Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వందే మా ‘తరం’-33

[తరాలు మారుతున్నాయి. సమాజం వేగంగా పరుగులు తీస్తోంది. విశ్వగ్రామం అనే సిద్ధాంతం ప్రబలింది. 1947లో పుట్టి 80వ ఏట కాలిడిన ప్రముఖ రచయిత డా. రేవూరు అనంత పద్మనాభరావు మూడు తరాల ప్రముఖులతో కలిసి మెలిసి తిరిగారు. ఆ జ్ఞాపకాల పందిరిని ధారావాహికంగా అందిస్తున్నారు.]

మదరాసు ముచ్చట్లు:

1972 జూన్ 9. నేను మదరాసులో మా బంధువు వి.సి.రామయ్య ఇంట్లో దిగాను. న్యూస్ పేపరు చూస్తే ఆంధ్రపత్రిక ఎడిటర్ శివలెంక శంభుప్రసాద్ మరణ వార్త కనిపించింది. నా పరిశోధన (PhD) లో భాగంగా భారతి కార్యలయం వెళ్లాలని ఆలోచన. తర్వాత ఎప్పుడో వెళ్లాను. తంబుచెట్టి స్ట్రీట్‌లో ఆంధ్రపత్రిక కార్యలయం. శివలెంక రాధాకృష్ణను కలిశాను. ఆ స్నేహం హైదరాబాదు ఆఫీసుకు వారు తరలి వచ్చేవరకు కొనసాగింది. బషీర్‌బాగ్ కార్నర్‌లో ఆంధ్రపత్రిక వుండేది. భారతిలో నా వ్యాసం వచ్చింది. ఆంధ్రపత్రిక వారపత్రికలో నా కథ ‘విధి నిర్వహణ’ పబ్లిష్ అయంది. అప్పట్లో ఆంధ్రపత్రికలో వీరాజీ, నండూరి పార్థసారథి సబ్ ఎడిటర్లు. ఇద్దరూ ప్రతిభావంతులైన రచయితలు. భారతి మాసపత్రిక దురదృష్టవశాత్తు మూతపడింది. ఆంధ్రపత్రిక వారపత్రిక మానివేశారు. దినపత్రికల దాటికి తట్టుకోలేక ఆంధ్రపత్రిక మూసివేశారు. ఎందరో సంపాదకులు కష్టించి నడిపారు. మదరాసులో ఆంధ్రపత్రిక వీధిలోనే వావిళ్ల రామస్వామి శాస్త్రుల ప్రచురణా సంస్థ వుండేది. వారు నెల్లూరీయులు. ప్రస్తుతం వారి వారసులు స్వామినాథన్ ఆ సంస్థను హైదరాబాదు నుండి నడుపుతున్నారు.

మదరాసులో ధనికొండ హనుమంతరావు క్రాంతి ప్రెస్ 1970వ దశకంలో ప్రముఖ ప్రింటింగ్ ప్రెస్. నేను ‘రామాయణంలో స్త్రీ పాత్రలు’ పుస్తకాన్ని అక్కడే ప్రింటు చేయించాను. 1977లో నా థీసీస్ ‘కందుకూరి రుద్రకవి’ కూడా అక్కడే ముద్రించారు. హనుమంతరావు దగ్గర బంధువు ఏల్చూరి మురళీధరరావు నా పుస్తకం ప్రూఫ్‌లు చూసి నిర్దుష్టంగా తీర్చిదిద్దారు.

2015లో హైదరాబాద్ లో సాహిత్య అకాడమీ సమావేశంలో గొల్లపూడి, మామిడి హరికృష్ణ, ఎన్. గోపి, ఉదయ్ శంకర్, మహాలింగేశ్వర్ గార్లతో

