Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వందే మా ‘తరం’-45

[తరాలు మారుతున్నాయి. సమాజం వేగంగా పరుగులు తీస్తోంది. విశ్వగ్రామం అనే సిద్ధాంతం ప్రబలింది. 1947లో పుట్టి 80వ ఏట కాలిడిన ప్రముఖ రచయిత డా. రేవూరు అనంత పద్మనాభరావు మూడు తరాల ప్రముఖులతో కలిసి మెలిసి తిరిగారు. ఆ జ్ఞాపకాల పందిరిని ధారావాహికంగా అందిస్తున్నారు.]

భాగ్యనగర సంస్కృతం:

నిజాం పరిపాలనా కాలంలో తెలంగాణ మాగాణంలో తెలుగు భాష మైనారిటీ బాష. ‘సెకండ్ లాంగ్వేజ్’ కింద ఉర్దూకే పట్టం. తెలుగుకు ప్రాధాన్యం తక్కువ గాన తెలుగు పండితులు తక్కవ. సంస్కృత కళాశాలల పట్ల దృష్టి లేదు. తెలుగు భాషాభివృద్ధికి శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషానిలయం, ఆంధ్ర సారస్వత పరిషత్తు అవిరళ కృషి చేశాయి. 1943 మే నెలలో లోకనంది నారాయణరావు సారథిగా ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆవిర్భవించింది. దేవులపల్లి రామానుజరావు ఆ సంస్థ పురోభివృద్ధికి కంకణం కట్టుకొన్నారు.

తెలుగు పండితుల కొరతను దృష్టిలో పెట్టుకొని 1964 అక్టోబరు 22న తెలుగు పండిత శిక్షణా కళాశాలను అప్పటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ప్రారంభించిన నూత్న భవనంలో క్లాసులు ప్రారంభించారు. డి.ఓ.యల్; బి. ఓ.యల్, యం.ఓ.యల్ కోర్సులు నడిపారు. ఇక్కడ అధ్యయనం చేసిన పలువురు ప్రముఖులయ్యారు. అందులో ఆంధ్రజ్యోతి దినపత్రిక సంపాదకులు కె. శ్రీనివాస్ ఒకరు. అధ్యాపకులలో డా.కె.కె.రంగనాథాచార్యులు తరువాతి కాలంలో హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీకి ప్రొఫసర్‌గా వెళ్లారు. ప్రిన్సిపాల్‌గా డి. చంద్రశేఖరరెడ్డి ఆగ్రగణ్యులు, ప్రస్తుతం ఎమెస్కో ప్రచురణ సంస్థల ఎడిటర్. ఆచార్య రవ్వా శ్రీహరి తొలినాళ్ళలో కొద్ది మాసాలు అధ్యాపకులు. సరిపెల్ల విశ్వనాధ శాస్త్రి ప్రిన్సిపాల్‍గా చేశారు. నాయని కోటీశ్వరి, శలాక రఘునాథశర్మ ప్రభృతులు అధ్యాపకులు. ప్రస్తుతం సిల్మానాయక్ ప్రిన్సిపాల్ (2026).

తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యర్యంలో ప్రాంగణంలో ఈ కళాశాల నడుస్తోంది. పరిషత్తు అధ్యక్షులుగా ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ఉపాధ్యక్షులుగా డా. కె.వి. రమణాచారి, ముదిగంటి సుజాతారెడ్డి, కార్యదర్శిగా డా. జె. చెన్నయ్య ఆధ్వర్యంలో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.

ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం ఆంధ్ర ప్రాచ్య కళాశాల:

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ ఆచార్యులు ఖండవల్లి లక్ష్మీరంజనం (1908-1986). ఆంధ్ర మహాభారత సంశోధిత ప్రతి ప్రధాన సంపాదకులు. వారికి సంస్కతంపై ఎనలేని అభిమానం. నల్లకుంటలో తమ స్వంత ఇంట్లోనే ప్రాచ్య కళాశాలను ప్రారంభించారు (1988). ఆ తర్వాత సంగీత పాఠశాల కూడా మొదలైంది,

క్రమంగా ఆ కళాశాల ప్రభుత్వపరమైంది. కళాశాలలో ఖండవల్లి శతజయంతి, కళాశాల స్వర్గోత్సవాలు 2008లో ఘనంగా జరిగాయి. ఓరియంటల్ లాంగ్వేజెస్ అంటే సంస్కృతం, పర్షియన్, అరబిక్ భాషలు, వాటిలో బోధనావకాశాలు పెరిగాయి.

