[తరాలు మారుతున్నాయి. సమాజం వేగంగా పరుగులు తీస్తోంది. విశ్వగ్రామం అనే సిద్ధాంతం ప్రబలింది. 1947లో పుట్టి 80వ ఏట కాలిడిన ప్రముఖ రచయిత డా. రేవూరు అనంత పద్మనాభరావు మూడు తరాల ప్రముఖులతో కలిసి మెలిసి తిరిగారు. ఆ జ్ఞాపకాల పందిరిని ధారావాహికంగా అందిస్తున్నారు.]
నెల్లూరు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు:
నేను నడయాడిన సింహపురి జిల్లా కవిపండితులకు, రాజకీయనేతలకే గాదు, ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలకూ నెలవు. కొన్నింటి పరిచయం గతంలో ప్రస్తావించాను. అవి కేవలం నెల్లూరు నగరానికే ప్రసిద్ధం. ఇప్పుడది నగరం. 1960-65 మధ్య నేను వెంకటగిరి రాజా కళాశాలలో చదివే రోజుల్లో ఒక చిన్న పట్టణం. మదరాసుకు దగ్గరగా మండటం వలన తమిళ వాసన అధికం. ఇటు రాయలసీమవారు మమ్మల్ని కోస్తా జిల్లా వాసులంటారు.
నేను చదివిన వి. ఆర్. కాలేజికి నూరేళ్లు నిండేయి. 2020 నాటికి నిజంగా నూరేళ్లు నిండాయి, కాలేజి మూతబడింది. ఒకప్పుడు వెలుగ వెలిగిన కాలేజి. ముప్పవరపు వెంకయ్యనాయుడు వంటి ప్రముఖులు డిగ్రీ చదివిన కాలేజి. వెంకటగిరి జమీందారు విరాళంతో ముందుగా హిందూ హైస్కూలు 1879 నవంబరులో కొనసాగింది. 150 ఏళ్ల చరిత్ర గల కాలేజి అప్పటి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల ప్రైవేట్ కాలేజీలకు ఎయిడ్ నిలిపివేయడంతో మూతబడింది. శల్యావశిష్టంగా మిగిలిన అధ్యాపకులను ఇతర కాలేజీలకు బదిలీ చేశారు. ఆలయాల గురించి చెబుదామనుకొన్నాను. కాని, నేను చదివిన విద్యాలయం శిధిలమైన ఆవేదనతో నాలుగు మాటలు ముచ్చటించాను.
నృసింహాలయాలు:
నెల్లూరుకు 80 కిలోమీటర్ల దూరంలో నెల్లూరు కడప జిల్లాల సరిహద్దుల మధ్య వెలుగొండల పడగల నీళ్లలో వెలసిన పుణ్యక్షేత్రం పెనుశిల నృసింహాలయం. పెంచలకోనగా ప్రసిద్ధం. ప్రహ్లాదుని రక్షణ స్తంభంలో ఆవిర్భవించిన ఉగ్రనారసింహుని ఒక చెంచు యువతి సమ్మోహన శక్తితో శాంతింపజేసిందని ఐతిహ్యము. స్వామి చెంచులక్ష్మిని ఉగ్రరూపంలోనే పైన వేసుకొని శిలగా మారినాడు. ఆలయంలో మూలవిరాట్ స్నానంలో రెండు శిలలు పెనవేసుకొని సాక్షాత్కరిస్తాయి. తరువాత స్వామి కృష్ణుని రూపంలో ఒక గొల్లబోయనికి దర్శనమిచ్చి తనకు గుడి కట్టించమని కోరాడు. గ్రామస్థులు గుడి నిర్మించారు. చెంచులక్ష్మిని వివాహమాడినందుకు పద్మలక్ష్మీదేవి అలిగి ఏటి గట్టుకుపోయింది. అక్కడ మహాలక్ష్మి ఆలయముంది. నవనారసింహ క్షేత్రాలలో చిత్రవటనృసింహమే పెంచలకోన నారసింహం. ఏటా వైశాఖ శుద్ధ ద్వాదశి మొదలు పూర్ణిమ వరకు ఐదు రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతారు. దగ్గరలో ఏడు గుండాలున్నాయి. వశిష్ఠాది సప్తర్షుల తీర్థాలుగా ఇవి ప్రసిద్ధం. ఇక్కడే కండలేరు ప్రవహిస్తుంది.
