[తరాలు మారుతున్నాయి. సమాజం వేగంగా పరుగులు తీస్తోంది. విశ్వగ్రామం అనే సిద్ధాంతం ప్రబలింది. 1947లో పుట్టి 80వ ఏట కాలిడిన ప్రముఖ రచయిత డా. రేవూరు అనంత పద్మనాభరావు మూడు తరాల ప్రముఖులతో కలిసి మెలిసి తిరిగారు. ఆ జ్ఞాపకాల పందిరిని ధారావాహికంగా అందిస్తున్నారు.]
కన్నడ కస్తూరి:
కర్ణాటక రాష్ట్రంతోను నా అనుబంధం విశిష్టం. కర్ణాటక గవర్నర్లు పెండేకంటి వెంకట సుబ్బయ్య, వి.యస్.రమాదేవిలు నన్ను అభిమానించేవారు. పెండేకంటికి నా గ్రంథం ‘రామాయణంలో స్త్రీ పాత్రలు’ అంకితం చేశాను. రమాదేవి తొలి రోజుల్లో ఆకాశవాణిలో పని చేయడం వల్ల ఆ మధుర జ్ఞాపకాలు పంచుకొనేవారు. 1976 జనవరి 26 రిపబ్లిక్ దినోత్సవ సందర్భంగా బెంగుళూరు సాహితీ సమితివారు ఏర్పాటు చేసిన సభలో నేను అష్టావధానం చేశాను. హైకోర్టు రిజిష్ట్రారు కృష్ణమూర్తి సభాధ్యాక్షులు. శతావధాని నరాల రామరెడ్డి ముఖ్య అతిథి. ఆకాశవాణి డైరక్టరు రజనీకాంతరావు ఆ కార్యక్రమం రికార్డు చేసి ప్రసారం చేశారు.
వ్యక్తిగతంగా మా అల్లుడు బళ్లారివాడు. మా వియ్యంకులు గోపాల కృష్ణమూర్తి బళ్లారి వీరశైవ కాలేజి మాధమటిక్స్ లెక్చరర్‌గా ప్రిసిద్ధులు. ఆయన శిష్యులు దరువూరి పుల్లయ్య యం.పి.గా గెలిచారు. మరో శిష్యుడు అనంతపురం MLA బి. నారాయణరెడ్డి. మా అమ్మాయి శైలజ బళ్లారి బెస్ట్ స్కూలు ప్రిన్సిపాల్‌గా పని చేసి ‘బెస్ట్’ ప్రిన్సిపాల్ అనిపించుకొంది.
మా అబ్బాయిలు రమేష్ చంద్ర, జనార్దన్‌లు 1996లో బి.టెక్ పూర్తి చేసి బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలలో చేరి 30 ఏళ్లుగా అమెరికా సాఫ్ట్‌వేర్ కంపెనీల ఛత్రచ్ఛాయలలో అత్యున్నత పదవులలో బెంగుళూరులో స్థిరపడ్డారు.
2018లో గుంటూరులో కుర్తాళం పీఠాధిపతి శ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వాముల వారి అవార్డు స్వీకరిస్తున్న సందర్భం
బెంగుళూరు యూనివర్శిటీ తెలుగు శాఖ:
తెలుగు శాఖ రూపశిల్పి తంగిరాల వెంకట సుబ్బారావు. 1965-67 మధ్య నేను తిరుపతిలో తెలుగు ఎం.ఏ. చేస్తున్న రోజుల్లో ఆయన పరిశోధక విద్యార్ధి. బెంగుళూరులో సాహితీ సంస్థను నెలకొల్పి మూడు దశాబ్దాలు సాహిత్య సమావేశాలు నిర్వహించారు. రెండు, మూడు సభలలో నేనూ పాల్గొన్నాను. ఒక సభలో ‘పఠాభి’ (తిక్కవరపు పట్టాభిరామిరెడ్డి) తన కవితలు వినిపించారు. ఫిడేలు రాగాల డజన్ రచయిత ఆయన. నెల్లూరీయుడు. బెజవాడ గోపాలరెడ్డి బావమరిది. పఠాబి భార్య స్నేహలతారెడ్డి ఎమర్జన్సీ రోజుల్లో జైలులో నిర్బంధించబడి అనారోగ్యంతో మృతి చెందారు. యూనివర్శిటీ తెలుగు శాఖలో ఆచార్యులుగా మూడు దశాబ్దాలు పని చేసి ఎందరో పరిశోధకులను తీర్చిదిద్దిన మరోకరు కొలకలూరి ఆశాజ్యోతి (ఇనాక్ కుమార్తె). 2025 ఆగస్టులో రిటైరయ్యారు. తెలుగు – కన్నడ భాషల తులనాత్మక పరిశోధనలపై దృష్టి పెట్టి ఎన్నో సెమినార్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించారు.
