Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వందే మా ‘తరం’-36

[తరాలు మారుతున్నాయి. సమాజం వేగంగా పరుగులు తీస్తోంది. విశ్వగ్రామం అనే సిద్ధాంతం ప్రబలింది. 1947లో పుట్టి 80వ ఏట కాలిడిన ప్రముఖ రచయిత డా. రేవూరు అనంత పద్మనాభరావు మూడు తరాల ప్రముఖులతో కలిసి మెలిసి తిరిగారు. ఆ జ్ఞాపకాల పందిరిని ధారావాహికంగా అందిస్తున్నారు.]

కేంద్ర సాహిత్య అకాడమీ ‘రెఫరీలు’:

పండిట్ జవహర్ లాల్ నెహ్రూ దూరదృష్టితో కేంద్ర సాహిత్య అకాడమీని 1954లో నెలకొల్పారు (12 మార్చి 1954). అది స్వతంత్ర సంస్థ. భారత ఉపరాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రారంభోత్సవం చేశారు. గత 74 సంవత్సరాలలో పురోభివృద్ధి చెందింది. రాజ్యాంగం ఆమోదించిన 22 భాషలలో వచ్చిన ఉత్తమ గ్రంథాలకు ఏటా లక్ష రూపాయల అవార్డు ప్రకటిస్తారు. ప్రాంతీయ కార్యాలయాలు కలక్తతా, బెంగుళూరు, ముంబై, అగర్తలాల లోను, మదరాసులో ఉపకార్యాలయం పని చేస్తున్నాయి. 1956 జనవరిలో సొసైటీగా రిజిస్టరయింది.

అన్ని భాషలకు పదిమంది సభ్యులతో ప్రత్యేకంగా సలహా సంఘాలు 5 ఏళ్ల కాలపరిమితితో ఎన్నుకోబడతాయి. కేంద్రంలో అధ్యక్ష, ఉపాధ్యక్షులు, జనరల్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ బోర్డు వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. కార్యదర్శిగా ఒక దశాబ్ది పాటు కె. శ్రీనివాసరావు పని చేసి 2025 అక్టోబరులో రిటైరయ్యారు. జనరల్ కౌన్సిల్‌లో ప్రస్తుతం 2023-2027 సంవత్సరాలకు డా. మాధవ కౌశిక్ (చండీఘడ్) అధ్యక్షులుగా, గుర్గాంకు చెందిన ఆచార్య కుముద్ శర్మ ఉపాధ్యక్షలుగా  ఎంపికయ్యారు. తెలుగు భాషకు సంబంధించి మందలపర్తి కిషోర్ జనరల్ కౌన్సిల్ సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. భాషా ప్రతినిధిగా ఆచార్య యన్.వి. సత్యనారాయణ ఉన్నారు. కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం ప్రతినిధిగా డా. సి.మృణాళిని నియుక్తులై కన్వీనర్‌గా ఎంపికయ్యారు.

ఆయా భాషల కన్వీనర్లు అవార్డుల కమిటీకి రెఫరీలుగా చెప్పావచ్చు. 5 ఏళ్ల పాటు ఈ సలహా సంఘ సభ్యులు ఆయా భాషాలలో సెమినార్ల నిర్వహణకు సూచనలందిస్తారు. 2023-2027 సంవత్సరాలకు తెలుగు సలహా సంఘ సభ్యులు వీరే. డా. సి. మృణాళిని, కన్వీనరు, ఆచార్య యస్.వి. సత్యనారాయణ (హైదరాబాదు) డా. నాళేశ్వరం శంకరం (హైదరాబాదు), మందలపర్తి కిషోర్ (హైదరాబాదు) డా. చింతకింది శ్రీనివాసరావు (చోడవరం), బి. ప్రకాశ్ కుమార్ (ఖమ్మం), డా. వినోదిని (కడప), డా. యస్. రఘు (హైదరాబాదు), వల్లూరి సాంబశివ ప్రసాద్ (గుంటూరు) డా. కె. లావణ్య (సికింద్రాబాదు).

శ్రీ బెజవాడ గోపాలరెడ్డి, శ్రీ జానమద్ది హనుమచ్ఛాస్త్రి గార్లతో రచయిత

కార్యదర్శుల కీలక పాత్ర:

సాహిత్య అకాడమీ అధ్యక్షులకు, కార్యవర్గానికీ అనుసంధానంగా కార్యదర్శి వ్యవహరిస్తారు. 1954 ఫిబ్రవరి నుండి 1971 ఫిబ్రవరి వరకు శ్రీ కృష్ణ కృపలానీ తొలి కార్యదర్శి. ఆయన కాలంలోనే కడప నుండి పుట్టపర్తి నారాణాచార్యులు అకాడమీ లైబ్రరీలో  కొంత కాలం పని చేశారు. ప్లేగు వ్యాధి కారణంగా కొంత కాలం వదలుకొని వచ్చేశారు. కార్యదర్శలుగా ఆర్.యస్.కేల్కర్, డా. ఇంద్రనాథ్ చౌధరి, డా. కె.సచ్చిదనందన్, అగ్రహార కృష్ణమూర్తి, డా.కె. శ్రీనివాసరావులు వ్యవహరించారు. శ్రీనివాసరావు 2025 అక్టోబరులో రిటైర్ కాగా ప్రభుత్వం సాంస్కృతిక కశాఖలోని శ్రీమతి పల్లవి ప్రశాంత్ హెల్కర్‌ని నియమించింది.

