Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వందే మా ‘తరం’-40

[తరాలు మారుతున్నాయి. సమాజం వేగంగా పరుగులు తీస్తోంది. విశ్వగ్రామం అనే సిద్ధాంతం ప్రబలింది. 1947లో పుట్టి 80వ ఏట కాలిడిన ప్రముఖ రచయిత డా. రేవూరు అనంత పద్మనాభరావు మూడు తరాల ప్రముఖులతో కలిసి మెలిసి తిరిగారు. ఆ జ్ఞాపకాల పందిరిని ధారావాహికంగా అందిస్తున్నారు.]

పలువురు బాబాల సంపర్కం:

గతంలో పుట్టపర్తి సాయిబాబా దివ్యచరణారవిందాల ప్రస్తావన 1990-1995ల మధ్య జరిగిన వివరాలు ప్రస్తావించాను. ఇప్పుడు దక్షిణదేశంలోను, ఉత్తరదేశంలోను నేను పని చేసిన రోజుల్లో తారసపడిన బాబాల ముచ్చట్లు వివరిస్తాను.

షిర్డి సాయిబాబా ఆరాధ్యదైవం. 1990ల నాటి మాట. వ్యక్తిగతమే అయినా ప్రస్తావిస్తాను. 1990 జూన్‌లో ఢిల్లీలో పని చేస్తున్నాను. మా పెద్దబ్బాయి రమేష్ చంద్ర ఇంటర్మీడియెట్ ప్యాసయ్యాడు. నేను ఢిల్లీలో ఉన్నందున, వారు ఇంటర్ డిల్లీలో చదవడం వల్ల EAMECT పరీక్షలకు Non-local అయ్యారు. ఆంధ్రాలో ఇంజనీరింగ్ సీట్ దొరకలేదు. షోలపూర్ ఇంజనీరింగ్ కాలేజి (మహారాష్ట్ర) వాళ్ల అడ్వర్టయిజ్‌మెంటు చూసి నేను రైలులో వెళ్ళి షోలాపురు వెళ్లాను. “సీట్లు అయిపోయాయి” అని బోర్డు పెట్టారు. దిగాలు పడ్డాను. దగ్గర్లో షిర్డీ వుంది గదా అని బస్సులో తెల్లవారేసరికి షిర్డీలో దిగాను.

గుడి దగ్గర కోలాహాలంగా జనం వున్నారు. అది గురు పూర్ణిమ. ఓ గంటలో దర్శనం చేసుకున్నాను. “స్వామీ! మా వాడికి ఒక సంవత్సరం వృథా కాకుండా చూడు” అని ప్రార్థించాను. గుడి బయట తిరగుతున్నాను. అపరిచత వ్యక్తి వచ్చి “ఇక్కడకు దగ్గర్లో కోపర్‌గాం ఇంజనీరింగ్ కాలేజీ వుంది తెలుసా?” అన్నారు. నేనాయనను అడగలేదు. బాబా అతని నోట పలికించాడు. హుటాహుటిన కోపర్‌గాం వెళ్లాను.

ఉదయం 10 గంటలు, కాలేజి ప్రిన్సిపాల్ రత్నకుమార్‌ని కలిశాను. సీటు వుందన్నారు. వాళ్లు ఒక పాలసీ పెట్టుకొన్నారు. “మీ అబ్బాయి PMC ఎంత?” అని అడిగారు. అంటే Physics, Maths, Chemistryలలో వచ్చిన మార్కులు స్కోరు ఎంత? అని.

“80%” అన్నాను.

100-80=20*1000 =20 వేలు డొనేషన్. 70 % అయితే 30 వేలు రెగ్యులర్ ఫీజు 12 వేలు. నేను cash తీసుకెళ్లాను. 32 వేలు కట్టి వచ్చేశాను.

రమేష్ చంద్ర అక్కడ బి.ఇ. పూర్తి చేసి ప్రస్తుతం L&T Infotel లో Global Head గా 1996 నుండి పని చేస్తు 30 సంవత్సరాల సర్వీసు పూర్తి చేశాడు.

అంతా షిర్జీ సాయిబాబా దయ కాక మరేమిటి?

