ కేంద్రంలో ప్రముఖ నటులు శ్రీ ధూళిపాళ గారితో రచయిత
మహారాష్ట్ర వాడే అయినా ప్రమోద్ మాహాజన్ మూలాలు తెలుగులోవి. మహబూబ్‌నగర్‌లో 1949 అక్టోబరు 30న జన్మించారు. 1998-99 మధ్య సమాచార శాఖ మంత్రి. ఢిల్లీ స్టేషన్ డైరక్టరుగా వారిని రెండు మార్లు మీటింగులకు స్టూడియోకి ఆహ్వానించాను. శుభ్రమైన తెలుగులో మాట్లాడి ఆశ్చర్యపచారు. మా డైరక్టర్ జనరల్ కొద్దిగా ఆసూయ పడ్డారు.
తెలుగు తేజం ముప్పవరపు వెంకయ్యనాయుడు 2016 జూలై 2017 జులై మధ్య సమాచార ప్రసార శాఖల మంత్రి. నేనూ, నాయుడు గారు బుచ్చిరెడ్డిపాళెం హైస్కూలులోను, నెల్లూరు వి.ఆర్. కాలేజీలోను చదువుకొన్నాం. ఆయన ఉపరాష్రపతిగా (2017-2022) ఆకాశవాణి, నెల్లూరు కేంద్రం ప్రారంభించారు.
ఆకాశవాణిలో డైరక్టరు జనరల్ పదవిని ఇద్దరే తెలుగువారు గత 80 ఏళ్ల చరిత్రలో అధిష్ఠించారు. మొదటి వారు సహృదయశీలి, మాతో బాటు 1988లో స్టేషన్ డైరక్టరుగా ఎంపికైన ఆర్. వెంకటేశ్వర్లు. రిటైర్మెంటుకు ముందు 2013-12014 మధ్య డైరక్టర్ జనరల్. ఆ తర్వాత వార్తా విభాగానికి చెందిన యన్. వేణుధరరెడ్డి 2021-22 మధ్య ఆ పదవికి గౌరవం పెంచారు. ఆకాశవాణి, దూరదర్శన్‌ల ఇంజనీర్-ఇన్-చీఫ్‌లుగా తెలుగువారికి అవకాశం రాలేదు.
పాత తరం యోధులు:
యస్. యన్. మూర్తిగా పేరు గాంచిన సూరినారాయణమూర్తి తొలిసారిగా ఢిల్లీ ఆకాశవాణి కేంద్ర డైరక్టరయిన తెలుగువారు. ఆయన డిప్యూటీ డైరక్టరు జనరల్ స్థాయి కెదిగి 1971 ఆగస్టులో రిటైరయ్యారు. ఆయన అడుగు జాడల్లో నేనూ (అనంత పద్మనాభరావు) 1997-2000 మధ్య ఢిల్లీ స్టేషన్ డైరక్టరుగా, 2001-2005 మధ్య డిప్యూటీ డైరక్టర్ జనరల్, దూరదర్శన్‌గా పని చేశాను.
మరో ప్రముఖులు పుల్లెల వెంకటేశ్వర్లు. ముక్కుకు సూటిగా నడిచే వ్యక్తి. హైదరాబాదు కేంద్ర డైరక్టరుగా 1975-78 మధ్య పని చేసి, ఢిల్లీలో డి.డి.జి.గా 1980-82 మధ్య మార్గదర్శనం చేశారు.
ఐఎఎస్ అధికారిగా కె.సుబ్రమణ్యశర్మ సమాచార శాఖలో జాయింట్ సెక్రటరీగాను, ప్రసారభారతి సి.ఈ.వో. గాను, తిరుపతి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తొలి సి.ఈ.వో. గాను మంచి పేరు తెచ్చుకున్నారు. కొంత కాలం దూరదర్శన్ డైరక్టర్ జనరల్‌గా అదనపు బాధ్యతలు చేపట్టారు. వారి హయాంలో నేను దూరదర్శన్ ఢిల్లీలోను, తిరుపతి యస్.వి భక్తి ఛానల్ లోను పని చేశాను. యోజన సంపాదకురాలిగా జె. భాగ్యలక్ష్మి ఉత్తమ శ్రేణి అధికారి (ఢిల్లీ).
ఆకాశవాణి డైరక్టర్ జనరల్ కార్యలయంలో డిప్యూటీ డైరక్టరు జనరల్ హోదాలో పని చేసిన మరికొదరు ఆంధ్రులు:
- పి.వి. రాఘవరావు, ఐఎ అండ్ ఎఎస్. వీరు ఆకాశవాణి మాన్యువల్, మనుస్మృతి రూపకర్త, వీరి కుమారులు పి.వి.రావు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రిటైరయ్యారు.