మదరాసులో కేంద్ర సాహిత్య అకాడమీ రీజనల్ లెక్రటరీగా చల్లా రాధాకృష్ణ శర్మ వుండేవారు. ఆయన బహుభాషా కోవిదులు. ఆయన మధురై కామరాజ్ యూనివర్శిటీ తెలుగు ఫ్రొఫెసర్‌గా వెళ్లారు. మధురైలో పని చేస్తున్న మా గురువుర్యులు తిమ్మావజ్ఝల కొదండరామయ్య హఠాన్మరణంతో ఏర్పడ్డ ఖాళీలో రాధాకృష్ణ శర్మ చోటు సంపాదించారు. సాహిత్య అకాడమీ మదరాసు రీజనల్ సెక్రటరీ పోస్టు 1981లో అడ్వర్టయిజ్ చేశారు. ఆకాశవాణి కడపలో ప్రొడ్యూసర్‌గా వున్న నేను అప్లయి చేశాను. అది నాకు డబుల్ ప్రమోషన్ అవుతుంది.

1982 ఆగస్టులో మదరాసులో అకాడమీ ఆఫీసులో నన్ను ఇంటర్వ్యూ చేశారు. అకాడమీ అధ్యక్షులు ప్రొ. ఉమాశంకర్ జోషీ, ఉపాధ్యక్షులు వి.కె. గోకక్, కె.ఆర్. శ్రీనివాస అయ్యంగార్‌లు నన్ను 45 నిముషాలు ఇంటర్య్వూ చేశారు. 24 మంది అభ్యర్ధులు వచ్చారు. ఆ సాయంకాలం ట్రిప్లికేన్‌లో పార్థసారథి కోవెలకు వెళ్లాను. ఆ వీధిలో శ్రీనివాస అయ్యంగార్ ఇల్లు. మర్యాదపూర్వకంగా కలిశాను. మిమ్మల్ని సెలక్టు చేశామన్నారు. అక్టోబర్‌లో నాకు ఆకాశవాణిలో అసిస్టెంట్ డైరక్టర్ సెలక్షన్ వచ్చింది. అకాడమీ సెక్రటరీ స్కేలు కంటే తక్కువయినా ఆకాశవాణిలోనే ఉండిపాయాను.

కందుకూరి రుద్రకవిపై పి.హెచ్.డి పరిశోధనలో భాగంగా మదరాసులో ఆరుద్రగారిని యింటి వద్ద కలిశాను (1974). అప్పటికి ఆయన సమగ్ర ఆంధ్రసాహిత్య చరిత్ర సంపుటాలు వెలువడ్డాయి. 1970లో కందుకూరు కళాశాలలో నేను అధ్యాపకుడిగా వున్న సమయంలో వి.ఏ.కె.రంగారావు, ఆరుద్ర ఒక సభకు వచ్చారు. రుద్రకవి జనార్దనాష్టక గ్రంథావిష్కరణ జరిగింది. రంగారావు నృత్యం చేసి అష్టక పద్యాలను భావ ప్రకటనతో జనార్దన స్వామి ఆలయంలో ప్రదర్శించారు. కందుకూరు కళాశాలకు దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారలను కావలి జవహర భారతి రెక్టార్ డి.ఆర్.రెడ్డి తీసుకొచ్చారు. ఆ పరిచయంలో మదరాసులో వారి యింటిలో కృష్ణశాస్త్రిని కలిశాను. అప్పటికాయన గొంతు మూగపోయింది. ‘అందమైన కంద పద్యం పద్మనాభరావు’ అని కాగితం మీద వ్రాసి నా చేతికిచ్చారు దేవులపల్లి. వి.ఎ.కె.రంగారావు నేను ఢిల్లీ దూరదర్శన్‌లో వుండగా రెండు మార్లు వచ్చి తమ సేకరణలో వున్న గ్రామఫోను రికార్టుల ప్రస్తావన తెచ్చారు. కార్వేటినగర వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో నృత్య ప్రదర్శన ఆయన అద్భుతంగా చేశారు.

