Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వందే మా ‘తరం’-44

[తరాలు మారుతున్నాయి. సమాజం వేగంగా పరుగులు తీస్తోంది. విశ్వగ్రామం అనే సిద్ధాంతం ప్రబలింది. 1947లో పుట్టి 80వ ఏట కాలిడిన ప్రముఖ రచయిత డా. రేవూరు అనంత పద్మనాభరావు మూడు తరాల ప్రముఖులతో కలిసి మెలిసి తిరిగారు. ఆ జ్ఞాపకాల పందిరిని ధారావాహికంగా అందిస్తున్నారు.]

అంతరించిపోయిన సంస్కృత కళాశాలలు:

మ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో సంస్కృత కళాశాలలు పండితులను తయారు చేశాయి. దిగ్దంతులైన విద్వాంసులు అక్కడ ప్రిన్సిపాల్, అధ్యాపకులుగా విద్యార్థులను తీర్చిదిద్దారు. మహారాజ పోషణలో వెలసిన విజయనగర సంస్కృత కళాశాల ఈ కోవలో ముందు వరసలో నిలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా  శ్రీ పి. వి. నరసింహారావు వ్యవహరించిన సమయంలో 70వ దశకంలో 30 దాకా సంస్కృత కళాశాలలు విలసిల్లాయి.

ఆ తరువాత పి.వి. మంత్రివర్గంలో దేవదాయశాఖ మంత్రి శ్రీ చింతలపాటి వరప్రసాద మూర్తిరాజు 68 విద్యా సంస్థలు నెలకొల్పారు. అందులో లేపాక్షి తదితర సంస్కృత కళాశాలలున్నాయి. ఆయనది పశ్చిమ గోదావిర జిల్లా పత్తేపురం. గాంధేయవాది. 1800 ఎకరాలు దానం చేసిన మహనీయుడు (1977). ఆరు సార్లు 1953-82 మధ్య ఎం.ఎల్.ఏగా గెలిచారు. 93 ఏళ్ల పూర్ణాయుర్దాయం జీవించారు. ఆయన నెలకొల్పిన పలు సంస్కృత కళాశాలలు ఆ తదనంతరం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మూతబడ్డాయి.

శిరోమణి, ఏ. విద్వాన్, బి. విద్వాన్ పరీక్షలను ఈ కళాశాలలు నిర్వహించాయి. దశాబ్దాలుగా వేలాదిమంది తెలుగు పండితులను విద్యారంగానికి అందించాయి. వారికి జీవనభృతిని కలిగించాయి. కాని, ఈనాడు అది గతవైభవం. చరిత్రలో నిలిచిపోయాయి ఆ సంస్థలు. నామమాత్రంగా వేళ్ల మీద లెక్క పెట్టగల కళాశాలలు మిగిలాయి. అందులో చేరే విద్యార్ధుల సంఖ్య రెండు అంకెలకు పరిమితం. అధ్యాపకుల నియామకాలు లేవు. పార్ట్ టైమ్ అధ్యాపకులతో కాలక్షేపం చేస్తున్నారు.

బహుపరిశ్రమ చేసి ఆ కళాశాలల పూర్వ చరిత్రను పలువురు వృద్ధపండితులు, పూర్వధ్యాపకుల ద్వారా ఫోన్లలో సంప్రదించి సేకరించాను. మరుగునపడ్డ అనేక కళాశాలల వివరాలు తెలియజేయగల వృద్ధులు లేరు. గత వైభవాన్ని స్మరించుకొంటూ పలువురు నిర్వేదం చెందారు. సంస్కృతం మృతభాషగా పరిణనలోకి వచ్చింది. భారతదేశంలో సంస్కృతం మట్లాడే వారి సంఖ్య 2500. అది 0.002 శాతం. గత ఐదు దశాభ్దాలుగా ఆకాశవాణి సంస్కృత వార్తలు ప్రసారం చేస్తూవుంది. ఇంటర్మీడియట్ విద్యార్ధులు సంస్కృతం రెండో భాషగా ఎంచుకొని 90 శాతం మార్కులు సంపాదిస్తున్నారు. శిధిలాలుగా మిగిలిన సంస్కృత కళాశాలల వివరాలు నా ఎరుకలోకి వచ్చినంత మేరకు ప్రస్తావిస్తాను.