పరమపూజ్య సద్గురు శ్రీ శివానందమూర్తిగారితో తిరుపతి విశ్వవిద్యాలయం సెమినార్, 2016లో

పుట్టపర్తి సాయిబాబా వలె వేషధారణలో కర్నులులో బాలసాయిబాబా భక్తులని అలరిస్తున్నారు. 1960 జనవరి 14న సంక్రాంతి నాడు జన్మించిన ఆయన మేజిక్ బాబాగా ప్రసిద్ధులు. 2018 నవంబరులో హైదరాబాదులో తీవ్రమైన గుండెపోటుతో కాలధర్మం చెందారు. ఆయనను కర్నులులో కలిశాను. మాయాజాలంతో విభూతి సృష్టించారు. హైదరాబాదు శ్రీనగర్ కాలనీలో మా ఫ్లాట్ సమీపంలో వారి పీఠం వుంది.

కర్నూలు జిల్లా నంద్యాలలో శ్యామచరణ్ బాబా తన శిష్యువర్గానికి సాక్షాత్ దైవ సమానులు. ప్రభుత్వోద్యోగం చేస్తూ కుటుంబభారాన్ని వహిస్తూ నంద్యాలలో స్థిరనివాసం ఏర్పరచుకొన్నారు. రావినూతల శ్రీరాములు ద్వారా నాకు పరిచయమయ్యారు. 1994లో పి.వి. నరసింహరావుగారు ప్రధానమంత్రిగా నంద్యాలలో తమ నియోజక వర్గ పర్యటనకు విచ్చేశారు. ఆ సభ రికార్డింగుకు కడప ఆకాశవాణి డైరక్టరుగా నంద్యాల వెళ్లాను. నంద్యాల చిన్న టౌన్. లాడ్జిలు, గెస్ట్ హౌస్‌లు కలెక్టరు అధీనంలో ఉన్నాయి. రాత్రి నిద్ర చేయడానికి శ్యామాచరణ బాబాని ఆశ్రయించాను. నా కొక గది కేటాయించారు. మెయిన్ హాల్‌లో బాబా శయన మందిరం. రాత్రి తెల్లవార్లు శిష్యులు ఆయన పాదాల వద్ద కూచొని ఏకాంత సేవ భజనలు చేశారు. శ్యామా తత్వాలను బ్లాగ్‌లో ఏడు సంకలనాలుగా పాటల రూపంలో వుంచారు.

“ఆది దేవ అమరవినుత, అప్రమేయం పాహిమాం
అఖిలలోక సంచారకా, వినాశనాశక రక్షమాం”

బాబా కాలధర్మం చెందారు.

నేను అనంతపురంలో పని చేస్తున్నప్పుడు 1992 మార్చి 18న భం భం బాబా శిష్యులు అనంతపురంలో ధర్మ సభ ఏర్పాటు చేశారు. వేలాది మంది భక్తులు సమావేశమైన సభలో ఆకాశవాణి డైరక్టర్‌గా నేను ముఖ్య అతిథిగా మాట్లాడాను.

1994 మార్చిలో కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో వి.వి.యల్. నరసింహరావు అధ్యక్షతన వీరబ్రహ్మంగారి జీవిత చరిత్ర గ్రంథావిష్కరణ సభకు జిల్లా కలెక్టరు డా. కె.వి. రమణాచారి, స్టేషన్ డైరక్టరుగా నేను ముఖ్య అతిధులం. కాలజ్ఞానం బోధించిన శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సంస్థాన పీఠాధిపతులు శ్రీవీరభోగ వంసతరాయలు, మాకు కాలజ్ఞాన ప్రతిని, భద్రంగా దాచిన దానిని చూపించారు. ప్రస్తుత పీఠాధిపతి శ్రీ వెంకటాద్రి స్వామి.

కుర్తాళం పీఠాధిపతి శ్రీశీ సిద్ధేశ్వరానంద భారతీస్వాముల వారి అవార్డు స్వీకరిస్తూ.. గుంటూరు హిందూ కళాశాల, 2018

1997 సెప్టెంబరులో విజయవాడ డైరక్టరుగా కృష్ణాజిల్లా నూజివీడులో జరిగిన అవతార్ మెహర్ బాబా జయంతికి ముఖ్య అతిథిని. మెహర్ బాబా సమాధి మహారాష్ట్ర లోని మెహరాబాదులో ప్రసిద్ధం. మౌన వ్రతాన్ని 44 ఏళ్ల తరబడి పాటించిన మెహర్ బాబా గురించి నాకు మిత్రులు మాల్లాది రామారావు, మల్లాది కృష్ణానంద్‌ల ద్వారా సుపరిచితం. 1894 ఫిబ్రవరిలో పూనాలో జన్మించిన బాబా 1969 జనవరిలో మెహరాబాద్‌లో తనువు చాలించారు. ఆయనకు అసంఖ్యాక శిష్యగణం యావద్భారతంలోను, విదేశాలలో వున్నారు. ఆయన అవతార పురుషుడు.

