Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వందే మా ‘తరం’-28

[తరాలు మారుతున్నాయి. సమాజం వేగంగా పరుగులు తీస్తోంది. విశ్వగ్రామం అనే సిద్ధాంతం ప్రబలింది. 1947లో పుట్టి 80వ ఏట కాలిడబోతున్న ప్రముఖ రచయిత డా. రేవూరు అనంత పద్మనాభరావు మూడు తరాల ప్రముఖులతో కలిసి మెలిసి తిరిగారు. ఆ జ్ఞాపకాల పందిరిని దారావాహికంగా అందిస్తున్నారు.]

ఎందరో మహానుభావులు:

ఢిల్లీలో వివిధ రంగాలలో సుప్రసిద్ధులైన వ్యక్తులు 1990వ దశకంలో ఉన్నత స్థానాల నలకరించారు. ప్రముఖులను ప్రస్తావిస్తాను.

U.P.S.C. (యూనియన్ పబ్లిక్ సర్వీసు కమీషన్):

కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌గా వ్యవహరించిన ఆచార్య కె.వెంకట్రామయ్య ఆరేళ్ల పాటు కమీషన్ సభ్యులుగా ఎందరో తెలుగు యువకులను ప్రోత్సహించారు (1986 నుండి 1992 వరకు). మరో సభ్యులు రాజకీయంగా రాజ్యసభ సభ్యులు (1980-86) భమిడిపాటి కృష్ణమోహన్. ఆయన UPSC మెంబరుగా కొద్ది సంవత్సరాలు పని చేసి 1998లో అకాల మరణం చెందారు.

అనంతపురం కళాశాల ప్రిన్సిపాల్‌గా పని చేసిన ఆచార్య వై. వెంకట రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్‌గా 2005-11 మధ్య పదవి నిర్వహించారు. 2011లో UPSC మెంబరుగా నియమితులై 65వ ఏట పదవీ విరమణ చేశారు. ప్రొ. కె. యన్. చలం అదే సమయంలో మెంబరు. ప్రొ. డి. సి. అగర్వాల్, ఐయం.జి. ఖాన్ బోర్డులలో నేను పరీక్షాధికారిని.

డా. ఇలపావులూరి పాండురంగారావు (1930-2011) ఒంగోలు జిల్లాకు చెందినవారు. బహుభాషా కోవిదులు. వారు రచించిన WOMEN IN VALMIKI గ్రంధాన్ని ‘రామాయణంలో స్త్రీ పాత్రలు’గా నేను అనువదించాను (1980). పాండురంగారావు UPSC లో అధికార భాషాధికారిగా సివిల్స్ పరీక్షా నిర్వాహణలో గణనీయ కృషి (1964-86) చేశారు. జ్ఞానపీఠ కార్యదర్శిగా (1989) పని చేయడానికి ముందు కలకత్తాలోని భారతీయ భాషాపరిషత్ కార్యదర్శి.

ఇండియన్ పోస్టల్ సర్వీసుకు చెందిన కావలి వాసి ఆర్. యస్. నటరాజమూర్తి యు.పి.యస్.సి.లో జాయింట్ సెక్రటరీగా 1995లో పని చేశారు. గ్రామీణ డాక్ సేవకుల ఉద్యోగ క్రమబద్ధీకరణకు 2016లో నటరాజమూర్తి అధ్యక్షతన కమిటీ వేశారు.

పోస్టల్ విభాగంలో ఉన్నతాధికారులు:

ప్లానింగ్ కమీషన్:

ప్రణాళికా సంఘం భారతీయ ప్రగతిలో ప్రధాన పాత్ర వహిస్తుంది. గుంటూరుకు చెందిన డా. డి. స్వామినాధన్ (1938 ఫిబ్రవరి) హైదరాబాదు లోని JNTU వైస్ ఛాన్సలర్. ఢిల్లీలో ప్లానింగ్ కమీషన్ మెంబరు (1990-96). మరో ప్రముఖ వ్యక్తి బి. యన్. యుగంధర్ (IAS). 1992 బ్యాచ్ ఆంధ్రా క్యాడరు ప్లానింగ్ కమీషన్ మెంబరు. సత్యా నాదెండ్లకు తండ్రి. యుగంధర్ ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా యన్.టి.రామారావు ప్రవేశపెట్టిన రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం అమలులో ప్రముఖ వ్యక్తి. ప్లానింగ్ కమీషన్‌లో పని చేసిన వి. యల్. కాంతారావు పి.వి.నరసింహారావుకు సన్నిహితులు.

