Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వందే మా ‘తరం’-37

[తరాలు మారుతున్నాయి. సమాజం వేగంగా పరుగులు తీస్తోంది. విశ్వగ్రామం అనే సిద్ధాంతం ప్రబలింది. 1947లో పుట్టి 80వ ఏట కాలిడిన ప్రముఖ రచయిత డా. రేవూరు అనంత పద్మనాభరావు మూడు తరాల ప్రముఖులతో కలిసి మెలిసి తిరిగారు. ఆ జ్ఞాపకాల పందిరిని ధారావాహికంగా అందిస్తున్నారు.]

మహనీయుల పద/పాద సన్నిధిలో..

అదృష్టవశాస్తూ గత 50 సంవత్సరాలుగా ఆకాశవాణి వల్ల పలువురు ఆధ్యాత్మిక సంపన్నుల పాదసన్నిధిలో మెలిగి వారి పద సందేశాలు ఆకాశవాణి శ్రోతలకు వినిపించే అవకాశం లభించింది. 1975 ఆగస్టులో 50 ఏళ్లనాడు కడప ఆకాశవాణిలో ప్రసంగశాఖ ప్రొడ్యూసర్‌గా చేరాను. సూక్తి ముక్తావళి కార్యక్రమానికి ‘సుభాషితాలు’ అనే నూతన నామకరణం చేసి కవి పండితులను అక్టోబరు 2 నుండి రికార్డు చేసి ప్రసారం చేశాను. దానిలో భాగంగా కడపలో వెలసిన పుష్పగిరి శంకర మఠం అప్పటి పీఠాధిపతులు శ్రీ శ్రీ విద్యానృసింహభారతీ స్వాముల వారిని బెల్లం మండి వీధిలోని వారి సంస్థాన కార్యలయంలో తొలిసారిగా కలిశాను. ఆ మహత్తర పరిచయం స్వామివారు జీవించినంత కాలం అనుగ్రహంగా లభించింది. కడప, విజయవాడ, హైదరాబాదు కేంద్రాల నుండి రికార్డింగులు చేశాను. వారి పట్టాభిషేక స్వర్ణోత్సవాలు పుప్షగిరిలో జరిగినప్పుడు సత్కృతుడనయ్యాను.

నేను ఢిల్లీ పండారా రోడ్ క్వార్టర్స్‌లో వుండగా స్వామి వారు మానససరోవర యాత్రకు వెళుతూ నాకు ఫోన్ చేసి ‘మీ ఆతిధ్యం స్వీకరిస్తా’మని అనుగ్రహించారు. ఎయిర్ పోర్ట్‌కు వెళ్లి స్వాగతించి మర్నాడు అర్ధరాత్రి వారిని విమానం ఎక్కించే సదవకాశం లభించింది. వారి చరమదశలో వారిని ఇంటర్య్వూలు చేసి వారి జీవిత చరిత్రను రచించాను. ప్రస్తుత పీఠాధిపతి శ్రీ శ్రీ అభినవోద్దండవిద్యాశంకర భారతీ స్వామి ఆ గ్రంథాన్ని సంస్థ పక్షాన ప్రచురించి స్వయంగా ఆవిష్కరించారు. ఆ సభలో నన్ను ‘పుష్పగిరి సంస్థాన ఆస్థాన కవి’గా ప్రకటించారు. వారి దివ్యాశీస్సులు వర్షించారు. 2007 ఏప్రిల్  1 న వారి ఆశ్రమ స్వీకారానికి పుష్పగిరి వెళ్లాను.

రెండవ దఫా నేను 1993లో కడప ఆకాశవాణి స్టేషన్ డైరక్టర్‍గా వెళ్లాను. ఆ డిసెంబరు నెలలో శ్రీ సుందర చైతన్య స్వామి వారు కడపలో తమ జన్మదినం (డిసెంబరు 25) నాటికి ముగిసేలా భాగవత సప్తాహం నిర్వహించారు. సమాపన సభలో అభినందన పురస్కారంగా వారి పై ఆశువుగా పద్యం చెప్పాను. 1995 మే మాసంలో ధవళేస్వరంలో వారు జరిపిన సభలకు నేను ప్రత్యేకాహ్వానితుణ్ణి. మా తల్లిదండ్రులను కూడా తీసుకెళ్లాను.  ఇక్కడి ఆశ్రమంలో వానప్రస్థం గడపమని మా తల్లిదండ్రులకు నొక్కి చెప్పారు. 1996 సెప్టంబరు 5న సర్వేపల్లి రాధాకృష్ణన్ పై ఆంగ్ల ప్రసంగం రికార్డు చేయడానికి విజయవాడ కేంద్రానికి వచ్చినపుడు సుందరచైతన్య గారు మా క్వార్టర్స్‌ను సందర్శించి మా కుటుంబానికి ఆశీస్సులందించారు. వారి గురుగీత గ్రంథాన్ని కడపలో ఆవిష్కరించాను.

