Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వందే మా ‘తరం’-41

[తరాలు మారుతున్నాయి. సమాజం వేగంగా పరుగులు తీస్తోంది. విశ్వగ్రామం అనే సిద్ధాంతం ప్రబలింది. 1947లో పుట్టి 80వ ఏట కాలిడిన ప్రముఖ రచయిత డా. రేవూరు అనంత పద్మనాభరావు మూడు తరాల ప్రముఖులతో కలిసి మెలిసి తిరిగారు. ఆ జ్ఞాపకాల పందిరిని ధారావాహికంగా అందిస్తున్నారు.]

మారుతున్న గ్రామీణ భారతం:

80 ఏళ్ల జ్ఞాపకాలు నన్ను విభ్రాంతికి గురి చేస్తున్నాయి. 1947 జనవరి 29న రథసప్తమీ పర్వదినాన నెల్లూరులో కన్యకల ఆసుపత్రిలో మూడు రోజుల ప్రసవ వేదన తర్వాత శారదా మాతకు నేను మూడో సంతానంగా పుట్టాను. మా స్వగ్రామం చెన్నూరు. అది చిన్న వూరు. రెండు వందల గడపల వూరు. మూడు మజరా గ్రామాలు. జిల్లా హెడ్ క్వార్డర్సు నెల్లూరుకు 30 కిలోమాటర్ల దూరం. మధ్యలో బుచ్చిరెడ్డిపాళెం. కాదు, కాదు ‘రిచ్’ రెడ్డి పాళెం, సంపన్నుల నిలయం.

1950లో పంచాయతీ వ్యవస్థ ఏర్పడే నాటికి చెన్నూరు పంచాయతీ తొలి ప్రెసిడెంటు ఆములూరు వెంకటసుబ్బానాయుడు. ఎలక్షన్ల హడావిడి లేకుండా రెండు దఫాలుగా పది సంవత్సరాలు ఆయనే ప్రెసిడెంటు, గ్రామ పంచాయతీ దస్త్రాలు మా యింట్లోనే వుండేవి. మా నాన్నగారు 1950 నుండి 1990 వరకు పంచాయతీ లెక్కలు చూస్తూ ఇంటి పన్నులు వసూలు చేసేవారు. పంచాయతీ ఆదాయం సంవత్సరానికి రెండు వేలు మించేది కాదు. ఒక స్వీపరు – పేరయ్య – వీధులు చిమ్మేవాడు. పంచాయతీ రేడియో మా యింట్లోనే వుండేది. సాయం కాలం 6 గంటల నుండి 10 గంటల వరకు రేడియో ‘ఆన్’ చేసే వాళ్లం. ముఖ్యంగా బుర్రకథలు, హరికథలు పల్లె జనులు వినేవారు. ప్రాంతీయ వార్తలు, ఢిల్లీ నుండి జాతీయ వార్తలు ఆసక్తిగా వినేవారు. సమాచార వ్యవస్థ అది ఒక్కటే.

పోస్టులో ఆంధ్రపత్రిక విజయవాడ నుండి మూడో రోజుకు ప్రెసిడెంట్ వెంకట సుబ్బయ్య పేర వచ్చేది. ఆయన అన్ని పేజీలూ ఆమూలాగ్రం చదివేవారని చమత్కరించేవారు. అప్పటికాయన వయస్సు 70. ఆయన కుమారులలో పెద్దవాడు రోశయ్య. గ్రామ మునసబుగా 40 ఏళ్లు రెవిన్యూ వ్యవహారాల దక్షుడు. ఆయన తమ్ముడు రమణయ్య. నెల్లూరులో R.S.S. కార్యాలయంలో వుంటూ వీ.ఆర్. కాలేజీలో బి.యస్.సి చేశాడు. ఇరిగేషన్ డిపార్టుమెంటులో ఆఫీసు సూపరిండెంట్‌గా రిటైరయ్యాడు. ఆయన కుమారుడు ‘గోపి’ రష్యాలో యం.బి.బి.యస్ పూర్తి చేసి గత 20 సంవత్సరాలుగా హైదరాబాదులో వివిధ ఆసుపత్రిలలో డాక్టర్‌గా పని చేసి ప్రస్తుతం సికిందరాబాదు యశోదా హస్పిటల్‌లో ప్రముఖ పాత్ర వహిస్తున్నాడు. ఆయన భార్య మొన్నటిదాకా తెలంగాణా రాజ్‍భవన్ ఎకౌంట్స్ ఆఫీసరు.

“ఈ గోల మాకెందుకు?” అని పాఠకులు ప్రశ్నించవచ్చు.

