[తరాలు మారుతున్నాయి. సమాజం వేగంగా పరుగులు తీస్తోంది. విశ్వగ్రామం అనే సిద్ధాంతం ప్రబలింది. 1947లో పుట్టి 80వ ఏట కాలిడబోతున్న ప్రముఖ రచయిత డా. రేవూరు అనంత పద్మనాభరావు మూడు తరాల ప్రముఖులతో కలిసి మెలిసి తిరిగారు. ఆ జ్ఞాపకాల పందిరిని దారావాహికంగా అందిస్తున్నారు.]
అధికార దర్పం:
కేంద్రంలో కార్యదర్శి హోదా పొందడానికి IAS అధికారికి కనీసం 30 సంవత్సరాల నిష్కళంక సర్వీసు అవసరం. జిల్లా కలెక్టరుగా, రాష్ట్ర సెక్రటేరియట్‍లో సెక్రటేరీలుగా పని చేసి కేంద్రంలో జాయింట్ సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీ హోదాలో 10 సవంత్సరాలు విధి నిర్వహణ చేసిన తర్వాత రిటైర్మెంటు మరో రెండు సంవత్సరాలు వుందనగా కార్యదర్శిగా ఎంపానెల్‌మెంట్ జరుగుతుంది. అదే శిఖర స్థాయి. 200 మందిలో ఐదుగురో ఆరుగురో ఆ పదవి నధిష్ఠిస్తారు. అందులో ఎవరెస్టు శిఖరం వంటి పదవి క్యాబినెట్ సెక్రటరీ. గత 75 సంవత్సరాల స్వాతంత్రంలో ఒకే ఒక్క ఆంధ్ర క్యాడర్ తెలుగు వ్యక్తి ఆ పదవిలో నిలిచారు. ఆయనే టి. రామచంద్ర ప్రసాద్ (1941- జులై 2022).
1963 బ్యాచ్ ఆంధ్రా క్యాడర్ IAS అధికారి అయిన టి.ఆర్. ప్రసాద్ 2000 నవంబరు 1 నుండి 2002 వరకు క్యాబినెట్ కార్యదర్శి. అంతకు ముందు రక్షణశాఖ కార్యదర్శి. 12వ ఆర్ధిక సంఘ సభ్యులు. విశాఖపట్టణంలో విశ్రాంత జీవనం గడుపుతూ మరణించారు.
2000 సంవత్సరంలో తన పుస్తకావిష్కరణ సభలో శ్రీ జి.ఎం.సి. బాలయోగి, కరణం మల్లీశ్వరి, ఎం.వి.పి. శాస్త్రి గార్లతో రచయిత
ICS అధికారులు:
1947కు ముందు ICS లో సెలక్టయిన ముగ్గురు తెలుగువారు కేంద్రంలో కార్యదర్శి స్థాయిలో అధికారం చెలాయించారు. వారిలో నేను కలిసిన వ్యక్తులిద్దరు. మూడోవారు శొంఠి రామమూర్తి. బుర్రా వెంకటప్పయ్య (1907-1998) 1932లో ICS లో చేరారు. బ్రిటీషు కాలంలో వీరు ఈ పరీక్షలలో నెగ్గేవారు. వెంకటప్పయ్య రూరల్ ఎలక్రిఫికేషన్ కమిషన్ (జాతీయ గ్రామీణ విద్యుద్దీకరణ సంస్థ) అధిపతిగా 1976లో వ్యవహరించారు. మా గ్రామం – చెన్నూరుకు ఎలక్ట్రిసిటీ అందించకుండా రాష్ట్ర ప్రభుత్వం పేచీ పెట్టింది. మా గ్రామస్థులు గెలిచిన ఎం.ఎల్.ఏ.కు ఓట్లు వేయలేదని నెపం. నేను ఢిల్లీలో వెంకటప్పయ్య గారిని కలిసి పరిస్థితి వివరించాను. ఆయన ఫోన్లో ఆంధ్రప్రదేశ్ ఎలక్రిటిసిటీ బోర్డు చైర్మన్ నార్ల తాతారావుకు ఫోన్ చేసి మా గ్రామానికి ఎలక్ట్రిసిటీ లైన్లు వేసేలా ఆదేశించారు.
