[తరాలు మారుతున్నాయి. సమాజం వేగంగా పరుగులు తీస్తోంది. విశ్వగ్రామం అనే సిద్ధాంతం ప్రబలింది. 1947లో పుట్టి 80వ ఏట కాలిడిన ప్రముఖ రచయిత డా. రేవూరు అనంత పద్మనాభరావు మూడు తరాల ప్రముఖులతో కలిసి మెలిసి తిరిగారు. ఆ జ్ఞాపకాల పందిరిని ధారావాహికంగా అందిస్తున్నారు.]
దైవాల కొలువు – ఆలయాల నెలవు నెల్లూరు:
గత పది నెలలుగా మా తరం వ్యక్తులు, ప్రదేశాలను గూర్చి ముచ్చటించాను. ఇప్పుడు నేను పుట్టి పెరిగిన విక్రమసింహపురిలోని ఆలయ సంపద గూర్చి సవిస్తరంగా ప్రస్తావిస్తాను. ఒంగోలు నుండి మదరాసు వైపు రైలులో ప్రయాణిస్తూంటే పెన్నానది బ్రిడ్జి మీద రణగొణ ధ్వనులు సమీపించగానే కుడి వైపు ఎత్తైన రంగనాథస్వామి ఆలయ గోపురం ప్రత్యక్షమవుతుంది. ఎరగుడిపాటి వెంకటాచలం పంతులు 1859 నాటికి గాలి గోపుర నిర్మాణాన్ని కష్ట నష్టాల కూర్చి పూర్తి చేశారు.
చరిత్ర పుటలు తిరగవేస్తే మనుమసిద్ధి కాలానికి అంటే క్రీ.శ. 1280 నాటికి తల్పగిరి రంగనాథుడు రంగ రంగ వైభవంగా పూజలందుకొన్న ఆధారాలు లభ్యమవుతాయి. మనుమసిద్ధి వద్ద మంత్రిగా తిక్కనామాత్యుడు కొలువు చేశాడు. ఆయన కంకితంగా నిర్వచనోత్తర రామాయణ కావ్యం వ్రాశాడు.
“ఏనిన్ను మామయనియెడు
దానికి తగనిమ్ము భారతీ కన్యక”
అని మనుమసిద్ధి తిక్కనను అభ్యర్ధించాడు. కృతి కన్యకను స్వీకరించి అల్లుడైనాడు. తిక్కన వ్రాసిన ఆంధ్రమహాభారతానికి వాడిన ఘంటం ఇప్పటికీ పెన్నానది వొడ్డున తిక్కన మ్యూజియంలో భద్రపరచబడి వుంది. పూర్వం ఈ ప్రాంతంలో పెన్నానది రెండు పాయలుగా చీలి అంతర్వేదిగా ఏర్పడి పవిత్రమైంది. కాలగమనంలో దక్షిణపుపాయ పూడిపోయి పినాకినిగా నామాంతరం చెందిననట్లు చెబుతారు. తిక్కన వంశీకుడు రామకృష్ణ ప్రస్తుతం నెల్లూరులో నివసిస్తున్నాడు.
తల్పగిరి రంగనాథస్వామి శయనమూర్తి, శ్రీరంగంలోవలె చరిత్ర ప్రసిద్ధం. దాదాపు వెయ్యి సంవత్సరాల పూర్వమే ఆలయ నిర్మాణం జరిగింది. దక్షిణ సరిహద్దులలో కావేరీ తీరాన శ్రీరంగ క్షేత్రం, ఉత్తర సరిహద్దులలో పినాకినీ తీరాన తల్పగిరి రంగనాథ స్వామి, పడమర శ్రీరంగపట్నంలో రంగనాథుడు వెలశారు. ఈ ఆలయాలు మూడింటిలోను చోళ సంప్రదాయంలో ఆగమశాస్రానుసారం పూజాదికాలు నిర్వహిస్తారు. శాసనాల ఆధారంగా క్రీ.శ. 1078 సంవత్సరం నుండి కుళోత్తుంగ చోళులలో మొదటి వాని నుండి ఇక్కడి ఆలయంలో శాసనాలు లభ్యమవుతున్నాయి.
చక్రవర్తుల పాలనలో..