విజయనగరం సంస్కృత కళాశాల:

విజయనగర రాజులు సంగీత సాహిత్యాలకు అపరిమిత ప్రోత్సాహం కల్పించారు. విజయరామ గజపతి రాజు ప్రోత్సాహంతో 1860లో విజయనగరంలో సంస్కృత కళాశాల నెలకొల్పబడింది. అయ్యకోనేరు వొడ్డున కళాశాల ప్రారంభించారు. ఆ తర్వాత ప్రస్తుతం వున్న ప్రదేశంలోకి మార్పారు. నాలుగు సంవత్సరాల కోర్సు నడిపారు. రెండేళ్లకు ప్రిలిమినరీ పరీక్షలు, నాలుగేళ్లకు చివర ఫైనల్ పరీక్షలు పెడతారు. 1915లో తొలి పరీక్ష జరిపారు. పెద్ద గ్రంథాలయం వుంది. తాళపత్ర ప్రతులు సేకరించారు. ఆ కళాశాల ప్రిన్సిపాళ్లు – తొలి ప్రిన్సిపాల్ కె.రామనుజాచారి 1900-1928, పి. వి. రామనుజస్వామి 1928-43, టి.వి.నరసింహాచార్య 1943-195, కె.రామమూర్తి శాస్త్రి 1955-62, పి.బి.యస్. అప్పలాచార్యులు, 1962-66, మనాప్రగడ శేషసాయి 1966-79, పులివర్తి నూకాలరావు 1979-83, పేరాల భారతశర్మ 1985-91 తదితరులు తరువాతి కాలాలలో ప్రిన్సిపాళ్లు. ఇక్కడ అధ్యాపకులలో డా. అయలసోమయాజుల గోపాలరావు సజీవ స్వరం. తొలి రోజుల్లో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ స్ఫూర్తితో విద్య ప్రణాళికలు ఏర్పరచారు. న్యాయ వ్యాకరణ శాఖలున్నాయి.

ఆ కళాశాలలో దిగ్దంతులైన పండితులు అధ్యాపకులుగా బోధించారు. కళాప్రపూర్ణ వజ్ఝుల చినసీతారామ స్వామి శాస్త్రి, తాతా సుబ్బరాయుడు శాస్త్రి, కర్రి శ్రీరామమూర్తి, అప్పల జోగన్నశాస్త్రి, పేరి వెంకటేశ్వరశాస్త్రి, పేరి సూర్యనారాయణ, కొల్లూరి లక్ష్మణమూర్తి, పంతుల లక్ష్మీనారాయణ శాస్త్రి, దువ్వూరి వెంకటరమణ శాస్త్రి, అయ్యల సోమయాజుల గోపాలరావు ప్రభృతులు అధ్యాపకులు.

1940లో కళాశాల వజ్రోత్సవాలు నిర్వహించారు. శేషసాయి  ప్రిన్సిపాల్‌గా 1969లో శజయంతి ఉత్సవాలు వైభవంగా జరిపారు. రాష్ట్ర గవర్నరు శ్రీ ఖండుబాయ్ దేశాయ్, విద్యాశాఖ మంత్రి శ్రీ పి. వి. నరసింహారావులు ముఖ్య అతిథులు. ప్రస్తుత కళాశాల ప్రిన్సిపాల్ డా. జనార్దన నాయుడు.

విజయనగర సామ్రాజ్య వైభవం క్రమేణా సన్నగిల్లినట్లే సంస్కృత కళాశాలల ప్రాభవం కూడా అంతరించి శల్యావశిష్ట స్థితికి చేరింది.

శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాల, తిరుపతి:

తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో నడుస్తున్న  ఓరియంటల్ కళాశాల అతి ప్రాచీనం. వంద సంవత్సరాల చరిత్ర గల సంస్థ. ప్రసిద్ధ పరిశోధకులు వేటూరి ప్రభాకరశాస్త్రి, పాతాళ భేధి సుబ్రమణ్యకవి, చేబ్రోలు సుబ్రమణ్యశర్మ ప్రభృతులు అక్కడ అధ్యాపకులు తొలిరోజుల్లో. 1965 ప్రాంతాలలో శ్రీ గోవిందరాజస్వామి ఆలయ సమీపంలో ఈ కళాశాల నడిచేది. ఆ తర్వాత కపిల తీర్థం రోడ్డులో ‘డబ్బారేకుల కాలేజి’కి మారింది. ఇప్పుడు గత దశాబ్దికి పైగా వినూత్న భవనాలు సర్వాంగసుందరంగా అదే స్థలంలో వెలశాయి.

సముద్రాల నాగయ్య, కె.యస్.ఆర్. దత్త ప్రభృతులు ప్రిన్సిపాళ్లుగా పేరు తెచ్చారు. అధ్యాపక వర్గంలో గేరి పెద్ది రామసుబ్బశర్మ, యన్.సి.వి.నరసింహాచార్యులు, ఈయుణ్ణి కృష్ణమాచార్యులు, టి.ఏ.గోపాలన్, సముద్రాల లక్ష్మణయ్య. సింగరాజు సచ్చిదానందం, ఇ.ఏ.సింగరాచార్య తదితరులు 80, 90 దశకాల అధ్యాపకులు.