ఇక్కడ పనిచేసిన అధ్యాపకులు: శివసూరి విశ్వనాథశర్మ, యస్.బి. రామానుజాచార్యులు, తంగిరాల ఆంజనేయాలు, చొప్పకట్ల సత్యనారాయణ, నారుమంచి లక్ష్మీనరసింహమూర్తి ప్రభుతులు. ప్రస్తుతం ఇది ప్రభుత్వ కళాశాలగా మారింది.

ఓరియంటల్ కళాశాలలపై తనిఖీకి చివుకుల మార్కండేయ శాస్త్రి హైదరాబాదులోని డైరక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్‌స్ట్రక్షన్ కార్యాలయంలో డిప్యుటీ డైరక్టరుగా దశాబ్దాలు పనిచేశారు. ఆయన స్వతహాగా సంస్కృత పండితులు. వారి సోదరులు చివుకుల సుందర రామశర్మ విజయవాడ కె.బి.యన్ కళాశాల తెలుగు శాఖ అధిపతి.

తెలంగాణాలో సంస్కత కళాశాలలు:

  1. శ్రీ వెంకటేశ్వర ఓరియంటల్ కాలేజీ, పాలెం
  2. శ్రీ లక్ష్మీనరసింహ సంస్కృతాంధ్ర కళాశాల – ధర్మపురి
  3. శ్రీ రాజరాజేశ్వరీ దేవస్థాన సంస్కత కళాశాల, వేములవాడ శ్రీ
  4. దుర్గేశ్వర సంస్కత స్త్రీల కళాశాల – వరంగల్
  5. గీతాప్రచారిణీ సంస్కృత కళాశాల – నల్గొండ.
  6. శ్రీ విశ్వేశ్వర సంస్కృతాంధ్ర కళాశాల – వరంగల్

శ్రీ వేంకటేశ్వర ఓరియంటల్ కాలేజి – పాలెం, మహబూబ్‌నగర్ జిల్లా

ధార్మిక జీవనుడైన పాలెం సుబ్బయ్య 1950లో గుడి, బడి కట్టించారు. సంస్కృతభాషాభివృద్ధికై 1964లో ఓరియంటల్ కాలేజి పాలెం సుబ్బయ్య (1926 ఏప్రిల్ – 1986 జూన్) సంకల్పబలంతో మొదలైంది. ఆంధ్ర, తెలంగాణాల నుండి నిరుపేదలైన విద్యార్థులు ఇక్కడ చేరారు. ఆరు దశాబ్దులలో ప్రగతి పథంలో నడిచింది. 1980లో ప్రభుత్వం స్వాధీనం చేసుకొంది. 1983లో సంపూర్ణ సూర్యగ్రహణం సందర్భంగా గ్రహణాన్ని స్పష్టంగా చూసే అబ్జర్వేటరీని ఈ గ్రామంలో నెలకొల్పడంతో అంతర్జాతీయఖ్యాతి గడిచింది ఈ ప్రదేశం.

ఈ కళాశాల ప్రిన్సిపాళ్లుగా సుప్రసిద్ధ పండితులు పనిచేశారు. తెలకపల్లి విశ్వనాధశర్మ, యం.సీతారామశాస్త్రి, యం. రామకృష్ణశాస్త్రి, శ్రీ రంగాచార్య, కపిలవాయి లింగమూర్తి, మామిడన్న సత్యనారాయణమూర్తి. ఇక్కడి విద్యార్థులు ప్రతిభాసంపన్నులు. ఉస్మానియా విశ్వవిద్యాలయు తెలుగు శాఖ ఆచార్యులు కసిరెడ్డి వెంకటరెడ్డి, రుక్ముద్దీన్, వెలుదండ నిత్యానందరావులు ప్రముఖులు. అలంపురం వాసి మహమ్మద్ హుసేన్ ఇక్కడ విద్యార్థి. నిత్యానందరావు తెలుగు విశ్వవిద్యాలయ ఛాన్సలర్. వరంగల్‌లో సృజన సాహిత్యసంస్థ కార్యకలాపాలు దశాబ్దాలుగా నడుపుతున్న ప్రముఖులు గన్నమరాజు గిరిజామనోహరబాబు పాలెం కళాశాల విద్యార్థి. ఆయన కళాశాలల్లో ఉపన్యాసకులుగా రిటైరై వరంగల్‌లో సాహిత్య చైతన్యం నెలకొల్పారు.