2004 డిసెంబరులో వరల్డ్ తెలుగు ఫెడరేషన్ సభలు బెంగుళూరులో ఇందిరాదత్ సారథ్యంలో ఘనంగా జరిగాయి. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌తో బాటు నేనూ సత్కారం పొందాను. బెంగుళూరు సాహిత్య కేతనం ఎగురవేసిన ప్రముఖులు ఏ.యన్. రాధాకృష్ణంరాజు. దశాబ్దాలుగా తెలుగువారి సాంస్కృతిక వారసత్వాన్ని పోషించారు. నెల్లూరీయుడైన జి.యన్.రెడ్డి సాహిత్య పోషకులు. సాహిత్య అకాడమీ ప్రాంతీయ కార్యలయాన్ని మదరాసు నుండి 1990 తర్వాత బెంగుళూరుకు మార్చారు. ప్రాంతీయ కార్యదర్శిగా ఆకాశవాణికి చెందిన అగ్రహార కృష్ణమూర్తి పని చేశారు. పదోన్నతిపై కార్యదర్శిగా ఢిల్లీలో రిటైరయ్యారు. నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రాంతీయ కార్యలయాధికారి బాలసాహిత్య అవార్డు గ్రహీత మోహన్ కొన్ని సంవత్సరాలుగా ఇతోధిక కృషి చేస్తున్నారు.
తిరుపతిలో భువనవిజయ అష్టదిగ్గజ కవులు పురవీధులలో
ప్రసారభారతి:
కర్ణాటకలో ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాలు సంగీత సాహిత్య రంగాలకు వెన్నెముకగా నిలిచాయి. 1976లో బెంగుళూరు ఆకాశవాణి కేంద్ర డైరక్టరుగా భీష్మపితామహుల వంటి బాలాంత్రపు రజీనీకాంతరావు పని చేశారు. తర్వాతి కాలంలో టి.ఆర్.రెడ్డి ప్రముఖులు. నేను కడప ఆకాశవాణిలో తొలిసారి 1975 ఆగస్టులో చేరినపుడు ఆయన మా డైరక్టరు. మదనపల్లెకు చెందినవారు. బెంగుళూరు కేంద్ర డైరక్టర్లలో హెచ్.ఆర్.కృష్ణమూర్తి సైన్స్ ఆఫీసరుగా ఆకాశవాణిలో చేరారు.
బెంగుళూరు ఆకాశవాణి మార్కెటింగ్ విభాగంలో ప్రతిభా సంపన్నురాలైన డా. డి. పద్మావతి ఒక దశాబ్ది పని చేసి వాణిజ్య విభాగం ఆదాయం పెంచారు. ఆమె హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీలో సి.ఆనందారామం వద్ద పి.హెచ్.డి. చేసిన విదుషీమణి. ఆమె భర్త శర్మ ప్రముఖ జ్యోతిష్కులు. సహాయశీలి.
ఆకాశవాణి ఢిల్లీ కేంద్రంలో సంగీత విభాగం డైరర్టరుగా పేరు తెచ్చుకొన్న యన్.యస్.కృష్ణమూర్తి పరిపాలనాధికారిగా ప్రముఖులు. వారి తర్వాత తెలుగువారైన బి.రామన్న పంతులు ఆ విభాగాధిపతి. హైదరాబాదులో స్థిరపడ్డారు. సంగీత విభాగాధిపతులుగా ఈమని శంకరశాస్త్రి ప్రాతఃస్మరీణీయులు. తెలుగువారైన ప్రపంచం సీతారామ్ ప్రసిద్ధ వేణుగానలోలురు. ఆ విభాగంలో కె.వాగీష్ చిరకాలం సంగీతజ్ఞలకు ప్రోత్సాహం కలిగించారు. బెంగుళూరులో స్థిరపడ్డారు. రేడియో వాణిజ్య విభాగంలో పని చేసిన సిరహట్టి పబ్లిక్ రిలేషన్స్‌లో ఘనుడు. గుల్బర్గాలో నేను సైన్స్ వర్క్‌షాప్ నిర్వహించినపుడు దిగ్విజయం చేశాడు.