నరసింహులు కొండ:
వేదగిరి లక్ష్మీనారసింహుడు వెలసిన కొండ నరసింహులు కొండ. నెల్లూరుకు 8 కిలోమీటర్ల దూరం. లక్ష్మీ సమేత నారసింహుడు కొండపై వున్నాడు. ఇతిహాసాలను అనుసరించి కశ్యప మహర్షి యాగం కోసం త్రేతాగ్నులను రత్నగిరి (జొన్నవాడ), తల్పగిరి (రంగనాయకులపేట), వేదగిరి (నరసింహుల కొండ) లో ప్రతిష్ఠించారు. పూర్ణాహుతి కాగానే ఒక తేజో జ్యోతి కొండపై గుహలోకి ప్రవేశించింది. అదే నృసింహమూర్తి రూపంలో వెలసి కశ్యపునిచే ప్రతిష్ఠించబడింది. వైశాఖ శుద్ధ చతుర్దశి శనివారం సాయంకాలం స్వాతీ నక్షత్రంలో ఈ ఆవిర్భావం జరిగింది. ప్రస్తుతం ఈ సమయంలో జ్యోతిని వెలిగిస్తారు.
కాంచీపుర పాలకులు పల్లవ రాజులు పల్లవ శిల్పకళా వైభవం ఉట్టిపడేలా వైభవంగా తీర్చిదిద్దారు. కొన్ని గ్రామాలు మాన్యంగా సమర్పించారు. దీనిని వేదగిరి అంటారు. దక్షిణభాగంలో ప్రసన్నగోవింద రాజస్వామి ఆలయం. ఆదిలక్ష్మీ ఆలయం చెంత సంతాన వటవృక్షముంది. సంతానం లేని స్త్రీలు ముడుపులు చెల్లించి సంతానవంతులవుతున్నారు. నృసింహజయంతి ఉత్సవాలు ఏడు రోజులు నిర్వహిస్తారు.
జొన్నవాడ కామాక్షీతాయి:
నెల్లూరుకు 7 కి.మీ. దూరంలో పినాకినీ తీరంలో జొన్నవాడ క్షేత్రం వెలసింది. కశ్యపుని యజ్ఞవాటిక జొన్నవాడ అయింది. యజ్ఞం పూర్తి కాగానే గార్హపత్య అగ్నికుండం నుండి మల్లికార్జునుని పేర తేజస్సు జొన్నవాడలో వెలసింది. పార్వతీదేవి కైలాసనాథుని వెదుకుతూ అక్కడికి చేరుకొంది, స్వామి కోరిక మేరకు ఆమె కామాక్షిదేవిగా నిలిచిపోయింది. శచీదేవితో కలిసి ఇంద్రుడు రాక్షస బాధలు తప్పించుకొనడానికి ఈ ఆలయ దర్శనం చేసుకొన్నాడు.
వివిధ రాష్ట్రాల నుండి భక్తులు వేలాదిగా అమ్మవారిని శుక్రవారాలు దర్శిస్తారు. నవావరణ, ఖడ్గమాల పూజలు నిర్వహిస్తారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో కామాక్షీతాయి బ్రహ్మోత్సవాలు. పిశాచ బాధలు తొలగిపోవడానికి ఈ క్షేత్రంలో నిద్రజేస్తారు. సంతాన ప్రాప్తికి ఇది పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి. కామాక్షీతాయి కల్పవల్లి.
నెల్లూరు శ్రీ కృష్ణయోగమందిరంలో 1994 ఫిబ్రవరిలో దత్త పీఠాధిపతులు గణపతి సచ్చిదానందస్వామి వివిధ విగ్రహాల ప్రతిష్ఠ చేశారు. మానసిక, శారీరక రుగ్మతలు పొగొట్టే నాద ప్రక్రియతో స్వామి భక్తులను ఆశీర్వదిస్తున్నారు.