శ్రీ లక్ష్మీనృసింహ సంస్కృతాంధ్ర కళాశాల, ధర్మపురి

ఇది ధర్మపురిలో ఏర్పడిన సంస్కృత కళాశాల.

కరోనా సమయంలో 2020 లో మూతబడింది. ఇటీవలి కాలంలో పునరుద్ధరణ జరిగి స్థానిక మంత్రి అడ్లూరి లక్ష్మణ కుమార్ చొరవతో తెలంగాంగా ప్రభుత్వం 32 లక్షలు మంజూరు చేసింది. జి.ప్రభాకర్ ప్రస్తుతం ప్రిన్సిపాల్. సంగనభట్ల నరసయ్య, వింజమూరి శేషఫణి శర్మలు అధ్యాపకులు. అన్ని సంస్కృత కళాశాలలు వెలుగు నీడలలో నిలిచిపోయాయి. కొన్ని మూతబడ్డాలు, కొన్ని శల్యావశిష్టంగా మిగిలాయి.

వేములవాడ సంస్కృత కళాశాల:

శ్రీరాజరాజేశ్వర దేవస్థాన సంస్కృత కళాశాల వేములవాడలో కొన్ని సంవత్సరాలు నడిచి 2017లో మూతబడింది.

వరంగల్ స్త్రీల సంస్కృత కళాశాల నెలకొల్పబడి స్త్రీల విద్యకు ప్రాధాన్యమిచ్చింది. మృత్యుంజయశర్మ దీని బాధ్యతలు స్వీకరించారు. ఉస్మానియా తెలుగు శాఖ ఆచార్యులు అమరేశం రాజేశ్వరశర్మ ఈ కళాశాలలో పాఠాలు ఉచితంగా బోధించారు. హైదరాబాదు నుండి వరంగల్‌కు వెళ్లి క్లాసులు తీసుకొనేవారు.

నల్గొండలో కూడా సంస్కృత కళాశాల నడిచి మూతబడింది. పెన్నా శివరామకృష్ణ, గడ్డం శ్యామల ఈ కళాశాలతో అనుబంధం గల వ్యక్తులు.

వీరేశ్వర సంస్కృతాంధ్ర డిగ్రీ, కళాశాల – వరంగల్

వరంగల్‌లో రెండు సంస్కృత కళాశాలలు ఒకప్పుడు ప్రశస్తిలో వుండేవి.

  1. వీరేశ్వర సంస్కృతాంధ్ర డిగ్రీ కళాశాల. 1940.
  2. దుర్గేశ్వర సంస్కృతాంధ్ర మహిళా కళాశాల.

వీరేశ్వర కళాశాలను 1940లో బ్యాంకింగ్ రంగ నిపుణులు, వదాన్యులైన ఆకారపు నరసింగం కార్యదర్శిగా, మాదిరాజు కోటీశ్వరరావు చైర్మన్‌గా ప్రారంభించారు. నరసింగం కుమారుడు రాజా చెన్న విశ్వేశ్వరరావు పేర ఈ కళాశాల స్థాపించారు. తొలి ప్రిన్సిపాల్‌గా ముదిగొండ వీరేశలింగం దాదాపు మూడు దశాబ్దులు ప్రగతికి దోహదం చేశారు. 1972 నుండి 1999 వరకూ వెంకటాచారి ప్రిన్సిపాల్. శ్రీ భాష్యం విజయసారథి ప్రిన్సిపాల్.

1964-65 లో ప్రభుత్వ ఎయిడెడ్ కళాశాలగా రూపాంతరం చెందింది. 1973లో ఉపన్యాసకులుగా చేరిన మాదిరాజు బ్రహ్మనందరావు 1993 నుండి 2005 వరకు ప్రిన్సిపాల్. వారు బహుభాషా పండితులు. ఈ కళాశాలలో అమరేశం రాజేశ్వరశర్మ విద్యార్థి. తరువాతి కాలంలో ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య కార్యదర్శిగా ఎన్నికయ్యారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎం.ఏ తెలుగు, ఎం. ఏ సంస్కృతం కోర్సులతో చేరే విద్యార్థుల సంఖ్య పెరగడంతో ఈ సంస్కత కళాశాలలో ఆ రెండు కోర్సులకు 30 సీట్లు మంజూరు చేశారు. కళాశాలకు 12 దుకాణాల ద్వారా వచ్చే అద్దెలు ఆదాయంగా ప్రస్తుతం నడుస్తోంది.