మారుతున్న గ్రాణీణ భారత ముఖ చిత్రం వివరించే ప్రయత్నమిది. 1952లో జనరల్ ఎన్నికలు జరిగాయి. పెద్దరెడ్డి చెప్పిన కాంగ్రెసు పెట్టెలోనే అన్ని ఓట్లు పడ్డాయి.

విద్యావ్యవస్థ:

మాది ‘దొడ్ల’ వారి జమీందారీ గ్రామం. రైతుల వద్ద గ్రామకరణం అన్నదాత వెంకట సుబ్బయ్య శిస్తు వసూలు చేసి జమీందార్లకు అప్పగించేవారు. వారి పొలాల మీద వచ్చిన ధాన్యం నిల్వ చేసే పెద్ద కొట్లు వుండేవి. జమీందారు చావడి వుండేది. పక్కనే వారి బిల్డింగులలోనే ప్రాథమిక పాఠశాల నడిచేది. 1950ల నాటి మాట. 1 నుండి 5 వ తరగతి వరకు 60 మంది విద్యార్ధులు. ఒక హెడ్మాష్టార్. మరొక టీచరు. నేను 1952 జూన్ లో 5 ఏళ్లు నిండగానే ఒకటో తరగతిలో చేరాను. పాపయ్య అయ్యవారు హెడ్మాస్టారు. ఆయన సైకిల్ మీద స్వగ్రామం వెలిపాడు నుండి స్కూలికి వచ్చేవారు. మరో టీచరు రావినూతల గోపాల కృష్ణమూర్తి. ఆయన 1, 2,3 తరగతులకు బోధించేవారు. 4,5 తరగతులు హెడ్మాష్టారు వంతు. నేల బల్లల మీద బకే గదిలో ఐదు తరగతుల వాళ్లం కూచోనే వాళ్లం. ఒక మూల హెడ్మాస్టారు. మరో మూల మరో టీచర్.

నాలుగు, ఐదు తరగతులకు టెక్స్ట్ పుస్తకాలుండేవి. మిగతా వాళ్లకు పలక మీదనే పాఠాలన్నీ. అక్షరమాల, ఎక్కాలు, పెద్ద బాలశిక్ష, సుమతీ శకతం సిలబస్‌లో భాగం. చిన్న మేస్టారుకు చుట్ట కాల్చడం అలవాటు. మాకు పలకల మీద వ్రాసుకోనే పని అప్పగించి ఆయన అలా వీధిలోకి వెళ్లి చుట్ట కాల్చుకొని 20 నిముషాల తర్వాత వచ్చేవారు. చేతిలో బెత్తం ఇద్దరి మేష్టార్ల చేతిలో పని కల్పించుకొనేది.

పాపయ్య గారు స్వగ్రామానికి బదిలీ కాగా 1954 ప్రాంతంలో హెడ్మాష్టార్ జాన్ అయ్యవారు వచ్చారు. ఆయన బహు కుటుంబీకుడు. చాలా సంవత్సరాలున్నారు. ఆ గ్రామం నుండి హైస్కూలు చదువులకు బుచ్చిరెడ్డిపాళెం వెళ్లేవారు. 1972 నాటికి మా వూరి నుండి ముగ్గరే గ్రాడ్యుయేట్, ప్రోస్టు గ్రాడ్యుయేట్లు.

రామాలయం అర్చకులు జూటూరు వెంకట సుబ్బయ్య కుమారుడు వెంకటేశ్వరరావు తిరుపతి యస్.వి. ఇంజనీరంగు కాలేజిలో బి.ఇ. పూర్తి చేశాడు. హైదరాబాదులో ఎలక్ట్రిసిటీ బోర్డులో సూపరెంటెండ్ ఇంజనీరుగా పని చేశాడు. చైర్మన్ పార్థసారథికి సన్నిహితుడిగా మంచి పేరు. హైదరాబాదులో స్థిరనివాసం.

రెండో వ్యక్తి మా టీచరు గోపాలకృష్ణమూర్తి కుమారుడు రామానుజ శర్మ. తిరుపతి ఇంజనీరింగు కాలేజీలో బి.ఇ. చేశాడు. ఇరిగేషన్ డిపార్టుమెంటులో సూపరింటెండ్ ఇంజనీరుగా రిటైరయి హైదరాబాదులో స్థిరనివాసం.

