[తరాలు మారుతున్నాయి. సమాజం వేగంగా పరుగులు తీస్తోంది. విశ్వగ్రామం అనే సిద్ధాంతం ప్రబలింది. 1947లో పుట్టి 80వ ఏట కాలిడిన ప్రముఖ రచయిత డా. రేవూరు అనంత పద్మనాభరావు మూడు తరాల ప్రముఖులతో కలిసి మెలిసి తిరిగారు. ఆ జ్ఞాపకాల పందిరిని ధారావాహికంగా అందిస్తున్నారు.]
పాత్రికేయ ప్రముఖులు:
పత్రికలతోనూ, ప్రసారమాధ్యమాలతోను నా పరిచయం 60 ఏళ్ల పైబడినది. 16వ ఏట 1964లోనే నా కవిత నెల్లూరు నుండి వెలువడే జమీన్ రైతు వార పత్రికలో ప్రచురించారు. నా సాహితీ షష్టిపూర్తి కాలంలో ఆంధ్రదేశంలోని దిన, వార, మాస పత్రికలలో అన్నింటిలో వ్యాసం, కవిత, కథానిక, సమిక్ష, ఇంటర్వ్యూలు వచ్చాయని సవినయంగా మనవి.
ఆ రోజుల్లో ఆంధ్రపత్రిక దిన వార పత్రికలు, భారతి మాస పత్రికలు మదరాసు నుండి వెలువడేవి. దిన పత్రికలో వ్యాసాలు, వార పత్రికలలో కథానిక, భారతిలో విమర్శనా వ్యాసము 1965-70ల మధ్య వచ్చాయి. ఆంధ్ర ప్రభ దిన వార పత్రికలు నా కవితలు, కధానికలు ప్రచురించాయి. ఆంధ్రజ్యోతి దిన వార పత్రికలు ప్రాచుర్యం కల్పించాయి, ఈనాడు సంపాదకేయ పేజీలో వ్యాసాలు వ్రాశాను. సాక్షి పత్రిక నన్ను ఇంటర్వ్యూ చేసింది.
1984 ప్రాంతాలలో పన్యాల రంగనాధరావు సంపాదకులుగా సమయం దిన పత్రిక కొద్ది సంవత్సరాలే నడిచింది. అందులో ధారావాహికంగా గల్పికలు (వ్యాసం) ప్రచురించాను. విశాలాంధ్ర రాఘవాచారి సంపాదకత్వంలో పలు వ్యాసాలు వచ్చాయి. వీటికన్నింటికంటే కాకినాడ నుండి వెలువడిన త్రైమాసిక సాహిత్య పత్రిక ‘ఆంధ్ర సాహిత్య పరిషత్’ పత్రికలో 1966 లోనే (నా వయస్సు 19 సంవత్సరాలు) సుధీర్ఘ వ్యాసం – ‘ఉత్తర రామాయణం – తిక్కన కంకంటి పాపరాజు’ ప్రచురితమైంది. భారతిలోను, ఆంధ్రసాహిత్య పరిషత్ పత్రికలోనూ తలలు పండిన పండితుల వ్యాసాలే తిరస్కరింపబడేవని ప్రచారం.
స్రవంతి మాస పత్రిక హైదరాబాదు నుండి దక్షిణ భారత హిందీ ప్రచార సభ వేమూరి రాధాకృష్ణమూర్తి సంపాదకత్వంలో వెలువడేది. అందులో నా వ్యాసాలు 1966 నుండి 1985 వరకు ఆ పత్రిక నిలిచిపోయే వరకు ప్రచురించారు. ఒకసారి రాధాకృష్ణమూర్తిని కలిశాను. ఆయన నన్ను చూసి “మీరా? పద్మనాభరావంటే వయస్సు మీరిన వారనుకున్నాను” అన్నారు చమత్కారంగా.
ఆంగ్ల పత్రికలలో ద హిందూ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్, యోజన, తదితరాలలో నా వ్యాసాలు వచ్చాయి. హైదరాబాదు నుండి వెలువడే తెలుగు యోజనలో వి.శ్రీపతిరావు (సంపాదకులు) అంగ్లవ్యాసాలకు అనువాదాలు నెల నెలా యాభై దాకా వ్రాయించారు. అనువాదాలే గాక స్వతంత్ర వ్యాసాలు తర్వాత సంపాదకులు సి.జి.కె.మూర్తి నుండి నేటి ‘సూరి ‘వరకు అడిగి వ్రాయించుకొన్నారు.