దుర్గేశ్వర మహిళా సంస్కుతాంధ్ర కళాశాలను ఇక్కడి దుర్గేశ్వరాలయం పక్షాన స్త్రీలకు ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. అత్తలూరి మృత్యుంజయశర్మ ప్రిన్సిపాల్‌గా సంస్థను తీర్చిదిద్దారు. వారిప్పుడు శైవ పీఠాధిపతి. ప్రస్తుతం ఈ కళాశాల మూతబడింది.

తెలంగాణాలో నిజాం పాలన కాలంలో ఉర్దూకు ప్రాధాన్యం కలిగింది. తెలుగు నేర్చుకునే వారి సంఖ్య తక్కువ. సంస్కృతం సంగతి సరేసరి. అయినా పాలెం కళాశాల, ఆంధ్ర సారస్వత పరిషత్ తదితర సంస్కృత కళాశాలలు సుప్రసిద్ధులైన పండితులను తయారుచేశాయి,

కేవలం సంస్కృత పండితుల, తెలుగు మేస్టార్లు గానే మిగిలిపోలేదు. కె. శ్రీనివాస్ వంటి వ్యక్తులు జర్నలిస్టులుగా తయారయ్యారు. ఆంధ్ర జ్యోతి దినపత్రిక సంపాదకులుగా ఒక దశాబ్దికాలం నూతనాధ్యాయం సృష్టించారు. వారి తండ్రి అలగర సింగరాచార్యులు సారస్వత పరిషత్ కళాశాలలో బోధించారు.

ఆంధ్ర విషయానికి వస్తే తెలుగు పండితుల కొరతను తీరడానికి అన్ని ప్రాంతాలలో కోస్తా, రాయలసీమలలో ప్రాచ్య కళాశాలలు వెలిశాయి. మూర్తి రాజు స్వయంగా పలు కళాశాలలను ప్రోత్సహించారు. ప్రభుత్వాలు వీటి పోషణకు సహకరించలేదు. ప్రభుత్వ గ్రాంట్లు నిలచిపోయాయి. నామమాత్రంగా కొన్ని కళాశాలలు మినుకుమినుకుమంటూ వస్తున్నాయి.

ఆంధ్రలో వివిధ సంస్కృత కళాశాలలు:

  1. వేద సంస్కృత కళాశాల – నెల్లూరు.
  2. మలయాళ స్వామి ప్రాచ్యకళాశాల – ప్రొద్దుటూరు; కడపజిల్లా
  3. శ్రీవేంకటేశ్వర ప్రాచ్య కళాశాల – తిరుపతి
  4. విజయనగరం మహారాజా సంస్కృత కళాశాల
  5. గోరంట్ల వెంకన్న సంస్కృత కళాశాల, తిమ్మసముద్రం, ప్రకాశం జిల్లా
  6. శారణానికేతన్ ఓరియంటల్ కళాశాల, గుంటూరు
  7. కె.వి.ఆర్. సంస్కృత కళాశాల, గుంటూరు, (డా. కొలచల వెంకటకృష్ణమూర్తి).
  8. భావనారాయణ సంస్కృత కళాశాల, పొన్నూరు.
  9. ఆంధ్రగీర్వాణ విద్యాపీఠం – కొవ్వూరు
  10. ఆంధ్ర సంస్కృత కళాశాల, రాజమండ్రి (1931); శ్రీ గౌతమీ విద్యాపీఠం, రాజమండ్రి
  11. మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల, జిల్లెళ్లమూడి
  12. కె.సి.యన్ సంస్కృత కళాశాల, తెనాలి (కోట లక్ష్మయ్య నాయుడు)
  13. యస్.జి.కె. ఓరియంటల్ కళాశాల, తాడికొండ
  14. యస్. యన్. సంస్కృత కళాశాల, చిట్టిగూడూరు
  15. ఓరియంటల్ కాలేజి, లేపాక్షి, అనంతపురం జిల్లా
  16. సంస్కృత కళాశాల, ఆగిరిపల్లి
  17. సంసృత కళాశాల- వాకాడు.
  18. సయ్యద్ అప్పలస్వామి సంస్కృత కళాశాల, విజయవాడ

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version