క్రీ.శ. 7-8 శతాబ్దాలలో పల్లవ చక్రవర్తులు నెల్లూరు సీమను పాలించారు. వారు తల్పగిరి రంగనాథుని ప్రతిష్ఠించారు. ఆ తర్వాత 12వ శతాబ్ది నాటి రాజరాజనరేంద్రుడు, ఉభయకులోత్తుంగ చోళుడు ఆలయ గర్భగృహాదులు నిర్మించారు. 13వ శతాబ్ది జటావర్మ సుందరపాండ్యుడు మనుమసిద్ధిని యుద్ధంలో జయించి రంగనాథాలయంలో వీరాభిషేకం చేయించుకున్నాడు. ఆ సందర్భంగా స్వామికి మడులు, మాన్యాలు దానకైంకర్యం చేశాడు.
తొలి రోజుల్లో ఈ ఆలయ ప్రాంతాన్ని ‘చిత్తర మేళ విణగల్’ అంటే శ్రీవైకుఠమనేవారు. రంగనాథస్వామిని ‘పళ్లికొండు పెరుమాళ్లు’ అంటే శయన నారాయణుడని కొలిచేవారు. 17, 18 శతాబ్దాల నాటికి సంస్కృత నామం తల్పగిరి రంగనాథుడు స్థిరపడింది. పురాతన చరిత్రను పరిశీలిస్తే ఏ ఏ రాజులు ఏయే గ్రామాలను దానమిచ్చారో తెలుస్తుంది.
1800 సంవత్సరం తర్వాత వెంకటాద్రి స్వామిగా ప్రసిద్ధులైన అల్లూరి వెంకటరమణదాసు మూలవిరాట్ వున్న ఆలయ విమానాన్ని పూర్తిగా పునరుద్ధరణ చేసి దానిపై స్వర్ణ కలశాలను ఏర్పచారు. కథ అంతటితో ఆగలేదు. నెల్లూరు జిల్లా సివిల్ అండ్ సెషన్స్ కోర్టులో శిరస్తదారుగా ఉద్యోగిస్తున్న ఎరగుడిపాటి వెంకటాచలం పంతులు 1835లో రంగనాయకుల పేటలో చిత్రకూటమనే ప్రదేశం నిర్మించారు. ఇందులో డోలోత్సవానికి పుణ్యకోటి విమానం కూడా ఏర్పాటు చేశారు.
కోదండ రామాలయం, బుచ్చిరెడ్డిపాళెం
1837లో ఆనందరావు ధర్మపత్ని యమునాబాయి రంగనాథునికి గంటల ధ్వజస్తంభం ఏర్పరిచింది. ఆనందరావు నెల్లూరు సీమకు అప్పట్లో కుంఫిణీ తరపు తాశిల్దారు. 1845లో వానమామలై జియ్యంగారు చిత్రకూటంలో బస చేశారు. శ్రీరంగనాథాలయం దివ్యదేశం కానందున ఆయన ఆలయంలో స్వామిని దర్శించలేదు. ఆ రాత్రి స్వామి ఆయనకు కలలో కన్పించి ఆలయ విశిష్టత తెలిపారు. మర్నాడు ఆలయ ప్రవేశం చేశారు.
గాలిగోపుర నిర్మాణానికి జియ్యంగారు వెంకటాచలం పంతులును పురికొల్పి వంద నాణెములు సమర్పించారు. అలా 1860 నాటికి అద్భుతమైన అతి పెద్ద గాలిగోపురం తయారైంది. ఆ తర్వాత పలువురు దాతలు భక్తులకు వసతి గృహం, మంటపం, రత్నాల వైలుముడి, బంగారు గరుడవాహనం, అద్దాల మండపం, విష్ణు సహస్రనామాలతో బంగారు జరీధోవతులు సమకూర్చారు. 2002 నాటికి 22 లక్షల అంచనాతో మధుర శిల్పులు గాలిగోపురంపై శిల్పాలను పునర్నిర్మించారు. 2001 జనవరిలో ‘లాయర్’ వార పత్రిక వెలువరించిన ప్రత్యేక సంచికలో ఈ వివరాలు లభిస్తాయి.
మరో రెండు పురాతన ఆలయాలు:
మూలస్థానేశ్వరాలయం:
నెల్లూరు నెరజాణలనే పేరు ఎలా వచ్చిందో తెలియదు. కానీ ఆలయాల నిలయం. నెల్లూరు పట్టణంలోనే మూలస్థానేశ్వరాలయం మూలపేటలో వుంది. నెల్ల (ఉసిరిక చెట్టు) కింద లింగాకారంలో స్వయంభూ అవతారం జరిగిందని ప్రతీతి. బహుశా నెల్లి + ఊరు = నెల్లూరు అయిందేమో! భువనేశ్వరీ సమేత మూలస్థానేశ్వరుడు ఇక్కడ పూజలందుకుంటున్నాడు. 60 ఏళ్ల క్రితం ఆ పరిసరాలలో కొద్ది నివాస గృహలుండేవి. ఇప్పుడది క్రిక్కిరిసిన ప్రదేశం. పంచారామాల వలె ఇక్కడ పంచ గోష్టం వుంది.