ఇండియా టుడే అమరనాథ్ మీనన్ (తెలుగు సంపాదకులు) ఇంటర్వ్యూ చేసి వాణిజ్య ప్రసార విభాగ ఘనతను చాటి చెప్పారు. WEEK వార పత్రికలో అవధాన ప్రతిభను గూర్చిన వ్యాసంలో లలితా అయ్యర్ నా వివరాలు ప్రముఖంగా ఇచ్చారు. HANS INDIA లో సివిల్స్ పరీక్షావహలకు ధారావాహిక వ్యాసాలు బహుళ ప్రయోజనకారులు. సురేష్ సంపాదకత్వంలో ‘ఉద్యోగ సోపానం’లో వంద వ్యాసలు ధారావాహికంగా వచ్చాయి. వాటిని పుస్తక రూపంలో వారు ప్రచురించారు.
శ్రీ భూతపురి సుబ్రహ్మణ్యం శర్మగారితో రచయిత
సంపాదకుల సంపర్కం:
నెల్లూరులో వి.ఆర్.కాలేజి బి.ఏ. విద్యార్థిగా 1962-65 మధ్య తరచు జమీన్ రైతు వార పత్రిక ఆఫీసుకు వెళ్లేవాడిని. సంపాదకులు నెల్లూరు శ్రీరామమూర్తి నన్ను అభిమానించేవారు. మేనేజరుగా తూపిలి పార్థసారథి, ఉపసంపాదకులుగా ‘బంగోరె’గా ప్రసిద్ధులైన బండి గోపాల రెడ్డి, ఆ తర్వాత పెన్నెటి గోపాలకృష్ణ వ్యవహరించారు. అప్పట్లో ఉగాది ప్రత్యేక సంచికలు సాహిత్య పరంగా వచ్చేవి. బంగోరె వేమన పై అథారిటీ. సుప్రసిద్ధ విమర్శకుడు. తిరుపతి విశ్వవిద్యాలయంలో వేమన పీఠంలో పరిశోధకులు, ఏ కారణం వల్లనో హిమాచల్ ప్రదేశ్ లోని సట్లెజ్ డ్యామ్ వద్ద ప్రాణత్యాగం చేశారు. ‘గోపి’ గా ప్రసిద్ధులైన గోపాల కృష్ణ కన్యాశుల్కంపై లోతుగా పరిశోధన చేశారు.
శ్రీరామమూర్తి వారసుడిగా డోలేంద్ర ప్రసాద్ ‘జమీన్ రైతు’ బాధ్యత స్వీకరించి సంపాదకులుగా మూడు దశాబ్దాలుగా నిర్భీతితో నడుపుతున్నారు. ప్రభుత్వాన్ని, ప్రభుత్వాధికారులను హెచ్చరిస్తూ ప్రజాపోరాటం కొనసాగిస్తున్నారు. 2025లో శ్రీరామమూర్తి శతజయంతిని ఘనంగా జరిపారు. 1965లో నెల్లూరు నుండి యల్.వి.కృష్ణారెడ్డి సంపాదకులుగా యూత్ కాంగ్రెస్ పత్రిక వారం వారం వచ్చేది. అది రాజకీయ పత్రిక. ఆయన యువ కాంగ్రెస్ వాది. పలువురు రాజకీయ నాయకులతో అనుబంధం.
తుంగా రాజగోపాల రెడ్డి ‘లాయర్’ పత్రిక 40 ఏళ్ల నాడు ప్రారంభించారు. నిబద్ధతతో పత్రికను నడిపారు. పెద్దపుత్తేడుకు చెందిన సంపన్న రైతు ఆయన. ఆయన కుమారుడు తుంగా శివ ప్రభాత్ రెడ్డి ‘లాయర్’ పత్రికకు అంతర్జాతీయ స్థాయి కల్పించారు. ప్రభుత్వానికి చురకలు అంటిస్తారు.