గతంలో పని చేసిన వివిధ కన్వీనర్లతోను నాకు పరిచయాలు కలిగాయి. వారి వివరాలలోకి వెళ్తే –

డా. బెజవాడ గోపాలరెడ్డి:

సాహిత్య సమరాంగణ సార్వభౌముడిగా చెప్పుకోదగిన గోపాలరెడ్డి రాజకీయాలలోనే గాక, సాహిత్య రంగంలోను ప్రముఖ పాత్ర పోషించారు. ఆయన (1907-1997) రాజకీయ భీష్మడు. ఆయన జీవిత చరిత్రను హైదరాబాదలోని సి.పి.బ్రౌన్ అకాడమీ వారికి నేను రచించాను. ఆయన జన్మించిన బుచ్చిరెడ్డిపాళెం నా జన్మస్థలం కూడా. 1957లో విశాలాంద్ర ఏర్పడిన నాటి నుండి ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ అధ్యక్షులుగా చిరకాలం వున్నారు. అదే సమయంలో కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా సంఘ కన్వీనరుగా చాలాకాలం  పని చేశారు. ఆయన ‘ఆంధ్రా ఠాగూరు’గా ప్రసిద్ధులు. కర్నూలులో ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రానికి ప్రకాశం తర్వాత 1955లో ముఖ్యమంత్రి. జ్ఞానపీఠ అవార్డు కమిటీ కూడా ఆయన చైర్మన్. ఉత్తర ప్రదేశ్ గవర్నరుగా వుంటూ ఆ పదవిలో కొనసాగారు. ఆంధ్రప్రదేశ్ లోను, కేంద్రంలో సాహిత్య అవార్డుల విషయంలో ఆయన మాట చెలామణీ అయింది. విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షం జ్ఞానపీఠ బహుమతి పొందడంలో ఆయన మాట చెల్లింది.

వసంతరావు వెంకటరావు, విజయనగరం (1909-1992):

గోపాలెడ్డి తర్వాత వెంకటరావు కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా సంఘ కన్వీనరయ్యారు. ఆయన విజయనగరం మహారాజా కాలేజి ప్రిన్సిపాల్‌గా 1956-69 మధ్య వ్యవహరించారు. భౌతిక శాస్త్రంలో పరిశోధనలు చేశారు. గ్రంథాలు ప్రచురించారు. 32 సైన్స్ గ్రంథాల రచయిత. కొన్ని ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్ధులకు పాఠ్యగ్రంధాలుగా ఎన్నికయ్యాయి. ఆయన సూరి భగంవతం శిష్యులు.

ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి (1928-2021)

ఒంగోలులో జన్మించిన కృష్ణమూర్తి లింగ్విస్టుగా ప్రసిద్ధి. హైదరాబాదులో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లింగ్విస్టిక్స్ విభాగంలో 1962-88 మధ్య సుదీర్ఘ కాలం అధ్యాపకులుగా, ఆచార్యులుగా బోధించారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో బోధన చేసి (1960-61) హైదరాబాదు వచ్చి ఉస్మానియాలో 1962లో లింగ్విస్టిక్స్ విభాగం ప్రారంభించారు. ప్రధాని శ్రీ. పి.వి. నరసింహరావు చొరవతో హైదరాబాదులో సెంట్రల్ యూనివర్శిటిని వైస్ ఛాన్స్‌లర్‌గా 1993-99 మధ్య ఆరేళ్లు ప్రగతి పథంలో నడిపించారు. 1993లో వారు వైస్ ఛాన్సలర్ అయిన సందర్భంలో అప్పటి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు చేతుల మీదుగా ప్రకాశం అభివృద్ధి అధ్యయన సంస్థ అధ్వర్యంలో కృష్ణమూర్తికి చేసిన సన్మాన సభలో నేనూ ప్రధాన పాత్రను వహించాను. ఆయన కేంద్ర సాహిత్య అకాడమీ కన్వీనర్‌గా 5 ఏళ్లు వ్యవహరించారు. 2000 సంవత్సరం నాకు అనువాద సాహిత్యంలో అవార్డు లభించింది. అమితాబ్ ఘోష్ రచించిన SHADOW LINES గ్రంథాన్ని తెలుగులో ‘ఛాయారేఖలు’గా అనువదించాను.