ఆంధ్రజ్యోతి ఢిల్లీ బ్యూరో చీఫ్ శ్రీ ఎ. కృష్ణారావుతో రచయిత

స్వామి అగ్నివేశ్ పదహారణాల ఆంధ్రులు. ఆర్యసమాజ ప్రభావితులు. ‘ఆర్యసభ’ అనే రాజకీయ పార్టీ స్థాపించారు. హర్యానాలో విద్యాశాఖ మంత్రిగా 1979లో పని చేశారు. ఢిల్లీ ఆకాశవాణిలో ఇంటర్య్వూ చేసినప్పుడు స్వచ్ఛమైన తెలుగు మాట్లాడారు. సి.హెచ్.హనుమంతరావు ఆర్ధిక సంఘ సభ్యులు. వీరి సోదరులు విద్యాసాగరరావు కేంద్రమంత్రి, మహారాష్ట్ర గవర్నరు.

యు.జి.సి.:

విశ్వవిద్యాలయ గ్రాంట్ల సంఘం చైర్మన్‌గా పని చేసిన వి.యస్.కృష్ణ ఆంధ్ర విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్‌గా ప్రసిద్ధులు. వీరి అల్లుడు పి. యల్. సంజీవరెడ్డి IAS అధికారి. యు.జి.సి. ఆధిపత్యం వహించిన మరో వ్యక్తి జి. రామిరెడ్డి (1929-1995) ఉస్మానియా వైస్ ఛాన్సలర్. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, ఇగ్నో మూడు విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స్‌లర్. యు.జి.సిలో వైస్ ఛైర్మన్లుగా ఆచార్య బి. రామచంద్రరావు (1922), ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి (1924) భిన్న సమయాలలో వ్యవహరించారు. ఇద్దరూ ఆంధ్రా విశ్వవిద్యాలయ ఆచార్యులు. తెలుగువారైన పి. ప్రకాశ్ యు.జి.సి. కార్యదర్శిగా పని చేసి ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయ వైస్. ఛాన్సలర్‌గా రెండేళ్లు పని చేశారు.

ఇగ్నో – ఢిల్లీ వైస్ ఛాన్సలర్‌గా ఆచార్య వి.యస్.ప్రసాద్ (1943) ప్రముఖులు. ఆకాశవాణిలో వ్యవసాయ కార్యక్రమాల డైరక్టరు డా. ఏ. డబ్లూ. ఖాన్ ఇగ్నో వైస్ ఛాన్సలర్‌గా గణనీయులు.

శ్రీ వెంకటేశ్వర కళాశాల టి.టి.డి ఆధ్వర్యంలో ఢిల్లీలో నడుస్తోంది (1961 నుండి). దీని తొలి ప్రిన్సిపాల్ డా. వి. కృష్ణమూర్తి ప్రతిభామూర్తి. తర్వాతి కాలంలో ఏ. శంకరరెడ్డి విద్యారంగ వ్యాప్తికి విశేష కృషి చేశారు. ఇటీవలి కాలంలో శ్రీమతి షీలారెడ్డి నాలుగో ప్రిన్సిపాల్. జువాలజీ అధ్యాపకులు డా. వి. సత్యనారాయణరావు విద్యార్ధుల మన్ననలు చూరగొన్నారు. ఆంగ్లోపన్యాసకులు డా. వాడ్రేవు పాండురంగారావు, సుజాత సంక్రాంతి ప్రముఖ రచయితలు. డా. వై. వి. రమణ తొలి ప్రిన్సిపాల్.

డా. ఏల్చూరి మురళీధరరావుతో రచయిత

విద్యారంగ ప్రముఖులు:

ఢిల్లీ విశ్వవిద్యాలయంలో మోడరన్ ఇండియన్ లాంగ్వేజెస్ విభాగాధిపతి పి. సి. వీరేశలింగం తెలుగు శాఖ అభివృద్ధికి నాంది పలికారు. వీరి కుమారులు పి. యస్. మూర్తి ఆకాశవాణి శ్రోతల పరిశోధనా విభాగం డైరక్టరు. ఢిల్లీ విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధిపతి డా. టి. సుశీల (1935) ద్విపద సాహిత్య చరిత్ర పై పరిశోధన చేసి డాక్టరేట్ సంపాదించారు. కొత్తపల్లి వీరభద్రరావు ఇక్కడ కొంత కాలం పని చేశారు.