1995లో ధవళేశ్వరంలో ‘స్వామి కృప’ గ్రంథావిష్కారం చేశాను.

విజయవాడ:

విజయవాడ సమీపంలోని గన్నవరంలో భువనేశ్వరపీఠం వుంది. అక్కడి పీఠాధిపతి శ్రీ చిదానంద భారతీ స్వామి. 1986 జూన్‌లో పీఠమెక్కారు. పూర్వశ్రమంలో నరసారావు పేటలో సంస్కృతాధ్యాపకులు. వారికి పలువురు అమ్మాయిలు. ఒకరు మా సమీప బంధువు వివాహమాడారు. స్వామివారిని విజయవాడ కేంద్ర సూక్తముక్తావళి రికార్డింగుకు ఆహ్వానించాను. పలుమార్లు ఆశ్రమం సందర్శించాను. 2006 మార్చిలో వారు బ్రహ్మీభూతులైనారు. వారు నాకు ‘పంచదశి’ మంత్ర దీక్షనిచ్చారు.

శ్రీశ్రీ చిదానంద భారతీ స్వామివారితో రచయిత

విజయవాడ ఆకాశవాణి ట్రాన్స్‌మిటర్లకు సమీపంలో నంబూరులో కాళీవనాశ్రమం పేర ఆశ్రమం వుంది. వారి నిర్యాణానంతరం ప్రస్తుత స్వామిని పీఠనిర్వహణ చేస్తున్నారు. ఆమె ప్రవచనాలు అమోఘం. కాళీ ప్రసాదబాబుగారి తర్వాత మాతాజీ ఆశ్రమ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు (చంద్రకాళీ ప్రసాద మాతాజీ).

విజయవాడ కృష్ణా నదీతీరంలో మాతా శివచైతన్య 1997 మే నుండి తపోవనం ఆశ్రమం నూతనంగా నిర్మించారు. ఆ శంఖుస్థాపన సభకు నేను స్టేషన్ డైరక్టరుగా ముఖ్య అతిథిని. ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ ముఖ్య అతిథి. 2007లో వారి ఆశ్రమ వైభవాన్ని తిరుపతి దేవస్థానంలో పని చేస్తున్నపుడు మరో మారు దర్శించాను.

ఇంచుమించు అదే సమయంలో అదే కృష్ణానదీ తీరంలో దత్త పీఠాధిపతి శ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామి దత్తపీఠానికి శంఖుస్థాపన గావించారు. హోమాదికాలు నిర్వహించారు. ఆ స్వామి వారు అనంతపురంలో వుండగా 1991లో స్టూడియోకి విచ్చేసి సుభాషితాలు రికార్డు చేశారు. ఢిల్లీ హైదరాబాదు, కడప, విజయవాడలలో వారి సాన్నిధ్యం లభించింది. 1999 నవంబర్‌లో వారు మానససరోవర యాత్ర నుండి ఢిల్లీ వచ్చి న్యాయవాది శ్యామలా పప్పు ఇంట్లో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. 2022లో మైసూరులో దత్తపీఠం వెళ్లినప్పుడు స్వామి వారు శుకవనంలో వున్నారు. నన్ను చూడగానే మేడ మీద నుండి క్రిందికి వచ్చి ఆప్యాయంగా అనంతపురం జ్ఞాపకాలు గుర్తు చేశారు. ఆయన చైతన్య శక్తి.