గండవరం ఉదయకళేశ్వరుడు:
నెల్లూరుకు ఉత్తరంగా 16 కిలోమీటర్ల దూరంలో గండవరం గ్రామంలో ఉదయ కళేశ్వరాలయం నిర్మితమైంది. నెల్లూరు జిల్లాలో జైన బౌద్ధ మతాలు వ్యాపించిన రోజులవి. క్రమంగా శైవ వైష్ణవమతాలు కాలూనాయి. తిక్కన శైవ వైష్ణవ విద్వేషాలను పోగొట్టడానికి హరిహరనాథ తత్వాన్ని ప్రతిపాదించాడు. ఆంధ్రమహాభారత అనువాదం మొదలు పెట్టి హరిహరనాథుని కంకితంగా రచించాడు. వైష్ణవాలయాలతో బాటు శివాలయులు వాడవాడలా ఆరంభమైన రోజులవి.
ఆలయనిర్మాణంలో ఆనాటి చోళరాజులు చొరవ జూపారు. శాసనాల ఆధారంగా ఈ వివరాలు తెలుస్తున్నాయి. యావద్భారత దేశంలో కోణార్క దేవాలయం తర్వాత ఉదయకళేశ్వరునిగా అవతరించిన లింగ స్వరూపుడైన శివుడిక్కడ వెలిశాడు. లింగంపై ప్రాతఃకాల సూర్యకిరణాలు స్పృశిస్తాయి. ఉదయకిరణం తొలిగా మహాశివునికి కిరణాభిషేకం చేయడంతో దైనందిన పూజలు ఆరంభం. దానశాసనాల ఆధారంగా క్రీ.శ. 1150 నాటికి చోళరాజులు ఈ ఆలయం నిర్మించినట్లు తెలుస్తూంది. శిల్పకళారీతులను పరిశీలిస్తే చోళ, పల్లవరాజు లిరువురు ఆలయ పోషణకు భూరి దానాలు చేసినట్లుంది. జిల్లా నలుమూలలా గ్రామాలలో శివాలయాలు ఆ కాలంలో వెలువడ్డాయి. మా స్వగ్రామమైన చెన్నూరులో కూడా మూలస్థానేశ్వరాలయం ముందట ఒక ప్రాచీన శాసనం వుంది.
సూళ్లూరుపేట చెంగాళమ్మ (తలుపులు లేని దేవాలయం)
రాకెట్ కేంద్రమైన శ్రీహరికోటకు అంతర్జాతీయ ప్రసిద్ధి. నెల్లూరు- మదరాసు రహదారి మార్గంలో సూళ్లూరుపేట గ్రామంలో చెంగాళమ్మ దేవాలయం భక్తజనుల నాకర్షిస్తోంది. దీనిని ‘శుభగిరి’ అంటారు. దక్షిణంగా కాళిందీనది ప్రవహిస్తుంది. ఆ నదిలో పశువుల కాపర్లు చెర్లాటలాడే సమయంలో చెంగాళమ్మ విగ్రహం దొరికింది. వాళ్లు ఆ విగ్రహాన్ని తెచ్చి గ్రామ శివార్లలో వుంచారు. రెండో రోజు ఆ శిలను కదిలించి గ్రామంలోకి తరలించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. దక్షిణముఖంగా యాదృచ్ఛికంగా శిల ప్రతిష్ఠ జరిగింది. తెన్-కాళి (దక్షిణ కాళి) క్రమంగా చెన్ కాళి – చెంగాళమ్మ అయింది. కంచి కామకోటి పీఠాధిపతులు ఈమె మహాలక్ష్మి అని నిర్వచించారు. కాళీమాతగా స్థిరీకరించారు. త్రిలక్ష్మిల అంశం గల సుందరమూర్తిగా ప్రశంసించారు. ఆమె భక్తులకు కొంగు బంగారం. అమ్మవారి చెవితమ్మలో ఒక పాదం వుంచి, తలక్రిందులుగా వేలాడుతున్న ఒక ఆకారాన్ని శిల్పి చెక్కాడు. ఆ ఆకారం సగం స్త్రీమూర్తి, సగం పురుషాకృతి. తల స్త్రీ గాని నోటిలో రెండు చిన్న కోరలు. ఈ నిగ్రహం దొరకక ముందు ఆటవిక జాతుల వారు పూజించేవారేమో. ఇలాంటి దేవతామూర్తి మదరాసుకు సమీపంలోని చోళవరంలో ‘ వనదుర్గగా పూజలందుకొంటోంది.
