Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వందే మా ‘తరం’-38

[తరాలు మారుతున్నాయి. సమాజం వేగంగా పరుగులు తీస్తోంది. విశ్వగ్రామం అనే సిద్ధాంతం ప్రబలింది. 1947లో పుట్టి 80వ ఏట కాలిడిన ప్రముఖ రచయిత డా. రేవూరు అనంత పద్మనాభరావు మూడు తరాల ప్రముఖులతో కలిసి మెలిసి తిరిగారు. ఆ జ్ఞాపకాల పందిరిని ధారావాహికంగా అందిస్తున్నారు.]

పరమాచార్య సందర్శనం:

నడయాడే దైవంగా భాసిల్లే కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వాముల వారి ప్రప్రథమ దర్శనం అనుకోకుండా లభించింది. దాని వెనుక సంఘటన ప్రస్తావించాలి. అప్పుడు నేను హైదరాబాదు ఆకాశవాణిలో అసిసెంట్ స్టేషన్ డైరక్టరుని (అక్టోబరు 1982- ఏప్రిల్ 1987). 1983 జూన్ మాసంలో అప్పటి ముఖ్యమంత్రి శ్రీమాన్ ఎన్.టి.రామారావు రేడియో ప్రసంగ ప్రసార విషయంలో గొడవ పార్లమెంటు చర్చల దాకా కొనసాగింది. 1983 జనవరిలో యస్.రాజారాం రిటైరయ్యారు. స్టేషన్ డైరక్టరుగా ఢిల్లీ నుండి 1983 ఆగస్టులో కేశవ పాండేను నియమించారు. సెప్టెంబరులో కర్నూలులో కంచి కామకోటి పీఠాధిపతుల చతుర్మాస్యం జరుగుతోంది. తుంగభద్రా నదీ తీరంలో మూడు శిబిరాలలో పరమాచార్య, శ్రీ జయేంద్ర సరస్వతిలతో బాటు అప్పుడే ఉత్తరాధికారిగా పదవీ స్వీకరించిన యువకులు శ్రీ విజయేంద్ర సరస్వతి ముగ్గురూ భక్తులకు దర్శనమిస్తున్నారు.

కేశవ పాండే నాతో కర్నూలు వెళదామని ప్రస్తావించారు. రాయలసీమ పేపర్ మిల్స్ పి. ఆర్. ఓ. నాకు కడప నుండి పరిచయం. ఆయనకు ఫోను చేశాను. ‘రండి సార్! దర్శనం చేసుకొందు’రని చెప్పారు. నేను, మా డైరక్టరు ఒక ఉదయం బయలుదేరి కర్నూలు చేరుకున్నాం. భక్త జన సందోహం బారులు తీరివున్నారు. వరుసగా ముగ్గురు స్వాములను దర్శించాము.

పరమాచార్య శిబిరంలో మోకాళ్లపై చేతులూని కూర్చొని భక్తులను ఆశీర్వదిస్తున్నారు. నేను అప్పుడే ప్రచురించిన ‘భక్తి సాహిత్యం’ గ్రంథం వారి పాదాల ముందు వుంచాను. అది నా వ్యాససంపుటి. లోగడ వివిధ పత్రికలలో వచ్చిన వ్యాసాల సంకలనం. స్వామివారు ఒక పేజీ తెరచి చూశారు. ‘గణపతి’ అనే వ్యాసం. తెలుగు కవులు తమ కావ్యలలో చేసిన గణపతి స్తుతులను ఒక చోట చేర్చి ఆంధ్రప్రభ దిన పత్రికకలో ప్రచురించిన వ్యాసమది.

కంచి కామకోటి పీఠం పరమాచార్యులు శ్రీ జయేంద్ర సరస్వతిస్వామి వారి ఆశీర్వాదం పొందుతున్న రచయిత

స్వామివారు రెండు మూడు వాక్యాలు చదివారు. నా ముఖం కేసి ప్రసన్న దృక్కులు ప్రసరించారు. ‘శుభమస్తు’ అన్నారు ఆశీఃపూర్వకంగా వారి పాదాలకు నమస్కరించాను. నన్ను అనుసరించి మా డైరక్టరు కూడా నమస్కరించారు. ఆయన ఎంతో సంబరపడ్డారు. ఆనుకోకుండా ఆయన జీవితంలో ఎన్నాళ్ల నుండో ఎదురు చూస్తున్న సంఘటన. ఆయన ఔత్తరాహుడు. దక్షిణ దేశంలో ఎన్నడూ పని చేయలేదు. కాని, కంచి కామకోటి పీఠం గూర్చి విని భక్తి ప్రపత్తులు పెంచుకొన్నారు. ఆయన కేవలం 50 రోజులే హైదరాబాదులో పని చేశారు. 1983 ఆక్టోబరు 31న ప్రమోషన్‌పై డిప్యూటీ డైరక్టర్ జనరల్‌గా ఢిల్లీ దూరదర్శన్‌లో చేరారు.

శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి 1969లో శంకరనారాయణగా తమిళనాడులో జన్మించారు. కంచి కామకోటి పీఠ ఉత్తరాధికారిగా 1983 మే 29న నియమితులై సన్యాసాశ్రమ స్వీకారం చేశారు. ‘బాల పెరియవర్’గా భక్తులు కొలిచారు. శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామి విదేహముక్తి పొందగా 2018 ఫిబ్రవరి 28 శుభముహుర్తాన 70వ పీఠాదిపతిగా కొలువుదీరారు.

1995 నాటి మాట:

1983 తర్వాత 1995 వరకు పీఠాధిపతుల దర్శన భాగ్యం నాకు కలగలేదు. 1995 ఏప్రిల్ విజయవాడ ఆకాశవాణి డైరక్టరుగా చేరాను. ఆ సంవత్సరం మాగంటి సుబ్రమణ్యం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం లబ్బీపేటలో వేద సదస్సు నిర్వహించారు. ఏటా జయేంద్ర సరస్వతి స్వామి జన్మదినాన్ని ఆయన ఎంతో ఘనంగా జరుపుతారు. వేద పండితులను స్వామి వారిచే సత్కరింప చేస్తారు. ఆ సభలో నేను, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రాళ్లపల్లి రామమూర్తి అతిథులం. జయేంద్ర సరస్వతీ స్వామితో బాటు విజయేంద్ర సరస్వతి గూడా విచ్చేశారు. సభానంతరం నేను స్వామిని అభ్యర్ధించాను.

‘మా స్టూడియోకి విచ్చేసి సూక్త ముక్తావళి రికార్డు చేయండి స్వామి! దీపావళి సందేశం ఇవ్వండి’ అన్నాను.

‘మేము స్టూడియోకు రాము. మీరు మా వద్దనే రికార్డు చేయండి’ అన్నారు స్వామి.

‘మీరు విచ్చేస్తే మా స్టూడియో పావనమవుతుంది!’ అన్నాను.

ఒక్క క్షణం ఆగి ‘సరే’ అన్నారు. ‘మహద్భాగ్యం స్వామీ!’ అన్నాను.

మర్నాడు ఉదయం ఉభయ స్వాములు స్టూడియోకి విచ్చేశారు.

ఆకాశవాణి కాలనీలో నివసించే సిబ్బంది మొత్తం ఆకాశవాణి ప్రాంగణంలో స్వాముల వారికి నీరాజనాలు పట్టారు.

విజయేంద్ర సరస్వతీ స్వామి వారు రికార్డింగు పరికాలను అన్ని స్టూడియోలను దర్శించి పులకితులయ్యారు. ముఖ్యంగా సంగీత స్టూడియోలు వీణాది వాద్యాలను చూచి ఆనందించారు.

జయేంద్ర సరస్వతీ స్వామి నాలుగు చిరు ప్రసంగాలను సూక్తి ముక్తావళిని రికార్డు చేశారు. దీపావళి సందేశం ఇచ్చారు. అదొక చిరస్మరణీయ ఘట్టం. సాధారణంగా వారు బయటకు వచ్చి రికార్డు చేయరు. అదొక సంప్రదాయం.

నేను 1997 నుండి 2005 వరకు ఢిల్లీ స్టేషన్ డైరక్టరుగా వుండగా శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామి ఢిల్లీ విచ్చేశారు. ఎలక్షన్ కమీషనర్ జి.వి.కృష్ణమూర్తి తమ క్వార్టర్సులో స్వామి వారికి పాదపూజ చేశారు. పద్మగారు, కృష్ణమూర్తిగారు ఢిల్లీలోని ఆంధ్ర ప్రముఖలను తమ యింటికి ఆహ్వానించారు. అప్పుడు మా దంపతులం స్వామి వారిని దర్శించాము. నన్ను చూడగానే ‘ఆకాశవాణి పద్మనాభరావు’ అని ఆశీర్వదించారు.