- బి.కె.రావు (భమిడిపాటి కుక్కటేశ్వరరావు), ఐఎఎస్. డిప్యూటేషన్ పై డి.డి.జి గా పేరు తెచ్చుకున్నారు.
- వి. పురుషోత్తమరావు (CRPF) డెప్యూటేషన్ పై 1992-96 మధ్య డి.డి.జి. విజిలెన్స్‌గా వ్యవహరించారు. పార్లమెంటును ముష్కరులు ముట్టడి చేసినపుడు కాపాడిన సెక్యూరిటీ అధికారి ఆయన.
ఇంజనీరింగు విభాగంలో చీఫ్ ఇంజనీర్ స్థాయిలో చేసిన తెలుగువారు
- విశ్వనాథ అచ్యుత దేవరాయలు (విశ్వనాథ సత్యనారాయణ కుమారులు) దూరదర్శన్ విజయవాడ కేంద్ర స్థాపనకు ఆద్యులు.
- ఆర్.ఎస్. శాస్త్రి, యం. యల్. శాస్త్రి, యన్. వెంకటేశ్వర్లు, వి. వి. రావు, మదరాసు ప్రాంతీయ కార్యాలయంలో యం.ఐ.సూర్యనారాయణ, ఆర్. శేషయ్య ప్రభృతులు.
మంత్రిత్వశాఖలో జనతా ప్రభుత్వ హయాంలో బీహారు క్యాడర్ ఐఎఎస్ అధికారి ఎ. ఉమాకాంతశర్మ(నందులూరు) జాయింట్ సెక్రటరీగా వున్నారు. బీహార్ చీఫ్ సెక్రటరీగా రిటైరయ్యారు. ప్రస్తుతం ఆంధ్రా క్యాడర్ అధికారి సంజయ్ జాజు సెక్రటరీ.
1998లో విజయవాడ కేంద్రంలో సావనీర్ ఆవిష్కరించిన ప్రముఖ సినీ దర్శకుడు, రచయిత శ్రీ జంధ్యాల
సంగీత ప్రపంచం:
ఆకాశవాణి డైరక్టర్ జనరల్ కార్యలయంలో కర్ణాటక సంగీత విభాగానికి చీఫ్ ప్రొడ్యూసర్‌గా సుప్రసిద్ధ వైణికులు ఈమని శంకరశాస్త్రి దిశానిర్దేశం చేశారు. జాతీయ స్థాయిలో సంగీత విద్వాంసులకు గ్రేడ్లు నిర్ణయించే అధికారం ఆయన చేతిలో వుండేది. జాతీయ సంగీత కార్యక్రమాలకు విద్వాంసులను ఎంపిక చేసి దేశవ్యాప్తంగా అన్ని కేంద్రాలు ప్రసారం చేసేవి. శంకర శాస్త్రి కుమార్తె కల్యాణి హైదరాబాద్ కేంద్రంలో నిలయ విద్వాంసురాలిగా పదవీ వరమణ చేశారు. శంకర శాస్త్రి తరువాత ఆ పదవిలో వేణుగాన విద్వాంసులు ప్రపంచం సీతారాం ఢిల్లీలో చాలా కాలం సంగీతజ్ఞులను అలరించారు. బి. రామన్నపంతులు ఆరు సంవత్సరాలకు పైగా సంగీత విభాగ పర్యవేక్షణ చేశారు. వి. ముకుందశర్మ దశాబ్ది కాలం ఆ శాఖధికారిగా వన్నె చేకూర్చారు. వారి సోదరులు ఉదయశంకర్ హైదరాబాదు స్టేషన్ డైరక్టరుగా ప్రఖ్యాతి గడించారు. శ్రోతల పరిశోధనా విభాగ డైరక్టరుగా పి.యస్.మూర్తి ఘనత వహించారు.