మరో ICS అదికారి ఓ. పుల్లారెడ్డి ( 1902-1999). ఆయన చిత్తూరు జిల్లావారు. 1925లో ICS సాధించారు. 1944లో మదరాసు కార్పోరేషన్ కమీషనరు 1953లో ఆంధ్రరాష్ట్ర తొలి ప్రధాన కార్యదర్శి. రక్షణ శాఖ కార్యదర్శి (1963). ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ (1964-72). విశ్రాంతి జీవితం హైదరాబాదులో గడిపారు. 1986లో వారి యింటి వద్ద కలిసి ఆకాశవాణికి వారిని ఇంటర్య్వూ చేశాను.
1947లో IAS అధికారిగా కావలికి చెందిన యం. రామకృష్ణయ్య సెలక్టయి ఒరిస్సా క్యాడర్‌కు వెళ్లారు. ప్రధాన కార్యదర్శిగా ముఖ్యమంత్రి నందినీ శతపధితో విభేదించి కార్యదర్శిగా 1975లో కేంద్ర నౌకాయాన, రవాణా శాఖలో పని చేశారు. రిజర్వు బ్యాంకు డిప్యూటీ గవర్నరు, NABARD చైర్మన్‌గా మంచి పేరు. విశ్రాంత జీవితంలో ప్రకాశం అభివృద్ధి అధ్యయన సంస్థ నేతృత్వం వహిస్తున్నపుడు నేను కూడా వారితో కలిసి పని చేశాను. ప్రకాశం విగ్రహం ఢిల్లీలో స్థాపించేందుకు కృషి చేశారు.
2017లో రవీంద్రభారతిలో శ్రీ ఎపివిన్ శర్మ, శ్రీ కె.వి. రమణాచారి గార్లతో రచయిత
రెండో తరం కార్యదర్శులు:
నేను పరిచయం పంచుకొని పెంచుకొన్న సీనియర్ కార్యదర్శి స్థాయి అధికారులను మాత్రమే ప్రస్తావిస్తున్నాను. వీరంతా 1990వ దశకంలో కేంద్ర కార్యదర్శులు. 1950 బ్యాచ్ IAS అధికారి డా. అబిద్ హుసేన్. ఈయన కేంద్ర వాణిజ్య శాఖ, భారీ పరిశ్రమల శాఖల కార్యదర్శి, ప్రణాళికా సంఘ సభ్యులు (1985-90). మా ప్రసారభారతి బోర్డు సభ్యులు (1997). రాజ్ మెహన్ గాంధీ రాష్ట్రపతి కె.ఆర్.నారాయణన్ కాలంలో కార్యదర్శి.
చావలి శ్రీనివాస శాస్త్రి (1956 బ్యాచ్) 1986లో కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి. వీరి సతీమణి మణిశాస్త్రి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకానమిక్ గ్రోత్ లో రీడర్. వీరి కుమార్తె చావలి షర్మిల IRAS అధికారిగా రిటైరయ్యారు.
భమిడిపాటి కుక్కుటేశ్వరరావు బి.కె.రావుగా ప్రసిద్ధులు (1954 బ్యాచ్) విశాఖపట్టణం పోర్టు ట్రస్టు చైర్మన్. ఆకాశవాణిలో డి.డి.జిగా పని చేశారు. కేంద్ర గనుల శాఖ కార్యదర్శిగా 1989 జూన్‌లో రిటైరయ్యారు. అమెరికాలో స్థిరపడ్డారు.
కడప జయభారతరెడ్డి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి. విజయభాస్కరరెడ్డి ఆహ్వానం మీద 1982లో ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా వచ్చారు. వీరి తండ్రి కడప కోటిరెడ్డి ప్రకాశం మంత్రివర్గంలో మంత్రి. తల్లి జిల్లా బోర్డుకు, దేశంలోనే, ఆధ్వర్యం వహించిన తొలి మహిళ.
