[తరాలు మారుతున్నాయి. సమాజం వేగంగా పరుగులు తీస్తోంది. విశ్వగ్రామం అనే సిద్ధాంతం ప్రబలింది. 1947లో పుట్టి 80వ ఏట కాలిడిన ప్రముఖ రచయిత డా. రేవూరు అనంత పద్మనాభరావు మూడు తరాల ప్రముఖులతో కలిసి మెలిసి తిరిగారు. ఆ జ్ఞాపకాల పందిరిని ధారావాహికంగా అందిస్తున్నారు.]
సత్యసాయి పాదస్పర్శ:
1990 ఆగస్టు. ఢిల్లీలో స్టాఫ్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో డిప్యూడీ డైరక్టరుగా మూడేళ్లుగా పని చేస్తున్న నన్ను కొత్తగా నిర్మించిన అనంతపురం ఆకాశవాణి డైరక్టరుగా వేశారు. పెట్టె, బేడా సర్దుకొని సామాన్లు అగర్వాల్ ప్యాకర్స్‌కు బుక్ చేసి కర్మాటక ఎక్స్‌ప్రెస్‍లో సకుటుంబంగా ఆగస్టు 8న అనంతపురంలో దిగాను. టైప్ IV క్వార్టర్స్ రెడీగా వున్నాయి. చేరిపోయాము.
ఆఫీసులో కూర్చొనే కుర్చీ గూడా ఇంకా సిద్ధంగా లేదు. ఇంజనీరు ఆంజనేయులు, అకౌంటెంట్ విశ్వనాధం అప్పటికే చేరారు. సిబ్బందిలో భాగంగా అనౌన్సర్లు, తదితరులను రిక్రూట్‌మెంటు ద్వారా ఎంపిక చేసుకొనే బాద్యత నాకప్పగించారు. ఒక రోజు సాయంకాలం ఒక జీపులో ఓ 60 ఏళ్ల ఖద్దరు వస్త్రధారి మా క్వార్టర్సు ముందు దిగారు. “నేను అనంతపరం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిని. మీ ఆఫీసులో ప్యూన్ ఉద్యోగానికి ఫలానా వ్యక్తిని చేర్చుకోండి!” అని అభ్యర్ధించారు. “ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ చేంజి ద్వారా పేర్లు వస్తాయి. అర్హతను బట్టి ఇంటర్వ్యూ చేసి సెలక్టు చేస్తాం లెండి” అన్నాను.
“మీ యిష్టం సార్! నా పేరు జానకిరామయ్య. సత్యసాయిబాబాగారి అన్నయ్యను. ఒకసారి పుట్టపర్తి వచ్చి దర్శనం చేసుకోండి!” అని కాఫీ తాగి వెళ్లారు.
నవంబరు 1990లో 21, 22, 23 తేదీలలో సత్యసాయిబాబా జన్మదినోత్సవాలు ఘనంగా జరిగాయి. అనంతపురం నుండి వెళ్లి స్వామి దర్శనం చేసుకొన్నాను. 1991 మేలో అనంతపురం కేంద్రం ప్రసారాలకు సిద్ధింగా వుంది. ఢిల్లీ నుండి డైరక్టర్ జనరల్ ప్రతినిధి ఎవరో ఒకరు వస్తారని ఎదురుచూస్తున్నాం.
ఇంతలో మా అమ్మాయి శైలజ వివాహం బళ్లారి యువ ఇంజనీరు రవిచంద్రతో నిశ్చయమైంది. మే 24న పెళ్లి నిశ్చయమైంది. మే 21 రాత్రి రాజీవ్ గాంధీ హత్యోదంతంతో పట్టణమంతా కర్ఫ్యూ విధించారు. యథావిధిగా కొద్ద మంది బంధువులతో స్థానిక మిత్రులతో వివాహం జరిపించాము. ఆ సమయంలో ఢిల్లీ నుండి ఫోన్ వచ్చింది.
నన్నే స్టేషన్ ప్రారంభం చేసేయమని సూచించారు. ఆ వారంలో ప్రారంబించాము.