ఆరుద్ర, శ్రీశ్రీలతో విజయవాడ, కడపలలో ఆకాశవాణి ఉగాది కవిసమ్మేళనాలు చేశాను. తిరుపతి భాషా బ్రహ్మోత్సవాలలో శ్రీశ్రీ సతీమణి సరోజ పాల్గొన్నారు. రామలక్ష్మి హైదరాబాదు సభలలో మాట్లాడారు. మదరాసులో సంగీత సాహిత్య సంపన్నులు డా. పప్పు వేణుగోపాలరావు, నేను అనేక సభలలో కలసి ప్రసంగించాము. అలానే USIS ఆఫీసులో అమెరికన్ రిపోర్టరు సంపాదకులుగా పని చేసిన బి.యస్.ఆర్ కృష్ణను 2004 కలిశాను. ఆయన వరల్డ్ తెలుగు ఫెడరేషన్ ఉత్సవాలలో నాకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. 2004 డిసెంబరులో బెంగుళూరు వైట్ ఫీల్డ్‌లో జరిగిన సభలలో ఇందిరాదత్ ఆధ్వర్యంలో సత్కారం జరిగింది.

మదరాసులో యన్.చందూర్, మాలతీ చందూర్ దంపతులు ప్రసిద్ధులు. బెజవాడ గోపాలరెడ్డి మదరాసులో చెట్టినాడు హవుస్‌లో బస చేసేవారు. ఒక సాయం సమయాన చందూర్ దంపతులు మేడపై సాహిత్య గోష్ఠిలో పాల్గొనేవారు. రేడియోతో అనుబంధమున్న మాలతీ చందూర్ అభిమానంగా నాతో మాట్లాడేవారు. తిరుపతిలో SVBC కార్యక్రమాలు చేస్తున్నాప్పుడు మదరాసు వెళ్లి మాలతీ చందూర్ ఇంటర్వ్యూ గంటకు పైగా రికార్డు చేశాము. అక్కడికి విచ్చేసిన ఘంటసాల సతీమణి సావిత్రిని కూడా రికార్డు చేశాము. ఘంటసాల అనగానే గుర్తు కొచ్చే వ్యక్తి యస్పీ బాలసుబ్రమణ్యం – మా నెల్లూరీయుడు. 2004లో మా నాన్నగారి పేర అనంత లక్ష్మికాంత సాహితీ పీఠం పక్షాన నెల్లూరు టౌన్ హాల్లో బాలుకు స్వర్ణ కంకణ పురస్కారం ప్రదానం చేశాము. ఆయన వినయ సంపన్నుడు. ఆ సభకు గొల్లపూడి మారుతీరావు సభాధ్యక్షులు.

2022 ఆగస్టులో హైదరాబాదులో సేవాపురస్కారం స్వీకరిస్తున్న సందర్భంలో సుద్దాల అశోక్ తేజ, మౌనశ్రీ మల్లిక్ తదితరులతో

‘మా బావ’ గొల్లపూడి:

గొల్లపూడి మారుతీరావు, నేను కడప ఆకాశవాణిలో 1980, 81 సంవత్సరాలలో కలసి పని చేశాం. ఆయన, నేను ‘ఆడది’ నాటకంలో వేషాలు వేసి కడపలో ప్రదర్శించాము. రేడియోలో ‘బావగారి కబుర్లు’ సంవత్సర కాలం చేశాము. అప్పటి నుండి నన్ను ‘బావగారూ!’ అని పిలిచేవారు. 1981లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వెలువడ్డ ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమా నిర్మాణం జరుగుతున్న రోజులవి. రామకృష్ణ ఆకాశవాణికి వచ్చి మారుతీరావుతో చర్చలు జరిపేవారు. ఆ సినిమా రిలీజ్ అయిన తొలిరోజు మేమిద్దరం కలిసి చూశాం.

S.V.B.C. లోగో

2007-10 మధ్య తిరుపతి దేవస్థానం వారి SVBC ప్రారంభదశలో శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ లోగో నిర్మాణం ‘బాపు’ చేత చేయిద్దామని కె.వి.రమణాచారి సంకల్పించారు. ఆ కార్యభారం నాపై వేశారు. నేను మదరాసులో వారి యింటికి వెళ్లగానే కలసిన వ్యక్తి ముళ్లపూడి వెంకటరమణ. వారు గతంలో వెంగమాంబ సీరియల్ డిస్కషన్ కోసం తిరుపతి వచ్చినపుడు వారికి వి.ఐ.పి దర్శనం దగ్గరుండి చేయించాను. బాపు ఆనందంగా వారం రోజుల్లో లోగో చిత్రించి పంపారు. స్వామికి కానుకగా సమర్పించారు. బాపు, బాలు దుబాయిలో ఆంధ్ర సంఘంవారు ఏర్పాటు చేసిన సన్మాన సభలో నాకూ సత్కారం జరిగింది. బాపు సోదరులు శంకరనారాయణ ఆకాశవాణిలో మా సహచరులు. గొప్ప చిత్రకారులు.