మూడో వ్యక్తిని నేనే. 1967లో తెలుగు ఎం.ఏ. పూర్తి చేశాను. ఆకాశవాణి దూరదర్శన్ లలో మూడు దశాబ్దాలు పని చేశాను. పూర్వాశ్రమంలో తెలుగు అధ్యాపకుడిగా 1967-75 మధ్య కందుకూరు ప్రభుత్వ కాలేజీ అధ్యాపకత్వం. మా మగ్గురి నా ఎరుకలో ఉన్నత విద్య చేసిన వారు సకృత్తుగా కన్పిస్తారు. 2025 మార్చిలో మా పూర్వ పాఠశాల చూడడానికి వెళ్లాను. ఐదు తరగతులకు కలిపి ఆరుగురు విద్యార్ధులు. ఒకే టీచరు. మిగతా పిల్లలు టౌన్‌లో కాన్వెంట్లకు పరుగులు.

వైద్యశాల, చెన్నూరు

రహదారి సౌకర్యం:

70 ఏళ్ల నాటి మాట. 1955లో నేను బుచ్చిరెడ్డిపాళెం జిల్లాపరిషత్ హైస్కూలులో సెవన్త్ క్లాసులో చేరి 1960 జూన్ నాటికి యస్.యస్.యల్.సి. (11వ తరగతి) పూర్తి చేశాను. నాకు 10 మైళ్లు ఆ వూరు. శని, ఆదివారాలు నడుచుకుంటూ చెన్నూరు వెళ్లి వచ్చేవాడిని. ఏదైనా ఎడ్లబండి వెళితే అందులో కూచుని ఓ రెండు గంటల ప్రయాణం. 1970ల నాటికి మా వూరికి 3 కిలోమీటర్ల దూరంలో తురిమెర్ల వరకు వెళితే నెల్లూరు బస్ సౌకర్యం వుండేది. లేదా ట్రంకురోడ్డు వైపు వెళితే 6 కిలోమీటర్ల దూరంలో సున్నపు బట్టి వద్ద బస్ దొరికేది. ఇప్పుడు ఆ ఏరియాలో దగవర్తి ఎయిర్‌పోర్టు నిర్మాణం జరుగుతోంది. 1990ల నాటికి నెల్లూరు- కావలి బస్సులు మా వూరి మీదుగా వెళుతున్నాయి. R.T.C బస్సులు వస్తున్నాయి. 2025 మార్చిలో ఉగాది నాడు రామమందిరం వార్షికోత్సవాలలో మా ఉభయం నిర్వహించడానికి కార్లో వెళితే గ్రామ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. బస్టాండు ఏర్పడింది. హోటలు, పక్కనే బ్రాందీ షాపు ఆశ్చర్యం గొలిపాయి. ‘అద్దెకివ్వబడును’ బోర్డు కన్పించింది.

పంచాయితీ బోర్డు ఆఫీసు కొత్తగా కట్టారు. పాలకేంద్రం వచ్చింది. ఆరోగ్యకేంద్రం నిర్మించారు. రామ మందిరం ముందు కల్యాణమండపం ఏర్పడింది. ‘ఔరా! ఇది మా చెన్నూరేనా?’ అని ఆశ్చర్యపోయాను.

పాల శీతలీకరణ కేంద్రం

మెయిన్ రోడ్డులో ఆ చివర నుండి మా యింటి వరకు నడిచాను. కుడి వైపు మూడు, నాలుగు ఇళ్లు. ఎడమ వైపు వీధి నిండా ఇళ్లు. కానీ, నివసించే వ్యక్తులు తక్కువ. అందరూ నెల్లూరు, బుచ్చి పట్టణాల వైపు వ్యాపార నిమిత్తం, పిల్లల చదువులకు తరలి వెళ్లారు. అంతకు ముందు 15 రెడ్ల కుటుంబాలుండేవి. ప్రస్తుతం నలుగురే. కాపులు మా వూర్లో లేరు. రెడ్లనే కాపువారు అని పిలుస్తారు. వైశ్యులు, యాదవులు, సాలెలు, తదితరులు మధ్య తరగతి, బలహీన వర్గాల వారున్నారు. 20 ఏళ్లనాడు ఊరు వదలిన నన్ను గుర్తు పట్టేవాళ్లు కొద్దిమంది.

‘కాంతయ్య కొడుకును’ అని పరిచయం చేసుకోవలసి వచ్చింది. వీధులు సిమెంటు రోడ్లు అయినాయి. పంటపొలాలు ఎకరం 12 లక్షలు పలుకుతున్నాయి. మా నాన్న గారు 10 ఎకరాలు సొంత వ్యవసాయం 50 ఏళ్లు చేశారు. 2000 సంవత్సరంలో ఆయన గతించడానికి ముందే ఆ పొలాలను ఎకరం పదివేల చొప్పున అమ్మి బ్యాంకులో వేశారు. అంతుక ముందు చెరువు నీటిపై ఆధారపడి వ్యవసాయం కొనసాగింది. ఇప్పుడు కావలి కన్పూరు కాలువ నీటి సాగు వలన వ్యవసాయరంగం ముందంజ వేసింది.