యస్. వి. గిరి (1960 బ్యాచ్) కేంద్ర మానవ వనరుల శాఖ కార్యదర్శి. 1999 వరకు కేంద్ర విజిలెన్స్ కమిషనర్. పుట్టపర్తి సత్యసాయి విద్యాసంస్థల వైస్ ఛాన్సలర్. 1961 బ్యాచ్ టి.యన్.ఆర్.రావు పట్టణాభివృద్ధి శాఖల కార్యదర్శి.
డా. యన్. చక్రవర్తి యం.ఆర్.టి.పి కమిషన్ సభ్యులు (1961 బ్యాచ్). ప్రపంచ బ్యాంకు సలహాదారు. సంగీత ప్రియులు.
వై. వేణుగోపాలరెడ్డి (1964 బ్యాచ్) కడప జిల్లా వారు. రిజర్వు బ్యాంక్ గవర్నరుగా ప్రసిద్ధులు. కడప జిల్లా నందలూరుకు చెందిన ఏ. యు. శర్మ(1957 బ్యాచ్) సమాచార ప్రసార శాఖల జాయింట్ సెక్రటరీ. బీహారు ప్రధాన కార్యదర్శి. హోంశాఖ కార్యదర్శిగా లబ్ధప్రతిష్ఠులు. కె. పద్మనాభయ్య (1961 బ్యాచ్) మహారాష్ట్ర క్యాడర్‌కు చెందిన వీరు 1997లో పదవీ విరమణానంతరం నాగాల్యండ్ సమస్యా పరిష్కార నిపుణులుగా 9 సంవత్సరాలు వ్యవహరించారు. హైదరాబాదులోని ASCI గవర్నింగ్ బాడీ చైర్మన్.
అదే మహారాష్ట్ర క్యాడరు అధికారి పి. అబ్రహం కేంద్ర విద్యుచ్ఛక్తి శాఖ కార్యదర్శి. తర్వాత UPSC సభ్యులు. వీరి అల్లుడు పి.శ్యాంబాబు లోక్‌సభ స్పీకరు జి.యం.సి బాలయోగి వద్ద కార్యదర్శి.
బొంబాయి దూరదర్శన్ స్టూడియోలో శ్రీ కె.ఎస్. శర్మ, ఐఎఎస్, తదితరులతో రచయిత
1967 బ్యాచ్ పశ్చిమ బెంగాల్ క్యాడర్ అధికారి జె. వి. ఆర్. ప్రసాదరావు గవర్నరు కె.వి.రఘునాధరెడ్డికి కార్యదర్శి. కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శిగా కె.యల్.రావు కుమార్తె కె. సుజాతారావు కూడా వ్యవహరించారు.
విద్యుచ్ఛక్తి శాఖ కార్యదర్శిగా పని చేసిన E.A.S శర్మ 1965 బ్యాచ్. ప్రభుత్వ విధానాల పట్ల అనాసక్తితో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. మణిశాస్త్రి వీరి సోదరి. 1964 బ్యాచ్ అధికారి జి.పి.రావు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి. సింగరేణి కాలరీస్ యం.డి.గా కార్మిక సమస్యలు పరిష్కరించారు. అదే రీతిలో 1974 బ్యాచ్ అధికారి ఏ.పి.వి.యన్.శర్మ సింగరేణి బొగ్గు గనుల యజమాన్యాన్ని నాలుగు సంవత్సరాలలో నష్టాల వూబి నుండి బయటకు తీసి అభివృద్ధి పథంలోకి తెచ్చారు. కేంద్ర షిప్పింగ్ శాఖ కార్యదర్శి. 2014 నుండి 2024 వరకు తెలంగాణా రాష్ట్ర గవర్నరుకు సలహాదారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగా పని చేశారు.
తి.తి.దే అధికారులుగా పని చేసిన మరో ఇద్దరు 1979 బ్యాచ్ అధికారులు. I. V. సుబ్బరావు, I.V.R. కృష్ణారావులు. సుబ్బారావు ఉపరాష్ట్రపతి శ్రీ యం. వెంకయ్యనాయుడు వద్ద కార్యదర్శిగా వ్యవహరించారు. కృష్ణారావు 2014లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు ప్రధాన కార్యదర్శి. కందుకూరు ప్రభుత్వ కళాశాల అధ్యాపకుడిగా నేనున్నపుడు ఈయన ఇంటర్మీడియేట్ చదివారు.