‘సింహపురి’ వార పత్రికను సుబ్రమణ్యం చాలాకాలం నడిపారు. నవయుగం, ధనెంకుల నరసింహం వార పత్రిక ప్రబలంగా వచ్చేవి. గోడ పత్రిక గండవరపు హనుమారెడ్డి, ఇంద్రగంటి సుబ్రమణ్యంల సారథ్యంలో చరిత్ర కెక్కింది.
2002లో చికాగోలో రచయిత
నెల్లూరు అనగానే ‘ద హిందూ’ పత్రిక సంపాదక వర్గంలో ప్రముఖులు జి.కె.రెడ్డి స్ఫురిస్తారు. ఢిల్లీలో ఆయనకు ప్రధాని కార్యాలయం, రాష్ట్రపతి భవనంలో ప్రత్యేక సంబంధాలుండేవి. నిబద్ధతకి నిజాయితీకి మారు పేరు. ‘ద హిందూ’ లో సుప్రీం కోర్టు తీర్పులను లీగల్ విలేకరిగా టి.పద్మనాభరావు నాలుగు దశాబ్దాలు ప్రచురించారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తులందరూ ఆయనను గౌరవించారు.
1965-67 మధ్య నేను తిరుపతిలో ఎం.ఏ. విద్యార్థిగా సిద్ధయ్య నాయుడు, ప్రజావాహిని వార ప్రత్రిక సంపాదకులను కలిశాను. నా వయస్సు 19 సంవత్సరాలు. ‘ప్రహ్లాదుని భక్తి భావం’ అని పది పేజీల వ్యాసం పట్టుకెళ్లాను. నన్ను చూసి ఆయనకు నమ్మకం కుదరలేదు. నాతో ముచ్చటించిన తర్వాత ఆ వ్యాసం నేనే వ్రాశానని నమ్మకం కుదిరి రెండు వారాలుగా ఆ వ్యాసం ప్రచురించారు. నెల్లూరు, తిరుపతి విద్యాభ్యాసానంతరం నా ప్రస్థానం కందుకూరికి మారింది 20వ ఏట.
ఆంధ్రప్రభతో అనుబంధం:
సంపాదకులు నార్ల వెంకటేశ్వరరావు, నీలంరాజు వెంకటశేషయ్యలను గూర్చి విన్నదే గాని కన్నది లేదు. విజయవాడలో 1978-80 మధ్య కె. ఎస్.సుబ్రమణ్యం సంపాదకులు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు వేరే సంపాదకులు. ఆయన మా కేంద్రంలో ఆంగ్ల ప్రసంగాలు రికార్డు చేసేవారు. తరువాతి తరంలో పొత్తూరి వెంకటేశ్వరరావు నన్ను ప్రోత్సహించారు. వారం వారం సాహిత్య పేజీలో రాయలసీమకు చెందిన సాహితీ ప్రముఖులతో ఇంటర్వ్యూలు పూర్తి పేజీలు నావి ప్రచురించారు. పుట్టపర్తి, గడియారం, శంకరంబాడి ప్రభృతుల ఇంటర్య్వూలు రాష్ట్ర వ్యాప్తంగా పండితుల ప్రశంసలందుకొన్నాయి. వాటిని ‘రాయలసీమ రత్నాలు’ పేర గ్రంథంగా తెచ్చాను.
ఆంధ్రప్రభ వార పత్రికలో విద్వాన్ విశ్వం వుండేవారు. తరువాతి కాలంలో మా సహోద్యోగి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ కొన్నేళ్లు పత్రికకు వన్నె చేకూర్చారు. వాకాటి పాండురంగారావు ప్రభలో పని చేశారు. రామోజీరావు నడిపిన ఆంగ్ల దిన పత్రిక – NEWS TIME సంపాదక బాధ్యతలు పాండురంగారావు చేపట్టారు. రామోజీరావుది GOLDEN HAND. కానీ ఆ పత్రిక నిలదొక్కుకోలేదు. ఈనాడులో రాంబట్ల కృష్ణమూర్తి, ఏ.బి.కె.ప్రసాద్ ప్రభృతులు పత్రికారంగంలో కొత్త పుంతలు తొక్కారు.