కర్ణాటకలోని గుల్బర్గాలో బాపు సోదరులు శంకర్ నారాయణ డైరక్టరు. ఆ తర్వాత జి.కె.కులకర్ణి. లోగడ ఆయన విజయవాడ డైరక్టరు. మడికెర ఆకాశవాణి డైరక్టురుగా తక్కోలు మాచిరెడ్డి పని చేశారు.
దూరదర్శన్, బెంగుళూరు డైరక్టరుగా మిత్రులు ఆర్.వెంకటేశ్వర్లు సత్సంప్రదాయాలు నెలకొల్పారు. 1988లో యు.పి.యస్.సి ద్వారా నేరుగా స్టేషన్ డైరక్టరుగా ఎంపికయ్యారు. తిరునెల్వేలి ఆకాశవాణి డైరక్టర్‌గా తొలి పోస్టింగ్. హైదరాబాదు దూరదర్శన్‌లో పదేళ్లు పని చేశారు. ఆకాశవాణి డైరక్టర్ జనరల్‌గా పని చేసిన తొలి తెలుగు వ్యక్తి.
ఆకాశవాణి ఆడియన్స్ రీసెర్చి విభాగం డైరక్టరుగా ఢిల్లీలో వినూత్న పరిశోధనలు కొనసాగించిన ఏ.యస్.చంద్రమౌళి బెంగుళూరులో స్థిరపడ్డారు. కర్ణాటకలో అధిక సంఖ్యలో రేడియో కేంద్రాలున్నాయి.
2018లో శ్రీ రావి కొండలరావు గారితో రచయిత
మైసూరు ప్రాంతీయ భాషాకేంద్రం:
Central Institute of Indian language అనే ఒక పురాతన సంస్థ మైసూరులో దశాబ్దాలుగా పని చేస్తోంది. తెలుగు విభాగంలో ప్రభాకర్ గణనీయ కృషి చేశారు. 2001లో తెలుగువారైన డి.వి.రావు డైరక్టరు. తెలుగు ప్రాచీన భాష హోదా కల్పించిన తర్వాత డైరక్టర్‌ని నియమించారు. అప్పటి ఉపరాష్ట్రపతి శ్రీయం. వెంకయ్య నాయుడు చొరవతో ఆ సంస్థని నెల్లూరులో స్థాపించారు. మునిరత్నం నాయుడు మూడేళ్లు డైరక్టరు. తర్వాత మాడభూషి సంపత్‌కుమార డైరక్టర్.
మైసూరులో బి.ఇడి.కళాశాల ప్రాచీనం. అక్కడి తెలుగు శాఖ ఆచార్యులు – పవని. ఆర్.హరనాథ్. ఆయన ప్రతిభావంతుడైన పండితుడు. మంగళూరు ఆకాశవాణి కేంద్రంలో బి.ఆర్. చలపతి రావు డైరక్టరు (1984).
దత్తపీఠం:
మైసూరు అనగానే స్ఫరణకు వచ్చేది దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వాములవారు. ప్రొద్దుటూరులో జీవనం ప్రారంభించిన వారు అనంతపురానికి చెందినవారు. దేశవిదేశాలలో అనేక సంస్థలను ఏర్పరచారు. రాగాల ద్వారా రోగనివారణ చేయగలనని నిరూపించారు. వీరి సంస్థలో విద్యాధికారి కుప్పా వెంకటకృష్ణమూర్తి. మైసూరులో దత్తపీఠం వారు దసరా ఉత్సవాలు ఘనంగా జరుపుతారు. స్వామివారికి విదేశాలలో ఎందరో శిష్యులున్నారు. అనంతపురం, విజయవాడ కేంద్రాలలో వారిని రికార్డు చేశాను. వారు మైసూరులో శుకవనం స్థాపించి వందలాది చిలుకలను పోషిస్తున్నారు. మైసూరు విశ్వవిద్యలయ తెలుగు శాఖ ఆచార్యులు ఆర్.వి.యస్.సుందరం, జి.యస్.మోహన్ బహుభాషా పండితులు. ప్రాచీనులలో సుబ్బరామప్ప ప్రాతఃస్మరణీయులు.