సౌజన్యమూర్తి అయిన ఆర్. వి. వైద్యనాథ్ ఆయ్యర్ 1966 బ్యాచ్ అధికారి. కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా 2000 సంవత్సరంలో రిపబ్లిక్ స్వర్ణోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇదే సంవత్సరం IAS అధికారి పి.వి.ఆర్.కె.ప్రసాద్ టి.టి.డి ఈ.వో.గా లబ్ధప్రతిష్ఠులు. పి.వి.నరసింహరావు ప్రధానిగా వున్న సమయంలో ప్రెస్ సెక్రటరిగా పేరు తెచ్చుకొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యదర్శిగా, గవర్నరు కార్యదర్శిగా విశిష్టులు.
1964 బ్యాచ్ అధికారి డా. పి. యల్. సంజీవరెడ్డి. వీరి తండ్రి పైడి లక్ష్మయ్య తొలి పార్లమెంటు సభ్యులు (1952-57). సంజీవరెడ్డి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ, కంపెనీ వ్యవహారాల శాఖల కార్యదర్శి. నీలం సంజీవరెడ్డికి వ్యక్తిగత కార్యదర్శిగా రాష్ట్రపతికి సహకరించారు. కె. సూర్యనారాయణ ప్రెస్ సెక్రటరీ.
1968 బ్యాచ్ అధికారి కె. సుబ్రహమణ్యశర్మ నవోదయ విద్యా సంస్థల నిర్మాణంలో చురుకుగా వ్యవహరించారు. ప్రసారభారతి సి.ఈ.వోగా 2002-2006 మధ్య గణనీయమైన మార్పులు తెచ్చారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్‌కు తొలి సి.ఈ.వో. వీరి సహపాఠి మోహన్ కందా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖలో కార్యదర్శి (ల్యాండ్ రిఫార్మ్స్) కేంద్రంలో గిరిజనాభివృద్ధి శాఖ కార్యదర్శి ఏ.వి.యస్.రెడ్డి కడప జిల్లా నందలూరు వాసి. కొంత కాలం మిలిటరీలో పని చేశారు. ఎస్.వి. యూనివర్శిటీ విద్యార్ధి నాయకుడు.
కేంద్రంలో ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ కార్యదర్శి పి. రాఘవేంద్రరావు హర్యానా క్యాడర్ అధికారి (1985 బ్యాచ్). గూడురు వాసి. హర్యానా క్యాడర్ మరో అధికారి యం. వై. ఖురేషి దూరదర్శన్ డైరక్టర్ జనరల్‌గా మా బాస్. తర్వాతి కాలంలో ఎన్నికల సంఘం ప్రధాన కమీషనర్‌గా రిటైరయ్యారు. నాకు బాసులుగా యస్. యం.గిల్, ఆర్.ఆర్.షా, అనిల్ బైజల్ (తర్వాతి కాలంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నరు) బి.వినోద్ కుమార్ (బీహారు క్యాడర్) యస్.యన్.వర్మ, యస్.యన్.మాధూరీలు పర్యవేక్షించారు.
ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్ కార్యదర్శిగా పని చేసిన ఏ.యన్. తివారి సమాచార కమీషన్ ప్రధాన కమీషనరు. ఆంధ్ర ప్రదేశ్ గవర్నరు కార్యదర్శి ఒరిస్సాకు చెందినవారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కార్యాలయంలో జాయింట్ సెక్రటరీగా వి.శేషాద్రి విశిష్ట వ్యక్తి. ప్రస్తుతం తెలంగాణా ముఖ్యమంత్రి కార్యాలయ ప్రధాన కార్యదర్శి.