ఏ.బి.కె. ప్రసాద్ అన్ని దినపత్రికలలోను ప్రముఖంగా పని చేశారు. ఈనాడును విశాఖపట్టణంలో మొదలు పెట్టిన ఘనుడు. ప్రభ, జ్యోతి, వార్త, ఉదయం, ఆంధ్రప్రదేశ్ (మాస పత్రిక) తదితరాల సంపాదకులు. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘాధ్యక్షులు. ఆయన సంపాదకీయాలు యువ రిపోర్టర్లకు కరదీపికలు.
రామోజీరావు సారథ్యంలో ఈనాడు పాత్రికేయ రంగంలో INVESTIGATIVE JOURNALISM ప్రారంభించింది. శిక్షణా సంస్థను నెలకొల్పి బూదరాజు రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఎందరో యువకులను తీర్చిదిద్దారు. ప్రస్తుతం నాగేశ్వరరావు ఆ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈనాడులో సుదీర్ఘ కాలం ఉపసంపాదకులుగా పని చేసిన జంధ్యాల శరత్ బాబు చక్కని విశ్లేషకులు.
ఈనాడు గ్రూప్‌లో విపుల చతుర మాస పత్రికలు వినూత్న ధోరణి. విపులలో చలసాని ప్రసాద్, చతురలో చంద్రప్రతాప్ ప్రచురణలకు జవసత్వాలు కలిగించారు. విపులలో అనువాద కథలు ప్రచురించారు. చతురలో నవలలు వచ్చాయి. అన్నదాత వ్యవసాయదారులకు మార్గదర్శి.
1994 లో విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో అప్పటి సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ ఎం. జగన్నాథరావు, తదితరులు
యోజన (ఆంగ్లం) సంపాదకురాలు డా. జె. భాగ్యలక్ష్మి ప్రసార మంత్రిత్వ శాఖలో ప్రముఖ వ్యక్తి. ఆమె సోదరి జోళెపాళం మంగమ్మ ఢిల్లీ నుండి ఆకాశవాణి తెలుగు వార్తలు చదివేవారు.
ఆంధ్రజోతి ఆత్మీయత:
నండూరి రామమోహనరావు చిరకాలం ఆంధ్రజోతి సారథ్యం వహించారు. స్వయంగా రచయిత. సౌమ్యుడు. నిర్వివాద ధోరణి. అదే పత్రిక వార పత్రికకు పురాణం సుబ్రమణ్యశర్మ నూతన ధోరణులు వార పత్రిక సర్కలేషన్ పెంచాయి. సినీ పత్రిక చిత్రజ్యోతికి పద్మ శ్రీ తుర్లపాటి కుటుంబరావు సారథి.
నండూరి తరం తర్వాత ఆంధ్రజ్యోతికి ఐ.వెంకటరావు సారధి. రాజకీయ విశ్లేషణలో అఖండులు. ప్రముఖులతో పరిచయాలు అధికం. నండూరి వద్ద తులసీ కృష్ణ ఉప సంపాదకులు. రామకృష్ణారెడ్డి ‘తులసీ కృష్ణ’గా ప్రసిద్ధులు. ఆంధ్రజ్యోతి హైదరాబాదుకు మారింది. నవ్యవార పత్రికను 2020 వరకు కరోనా వరకు నడిపారు. ఎ.యన్. జగన్నాథ శర్మ ఆ పత్రికకు కొత్త రూపు తెచ్చారు. బాలజ్యోతికి ఆవంత్స శశికాంత శాతకర్ణి సారథి. వనితా జ్యోతి వెలువడేది.
వార పత్రికలలో తలమానికం విజయవాడ నుండి వెలవడే ‘స్వాతి’. వేమూరి బలరాం దాని సారథి. కథలు, నవలలు ప్రత్యేక బాణీలో వుంటాయి. సరస శృంగారానికీ, సమరం సమాధానాలకు పాఠకులు ఆకర్షితులయ్యారు. బలరాం నవలలు, కథలకు అధిక మొత్తంలో పారితోషికాలు అందించారు. పాఠకుల సంఖ్య పెరిగే ఆలోచనలే ఆయన చేశారు. ఒక కొత్త ‘ట్రెండ్’ సృష్టించారు.
పాత తరానికి చెందిన పత్రికలలో విశాలాంద్ర, ప్రజాశక్తి పార్టీల అనుబంధాలు. విశాలాంధ్ర సంపాదకులుగా సి.రాఘవాచారి ప్రముఖులు. వేతనాలతో సంబంధం లేకుండా పని చేశారు. ఏటుకూరి బలరామ మూర్తి ఆ సంస్థకు వెన్నెముక.