1991 నవంబరులో సత్యసాయి జన్మదినోత్సవం నాటికి అనంతపురం కేంద్ర సిబ్బందితో పుట్టపర్తి వెళ్లి రికార్డింగులు చేశాము. ప్రధాని పి.వి.నరసింహారావు సత్యసాయి ఆసుపత్రిని ప్రారంభించారు. మదరాసు తెలుగు అకాడమీ టి.వి.కె.శాస్త్రి, యం.యస్.సుబ్బలక్ష్మి కచేరీ ఏర్పాటు చేశారు. 1992లో జన్మదినోత్సవాలకు రాష్ట్రపతి శ్రీశంకర్ దయాళ్ శర్మ విచ్చేశారు. స్వామివారు వేదిక పైకి ఆకాశవాణి సిబ్బందిని పిలిచి తెల్లని ప్యాంట్ పీసులు జహుకరించారు.
1991లో భగవాన్ సత్యసాయిబాబా తో రచయిత
నా పక్కనే నిలుచున్న మా స్టేషన్ ఇంజనీరు వెంకట్రామన్‌కు మాయాజాలంతో ఉంగరం తీసి చేతికి బహుకరించారు. 1999లో సత్యసాయి కేంద్రం ఢిల్లీలో ప్రారంభోత్సవానికి విచ్చేసిన స్వామిని ప్రధాని ఏ.బి.వాజ్‌పేయితో కలసి ఏకాంతంగా దర్శిచుకునే భాగ్యం కలిగింది.
శృంగేరీ స్వాముల సన్నిధిలో:
2004 నవంబరులో పది రోజులు సెలవు పెట్టి బెంగుళూరు సతీసమేతంగా వెళ్లాను. అప్పుడు అక్కడి దూరదర్శన్ డైరక్టరు మిత్రులు వెంకటేశ్వర్లు. ఆయన సౌజన్యంతో నాలుగు రోజులు ఉడిపి, శృంగేరి, ధర్మస్థల, మూకాంబిక, హసన్ శ్రీవణబెళగోళ దర్శించాము. ధర్మస్థలలో పీఠాధిపతి వీరంద్ర హెగ్డేను దర్శించి ఆయన చేతుల మీదుగా కానుకలు స్వీకరించాము. వారు నిర్వహించే పెద్ద హాస్పటల్ చూశాం. ఉడిపిలో శ్రీకృష్ణుని దర్శించాము. హెజావర్ మఠాధిపతి ఆశీస్సులందుకున్నాము. ఒక రాత్రి శృంగేరీలో బస చేశాము. మర్నాడు ఉదయం శృంగేరి శంకరాచార్య స్వాముల వారిని ఏకాంతంగా దర్శించాము.
“నేను అష్టావదానాలు చేశాను స్వామి” అంటే వారు సంతోషించి ఆశీర్వదించారు. పక్కనే వున్న శారదా మాత విగ్రహం వద్ద కూర్చొని మా శోభాదేవి మైమరచిపోయింది ధ్యానంలో.
1992లో అనంతపురంలో ఉడిపి స్వామీజీతో రచయిత
పెజావర్ పీఠాధిపతిని అనంతపురంలోను, ఢిల్లీలోను కలిశాను. అదే రీతిలో 1981లో మంత్రాలయంలో ఆరాధనోత్సవాలకు నేను, గొల్లపూడి మారుతీరావు కలసి వెళ్లి రికార్డింగులు చేశాము. గొల్లపూడి తన ఆత్మకథలో ఇలా వ్రాశారు. “మా బావగారు అనంతపద్మనాభరావుతో కలసి 1981లో మూడు పవిత్ర క్షేత్రాలు దర్శించాను. శ్రీశైలంలో శివరాత్రి, మంత్రాలయంలో ఆరాధాన, తిరుమలలో బ్రహ్మోత్సవాలు.”