యస్.కె. పచౌరి వివిధ శాఖలలో పని చేశారు. వి.గోవిందరాజన్ భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శి. సి.యస్.రావు ఆర్ధిక శాఖ కార్యదర్శి. IRDA వ్యవహారాల నిపుణులు. వి.కె. అగ్నిహోత్రి రాజ్యసభ కార్యదర్శి. TRAI సెక్రటరీ జె.యస్.శర్మ ఆకాల మరణం చెందారు. జె.పి.మూర్తి, ఆశామూర్తి దంపతులు కేంద్రంలో కీలక బాధ్యతలు వహించారు. యం.వి.పి.శాస్త్రి ఢిల్లీలో ఎ.పి.భవన్ స్పెషల్ ఆఫీసరు. వీరి సతీమణి ఉషా చంద్రశేఖరన్ పొస్టల్ శాఖ ఉన్నతోద్యోగి.
యస్.కె. జోషి – యస్.వేణు గోపాలాచార్యుల వద్ద వ్యక్తిగత కార్యదర్శి. రజత్ భార్గవ వెంకయ్యనాయుడు (గ్రామాణాభివృద్ధి శాఖ) వద్ద కార్యదర్శి. జె.వెంగళరావు వద్ద కె.వి.రావు కార్యదర్శి.
1999లో ఢిల్లీలో రచయిత పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న శ్రీ ఆర్. వి. వైద్యనాడయ్యర్, ఐఎఎస్
ఉపరాష్ట్రపతి వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా యన్. యువరాజ్ పని చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శి. వీరి సతీమణి జానకి పబ్లిక్ ఎంటర్‌ప్రయిజస్ శాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శి. ఉత్తర ప్రదేశ్ క్యాడర్‌కు చెందిన సీనియర్ IAS అధికారి ఆర్.చంద్రమౌళి కేంద్రంలో ఆరోగ్యశాఖ కార్యదర్శి.
కర్ణాటక క్యాడర్‌కు చెందిన జె.డి.శీలం IAS పదవికి రాజీనామా చేసి కాంగ్రెసు ప్రభుత్వంలో ఆర్థిక శాఖ సహాయామంత్రి పదవి నధిష్ఠించారు. కేరళ క్యాడర్‌కు చెందిన యం. రవికాంత్ HUDCO అధిపతిగా పని చేశారు. ఎపిభవన్ కమీషనరు జి. కిషన్ రావు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం చిరకాలం చేశారు.
ఇంత మంది అధికారుల పరిచయాలు సంవత్సరాల తరబడి వున్నా వారి సౌజన్యం నేనెన్నడూ వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకోలేదు.
(మళ్ళీ కలుద్దాం)
డా. రేవూరు అనంతపద్మనాభరావు అష్టావధాని, విమర్శకులు, ప్రముఖ సాహితీవేత్త. తెలుగు సాహిత్యం లోని అన్ని ప్రక్రియలలోనూ రచనలను చేశారు. 80 ఏళ్ళ వయస్సులో నిరంతర అధ్యయన, అధ్యాపనాలు కొనసాగిస్తూ 120 గ్రంథాలు ప్రచురించారు. 2005 లో దూరదర్శన్, ఢిల్లీ నుండి అదనపు డైరక్టర్ జనరల్‌గా పదవీ విరమణ చేశారు. పదవీ విరమణాంతరం గత 20 సంవత్సరాలలో 80 గ్రంథాలు వివిధ ప్రక్రియలలో ప్రచురించారు.
అనువాద సాహిత్యంలో తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం (1993); కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం (2000), అప్పాజోశ్యుల – విష్ణుభొట్ల – కందాళై ఫౌండేషన్ వారి విశిష్ట సాహితీ పురస్కారం లభించాయి. వీరి రచనలపై వివిధ కోణాలలో 5 విశ్వవిద్యాలయాల నుండి ఆరుగురు ఎం.ఫిల్/పిహెచ్డి పరిశోధనా గ్రంథాలు సమర్పించి పట్టాలు పొందారు.
సంచికలో వీరు గత ఐదు సంవత్సరాలలో – ఆకాశవాణి పరిమళాలు, కావ్యపరిమళం, జ్ఞాపకాలు-వ్యాపకాలు, ఆచార్య దేవోభవ, అవధానం ఆంధ్రుల సొత్తు అనే ఐదు గ్రంథాలు సమర్పించారు.