2004 సంవత్సరం. మా ప్రసారభారతి సి.ఇ.ఓ కె.యస్. శర్మ “మలంగ్ బాబా మీ వద్దకు వస్తారు చూడండి!” అని ఫోన్ చేశారు. నల్లటి దుస్తులు ధరించిన 60 ఏళ్ల స్వామీజీ, ఆయన వెంట శిష్యురాలు వచ్చారు. సాధారణంగా స్వామీజీలు కాషాల వస్త్రాలు ధరిస్తారు. ఈయన శబరిమల స్వాముల దుస్తులలో వున్నారు. ఆయన శిష్యురాలు దూరదర్శన్‌లో ఒక సీరియల్ ప్రపోజల్ తెచ్చారు. స్వామీజీ బొంబాయిలో బాగా ప్రసిద్ధులు. శిష్యవర్గం గొప్పగా వుంది. రెండు, మూడు సార్లు వారే వచ్చి కలిశారు.

ఋషీకేశ్‌లో ఆంధ్రాశ్రమం వుంది. అక్కడ తెలుగువారైన స్వామీ శ్రీ మేధానందపురి వున్నారు. 2012లో మా మాతృమూర్తి శరదాంబ గతించారు. వారి సంస్మరణార్ధం హరిద్వార్, ఋషికేశ్, బదరీనాధ్ క్షేత్రాలకు సకుటుంబంగా వెళ్లి శ్రాద్ధకర్మలు నిర్వహించాము. ముందుగా ఆంధ్రాశ్రమంలో స్వామీ మేధానందపురికి ఫోన్ చేశాను. ఋషికేశ్‌లో బస ఏర్పాటు చేశారు. వారు 1995లో విజయవాడ ఆకాశవాణిలో నన్ను కలిశారు. ‘ప్రశ్నోత్తరావళి’ పేర ఒక గ్రంథం ప్రచురిస్తూ నన్ను ముందుమాట వ్రాయమని కోరారు. అది ప్రచురించారు. ఒక రాత్రి ఋషికేశ్‌లో బస చేసి ఆశ్రమ వాతావరణాన్ని చూసి ఆనందించాము.

1981లో శాంతినికేతన్‌లో ఓరియంటల్ కాన్ఫరెన్స్‌కు నేను, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, బేతవోలు రామబ్రహ్మం ప్రభృతులం వెళ్లాము. ఆ సభలో Udaharana Literature in Telugu అనే పేపరు సమర్పించాను. దారిలో కలకత్తాలో రెండు రోజులు బస చేశాము. అప్పుడు రామకృష్ణ మిషన్ దర్శించి స్వామీజీని కలిశాము. హైదరాబాదు రామకృష్ణ మిషన్ స్వామీ రంగనాథానంద ఆకాశవాణిలో ప్రసంగాలకు విచ్చేశారు. ప్రస్తుతం మఠాధిపతి స్వామి బోధమయానంద నెల్లూరీయులు కావడం వల్ల పరిచితులు. నెల్లూరులో రామకృష్ణ మిషన్ శాఖను రామకృష్ణ మఠం వారు తమ పరిధిలోకి తీసుకునే విషయంలో నా ప్రయత్నం కూడా వుంది. ప్రస్తుత మఠం ఇన్‌చార్జి, స్వామి హృదానందను 2025లో కలిశాను. కడపలో వుండగా కడప శాఖను మంటపంపల్లె రమాణారెడ్డి పర్యవేక్షించేవారు. స్వామి అమృతానంద మహారాజ్ సభలకు అతిధిగా వెళ్లారు.