శ్రీకాళహస్తిలోని శుకబ్రహ్మాశ్రమం గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రం. 1992-95 మధ్య కడప ఆకాశవాణికి రికార్డింగుకు విచ్చేసిన శ్రీవిద్యాప్రకాశానందగిరి స్వాముల వారు సపరివారంగా మా ఆవిడ ఆతిథ్యం మాంయింట స్వాకరించారు. 2006లో శుకబ్రహ్మాశ్రమాన్ని దర్శించినపుడు అక్కడి పీఠాధిపతి శ్రీ విద్యాస్వరూపానందగిరి స్వాముల వారి సాన్నిహిత్యం లభించింది. అక్కడి నేత్రాలయంలో వారు చేస్తున్న ఉచిత కంటి ఆపరేషన్లు నా హృదయాన్ని కదిలించాయి. మా మాతృమూర్తి శారదాంబ స్మత్యంకంగా 50 వేల రూపాయలు విరాళం పంపాను. వారు ప్రచురిస్తున్న వేదాంత ఖేరి మాసపత్రికలో నేనూ, నా శ్రీమతి అనేక వ్యాసాలు వ్రాశాము.
ఏర్పేడు లోని మలయాళ స్వాముల వారి ఆశ్రమాన్ని 2007లో సందర్శించాను. ఆ సమయంలో అప్పటి పీఠాధిపతి సుమారు 90 సంవత్సరాల వయస్సుగలవారు పరమపదించారు. ఆ సమాధి సమయంలో నేను దర్శించగలిగాను.
తిరుమలలో జియ్యంగార్ వ్యవస్థ రామానుజ సంప్రదాయంలో ప్రసిద్ధం. ప్రస్తుతం వున్న పెద జియ్యంగారికి పూర్వం వున్నవారు నన్ను 2005 ప్రాంతంలో అభిమానించారు. వారు పూర్వాశ్రమంలో నెల్లూరు వేద కళాశాలలో పని చేశారు. మాదీ నెల్లూరు. ప్రస్తుతం పెదజీయంగారు అప్పట్లో చిన్న జీయంగారుగా వుండేవారు. తర్వాత పీఠాధిపతి అయ్యారు. శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రారంభమైన నాటి నుండి వారు, చిన్నజియంగార్లు నాతో ఆప్యాయంగా మాట్లాడి ఆశీర్విదంచేవారు.
వెదురుపాక గాడ్:
రాజమండ్రికి 25 కిలోమీటర్లు దూరంలో వెదురుపాక అనే కుగ్రామం వుంది. అక్కడ వి.వి.సుబ్రమణ్యం అనే సదాచార సంపన్నులు 1972 ఆగస్టు 18న ఒక దివ్యశక్తిని పొందిన అనుభూతి చెందారు. అప్పటి నుండి ‘వెదురుపాక గాడ్’గా ప్రసిద్ధులు. 2025 జనవరి 19న వారి 90వ జన్మదినోత్సవం. భక్తులు ఆనందోత్సాహాలతో జరుపుకొన్నారు. అక్కడే వెలసిన విజయదుర్గా పీఠం భక్తులకు కొంగు బంగారం. ప్రతి ఏటా వారి జన్మదినోత్సవం ఘనంగా జరుగుతుంది. 2009లో తొలిసారిగా వారిని నేను తిరుపతిలో దర్శించాను. అప్పుడు నేను దేవస్థానంలో SVBCలో పని చేస్తున్నాను.
2012 నుండి నేను వారి జన్మదినోత్సవాలకు దంపతి సమేతంగా వెళ్లి వారి ఆశీస్సులు పొందుతున్నాను. 2020లో నవంబరు 19న ఆదర్శ దంపతులుగా మమ్మల్ని పీఠం వారు సత్కరించారు. అదే సమయంలో పి.వి.నరసింహారావుగారి సోదరులు పి.వి.మనోహరరావు దంపతులను కూడా సన్మానించారు.
వెదురుపాక గాడ్ జన్మదినోత్సవాలలో రచయిత
దాంపత్య జీవనం కొనసాగిస్తూ నలుగురు ఆడపిల్లలు, అల్లుళ్లుతో ఆ గ్రామంలో వారు నివసిస్తున్నారు. సాధారణంగా ‘గాడ్’ అనే పదం వాడరు. కాని, వీరు ‘వెదురుపాక గాడ్’ గా ప్రసిద్ధులు.