ఆకాశవాణి మదరాసు కేంద్రంతో నా అనుబంధం చిరస్మరణీయం. నేను హైదరాబాదు రీజనల్ ట్రెయినింగ్ సెంటర్ అధిపతిగా వున్న సమయంలో మదరాసు, తిరుచి, కోయంబత్తూరులలో 1987-90 మధ్య వర్క్‌షాపులు జరిపాను. మదరాసు డైరక్టర్ గా జి.సుబ్రమణ్యం మాకు సీనియరు. మదరాసు, త్రివేండ్రం, ఢిల్లీ కేంద్రాలు – మూడు రాజధాని కేంద్రాల డైరక్టర్‌గా 1997-2000 మధ్య నేను వారి స్థానంలో ఢిల్లీ డైరక్టర్‍గా వ్యవహరించాను.

2022 లో నన్నయ సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలుగు విశ్వవిద్యాలయంలో బ్రహ్మానందం గారు, మాశర్మగారితో

తిరుచి ఆకాశవాణి డైరక్టరుగా మిత్రులు యస్. వేణుగోపాల రెడ్డి ప్రసార మాధ్యమాల నాడి తెలిసిన వ్యక్తి. మదరాసులో తెలుగు ప్రసారాలకు ఊపునిచ్చారు. బొంబాయి కేంద్ర డైరక్టరుగా రిటైరయ్యారు. శ్రీకాళహస్తి వాసి. మదరాసు వాణిజ్య ప్రసార కేంద్రం డైరక్టరుగా తెలుగువారైన చంద్రమౌళి పని చేశారు. మదరాసు కేద్రంలో పలువురు తెలుగువారు కార్యక్రమ నిర్వహణ చేశారు. వారిలో యస్.లీల, కె.కలివేలు, నండూరి పద్మజానిర్మల, నాగసూరి వేణుగోపాల్, లలిత ప్రముఖులు. మదరాసు దూరదర్శన్ డైరక్టర్ సి.గురునాథ్ తర్వాత బి.బి.సి.లో చేరారు. సినీ నిర్మాత యం.యస్. శ్రీరామ్ అక్కడ పని చేస్తూ హఠాన్మరణం చెందారు. కడపలో మాతో పని చేశారు. పెళ్లి రోజు సినీ నిర్మాత – సంగీత దర్శకులు.

సినీ ప్రముఖులు:

1970 దశకంలో సినీరంగం మదరాసులో విలసిల్లింది. అప్పట్లో మా బంధువు రామయ్య చొరవతో నాగభూషణం, జమున నటిస్తున్న ఒక సినిమా ఘాటింగుకు వాహినీ స్టూడియో వెళ్లాము. ఇద్దరిదీ అద్భత నటన. 1973లో నాగభూషణం, నేను కావలిలో ఒక సభలో మాట్లాడాము. కడపలో రక్త కన్నీరు నాటిక ప్రదర్శిన హైలైట్. జమునను కడప కేంద్రంలో ఇంటర్వ్యూ చేశాను. పుట్టపర్తిలో 1992లో బాబా జన్మదిన సభకు ఆమె వచ్చారు. కార్ పార్కింగ్ ఇబ్బంది వల్ల మా ఆకాశవాణి ఆనంతపురం కారులో ఆమె ప్రయాణించారు. మా డ్రైవర్ ఉప్పొంగిపోయాడు. నాటక అకాడమీ అధిపతిగా ఆమె నేను ప్రచురించిన ‘సుగ్రీవ విజయ’ యక్షగానం ఆవిష్కరించారు.