ఆలయ గర్భగుడిలో ఆగ్నేయ పార్శ్వంలో గణాధిపతి, దక్షిణాభిముఖంగా దక్షిణామూర్తి, పశ్చిమాభిముఖంగా విష్ణుమూర్తి, ఉత్తరాభిముఖంగా చతుర్ముఖ బ్రహ్మ ఈశాన్య పార్శ్వంలో ఉత్తరాభిమఖంగా దుర్గాదేవి పూజలందుకొంటున్నారు. రాహుకాల పూజలు జరుపుతారు. శ్రీకాళహస్తిలో దక్షిణామూర్తి వెలసినట్లే ఇక్కడ దక్షిణామూర్తి వెలశాడు. సముదాయ దేవాలయాలలో నటరాజ స్వామి, సహస్ర లింగేశ్వరుడు, సూర్యదేవుడు పూజలందుకోవడం విశేషం.
మూలస్థానేశ్వర ఆలయం, మూలపేట
మూల స్థానేశ్వరుని దర్శించడానికి కార్తీక మాసంలో భక్తులు విరివిగా వస్తారు. మాఘ మాసంలో శివరాత్రికి ముందు ఐదు రోజులు తర్వాత ఐదు రోజులు మొత్త 10 రోజులు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుపుతారు. కార్తిక పూర్ణిమనాడు చంద్రదర్శనార్ధమై భక్తులు ఆలయానికి వస్తారు. శివ భక్తులకిది కొంగు బంగారం.
విశాల ప్రాంగణం. ఒక హెక్టారు స్థలంలో ఆలయం నిర్మించారు. వీరశైవం పుంజుకొన్న క్రీ.శ. 1100 – 1150 ప్రాంతంలో శైవ మతావలంబులైన చోళరాజులు శివాలయాలు పలు ప్రాంతాలలో నిర్మించారు. నెల్లూరులో అప్పటికి జైన మతం చలామణీలో వుంది. నెల్లూరుకు 12 కిలోమీటర్ల దురంలో జైన దేవాలయం 24వ తీర్థంకర ధామం. నేషనల్ హైవే-5 పక్కన నిర్మించడం అందుకు ఉదాహరణ. 1988లో ఐదు కోట్ల రూపాయలతో ఈ ఆలయ పునాది మొదలైంది. 1996 ఏప్రిల్ 25న జైనమత ప్రధానాచార్యులు ఆచార్య విజయశ్రీ కళాపూర్ణ సూరీశ్వర్ మహరాజ్ మహావీరుని విగ్రహ ప్రతిష్ఠ చేశారు. శిల్ప సౌందర్యంతో నాలుగు దిక్కులా మహావీరుని నాలుగు పాలరాతి విగ్రహాలు ప్రతిష్ఠించారు. అలా జైనం బలపడింది.
వేణుగోపాల స్వామి ఆలయం:
160 సంవత్సరాల క్రితం నెల్లూరు మూలాపేట మూలస్థానేశ్వరాలయ సమీపంలో వేణుగోపాల స్వామి దేవస్థానానికి 1873 సంవత్సరం కృష్ణాష్టమి నాడు ప్రతిష్ఠ జరిగింది. కంఠాబత్తిన పాపిరెడ్డి దంపతులు సంతాన లేమితో శివాలయ పూజలు చేసేవారు. శివాలయ సమీపంలో కోనేరు తవ్వగా వేణుగోపాల స్వామి విగ్రహం లభించింది. దానిని శివాలయంలో ప్రతిష్ఠించారు. పాపిరెడ్డి మరణానంతరం ఆయన భార్య సుబ్బమ్మ తమ యావదాస్తిని ఆలయం పేర దానం చేసింది.
వేణుగోపాల స్వామి ఆలయ ప్రతిష్ఠను మేల్కోట్ యతిరాజ మఠాధిపతి శ్రీ రామనుజ జియ్యర్ చేశారు. 1970లో దేవస్థాన సత్రాలు నిర్మించారు. 1997లో వేణుగోపాల స్వామి డిగ్రీ కళాశాల ప్రారంభించారు. చైత్రమాసంలో ఏకాదశి నుండి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ ఆలయంలో పెళ్లిళ్లు విశేషం.
