[తరాలు మారుతున్నాయి. సమాజం వేగంగా పరుగులు తీస్తోంది. విశ్వగ్రామం అనే సిద్ధాంతం ప్రబలింది. 1947లో పుట్టి 80వ ఏట కాలిడిన ప్రముఖ రచయిత డా. రేవూరు అనంత పద్మనాభరావు మూడు తరాల ప్రముఖులతో కలిసి మెలిసి తిరిగారు. ఆ జ్ఞాపకాల పందిరిని ధారావాహికంగా అందిస్తున్నారు.]
పరిచిత ప్రముఖులు:
నేను 1975లో ఆకాశవాణి కడపలో ప్రొడ్యూసర్‌గా చేరే నాటికి డైరక్టర్ జనరల్‍గా బెంగాలీ పి.సి. చటర్జీ వుండేవారు. 1976 ఆగస్టులో మూడు నెలల ట్రైయినింగుకు ఢిల్లీ వెళ్లినప్పుడు వారిని కలిశాను. 1998లో ఢిల్లీలో కేంద్ర డైరక్టరుగా విశ్రాంతి డైరక్టర్ జనరళ్లకు సన్మానం చేశారు. అప్పుడు ఛటర్జీ, కె.సి.శర్మ, మాధుర్ ప్రభృతులను గౌరవించాము.
1997లో అనుకోని పరిణామం. నేను పబ్లికేషన్ డివిజన్, ఢిల్లీ వారికి రచించిన ‘భారతీయ సుప్రసిద్ధ గ్రంథాలు – తెలుగు’ ఆవిష్కరణను అప్పటి డైరక్టర్ జనరల్ ఓం ప్రకాశ్ కెజ్రివాల్ చేశారు – హైదరాబాదులో. ఆ సభలో ఆయన నన్ను ప్రశంసిస్తూ “రావును ప్రధానమైన ఢిల్లీ కేంద్ర డైరక్టరుగా విజయవాడ నుండి బదిలీ చేస్తున్నాము” అని ఆశ్చర్యకర ప్రకటన చేశారు. అలా 1997 అక్టోబరులో నేను ప్రసారాల కేంద్ర బిందువునకు అధిపతినయ్యాను. అప్పటికి సరిగ్గా నా వయస్సు 50 సంవత్సరాలు.
1999లో ఢిల్లీలో అప్పటి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి డా. ఎస్. వేణుగోపాలాచారి గారితో
ఆకాశవాణి డైరక్టరేట్‌లో డి.డి.జి.గా యం.డి. గైక్వాడ్ నన్ను అభిమానించేవారు. కాని, ఆయనకు, డి.జి.కి పడదు. మద్యలో నేను నలిగాను. అలానే నేను చేరిన నెల లోపలే ప్రసార భారతి ఏర్పడింది. నిఖిల్ చక్రవర్తి చైర్మన్. యస్.గిల్, IAS సి.ఈ.వో. ఆయనకు, డి.జి.కి పడేది కాదు. ఇద్దరి పరస్పర విరుద్ధ ఆదేశాలు అమలు చేయవలసిన బాధ్యత నాపై పడింది.
అంతకు ముందు అమృతరావు షిండే 1991 వరకు డైరక్టర్ జనరల్. నన్ను 1987లో ఢిల్లీ లోని శిక్షణా కేంద్రానికి బదిలీ చేసి గౌరవించింది ఆయనే. 1988లో అకస్మాత్తుగా కొత్తగూడెం ఆకాశవాణిని అప్పటి కేంద్ర పరిశ్రమల శాఖామంత్రి జలగం వెంగళరావు కోరిక మేరకు ప్రారంభంచాల్సి వచ్చింది. నన్ను బదిలీ చేశారు. “పిల్లలు చదువుల మధ్యలో వున్నారు. ఇప్పుడు అర్ధాంతరంగా మారిస్తే ఎలా?” అని ఒక పెళ్లి విందు వేడుకలో మా ఆవిడ షిండేను వచ్చీ రాని హిందీలో అడిగింది. కోపగించుకోవలసిన ఆయన ప్రసన్న చిత్తంతో “రెండు నెలలు టూర్ మీద కొత్తగూడెం వెళ్లి ఢిల్లీకి వచ్చేయండి!” అని మార్పు చేశారు.