ఈ ఆలయంలో తిరునాళ్లు సుడి వుత్సవంగా జాతర రూపంలో చేస్తారు. ఏడు సంవత్సరాల కొకసారి జరుగుతుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవం అంగరంగవైభవంగా చేస్తారు. పరమశ్వరి మూల విగ్రహానికి ఎదురుగా 40 అడుగుల లావుపాటి స్తంభం ప్రతిష్ఠిస్తారు. సుడిమాను తయారు చేస్తారు. గతంలో ఆ కొయ్య చట్రానికి మనిషిని అమర్చేవారు. ప్రస్తుతం నల్ల మేక పిల్లను తగిలించి తొమ్మిది సార్లు కొయ్యను సుడిగా తిప్పుతారు.
ఆలయానికి తొలినాళ్లలో తలుపులు చేయించేందుకు కొయ్యలు తయారు చేసి సమీపంలోని మద్ది చెట్టుకు ఆనించి వెళ్లారు. ఆ కొయ్యలు కొద్దిరోజుల్లోనే చెట్టుతో కలిసిపోయి చిగురించాయి. అందువల్ల తలుపులు అమర్చలేదు. ఈ మద్ది చెట్టుకు ఊయల కడితే సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. ఆలయ సమీపంలో భక్తులకు వసతి గదులు, కల్యాణమండపం ఏర్పరచారు, తలుపులు లేని చిత్రకళా శోభితమైన రంగూన్ టేకులతో మహాద్వారాన్ని ప్రస్తుతం గ్రిల్స్ వున్న ప్రాంతంలో అమర్చారు.
ఇరుకాళమ్మ:
నెల్లూరు శివార్లలో మూలపేటలో నెల్లూరు చెరువు గట్టున ఇరుకళల పరమేశ్వరి ఆలయం వుంది. స్వర్ణాల చెరువును కాకతీయ గణపతి దేవుడు నిర్మించాడని ప్రతాపరుద్ర చరిత్ర చెబుతోంది. కాకతీయ సేనానులు రాజపుత్రుల క్షేమాన్ని కోరి కొన్ని దాన ధర్మాలు చేశారు. ఉదయగిరి పాలకుడు సావణ్ణ ఒడయారు (1364-65) ప్రతి శుక్రవారం సంత ఏర్పాటు చేసి, దాని ద్వారా వసూలయ్యే సుంకాలను అమ్మవారి అంగరంగ భోగాలకు ఇచ్చే కట్టడి చేశాడు. జిల్లాలో ఊరూరా ఆలయాలు, కొన్నింటిని ప్రధానంగా పేర్కొన్నాను. శుభం!
(మళ్ళీ కలుద్దాం)
డా. రేవూరు అనంతపద్మనాభరావు అష్టావధాని, విమర్శకులు, ప్రముఖ సాహితీవేత్త. తెలుగు సాహిత్యం లోని అన్ని ప్రక్రియలలోనూ రచనలను చేశారు. 80 ఏళ్ళ వయస్సులో నిరంతర అధ్యయన, అధ్యాపనాలు కొనసాగిస్తూ 120 గ్రంథాలు ప్రచురించారు. 2005 లో దూరదర్శన్, ఢిల్లీ నుండి అదనపు డైరక్టర్ జనరల్‌గా పదవీ విరమణ చేశారు. పదవీ విరమణాంతరం గత 20 సంవత్సరాలలో 80 గ్రంథాలు వివిధ ప్రక్రియలలో ప్రచురించారు.
అనువాద సాహిత్యంలో తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం (1993); కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం (2000), అప్పాజోశ్యుల – విష్ణుభొట్ల – కందాళై ఫౌండేషన్ వారి విశిష్ట సాహితీ పురస్కారం లభించాయి. వీరి రచనలపై వివిధ కోణాలలో 5 విశ్వవిద్యాలయాల నుండి ఆరుగురు ఎం.ఫిల్/పిహెచ్డి పరిశోధనా గ్రంథాలు సమర్పించి పట్టాలు పొందారు.
సంచికలో వీరు గత ఐదు సంవత్సరాలలో – ఆకాశవాణి పరిమళాలు, కావ్యపరిమళం, జ్ఞాపకాలు-వ్యాపకాలు, ఆచార్య దేవోభవ, అవధానం ఆంధ్రుల సొత్తు అనే ఐదు గ్రంథాలు సమర్పించారు.