ఆచార్య జి.వి. సుబ్రమణ్యం (1935-2006):

ప్రకాశం జిల్లా ఆదిపూడిలో జన్మించిన సుబ్రమణ్యం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ఎం.ఏ.లో యూనివర్శిటి ఫస్ట్ వచ్చారు. అలా విజయం సాధించిన వారికి ఉద్యోగ కల్పనలో భాగంగా వరంగల్లులో తెలుగు లెక్చరర్‌గా నియమితులయ్యారు. 1975-95 మధ్య హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీలో రీడరు, ప్రొఫసరుగా బోధన చేశారు. తరువాత తెలుగు విశ్వవిద్యాలం వైస్ ఛాన్సలర్ (2002-05) అయ్యారు. టి.టి.డి వారు ప్రచురించిన ఆంద్ర మహాభారతానికి సంపాదకత్వం వహించారు. అందులో విరాట పర్వ భాగానికి నేను టికా తాత్పర్యం వ్రాశాను. ఆయన సాహిత్య అకాడమీ కన్వీనర్‌గా వున్నారు.

ప్రముఖ చిత్రకారుడు పద్మశ్రీ ఎస్.వి. రామారావుగారితో చికాగోలో రచయిత

అక్కిరాజు రమాపతి రావు (మంజుశ్రీ) (1934):

బహుముఖ ప్రజ్ఞాశాలి రమాపతిరావు. జీవిత చరిత్రల రచనలో మేటి. గుంటూరులో జన్మిచారు. తెలుగు అకాడమీలో చాలా కాలం పని చేశారు. వీరి రచన ‘ప్రతిభామూర్తులు’ ప్రసిద్ధం. అప్పాజోస్యుల విష్టుభొట్ల ఫౌండేషన్ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. సాహిత్య అకాడమీ కన్వీనర్ గా వ్యవహరించారు. వీరి సోదరులు అక్కిరాజు సుందర్ రామకృష్ణ పద్య నాటకాలలో రాణిస్తున్నారు. కేంద్ర సాహిత్య అకాడమీకి రమాపతి రావు పాలగుమ్మి పద్మరాజు మోనోగ్రాఫ్ వ్రాశారు. వీరు తెలుగు విభాగ కన్వీనరు. భోగరాజు పట్టాభి సీతారామయ్య జీవిత కథ రచనా ధురంధరులు. ఆత్మకథ ప్రచురించారు.

ఆచార్య యన్. గోపి (1948 జూన్):

ప్రజాకవి వేమన మీద సాధికారిక పరిశోధన చేసిన యన్. గోపి తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతిగా 1999-2002 మధ్య సంస్థ పురోగతికి దోహదం చేశారు. చిన్న వయస్సులో వి.సి. అయిన వ్యక్తి. సాహిత్య అకాడమీ కన్వీనర్‍గా  2013 -17 మధ్య విస్తృతంగా సెమినార్లు నిర్వహించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.

కె. శివారెడ్డి:

కవిగా సుప్రసిద్ధులు (1943). అభ్యుదయ కవిగా ఖ్యాతి. గుంటూరు జిల్లాలో జన్మించి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇంగ్లీషు ఎం.ఏ. చేశారు. వివేక వర్ధిని కాలేజి ప్రిన్సిపాల్‌గా 1999లో పదవీ విరమణ చేశారు. సాహిత్య అకాడమీ కన్వీనరు 2018-2022. 2016లో సరస్వతీ సమ్మన్ పొందారు.

ఫ్రొ. ఎన్. గోపి గారికి సాహిత్య అకాడెమీ పురస్కారం లభించిన తర్వాత జరిగిన అభినందన సభ

డా. సి. మృణాళిని (1956):

మృణాళిని కాకినాడలో జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ నుండి ఎం.ఏ. పిహెచ్.డి పొందారు. తెలుగు విశ్వవిద్యాలయంలో తులనాత్మక పరిశీలనా విభాగంలో ప్రొఫసర్‌గా రిటైరయ్యారు. తెలుగు సలహా సంఘం కన్వీనర్‌గా 2023-27 మధ్య ఎన్నికయ్యారు.

ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ:

1957లో స్థాపించబడ్డ రాష్ట్ర సాహిత్య అకాడమీకి బెజవాడ గోపాలరెడ్డి చాలాకాలం అధిపతిగా కార్యకలాపాలు కొనసాగించారు. దేవులపల్లి రామనుజరావు కార్యదర్శి. గోపాల రెడ్డి తర్వాత రామానుజరావు అధిపతిగా ఇరివెంటి కృష్ణమూర్తి కార్యదర్శిగా సాహితీ అవార్డులు, సభలు, సమావేశాలు గ్రంథ ప్రచురణలు చేపట్టారు. యన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా అకాడమీలు రద్దు కాబడి తెలుగు విశ్వవిద్యాలయంలో భాగమయ్యాయ. తెలంగాణా సారస్వత పరిషత్ దేవులపల్లి రామానుజరావు పర్యవేక్షణలో నడిచింది. ఆ పైన డా. సి. నారాయణరెడ్డి మార్గదర్శి. ప్రస్తుతం ఎల్లూరి శివారెడ్డి అధిపతి. జె. చెన్నయ్య కార్యదర్శి.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version