జన్మదినోత్సవాలు మూడురోజులు నిర్వహిస్తారు. మొదటి రోజున గోదా శ్రీరంగనాథుల కల్యాణం, మర్నాడు తిరుమల పద్మావతీ శ్రీనివాసుల కల్యాణం వేదోక్తంగా నిర్వహిస్తారు. కాశీ నుండి పండితులు విచ్చేసి విశ్వేశ్వరునికి రుద్రాభిషేకం ఒక సంవత్సరం చేస్తారు. మూడవ రోజున జన్మదినోత్సవ సభ ఘనంగా పండిత సన్మానాలతో కొనసాగుతుంది.
గత ఆరు సంవత్సరాలుగా ఆ సభలకు నేనే అధ్యక్షుడిని. డా. మేడసాని మోహన్, డా. గరికపాటి నరసింహారావు, కడిమళ్ల వరప్రసాద్, ధూళిపాళ మహాదేవమణి, యర్రాప్రగడ రామకృష్ణ, విశ్వనాథ గోపాలకృష్ణశాస్త్రి ప్రభృతులను ఆహ్వానించి సత్కరించారు.
తిరుపతి నుండి పండితులు విచ్చేసి వెంకటేశ్వర కల్యాణం జరుపుతారు. తిరుమల ప్రధానార్చకులు శ్రీవేణుగోపాల దీక్షుతులు ప్రత్యేకంగా విచ్చేసి స్వామివారి ప్రసాదాలను ‘గాడ్’ గారికి సమర్పించి వెళతారు. ‘గాడ్’ గారి సతీమణి సీతమ్మ కాలధర్మం చెందారు. వారి అల్లుళ్లు కూతుళ్లు కార్యభారాన్ని మోస్తున్నారు. సోదరులు బాపిరాజు ప్రధాన కార్యనిర్వాహాకులు.
IAS ఆఫీసర్లు, IPS ఆఫీసర్లు హైకోర్టు న్యాయమూర్తులు, పలువురు ఎం.ఎల్.ఏలు రాజకీయ నాయకులు జన్మదినోత్సవానికి హాజరవుతారు. గుంటూరు ఏ.సి. కాలేజిలో ‘గాడ్’ గారు, నాదెండ్ల భాస్కరావు కలిసి చదువుకొన్నారు. 90 ఏళ్లు పైబడినా వారిలో ఉత్సాహం సన్నగిల్లలేదు. విజయదుర్గ అనుగ్రహం.
శ్రీ మాతాశివచైతన్య గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో రచయిత
వివిధ పీఠాధిపతులు:
ఢిల్లీలో పని చేస్తున్నప్పుడు కడప నుండి మిత్రులు డా. మల్లెమాల వేణుగోపాల రెడ్డి విచ్చేశారు. Divine United Organisation సంస్షకు చెందిన మహారాజ్ 1988 ఏప్రిల్‌లో ఢిల్లీ నగర శివార్లలో బసచేశారు. లక్షలాది మంది భక్తులు వారిని దర్శించుకొన్నారు. వేణుగోపాలరెడ్డి ప్రత్యేకంగా నన్ను వారికి పరిచయం చేశారు. విదేశాలలో పేరున్న వ్యక్తి వారు.
ప్రజాపిత బ్రహ్మకుమారి ఆశ్రమంవారు 1994 ఆగస్టులో కడపలో సమ్మేళనం పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. పదివేల మంది దాకా సభకు హాజరయ్యారు. స్టేషన్ డైరక్టర్‌గా నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అది వజ్రోత్సవం. వ్యవస్థ స్థాపకులు వజ్రాల వ్యాపారి. “వజ్రాల వ్యాపారికి వజ్రోత్సవం జరపడం సముచిత”మని నేను ప్రసంగం మొదలు పట్టాను. సభలో హర్షధ్వానాలు మిన్నుముట్టాయి.
1996 జనవరిలో 27న బ్రహ్మకుమారీలు విజయవాడలో గొప్ప సభ నిర్వహించారు. విజయవాడ డైరక్టర్‌గా నేను ముఖ్య అతిధిని. 2012లో హైదరాబాదులో విశ్రాంతి జీవనం గడుపుతున్నాను. బ్రహ్మకుమారీల సంఘ నిర్వహాకురాలు సరళాబెన్ నాకు ఫోను చేశారు. “మౌంట్ ఆబోలో ప్రసార మాధ్యమాల సెమినార్ జరుపుతున్నాం. మీరు ఒక పేపరు సమర్పించండి!” అని. నేను సరేనని వెళ్లి ప్రసంగించాను.