2006లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగా వున్న శ్రీ ఏ.పి.వి.యస్.శర్మగారి విశాల దృక్పధంతో కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రసార శాఖల వారి కమ్యూనిటీ రేడియో  ఈ కళాశాలకు శాంక్షన్ అయింది. తిరుమలలో ఈ కేంద్రాన్ని అప్పటి ముఖ్యుమంత్రి శ్రీ వై.యస్. రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. అప్పటి కళాశాల ప్రిన్సిపాల్ సి. రామయ్య, నేను ఢిల్లీ వెళ్లి సంబంధిత అగ్రిమెంటుపై సంతకాలు చేశాము. తిరుమలపై ప్రసారాల శక్తి తక్కువ గావడంతో 2011లో ఈ కేంద్రాన్ని తిరుపతి కళాశాల ప్రాంగణంలోకి మార్చారు.

వేదాంత వర్ధని సంస్కృత కళాశాల, సికిందరాబాదు:

బద్రీ విశాల్ పిట్టి తదితర వ్యాపారస్థుల సౌజన్యంతో 1928 నాటికి హైదరాబాదులోని సీతారాంబాగ్‌లో వేదపాఠశాల ప్రారంభమైనది. షట్ శాస్త్ర పండితులైన కోవిల్ కందాడై అప్పన్ శఠగోపరామానుజాచార్యులు దానిని కళాశాలగా రూపొందించారు.

క్రమేణా ప్రభుత్వం ఈ కళాశాలకు అధ్యాపక పోస్టులు శాంక్షన్ చేసింది. భారత రాష్ట్రపతి బాబూరాజేంద్ర ప్రసాద్ ఈ కళాశాలను సందర్శించి అభినందించారు. 1964లో తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు చెలికాని అన్నారావు ఈ సంస్థను తి.తి.దే యజమాన్యంలోకి చేర్చారు.

ఇక్కడ ప్రాతః స్మరణీయులైన అధ్యాపకుల పేర్లు తలచుకుంటేనే వొళ్లు గగుర్పొడుస్తుంది. ఖండవల్లి నరసింహశాస్త్రి, వేదాల తిరువెంగళాచార్యులు, గొబ్బూరు శేషచార్యులు, అమరవాది కృష్ణమాచార్యులు, సముద్రాల శ్రీనివాసాచార్యులు, మరింగంటి శ్రీరంగాచార్య, వంగీపురం రామానుజాచార్యులు ప్రభృతులు.

తి.తి.దే. యాజమాన్య పర్యవేక్షణలో అధ్యాపకులను తిరుపతి నుండి బదిలీ చేశారు. చలమచర్ల వెంకట శేషాచార్యులు, కంభంపాటి సీతారామాంజనేయులు ఇక్కడ చేరారు. ఇతర అధ్యాపకులు దుద్దేళ్ల నరసింహమూర్తి, కె.వి.ఆర్ గోపాలాచార్యులు, ప్రతివాద భయంకర అణ్ణన్ ఆచార్యులు, కందాళై రామానుజాచార్యులు (1962) ప్రభృతులు.

ఇక్కడ న్యాయం, వ్యాకరణం, సాహిత్యం బోధిస్తారు.

కళాశాల ప్రిన్సిపాల్‌గా ప్రముఖ వ్యక్తి గొడవర్తి శ్రీరామమూర్తి. 1969 నుండి 1989 వరకు పనిచేసి రిటైరయ్యారు. జ్యోతిష ప్రావీణ్యంతో పలువురు రాజకీయ ప్రముఖులకు ఆయన సన్నిహితులు. టి.టి.డి బోర్డు మెంబరుగా నియమతులయ్యారు. కందాళై రామనుజార్యులు ఒక దశాబ్దకాలం ఈ కళాశాల ప్రిన్సిపాల్‌గా పని చేసి 2002లో రిటరైయ్యారు.

వారి తర్వాత ప్రముఖ విద్వాంసులు నండూరి రామకృష్ణమాచార్యుల కుమారులు నండూరి విద్యారణ్య 2002-2017 మధ్య ప్రిన్సిపాల్. బోయినపల్లిలో ఈ సంస్థ ప్రస్తుతం 47 మంది విద్యార్ధాలుతో నడుస్తోంది. ఇక్కడి పూర్వవిద్యార్ధాలు యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్లు కావడం విశేషం. సన్నిధానం సుదర్శనశర్మ (వేద విశ్వవిద్యాలయం, తిరుపతి), రవ్వా శ్రీహరి (కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయం), పెన్నా మధుసూదన్ (కాళిదాస విశ్వవిద్యాయం, రామ్‌టెక్), వి. మురళీధరశర్మ (సంస్కృత విశ్వవిద్యాలయం, తిరుపతి).

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version