నరసింహులు కొండ ఆలయం
గొలగమూడి వెంకయ్య స్వామి:
1897 ప్రాంతంలో జన్మించిన వెంకయ్య స్వామి ఒక అవధూత. కులమతాలకు వ్యతిరేకంగా వేదాంత ధోరణి మట్లాడేవాడు. 1995లో ఆయన నెల్లూరుకు సమీపంలోని గొలగమూడి చేరుకొన్నారు. 8 ఏళ్లపాటు నిత్యాగ్ని హోత్రం చేశారు. 70వ ఏట 1982 ఆగస్టు 24న జీవ సమాధి చెందారు. 1983 నుండి శ్రీభగవాన్ వెంకయ్యస్వామి ఆరాధన ఉత్సవాలు మొదలయ్యాయి. ప్రతి శనివారం భక్తులు విరివిగా వస్తున్నారు. ఆగస్టు నెలలో ఆరాధానోత్సవాలు జరుగుతాయి.
ధర్మరాజు దేవాలయం:
పరశరాముడు 21 మార్లు క్షత్రియ వంశ నాశనం చేశాడు. హిమాలయాలలో జంబూ మహర్షి చేసిన యాగం నుండి స్వయంభూ మనువు జన్మించాడని ఐతిహ్యం. ఆయన సంతతి వారమని అగ్నికుల క్షత్రియలు విశ్వసిస్తారు. ద్రౌపదీ సమేత ధర్మరాజు ఆలయాన్ని నెల్లూరు చెరువు సమీపంలో వారు నిర్మించిట్లు నెల్లూరు గెజిట్ చెబుతోంది. ఇక్కడ ద్రౌపది, ధర్మరాజు విగ్రహాలకు నిత్య పూజలు జురుగతాయి. దేవతలకు గాక పురాణ పురుషులకు వెలసిన ఆలయమిది. గర్భగుడికి ఎదురుగా పోతురాజుల విగ్రహ ప్రతిష్ఠ వుంది. మూడేళ్ల కొకసారి ఇక్కడ బ్రహ్మోత్సవాలు జ్యేష్ఠమాసంలో 21 రోజులు జరుగుతాయి. పాండవుల జననాదికాలు యుధిష్టిర పట్టాభిషేకం వరకు ఉత్సవాలలో ప్రదర్శిస్తారు. నెల్లూరు నగరంలోని ఆలయాల తర్వాత నెల్లూరు జిల్లాలోని ఇతర ప్రసిద్ధ ఆలయాల వివరాలు మరో సంచికలో.
(మళ్ళీ కలుద్దాం)
డా. రేవూరు అనంతపద్మనాభరావు అష్టావధాని, విమర్శకులు, ప్రముఖ సాహితీవేత్త. తెలుగు సాహిత్యం లోని అన్ని ప్రక్రియలలోనూ రచనలను చేశారు. 80 ఏళ్ళ వయస్సులో నిరంతర అధ్యయన, అధ్యాపనాలు కొనసాగిస్తూ 120 గ్రంథాలు ప్రచురించారు. 2005 లో దూరదర్శన్, ఢిల్లీ నుండి అదనపు డైరక్టర్ జనరల్‌గా పదవీ విరమణ చేశారు. పదవీ విరమణాంతరం గత 20 సంవత్సరాలలో 80 గ్రంథాలు వివిధ ప్రక్రియలలో ప్రచురించారు.
అనువాద సాహిత్యంలో తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం (1993); కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం (2000), అప్పాజోశ్యుల – విష్ణుభొట్ల – కందాళై ఫౌండేషన్ వారి విశిష్ట సాహితీ పురస్కారం లభించాయి. వీరి రచనలపై వివిధ కోణాలలో 5 విశ్వవిద్యాలయాల నుండి ఆరుగురు ఎం.ఫిల్/పిహెచ్డి పరిశోధనా గ్రంథాలు సమర్పించి పట్టాలు పొందారు.
సంచికలో వీరు గత ఐదు సంవత్సరాలలో – ఆకాశవాణి పరిమళాలు, కావ్యపరిమళం, జ్ఞాపకాలు-వ్యాపకాలు, ఆచార్య దేవోభవ, అవధానం ఆంధ్రుల సొత్తు అనే ఐదు గ్రంథాలు సమర్పించారు.