ఢిల్లీలో 2004 లో Indian Institute of Public Administration, ఇంద్రప్రస్థ ఎస్టేట్ లోని వారి ఆడిటోరియంలో పిరమిడ్ సంస్థ అధిపతి సుభాష్ పత్రి సభలో నేను ముఖ్యఅతిథిని. అప్పుడు అక్కడ డాక్టర్ పి.య.ల్ సంజీవరెడ్డి ఆ ఇనిస్టిట్యూట్ డైరక్టరు. 2009లో పిరమిడ్ సంస్థ ఆధ్వర్యంలో తిరుపతిలో బహుళ సంసఖ్యలో సాధకులు పాల్గొన్న సమావేశాలకు హజరయ్యారు.

శుకబ్రహ్మాశ్రమ పీఠాధిపతిగారితో శ్రీకాళహస్తి, 2017

స్వామి చిన్మాయానంద సందేశాలను 1964లో నెల్లూరులో బి.ఏ. విద్యార్ధిగా విని నోట్సు వ్రాసుకొని పదిల పరచుకొన్నాను. ఢిల్లీలో, విజయవాడలో వారి శిష్యుల భగవద్గీత ప్రసంగాలు విన్నాను. ముఖ్యఅతిథిగా వున్నాను. అదే రీతిలో రమణ మహర్షి ఆశ్రమానికి (రమణాశ్రమం) 2004లో సతీ సమతంగా వెళ్లి గిరి ప్రదక్షిణ చేశాము. ఢిల్లీ లోడీ రోడ్‌లో రమణాశ్రమ కేంద్రంలో కె.సి .సుబ్బయ్య ఆధ్వర్యంలో నడిచిన ప్రార్థనా సభలకు హాజరయ్యాను. హైదరాబాద్‌లో రమణ కేంద్ర పుస్తకావిస్కరణ సభలో ముఖ్యఅతిథిని. చిన్మయా మిషన్ వారు కడపకు సమీపంలో ఏర్పాటు చేసిన చిన్మయ ఆశ్రమం వర్ధిల్లుతోంది. అనంతపురం సభలో స్వామిని శారదా ప్రియనంద సభలో నేను ముఖ్య అతిథిని.

హైదరాబాదులో స్వామి పరిపూర్ణానంద సుపరిచితులు. వారి ఛానల్‌లో చర్చాకార్యక్రమాలలో నేను పాల్గొన్నాను. హిందూ ధర్మ పరిరక్షణకు వారి కృషి అమోఘం.

శ్రీ స్వరూపానంద స్వామివారితో విశాఖ, 2022

1991 నాటి మాట. పెంచల కోన (నెల్లూరు జిల్లా)కు చెందిన మాతా విజయయేశ్వరీదేవి అనంతపురంలో సాయిబాబా స్కూలు ఆవరణలో చిన్నపిల్లల నాలుకలపై బీజాక్షరాలు లిఖించారు. వారిని ఆకాశవాణి స్టూడియోకు ఆహ్వానించి రికార్డింగు చేశాము. ఆమె వెంట వీడియోగ్రాఫర్ వచ్చాడు. ఆధునిక ప్రచారసాధనాలు వున్నాయి. కరుణామయిగా పిలవబడే ఆమె నెల్లూరు జిల్లా గూడూరు వాసి. పెంచలకోన నరసింగస్వామి భక్తురాలు. అందువల్ల అక్కడ ఒక ఆశ్రమం నిర్మించారు. రావూరులో శ్రీ విజయేశ్వరీదేవి గ్రామీణ విద్యా వైద్య సంస్థను నెలకొల్పారు. బెంగుళూరుకు సమీపంలో శ్రీకరుణామయి శాంతి గ్రామం స్థాపించారు. బాల్యం నుండి ఆమె మనం, ధ్యానం లను ప్రేమించేది.

మాతాజీ జనవరి, ఫిబ్రవరి మాసాలలో భారతదేశంలోను, మే జూన్ జులై నెలల్లో విదేసాలలోను ఆధ్యాత్మికోన్నతిని బోధిస్తూ పర్యటిస్తారు. ప్రశాంతంగా ధ్యానం చేయడం ఓ దివ్యానుభూతి అని ఆమె భక్తులకు సందేశంలో తెలుపుతుంటారు.

ఈ రీతిగా పలువురు బాబాలు, మాతాజీల సందర్శనం, సందేశాలు నాలో ఆధ్యాత్మికానుభూతిని పెంచాయి. 80వ ఏట ఆరోగ్యవంతంగా ప్రశాంత జీవనం గడుపుతూ విశ్రాంత జీవితాన్ని 20 ఏళ్లుగా గడపగలిగాను.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version