ఇతర సాహితీవేత్తలు – డా. ఏల్చూరి మురళీధరరావు, ఆర్. యస్ .గణేశ్వరావు, శాంతసుందరి దంపతులు, వి. వి. బి. రామారావు, జె. యల్. రెడ్డి, తాళ్లపల్లి మురళీధర్ గౌడ్, ప్రభల జానకి, దాసరి అమరేంద్ర, కల్లూరి శ్యామల (IIT), కందుకూరు మహాలక్ష్మి రవికాంత్, డా. యన్. రాజేశ్వరి, పులిగడ్డ విశ్వనాథరావు, అబ్బూరి ఛాయాదేవి. హిందీ రీడర్ డా. జె.యల్. రెడ్డి నా గ్రంథం (భారతీయ సుప్రసిద్ధ గ్రంథాలు) హిందీలోకి అనువదించారు.

నేషనల్ బుక్ ట్రస్ట్‌లో తెలుగు విభాగాధిపతి ఉషారాణి భాటియా, గురవయ్య తొలి తరం వ్యక్తులు. ప్రస్తుతం పత్తిపాక మోహన్ ఆ బాధ్యత వహిస్తున్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శిగా 2025 అక్టోబరులో రిటైరయిన కె. శ్రీనివాసరావు 30 సంవత్సరాలు వివిధ స్థాయిలలో పని చేశారు. డి. సుబ్బారావు, Indian Literature పత్రిక సంపాదకులు కార్యదర్శలుగా పని చేసిన డా. ఇంద్రనాథ్ చౌదరి, డా. కె. సచ్చిదానందన్, అగ్రహార కృష్ణమూర్తి నాకు సన్నిహితులు.

ఉన్నత పదవులు:

ప్రముఖ వైద్యసంస్థ AIIMS అధిపతి డా. పి. వేణుగోపాల్ హృద్రోగ నిపుణులు. సెంట్రల్ వాటర్ కమీషన్ మెంబరు యం. యస్. రెడ్డి వి.యస్.యన్.యల్. అధిపతి. యం. ఆర్. సుబ్రమణ్యం, టి.హనుమాన్ చౌదరి, GAIL అధిపతిగా సి. ఆర్. ప్రసాద్, ప్రముఖ జ్యోతిషవేత్త కె. యన్. రావు IA&AS డిప్యూటీ అకౌంటెంట్ జనరల్. 80వ ఏట భవన్స్ విద్యాకేంద్రంలో జ్యోతిష పాఠాలు బోధించారు. IIT ఢిల్లీ అధిపతి డా. వి. యస్. రాజు, రైల్వే బోర్డు చైర్మన్ యం.కె. రావు, బోర్డు మెంబరు వి. వి. చయనులు. IIFC బ్యాంకు అధిపతి పి.నరసింహం – ఓరియంటల్ ఇన్యూరెన్సు అధిపతి జి.వి.రావు అనంతపురం వాసి. వీరికి శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. యోజన ఇంగ్లీషు మేగజైన్‌కు సంపాదకత్వం వహించిన డా. జె. భాగ్యలక్ష్మి, డి. కృష్ణారావు దంపతులు సౌజన్యమూర్తులు. టి. వి. లక్ష్మణరావు విశిష్టులు. ఏ. ఆర్. బాజీ పి.ఐ.బి.అధిపతిగా సుప్రతిష్ఠితులు. దూరదర్శన్‌లో హిందీ వార్తలు చదివిన జి.వి.రమణ, ఆకాశవాణిలో ఇంగ్లీషు వార్తలు చదివిన మనోహర్ కోల్ తెలుగువారే. వాటర్ కమిషన్‌లో పని చేసిన ఆర్. విద్యాసాగర్ రావు తెలుగాణా ప్రభుత్వ సలహాదారు (2014).