శివాలయం, చెన్నూరు

మజరా గ్రామాలు:

చెన్నూరు పంచాయతీలో భాగంగా రెండు కిలోమీటర్ల దూరంలో కట్టుబడి పాళెం, సిద్దారెడ్డి పాళెం, తిమ్మ రెడ్డి పాళం అనే మూడు మజరా గ్రామాలున్నాయి. అదిగాక మాలవాడ, మాదిగ వాడ విడివిడిగా ఉన్నాయి. కట్టుబడి పాళెంలో అధిక శాతం బలిజ కులస్థులు. వారు వ్యాపారం మదరాసులో చేస్తూ పురోభివృద్ధి సాధించారు. 1978 ప్రాంతానికి ఆ వూరికి చెందిన వేముల ఆదిశేషయ్య చెన్నురు పంచాయతీ అధ్యక్షలయ్యారు. చెన్నూరులో వున్న పెత్తనం అప్పుడు కడ్డుబడిపాళెం చేరుకొంది. ఆదిశేషయ్య నేదురుమళ్లి జనార్ధనరెడ్డికి ఆప్తుడు. దగవర్తి మండల పరిషత్ అధ్యక్షుడిగా 5 ఏళ్లు పాలించాడు.

రామాలయం విగ్రహాలు

కట్టుబడిపాళెంలో గ్రామస్తుల కృషి ఫలితంగా చెన్నూరుకు రావలసిన హైస్కూలు కట్టుబడి పాళెం సాధించగలిగంది. చాలా మంది ఉన్నత విద్యలు చదివి ఉన్నతోద్యోగాలలో ఉన్నారు.

సిద్ధారెడ్డి పాళెం చిన్నవూరు. వంద కుటుంబాలుంటాయి. అక్కడ పొట్టి కోమటి శెట్టి కమ్యూనిస్టు పార్టీ సానుభూతిపరుడు. రాజకీయాల పట్ల ఆసక్తి గలవాడు. విశాలాంద్ర దినపత్రికను తెప్పించేవాడు. మూడడుగుల ఎత్తు. ఆలోచనలో దిట్ట. ఆ వూర్లో ఎలిమెంటరీ స్కూలు వచ్చింది. గణపతి శాస్త్రి అనే టీచరు గ్రామస్తుల అభిమానం చూరగొన్నారు. ఆయన సత్యసాయిబాబా భక్తులు. రిటైరయిన తర్వాత నెల్లూరులో స్థిరపడ్డారు. గురువారం ఉదయం సాయి భజనలు నెల్లూరు పురవీధులలో నిర్వహించేవారు.

గ్రామాలయాలు:

మా వూర్లో ప్రధానంగా శివాలయం ప్రాచీనం. శివార్చకుడు శివయ్య. ఆయనకు మూడోతరం శివప్రసాద్. ఆయన కుమారుడు రవికాంత్ శివాలయ పునరుద్ధరణకు మార్గదర్శనం చేసి నిత్య పూజలు కొనసాగించి భక్తుల ప్రేమ చూరగొన్నారు. రామ మందిరం శిధిలావస్థలో వుంది. జోటురు కుటుంబంలో వేణుగోపాల్ మూడు దశాబ్దాలు అర్చన చేశాడు. ఆయన మరణంతో ఆ బాధ్యతను సర్వాభొట్ల మల్లికార్జున భక్తి శ్రద్ధలతో చేస్తున్నాడు.

ఉత్సవమూర్తులు

ఆంజనేయ స్వామి గుడి శివాలయం ప్రాంగణంలోనే వుంది. శివాలయం వాకిట్లో వీరభద్రస్వామి గుడిని జంగమదేవరలు కొలుస్తున్నారు. శివరాత్రికి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుపుతారు. ఉగాది నుండి శ్రీరామ నవమి వరకు సీతారామ లక్ష్మణుల వార్షికోత్సవాలు వైభవంగా గ్రామస్థులు జరుపుతున్నారు. కులాల వారీగా ఒక్కొక్క వాహన సేవను ఎంచుకొని పోటాపోటీగా ఉత్సవ సంరంభం కొనసాగుతోంది. ఇదీ గ్రామీణ భారత ముఖచిత్రం. అధికశాతం గ్రామాల స్థితి ఇలానే వుంది.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version