Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వందే మా ‘తరం’-27

[తరాలు మారుతున్నాయి. సమాజం వేగంగా పరుగులు తీస్తోంది. విశ్వగ్రామం అనే సిద్ధాంతం ప్రబలింది. 1947లో పుట్టి 80వ ఏట కాలిడబోతున్న ప్రముఖ రచయిత డా. రేవూరు అనంత పద్మనాభరావు మూడు తరాల ప్రముఖులతో కలిసి మెలిసి తిరిగారు. ఆ జ్ఞాపకాల పందిరిని దారావాహికంగా అందిస్తున్నారు.]

అధికార యంత్రాంగం:

ఢిల్లీలో వివిధ శాఖలలో ఉన్నత స్థాయి నలంకరించిన పలువురితో నాకు పరిచయాలు ఏర్పడ్డాయి. చొరవ తీసుకొని వారిని కలిసి నా ప్రవర చెప్పి ‘ఆకాశవాణి’ అనగానే సాదరంగా పలకరించేవారు. ముందుగా ఎన్నికల సంఘ ప్రముఖులను గూర్చి ప్రస్తావిస్తాను.

ఎన్నికల సంఘంలో 1991 వరకు ఒకే ఒక్క కమీషనర్ వుండేవారు. ఆర్.వి.యస్. పేరిశాస్త్రి 1985-90 మధ్య ఎన్నికల కమీషనర్. అంతకు ముందు తెలుగువారు ఎంపిక కాలేదు. ఆయన న్యాయశాఖ కార్యదర్శిగా పని చేసి నిబద్ధతగల అధికారిగా ఆ పదవినందుకొన్నారు. ఆ తర్వాత 9వ ప్రధాన ఎన్నికల అధికారిగా వి. యస్. రమాదేవి 1990 నవంబరు నుండి 15 రోజులు వ్యవహారించారు. ఆ పదవి నలంకరించిన తొలి మహిళ. ఆమె రాజ్యసభ సెక్రటరీ జనరల్‌గా సమర్థురాలు. న్యాయశాఖలో కార్యదర్శిగా పని చేశారు. హిమాచల ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల గవర్నరుగా 1997-2002 మధ్య ప్రతిభ కనబరచారు. తొలి రోజుల్లో ఆమె హైదరాబాదు ఆకాశవాణి కార్యక్రమ వ్యాఖ్యతగా 1963కు ముందు వున్నారు.

ఎన్నికల ప్రధానాధికారి టి.యన్.శేషన్ ఒక ప్రభంజనం. ఆయన సతీమణి ఢిల్లీలో మహిళలకు నారాయణీయ పారాయణం నేర్పించారు. ఆ బృందంలో పలువురు కార్యదర్శుల గృహిణులతో బాటు నా సతీమణి శోభాదేవి కూడా సభ్యురాలు. శేషన్ ఉధృతిని తట్టుకోలేక భారత ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని త్రిసభ్య సంఘంగా మార్చింది.

జి.వి.జి.కృష్ణమూర్తి న్యాయశాఖ కార్యదర్శిగా 1963లో ఢిల్లీలో అడుగు పెట్టారు. వారితో నాకు బాగా చనువు ఏర్పడింది. తమ పూర్వులు వ్రాసి పెట్టిన తన జాతకం నాకు చూపి 1990లో “భవిష్యత్తు ఎలా వుంది?” అని అడిగారు. జాతక చక్రం అధ్యయనం చేసి నాలుగు పేజీలు వ్రాసి యిచ్చాను. “మీరు రిటైర్ కారు, రాష్రపతి ముద్రగల నియామకం వస్తుంది” అని జోస్యం చెప్పాను. అదే రీతిలో 1993 అక్టోబరులో ఎన్నికల కమీషనరుగా నియమితులయ్యారు. నా జోస్యం గూర్చి ఎందరికో ప్రశంసాపూర్వకంగా పలికారు.

2000 లో ఢిల్లీలో శ్రీ కె. ఆర్. నారయణన్, శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గార్లతో రచయిత

ఎన్నికల సంఘ ప్రధాన కమీషనర్‌గా నియమితులైన టి.యస్. కృష్ణమూర్తి ఇండియన్ రెవెన్యూ సర్వీసు అధికారి. నేను నివసించే పండారా పార్క్ క్వార్టరుకి సమీపంలో వారి క్వార్టరు. వారి సతీమణి వైణికురాలు. ఆంధ్రా క్యాడరు IAS అధికారులు వి. యస్. సంపత్, హెచ్.యస్.బ్రహ్మ ప్రధాన ఎన్నికల అధికారులు. యన్. గోపాలస్వామి, యస్. వై. ఖురేషీలు ఆ పదవికి వన్నె తెచ్చిన ప్రముఖులు. ఎన్నికల సంఘ కార్యదర్శిగా కె.జె.రావు విశిష్టులు.