హోం శాఖ మాజీ కార్యదర్శి శ్రీ కె. పద్మనాభయ్య, శ్రీమతి సత్యవతి గారితో శ్రీమతి శోభాదేవి

పత్రికారంగం:

హిందూ దినపత్రిక ఢిల్లీ బ్యూరో చీఫ్ జి.కె.రెడ్డి ఆ తరం సంపాదకులలో నిబద్ధత గల వ్యక్తి. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సంపాదక వర్గంలోని జి.యస్.భార్గవ – వి.వి.గిరి జీవిత చరిత్రను ఇంగ్లీషులో రచించారు (1969). డా. యన్. భాస్కరరావు CMS పరిశోధనా సంస్థ అధిపతి, ఇందిరాగాంధీ హయాంలో 20 సూత్రాల ఆర్థిక ప్రణాళిక అమలును పర్యవేక్షించారు. సభా సమ్రాట్ కె. వి. భాస్కరారావు కొంత కాలం ఢిల్లీలో పని చేశారు. సి. నరేంద్రరెడ్డి ఢిల్లీ బ్యూరో అధిపతి. ప్రస్తుతం ఆంధ్రజ్యోతి ఢిల్లీ బ్యూరో అధిపతి ఏ. కృష్ణారావు సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత. పి.వి.నరసింహారావు జీవిత చరిత్ర రచయిత. టంకసాల అశోక్ ఢిల్లీ బ్యూరోలలో పని చేశారు. బి. మురళీధరరెడ్డి హిందూ విలేఖరి. మన్మోహన్ సింగ్ ప్రెస్ సెక్రటరీ సంజయ్ బారు తెలుగువారే. IAS అధికారి. బి. పి. ఆర్. విఠల్ తనయుడు. UNI లో ప్రముఖ వ్యక్తి కల్యాణీ శంకర్.

వివిధ సంస్థలు:

ఆంధ్రా ఎడ్యుకేషన్ సోసైటీ (1948) బదిలీపై ఢిల్లీకి వచ్చిన ఆంధ్రుల పిల్లలకు విద్యావకాశాలు కల్పించడానికి ఏర్పడింది. వీరి ఆధ్వర్యంలో దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ఆధ్వర్యంలో పలు ప్రాంతాలలో హైస్కూళ్లు వెలిశాయి. శాశ్వత భవనాలు ఏర్పడ్డాయి.

ఆంధ్రా అసోసియేషన్ 1935లో కాశీనాథుని నాగేశ్వరరావు ప్రభృతుల దూరదృష్టితో ఏర్పడింది. 1990 దశకంలో డా. వి. కృష్ణమూర్తి నేత. తర్వాత డా. కె. జి. రావు నేతృత్వం వహించారు.

1978లో ఢిల్లీ తెలుగు సంఘం మొదలైంది. డి. కృష్ణారావు నేత. జి. సాయికృష్ణారావు కార్యదర్శి. ఆంధ్ర వనితా మండలి లక్ష్మీరఘురామయ్య నేతృత్వంలో 1961లో ప్రారంభించారు. 1978లో సరస నవరస నాటకరంగ సంస్థ పి.వి.నరసింహారావు చొరవతో మొదలైంది. నాటకాలు ప్రదర్శించేవారు.

1968లో తెలుగు సాహితి – దామోదరం సంజీవయ్య కేంద్రమంత్రిగా ఆరంభించారు. సాహిత్య అకాడమీ అవార్డులు స్వీకరించడానికి ఢిల్లీ విచ్చేసిన వారితో ఇష్టాగోష్ఠి ఏర్పాటు చేసేవారు. ఆర్. యస్. గణేశ్వరరావు మూడు దశాబ్దులు నడిపారు.

1990లో ఢిల్లీ తెలుగు అకాడమీ ప్రారంభమై చైతన్య స్ఫూర్తి.. యస్. వి. యల్. నాగరాజు ఆధ్వర్యంలో మూడ దశాబ్దాలు అవార్డులు ప్రదానం చేసింది. కరోనా సమయంలో నాగరాజు మృతితో సంస్థ మూతబడింది. తెలుగు ఫిలిం సొసైటీ, తెలుగు ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ తర్వాత ఆరంభించారు.

సుదీర్ఘ చరిత్ర గల పై సంస్థల వివరాలు సంక్షిప్తంగా అందించాను.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version