2016లో మా దంపతులం మౌంట్ ఆబులో అలాంటి సెమినార్‌లో పాల్గొన్నాం. అహమ్మదాబాదుకు విమానంలో వెళ్లి సరళగారితో కలసి కార్లో శాంతివనం వెళ్లి మూడు రోజులు ప్రశాంతంగా గడిపాము.
సహజయోగ స్థాపకురాలు మాతాజీ ఢిల్లీలో 2003లో జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో లక్షలాది మందికి దర్శనమిచ్చారు. దూరదర్శన్‌లో పని చేసే మిత్రుడు మాకు పాస్‌లు తెచ్చి పెట్టి దర్శన భాగ్యం కల్పించారు. మా అమ్మాయి శైలజ ఆ సహజయోగ అభ్యాసి. నిత్యం ధ్యానం చేస్తుంది.
కన్వాలో (హైదరాబాదు సమీపం) స్థాపించిన కమలేష్ పటేల్ ధ్యానయోగం శిబిరానికి మా మేనల్లుడు పరమేశ్వరరావు తీసుకెళ్లాడు. అదొక గొప్ప అనుభూతి. రామచంద్ర మిషన్ వ్యవస్థాపకుల దివ్యదృష్టికి అది నిదర్శనం. చారీజీ దాని వ్యవస్థాపకులు.
బ్రహ్మం గారి మఠంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పీఠాధిపతులను కలెక్టరు రమణాచారి, నేను 1994లో కలిశాము. ప్రస్తుత పీఠాధిపతి వీరధర్మజ వెంకటాద్రి స్వామి. ప్రేమ సిద్దధార్ధ, నంద్యాలలో శ్యామా చరణ్ బాబా, కర్నూలులో బాల సాయిబాబా, భంభం బాబా(1992) మలంగ్ బాబా (బొంబాయి), మెహర్ బాబా, విజయేశ్వరీ దేవి సాన్నిధ్యం ఆయా కాలాలలో లభించాయి. రామకృష్ణ మిషన్, చిన్మయా మిషన్ వంటి సంస్థల ప్రముఖుల పరిచయాలు ఆకాశవాణి వలన లభించాయి.
80వ ఏట అడుగిడిన నాకు ఆధ్యాత్మిక చింతనాభివృద్ధికి ఈ పరిచయాలు సోపానాలు.
(మళ్ళీ కలుద్దాం)
డా. రేవూరు అనంతపద్మనాభరావు అష్టావధాని, విమర్శకులు, ప్రముఖ సాహితీవేత్త. తెలుగు సాహిత్యం లోని అన్ని ప్రక్రియలలోనూ రచనలను చేశారు. 80 ఏళ్ళ వయస్సులో నిరంతర అధ్యయన, అధ్యాపనాలు కొనసాగిస్తూ 120 గ్రంథాలు ప్రచురించారు. 2005 లో దూరదర్శన్, ఢిల్లీ నుండి అదనపు డైరక్టర్ జనరల్‌గా పదవీ విరమణ చేశారు. పదవీ విరమణాంతరం గత 20 సంవత్సరాలలో 80 గ్రంథాలు వివిధ ప్రక్రియలలో ప్రచురించారు.
అనువాద సాహిత్యంలో తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం (1993); కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం (2000), అప్పాజోశ్యుల – విష్ణుభొట్ల – కందాళై ఫౌండేషన్ వారి విశిష్ట సాహితీ పురస్కారం లభించాయి. వీరి రచనలపై వివిధ కోణాలలో 5 విశ్వవిద్యాలయాల నుండి ఆరుగురు ఎం.ఫిల్/పిహెచ్డి పరిశోధనా గ్రంథాలు సమర్పించి పట్టాలు పొందారు.
సంచికలో వీరు గత ఐదు సంవత్సరాలలో – ఆకాశవాణి పరిమళాలు, కావ్యపరిమళం, జ్ఞాపకాలు-వ్యాపకాలు, ఆచార్య దేవోభవ, అవధానం ఆంధ్రుల సొత్తు అనే ఐదు గ్రంథాలు సమర్పించారు.