కంచి కామకోటి పీఠ, ఆస్థాన విద్వాంస సత్కారం:

2006 నాటి మాట. తిరుమల తిరుపతి దేవస్థానంలో S.V.B.C ఏర్పాటు చేసే బాధ్యతల నిర్వహణలో వున్నాను. చైర్మన్ భూమన్ కరుణాకరరెడ్డి, ఏ.పి.వి.యన్. శర్మగారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు. సాధు సమ్మేళనం తిరుమల ఆస్థాన మండపంలో ఏర్పాటు చేశారు. 50 మంది దాకా ప్రసిద్ధ పీఠాధిపతులు విచ్చేశారు. వారిలో కంచి కామకోటి పీఠం, దత్త పీఠం తదిదర నాలుగు పీఠాల స్వాములకు స్వాగతం పలికి, వారి బస ఏర్పాట్లు చేసే బాధ్యత నాకప్పగించారు. అప్పుడు జయేంద్ర సరస్వతీ, గణపతి సచ్చిదానంద స్వామినీ సేవించుకునే భాగ్యం లభించింది.

కంచి కామకోటి పీఠం పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతిస్వామి వారితో విజయవాడ ఆకాశవణి స్టూడియోలో రచయిత

2009లో కంచి పీఠం నుండి మిత్రులు టి.వి. రాఘవాచారి ఫోన్ చేశారు. ‘ఈ దసరాలలో పీఠం పక్షాన సత్కారించే ఆస్థాన విద్వాంసులలో మీ పేరు వుంది’ అన్నారు. ‘మహాద్భాగ్యం’ అన్నాను. ఆయన దూరదర్శన్ మదరాసులో డైరక్టర్ హోదాలో రిటైరయి, కంచిలో స్థిరనివాసం ఏర్పరచుకొని పీఠం పబ్లిక్ రిలేషన్స్ చూస్తూ స్వామివారికి సన్నిహితులయ్యారు. ఆయనది మా బుచ్చిరెడ్డిపాళెం.

దసరా ఉత్సవాలు ఘనంగా కంచి పీఠంలో జరుపుతారు. సంగీత సాహిత్యాలకు సంబంధించిన విద్వాంసులను ఆస్థాన విద్వాంసులుగా స్వామివారు సత్కరిస్తారు. ఆ భాగ్యం నాకు లభించింది. అదొక గొప్ప గౌరవం.

మరుసటి సంవత్సరం స్వామి వారు తిరుపతిలోని తమ మఠంలో పది రోజులు మకాం చేశారు. ప్రతి రోజూ సాయంకాలాలు దార్మిక ప్రవచనాలు ఇతరులతో చేయిస్తారు. రెండు రోజులు నా చేత రామాయణ రహస్యాలు చెప్పించారు. స్వామి సమక్షంలో మాట్లాడటమంటే భయం. ప్రసంగాలు విని ఆశీర్వదించారు.

I.A.S. శిక్షణా కోర్స్:

2012 నేను తిరుపతి దర్శనానికి వెళ్లాను. శ్రీ జయేంద్ర సరస్వతి తిరుపతి మఠంలో బస చేశారని తెలిసి వారిని దర్శించుకొన్నాను.

‘ఏం చేస్తున్నారు ఇప్పుడు?’ అన్నారు.

‘నారాయణ IAS అకాడమీ ప్రిన్సిపాల్‌గా 2011 జూన్ నుండి వున్నాను!’ అని సభక్తికంగా మనవి చేశాను.

‘సాయంత్రం నాలుగు గంటలకు వస్తే ఒకరిని పరిచయం చేస్తాన’న్నారు.

సాయంత్రం కలిశాను. హైదరాబాదులో ప్రముఖ పారిశ్రామికవేత్త, పీఠానికి పరమ భక్తులు ఆయన మాగంటి సూర్యనారాయణను పరిచయం చేశారు.

‘మీరిద్దరు కలిసి హైదరాబాదులో సనాతన కుటుంబాల వారి పిల్లలకు IAS కోచింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయండి, పీఠం సహకరిస్తుంది’ అన్నారు.