హైదరాబాదులో హనుమంతరావు న్యూస్ సిండికేట్ నడిపారు. వామనరావు ఐ.వి. చలపతిరావు, జి.యల్. వరదాచారి, ఉడయవర్లు చక్రధర్, టంకశాల అశోక్, తెలకపల్లి రవి, వి. వాసుదేవ దీక్షుతులు బాగ్యనగర బావుటాలు. త్రివేణి ఆంగ్ల పత్రికను చలపతి రావు నడిపారు.
శ్రీ పుట్టపర్తి నారాయాణాచార్యుల వారితో రచయిత
కె.రామచంద్రమూర్తి వివిధ పత్రికలలోను, సాక్షిలోను పని చేశారు. HANS INDIA లో ప్రముఖ పాత్ర పోషించారు. వేమరాజు భానుమూర్తి కుమారులు వి.రామశర్మ ఆంగ్ల దినపత్రిక HANS INDIA సంపాదకులు. ‘కృష్ణా పత్రిక’ను దిన పత్రికగా పిరాట్ల వెంకటేశ్వర్లు నడిపి చేతులు కాల్చుకొన్నారు.
పాత్రికేయ రంగంలో బహుకాలం కొనసాగడం కత్తిమీద సాము. రాజకీయాల ఒత్తిడులు తట్టుకొని నిలబడాలి. డెక్కన్ క్రానికల్, ఆంధ్రభూమి గ్రూప్ సంస్థలలో పులువురు పని చేశారు. ఆంధ్రభూమి దిన పత్రిక సంపాదకులు యం.వి.ఆర్. శాస్త్రికి 45 సంవత్సరాల పాత్రికేయ అనుభవం వుంది. ఆంధ్రభూమి వార్త మాసపత్రికలను సి.కనకాంబరరాజు చాలాకాలం నడిపారు. ఎ.యస్.లక్ష్మి ఇటీవల వరకు వార పత్రికను చూశారు. ఢిల్లీలో నేషనల్ హెరాల్ట్ సంపాదకులుగా మల్లాది రామారావు కొన్నాళ్లు పత్రికకు జీవం పోశారు. ఆయన లోగడ ఆకాశవాణి రిపోర్టర్. ఇన్ని రకాల పత్రికలు సంపాదకులలో అనుబంధం చిరస్మరణీయం.
(మళ్ళీ కలుద్దాం)
డా. రేవూరు అనంతపద్మనాభరావు అష్టావధాని, విమర్శకులు, ప్రముఖ సాహితీవేత్త. తెలుగు సాహిత్యం లోని అన్ని ప్రక్రియలలోనూ రచనలను చేశారు. 80 ఏళ్ళ వయస్సులో నిరంతర అధ్యయన, అధ్యాపనాలు కొనసాగిస్తూ 120 గ్రంథాలు ప్రచురించారు. 2005 లో దూరదర్శన్, ఢిల్లీ నుండి అదనపు డైరక్టర్ జనరల్‌గా పదవీ విరమణ చేశారు. పదవీ విరమణాంతరం గత 20 సంవత్సరాలలో 80 గ్రంథాలు వివిధ ప్రక్రియలలో ప్రచురించారు.
అనువాద సాహిత్యంలో తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం (1993); కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం (2000), అప్పాజోశ్యుల – విష్ణుభొట్ల – కందాళై ఫౌండేషన్ వారి విశిష్ట సాహితీ పురస్కారం లభించాయి. వీరి రచనలపై వివిధ కోణాలలో 5 విశ్వవిద్యాలయాల నుండి ఆరుగురు ఎం.ఫిల్/పిహెచ్డి పరిశోధనా గ్రంథాలు సమర్పించి పట్టాలు పొందారు.
సంచికలో వీరు గత ఐదు సంవత్సరాలలో – ఆకాశవాణి పరిమళాలు, కావ్యపరిమళం, జ్ఞాపకాలు-వ్యాపకాలు, ఆచార్య దేవోభవ, అవధానం ఆంధ్రుల సొత్తు అనే ఐదు గ్రంథాలు సమర్పించారు.