స్టేషన్ డైరక్టర్ల స్థాయి ఇతర అధికారులు:
పాత తరానికి చెందిన అరికెపూడి రమేష్ చౌదరి ప్రసంగ శాఖలో డిప్యూడీ చీఫ్ ప్రొడ్యూసర్‌గా ప్రముఖులు. అనంతపురానికి చెందిన గుంటూరు రఘురాం వివిధ విభాగాలలో డైరక్టరేట్‌లో కొలువుదీరారు. వాణిజ్య విభాగాధిపతిగా బి. ఆర్. చలపతిరావు ఉన్నతాధికారుల మన్ననలు పొంది దశాబ్ది కాలం ఆదాయాన్ని పెంచారు. రాయప్రోలు సుబ్బారావు కుమారులు ఆర్. సి. రాజశేఖర్ విదేశీ ప్రసారాల విభాగ డైరక్టర్‌గా పని చేస్తూ మరణించారు. అదే విభాగంలో పని చేస్తూ అమరావతి కథల రచయిత శంకరమంచి సత్యం అకాలమరణం పొందారు. ఢిల్లీ స్టేషన్ డైరక్టర్‌గా నా తరువాతి కాలంలో శైలజా సుమన్ ప్రతిష్ఠ చేకూర్చారు. విదేశీ ప్రసార విభాగంలో పని చేసిన పి.ఆర్. రెడ్డి వరంగల్ డైరక్టర్‌గా వుండగా అకాల మృత్యువు కబళించింది. డా. కె. బి. గోపాలం, యన్. సి. నరసింహాచార్యులు ఢిల్లీలో పని చేశారు. దూరదర్శన్‌లో వడ్డాది అప్పారావు, వి. వి. కృష్ణశాస్త్రి (వేదుల సత్యనారాయణ కొడుకు), దేవళ్ల బాలకృష్ణ, కోటంరాజు పద్మావతి ప్రభృతులు వివిధ హోదాలలో వున్నారు.
1999లో ఢిల్లీ స్టూడియోలో అపోలో గ్రూప్ సంస్థల చైర్మన్ ప్రతాపరెడ్డి గారితో రచయిత
వార్తా విభాగాధికారులు:
ఢిల్లీలో వార్తా విభాగం చాలా పెద్దది. అందులో వివిధ కాలాల్లో ప్రముఖులు పని చేశారు. శ్రీశ్రీ, కొంగర జగ్గయ్య, కపిల కాశీపతి, కొత్తపల్లి సుబ్రమణ్యం, పన్యాల రంగనాథరావు, వనమాలి ప్రసాద్, మల్లాది రామారావు, సి.జి.కె.మూర్తి, కె. ఆశయ్య, జె. బి. రాజు, ఆర్. రామచంద్రరావు, సుజాత అలీ, ఏ. పి. రావు. ఆకిరి రామకృష్ణారావు, యన్.వేణుధరరెడ్డి సీనియర్ హోదాలు ధరించారు.
న్యూస్ రీడర్లుగా తెలుగు వార్తలు ఢిల్లీ నుండి చదివిన ప్రముఖులు – జోళిపాళ మంగమ్మ, తిరుమలశెట్టి శ్రీరాములు, కందుకూరు సూర్యనారాయణ, అద్దంకి మన్నార్, వావిలాల రాజ్యలక్ష్మి, ఏడిద గోపాలరావు, దుగ్గిరాల పూర్ణయ్య, సమ్మెట నాగమల్లీశ్వరరావు, సూర్యదేవర ప్రసన్నకుమార్, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ శాసన సభ కార్యదర్శి వెదురుమూడి రాజేశ్వరి, తురగా ఉషారమణి, గద్దె దుర్గారావు, యండ్రపాటి మాధవీలత ప్రభృతులు. ఘన చరిత్ర గల ఆకాశవాణి ఈనాడు క్రమక్రమంగా వెనకబడింది.
(మళ్ళీ కలుద్దాం)
డా. రేవూరు అనంతపద్మనాభరావు అష్టావధాని, విమర్శకులు, ప్రముఖ సాహితీవేత్త. తెలుగు సాహిత్యం లోని అన్ని ప్రక్రియలలోనూ రచనలను చేశారు. 80 ఏళ్ళ వయస్సులో నిరంతర అధ్యయన, అధ్యాపనాలు కొనసాగిస్తూ 120 గ్రంథాలు ప్రచురించారు. 2005 లో దూరదర్శన్, ఢిల్లీ నుండి అదనపు డైరక్టర్ జనరల్‌గా పదవీ విరమణ చేశారు. పదవీ విరమణాంతరం గత 20 సంవత్సరాలలో 80 గ్రంథాలు వివిధ ప్రక్రియలలో ప్రచురించారు.
అనువాద సాహిత్యంలో తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం (1993); కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం (2000), అప్పాజోశ్యుల – విష్ణుభొట్ల – కందాళై ఫౌండేషన్ వారి విశిష్ట సాహితీ పురస్కారం లభించాయి. వీరి రచనలపై వివిధ కోణాలలో 5 విశ్వవిద్యాలయాల నుండి ఆరుగురు ఎం.ఫిల్/పిహెచ్డి పరిశోధనా గ్రంథాలు సమర్పించి పట్టాలు పొందారు.
సంచికలో వీరు గత ఐదు సంవత్సరాలలో – ఆకాశవాణి పరిమళాలు, కావ్యపరిమళం, జ్ఞాపకాలు-వ్యాపకాలు, ఆచార్య దేవోభవ, అవధానం ఆంధ్రుల సొత్తు అనే ఐదు గ్రంథాలు సమర్పించారు.