శ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారితో రచయిత

విజయవాడ కేంద్రానికి 1995-97 మధ్య పలువురు పీఠాధిపతులను ఆహ్వానించి రికార్డు చేసే భాగ్యం కలిగింది. సీతానగరంలో (విజయవాడ) శ్రీశ్రీ చినజీయర్ స్వామి వారి ఆశ్రమానికి వెళ్లి వారిని ఆహ్వానించాను. ఆయన రాకతో సిబ్బంది ఉత్తేజితులయ్యారు. 2007లో తాళ్లపాకలో అన్నమయ్య 600 జయంతికి వారిని ఆహ్వానించడానికి భూమన కరుణాకర్ రెడ్డి (చైర్మన్)తో బాటు నేను వచ్చి కలిశాను. స్వామి వారి షష్టిపూర్తి హైదరాబాదులోని ముచ్చింతలలో ఘనంగా జరిపినపుడు కవి పండిత సత్కారంలో నేను, బేతవోలు రామబ్రహ్మం, మేడసాని మోహన్ వున్నాము. 2012లో బదరీనాథ్ వెళ్లినపుడు స్వామివారి సిఫారసుతో వారి ఆశ్రమంలో రెండు రోజులు అతిథిగా కుటుంబ సమేతంగా వున్నాను.

శ్రీశ్రీ చినజీయర్ స్వామి వారితో రచయిత

కుర్తాళం పీఠాధిపతులు:

విజయవాడ కేంద్రానికి విచ్చేసిన స్వామిజీలలో 1991 నుండి కుర్తాళం పీఠాధిపతిగా 2002 డిసెంబరు వరకు వున్న శ్రీ శ్రీ శివచిదానంద భారతీ స్వాములు వున్నారు. వారి దివ్య సందేశం రికార్డు చేశాము. వారి హఠాత్ నిర్యాణంతో ప్రస్తుత పీఠాధిపతి శ్రీ శ్రీ సిద్దేశ్వరానంద భారతీ మహా స్వామి 2002 డిసెంబరులో ఆశ్రమ ఆధిపత్యం స్వీకరించారు. ఆ పీఠాన్ని మౌనస్వామిగా పేరు గాంచిన శ్రీ శ్రీ చిదానంద సరస్వతి స్వామి మహీమన్విత యోగి. ఇది సిద్దేశ్వర పీటం. తమిళనాడులో ప్రసిద్ధం. 1951-91 మధ్య త్రివిక్రమరామనంద భారతి పీఠాధిపతి.

శ్రీ శ్రీ శివచిదానంద భారతీ స్వామివారితో రచయిత

గుంటూరు హిందూ కళాశాల ప్రిన్సిపాల్‌గా పూర్వాశ్రమమంలో పని చేసిన శ్రీప్రసాదరాయ కులపతి సన్యాస స్వీకారానంతరం పీఠాధిపతి అయ్యారు. 1965-67 మధ్య నేను తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎం.ఏ చదువుతున్నపుడు వారు భాగవతంపై పరిశోధన చేస్తూ పి.హెచ్.డి స్కాలర్‌గా ఉన్నారు. నేను విజయవాడ ఆకాశవాణి డైరక్టరుగా వున్నప్పుడు వారి ఆధ్వర్యంలో ఆహూతుల సమక్షంలో ఇంద్రసభ నిర్వహించాము. ఇంద్రుడిగా గుంటూరు జిల్లా కలెక్టరు సి. ఉమామహేశ్వరరావు పాత్ర పోషణ చేయాలి. ఆ ఉదయం తుఫాను హెచ్చరిక కారణంగా కలెక్టరు హెడ్ క్వార్టర్స్ వదలి వెళ్ళగూడని పరిస్థితి ఏర్పడింది. కులపతిగారి సూచన మేరకు అనుకోకుండా నాకు  ‘ఇంద్రపదవి’ దక్కింది.

వారు ఢిల్లీలో ఆంధ్రావతరణోత్సవాలలో భువన విజయసభ 1989లో నిర్వహించారు. అందులో అష్టదిగ్గజ కవులలో నేను పింగళి సూరన్న పాత్ర ధరించాను. ఆ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు విచ్చేశారు.

2009లో అన్నమాచార్య ప్రాజెక్టు (తిరుపతి) ఆధ్వర్యంలో కుర్తాళం మహిళా కళాశాలలో ఒక సెమినార్ మేడసాని మోహన్ ఏర్పాటు చేశారు. నేను, మా శ్రీమతి శోభదేవి కుర్తాళం సిద్దేశ్వరీ మాతను దర్శించి స్వామివారు ఆశీస్సులు పొందాము. ఎంతో వాత్సల్యంతో మాట్లాడారు.

ప్రసాదరాయ కులపతి పేర ఏటా ఒక కవికి విశిష్ట పురస్కారం (10 వేల నగదు) అందిస్తారు. 2019లో గుంటూరులో శ్రీ సిద్దేశ్వరానంద భారతీస్వాముల కరకమలాల మీదుగా హిందూ కళాశాల ఏకాదండయ్య పంతులు హాలులో స్వీకరించాను. ఆయన వాగ్ఝరి అమోఘం. పాండితీధనుడు. వారికి ఉత్తరాధికారిగా దత్తేశ్వరానంద భారతి నియమితులయ్యారు.