అప్పట్లో డి.డి.జి.లు కేశవ పాండే, డి.పి. రామచంద్ర, యం.పి. లేలే, మేష్ రాం ప్రభృతులు నన్ను ప్రోత్సహించారు. నా సహోద్యోగులు నలుగురు వయసులో నాకంటే చిన్నవారు కావడం వల్ల డైరక్టర్ జనరళ్లు కాగలిగారు. వారు నన్నెంతో ఆదరంగా చూశారు. లీలాధర మండ్లోయీ, నోరిన్ నక్వీ జయలాల్, ఆర్. వెంకటేశ్వర్లు ఈ కోవలోని వారు. వార్తావిభాగానికి చెందిన వేణుధరరెడ్డి తర్వాత డైరక్టర్ జనరల్ అయ్యారు. రిటైరై హైదరాబాదులో స్థిరపడ్డారు.
జాతీయ సంస్థలు:
పలువురు తెలుగువారు కేంద్రంలో వివిధ జాతీయ సంస్థలలో చక్రం తిప్పారు. కేంద్ర సమాచార కమీషనర్లుగా మాడభూషి శ్రీధర్ న్యాయశాస్త్ర కోవిదులు. ఎన్నో విలక్షణ తీర్పులు వెలువరించారు (2013-19). ప్రస్తుతం మహీంద్రా విశ్వవిద్యాలయం, హైదరాబాదులో లా విభాగ డీన్ గా పాఠాలు బోధిస్తున్నారు. ఇన్ఫర్మేషన్ కమీషనర్లుగా ఆంధ్రా క్యాడరు IAS అధికారి ఏ.యస్.తివారి, ఆకాశవాణి డైరక్టర్ జనరల్ ఓ.పి. కెజిర్వాల్ కూడా నియమితులయ్యారు.
నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ డైరక్టరుగా యన్. విజయాదిత్య 2006 వరకు ఈ-గవర్నెన్స్ అమలులో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. భద్రతా విభాగాలను పట్టిష్టం చేశారు. పదవీ విరమణానంతరం కూడా సాకేంతిక రంగంలో ప్రధాన భూమిక వహిస్తూ హైదరాబాదులో స్థిరపడ్డారు.
2000లో ఢిల్లీలో అప్పటి కేంద్ర మంత్రి శ్రీ సుశీల్ కుమార్ షిండే గారితో
నూనెగింజల డైక్టరేట్ అధిపతి డా. యం. వి. రావు ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త. 1986 మధ్య ఢిల్లీలో నూనెగింజల ఉత్పత్తులలో విప్లవం సృష్టించారు. యన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్. పద్మశ్రీ ఆవార్డు గ్రహీత. హరిత విప్లవ యోధులలో ఒకరైన రావు 2016 మార్చిలో గతించారు.
అపోలో వైద్యశాలల దిగ్గజం ప్రతాప్ సి.రెడ్డి దార్శనికులు (1933 ఫిబ్రవరి). చిత్తూరు జిల్లా అరగొండలో జన్మించిన హృద్రోగనిపుణులు. 2000 మార్చిలో ఢిల్లీ అపోలో ఆసుపత్రిలో ఆయన పర్యవేక్షణలో నాకు బైపాస్ సర్జరీ జరిగింది. 2010లో పద్మవిభూషణ్ భూషితులు.