పోలీసు యంత్రాంగం:

పలువురు తెలుగు ప్రముఖులు పోలీసుశాఖలో వివిధ విభాగాలలో వన్నెకెక్కారు. కృష్ణాజిల్లాకు చెందిన సూరత్ వేణుగోపాలరావు (1918) 1949 ఐపిఎస్ అధికారి. 1974-76 మధ్య పోలీస్ RAW పరిశోధనా విభాగ డైరక్టర్ జనరల్. ప్రామాణికమైన 11 గ్రంథాలు వ్రాశారు. ఆయన స్మారకోపన్యాసాలు ఏటా జరుపుతారు. వారి అల్లుడు డా. వ్యాస నారాయణ గాంధీ ఆసుపత్రిలో యూరాలజీ విభాగాధిపతి.

ఆంధ్రా క్యాడరు యస్. ఆనందారాం (1927) ఆంధ్రప్రదేశ్ పోలీసు డైరక్టర్ జనరల్ (1982-83). హైదరాబాదు ఆకాశవాణిలో వారి ప్రసంగాలు రికార్డు చేశాను. వారి సతీమణి విమలా ఆనందరామం రచయిత్రి. ప్రముఖ కార్టునిస్టు ఆర్.కె.లక్ష్మణ్ సోదరి. ఆనందారామం ఇందిరాగాంధీ హత్యోదంత SIT బృంద నాయకులు. వారిని విదేశ రాయబారిగా ప్రభుత్వం నియమించింది. కాని ఎన్నికల తర్వాత వచ్చిన ప్రభుత్వం రద్దు చేసింది.

ఆంధ్రప్రదేశ్ పోలీసు డైరక్టర్ జనరల్ యం. వి. నారాయణరావు (1925) ఢిల్లీలో యస్.పి.జిలో ఉన్నత పదవిలో వున్నారు. మరో డైరక్టర్ జనరల్ రొద్దం ప్రభాకరరావు (1934) పదవీ విరమణానంతరం 1992లో ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రత్యేక కమీషనరు. ప్రస్తుతం సలహాదారు పదవిలో మరో డైరక్టర్ జనరల్ ఆర్.పి. ఠాకురు నియమితులయ్యారు. ఆంధ్ర క్యాడర్ అధికారి ఇ. యస్. యల్. నరసింహన్ ఆంధ్ర ప్రదేశ్ గవర్నరు. నేను వ్రాసిన ‘నరుని సేవలో నారాయణుడు’ అనే జీవిత చరిత్రను రాజభవన్‌లో ఆవిష్కరించారు.

1957 బ్యాచ్ అధికారి డి.వి.యల్.యన్. రామకృష్ణారావు (1934) ఇండో-టిబెటన్ బోర్డ్డర్ పోలీసు విభాగ డైరక్టర్ జనరల్‌గా 1992 జనవరి వరకు ప్రతిభను చాటారు. ఏలూరు రేంజి డి.ఐ.జిగా విజయవాడ ఆకాశవాణిలో వారి ఇంటర్వ్యూ రికార్డు చేశాము.

విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో వింజమూరి సోదరీమణులతో అప్పటి డిజిపి శ్రీ ఆర్. ప్రభాకర రావు, రచయిత

నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన కె. విజయరామరావు (1937) 1959 బ్యాచ్ అధికారి, ఢిల్లీలో CBI డైరక్టరుగా 1996 జూలై వరకు ప్రతిభ చాటారు. 1999లో తెలుగుదేశం పార్టీలో చేరి రహదారులు, భవనాల శాఖామంత్రి పదవీ బాధ్యతలు చేపట్టారు.

యం. ఆర్. రెడ్డి (1944) ప్రధాన మంత్రుల ప్రత్యేక రక్షకదళ విభాగ డైరక్టరు. యు. యన్. బి. రావు (1945) ఢిల్లీ పోలీస్ విభాగాధిపతి. కావలికి చెందిన యస్. వాసుదేవరావు (1957) యు.టి. క్యాడర్ అధికారిగా పదవీ విరమణ చేశారు. సి.ఆర్.పి.యఫ్.లో పని చేసిన వి. పురుషోత్తమరావు (1998) పార్లమెంటు రక్షణదళ విభాగాధిపతి. ఈ విభంగా పలువురు పోలీసు అధికారులు తెలుగు జాతికి గర్వకారణాలు. మదరాసు క్యాడర్‌కు చెందిన యం.కె.ఝా పండారా రోడ్‌లో మా పక్కనే క్వార్టరులో వుండి I.B. అడిషనల్ డైరక్టర్‌గా 2022 లో రిటైరయ్యారు.