2018లో గ్రంథావిష్కరణ సభలో శ్రీ బ్రహ్మానందం, తదితరులతో
తిరువనంతపురంలో అనంత పద్మనాభస్వామి:
తిరువాన్కూరు మహారాజవంశం వారు శతాబ్దాలుగా పోషించిన అనంతపద్మనాభ స్వామి ఆలయం ప్రపంచంలోనే అతి సంపన్న ఆలయం. ఆ స్వామి పేరే నాకు పెట్టారు మా తల్లిదండ్రులు. ఏటా భాద్రపద శుక్ల చతుర్దశి నాడు అనంత పద్మనాభ స్వామి వ్రతం 50 ఏళ్లుగా నిర్వహిస్తున్నాం. విశాల ప్రాంగణంలోని ఆ శయనమూర్తి శిరస్సు, నాభి, పాదాల వద్ద మూడు ద్వారాలలో దర్శించాలి. తొలి పూజ రాజవంశీకులే నిర్వహిస్తారు రోజూ.
త్రివేండ్రం ఆకాశవాణి అతి ప్రాచీనం. మలయాళ భాషా సాహిత్య ప్రాచుర్యానికి దోహదం చేసింది. తమిళులైన జి.సుబ్రమణ్యం అక్కడ డైరక్టరుగా వుండగా నేనొక వర్కషాపు నిర్వహించాను. దక్షిణ ప్రాంత ఆకాశవాణి కార్యక్రమ నిర్వహాకులు 15 మంది పాల్గొన్నారు.
హైదరాబాదులో నాతో బాటు అసిస్టెంట్ డైరక్టరుగా పని చేసిన యం.కె.శివశింకరన్ కాలికట్‌కు బదిలీ అయ్యారు. తర్వాత త్రివేండ్రం అధిపతి. ఢిల్లీలో నా సహచరుడు. వి.జి. మాథ్యూ త్రివేండ్రం దూరదర్శన్ అధిపతి. ఆకాశవాణి డైరక్టరుగా ఇటీవలి కాలంలో పని చేసిన ఆర్. సి. గోపాల్ నా వద్ద శిక్షణ పొందారు.
నేను ప్రాంతీయ శిక్షణా కేంద్రం హైదరాబాదులో 1985—87 మధ్య, ఢిల్లీలో జాతీయ శిక్షణా కేంద్రంలో 1987—90 మధ్య వివిధ హోదాలలో పని చేశాను. అందువల్ల దేశమంతటా ఉన్నత స్థానాలలో వున్న రేడియో, దూరదర్శన్ అధికారులు నన్ను ద్రోణాచార్యునిగా భావించేవారు.
తరాలు మారుతున్నాయి.
అంతరాలు పెరుగుతున్నాయి.
తరాల అంతరాలలో విలువలు తరుగుతున్నాయి.
ప్రమాణాలు పలచబడుతున్నాయి.
అన్ని రంగాలలో ‘ఆ తరం – ఈ తరం’ అని బేరీజు వేసుకునే రోజులు వచ్చాయి. ‘గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్’ అని ఆనాటి కవి పేర్కొన్నట్లు పాత రోజులు స్మరించుకొంటే అదొక అనుభూతి. మధుర స్మృతి.
(మళ్ళీ కలుద్దాం)
డా. రేవూరు అనంతపద్మనాభరావు అష్టావధాని, విమర్శకులు, ప్రముఖ సాహితీవేత్త. తెలుగు సాహిత్యం లోని అన్ని ప్రక్రియలలోనూ రచనలను చేశారు. 80 ఏళ్ళ వయస్సులో నిరంతర అధ్యయన, అధ్యాపనాలు కొనసాగిస్తూ 120 గ్రంథాలు ప్రచురించారు. 2005 లో దూరదర్శన్, ఢిల్లీ నుండి అదనపు డైరక్టర్ జనరల్‌గా పదవీ విరమణ చేశారు. పదవీ విరమణాంతరం గత 20 సంవత్సరాలలో 80 గ్రంథాలు వివిధ ప్రక్రియలలో ప్రచురించారు.
అనువాద సాహిత్యంలో తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం (1993); కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం (2000), అప్పాజోశ్యుల – విష్ణుభొట్ల – కందాళై ఫౌండేషన్ వారి విశిష్ట సాహితీ పురస్కారం లభించాయి. వీరి రచనలపై వివిధ కోణాలలో 5 విశ్వవిద్యాలయాల నుండి ఆరుగురు ఎం.ఫిల్/పిహెచ్డి పరిశోధనా గ్రంథాలు సమర్పించి పట్టాలు పొందారు.
సంచికలో వీరు గత ఐదు సంవత్సరాలలో – ఆకాశవాణి పరిమళాలు, కావ్యపరిమళం, జ్ఞాపకాలు-వ్యాపకాలు, ఆచార్య దేవోభవ, అవధానం ఆంధ్రుల సొత్తు అనే ఐదు గ్రంథాలు సమర్పించారు.