1999లో ఢిల్లీ ఆకాశవాణి స్టూడియోలో అపోలో సంస్థల అధిపతి ప్రతాప రెడ్డిగారితో
మరో ఇద్దరు హృద్రోగ నిపుణులైన తెలుగు వారిని ప్రస్తావిస్తాను. జాతీయ స్థాయి AIMS అధినేత డా. పి. వేణుగోపాల్ (1942-2004 అక్టోబరు). దాదాపు 50 సంవత్సరాలు ఆ సంస్థలో ఎందరో వర్ధిష్ణు హృద్రోగనిపుణులను తీర్చిదిద్దారు. ప్రస్తుత తిరుపతి SVIMS డైరక్టర్ జనరల్ డా. ఆర్. వి. కుమార్ ఆయన ప్రధాన శిష్యులు. హృద్యోగ రంగంలో గణనీయమైన కృషి చేసిన డా. కె. శ్రీనాథరెడ్డి భారత ప్రజారోగ్య సమాఖ్య అధినేత. వీరి తండ్రి రఘునాధరెడ్డి పశ్చిమ బెంగాల్ గవర్నరు. పి. వి. నరసింహారావు ప్రధానిగా వున్నప్పుడు శ్రీనాథరెడ్డి వ్యక్తిగత వైద్యులు. 2005లో పద్మభూషణ భూషితులు.
ఢిల్లీ IIT డైరక్టరుగా డా. వి.యన్. రాజు 2003 వరకు ఎందరో టెక్నోక్రాట్స్‌కు మార్గదర్శి. పదవీ విరమణానంతరం హైదరాబాదులో వి. యస్. రాజు కన్సల్టెంట్స్ అనే సంస్థ నడుపుతున్నారు. IIT ఢిల్లీ ఆంగ్ల విభాగాధిపతి డా, కల్లూరి శ్యామల ప్రముఖ రచయిత్రి.
నలుగురు కృష్ణమూర్తులు:
1990వ దశకంలో ఢిల్లీలో ప్రముఖ స్థానంలో నలుగురు కృష్ణమూర్తులున్నారు. ఎలక్షన్ కమీషనరు జి.వి.జి.కృష్ణమూర్తి (1934) అందరికంటే సీనియర్. న్యాయశాఖలో కార్యదర్శిగా, లా కమీషన్ సభ్యులుగా వుండి 1993లో ఎలక్షన్ కమీషనర్ అయ్యారు. చీరాల వారి స్వస్థలం. ఎన్నికల సంఘంలో కార్యదర్శి స్థాయిలో కె. జె. రావు, సి. ఆర్. బ్రహ్మంలు పని చేశారు.
మరో కృష్ణమూర్తి – సి. హెచ్. జి. కృష్ణమూర్తి (1931). ఆదాయపు పన్ను శాఖలో CBDT (Central Board of DIRECT TAXES) అత్యున్నత సంస్థ. చార్జర్డ్ అకౌంటెంట్ గా పని చేస్తూ ఆదాయపు పన్ను శాఖ ట్రిబ్యునల్ సభ్యులై 1985-94 మధ్య చైర్మన్‌గా ఎదిగారు. హైదరాబాదులో స్థిరపడ్డారు. బి. వి. కుమార్ అనే మరో తెలుగు వ్యక్తికి ఆ తర్వాత ఆ పదవి లభించింది.
మూడో కృష్ణమూర్తి పి. వి. నరసింహరావుకు మూడు దశాబ్దాలుగా ముఖ్యమంత్రి హోదా నుండి ప్రధాని హోదా వరకు వ్యక్తిగత కార్యదర్శిగా చక్రం తిప్పిన కృష్ణమూర్తి. చాకచక్యంతో యంత్రాంగాన్ని నడిపారు.
నాలుగో కృష్ణమూర్తి ఆంధ్రా అసోసియేషన్ సారధి. డా. వి. కృష్ణమూర్తి. 1994 డిసెంబరు నుండి దాని అధిపతి. డా. కె. జి. రావు ప్రధాన కార్యదర్శి. వేములపల్లి కృష్ణమూర్తి (1938) నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లయిడ్ ఎకనామిక్ రీసెర్చి సంస్థలో 1965-67 మధ్య ఆర్ధిక శాస్త్రవేత్త.