పి. బి. శ్రీనివాస్‌ను విజయవాడలో ఇంటర్వ్యూ చేశాం. 1995 డిసెంబరు 1న విజయవాడ ఆకాశవాణి వార్షికోత్సవానికి కొంగర జగ్గయ్య ముఖ్య అతిథి. అదొక చిరస్మరణీయ ఘట్టం. పి. సుశీల, కోట శ్రీనివాసరావు, జంధ్యాల, భానుమతి, బ్రహ్మానందం, సాక్షి రంగారావు ప్రభృతులు విజయవాడ కేంద్రంలో రికార్డు చేశారు. చంద్రమోహన్, నేను కరవదిలో మా బాబాయి ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించాం.

విద్యలకు నెలవు విశ్వవిద్యలయం:

మదరాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అత్యంత ప్రాచీనం. అక్కడ నాకు సుపరిచితులు ఆచార్య పదవులధిష్ఠించారు. 1965-67 మధ్య నేను తిరుపతి వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎం.ఏ తెలుగు చేశాను. అప్పుడు అక్కడ పరిశోధక విద్యార్ధులు యస్. అక్కిరెడ్డి, యల్.బి. శంకరరావు, వి. రామచంద్ర – వీరు ముగ్గురు మదరాసులో వివిధ పదవు లధిష్ఠించారు. మా సహాధ్యాయులు టి. ఉపారాణి, సి. మనోజ మదారాసులో వివిధ కళాశాలలో అధ్యాపకులుగా రిటైరయ్యారు.

మదరాసు విశ్వవిద్యాలవయ తెలుగు శాఖకు భీష్ములు జి.యస్.ఆర్. కృష్ణమూర్తి. వారి తర్వాత మాడభూషి సంపత్ కుమార్ ఆచార్య పదవీ కాలంలో సెమినార్లు విశేషంగా జరిపారు. తాళపత్ర సేకరణ సదస్సులో నేను పాల్గొన్నాను. ఆయన తర్వాత విస్తాలి శంకరరావు ఆ పదవిలో ఉన్నారు.

అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ ఇ. ఎల్. నరసింహన్ గారితో

మదరాసు తెలుగు అకాడమీ స్థాపకులు టి.వి.కె.శాస్త్రి. ఆయన గొప్ప ఆర్గనైజరు. ఏటా సంగీత సభలు, సత్కారాలు దేశవ్యాప్తంగా చేశారు. ఆ సంస్థకు నన్ను గౌరవ ఉపాధ్యక్షులుగా నియమించారు. అక్కినేని నాగేశ్వరరావు ఆయన ప్రతి సభలోను పాల్గొన్నారు. 2003లో నన్ను సత్కరించారు. నిప్పో ఓబుల్ రెడ్డి ఆ సంస్థ పోషకులు.

మదరాసు రాష్ట్రంలోని కంచి కామకోటి పీఠం వారు 2008 సంవత్సరం ఆస్థాన విద్వాంసులుగా నన్ను శ్రీశ్రీ జయేంద్ర సరస్వతీ స్వాముల వారిచే సత్కరించారు. మిత్రులు టి.వి.రాఘవాచారి స్వామివారి ప్రియ శిష్యులు. ప్రస్తుత ఫీఠాధిపతి విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు నాపై అపారనుగ్రహం వర్షిస్తారు. నాగర్ కోయిల్‌లో నేను ఆకాశవాణి అధిపతులకు ఢిల్లీ శిక్షణాకేంద్రం అధికారిగా శిక్షణనిచ్చాను.

సాహితీ సభ నిర్వాహకులు గుడిమెట్ల చెన్నయ్య, హోసూరు ఆంధ్ర సంఘం అధిపతి రామస్వామి రెడ్డి ఉత్సాహంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రమేష్ ఇక్కడి ఎం.ఎల్.ఏ. మధురై కామరాజ్ విశ్వవిద్యాలయ ఆచార్యులు తిమ్మావజ్ఝల కోదండరామయ్య, చల్లా రాధాకృష్ణశర్మ బహుభాషా పండితులు. జయ ప్రకాష్ జవసత్వాలు పోషించిన ఆచార్యులు.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version