పీఠాధిపతుల అనుగ్రహభాషణాలు, పద పాద సన్నిధి పురాకృత సుకృతం.

విశ్వయోగి విశ్వంజీ:

గుంటూరులో మరొక ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విశ్వయోగి విశ్వంజీ (1944 మార్చి 5). 1988 నవంబరులో వారు అధ్యాపక వృత్తికి రాజీనామా చేసి ఆధ్యాత్మిక రంగప్రవేశం చేశారు. 1996లో స్వామీజీ నూతనంగా నిర్మించిన విశ్వ భవన ప్రారంభోత్సవానికి నేను ముఖ్య అతిథిని. కేంద్ర ఎన్నికల కమీషనరు జి.వి.జి. కృష్ణమూర్తి భవన ప్రారంభోత్సవం చేశారు. విశ్వనగరంలో నిర్మించిన మాతాశిశు కేంద్రాన్ని పూర్వరాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలామ్ 2008 ఏప్రియల్‌లో ప్రారంభించారు. దత్తజయంతిని ఏటా నిర్వహిస్తారు.

స్వామి ప్రజ్ఞారణ్య:

నేను నెల్లూరు వి.ఆర్.కాలేజీలో 1962-65 మధ్య బి.ఏ. చదువుతున్న రోజుల్లో బాటనీ డిపార్టుమెంటులో లెక్చరర్‌గా సి.పద్మనాభరావు గురువు. వారు ఉద్యోగం వదలుకొని ఋషీకేశ్ ఆశ్రమాలలో జీవించి సన్యాసి అయ్యారు. స్వామి ప్రజ్ఞారణ్యగా యోగాభ్యాసం పలుప్రాంతాలలో శిష్యులకు నేర్పించారు. నేను ఢిల్లీలో వుండగా మా క్వార్టర్స్‌కు విచ్చేశారు. 2006 డిసెంబరులో శ్రీ కాళహస్తి శుకబ్రహ్మాశ్రమంలో వారు వారం రోజుల పాటు యోగా క్లాసులు నడిపారు. నేను, నా శ్రీమతి హజరయ్యాము. శాస్త్రీయ దృక్పథంతో ఆధ్యాత్మిక విషయాలపై విశ్లేషణ చేసేవారు. చరమ దశలో నెల్లూరు జిల్లా అన్నారెడ్డి పాళెంలో రామయోగి అశ్రమ నిర్వహమ చేపట్టారు. పుణ్యజీవి. 2020 సెప్టెంబరులో నిర్యాణం.

అంతర్వేది ఆశ్రమం:

గోదావరీ, వశిష్టానదుల సంగమం అంతర్వేది. అక్కడ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ప్రసిద్ధం. గోదావరీ తీరంలో అంతర్వేదిలో ప్రసాదరాజు అనే సత్పురుషుడు – వశిష్ఠుడు హోమాదికాలు నిర్వహించిన చోట వశిష్ఠాశ్రమ నిర్మాణం చేశారు. సువిశాలమైన ప్రాంగణంలో శ్రీ చక్రపీఠం నెలకొల్పి వశిష్ఠుని విగ్రహ ప్రతిష్ఠ చేశారు. సప్త ఋషుల విగ్రహాలు నెలకొల్పారు. 2022లో 108 విగ్రహాలను వర్తులాకారంలో నిర్మించే బృహత్ కార్యక్రమం చేపట్టారు. అతిరహస్య యోగినీ విగ్రహ ప్రతిష్ఠను 2022 జనవరిలో మా దంపతులచే నిర్వహింపచేశారు. అదే సమయంలో సనాతన ధర్మ ప్రచార సదస్సు నిర్వహించారు. నేను అధ్యక్షుడిని. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం (తిరుపతి) ఉపకులపతి ఆచార్య జి.యస్.ఆర్. కృష్ణమూర్తి ముఖ్య అతిథి. దీక్షా దక్షతలతో వశిష్ఠాశ్రమ నిర్వహణ కొనసాగిస్తున్నారు పీఠాధిపతి శ్రీ ప్రసాద్ రాజు. ఇతర పీఠాధిపతుల వివరాలు మరో సంచికలో.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version