2000లో ఢిల్లీ ఆకాశవాణి స్టూడియోలో అప్పటి కేంద్ర సమాచార శాఖ మంత్రి శ్రీ ముఖ్తార్ అబ్బాస్ నక్వీ గారితో
మరో డి. కృష్ణారావు (1932) సెంట్రల్ ఇన్ఫర్మేషన్ సర్వీసు అధికారిగా 1992 నుండి రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు మీడియా సలహాదారు. వీరి సతీమణి డా. జె. భాగ్యలక్ష్మి ఇంగ్లీషు యోజన సంపాదకురాలు, రచయిత్రి. ఆమె సోదరి జోళపాళెం మంగమ్మ (1925) ఢిల్లీ నుండి తెలుగు వార్తలు చదివేవారు. మదనపల్లెలో విశ్రాంత జీవనం గడుపుతూ తుదిశ్వాస విడిచారు.
డా. ఏ. ఆర్. బాజి (1920) అత్యున్నత పదవి (ప్రిన్సిపాల్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరు) అధిష్ఠించిన పదహారణాల ఆంధ్రులు. సికింద్రాబాదులో జన్మించారు. అదే శాఖలో డిప్యూటీ ఇన్ఫర్మేషన్ అధికారిగా డా. వేమరాజు భానుమూర్తి (1923) సిక్కుల మత గ్రంథం గురుగ్రంథ్ సాహెబ్‌ను తెలుగులోకి అనువదించారు. వారి కుమారులు రాము శర్మ ప్రస్తుతం హన్స్ ఇండియా సంపాదకులు.
ఏడిద గోపాలరావు (1939) తెలుగు వార్తలు చదివేవారు. గాంధీగా నాటక ప్రదర్శనలిచ్చారు. దక్షిణభారత నటీనట సమాఖ్య కార్యదర్శి. రెండేళ్లు మాస్కో రేడియోలో తెలుగు వార్తలు చదివారు. శంకరాభరణ సినిమా నిర్మాత ఏడిద నాగేశ్వరరావు వీరి సోదరులు.
నమామి:
National Mission for Manuscripts అనే సంస్థను 2003 ఫిబ్రవరిలో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో స్థాపించారు. కోటి తాళపత్ర గ్రంథాలను సేకరించి భద్రపరచాలనే ధ్యేయంతో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ప్రారంభించారు. ఆ సంస్థ డైరక్టర్‌గా పరిశోధకులు డా. వి. వెంకటరమణారెడ్డి (తిరుపతి) రెండేళ్లు వ్యవహరించారు (2016-2018). ఆయన తిరుపతి లోని శ్రీవేంకటేశ్వర ప్రాచ్య పరిశోధనా సంస్థ డైరక్టరుగా వినుత్న కార్యక్రమాలు చేపట్టారు.
ఢిల్లీలోని నేషనల్ ఆర్కైవ్స్ (పురాతత్వ శాస్త్ర విభాగం) అధిపతిగా తెలుగువారైన ఇంగువ కార్తికేయ శర్మ (1988-91) మధ్య వ్యవహరించారు. అనంతరం సాలార్ జంగ్ మ్యూజియం డైరక్టరుగా (హైదరాబాదు) 1991-98 మధ్య విశేష కృషి చేశారు. నాగార్జున కొండ త్రవ్వకాలలో పరిశోధనలు చేసిన ఘనులు. ఈ శాఖలో పాడిబండ్ల మాధవశర్మ కుమార్తె పి. అరుంధతి పరిశోధకురాలు.