న్యాయధీశుల నేర్పులు:

సుప్రీం కోర్టు న్యాయమూర్తులు కొందరితో పరిచయాలు ఏర్పడటం విశేషం. నేను ఢిల్లీ ఆకాశవాణి డైరక్టరుగా వున్న సమయంలో 2000లో సుప్రీం కోర్టు స్వర్ణోత్సవాలు వైభవంగా జరిగాయి. సాధారణంగా చీఫ్ జస్టిస్ రేడియోలో మాట్లాడరు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని జాతీయ స్థాయిలో సుప్రీం కోర్టు ప్రగతిని శ్రోతలకు తెలియజేసే ఆంగ్ల రూపకం నా దర్శకత్వంలో తయారు చేశాము. రిజిష్ట్రారు ద్వారా అప్పటి ప్రధాని న్యాయమూర్తి జస్టిస్ శ్రీ. ఏ.యస్. ఆనంద్‍ను అంగీకరింపజేసి వారి బంగళాలో సందేశం రికార్డు చేశాం. సీనియర్ న్యాయమూర్తి, నాకు సుపరిచుతులైన జస్టిస్ యం.జగన్నాధరావును కూడా రికార్డు చేశాము, మూడు తరాలు వారి కుటుంబంలో న్యాయమూర్తులు. జగన్నాధరావు కుమారులు జస్టిస్ యం. యస్. రామచంద్రరావు ప్రస్తుతం త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తొలిసారిగా జస్టిస్ కోకా సుబ్బారావు వ్యవహరించే సమయంలో నేను తిరుపతి యూనివర్శిటీలో ఎం.ఏ. చదువుతున్నాను. ఆయన చేత నూతన భవనాలు ప్రారంభింపజేశారు. ఆయన యస్.వి.యూనివర్శిటీకి 1954-55 మధ్య ఛాన్సలర్. చాలా సంవత్సరాల తర్వాత తెలుగు వారైన యన్.వి.రమణ ప్రధాన న్యాయమూర్తి స్థానాన్ని 2021-22 మధ్య అధిరోహించారు. 2027లో తిరిగి జస్టిస్ పి. యస్. నరసింహ ఆ పదవి నధిష్ఠించబోతున్నారు. వారి తండ్రి జస్టిస్ పి.కోదండరామయ్య ఆంధ్రప్రదేశ్ హై కోర్టు న్యాయమూర్తి.

మరో న్యాయమూర్తి జస్టిస్ కె. జయచంద్రరెడ్డి (1929) సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా 1990 జనవరి 1994 జూలై మధ్య వ్యవహరించారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా వుండగా నా అభ్యర్ధన మేరకు అనంతలక్ష్మీకాంత సాహితీ పీఠం పక్షాన మా నాన్నగారి స్మారకార్ధం ఏర్పాటు చేసిన అవార్డును పి.లక్ష్మీకాంత శెట్టికి ప్రదానం చేశారు. కడప జిల్లా నుండి ఎంపికైన పలువురు న్యాయమూర్తులలో ఆయన విశిష్టులు.

డా. జస్టిస్ కె. రామస్వామి (1932) భీమవరం కళాశాల పట్టభద్రులు. 1982లో ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి. 1987లో అక్టోబరులో సుప్రీం కోర్టు న్యాయమూర్తి. 1997 వరకు ఆ పదవిలో వున్నారు. ఏ.పి.భవన్‌లో ఒక సాహిత్య సభకు వారు, నేను, ఐ.జె.రావు అతిథులం. అధ్యక్షస్థానంలో ఎవరు కోర్చువాలనే చర్చ వచ్చింది. ఐ.జె.రావు అనబడే ఇచ్ఛాపురం జగన్నాధరావు అప్పుడు సెంట్రల్ ఎక్సైజ్ ట్రిబ్యునల్ సభ్యులు. చమత్కారంగా ఆయన రామస్వామి గారితో “సార్! మీరు అప్సిలెట్ ట్రిబ్యూనల్ (సుప్రీం కోర్టు). మీరే అధ్యక్షులు” అన్నారు. రామస్వామి నేషనల్ హ్యూమన్ కమిషన్ సభ్యులు. ఆ స్థానంలో జస్టిస్ వై. భాస్కరరావు కూడా వున్నారు.

శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, శ్రీ సత్యనారాయణ (ఐపిఎస్) గార్లతో రచయిత

జస్టిస్ లావు నాగేశ్వరరావు సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ప్రసిద్ధులు. పాత తరానికి చెందిన తెలుగు వారిలో జస్టిస్ బచ్చు జగన్నాథదాసు (1893-1968) ప్రాతఃస్మరణీయులు. ఆయన కుమారులు పార్థసారధి సీనియర్ న్యాయవాది. తమిళనాడుకు చెందిన జస్టిస్ యం.శ్రీనివాసన్ 1997-2000 మధ్య సుప్రీం కోర్టు న్యాయమూర్తి. హిమాచల్ ప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తిగా సిమ్లాలో కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీ జయేంద్ర సరస్వతి వారి బంగళాకు విచ్చేసిన సందర్భంలో నాకు పరిచయమయ్యారు. అప్పుడు వి.యస్.రమాదేవి హిమాచల్ గవర్నరు.

జస్టిస్ యస్.యస్.యం.ఖాద్రి 1997 డిసెంబరు నుండి సుప్రీం కోర్టు న్యాయమూర్తి. జస్టిస్ జాస్తి ఈశ్వర ప్రసాద్ (1934) ఢిల్లీలోని ఫోర్‌ఫిటెడ్ ప్రాపర్టీస్ అప్పిలెట్ ట్రిబ్యూనల్ చైర్మన్‌గా 1997 మార్చి నుండి వ్యవహరించారు. పండారా రోడ్‌లో వారి నివాసానికి సమీపంలో మా క్వార్టర్సు. తరచు కలిసే వారం. వారి కుమారులు కృష్ణకిషోర్ ఇన్‍కమ్ టాక్స్ ప్రిన్సిపాల్ ఛీఫ్ కమీషనరుగా రిటైరయ్యారు.

సుప్రీం కోర్టు స్వర్ణోత్సవాల రూపకంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ దువ్వూరి సుబ్బారావును (2000 – 2002) రికార్డు చేశాం. ఆయన విశాఖ పట్టణం మేయరు.

హిందూ పత్రిక లీగల్ రిపోర్టర్‌గా ప్రసిద్ధులైన తలుపూరు పద్మనాభరావు సుప్రీం కోర్టు కీలక తీర్పులను పాఠకులకు నాలుగు దశాబ్దాలు అందించారు.

ప్రముఖ న్యాయవాది పవని పరమేశ్వరరావు (1993-2017) రాజ్యాంగ నిపుణులు. పద్మభూషణ్ పురస్కార గ్రహీత. కందుకూరు ప్రభుత్వ కళాశాలలో పని చేస్తూన్న సమయంలో వారి సోదరులు శ్రీధరరావు, పవని నిర్మల ప్రభావతి దంపుతులు సన్నిహితులు. ఢిల్లీ న్యాయవాదులలో ప్రముఖులు శ్యామలా పప్పు. గణపతి సచ్చిదానంద స్వామి వారి యింటికి విచ్చేసినప్పుడు పలువురు ఆంధ్రులం కలిశాము.

1982 లో కడపలో జస్టిస్ శ్రీ పాండురంగారావు గారితో రచయిత

కడపకు చెందిన వి.ఆర్.రెడ్డి అదనపు సోలిసిటర్ జనరల్. మరో వి. రాజగోపాల రెడ్డి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ సభ్యులు. పద్మా సేథ్ (అనంతశయనం అయ్యగార్ కుమార్తె) బాలల అకాడమీ సభ్యులు. ఇన్‌కమ్ టాక్స్ అప్సిలేట్ ట్రిబ్యూనల్ చైర్మన్‌గా సి. హెచ్. జి. కృష్ణమూర్తి ప్రముఖులు. శాంతారెడ్డి సెంట్రల్ ఉమెన్స్ కమీషన్ సభ్యురాలు. ఆర్. సుబ్బారావు సుప్రీం కోర్టు రిజిష్ట్రారుగా గణనీయమైన సేవ చేశారు. ఇలా పలువురి ప్రముఖుల పరిచయాలు ఏర్పడటం విశేషం. నేనెరిగిన వ్యక్తులనే ప్రస్తావించాను. ఎందరో మహానుభావులు.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version