అనేక కారణాల వల్ల ఆ ప్రయత్నాలు ఫలించలేదు.

ఉడిపి పెజావర్ మఠాధిపతి ఆశీర్వాదం పొందుతున్న రచయిత

S.V.B.C. కార్యక్రమాలు:

2008 జూలై 7న రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభాపాటిల్ తిరుమల ఆలయ ప్రధాన ద్వారం ముందు శ్రీ వేంకటేశ్వర భక్తి ఛనాల్ ప్రారంభించారు. దానికి మూల కారకులు శ్రీ భూమన కరుణాకరరెడ్డి – చైర్మన్, శ్రీ కె.వి. రమణాచారి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు. ఛానల్ స్థాపనకు కావలసిన ఢిల్లీ శాంక్షన్లు తెచ్చి పెట్టి బాధ్యతను వారిద్దరు నాకప్పగించారు. భగవదనుగ్రహం వల్ల 2008 బ్రహ్మోత్సవాలకు ముందు ఛానల్ ప్రారంభమైనది.

ఛానల్ కార్యక్రమాల నిర్మాణంలో భాగంగా నేను మా యూనిట్‌తో కలిసి కంచి వెళ్లి అక్కడి విశ్వవిద్యాలయంపై ఒక డాక్యుమెంటరీ తీసే ప్రయత్నం చేశాము. అప్పుడు జయేంద్ర సరస్వతీ స్వామిని కలిశాను. వారు ఎంతో ఆనందించి అప్పటి వైస్ ఛాన్సలర్ తదితరులను కలిసే ఏర్పాటు చేశారు.

శ్రీ విజయేంద్ర సరస్వతీ స్వామి ఆశీస్సులు:

2018 మార్చిలో మదరాసు విశ్వవిద్యాలయ తెలుగు శాఖాధిపతి శ్రీ మాడభూషి సంపత్‍కుమార్ ఒక సదస్సుకు నన్ను ఆహ్వానించారు. ఆ సమయంలో అప్పుడే పీఠాధిపతిగా పదవీ బాధ్యతనలంకరించిన శ్రీవిజయేంద్ర సరస్వతీ స్వాములను కలిసేందుకు కంచి వెళ్లాను. స్వామి వారు తమ పూజ గదిలో నుండి బయటకి వచ్చారు. వందలాది భక్తులు గంటల తరబడి ఎదురు చూస్తున్నారు.

జనం మధ్యలో వున్న నన్ను పరికించారు.

‘ఆకాశవాణి’ అంటూ పలకరించి నా ఫోన్ నెంబరు తీసుకోమని శిష్యులకు చెప్పారు.

2024లో స్వామి వారు సికిందరాబాదులోని స్కందగిరి ఆలయంలో బస చేశారు. నేను దంపతి సమేతంగా వారిని దర్శించాను. ఉదయం వేళ భక్తులు క్యూలో నిలబడి దర్శనం చేసుకుంటున్నారు. నేను మా ఆవిడ ఆ వరుసలో వెళ్లాము.

‘మీరు వేదిక మీదికి రండి!’ అని సైగ చేశారు.

ఆ మర్నాడు ఉదయం ఒక సమావేశం ఏర్పాటు చేసి పొదిలి వద్ద ఏర్పాడు చేయబోయే వేద పాఠశాల గూర్చి ప్రముఖులతో చర్చించారు. యం.వి.యస్. ప్రసాద్ గారిని ఆ బాధ్యత తీసుకోమన్నారు.

విశ్వయోగి విశ్వంజీ గారితో రచయిత

సనాతన కుటుంబాల పిల్లలకు IAS కోచింగ్ ఉచితంగా ఏర్పాటు చేసే బాధ్యత నాకప్పగించారు. ఎంతో ఆప్యాయంగా ఆశీర్వదించారు. అనేక కారణాల వల్ల అది సఫలం కాలేదు. కాని కంచిలోని విశ్వవిద్యాలయంలో ఆచార్య శ్రీనివాస్ వైస్ ఛాన్సలర్ నేను సంప్రదించగా అక్కడ కోచింగ్ ఏర్పాట్లు జరిగాయని చెప్పారు. సంతోషించాను. ఆ విధంగా కంచి పీఠంతో నా అనుబంధం నాలుగు దశాబ్దాల నాటిది.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version