మరి కొందరు ఆత్మీయులు:
1997 – 2005 మధ్య పండారా రోడ్ క్వార్టర్స్ (ఢిల్లీలో) దాదాపు దశాబ్ది కాలం బస చేశాను. నాకు ముందు ఆ యింట్లో ప్రముఖ గాంధేయవాది నిర్మలా దేశ్‌పాండే బస చేశారు. అక్కడ ఎందరో కుటుంబ సమేతంగా మిత్రులయ్యారు. వారిలో – బచ్చు పార్థసారథి – పుష్ప దంపతులు సీనియర్లు. పార్థసారథి సుప్రింకోర్టు న్యాయవాది. వారి తండ్రి బచ్చు జగన్నాధ దాసు (1893-1968) సుప్రీంకోర్టు న్యాయమూర్తి.
మరో జంట రాచకొండ వరహాలరావు, వినోదిని దంపతులు. వీరి తండ్రి రాచకొండ జగన్నాధరావు (1909) నెహ్రూ. ఇందిరాగాంధీ ప్రభుత్వాలలో వివిధ శాఖల సహాయమంత్రి.
జి.వి.జి. కృష్ణమూర్తి, పద్మాకృష్ణమూర్తిలు మా కుటుంబంతో సన్నిహితంగా మెలిగారు. సాహితీ మిత్రులు గణేశ్వరరావు, శాంతసుందరి. ప్రభల జానకి – సుబ్బారావు దంపతులు, డా. ఏల్చూరి మురళీధర రావు దంపతులు దశాబ్ది కాలం పాటు మైత్రి బంధం కొనసాగించారు. పి.బి. శ్రీనివాస్ బంధువు డి. నాగమణి రామమనోహర్ లోహియా ఆసుపత్రిలో హృద్రోగ నిపుణులు. వారి ఆరోగ్య సలహా సంప్రదింపులు నా జీవన గమనాన్ని మెరుగు పరచాయి. ఇలా ఎందరెందరో. IAS అధికారులలో హోం శాఖ కార్యదర్శి కె. పద్మనాభయ్య, సత్యవతి, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి, పి. యల్. సంజీవ రెడ్డి, రమాదేవి, షిప్పింగ్ సెక్రటరీ ఏ.పి.వి.యన్. శర్మ దుర్గాశర్మ దంపతులు మా కుటుంబ సన్నిహితులు, మిత్రులు.
(మళ్ళీ కలుద్దాం)
డా. రేవూరు అనంతపద్మనాభరావు అష్టావధాని, విమర్శకులు, ప్రముఖ సాహితీవేత్త. తెలుగు సాహిత్యం లోని అన్ని ప్రక్రియలలోనూ రచనలను చేశారు. 80 ఏళ్ళ వయస్సులో నిరంతర అధ్యయన, అధ్యాపనాలు కొనసాగిస్తూ 120 గ్రంథాలు ప్రచురించారు. 2005 లో దూరదర్శన్, ఢిల్లీ నుండి అదనపు డైరక్టర్ జనరల్‍గా పదవీ విరమణ చేశారు. పదవీ విరమణాంతరం గత 20 సంవత్సరాలలో 80 గ్రంథాలు వివిధ ప్రక్రియలలో ప్రచురించారు.
అనువాద సాహిత్యంలో తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం (1993); కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం (2000), అప్పాజోశ్యుల – విష్ణుభొట్ల – కందాళై ఫౌండేషన్ వారి విశిష్ట సాహితీ పురస్కారం లభించాయి. వీరి రచనలపై వివిధ కోణాలలో 5 విశ్వవిద్యాలయాల నుండి ఆరుగురు ఎం.ఫిల్/పిహెచ్డి పరిశోధనా గ్రంథాలు సమర్పించి పట్టాలు పొందారు.
సంచికలో వీరు గత ఐదు సంవత్సరాలలో – ఆకాశవాణి పరిమళాలు, కావ్యపరిమళం, జ్ఞాపకాలు-వ్యాపకాలు, ఆచార్య దేవోభవ, అవధానం ఆంధ్రుల సొత్తు అనే ఐదు గ్రంథాలు సమర్పించారు.
